29
1 యాకోబు తన ప్రయాణం సాగిస్తూ తూర్పు జనుల దేశానికి చేరుకొన్నాడు. 2 అక్కడ అతనికి పచ్చిక మైదానంలో ఒక బావీ, దాని దగ్గర పడుకొని ఉన్న మూడు గొర్రెల మందలూ కనిపించాయి. ఆ బావి నీళ్ళు మందలకు పెట్టడం కాపరులకు వాడుక. ఒక పెద్ద రాయి బావిమీద మూతవేసి ఉంది. 3 అక్కడికి మందలన్నీ పోగయ్యాక వాళ్ళు బావిమీది రాయి దొర్లించి గొర్రెలకు నీళ్ళు పెట్టి, మళ్ళీ బావిమీద రాయి దాని చోట ఉంచేవాళ్ళు.
4 యాకోబు వారిని చూచి, “సోదరులారా! మీదే ఊరు?” అని అడిగాడు. “మేము హారానువాళ్ళం” అని వారి జవాబు.
5 అందుకతడు “నాహోరుగారి కొడుకు లాబాను మీకు తెలుసా?” అని అడిగినప్పుడు, “అవును, తెలుసు” అని వారు అన్నారు.
6 “ఆయన బాగున్నారా?” అని వారిని అడిగితే “బాగున్నారు. ఇదిగో, ఇక్కడికి ఆ గొర్రెల వెంట వస్తున్నది వాళ్ళ అమ్మాయి రాహేలు” అన్నారు వారు.
7 అతడన్నాడు, “ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉంది. పశువులను పోగుచేసే వేళ కాలేదు. గొర్రెలకు నీళ్ళు పెట్టి, వెళ్ళి, వాటిని మేపండి.”
8 వారు “మందలన్నీ పోగయ్యాక బావిమీది రాయి దొర్లిస్తారు. అప్పుడు మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం. అంతకుముందు మేమేం చేయలేం” అని బదులు చెప్పారు.
9 అతడు వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాహేలు తన తండ్రి గొర్రెల వెంట వచ్చింది. ఆమె వాటిని కాసేది. 10 యాకోబు తన మేనమామ లాబాను కూతురిని చూచి, అతనికి చెందిన గొర్రెలను కూడా చూచి, బావిదగ్గరకు వెళ్ళి దానిమీది రాయి దొర్లించి తన మేనమామ లాబాను మందకు నీళ్ళు పెట్టాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని గట్టిగా ఏడ్చాడు.
12 యాకోబు రాహేలుకు తాను ఆమె తండ్రి సమీప బంధువుణ్ణీ రిబ్కా కొడుకునూ అని తెలిపాడు. ఆమె పరుగెత్తి వెళ్ళి ఆమె తండ్రితో చెప్పింది. 13 లాబాను తన మేనల్లుడు వచ్చిన సంగతి వినడంతోనే అతణ్ణి కలుసుకోవడానికి పరుగులు తీస్తూ వచ్చి అతణ్ణి కౌగిలించుకొని, ముద్దుపెట్టుకొని, తన ఇంటికి తీసుకువచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.
14 లాబాను “నిజంగా నువ్వు నాకు రక్తసంబధివే” అన్నాడు. యాకోబు అతడి దగ్గర నెల రోజులు గడిపాడు.
15 ఆ తరువాత లాబాను యాకోబుతో “నువ్వు నాకు బంధువుడివి కావడంచేత నాకోసం ఊరికే పని చేయడం న్యాయమా? నీకేం జీతం కావాలో చెప్పు!” అన్నాడు.
16 లాబానుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు లేయా. చిన్నమ్మాయి పేరు రాహేలు. 17 లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలైతే రూపవతి, అందకత్తె. 18 రాహేలంటే యాకోబుకు ప్రేమ గనుక అతడు లాబానుతో, “మీ చిన్నమ్మాయి కోసం ఏడేళ్ళు మీదగ్గర పని చేస్తాను” అన్నాడు.
