24
1 అబ్రాహాము వయసు మళ్ళిన వృద్ధుడు. అన్ని విషయాల్లో యెహోవా అబ్రాహాముకు ఆశీస్సులు కుమ్మరించాడు. 2 అబ్రాహాము తన ఆస్తినంతా చూచే తన ఇంటి పెద్ద సేవకుడితో ఇలా అన్నాడు:
“నీ చెయ్యి నా తొడకింద పెట్టు. 3  ఆకాశానికీ భూమికీ దేవుడైన యెహోవాతోడని నీచేత ఒక శపథం చేయించుకుంటాను. ఏమిటంటే నేను కాపురమున్న ఈ కనానుదేశ ప్రజల్లో నుంచి ఏ పిల్లనూ నా కొడుక్కు పెళ్ళి చేయకూడదు. 4 కానీ నీవు నా స్వదేశానికీ, నా బంధువులదగ్గరికీ వెళ్ళి, అక్కడ నా కొడుకు ఇస్సాకు కోసం ఒకామెను తీసుకురావాలి.”
5 అతనితో ఆ సేవకుడు “ఒకవేళ ఈ దేశానికి నా వెంట వచ్చెయ్యడానికి ఆమె ఇష్టపడదేమో. అలాంటప్పుడు నీవు బయలు దేరివచ్చిన ఆ దేశానికి నేను నీ కొడుకును తీసుకుపోవాలా?” అన్నాడు.
6 అబ్రాహాము అతడితో అన్నాడు, “అక్కడికి నా కొడుకును తీసుకువెళ్ళకూడదు సుమా! 7 పరలోక దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటినుంచీ నా స్వదేశంనుంచీ నన్ను రప్పించి, నాతో మాట్లాడి, ‘ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను’ అని వాగ్దానం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఈ విధంగానే నీవు నా కొడుకు పెళ్ళాడడానికి ఒకామెను అక్కడనుంచి తీసుకువస్తావు.
8 “ఒకవేళ ఆమెకు నీ వెంట వచ్చెయ్యడం ఇష్టం కాకపోతే నీకు ఈ శపథంనుంచి విడుదల కలుగుతుంది. నా కొడుకును అక్కడికి ఏ మాత్రం తీసుకుపోకూడదు.”
9 అప్పుడా సేవకుడు తన యజమాని అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఆ విషయంలో అతనికి శపథం చేశాడు.
10 అతడు తన యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, తన యజమానికి ఉన్నదానిలో మేలురకమైనవి కొన్నిటిని తీసుకువెళ్ళాడు. అతడు ప్రయాణమై ఆరామ్నాహారయిమ్ దేశానికి వెళ్ళి నాహోరు నివసించే ఊరు చేరాడు. 11 అది సాయంకాలం, స్త్రీలు నీళ్ళు చేదుకోవడానికి ఊరి బయట ఉన్న బావిదగ్గరకు వచ్చే సమయం. అతడా బావిదగ్గర తన ఒంటెలను మోకరించేలా చేసి ఇలా అన్నాడు:
12 “యెహోవా! నా యజమానుడైన అబ్రాహాము దేవా! నాకు ఈ వేళ అంతా చక్కగా జరిగించి నా యజమాని అబ్రాహాము మీద అనుగ్రహం చూపు. 13 ఇదిగో, నేను ఈ నీటిబుగ్గదగ్గర నిలబడి ఉన్నాను. ఈ ఊరివాళ్ళ పిల్లలు నీళ్ళు చేదుకొందామని వస్తున్నారు. 14 నేను వాళ్ళలో ఒకామెతో ఇలా అంటాను: ‘నేను నీళ్ళు తాగడానికి దయచేసి నీ కడవ వంచు’. ఆమె ‘తాగండి. మీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తాను’ అంటే, నీవు నీ సేవకుడైన ఇస్సాకు కోసం ఎన్నుకున్నది ఆ అమ్మాయే అయివుండాలి. ఈ విధంగా నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపించావని తెలుసుకుంటాను.”
