30
1 రాహేలు తాను యాకోబుకు పిల్లలను కనలేదని గ్రహించి, తన అక్కను చూచి అసూయపడింది. “నన్ను సంతానవతిని చేయండి. లేకపోతే చస్తాను” అని యాకోబుతో చెప్పింది.
2 రాహేలుమీద కోపంతో యాకోబు మండిపడి “నేనేం దేవుని స్థానంలో ఉన్నానా? ఆయన గర్భఫలం ప్రసాదించలేదు అంతే!” అన్నాడు.
3 రాహేలు “ఇదిగో! నా దాసి బిల్హా ఉంది గదా. ఆమెతో పోండి. ఆమె నాకోసం పిల్లల్ని కంటుంది. అలా ఆమెమూలంగా నేనూ తల్లిని అనిపించుకుంటాను” అని చెప్పి, 4 తన దాసి బిల్హాను భార్యగా అతనికిచ్చింది. యాకోబు ఆమె దగ్గరికి వెళ్ళాడు.
5 బిల్హా గర్భవతి అయి యాకోబుకు ఒక కొడుకును కన్నది.
6 అప్పుడు రాహేలు “దేవుడు నాపట్ల న్యాయం తీర్చాడు. నా మొర విని నాకు కొడుకును ప్రసాదించాడు” అంది. అందుచేత ఆ కొడుకుకు ‘దాను’ అనే పేరు పెట్టింది.
7 మరోసారి రాహేలు దాసి బిల్హా గర్భవతి అయి యాకోబుకు రెండో కొడుకును కన్నది. 8 రాహేలు “నా అక్కతో దైవసంబంధమైన పోరాటాలలో గెలిచాను” అంటూ అతనికి ‘నఫ్తాలి’ అనే పేరు పెట్టింది.
9 లేయా తనకు కానుపులు ఉడిగాయని గ్రహించి తన దాసి జిల్పాను భార్యగా యాకోబుకు ఇచ్చింది.
10 జిల్పా కూడా యాకోబుకు ఒక కొడుకును కన్నది. 11 అందుకు లేయా “ఎంత భాగ్యం!” అంటూ అతనికి ‘గాదు’ అనే పేరు పెట్టింది. 12 లేయా దాసి జిల్పా రెండో కొడుకును యాకోబుకు కన్నది. 13 లేయా “నేను ధన్యనే! స్త్రీలు నన్ను ధన్యురాలంటారు” అంటూ అతనికి ‘ఆషేరు’ అనే పేరు పెట్టింది.
14 గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పచ్చిక మైదానాలలో పుత్రదాత ఓషధి చూచి, ఆ మొక్కలు తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు లేయాతో “దయచేసి నీ కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధులు కొన్ని నాకియ్యి” అంది.
15 అందుకు లేయా “నువ్వు నా భర్తను తీసుకున్నావే. అది చాలదా? నా కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి కూడా తీసుకోవాలని చూస్తున్నావా?” అంది. రాహేలు “సరే, నీ కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి నాకిస్తే ఈ రాత్రి యాకోబు నిన్ను పొందవచ్చు” అంది.
16 ప్రొద్దు క్రుంకే వేళ యాకోబు పచ్చిక మైదానాలనుంచి వస్తున్నప్పుడు అతణ్ణి కలుసుకోవడానికి లేయా వెళ్ళి, “మీరు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన పుత్రదాత ఓషధి ఇచ్చి మిమ్మల్ని బాడుగకు తీసుకున్నాను” అంది. అందుచేత అతడు ఆ రాత్రి ఆమెను పొందాడు.
17 దేవుడు లేయా మొర విన్నాడు, గనుక ఆమె గర్భవతి అయి యాకోబుకు అయిదో కొడుకును కన్నది. 18 లేయా “నేను నా దాసిని నా భర్తకిచ్చినందుచేత దేవుడు నాకు ప్రతిఫలం ప్రసాదించాడు” అంది. ఆ కొడుకుకు ‘ఇశ్శాకారు’ అని పేరు పెట్టింది. 19 మరోసారి లేయా గర్భవతి అయి యాకోబుకు ఆరో కొడుకును కన్నది.
20 అప్పుడు లేయా “దేవుడు మంచి బహుమతి నాకిచ్చాడు. నేను నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను, గనుక ఇకనుంచి అతడు నాతోనే కాపురం చేస్తాడు” అంటూ, అతనికి ‘జెబూలూను’ అనే పేరు పెట్టింది. 21 ఆ తరువాత ఒక కూతురును కని ఆమెకు ‘దీనా’ అనే పేరు పెట్టింది.
22 దేవుడు రాహేలును జ్ఞాపకముంచుకొని ఆమె మొర విని ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు.
23 ఆమె గర్భవతి అయి కొడుకును కని “దేవుడు నా అవమానం తీసేశాడు” అంది. 24 “యెహోవా మరో కొడుకును నాకు ప్రసాదిస్తాడు గాక!” అంటూ ఆమె అతనికి ‘యోసేపు’ అనే పేరు పెట్టింది.
