25
1 ఆ తరువాత అబ్రాహాము మరో ఆమెను వివాహమాడాడు. ఆమె పేరు కెతూరా✽. 2 ఆమె అతనికి కన్న సంతానం జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. 3 యొక్తానుకు షేబ, దదాను జన్మించారు. దదాను కొడుకులు అష్షూరిం, లెతుషిం, లెయుమిం. 4 మిద్యాను కొడుకులు ఏయిఫా, ఎఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతతివారు. 5 ✝అయితే అబ్రాహాము తనకు కలిగినదంతా ఇస్సాకుకే ఇచ్చాడు. 6 అబ్రాహాము తన ఉంపుడుకత్తెల✽ కొడుకులకు బహుమతులిచ్చి తానింకా బ్రతికి ఉన్నప్పుడే తన కొడుకు ఇస్సాకు దగ్గరనుంచి తూర్పు దిక్కుకు తూర్పు ప్రదేశానికి వాళ్ళను పంపివేశాడు.7 ✽అబ్రాహాము బ్రతికిన సంవత్సరాలు మొత్తం నూట డెబ్భై అయిదు. 8 అబ్రాహాము సుదీర్ఘ జీవితం గడిపి నిండు ముసలితనంలో ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు✽. 9 ✝అతని కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలు మకపేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. అది హేతువాడైన సోహరు కొడుకు ఎఫ్రోనుకు చెందిన మైదానంలో, మమ్రేకి ఎదురుగానే ఉంది. 10 అబ్రాహాము హేతు సంతతివాళ్ళ దగ్గర కొనుక్కొన్న ఆ మైదానంలోనే అబ్రాహామునూ, అతని భార్య శారానూ పాతిపెట్టడం జరిగింది. 11 ✝అబ్రాహాము చనిపోయిన తరువాత అతని కొడుకు ఇస్సాకును దేవుడు దీవించాడు. అప్పుడు ఇస్సాకు బేర్‌లహాయిరోయి దగ్గర కాపురం ఉన్నాడు.
12 అబ్రాహాము కొడుకు ఇష్మాయేలు సంతతివాళ్ళ వంశవృక్షం: అతణ్ణి అబ్రాహాముకు శారా దాసీ, ఈజిప్ట్ స్త్రీ అయిన హాగరు కన్నది. 13 ఇష్మాయేలు కొడుకుల పేర్లు వాళ్ళ తరాలప్రకారం ఇవే: ఇష్మాయేలుకు మొదట పుట్టినవాడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాం, 14 మిష్మా, దూమా, మశ్శా, 15 హదరు, తేమా, యెతూరు, నాఫీషు, కెదమా. 16 ✝ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ కోటల ప్రకారమూ వారి పేర్లు ఇవే. వారు తమ తమ వంశాలకు పన్నెండుగురు నాయకులు. 17 ఇష్మాయేలు జీవితకాలం నూట ముప్ఫయి ఏడేళ్ళు. అప్పుడతడు ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. 18 అతడి సంతానం✽ హవీలానుంచి షూరువరకు తమ బంధువులను✽ లెక్కచెయ్యకుండా తమ కాపురమేర్పరచుకొన్నారు. షూరు ఈజిప్ట్‌దేశానికి తూర్పుగా అష్షూరుకు వెళ్ళే త్రోవలో ఉంది. 19 అబ్రాహాము కొడుకు ఇస్సాకు చరిత్ర ఇదే: ఇస్సాకు అబ్రాహాముకు జన్మించినవాడు. 20 ఇస్సాకు రిబ్కాను పెళ్ళి చేసుకొన్నప్పుడు నలభై ఏళ్ళవాడు. రిబ్కా పద్దన్అరాంలో నివసించే సిరియావాడైన బెతూయేలు కూతురు, సిరియావాడైన లాబాను సోదరి. 21 తన భార్య గొడ్రాలై✽ ఉండడం చేత ఆమెనిమిత్తం ఇస్సాకు యెహోవాను ప్రార్థించాడు✽. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. గనుక రిబ్కా గర్భవతి అయింది. 22 ఆమె గర్భంలో శిశువులిద్దరు దెబ్బలాడుకొంటూ ఉన్నారు. గనుక ఆమె “ఇలా ఉంటే నేను బ్రతకడం ఎందుకు?” అని చెప్పి యెహోవా ఉద్దేశం తెలుసుకుందామని వెళ్ళింది.
23 యెహోవా ఆమెకు చెప్పినదేమిటంటే, “నీ గర్భంలో రెండు జనాలు✽ ఉన్నాయి. నీలోనుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు. పుట్టుకనుంచే ఒకడంటే రెండోవాడికి గిట్టదు. ఒక గోత్రంకంటే మరో గోత్రం బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి✽ సేవ చేస్తాడు.”
24 ప్రసవ దినం వచ్చింది. ఆమె గర్భంలో కవల పిల్లలున్నారు. 25 మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికీ రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు గనుక అతడికి ఏశావు✽ అనే పేరు పెట్టారు.
26 తరువాత ఏశావు మడమను పట్టుకొని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు✽ అనే పేరు పెట్టారు. ఆమె వారిని కన్నప్పుడు, ఇస్సాకు అరవై ఏళ్ళవాడు.
27 ఆ పిల్లవారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు నేర్పుగల వేటగాడై మైదానాల్లో తిరుగుతూ ఉండేవాడు. యాకోబైతే నెమ్మదిపరుడు, డేరాలదగ్గర ఎప్పుడూ ఉండేవాడు. 28 ఏశావు తెచ్చే మాంసం ఇస్సాకు తినేవాడు, గనుక అతనికి ఏశావు అంటే ప్రేమ. అయితే రిబ్కాకు యాకోబంటే ప్రేమ. 29 ఒకరోజు యాకోబు ఏదో వంటకం వండాడు. అప్పుడే ఏశావు చాలా అలసిపోయి మైదానం నుంచి వచ్చాడు.
30 యాకోబుతో “అబ్బ, నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదాంట్లో కొద్దిగా బావుకోనియ్యి” అన్నాడు ఏశావు. అందుచేత అతడికి ఎదోం✽ అనే పేరు వచ్చింది.
31 యాకోబు అన్నాడు “మొదట నీ జన్మహక్కు✽ నాకు అమ్మివేయి✽.”
32 ఏశావు “ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. జన్మహక్కు నాకెందుకూ?” అన్నాడు.
33 “మొదట నాకు శపథం చెయ్యి” అన్నాడు యాకోబు. ఏశావు యాకోబుకు శపథం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు. 34 ✽అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టె, సిద్ధం చేసిన వంటకం పెట్టాడు. ఏశావు తిని త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు. ఈ విధంగా ఏశావు తన జన్మహక్కును కాలదన్ను కొన్నాడు.