19
1 సాయంకాల సమయంలో ఆ ఇద్దరు దేవదూతలు✽ సొదొమకు చేరారు. అప్పుడు లోత్ సొదొమ ప్రధాన ద్వారం✽ దగ్గర కూర్చుని ఉన్నాడు. లోత్ వారిని చూడడంతోనే వారిని కలుసుకోవడానికి లేచి సాష్టాంగపడి, 2 ✽“నా యజమానులారా! దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. అక్కడ మీ కాళ్ళు కడుక్కొని రాత్రి గడిపి పెందలకడ లేచి మీ దారిని సాగిపోవచ్చు” అన్నాడు.వారైతే “వద్దు. ముంగిటలో రాత్రి గడుపుతాము” అన్నారు.
3 అతడు పట్టుపట్టి అడిగినందుకు వారు అతనితో పాటు అతని ఇంట్లోకి వెళ్ళారు. అతడు వారికి చపాతీలు కాల్చి విందు చేస్తే వారు తిన్నారు. 4 ✽వారు పడుకొనేముందు ఆ పట్టణస్థులు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు. సొదొమ మనుషులంతా, ఆబాలగోపాలమూ నలుదిక్కులనుంచి వచ్చారు.
5 వాళ్ళు లోత్‌ను పిలిచి “ఈ రాత్రి మీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వాళ్ళతో సంపర్కం చేయాలని వచ్చాం. మా దగ్గరికి వాళ్ళను బయటికి తీసుకురా” అన్నారు.
6 లోత్ తలుపు తీసి వాళ్ళదగ్గరికి బయటికి వెళ్ళి తన వెనుక తలుపు మూసివేసి ఇలా అన్నాడు: 7 “సోదరులారా! ఇంత దుర్మార్గంగా ప్రవర్తించకండి. 8 ✽చూడండి, పురుషునితో ఎన్నడూ ఉండని ఇద్దరు కూతుళ్ళు నాకున్నారు. మీరు ఒప్పుకొంటే వారిని మీ దగ్గరికి తీసుకువస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు వారిని చేయవచ్చు. కాని ఈ మనుషులను ఏమీ చేయకండి. వారు నా పంచకు వచ్చారు గదా?”
9 ✽అయితే వాళ్ళు “అవతలికి పో” అన్నారు. “వీడు పరాయివాడుగా వచ్చి తీర్పరిగా అవుతాడట. ఇప్పుడు వాళ్ళకు చేయబోయే దానికంటే నీకే ఎక్కువ కీడు చేస్తాం” అన్నారు.
వాళ్ళు దొమ్మిగా లోత్‌మీదికి వచ్చి తలుపు విరగగొట్టడానికి దానిదగ్గరికి వచ్చారు. 10 అప్పుడు లోపల ఉన్న ఆ మనుషులు తమ చేతులు చాపి లోత్‌ను పట్టుకొని, ఇంట్లోకి తమ దగ్గరకు లాగి, తలుపు మూసివేశారు. 11 ✽ఇంటి తలుపు దగ్గర ఉన్న వాళ్ళకు చిన్నా పెద్దా అందరికీ కనుచీకటి కలిగించారు. బయటివాళ్ళు తలుపుకోసం తడవులాడుతూ విసికిపొయ్యారు.
12 అప్పుడు లోపల ఉన్న ఆ మనుషులు లోత్‌తో ఇలా అన్నారు: “ఇక్కడ నీకు ఇంకెవరైనా ఉన్నారా? అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే వారిని ఊరి బయటికి తీసుకుపో. 13 ✽ఎందుకంటావా? మేము ఈ స్థలాన్ని నాశనం చేస్తాం. వీళ్ళను గురించిన మొర గొప్పదై యెహోవా సముఖం చేరింది. గనుక దీన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్ములను పంపించాడు.”
14 ✽కనుక లోత్ బయటికి వెళ్ళి తన కూతుళ్ళను పెండ్లాడనున్న తన అల్లుళ్ళతో మాట్లాడుతూ “రండి ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు!” అన్నాడు. అయితే అతడు హాస్యమాడుతున్నట్టు అతని అల్లుళ్ళకు అనిపించింది.
15 ఉదయం కాగానే ఆ దేవదూతలు లోత్‌ను త్వరపెట్టి “రా! నీవు ఈ పట్టణంమీదికి రానున్న దోష శిక్షలో నశించకుండా నీ భార్యనూ, ఇద్దరు కూతుళ్ళనూ తీసుకురా!” అన్నారు.
16 ✽అతడు వెనుక తీసేటట్టుండగా, ఆ మనుషులు అతని చెయ్యీ అతని భార్య, కూతుళ్ళ చేతులూ పట్టుకొని, బయటకు తీసుకువెళ్ళి వారిని పట్టణం వెలుపల ఉంచారు. అలా యెహోవా అతనిమీద జాలిపడ్డాడు. 17 వారతణ్ణి బయటికి తీసుకుపోయిన తరువాత వారిలో ఒకరు అన్నారు: “నీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపో✽! వెనక్కు చూడకు! ఈ లోయలో ఎక్కడా ఆగకు! నీవు నశించకుండా ఆ కొండకు పారిపో.”
