31
1 ఆ తరువాత లాబాను కొడుకులు – “మన తండ్రికి కలిగినదంతా యాకోబు లాక్కున్నాడు. నాన్నకున్న ఆస్తిలోనుంచే ఇంత ఐశ్వర్యాన్ని చేజిక్కించుకున్నాడు” అని చెప్పుకొన్నారు. ఆ మాట యాకోబుకు వినవచ్చింది.
2 అంతేగాక లాబాను ముఖం తీరు తనపట్ల మునుపు ఉన్నట్లు అనుకూలంగా లేదని యాకోబు గమనించాడు.
3 అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ తాత ముత్తాతల దేశానికి, నీ బంధువులదగ్గరికి తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను” అన్నాడు.
4 కనుక యాకోబు పచ్చిక మైదానాలలో తన మంద దగ్గర ఇంకా ఉన్నప్పుడు రాహేలునూ లేయానూ అక్కడికి రమ్మని కబురు పంపాడు. వారితో ఇలా అన్నాడు:
5  “మీ తండ్రి ముఖం తీరు నాపట్ల అనుకూలంగా లేదని గమనిస్తున్నాను. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 6 నా శాయశక్తులా మీ నాన్నకు సేవ చేశానని మీకు తెలుసు. 7 ఆయన నా ఎడల కపటంగా వ్యవహరిస్తూ నా జీతం పది సార్లు మార్చేశాడు. అయితే దేవుడు అతడి మూలంగా నాకు నష్టం రానియ్యలేదు. 8 ‘పొడలు గలవి నీ జీతంగా ఉంటాయ’ని అతడు చెప్తే మందలన్నీ పొడలు గల పిల్లల్ని ఈనాయి. తరువాత ‘చారలు గలవి నీ జీతంగా ఉంటాయ’ని చెప్తే మందలన్నీ చారలుగల పిల్లల్ని ఈనాయి. 9 ఈ విధంగా దేవుడు మీ నాన్నకున్న పశువుల్ని తీసేసి నాకిచ్చాడు. 10 మందలు చూలు కట్టేకాలంలో నాకు కల వచ్చింది. ఆ కలలో నేను తలెత్తి చూస్తే మేకల్ని దాటే మేకపోతులకు చారలు గానీ, పొడలు గానీ, మచ్చలు గానీ ఉన్నాయి. 11 ఆ కలలో దేవుని దూత ‘యాకోబు!’ అన్నాడు. నేను ‘ఇక్కడే ఉన్నాను’ అంటూ పలికాను. 12 అప్పుడాయన ఇలా అన్నాడు: ‘నీ తలెత్తి చూడు. మేకలను దాటుతున్న మేకపోతులన్నిటికీ చారలు గానీ, పొడలు గానీ, మచ్చలు గానీ ఉన్నాయి. ఎందుకంటే నీకు లాబాను చేస్తున్నదంతా చూశాను. 13 నీవు బేతేలులో జ్ఞాపకార్థ స్తంభం మీద నూనె పోసి నాకు మొక్కుబడి చేశావు. ఆ బేతేల్ దేవుడను నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు.’”
14 అతనికి రాహేలు, లేయా జవాబిస్తూ “ఇక మా నాన్నగారింట్లో మాకు పాలు పంపులెక్కడివి? 15 ఆయన మమ్మల్ని పరాయివాళ్ళలాగా చూస్తూ ఉన్నాడు గదా. మమ్మల్ని అమ్మేసి ఆ సొమ్మంతా తానే తినేశాడు. 16 దేవుడు మా తండ్రి దగ్గర్నుంచి తీసేసిన ధనమంతా మనదీ, మన పిల్లలదీ గదా? కనుక దేవుడు మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి” అన్నారు.
17 అప్పుడు యాకోబు సిద్ధపడి, తన పిల్లలనూ భార్యలనూ ఒంటెల మీద కూర్చోబెట్టి, 18 తన పశువులనూ, తాను సంపాదించుకొన్నదంతా తీసుకొని కనానుదేశానికి, తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. పద్దన్అరాంలో సంపాదించుకొన్న సంపదనంతా తీసుకువెళ్ళాడు.
19 ఈలోగా లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరిద్దామని వెళ్ళాడు. అప్పుడు రాహేలు తన తండ్రి గృహదేవతలు దొంగిలించింది. 20 యాకోబు తాను పారిపోతున్న సంగతి సిరియావాడైన లాబానుకు తెలియజేయకుండా అతడి మోసానికి అధికమైన మోసం చేశాడు. 21 ఇలా తనకున్నదంతా తీసుకొని పారిపొయ్యాడు. అతడు బయలుదేరి, యూఫ్రటీస్ నది దాటి, గిలాదు కొండసీమవైపు ప్రయాణం సాగించాడు.
