27
1 ఇస్సాకు కండ్లు మసకబారాయి. చూపులేని వయోవృద్ధుడైపోయాడు. అప్పుడతడు పెద్ద కొడుకు ఏశావుతో, “అబ్బాయీ!” అని పిలవగా అతడు “ఇక్కడే ఉన్నాను” అన్నాడు. 2 ఇస్సాకు “చూడు, నేను వృద్ధుణ్ణి. నేనెప్పుడు చనిపోతానో తెలియదు. 3 కనుక నీవు నీ ఆయుధాలు – నీ అంబులపొదీ, విల్లూ – పట్టుకొని మైదానాలకు వెళ్ళి వేటాడి నా కోసం మాంసం తీసుకురా. 4 నేను చనిపోయేముందు నిన్ను దీవించేలా నీవు నాకిష్టమైన రుచిగల వంటకం సిద్ధం చేసి నేను తినడానికి తీసుకురా” అన్నాడు.
5 ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా అంటూ ఉంటే రిబ్కా విన్నది. ఏశావేమో వేటాడి, మాంసం తేవడానికి మైదానాలకు వెళ్ళాడు. 6 అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో ఇలా చెప్పింది:
“చూడు, మీ నాన్నగారు నీ అన్న ఏశావుతో మాట్లాడడం విన్నాను. 7 ‘నేను చనిపోయేముందు యెహోవా సముఖంలో నిన్ను దీవించేలా నీవు మాంసం తెచ్చి నేను తినడానికి రుచిగల వంటకం సిద్ధం చెయ్యమ’ని అతనితో అన్నారు. 8 అందుచేత, నా మాట విని నేను నీకు చెప్పేది చెయ్యి. 9 మందకు వెళ్ళి, రెండు మంచి మేకపిల్లల్ని నా దగ్గరికి తీసుకురా. మీ నాన్నగారికిష్టమైన రుచిగల వంటకం ఆయనకోసం సిద్ధం చేస్తాను. 10 ఆయన చనిపోయేముందు దాన్ని తిని, నిన్ను దీవించేట్టు మీ నాన్నగారి దగ్గరికి నీవు తీసుకుపోవాలి.”
11 యాకోబు తన తల్లి రిబ్కాతో, “ఇదిగో, ఏశావుకు ఒళ్ళంతా వెండ్రుకలు; నేను నున్ననివాణ్ణి. 12 మా నాన్నగారు నన్ను చేత్తో తాకి చూస్తాడేమో. అప్పుడు నేను వంచకుణ్ణి అని ఆయనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు దీవెన కాదు, శాపమే నా నెత్తిమీదికి కొనితెచ్చుకుంటాను” అన్నాడు.
13 అందుకు అతని తల్లి “బాబూ, ఆ శాపం నాకు తగలనియ్యి, నా మాట మాత్రం విని, వెళ్ళి, మేక పిల్లల్ని నా దగ్గరికి తీసుకురా” అంది.
14 కనుక అతడు వెళ్ళి, వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు. ఆమె అతని తండ్రికష్టిమైన రుచిగల వంటకం సిద్ధం చేసింది. 15 అంతేకాక ఇంట్లో ఉన్న తన పెద్ద కొడుకు ఏశావు వస్త్రాల్లోకల్లా మంచివాటిని తీసుకొని, తన చిన్న కొడుకు యాకోబుకు తొడిగించింది రిబ్కా. 16 ఆ మేకపిల్లల తోలును అతని చేతుల మీదా నున్నని మెడభాగంమీదా కప్పింది కూడా.
17 అప్పుడు తాను సిద్ధం చేసిన రుచిగల వంటకం, రొట్టె తన కొడుకు యాకోబు చేతికిచ్చింది.
18 అతడు తన తండ్రిదగ్గరికి వచ్చి “నాన్నగారూ” అని పిలిచాడు. “ఏం బాబూ, నీ వెవరివి?” అని ఇస్సాకు అడిగాడు. యాకోబు తన తండ్రితో ఇలా అన్నాడు:
19 “నేను నీ పెద్ద కొడుకు ఏశావును. నువ్వు నాతో చెప్పినట్టే చేశాను. నువ్వు నన్ను దీవించేలా లేచి, కూచుని, నేను తెచ్చిన మాంసం తిను.”