15 అతడీ మాటలు అంటూ ఉండగానే రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. (బెతూయేలు ఎవరంటే, అబ్రాహాము తోబుట్టువు నాహోరు యొక్క భార్య అయిన మిల్కా కొడుకు) 16 ఆ అమ్మాయి చాలా చక్కనిది. ఆమె కన్య. పురుషస్పర్శ ఎరుగనిది. ఆమె బావిలోకి దిగిపోయి కడవ నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా, 17 ఆ సేవకుడు ఆమెకు ఎదురు పరిగెత్తి వెళ్ళి “దయచేసి నీ కడవ నీళ్ళు కొంచెం నన్ను తాగనివ్వమ్మా” అని అడిగాడు.
18 ఆమె “అయ్యగారూ, తాగండి” అని చెప్పి త్వరపడి తన కడవ చేతిమీదికి దించి అతడికి దాహమిచ్చింది. 19 అతడికి దాహమిచ్చాక ఆమె “మీ ఒంటెలు కూడా తాగడానికి చాలినంత నీళ్ళు చేది పోస్తాను” అంది. 20 ఆమె త్వరగా తన కడవ తొట్టిలో పోసి ఇంకా నీళ్ళు చేదడానికి బావికి పరుగెత్తి అతడి ఒంటెలన్నిటికీ నీళ్ళు చేది పోసింది.
21 ఈ లోగా ఆ మనుషుడు తాను ప్రయాణం చేసిన ఉద్దేశాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకుందామని మౌనం వహించి ఆమెను చూస్తూ ఉన్నాడు. 22 ఒంటెలు త్రాగిన తరువాత అతడు అరతులం బంగారు ముక్కు పుడక, ఆమె చేతులకు పది తులాల బంగారు గాజులు రెండు తీసి, 23 “నువ్వు ఎవరి అమ్మాయివి? దయచేసి నాతో చెప్పమ్మా. మేము ఈ రాత్రి ఉండడానికి నీ తండ్రి ఇంట స్థలం ఉంటుందా?” అని అడిగాడు.
24 ఆమె అతడితో “నేను బెతూయేలు కూతురిని. ఆయన నాహోరు మిల్కాల కుమారుడు” అంది. 25 ఆమె ఇంకా “మీరుండడానికి మా ఇంట స్థలం ఉంది. మా దగ్గర చాలా గడ్డీ మేతా కూడా ఉన్నాయి” అంది.
26 అప్పుడతడు తల వంచి యెహోవాను ఆరాధించి, 27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! ఆయన నా యజమానిపట్ల తన కృప విశ్వసనీయత చూపడం మానలేదు. నేను త్రోవలో ఉండగానే నా యజమాని బంధువుల ఇంటికి నేను సూటిగా వచ్చేలా యెహోవా చేశాడు” అన్నాడు.
28 ఆ అమ్మాయి పరుగెత్తి వెళ్ళి, తన తల్లి ఇంటివాళ్ళకు ఈ సంగతులను తెలియజేసింది. 29 రిబ్కాకు తోడబుట్టినవాడొకడు ఉన్నాడు. అతడి పేరు లాబాను. లాబాను బావిదగ్గర ఉన్న ఆ మనిషి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాడు. 30 తాను చూచినట్టే తన తోబుట్టువు రిబ్కా దగ్గర ఉన్న ఆ ముక్కుపుడక, చేతుల గాజులు, “ఆ మనిషి నాతో ఇలా చెప్పాడు” అన్న ఆమె మాటలు తలపోస్తూ అతడు బయలుదేరి వచ్చి బావిదగ్గర ఆ మనిషి ఒంటెలవద్ద నిలబడి ఉండడం చూశాడు. అతణ్ణి సమీపించి ఇలా అన్నాడు:
31 “యెహోవా దీవించినవారు మీరు, లోపలికి రండి, మీరు బయట నిలబడి ఉండడం దేనికి? నేను ఇల్లూ, ఒంటెలకు స్థలమూ సిద్ధం చేశాను.”
