21
1 తరువాత యెహోవా తాను చెప్పినట్టే శారాను జ్ఞాపకముంచుకొని తన మాటప్రకారమే✽ ఆమె విషయంలో జరిగించాడు. 2 అంటే, దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణీత కాలంలో, అబ్రాహాము వృద్ధాప్యంలో, శారా గర్భవతి అయి అతనికి కొడుకును కన్నది. 3 శారా అబ్రాహాముకు కనిన కొడుకుకు అతడు ఇస్సాకు✽ అనే పేరు పెట్టాడు. 4 ✝తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు. 5 ✝తనకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.6 ✝అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు కలిగించాడు. దీన్ని వినేవారంతా నాతోపాటు నవ్వుతారు” అంది. 7 ఆమె ఇంకా అంది, “శారా పిల్లలకు పాలిస్తుందని ఇంతకుముందు అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగి ఉండేవాళ్ళు? అయినా, ఆయనకు వృద్ధాప్యంలో కొడుకును కన్నాను.”
8 ఆ చిన్నవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు. 9 ✽అప్పుడు, అబ్రాహాముకు ఈజిప్ట్ స్త్రీ హాగరు కన్న కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూచింది.
10 ✝“ఈ బానిసనూ, దాని కొడుకునూ వెళ్ళగొట్టు. ఈ బానిస కొడుకు నా కొడుకు ఇస్సాకుతోపాటు వారసుడు కాబోడు” అంది. 11 ✽తన కొడుకు కారణంగా ఈ మాట అబ్రాహామును చాలా బాధించింది.
12 ✽ అయితే దేవుడు అబ్రాహాముతో, “ఆ కుర్రవాడి విషయంలో, బానిస విషయంలో నీకు బాధ ఉండకూడదు. శారా నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేయి. ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు. 13 ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే గనుక, అతణ్ణి ఒక జనంగా చేస్తాను” అన్నాడు.
14 తెల్లవారగానే✽ అబ్రాహాము లేచి రొట్టెనూ, నీళ్ళతో నిండిన తిత్తినీ హాగరుకు ఇచ్చి, ఆమె భుజంమీద పెట్టి, ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళిపోయి, బేర్‌షెబా ఎడారిలో తిరుగుతూ ఉంది. 15 తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొదక్రింద విడిచిపెట్టింది.
16 “ఆ కుర్రవాడి చావు నేను చూడలేను” అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది.
17 దేవుడు ఆ కుర్రవాడి మొర✽ విన్నప్పుడు దేవుని దూత పరలోకంనుంచి హాగరును పిలిచి ఆమెతో “హాగరూ, నీకేం వచ్చింది? ఆ కుర్రవాడు ఉన్నచోట దేవుడు అతడి మొర విన్నాడు. గనుక భయం పెట్టుకోకు. 18 లేచి ఆ కుర్రవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో. అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను” అన్నాడు.
19 అప్పుడామెకు ఒక ఊట కనపడేలా✽ దేవుడు చేశాడు. ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి కుర్రవాడికి త్రాగించింది.
20 దేవుడు ఆ కుర్రవాడికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఎడారిలోనే ఉంటూ విలుకాడయ్యాడు.
21 ✽అతడు పారాన్ ఎడారిలో ఉంటూ ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్ట్‌దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
22 ఆ కాలంలోనే అబ్రాహాముతో అబీమెలెకు✽, అతని సేనాధిపతి ఫీకోలు ఇలా అన్నారు: “నీవు చేసే దానంతట్లో దేవుడు నీకు తోడుగా✽ ఉన్నాడు. 23 కనుక మీరు దేవుని పేర నాతో శపథం చెయ్యండి. అంటే, నన్నూ, నా కుమారుణ్ణీ, నా మనుమణ్ణీ మోసం చెయ్యకుండా నేను మీకు చూపిన దయప్రకారమే మీరు పరాయివాడుగా ఉంటున్న ఈ దేశానికీ మాకూ దయ చూపుతూ ఉండండి.”
24 అబ్రాహాము “శపథం చేస్తాను” అన్నాడు. 25 అంతకుముందు అబీమెలెకు దాసులు ఒక బావిని బలాత్కారంగా ఆక్రమించుకొన్నారు. దీన్ని గురించి అబ్రాహాము అబీమెలెకును చీవాట్లు పెడితే, 26 అబీమెలెకు, “ఇలా చేసినదెవరో నాకు తెలీదు. మీరు నాకు చెప్పలేదు. ఈనాటి వరకు ఈ సంగతి వినలేదు” అన్నాడు.
27 అప్పుడు అబ్రాహాము గొర్రెలనూ, గొడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వారిద్దరూ ఒక ఒడంబడిక చేసుకొన్నారు. 28 అబ్రాహాము తన మందనుంచి ఏడు ఆడ గొర్రె పిల్లలను వేరుగా ఉంచినప్పుడు, అబీమెలెకు అతణ్ణి 29 “మీరు వేరుగా ఉంచిన ఈ ఏడు ఆడ గొర్రె పిల్లల సంగతి ఏమిటి?” అని అడిగాడు.
30 “నేను ఈ బావిని త్రవ్వించుకున్నానని గుర్తుగా మీరీ ఏడు ఆడ గొర్రెపిల్లలను నానుంచి పుచ్చుకోవాలి” అని జవాబిచ్చాడు అబ్రాహాము.
31 ✽అక్కడ వారిద్దరూ శపథం చేసుకొన్నందుచేత ఆ స్థలానికి బేర్‌షెబా అనే పేరు వచ్చింది. 32 అలా వారు బేర్‌షెబాలో ఒడంబడిక చేసుకొన్నాక అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోల్ అక్కడనుంచి బయలుదేరి ఫిలిష్తీయవారి✽ దేశానికి తిరిగి వెళ్ళారు. 33 అబ్రాహాము బేర్‌షెబాలో ఒక పిచుల వృక్షాన్ని నాటి, శాశ్వత దేవుడైన✽ యెహోవా పేరట ప్రార్థన చేశాడు. 34 తరువాత అబ్రాహాము ఫిలిష్తీయవాళ్ళ దేశంలో అనేక రోజులు గడిపాడు.