17
1 అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్లవాడయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై✽ ఇలా అన్నాడు: “నేను అమిత శక్తిగల దేవుణ్ణి✽. నా సముఖంలో నిందారహితుడు✽గా మెలుగుతూ ఉండు. 2 ✝నీకూ నాకూ మధ్య నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. నీ సంతతి సంఖ్య అత్యధికంగా చేస్తాను.”3 అబ్రాము సాష్టాంగపడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: 4 “ఇదిగో, విను, నా ఒడంబడిక నీతో చేశాను. నీవు అనేక జనాలకు✽ తండ్రివి అవుతావు. 5 ✽ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు. అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను గనుక నీకు అబ్రాహాము అనే పేరు ఉంటుంది. 6 నేను నిన్ను చాలా ఫలవంతంగా చేస్తాను. నీ సంతానం వేరు వేరు జనాలయ్యేలా చేస్తాను. నీ సంతానంలో కొందరు రాజులు✽ కూడా అవుతారు. 7 నాకూ, నీకూ నీ తరువాతివారి తరాలలో నీ సంతతివారికీ మధ్య నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. నేను నీకూ నీ తరువాత నీ సంతతివారికీ దేవుడై ఉంటాను✽. ఇదే శాశ్వతమైన నా ఒడంబడిక. 8 అంతేగాక, నీకూ, నీ తరువాత నీ సంతతివారికీ మీరు పరాయివారుగా కాపురం ఉంటున్న ఈ దేశాన్ని ఇస్తాను. ఈ కనానుదేశమంతా ఎప్పటికీ ఆస్తిగా ఇచ్చి వారికి దేవుడుగా ఉంటాను.”
9 ✽దేవుడు అబ్రాహాముతో ఇంకా అన్నాడు, “నీవైతే నా ఒడంబడికను అనుసరించి నడుచుకోవాలి. నీ తరువాత నీ సంతతివారు కూడా వారి తరాల్లో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. 10 నాకూ నీకూ, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న, మీరు అనుసరించవలసిన నా ఒడంబడిక ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి సంస్కారం పొందాలి. 11 మీరు మర్మాంగ చర్మం కొనను ఛేదించాలన్నమాట. నాకు నీకూ మధ్య ఉన్న ఒడంబడికకు అది గురుతుగా ఉంటుంది. 12 మీలో ప్రతి పిల్లవాడికీ ఎనిమిదో రోజున సున్నతి చెయ్యాలి. అతడు మీ ఇంట్లో పుట్టినవాడైనా, మీ సంతానం కాక మీరు డబ్బిచ్చి విదేశీయునిదగ్గర కొనుక్కొన్నవాడైనా ఫరవాలేదు. అన్ని తరాల్లోనూ మగవారందరికీ సున్నతి చెయ్యాలి. 13 మీ ఇంట్లో పుట్టినవాడూ, డబ్బిచ్చి కొనుక్కొన్నవాడూ తప్పక సున్నతి పొందాలి. ఇలా మీ శరీరాల్లో నా ఒడంబడిక నిరంతరమైనదిగా ఉంటుంది. 14 మర్మాంగ చర్మంలో సున్నతి లేని ప్రతివాడూ తన ప్రజల్లో లేకుండా పోవాలి. అలాంటివాడు నా ఒడంబడికను మీరుతున్నాడు.”
15 ✽దేవుడు అబ్రాహాముతో ఇంకా అన్నాడు, “నీ భార్య శారై సంగతి – నీవు ఆమెను శారై అనకు. ఇకమీదట ఆమె పేరు శారా. 16 ✽నేను ఆమెను దీవించి ఆమెవల్ల నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. ఆమెను ఆశీర్వదిస్తాను – ఆమె వేరు వేరు జనాలకు తల్లి అవుతుంది. ఆమె సంతానంలో వేరు వేరు ప్రజల రాజులు ఉంటారు.”
17 ✽అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడి, నవ్వి, “నూరేళ్ళవాడికి సంతానం కలుగుతుందా మరి? తొంభై ఏళ్ళ శారా కంటుందా?” అని లోలోపల అనుకొన్నాడు.
18 దేవునితో అబ్రాహాము “నీవు ఇష్మాయేల్‌ను నిరాకరించకపోతే ఎంత బాగుంటుంది” అన్నాడు.
19 ✽దేవుడు అన్నాడు, “అలా కాదు, నీ భార్య శారా నీకు ఒక కుమారుణ్ణి కంటుంది. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలి. నేను అతనితో నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. అది అతని తరువాత అతని సంతతివారికోసం నిరంతరమైన ఒడంబడికగా ఉంటుంది. 20 ఇష్మాయేల్ సంగతి అంటావా? సరే, నీ ప్రార్థన విన్నాను. నేను అతణ్ణి దీవించి ఫలవంతంగా చేసి, అతని సంతతిని అధికం చేస్తాను. అతనికి పన్నెండుమంది కొడుకులు పుట్టి గోత్ర నాయకులవుతారు. నేనతణ్ణి గొప్ప జనంగా చేస్తాను. 21 అయితే నా ఒడంబడిక ఇస్సాకుతోనే సుస్థిరం చేస్తాను. వచ్చే సంవత్సరం ఇదే కాలానికి అతణ్ణి శారా నీకు కంటుంది.”
22 దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం చాలించి అతని దగ్గరనుంచి పైకి వెళ్ళిపోయాడు.
23 ✽దేవుడు తనతో చెప్పినట్టు ఆ రోజునే అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేల్‌కు అతని మర్మాంగ చర్మానికి సున్నతి చేశాడు. తన దాసుల్లోనూ తాను డబ్బిచ్చి కొనుకొన్నవారిలోనూ మగవాళ్ళందరికీ అలా చేశాడు. 24 మర్మాంగచర్మంలో సున్నతి పొందినప్పుడు అబ్రాహాము వయస్సు తొంభైతొమ్మిదేళ్ళు. 25 ఇష్మాయేల్ మర్మాంగచర్మంలో సున్నతి పొందినప్పుడు అతడు పదమూడేళ్ళవాడు. 26 ఒకే రోజున అబ్రాహాము, అతని కొడుకు ఇష్మాయేల్ సున్నతి పొందారు. 27 అతని ఇంట్లోని పురుషులందరూ – ఇంట్లో పుట్టిన దాసులు సరే, అతడు డబ్బిచ్చి విదేశీయులదగ్గర కొనుక్కొన్నవారు కూడా అతనితోపాటు సున్నతి పొందారు.