32 అప్పుడా మనిషి ఆ ఇంటికి వచ్చాడు. లాబాను ఒంటెల జీనులు విప్పి, వాటికి గడ్డీ మేతా పెట్టాడు. ఆ మనిషికీ అతనితో వచ్చినవాళ్ళకూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. 33 అతనికి భోజనం కూడా పెట్టాడు. గానీ అతడు “నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను” అన్నాడు. లాబాను “చెప్పండి” అనగా అతడు ఇలా చెప్పాడు: 34 “నేను అబ్రాహాము సేవకుణ్ణి. 35 నా యజమానిని యెహోవా ఎంతో దీవించాడు. గనుక అతడు గొప్పవాడయ్యాడు. యెహోవా అతనికి గొర్రెల, మేకల మందల్నీ పశువుల మందల్నీ వెండి బంగారాలనూ దాస దాసీలనూ ఒంటెల్నీ గాడిదల్నీ ప్రసాదించాడు. 36 నా యజమానుని భార్య శారా వృద్ధాప్యంలో నా యజమానికి ఓ కుమారుణ్ణి కన్నది. నా యజమాని తనకు కలిగినదంతా ఆ కుమారుడికిచ్చాడు. 37 నా యజమాని నాచేత ఓ శపథం చేయించి ఇలా అన్నాడు: ‘నేను కాపురమున్న కనాను దేశంవారిలో నుంచి ఏ పిల్లనూ నా కొడుకుకు చేయకూడదు. 38 కాని, నీవు నా తండ్రి ఇంటికి నా బంధువుల దగ్గరికి వెళ్ళి, నా కొడుకు కోసం ఒకామెను తీసుకురావాలి’. 39 నేను నా యజమానితో ‘ఒకవేళ ఆమె నా వెంట రాదేమో’ అన్నాను. 40 ఆయన నాతో అన్నాడు, ‘నేను ఎవరి సముఖంలో బ్రతుకుతున్నానో ఆ యెహోవా తన దూతను నీతోపాటు పంపించి నీ ప్రయాణం సఫలం చేస్తాడు. అలా నా బంధువుల్లో నా తండ్రి ఇంటినుంచి నా కొడుకుకోసం ఒకామెను తీసుకు వస్తావు. 41 నీవు నా బంధువులదగ్గరికి చేరినప్పుడు ఈ శపథంనుంచి నీకు విడుదల అవుతుంది. వారు ఆమెనివ్వకపోతే నీ బాధ్యత తీరిపోతుంది’ అన్నాడు.
42 “ఈనాడు నేను బావిదగ్గరికి వచ్చి దేవునితో, ‘యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, నీవు నా ప్రయాణం సఫలం చేస్తుంటే ఇలా జరగనియ్యి: 43 ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలుచున్నాను. ఒక అమ్మాయి నీళ్ళు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమె కడవలో నీళ్ళు కొంచెం నన్ను త్రాగనివ్వమని అడుగుతాను’. 44 ఆమె – ‘మీరు త్రాగండి. మీ ఒంటెలకు కూడా చేది పోస్తాన’ని చెపితే, ‘యెహోవా నా యజమాని కొడుకు కోసం ఎన్నుకొన్నది ఆ అమ్మాయే అయివుండాలి.’ 45 నేనిలా లోలోపల అనుకుంటూండగానే భుజంమీద తన కడవ పెట్టుకొని వస్తున్న రిబ్కా నాకు కనిపించింది. ఆమె బావిలోకి దిగిపోయి నీళ్ళు చేదుకొని వచ్చింది. ‘దయచేసి దాహానికియ్యమ్మా’ అని నేను ఆమె నడిగాను. 46 ఆమె త్వరపడి భుజంమీది తన కడవ దించి ‘తాగండి. నేను మీ ఒంటెలకు కూడా నీళ్ళుపోస్తాను’ అంది. నేను తాగాను. ఆమె ఒంటెలకు నీళ్ళు పెట్టింది. 47 అప్పుడు ‘నువ్వెవ్వరి పిల్లవి?’ అని నేను అడిగితే ఆమె ‘బెతూయేల్‌గారి పిల్లను. మా నాన్నగారు నాహోరుగారికి మిల్కా కన్న కుమారుడు’ అంది. కనుక నేనామె ముక్కుకు పుడక, ఆమె చేతులకు గాజులు పెట్టి, 48 నా తల వంచి యెహోవాను ఆరాధించి నా యజమాని అబ్రాహాము యొక్క దేవుడైన యెహోవాను స్తుతించాను. ఎందుకంటే ఆయన నా యజమాని సోదరుడి పిల్లను ఆయన కుమారుడికోసం తీసుకుపోవడానికి నాకు చక్కగా దారి చూపాడు. 49 ఇప్పుడు మీరు నా యజమానిపట్ల దయతో, నిజాయితీతో వ్యవహరించ గోరితే అది నాకు చెప్పండి. లేకపోతే అదీ చెప్పండి. అప్పుడు నేనింకా ఏం చెయ్యాలో తెలుస్తుంది.”
