18
1 ✽మరొకప్పుడు అబ్రాహాముకు మమ్రే సిందూర వృక్షాల దగ్గర యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము ఎండవేళ తన డేరా ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు, 2 తలెత్తి ఎదురుగా నిలుచున్న ముగ్గురు మనుషులను చూచి, వారిని కలుసుకోవడానికి డేరా ద్వారం నుంచి పరుగెత్తి నేలవరకు వంగి ఇలా అన్నాడు:3 “నా ప్రభూ, నన్ను దయతో చూస్తే మీ దాసుడైన నన్ను దర్శించకుండా వెళ్ళిపోకండి. 4 నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను. కాళ్ళు కడుక్కొని ఈ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకోండి. 5 మీ దాసుడైన నా దగ్గరికి వచ్చారు గదా! మీరు సేద దీర్చుకొనేలా కొంచెం ఆహారం తెస్తాను. ఆ తరువాత మీరు వెళ్ళవచ్చు.” వారు “నీవు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
6 అబ్రాహాము డేరాలో ఉన్న శారా దగ్గరికి తొందరగా వెళ్ళి “మూడు మానికల మెత్తని పిండి పిసికి, త్వరగా రొట్టెలు చెయ్యి” అన్నాడు.
7 అబ్రాహాము మందకు పరుగెత్తి వెళ్ళి ఒక మంచి లేత కోడెదూడను తెచ్చి, పనివాడి చేతికప్పగించాడు. ఆ పనివాడు దాన్ని త్వరగా వండాడు. 8 ✽అప్పుడు అబ్రాహాము పెరుగు, పాలు, తాను వండించిన వంటకం తీసుకుపోయి, ఆ మనుషుల ఎదుట పెట్టాడు. వారు భోజనం చేస్తూ ఉంటే, అతడు వారిదగ్గర ఆ చెట్టుక్రింద నిలుచున్నాడు.
9 వారు “నీ భార్య శారా ఎక్కడ ఉంది?” అని అతణ్ణి అడిగారు. “అదుగో, డేరాలో ఉంది” అన్నాడు.
10 ఆయన “వచ్చే సంవత్సరం ఇదే కాలంలో నీ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తాను. అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు కలుగుతాడు” అన్నాడు.
ఆయనకు వెనుక ఉన్న డేరా ద్వారంలో శారా ఆ మాటలు వింటూ ఉంది. 11 అబ్రాహాము, శారా ఇద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. శారాకు కాన్పులు ఉడిగిపోయాయి.
12 ✽అందుచేత శారా తనలో నవ్వుకొంటూ “నేను నీరసించిపోయాక, నా యజమాని ముసలివాడయ్యాక నాకు మరి అలాంటి సంతోషం కలుగుతుందా?” అనుకొంది.
13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ఎందుకు నవ్వింది? ‘ముసలిదాననైన నాకు నిజంగా సంతానం కలుగుతుందా?’ అని ఎందుకు అన్నది? 14 యెహోవా చేయలేనిది✽ ఏదైనా ఉన్నదా? వచ్చే సంవత్సరం నేను నియమించిన ఈ కాలంలో నీ దగ్గరికి తిరిగి వస్తాను. శారా కుమారుణ్ణి కంటుంది” అన్నాడు.
15 ✽శారాకు భయం వేసి “నేను నవ్వలేద”ని బొంకింది. యెహోవా “అలా అనకు, నీవు నవ్వావు” అన్నాడు.
16 ఆ పైన ఆ మనుషులు అక్కడనుంచి బయలుదేరి సొదొమ✽వైపు చూస్తూ ఉన్నారు. అబ్రాహాము వారిని సాగనంపడానికి వెళ్ళాడు.
17 ✝అప్పుడు యెహోవా ఇలా అనుకొన్నాడు: “నేను చేస్తున్నది అబ్రాహాముకు తెలుపకుండా ఉంటానా? 18 ✝అబ్రాహాము బలమైన గొప్ప ప్రజకు తండ్రి అవుతాడు గదా! అతనిమూలంగా లోకంలో అన్ని జనాలకు దీవెనలు వస్తాయి గదా! 19 అబ్రాహాము తరువాత అతని సంతతివారూ✽, ఇంటివారూ నీతి న్యాయాలతో బ్రతుకుతూ యెహోవా మార్గాన్ని అనుసరించేలా అతడు వారికి ఆజ్ఞాపించాలి, అందుకే నేను అతణ్ణి ఎరిగి ఎన్నుకొన్నాను. ఈ విధంగా తాను అబ్రాహామును గురించి చెప్పినది యెహోవా అతని విషయంలో నెరవేరుస్తాడు.”