25 రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను స్వదేశానికి, స్వస్థలానికి వెళ్ళనివ్వు. 26 నా భార్యలకోసం, పిల్లలకోసం నీ దగ్గర పని చేశాను గదా! వారిని నాకప్పగించు, నేను వెళ్తాను. నేను నీకోసం చేసిన పని నీకు బాగా తెలుసు గదా!”
27 అందుకు లాబాను “నీకు నామీదే గనుక దయ ఉంటే నేను చెప్పేది విను. నీ కారణంగా యెహోవా ఆశీస్సులు నాకు కలిగాయని శకునం చూచి తెలుసుకున్నాను” అన్నాడు. 28 పైగా, “నీకెంత జీతం కావాలో చెప్పు. అది ఇస్తాను” అన్నాడు.
29 అందుకు యాకోబు “నేను నీ దగ్గర ఎలా పని చేశానో, నీ మందలు నాతో ఎలా ఉన్నాయో నీకు తెలుసు. 30 నేను రాకముందు నీకు ఉన్నది కొంచెమే. అది చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. నేను కాలు పెట్టిన ప్రతి చోటా యెహోవా దీవెనలు నీకు వచ్చాయి. అయితే నేను నా ఇంటివారికోసం సమకూర్చు కొనేది ఎప్పుడు?” అని అన్నాడు.
31 లాబాను “మరి, నేను నీకేమివ్వాలి” అని అడిగితే యాకోబు ఇలా చెప్పాడు: “నీవు నాకేమీ ఇవ్వకు గానీ, ఒకమాట – నీవీ మాట ప్రకారం నన్ను చెయ్యనిస్తే చాలు. నీ మందను మళ్ళీ మేపుతూ కాస్తూ ఉంటాను. 32 అంటే, ఈ రోజు నీ మంద అంతట్లో తిరుగుతూ మచ్చలు గానీ పొడలు గానీ గల ప్రతి గొర్రెనూ వేరుపరుస్తాను. గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదాన్నీ, మేకల్లో పొడలు, లేక మచ్చలు గల ప్రతిదాన్నీ వేరుపరుస్తాను. అలాంటివి నా జీతం అనుకుందాం. 33 తరువాత ఈ నా జీతాన్ని చూడడానికి నీవు వచ్చినప్పుడు, నా నిజాయితీ నీకు తెలిసిపోతుంది. నా మేకల్లో మచ్చలూ పొడలూ లేనివీ, నా గొర్రెపిల్లల్లో నలుపు లేనివీ ఏవైనా ఉంటే వాటిని నేను దొంగిలించానన్న మాటే.” 34 లాబాను “సరే, నువ్వు చెప్పినట్టే కానియ్యి” అన్నాడు.
35 ఆ రోజే లాబాను చారలు, మచ్చలు గల మేకపోతులనూ, పొడలు గానీ మచ్చలు గానీ గల ప్రతి ఆడమేకనూ – తెలుపు కొంచెమైనా గల ప్రతిదాన్నీ – గొర్రెపిల్లల్లో ప్రతి నల్లదాన్నీ వేరుపరచి తన కొడుకులకు అప్పగించాడు. 36 అప్పుడు లాబాను యాకోబు దగ్గరనుంచి మూడు రోజుల ప్రయాణం చేశాడు. అతని మందలో మిగిలినవాటిని యాకోబు మేపుతూ ఉన్నాడు.
37 అప్పుడు యాకోబు గంగరావి, బాదం, సాల అనే చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడేలా అక్కడక్కడ వాటి బరెడు ఒలిచాడు. 38 ఒలిచిన చువ్వలను మందలు త్రాగడానికి వచ్చే నీళ్ళ తొట్లలో వాటి ఎదుట ఉంచాడు. ఎందుకంటే అవి నీళ్ళు త్రాగడానికి వచ్చినప్పుడు అక్కడ ఎద అయ్యేవి. 39 అలా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి పిల్లలను ఈనినప్పుడు ఆ పిల్లలకు చారలు గానీ, పొడలు గానీ, మచ్చలు గానీ ఉండేవి. 40 యాకోబు ఆ గొర్రెపిల్లలను ప్రత్యేకంగా ఉంచాడు. లాబానుకు చెందిన మందలోని చారలుగల వాటివైపూ నల్లనివాటివైపూ మందల్లో మిగిలినవాటి ముఖాలను త్రిప్పాడు. తరువాత తన మందలను లాబాను మందలతో ఉండనియ్యకుండా వేరుగా ఉంచాడు. 41 మందలో బలమైనవి దాటినప్పుడెల్లా అవి ఆ చువ్వలెదుట చూలు కట్టాలని యాకోబు వాటి కళ్ళెదుట కాలువల్లో ఆ చువ్వలు ఉంచుతూ వచ్చాడు. 42 బలహీనమైనవాటి ఎదుట మాత్రం పెట్టలేదు. అలా బలహీనమైనవి లాబానుకూ, బలమైనవి యాకోబుకూ వచ్చాయి. 43 ఈ విధంగా యాకోబు చాలా అభివృద్ధి చెందుతూ పెద్ద పెద్ద మందలనూ దాసదాసీ జనాన్నీ ఒంటెలనూ గాడిదలనూ సంపాదించుకొన్నాడు.