22
1 ఇదంతా జరిగాక దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. అతణ్ణి “అబ్రాహామూ” అని పిలవగా అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు.
2 అప్పుడు దేవుడు అన్నాడు, “నీ ఒకే ఒక కొడుకును – నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి హోమబలిగా అర్పించు.”
3 తెల్లవారగానే అబ్రాహాము లేచి తన గాడిదకు జీను కట్టి పనివాళ్ళలో ఇద్దరినీ, తన కొడుకు ఇస్సాకునూ వెంటబెట్టుకొని, హోమబలికోసం కట్టెలు కొట్టి, బయలుదేరి తనతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. 4 మూడో రోజున అబ్రాహాము తలెత్తి, దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూచి, పని వాళ్ళతో ఇలా అన్నాడు:
5 “మీరిక్కడ గాడిదతో ఉండండి. నేనూ, అబ్బాయీ అక్కడికి వెళ్తాం. దేవుణ్ణి ఆరాధించి మీ దగ్గరికి తిరిగి వస్తాం.”
6 అప్పుడు అబ్రాహాము హోమబలికోసం ఆ కట్టెలు తన కొడుకు ఇస్సాకు మీద ఉంచి. తానే స్వయంగా నిప్పూ, కత్తీ చేతపట్టుకొన్నాడు. వారిద్దరూ కలిసి సాగిపోతూ ఉంటే, 7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును ఉద్దేశించి “నాన్నా” అన్నాడు. అబ్రాహాము “ఏం బాబు?” అన్నాడు. “ఇవిగో నిప్పూ కత్తీ ఉన్నాయి గానీ, హోమబలికోసం గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు ఇస్సాకు.
8 “దేవుడే హోమబలికోసం గొర్రెపిల్లను చూచుకొంటాడు, బాబూ” అని అబ్రాహాము జవాబిచ్చాడు. అలా వారిద్దరూ కలిసి ముందుకు నడిచారు.
9 దేవుడు చెప్పిన స్థలానికి వారు చేరుకొన్నప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దానిమీద కట్టెలు చక్కగా పేర్చాడు. తన కొడుకైన ఇస్సాకును బంధించాడు, ఆ పీఠంమీద ఉన్న కట్టెలమీద పెట్టాడు. 10 అప్పుడు అబ్రాహాము తన కొడుకును వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకొన్నాడు.
11 అప్పుడు అతణ్ణి ఆకాశంనుంచి యెహోవా దూత పిలిచాడు – “అబ్రాహామూ! అబ్రాహామూ!” అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు.
12 “అబ్బాయి మీద చెయ్యి వేయకు. అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకివ్వడానికి వెనక్కు తీయలేదు” అన్నాడా దేవదూత.
13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకొన్న ఒక పొట్టేలు కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని, తన కొడుకు స్థానంలో హోమబలిగా సమర్పించాడు. 14 అబ్రాహాము ఆ స్థలానికి “యెహోవా యీరే” అని పేరు పెట్టాడు. ఈనాటి వరకు “యెహోవా పర్వతంమీద చూచుకుంటాడు” అని చెప్తారు.
15 యెహోవా దూత ఆకాశంనుంచి రెండోసారి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు: 16 “నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకును ఇవ్వడానికి వెనక్కు తీయలేదు. 17 గనుక నేను నిన్ను తప్పనిసారిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి, లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రతీరం ఇసుక రేణువులలాగా చేస్తాను. నీ సంతతివారు శత్రువుల ద్వారాలను స్వాధీనం చేసుకొంటారు. 18 నీ సంతానం మూలంగా లోకంలోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నాతోడని ప్రమాణం చేశాను. ఎందుకంటే, నీవు నా మాట విన్నావు.”
19 ఆ తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చాడు. వారంతా కలిసి బయలుదేరి బేర్‌షెబా చేరారు. అబ్రాహాము బేర్‌షెబాలో కాపురమున్నాడు.
20 ఆ విషయాలు జరిగిన తరువాత అబ్రాహాముకు చేరిన వార్త ఏమంటే “నీ తోబుట్టువు నాహోరుకు అతని భార్య మిల్కా పిల్లలను కన్నది. 21 వారెవరంటే, మొదట పుట్టినవాడు ఊజు, ఇతడి తమ్ముడు బూజ్, అరామ్ తండ్రి కెమూయేల్, 22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.” 23 బెతూయేలుకు రిబ్కా పుట్టింది. ఈ ఎనిమిదిమందిని అబ్రాహాము తోబుట్టువు నాహోరుకు మిల్కా కన్నది. 24 నాహోరు ఉంపుడుకత్తె కూడా కొడుకులను కన్నది. (ఆమె పేరు రయూమా.) వారు తెబహు, గహము, తహషు, మయకా.