22 యాకోబు పారిపోయిన మూడో రోజున ఆ సంగతి లాబానుకు తెలియవచ్చింది. 23 అప్పుడే అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యాకోబును తరుముతూ ఏడు రోజులు ప్రయాణం చేసి, గిలాదు కొండసీమలో అతని దరిదాపులకు చేరాడు. 24 అయితే దేవుడు ఆ రాత్రి కలలో సిరియావాడైన లాబాను దగ్గరికి వచ్చి, “నీవు యాకోబుతో మంచి గానీ చెడు గానీ చెప్పకు, జాగ్రత్త!” అన్నాడు. 25 ఆ తరువాత లాబాను యాకోబును కలుసుకొన్నాడు. యాకోబు ఆ కొండసీమలో తన డేరా వేసుకొని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండల్లోనే డేరా వేసుకొన్నాడు.
26 అప్పుడు లాబాను యాకోబుతో ఇలా అన్నాడు: “నువ్వు చేసినదేమిటి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వాళ్ళలాగే నా కూతుళ్ళను తీసుకుపొయ్యావేం? 27 నువ్వు నన్ను మోసపుచ్చి నాకేం చెప్పకుండా రహస్యంగా పారిపోవడం దేనికి? నేను నిన్ను సంబరంతో, కంజరి, తంతి వాద్యాలతో, పాటలతో సాగనంపకుండా చేసుకున్నావేం? 28 నా మనుమల్నీ, కూతుళ్ళనూ ముద్దుపెట్టుకోనివ్వలేదే. ఇందులో నువ్వు పిచ్చి పట్టినవాడిలాగా ప్రవర్తించావు. 29 మీకు హాని చెయ్యాలంటే చేయగలను. అయితే నిన్నటి రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నాతో చెప్పినదేమిటంటే, ‘నీవు యాకోబుతో మంచి గానీ చెడు గానీ ఏమీ చెప్పకు సుమీ’ అని. 30  పోనీ, నువ్వు మీ నాన్న ఇంటిమీద చాలా బెంగ పెట్టుకొని వెళ్ళిపోతే పొయ్యావు గానీ నా దేవుళ్ళను దొంగిలించడం ఎందుకు?” 31 లాబానుకు జవాబిస్తూ, యాకోబు “నీవు నాదగ్గరనుంచి నీ కూతుళ్ళను బలవంతంగా తీసుకుంటావేమో అనే భయంచేత ఇలా పారిపొయ్యాను. 32 నీ దేవుళ్ళ సంగతంటావా? అవి ఎవరిదగ్గర ఉన్నాయో వారు చావాలి. నాదగ్గర ఉన్నవాటిలో నీది ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. మన బంధువులు చూస్తుండగానే వెదకి తెలుసుకో” అన్నాడు. రాహేలు ఆ విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు.
33 లాబాను యాకోబు డేరాలోకీ లేయా డేరాలోకీ ఇద్దరు దాసీల డేరాల్లోకి వెళ్ళాడు గాని అవి దొరకలేదు. అతడు లేయా డేరాలోనుంచి వెళ్ళి రాహేలు డేరాలో ప్రవేశించాడు. 34 అంతకుముందు రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామానులో పెట్టి దానిమీద కూర్చుంది. లాబాను డేరాలో అంతా తడిమి తడిమి చూచినా అవి దొరకలేదు.
35 రాహేలు తన తండ్రితో “మీ ఎదుట నేను లేవలేకపోవడం చేత మీరు కోపపడకండి. నేను బయట ఉన్నాను” అంది. అతడు అక్కడ ఆ విగ్రహాలకోసం వెదికినా అవి దొరకలేదు.