20 అందుకు ఇస్సాకు “నీకిది ఇంత త్వరగా ఎలా దొరికింది బాబూ?” అని అడిగాడు. “నీ దేవుడైన యెహోవా అలా జరిగించాడు” అని యాకోబు జవాబు.
21 అప్పుడు ఇస్సాకు యాకోబుతో “దగ్గరకు రా, బాబు. అసలు నీవు నా కొడుకు ఏశావువో కాదో నిన్ను తాకి తెలుసుకోవాలి” అన్నాడు.
22 యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అతణ్ణి తడుముతూ “స్వరమేమో యాకోబుది. చేతులేమో ఏశావువి” అన్నాడు.
23 అతని అన్న ఏశావు చేతులలాగే అతని చేతులూ వెండ్రుకలు గలవి గనుక ఇస్సాకు అతణ్ణి గుర్తు పట్టలేదు. అందుచేత అతణ్ణి దీవించాడు.
24 “నీవు నిజంగా నా కొడుకు ఏశావువా?” అని అతణ్ణి అడిగితే “అవును, నేనే” అన్నాడతను.
25 ఇస్సాకు అన్నాడు: “దాన్ని నాదగ్గరకి తే. నేను నిన్ను దీవించేలా నా కొడుకైన నీవు వేటాడి తెచ్చిన మాంసం తింటాను.” అతడు దాన్ని అతనిదగ్గరకు తెచ్చినప్పుడు తిన్నాడు, ద్రాక్షరసం తెచ్చినప్పుడు దాన్ని త్రాగాడు.
26 ఆ తరువాత తండ్రి ఇస్సాకు, “దగ్గరకు వచ్చి నన్ను ముద్దుపెట్టుకో బాబూ” అన్నాడు.
27 యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దుపెట్టుకొన్నప్పుడు ఇస్సాకు అతని వస్త్రాలను వాసన చూచి అతణ్ణి దీవిస్తూ ఇలా అన్నాడు:
“ఇదిగో, నా కొడుకు సువాసన
యెహోవా దీవించిన భూముల సువాసనలాంటిది.
28 కాబట్టి దేవుడు ఆకాశం మంచునూ,
భూసారాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ,
ద్రాక్షరసాన్నీ నీకు ప్రసాదిస్తాడు గాక.
29 వేరు వేరు ప్రజలు నీకు సేవ చేస్తారు గాక.
జనాలు నీకు సాగిలపడతారు గాక.
నీ బంధువులకు నీవు యజమానిగా
ఉంటావు గాక.
నీ తల్లి కొడుకులు నీకు సాగిలపడతారు గాక.
నిన్ను శపించే ప్రతి ఒక్కడూ శాపానికి
గురి అవుతాడు గాక.
నిన్ను దీవించే ప్రతి ఒక్కడూ ధన్యజీవి
అవుతాడు గాక.”
30 ఇస్సాకు యాకోబును దీవించి ముగించగానే, యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గరనుంచి వెళ్ళిన తక్షణమే, తన అన్న ఏశావు వేటనుంచి వచ్చాడు.
31  అతడు కూడా రుచిగల వంటకం సిద్ధం చేసి తన తండ్రిదగ్గరకు తెచ్చి అతనితో, “నాన్నగారూ, నీవు నన్ను దీవించేట్టు లేచి నీ కొడుకైన నేను తెచ్చిన మాంసం తిందువుగాని” అన్నాడు. 32 అతని తండ్రి ఇస్సాకు “నీవు ఎవరివైనట్టు?” అని అడిగాడు. అతడు “నీ పెద్ద కొడుకు ఏశావును” అన్నాడు.
33 ఇస్సాకు గడగడ వణకుతూ “ఇంతకుముందే వేటాడి మాంసం నా దగ్గరికి తెచ్చినదెవరు? నీవు వచ్చేముందే దాన్ని తిని అతణ్ణి దీవించాను. దేవుడు అతణ్ణి నిజంగా దీవిస్తాడు కూడా” అన్నాడు.
