32
1 యాకోబు తన దారిన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవదూతలు✽ అతణ్ణి కలుసుకొన్నారు. 2 ✽వారిని చూచినప్పుడు యాకోబు “ఇది దేవుని సేన” అని చెప్పి, ఆ చోటికి ‘మహనయీం’ అనే పేరు పెట్టాడు.3 యాకోబు ఎదోం✽ దేశంలో ఉన్న శేయీరు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏశావు✽ దగ్గరకు వార్తాహరులను తనకు ముందుగా పంపుతూ వారిని ఇలా ఆదేశించాడు: 4 ✽“మీరు నా యజమాని ఏశావుతో చెప్పవలసినదేమిటంటే, నా యజమానులైన మీకు ఇది తెలియజేయడానికి కబురు పంపుతున్నాను: ఇప్పటిదాకా నేను లాబాను దగ్గర ఉన్నాను. 5 నాకు పశువులూ గాడిదలూ మందలూ ఉన్నాయి. దాసదాసీలు ఉన్నారు. మీరు నన్ను దయ చూడాలని కోరుతున్నాను అని మీ సేవకుడైన యాకోబు అంటున్నాడు.”
6 తరువాత ఆ వార్తాహరులు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి, “మీ అన్న ఏశావు దగ్గరికి చేరాం. అతడు నాలుగు వందలమందిని వెంటబెట్టుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు” అన్నారు.
7 అందుకు యాకోబు చాలా భయపడ్డాడు, కలవరపడ్డాడు. తనతో ఉన్నవారినీ, మందలనూ, పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులుగా విభాగించాడు. 8 ఎందుకంటే అతడు “ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని కొట్టాడంటే, మిగిలిన గుంపు తప్పుకొని పారిపోవచ్చు” అనుకొన్నాడు.
9 అప్పుడు యాకోబు ఇలా ప్రార్థించాడు✽: “నా తాత అయిన అబ్రాహాముకు, నా తండ్రి అయిన ఇస్సాకుకు తోడైన దేవా! యెహోవా! నీవు నాతో, ‘నీ స్వదేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు✽; నీకు మేలు చేస్తాను’ అన్నావు. 10 ✽నీవు నీ దాసుడైన నాపట్ల నమ్మకంగా ఉండి ఎంతో వాత్సల్యత చూపించావు. దానికి నేను యోగ్యుణ్ణి కాను. నేనీ యొర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర్ర మాత్రమే. ఇప్పుడైతే నేను రెండు గుంపులయ్యాను. 11 దయ చూపి నా అన్న ఏశావు చేతినుంచి నన్ను రక్షించు. అతడు వచ్చి నన్నూ పిల్లల్తోపాటు తల్లులనూ చంపుతాడేమో అని అతని విషయం నాకు భయం ఉంది. 12 నీవు నాతో అన్నావు గదా! ‘నేను నీకు మేలు చేసి తీరుతాను; సముద్రం ఇసుక రేణువులలాగా మనుషులు లెక్కించలేనంతగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను’ అని.”
13 ✽ఆ రాత్రి అతడక్కడ గడిపిన తరువాత తాను తెచ్చినదానిలో తన అన్న ఏశావుకోసం ఒక కానుకను ఏర్పరచాడు. 14 ఆ కానుక రెండు వందల మేకలూ, ఇరవై మేకపోతులూ, రెండు వందల గొర్రెలూ, ఇరవై పొట్టేళ్ళూ, 15 ముప్ఫయి పాడి ఒంటెలూ వాటి పిల్లలతోపాటు, నలభై ఆవులూ, పది ఆబోతులూ, ఇరవై ఆడ గాడిదలు, పది గాడిద పిల్లలూనూ.
16 వాటిని మంద మందగా చేసి, తన దాసుల చేతికప్పగించి, “మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవాలి” అన్నాడు. 17 వారిలో మొదటివాడితో “నా అన్న ఏశావు నీకు ఎదురై ‘నువ్వు ఎవరివాడివి? ఎక్కడికి వెళుతున్నావు? నీ ముందర ఉన్నవి ఎవరివి?’ అని అడిగినప్పుడు, 18 నీవు ఇలా అనాలి – ‘ఇవి మీ సేవకుడైన యాకోబువి. ఇదంతా మా యజమానులైన ఏశావుకు కానుక. ఆయన మా వెనుక ఇప్పుడే వస్తున్నాడు’” అంటూ ఆజ్ఞాపించాడు యాకోబు. 19 రెండోవాడికీ మూడోవాడికీ మందల వెంట వెళ్ళిన వారందరికీ అలా ఆజ్ఞాపిస్తూ, “మీరు ఏశావును చూచినప్పుడు అలాగే అతనితో చెప్పాలి. 20 ‘మీ సేవకుడు యాకోబు మా వెనుక ఇప్పుడే వస్తున్నాడ’ని కూడా చెప్పాలి” అన్నాడు. ఎందుకంటే “నేను ముందుగా పంపుతున్న కానుక వల్ల అతణ్ణి శాంతపరుస్తాను. ఆ తరువాత ముఖాముఖిగా కలుసుకొన్నప్పుడు ఒకవేళ అతడు నన్ను దయతో స్వీకరిస్తాడు” అనుకొన్నాడు.
21 కానుకను తనకు ముందుగా పంపించి, తాను ఆ శిబిరంలో ఆ రాత్రి గడిపాడు. 22 రాత్రివేళ అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ ఇద్దరు దాసీలనూ పదకొండుమంది పిల్లలనూ వెంటబెట్టుకొని యబ్బోకు✽ రేవు దాటిపొయ్యాడు. 23 వారినీ, తనకున్నదాన్నంతా ఆ వాగు దాటించాడు.
24 యాకోబు ఒంటరిగా ఉండిపొయ్యాడు. తెల్లవారేవరకు✽ ఒక వ్యక్తి✽ అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. 25 ఆ వ్యక్తి తాను గెలవకపోవడం✽ చూచి యాకోబు తొడగూటిమీద కొట్టాడు. అలా అతడు ఆ వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు తొడగూడు తప్పింది.
26 ఆ వ్యక్తి “తెల్లవారుతున్నది, గనుక నన్ను వెళ్ళనియ్యి” అన్నాడు.
అతడు “నీవు నన్ను దీవిస్తేనే✽ తప్ప నిన్ను వెళ్ళనియ్యను” అని బదులు చెప్పాడు.
27 ఆ వ్యక్తి “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు “యాకోబు” అన్నాడు.
28 ఆయన “ఇక మీదట నీ పేరు యాకోబు✽ కాదు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు✽ గనుక నీ పేరు ఇస్రాయేల్” అన్నాడు.
29 యాకోబు “దయచేసి నీ పేరు✽ నాకు చెప్పు” అన్నాడు.
అందుకాయన “నా పేరేమని నీవు ఎందుకు అడుగుతున్నావు?” అని చెప్పి అక్కడ అతణ్ణి దీవించాడు✽.
30 యాకోబు ఆ స్థలానికి ‘పెనూయేల్✽’ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచినా చావలేదు” అని చెప్పాడు. 31 ✽అతడు పెనూయేల్ నుంచి సాగిపోవడంతో ప్రొద్దు పొడిచింది. అతడు కుంటుతూ నడుస్తున్నాడు. 32 ఆ వ్యక్తి యాకోబు తొడగూటిమీది తుంటినరాన్ని కొట్టినందుచేత నేటివరకు ఇస్రాయేల్ ప్రజలు దేని తొడగూటిమీద ఉన్న తుంటి నరమూ తినరు.