26
1 అబ్రాహాము కాలంలో వచ్చిన ఆ మొదటి కరవుగాక మరో కరవు ఆ దేశంలో వచ్చింది. అందుచేత ఇస్సాకు గెరారుకు, ఫిలిష్తీయవాళ్ళ రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు.
2 అప్పుడు అతనికి యెహోవా ప్రత్యక్షమై అతనితో అన్నాడు, “ఈజిప్ట్ దేశానికి వెళ్ళవద్దు. నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. 3 నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఆశీస్సులు ప్రసాదిస్తాను. ఎందుకంటే నీకూ, నీ సంతానానికీ ఈ దేశాలన్నీ ప్రసాదిస్తాను; నీ తండ్రి అబ్రాహాముతో నేను చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. 4 నీ సంతానాన్ని లెక్కకు ఆకాశ నక్షత్రాలలాగా అధికం చేస్తాను, వారికి ఈ దేశాలన్నీ ప్రసాదిస్తాను. వారి మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి. 5 ఎందుకంటే అబ్రాహాము నా మాట విని నా చట్టాలు, ఆజ్ఞలు, శాసనాలు, నియమాలు అనుసరించి ప్రవర్తించాడు.”
6 అందుచేత ఇస్సాకు గెరారులో ఉండిపొయ్యాడు. 7 అక్కడివాళ్ళు అతని భార్యను చూచి ఆమె విషయం అడిగినప్పుడు అతడు “ఈమె నా చెల్లెలు” అని జవాబిచ్చాడు. “రిబ్కా చాలా చక్కనిది గనుక ఆమెకోసం ఇక్కడివాళ్ళు నన్ను చంపేస్తారేమో” అనుకొని, “ఈమె నా భార్య” అనడానికి భయపడ్డాడు. 8 ఆ స్థలంలో అతడు చాలా రోజులున్న తరువాత ఒకనాడు ఫిలిష్తీయవాళ్ళ రాజైన అబీమెలెకు ఒక కిటికీలోనుంచి చూస్తూవుంటే ఇస్సాకు తన భార్యతో సరస సల్లాపాలాడడం కనిపించింది.
9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలవనంపించి “ఆమె నీ భార్య. సందేహం లేదు. ‘ఈమె నా చెల్లెల’ని నీవు చెప్పావేమిటి?” అన్నాడు. అతనితో ఇస్సాకు “ఆమె నిమిత్తం నేను చావవలసి వస్తుందేమో అనుకున్నాను” అన్నాడు.
10 అబీమెలెకు “నీవు మాకు చేసిందేమిటి? ఒకవేళ ఈ జనంలో ఎవరో ఒకడు నీ భార్యతో నిర్భయంగా పోయి ఉండి ఉండేవాడు. అలా జరిగితే నీవు మా నెత్తిమీదికి అపరాధం తెచ్చిపెట్టేవాడివే కదా?”
11 అబీమెలెకు ఆ దేశ ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తూ, “ఈ మనిషికి గానీ, అతడి భార్యకు గానీ ఎవడైనా హాని చేస్తే, వాడు తప్పనిసరిగా మరణశిక్ష పొందుతాడు” అన్నాడు.
12 ఇస్సాకు ఆ దేశంలో భూమి సాగుచేశాడు. ఆ సంవత్సరంలోనే నూరంతలుగా పంట కోశాడు. ఎందుకంటే, యెహోవా అతణ్ణి దీవించాడు. 13 ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు.
14 గొర్రెల మందలూ, పశువుల మందలూ, దాసులూ అనేకులు అతనికి ఉండడం చూచి ఫిలిష్తీయవాళ్ళకు అసూయ పుట్టింది. 15 అతని తండ్రి అబ్రాహాము కాలంలో అతని తండ్రి దాసులు త్రవ్విన అన్ని బావులను ఫిలిష్తీయవాళ్ళు మట్టిపోసి పూడ్చివేశారు.
16 అబీమెలెకు ఇస్సాకుతో, “మాకంటే మీ బలం చాలా ఎక్కువ. మా దగ్గరనుంచి మీరు వెళ్ళిపోండి” అన్నాడు. 17 అందుచేత ఇస్సాకు అక్కడనుంచి వెళ్ళి, గెరారు లోయలో డేరా వేసుకొని అక్కడ ఉండిపోయాడు.