34 తన తండ్రి మాటలు వినిపించగానే ఏశావు బాధగా పెద్ద కేకపెట్టి అతనితో “అయ్యో, నాన్నా, నన్నూ దీవించు, నన్ను కూడా” అన్నాడు.
35 ఇస్సాకు అన్నాడు, “నీ తమ్ముడు కపటంగా వచ్చి నీ దీవెన తీసుకుపొయ్యాడు.”
36 ఏశావు “వాడికి యాకోబు అనే పేరు తగినదే. ఈ రెండుసార్లు కుయుక్తితో నన్ను పడగొట్టాడు. మునుపు నా జన్మహక్కును తీసుకున్నాడు. ఇప్పుడు నా దీవెన కూడా తీసుకుపొయ్యాడు” అంటూ “అయితే నాకోసం ఏ దీవెనా మిగిల్చివుంచలేదా, నాన్నా?” అని అడిగాడు.
37 ఇస్సాకు ఏశావుతో “ఇదిగో, నేను అతణ్ణి నీ యజమానిగా చేశాను; అతని బంధువులందరినీ అతనికి సేవకులనుగా ఇచ్చాను. అతడి పోషణకు ధాన్యమూ, ద్రాక్షరసమూ ఇచ్చాను. నీకు ఇవ్వడానికి మిగిలినదేమిటి నాయనా?” అని జవాబిచ్చాడు.
38 తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క దీవెన మాత్రమే ఉందా? నన్నూ దీవించు, నాన్నా, నన్ను కూడాను” అంటూ ఏశావు కంఠమెత్తి ఏడ్చాడు. 39 గనుక అతని తండ్రి ఇస్సాకు అన్నాడు,
“నీ నివాసం భూసారానికీ, ఆకాశం నుంచి
పడే మంచుకూ దూరం అవుతుంది.
40 నీ ఖడ్గంచేత నీవు బతుకుతావు గానీ,
నీ తమ్మునికి సేవ చేస్తావు.
నీవు కట్లు తెంచుకొని తప్పించుకొని
నీ మెడపైనుంచి అతని కాడి విరిచివేస్తావు.”
41 యాకోబు తన తండ్రిచేత పొందిన దీవెన కారణంగా అతనిమీద ఏశావుకు ద్వేషం కలిగింది. అతడు లోలోపల “మా నాన్న త్వరలో చనిపోతాడు. అతణ్ణి గురించి శోకించే రోజులు రానియ్యి. నా తమ్ముడు యాకోబును చంపేస్తాను చూస్కో” అనుకొన్నాడు.
42 తన పెద్దకొడుకు ఏశావు అలా చెప్తున్నాడని రిబ్కాకు ఎవరో తెలియజేయడంతో ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిచి అతనితో ఇలా అంది:
“విను, నీ అన్న ఏశావు నీమీద పగపట్టాడు. నిన్ను చంపి తీరుతాడు. 43 గనుక, నా మాట విను, నువ్వు సిద్ధపడి హారానులో ఉన్న నా అన్న లాబాను దగ్గరికి పారిపో. 44 నీ అన్న కోపాగ్ని చల్లారిపోయేవరకు కొన్నాళ్ళు అక్కడ అతనిదగ్గర ఉండు. 45 నీ మీద నీ అన్నకున్న కోపాగ్ని చల్లారిపోయాక, నువ్వు అతనికి చేసినది అతడు మరచిపోయినప్పుడు, నిన్ను అక్కడనుంచి పిలిపిస్తాను. ఒకే రోజున మీ ఇద్దరినీ నేనెందుకు పోగొట్టుకోవాలి?”
46  తరువాత రిబ్కా ఇస్సాకుతో “ఈ హేతు ఆడవాళ్ళంటే నా ప్రాణం విసికిపోయింది. ఈ దేశ స్త్రీలలో ఇలాంటి హేతు స్త్రీని ఎవర్నైనా యాకోబు పెళ్ళాడితే నా బతుకెందుకు?” అంది.