20
1 ఆ తరువాత అబ్రాహాము అక్కడనుంచి దక్షిణ ప్రదేశానికి ప్రయాణాలు చేస్తూ, కాదేషుకూ షూరుకూ మధ్య కాపురమేర్పరచుకొని, కొంతకాలం గెరారులో గడిపాడు. 2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి “ఈమె నా చెల్లెల”ని చెప్పినందుచేత గెరారు రాజైన అబీమెలెకు తన ఇంటికి శారాను రప్పించుకొన్నాడు.
3 అయితే రాత్రివేళ దేవుడు కలలో అబీమెలెకుకు దర్శనమై అతడితో “నీవు రప్పించుకొన్న ఆ స్త్రీ కారణంగా నీవు చావాలి. ఎందుకంటే ఆమె ఒక మనిషి భార్య” అన్నాడు.
4 అబీమెలెకు ఆమె దగ్గరకు వెళ్ళలేదు గనుక ఇలా అన్నాడు: “స్వామీ, నేరం చేయని ప్రజను చంపుతావా? 5 ‘ఈమె నా చెల్లెల’ని అతడే నాతో చెప్పలేదా? ‘ఈయన నా అన్న’ అని ఆమే చెప్పింది గదా! నేను చేసినదాన్ని యథార్థమైన మనసుతో అమాయకంగా చేశాను.”
6 అందుకు ఆ కలలో దేవుడు అతనితో, “అవును, నీవు యథార్థమైన మనసుతో అలా చేశావని నాకు తెలుసు. ఈ విషయంలో నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను కూడా. అందుచేత నీవు ఆమెను తాకకుండా చేశాను. 7 ఇప్పుడు ఆ మనిషి భార్యను అతనిదగ్గరకు పంపించు. అతడు ప్రవక్త. నీవు బ్రతికేలా నీకోసం అతడు ప్రార్థన చేస్తాడు. కానీ నీవు ఆమెను పంపించకపోతే నీవూ నీవారంతా తప్పక చస్తారని తెలుసుకో” అన్నాడు.
8 ఉదయం కాగానే అబీమెలెకు లేచి, తన పరివారాన్నంతా పిలిపించి, వాళ్ళకు ఈ సంగతులన్నీ తెలిపాడు. వాళ్ళకు చాలా భయం వేసింది.
9 తరువాత అబీమెలెకు అబ్రాహామును పిలువనంపించి “మీరు మాకు చేసినదేమిటి? నామీదికి నా రాజ్యంమీదికి గొప్ప కీడు రప్పించడానికి నేను మీకు విరోధంగా చేసిన దోషమేమిటి? చేయరానివి నా పట్ల జరిగించారు” అన్నాడు. 10 ఇంకా అబీమెలెకు అబ్రాహామును “ఇలా చేయడానికి ఇక్కడ మీకేం కనిపించింది?” అని అడిగాడు.
11 అబ్రాహాము ఇలా జవాబిచ్చాడు: “ఈ స్థలంలో దైవభయమేమీ లేదనీ, నా భార్యకోసం నన్ను చంపుతారనీ అనుకొని అలా చేశాను. 12 అంతేకాక, ఆమె నిజంగా నా చెల్లెలే. నా తల్లి కూతురు కాదు, నా తండ్రి కూతురు. ఆమె నాకు భార్య అయింది. 13 నేను నా తండ్రి ఇల్లు విడిచి సంచరించేలా దేవుడు చేసినప్పుడు నేను ఆమెతో ఇలా చెప్పాను: మనం ఎక్కడికి చేరుకొన్నా అక్కడ ‘ఈయన నా అన్న’ అని దయచేసి నా గురించి చెప్పు.”
14 అప్పుడు అబీమెలెకు అబ్రాహాముకు అతని భార్య శారాను అప్పగించి గొర్రెలనూ గొడ్లనూ దాసదాసీలను కూడా అతనికిచ్చాడు.
15 “ఇదుగో, నా దేశం మీ ఎదుట ఉంది. మీకిష్టమైన చోట కాపురం ఉండండి” అన్నాడు అబీమెలెకు.
16 అతడు శారాతో, “ఇదిగో, నీ అన్నకు వేయి వెండి నాణేలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీ దగ్గర ఉన్న వారందరి ఎదుట ఈ డబ్బు రుజువుగా ఉంటుంది. ఈ విషయంలో నీకు న్యాయం పూర్తిగా తీరిపోయింది” అన్నాడు.
17 అబ్రాహాము భార్య శారా కారణంగా దేవుడు అబీమెలెకు భవనంలో ఉన్న స్త్రీలందరినీ గొడ్రాళ్ళుగా చేశాడు. 18 అయితే అబ్రాహాము అబీమెలెకు పక్షాన దేవునికి విన్నపం చేయడంతో దేవుడు అతణ్ణి బాగు చేశాడు. అతని భార్యకూ దాసీలకూ పిల్లలు పుట్టేలా వారిని కూడా బాగుచేశాడు.