20 అప్పుడు యెహోవా అన్నాడు: “సొదొమ, గొమొర్రాలను గురించిన మొర గొప్పదే. వాటి పాపం చాలా ఘోరమైంది. 21 నేను ఇక్కడనుంచి దిగిపోయి నా దగ్గరకు వచ్చిన ఆ మొరప్రకారం వారు పూర్తిగా చేశారో లేదో చూడాలి. చేయకపోతే తెలుసుకొంటాను✽.”
22 ✽ఆ మనుషులు అక్కడనుంచి మళ్ళుకొని సొదొమవైపు వెళ్ళారు. అయితే అబ్రాహాము యెహోవా ఎదుట ఇంకా నిలుచున్నాడు.
23 అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అన్నాడు: “నీవు దుర్మార్గులతోపాటు న్యాయవంతులను నిజంగా నాశనం చేస్తావా? 24 ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది న్యాయవంతులున్నారేమో, అందులో ఉన్న ఆ యాభైమంది న్యాయవంతులకోసం ఆ స్థలాన్ని నాశనం చేయకుండా క్షమించవా?
25 “న్యాయవంతులను దుర్మార్గులతోపాటు చంపడం నీకు దూరం కావాలి. దుర్మార్గుల పట్ల ఎలాగో న్యాయవంతులపట్ల అలాగే వ్యవహరించడం నీకు దూరం అవుతుంది గాక. లోకమంతటికీ న్యాయమూర్తి✽ న్యాయంగా తీర్పు తీర్చడా✽?”
26 యెహోవా “సొదొమలో యాభైమంది న్యాయవంతులు కనబడితే వారికోసం ఆ స్థలాన్నంతా క్షమిస్తాను” అన్నాడు.
27 దానికి అబ్రాహాము “ఇదిగో, నేను ధూళి, బూడిద✽లాంటివాణ్ణి. అయినా యెహోవాతో మాట్లాడడానికి పూనుకున్నాను.
28 “ఒకవేళ ఆ యాభైమంది న్యాయవంతుల లెక్కలో అయిదుగురు తక్కువ అవుతారనుకో. అయిదుగురు తక్కువ కావడం చేత ఆ పట్టణమంతా నాశనం చేస్తావా?” అని ప్రత్యుత్తరమిచ్చాడు.
“అక్కడ నలభై అయిదుగురు న్యాయవంతులను నేను చూస్తే దాన్ని నాశనం చెయ్యను” అన్నాడు యెహోవా.
29 మరోసారి అబ్రాహాము ఆయనతో “అక్కడ నలభైమంది మాత్రం కనబడతారేమో” అన్నాడు.
“నలభైమంది ఉంటే, వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడాయన.
30 “ప్రభువుకు కోపం✽ రాకపోతే నేనింకా మాట్లాడతాను, ఒకవేళ ముప్ఫయిమంది అక్కడ కనిపించవచ్చు” అని అబ్రాహాము అన్నాడు.
ఆయన “అక్కడ నేను ముప్ఫయి మందిని చూస్తే దాన్ని నాశనం చేయను” అన్నాడు.
31 అబ్రాహాము “ఇదిగో, ప్రభువుతో మాట్లాడడానికి పూనుకున్నాను. ఒకవేళ అక్కడ ఇరవైమంది మాత్రం కనబడతారు” అన్నాడు.
ఆయన “ఇరవైమంది ఉంటే వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడు.
32 ✽అతడిలా అన్నాడు: “ప్రభువుకు కోపం రాకపోతే ఇంకోసారి మాత్రమే మాట్లాడుతాను. ఒకవేళ పదిమంది మాత్రమే అక్కడ కనిపిస్తే?”
ఆయన “పదిమంది ఉంటే వారినిబట్టి దాన్ని నాశనం చేయను” అన్నాడు.
33 అబ్రాహాముతో మాట్లాడడం మానుకొని యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన స్థలానికి తిరిగి వెళ్ళాడు.