28
1 అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలా ఆజ్ఞాపించి దీవించాడు✽: “నీవు ఈ కనానుదేశంలో ఉన్న స్త్రీలలో✽ ఎవతెనూ పెళ్ళి చేసుకోకూడదు. 2 లేచి, పద్దన్ అరాంకు, మీ తల్లి యొక్క తండ్రి బెతూయేలు ఇంటికి వెళ్ళి, మీ తల్లి అన్న లాబాను కూతుళ్ళలో ఒకామెను పెళ్ళి చేసుకో. 3 నీవు అనేక జనాలయ్యేలా అమిత శక్తి గల దేవుడు నిన్ను దీవించి, ఫలవంతంగా చేసి, అనేక సంతతివారిని ప్రసాదిస్తాడు గాక! 4 ✝దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని, అంటే నీవు పరదేశిగా నివసించే ఈ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకొనేలా దేవుడు నీకూ నీ సంతానానికీ అబ్రాహాము యొక్క దీవెనను దయచేస్తాడు గాక.”5 అప్పుడు ఇస్సాకు పంపివేసిన యాకోబు పద్దన్అరాంలో ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కొడుకు; యాకోబు, ఏశావుల తల్లి రిబ్కాకు అన్న. 6 యాకోబు పద్దన్ అరాంలో పెళ్ళి చేసుకొనేలా ఇస్సాకు అతణ్ణి దీవించి, అక్కడికి పంపివేశాడనీ, దీవిస్తూ ఉన్నప్పుడు ‘కనాను దేశంలో వున్న స్త్రీలలో ఎవతెనూ పెళ్ళి చేసుకోకూడద’ని ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసిపోయింది. 7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని, పద్దన్ అరాంకు వెళ్ళిపోయాడనీ, 8 కనాను దేశం స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ కూడా ఏశావు తెలుసుకున్నాడు. 9 గనుక అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి తనకున్న భార్యలు గాక మాహలతు అనే ఇంకో ఆమెను పెండ్లాడాడు. ఆమె అబ్రాహాము కొడుకైన ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి.
10 ✽యాకోబు బేర్‌షెబానుంచి హారాను✽కు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. 11 ఒక చోట చేరి ప్రొద్దు క్రుంకినందుచేత అక్కడ ఆ రాత్రి ఉండిపోయి, అక్కడి రాళ్ళలో ఒకదాన్ని తలక్రింద దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు. 12 అప్పుడు అతనికి ఒక కల✽ వచ్చింది. అందులో ఒక నిచ్చెన✽ భూమిమీద నిటారుగా ఉంది. దాని కొన ఆకాశంవరకూ ఉంది. దానిమీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
13 ✽అంతేగాక, యెహోవా తానే దానికి పైగా నిలబడి ఉండి ఇలా అన్నాడు:
“నేను యెహోవాను, నీ తండ్రి అబ్రాహాముకూ, ఇస్సాకుకూ దేవుడను. నీవు పడుకొన్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 14 నీ సంతానం లెక్కకు ఇసుక రేణువులలాగా అవుతుంది. నీ సంతానం పడమటగా, తూర్పుగా, ఉత్తరంగా, దక్షిణంగా అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది. నీ మూలంగానూ నీ సంతానం మూలంగానూ లోకంలో ఉన్న వంశాలన్నీ ధన్యం అవుతాయి✽. 15 ఇదిగో, నేను నీకు తోడుగా✽ ఉంటాను. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ✽, నిన్ను ఈ దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. నేను నీ చెయ్యి విడవకుండా నీతో చెప్పిన మాట నిలబెట్టుకొంటాను.”
16 ✽యాకోబు మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు – సందేహం లేదు, గానీ అది నాకు తెలియలేదు” అనుకొన్నప్పుడు అతనికి భయం వేసింది. 17 “ఈ స్థలం ఎంత భయం కలిగించేది! ఇది దేవుని ఆలయమే గాని వేరొకటి కాదు. ఇది పరలోక ద్వారమే!” అనుకొన్నాడు.
18 ఉదయం కాగానే యాకోబు లేచి తన తలక్రింద దిండుగా పెట్టుకొన్న ఆ రాయి తీసుకొని జ్ఞాపకార్థ స్తంభం✽గా నిలిపి దానిపై నూనె పోశాడు. 19 ✽అతడు ఆ స్థలానికి “బేతేల్” అనే పేరు పెట్టాడు. పూర్వం ఆ ఊరి పేరు లూజు. 20 ✽అప్పుడు యాకోబు ఒక మొక్కుబడి చేసుకొని ఇలా అన్నాడు:
21 “నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేలా దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను వెళ్తున్న తోవలో నన్ను కాపాడుతూ, తినడానికి ఆహారమూ, తొడుక్కోవడానికి బట్టలూ నాకు ప్రసాదిస్తూ వుంటే యెహోవానే నా దేవుడుగా✽ భావించుకొంటాను.
22 “అలాంటప్పుడు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి ఉన్న స్థలం దేవుణ్ణి ఆరాధించే స్థలం అవుతుంది. నీవు నాకు ప్రసాదించేవాటన్నిట్లో పదో భాగం✽ నీకిచ్చితీరుతాను.”