18 తన తండ్రి అయిన అబ్రాహాము కాలంలో త్రవ్విన బావులను అబ్రాహాము చనిపోయాక ఫిలిష్తీయవాళ్ళు పూడ్చివేసి నందుచేత ఇస్సాకు వాటిని మళ్ళీ త్రవ్వించాడు. తన తండ్రి వాటికి పెట్టిన పేర్లే వాటికి తిరిగి పెట్టాడు. 19 ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వుతూ ఉన్నప్పుడు ఉబికిపారుతున్న నీటి బుగ్గ దొరికింది. 20 అప్పుడు గెరారుకు చెందిన కాపరులు “ఈ నీళ్ళు మావే” అని చెప్తూ ఇస్సాకు కాపరులతో పోరాడారు. వాళ్ళు అలా తనతో జగడమాడినందుచేత అతడు ఆ బావికి ఏశెక్ అనే పేరు పెట్టాడు. 21 వారు మరో బావి త్రవ్విన తరువాత దానికోసం కూడా పోరాడారు. అతడు దానికి సిత్నా అనే పేరు పెట్టాడు.
22 అప్పుడతడు అక్కడనుంచి ఇంకో స్థలానికి వెళ్ళి మరో బావి త్రవ్వించాడు. దానికోసం వాళ్ళు పోరాడలేదు, గనుక “యెహోవా మనకు తావు ప్రసాదించాడు. ఈ దేశంలో వర్ధిల్లుతాం” అని చెప్పి ఆ బావికి రెహబోత్ అనే పేరు పెట్టాడు. 23 తరువాత అతడు అక్కడనుంచి బేర్‌షెబాకు వెళ్ళాడు. 24 చేరిన రాత్రే అతనికి యెహోవా ప్రత్యక్షమై, “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము యొక్క దేవుడను. నేను నీకు తోడుగా ఉన్నాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నిన్ను దీవించి నీ సంతానం అనేకం అయ్యేలా చేస్తాను, గనుక నీకు భయం ఉండకూడదు” అన్నాడు.
25 అక్కడ ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టి, యెహోవా పేర ప్రార్థన చేసి, అక్కడ తన డేరా వేసుకొన్నాడు. అక్కడ కూడా ఇస్సాకు దాసులు ఒక బావి త్రవ్వారు.
26 అబీమెలెకు, అతని మిత్రుడు అహూజతు, అతని సేనాధిపతి ఫీకోలు గెరారునుంచి అతనిదగ్గరికి వచ్చారు. 27 ఇస్సాకు వాళ్ళను చూచి, ఇలా అన్నాడు: “మీరు నా దగ్గరికి వచ్చారెందుకు? నన్ను ద్వేషించి మీదగ్గరనుంచి పంపివేశారు గదా!”
28 వాళ్ళు “యెహోవా మీకు తోడుగా ఉన్నాడని మాకు తేటతెల్లంగా కనిపించింది. అందుచేత మేము చెప్పుకొనేదేమంటే, మన మధ్య అంటే మాకూ, మీకూ మధ్య ఓ శపథం ఉండాలి. మేము మీతో ఓ ఒడంబడిక చేయాలి. 29 అంటే, మేము మీకు ఏ హానీ చేయకుండా మేలే చేసి మిమ్మల్ని ప్రశాంతంగా పంపివేసిన ప్రకారం మీరు మాకు ఏ కీడూ చేయకుండా ఉంటారని మనం ఒప్పందపడాలనుకున్నాం. మీరిప్పుడు యెహోవా దీవెన పొందినవారు గదా!” అన్నారు.
30 అతడు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళంతా ఆహారం, పానీయం పుచ్చుకొన్నారు. 31 ఉదయం పెందలకడ లేచి ఒకరితో ఒకరు శపథం చేసుకొన్న తరువాత ఇస్సాకు వాళ్ళను త్రోవన సాగనంపాడు. వాళ్ళు అతని దగ్గరనుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. 32 ఆ రోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావి గురించి అతనికి తెలిపి, “నీళ్ళు దొరికాయి” అన్నారు. 33 ఆ బావికి షేబ అనే పేరు పెట్టాడు. ఈ రోజువరకు అక్కడి ఊరి పేరు బేర్‌షెబా.
34 ఏశావు నలభై ఏళ్ళవాడయినప్పుడు హేతువాడైన బేయేరీ కూతురు యహూదీయునూ హేతువాడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళిచేసుకొన్నాడు. 35 ఇస్సాకు, రిబ్కాల మనసులకు వీళ్ళు చాలా వేదన కలిగించేవాళ్ళు.