23
1 శారా జీవించిన సంవత్సరాలు నూట ఇరవై ఏడు. 2 శారా కనానుదేశంలోని కిర్యాత్ అర్బాలో చనిపోయింది. కిర్యాత్ అర్బా అంటే “హెబ్రోను.” ఆమెకోసం విలపించడానికి ఏడ్వడానికీ అబ్రాహాము ఆమె దగ్గరకు వచ్చాడు. 3 ✽ తరువాత చనిపోయిన తన భార్య దగ్గరనుంచి లేచి హేతు సంతతివాళ్ళతో మాట్లాడుతూ, 4 “నేను మీ మధ్యలో పరాయివాణ్ణి, పరదేశిని✽. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుటే ఉంది. ఆమెను పాతిపెట్టడానికి ఇక్కడ కొంత భూమి నాకివ్వండి” అన్నాడు.5 హేతుసంతతివాళ్ళు అబ్రాహాముకు ఇలా జవాబిచ్చారు: 6 “అయ్యా, మేము చెప్పేది వినండి. మీరు మా మధ్య దైవసంబంధమైన నాయకులు✽. మా సమాధులన్నిటిలో మంచిదానిలో, చనిపోయిన మీ భార్యను పాతిపెట్టండి. మీరు ఆమెను పాతిపెట్టడానికి మాలో ఎవ్వరూ తన సమాధిని ఇవ్వకుండా ఉండలేరు.”
7 అబ్రాహాము లేచి, ఆ ప్రాంతంవాళ్ళ ఎదుట, అంటే హేతుసంతతివాళ్ళ ఎదుట మర్యాదసూచకంగా వంగి, 8 “నేను నా కళ్ళ ఎదుట ఉన్న నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడం మీకిష్టమైతే నా మనవి వినండి. 9 ✽సోహరు కొడుకు ఎఫ్రోనుకు తన మైదానం చివరలో మకపేలా గుహ ఉంది గదా! అతడు దాన్ని నాకిచ్చేలా నా తరఫున అతనితో మాట్లాడండి. దాన్ని శ్మశానభూమిగా మీ సమక్షంలో అతడు నిండు వెలకు నాకివ్వాలని కోరుతున్నాను” అన్నాడు.
10 ఆ సమయంలో ఎఫ్రోను అక్కడే హేతుసంతతివాళ్ళ మధ్యన కూర్చుని ఉన్నాడు. హేతుసంతతివాళ్ళూ, తన ఊరి గవిని✽ ప్రవేశించేవాళ్ళంతా వింటూ ఉండగానే హేతువాడైన ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు:
11 “అయ్యా, అలా కాదు. నా మనవి వినండి. ఆ మైదానమూ అందులో ఉన్న గుహా మీకు ఉచితంగా ఇస్తున్నాను. ఇక్కడ నా ప్రజల సముఖంలోనే దాన్ని మీకిస్తున్నాను. అందులో మీ భార్య మృత దేహాన్ని పాతిపెట్టండి.”
12 ఆ ప్రాంతం ప్రజల ఎదుట అబ్రాహాము వంగి, 13 వాళ్ళంతా వింటుండగా ఎఫ్రోనును చూచి “దయచేసి నా మనవి వినండి. ఆ మైదానం వెల మీకిస్తాను. దాన్ని నా దగ్గర పుచ్చుకుంటే నా భార్య మృతదేహాన్ని పాతిపెడతాను” అన్నాడు.
14 ఎఫ్రోను అబ్రాహాముకు జవాబు చెప్తూ, 15 “అయ్యా, నా మనవి వినండి. నాలుగు వందల వెండి నాణేల✽ భూమి నాకు మీకూ ఏ మాత్రం? కనుక మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు.
16 అబ్రాహాము ఎఫ్రోను మాట విని హేతుసంతతివాళ్ళు వింటూ ఉండగా ఎఫ్రోను చెప్పిన వెల, అంటే నాలుగు వందల వెండి నాణేలు, వ్యాపార పరిమాణం ప్రకారం తూచి ఎఫ్రోనుకిచ్చాడు.
17 ఈ విధంగా మమ్రేకి ఎదురుగా మకపేలాలో ఉన్న ఎఫ్రోను మైదానం అబ్రాహాముది అయిపోయింది. ఆ మైదానమూ, 18 అందులోని గుహా, దాని సరిహద్దుల లోపల ఉన్న చెట్లన్నీ హేతుసంతతివాళ్ళ సముఖంలోనూ ఆ ఊరి గవిని ప్రవేశించేవాళ్ళందరి సముఖంలోనూ అబ్రాహాము పేర వ్రాయడం జరిగింది. 19 ఆ తరువాత అబ్రాహాము తన భార్య శారాను కనానుదేశంలోని మమ్రేకి, అంటే హెబ్రోనుకు ఎదురుగా ఉన్న మకపేలా మైదానంలోని గుహలో పాతిపెట్టాడు. 20 మైదానాన్నీ అందులోని గుహనూ హేతుసంతతివాళ్ళు అబ్రాహాము పేర వ్రాయడంవల్ల అవి అబ్రాహాము స్వాధీనంలోకి వచ్చాయి.