19 “నేనామెను వేరొకడికి ఇవ్వడం కంటే నీకివ్వడం నయం. మా దగ్గర ఉండు” అన్నాడు లాబాను.
20 అలా యాకోబు రాహేలుకోసం ఏడేళ్ళు పని చేశాడు. అయితే ఆమె మీద తనకుండే ప్రేమ ఎంత గొప్పదంటే ఆ సంవత్సరాలు కొద్ది రోజులే అనిపించాయి.
21 అప్పుడు యాకోబు లాబానును చూచి “నా నిర్ణీతకాలం అయిపోయింది. నేను నా భార్య దగ్గరికి వెళ్ళేట్టు మీరు ఆమెను నాకిచ్చి చెయ్యండి” అని అడిగాడు.
22 కనుక లాబాను అక్కడి వాళ్ళందరినీ పోగు చేసి విందు చేశాడు. 23 ఆ రాత్రి అతడు తన కూతురు లేయాను యాకోబు దగ్గరికి తీసుకువచ్చాడు. యాకోబు ఆమెతో లోపలికి పోయాడు. 24 (లాబాను తన దాసి జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు.)
25 ఉదయం అయింది. యాకోబు చూచినప్పుడు కనబడింది లేయా! గనుక లాబానుతో, “నీవు నాకు ఏం చేసినట్టు? నేను రాహేలు కోసమే గదా నీ దగ్గర పని చేసినది! నీవు నన్ను మోసం చేశావెందుకు?” అన్నాడు.
26 లాబాను అన్నాడు, “పెద్దమ్మాయి కంటే ముందుగా చిన్నమ్మాయిని ఇవ్వడం అనేది మా దేశం వాడుక కాదు. 27 ఈమె వివాహోత్సవ వారం నెరవేర్చు. నువ్వు మరో ఏడేళ్ళు నా దగ్గర పని చేస్తే ఆమెను కూడా నీకిస్తా.”
28 యాకోబు అలా చేసి, లేయా వారం గడువు నెరవేర్చాడు, గనుక లాబాను తన కూతురు రాహేలునూ అతడికిచ్చి పెళ్ళి చేశాడు. 29 (లాబాను తన దాసి బిల్హాను రాహేలుకు దాసిగా ఇచ్చాడు.) 30 యాకోబు రాహేలును పొందాడు. లేయాను ప్రేమించేకంటే రాహేలును ఎక్కువగా ప్రేమిస్తూ, లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు పని చేశాడు.
31 లేయా ద్వేషానికి గురి అయిన సంగతి యెహోవా చూచి ఆమెకు సంతానాన్ని ప్రసాదించాడు, రాహేలేమో గొడ్రాలు. 32 లేయా గర్భవతి అయి కొడుకును కని అతనికి ‘రూబేను’ అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యెహోవా నా బాధ చూశాడు. ఇక నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అనుకొంది. 33 ఆమె ఇంకొక సారి గర్భవతి అయి కొడుకును కని, “నేను ద్వేషానికి గురి అయిన సంగతి యెహోవా విని ఈ కొడుకును కూడా ప్రసాదించాడు” అంటూ, అతనికి ‘షిమ్యోను’ అనే పేరు పెట్టింది. 34 ఆమె మరోసారి గర్భవతి అయి కొడుకును కని, “నేను నా భర్తకు ముగ్గురు కొడుకుల్ని కన్నాను, గనుక ఇప్పుడు ఆయన నాతో హత్తుకుని ఉంటాడు” అంది. అందుచేత అతనికి లేవీ అని నామకరణం చేసింది. 35 ఆమె ఇంకోసారి గర్భవతి అయి కొడుకుని కని, “ఈ సారి నేను యెహోవాను స్తుతిస్తాను” అంది. కనుక అతనికి “యూదా” అనే పేరు పెట్టింది. అప్పుడామెకు కాన్పులు ఉడిగిపోయాయి.