18 ✽అయితే లోత్ వారితో “అలా కాదు, ప్రభూ! 19 నీవు నీ దాసుడైన నన్ను దయతో చూశావు. నా ప్రాణం రక్షించి నీ గొప్ప అనుగ్రహం నాపట్ల చూపావు. అయితే నేను ఆ కొండకు పారిపోయేలోగా ఈ బీభత్సం నామీదికి వచ్చి చనిపోతానేమో. 20 అదుగో, నేను పారిపోవడానికి ఆ ఊరు దగ్గరలో ఉంది. అది చిన్నది కూడా. నన్ను అక్కడికి తప్పించుకుపోనియ్యండి. అప్పుడు నా ప్రాణం దక్కుతుంది. ఆ ఊరు చిన్నదే గదా?” అన్నాడు.
21 ఆయన లోత్‌తో “సరి, ఈ విషయంలో కూడా నీ మనవి అంగీకరించాను – నీవు చెప్పిన ఆ ఊరును నాశనం చేయను. 22 ✽అక్కడికి త్వరగా పారిపో. నీవు అక్కడికి చేరేవరకు నేనేమీ చేయలేను” అన్నాడు. అందుచేత ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.
23 లోత్ సోయరు చేరేలోగా ఆ ప్రదేశంలో ప్రొద్దు పొడిచింది. 24 అప్పుడు యెహోవా సొదొమ, గొమొర్రాల మీద తన సన్నిధానం నుంచి అగ్ని గంధకాలను ఆకాశం నుంచి కురిపించాడు. 25 ఆ పట్టణాలను, ఆ లోయనంతా, ఆ పట్టణస్థులందరినీ, నేల మొక్కలను కూడా, ధ్వంసం చేశాడు. 26 ✽అయితే లోత్ భార్య అతని వెనకాల వస్తూ, వెనక్కు తిరిగి చూచి, ఉప్పు స్తంభమైంది. 27 ✝ప్రొద్దు పొడవడంతోనే అబ్రాహాము లేచి ఎక్కడైతే యెహోవా ఎదుట నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి, 28 సొదొమ, గొమొర్రాలవైపు ఆ లోయ ప్రాంతమంతా కలయ చూశాడు. కొలిమి పొగలాగా ఆ ప్రదేశంనుంచి పొగ లేస్తూ ఉంది. 29 ✽దేవుడు ఆ లోయలోని పట్టణాలు ధ్వంసం చేసినప్పుడు అబ్రాహామును జ్ఞాపకముంచు కొన్నాడు. లోత్ కాపురముండే పట్టణాలు ధ్వంసం చేసిన రోజు ఆ నాశనంనుంచి లోత్‌ను తప్పించాడు.
30 ✽తరువాత లోత్ సోయరులో నివసించడానికి భయపడి తన ఇద్దరు కూతుళ్ళతోపాటు సోయరునుంచి వెళ్ళి కొండెక్కి అక్కడ ఉండిపోయాడు. అతడూ అతని ఇద్దరు కూతుళ్ళూ ఒక గుహలో నివసించారు.
31 అలా ఉండగా అక్క తన చెల్లెలితో ఇలా అంది: “మన తండ్రి ముసలితనంలో ఉన్నాడు. లోక మర్యాద ప్రకారం మనతో పోవడానికి ఈ లోకంలో పురుషుడెవడూ లేడు. 32 ఆయనకు ద్రాక్షమద్యం త్రాగించి ఆయనదగ్గర పడుకొందాం, రా. అలా మన తండ్రివల్ల సంతానాన్ని పొందుదాం.”
33 ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షమద్యం త్రాగించారు. పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో పడుకొంది. ఆమె ఎప్పుడు పడుకొందో ఎప్పుడు లేచిందో అతనికి తెలియనేలేదు.
34 మరుసటి రోజు అక్క తన చెల్లిలితో “చూడు, పోయిన రాత్రి మన తండ్రితో పడుకున్నాను. ఈ రాత్రి కూడా ఆయనకు ద్రాక్షమద్యం తాగిద్దాం. నువ్వు లోపలికి వెళ్ళి ఆయనతో పడుకో. ఇలా మన తండ్రివల్ల సంతానాన్ని పొందుదాం” అంది.
35 ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షమద్యం త్రాగించారు. ఆ చిన్న కూతురు వెళ్ళి అతనితో పడుకొంది. ఆమె ఎప్పుడు పడుకొందో ఎప్పుడు లేచిందో అతడికి తెలియనేలేదు. 36 ✽ఈ విధంగా లోత్ కూతుళ్ళు ఇద్దరూ వారి తండ్రివల్ల గర్భవతులయ్యారు. 37 పెద్ద కూతురు ఒక కొడుకును కని అతడికి మోయాబు అనే పేరుపెట్టింది. ఇప్పటి మోయాబు దేశస్థులకు అతడు ఆదిపురుషుడు. 38 చిన్న కూతురు కూడా ఒక కొడుకును కని అతడికి బెన్ అమ్మి✽ అనే పేరు పెట్టింది. ఇప్పటి అమ్మోనువారికి అతడు ఆదిపురుషుడు.