36 యాకోబు మండిపడి లాబానుతో వాదిస్తూ ఇలా అన్నాడు: “నీవు ఇంత తీవ్రంగా నా వెంటపడ్డావు గదా? నేను చేసిన తప్పేమిటి? నా నేరం ఏమిటి? 37 నీవు నా సామానులో అంతా తడిమి చూస్తే నీ ఇంటి వస్తువుల్లో ఏది దొరికింది? ఒకవేళ దొరికితే దాన్ని నా వాళ్ళ ఎదుటా, నీ వాళ్ళ ఎదుటా తెచ్చిపెట్టు. మనిద్దరి మధ్య ఉన్న ఈ విషయంలో వాళ్ళనే నిర్ణయానికి రానియ్యి. 38 ఈ ఇరవై ఏళ్ళు నేను నీ దగ్గర ఉన్నాను, నీ గొర్రెలు గానీ మేకలు గానీ ఈనక మానలేదు. నీ మంద పొట్టేళ్ళను నేను తినలేదు. 39 అడవిమృగాలు చీల్చిన వాటిని నేను నీ దగ్గరికి తీసుకురాలేదు; నేనే ఆ నష్టం భరించాను. పగలు గానీ రాత్రి గానీ దొంగలు ఎత్తుకుపోయిన వాటికి బదులు చెల్లించమని నన్నడిగావు నీవు. 40 నా స్థితి పగటి ఎండకూ రాత్రి అతి చలికి కృశించిపోతున్నట్లు ఉండేది. నిద్ర నా కండ్లకు దూరమైంది. 41 ఈ ఇరవై ఏళ్ళు నేను నీ ఇంట్లో ఉంటున్నాను. నీ ఇద్దరి పిల్లలకోసం పద్నాలుగేళ్ళూ, నీ మందకోసం ఆరేళ్ళూ నీకు చాకిరి చేశాను. నీవు నా జీతం పదిసార్లు మార్చేశావు. 42 ఒకవేళ నా తండ్రియొక్క దేవుడు, అంటే అబ్రాహాము దేవుడూ, ఇస్సాకు భయభక్తులతో సేవించిన దేవుడూ, నాకు తోడుగా ఉండకపోతే తప్పనిసరిగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపేసేవాడివే. దేవుడు నా బాధ, నా చేతుల కష్టం చూచి గడచిన రాత్రి నిన్ను ఒప్పించాడు.”
43 అప్పుడు లాబాను యాకోబుకు ఇలా మారు చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కూతుళ్ళే; ఈ అబ్బాయిలు నావారే; ఈ మందలు నా మందలే; నీకు కనబడేదంతా నాదే. అయితే ఈరోజు ఈ నా కూతుళ్ళ విషయం, వీళ్ళు కన్న పిల్లల విషయం నేనేం చేసేది? 44 కనుక నేనూ నువ్వూ ఓ ఒడంబడిక చేసుకుందాం, రా. అది నాకూ నీకూ మధ్య సాక్ష్యంగా ఉంటుంది.”
45 అప్పుడు యాకోబు ఒక రాయి తీసుకొని స్తంభంగా నిలబెట్టాడు. 46 “కొన్ని రాళ్ళు తెండి” అని తన బంధువులతో అన్నాడు. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిన తరువాత, ఆ కుప్ప దగ్గర వారంతా భోజనం చేశారు. 47 ఆ కుప్పకు లాబాను యగర్‌శాహ దూతా అనే పేరు పెట్టాడు. యాకోబు దానికి గలేదు అనే పేరు పెట్టాడు.
48 లాబాను “ఈరోజు నాకూ నీకూ ఈ కుప్ప సాక్ష్యంగా ఉన్నది” అన్నాడు (అందుచేతే దానికి “గలేదు” అనే పేరు వచ్చింది). 49 పైగా, “మనం ఒకరికొకరం దూరమై ఉన్నప్పుడు యెహోవా నీకూ నాకూ మధ్య కావలిగా ఉంటాడు గాక” అన్నాడు. గనుక ఆ కుప్పకు మిస్పా అనే పేరు కూడా వచ్చింది. 50 లాబాను యాకోబుతో ఇంకా అన్నాడు, “నువ్వు నా కూతుళ్ళను బాధించినా, నా కూతుళ్ళు గాక వేరే స్త్రీలను పెళ్ళాడినా జాగ్రత్త సుమీ! మన దగ్గర ఎవ్వరూ లేకపోయినా నాకూ నీకూ మధ్య దేవుడే సాక్షి. 51 నాకూ నీకూ మధ్యలో నేను నిలబెట్టిన ఈ స్తంభం, ఈ కుప్ప చూడు. 52 హాని చేయడానికి నేను ఈ కుప్ప దాటి నీదగ్గరికి రాననీ, నువ్వు ఈ కుప్ప, ఈ స్తంభం దాటి నా దగ్గరికి రావనీ ఈ కుప్ప, ఈ స్తంభం సాక్ష్యంగా ఉంటాయి. 53 అబ్రాహాము, నాహోరు, వాళ్ళ తండ్రి యొక్క దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తాడు గాక”! అప్పుడు యాకోబు, తన తండ్రి భయభక్తులతో సేవించిన దేవునితోడని శపథం చేశాడు. 54 యాకోబు ఆ కొండలలో దేవునికి బల్యర్పణ సమర్పించాడు. భోజనానికి తన బంధువులను పిలిచాడు. వారంతా భోజనం చేసి ఆ కొండసీమలోనే ఆ రాత్రి ఉండిపొయ్యారు. 55 ప్రొద్దుటే లాబాను లేచి తన మనుమలనూ, కూతుళ్ళనూ ముద్దుపెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపొయ్యాడు.