50 అందుకు లాబాను, బెతూయేలు “ఇది యెహోవావల్లే అయింది. మంచిదని గానీ చెడ్డదని గానీ చెప్పడానికి మేమెవరిమి? 51 ఇదిగో, రిబ్కా మీ ఎదుట ఉంది. ఆమెను తీసుకుపోవచ్చు. యెహోవా సెలవిచ్చినట్టే ఈమె మీ యజమాని కుమారుడికి భార్య అవుతుంది” అని జవాబిచ్చారు.
52 వాళ్ళు చెప్పినది అబ్రాహాము సేవకుడు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 53 అప్పుడు ఆ సేవకుడు వెండి బంగారాల నగలూ, వస్త్రాలూ తీసి రిబ్కాకిచ్చాడు. ఆమె సోదరుడికీ తల్లికీ కూడా విలువ గల వస్తువులు ఇచ్చాడు. 54 తరువాత అతడు, అతనితో పాటు వచ్చినవాళ్ళంతా ఆహారం, పానీయం పుచ్చుకొని ఆ రాత్రంతా అక్కడ గడిపారు. ప్రొద్దున అందరూ లేచాక అతడు “నా యజమానిదగ్గరకు నన్ను పంపించండి” అన్నాడు.
55 రిబ్కా సోదరుడూ, తల్లీ, “ఈమెను కొన్ని రోజులు – కనీసం పది రోజులు – మాదగ్గర ఉండనియ్యి, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు” అన్నారు.
56 అందుకతడు “యెహోవా నా ప్రయాణం సఫలం చేశాడు, గనుక నాకు ఆలస్యం కాకుండా నా యజమానిదగ్గరికి వెళ్ళేట్టు నన్ను పంపివేయండి” అన్నాడు.
57 వారు “అమ్మాయిని పిలిచి, ఆమె ఏమంటుందో చూద్దాం” అన్నారు. 58 “ఈ మనిషితో పాటు వెళ్తావా”? అని వాళ్ళు రిబ్కాను అడిగినప్పుడు ఆమె “వెళ్తాను” అని జవాబిచ్చింది.
59 అప్పుడు వాళ్ళు తమ సోదరి రిబ్కానూ ఆమె పరిచారికనూ అబ్రాహాము సేవకుణ్ణీ అతనితో వచ్చినవాళ్ళనూ సాగనంపారు. 60 రిబ్కాను దీవిస్తూ “మా సోదరీ! నువ్వు వేలాది వేలమందికి తల్లివి అవుతావు గాక! నీ సంతానం తమ పగవాళ్ళ పట్టణాల్ని స్వాధీనం చేసుకుంటారు గాక!” అన్నారు.
61 రిబ్కా, ఆమె పనికత్తెలు ఒంటెలనెక్కి బయలుదేరి ఆ మనిషి వెంట వెళ్ళారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని తన దారి పట్టాడు.
62 అప్పుడు ఇస్సాకు కనాను దక్షిణ ప్రదేశంలో కాపురముంటూ బేర్‌లహాయిరోయి నుంచి వస్తూ ఉన్నాడు. 63 సాయంకాలం ఇస్సాకు ధ్యానం చేసుకోవడానికి మైదానంలోకి వెళ్ళాడు. అతడు తలెత్తి చూడగా వస్తూ ఉన్న ఒంటెలు కనబడ్డాయి. 64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూచినప్పుడు ఒంటెమీదినుంచి దిగి అబ్రాహాము సేవకుణ్ణి ఇలా ప్రశ్నించింది:
65 “మనల్ని కలుసుకోవడానికి మైదానంలో నడుస్తూ ఉన్న ఆ మనిషి ఎవరు?” అతడు “నా యజమాని” అన్నాడు. కనుక ఆమె ముసుకు వేసుకొంది. 66 తరువాత ఆ సేవకుడు తాను చేసినదంతా ఇస్సాకుకు వివరించాడు. 67 ఇస్సాకు తన తల్లి శారా డేరాలోకి రిబ్కాను తీసుకువెళ్ళాడు. ఆమె అతనికి భార్య అయింది. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మృతి విషయంలో ఆదరణ పొందాడు.