16
1 ✽అబ్రాము భార్య శారై అతనికి సంతానాన్ని కనలేదు. ఆమెకు దాసి ఉంది. పేరు హాగరు. ఆమెది ఈజిప్ట్ దేశం.2 శారై అబ్రాముతో “చూశారా, నేను పిల్లల్ని కనకుండా యెహోవా చేశాడు. మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆమెమూలంగా నాకు పిల్లలు కలుగుతారు” అంది. అబ్రాము శారై మాట విన్నాడు.
3 ఇది అబ్రాము కనానుదేశంలో పదేళ్ళు కాపురమున్న తరువాత జరిగిన సంగతి. అతని భార్య శారై ఈజిప్ట్‌దేశానికి చెందిన తన దాసి హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది. 4 అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతి అయిన సంగతి తెలుసుకొన్నప్పుడు ఆమె యజమానురాలిని చిన్న చూపు చూచింది.
5 అప్పుడు శారై అబ్రాముతో అంది, “మీకు నా ఉసురు కొడుతుంది! నేను నా దాసిదాన్ని మీ కౌగిట చేర్చాను. తను గర్భం ధరించిన సంగతి తెలుసుకున్నాక నన్ను చిన్న చూపు చూచింది. నాకూ మీకూ మధ్య యెహోవా న్యాయం చేకూరుస్తాడు గాక!”
6 అబ్రాము శారైతో “ఇదిగో, నీ దాసి నీ చేతిలో మనిషే, ఆమెను ఏమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం” అన్నాడు. శారై ఆమెను బాధపెట్టింది. గనుక ఆమె శారై దగ్గరనుంచి పారిపోయింది.
7 ✽ఆమె ఎడారిలో, షూరు ప్రదేశానికి పోయే దారిలోని నీటిబుగ్గదగ్గర ఉన్నప్పుడు యెహోవా దూత ఒకడు ఆమెదగ్గరికి వచ్చాడు.
8 “హాగరూ, శారై దాసీ, నీవు వచ్చినది ఎక్కడనుంచి? వెళుతున్నది ఎక్కడికి?” అని అడిగాడు. ఆమె “నా యజమానురాలు శారై దగ్గర్నుంచి పారిపోయి వచ్చానండి” అంది.
9 ఆ దూత ఆమెతో అన్నాడు, “నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమెకు లోబడి ఉండు.” 10 ✽ఆ దేవదూత ఇంకా అన్నాడు, “నీ సంతానాన్ని ఇంకా అధికం చేసితీరుతాను. లెక్క పెట్టలేనంతమంది అవుతారు వారు.” 11 ఆ దేవదూత ఇంకా అన్నాడు, “ఇప్పుడు నీవు గర్భవతివి. నీవు మగబిడ్డను కంటావు. అతనికి ఇష్మాయేల్✽ అనే పేరు పెట్టు. ఎందుకంటే యెహోవా నీ బాధ✽ చూశాడు. 12 నీ కొడుకు అడవిగాడిదలాంటివాడుగా తయారవుతాడు. అతడికి తక్కినవారందరికీ మధ్య పరస్పర విరోధం ఉంటుంది. అయితే అతడు తన సమీప బంధువులదగ్గర కాపురముంటాడు.”
13 ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు “నీవు చూస్తున్న దేవుడివి” అనే పేరు పెట్టింది. ఎందుకంటే ఆమె “ఇక్కడ సహా నన్ను చూచిన✽ దేవుడు నాకు కనిపించాడా!” అంది. 14 ✽అందుచేత అక్కడి బావిని “బెయెర్ లహాయి రోయి” అంటారు. అది కాదేషుకూ బెరెదుకూ మధ్య ఉంది.
15 తరువాత హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది. అబ్రాము హాగరు కన్న తన కొడుకుకు ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు. 16 అబ్రాముకు హాగరు ఇష్మాయేల్‌ను కన్నప్పుడు అతని వయస్సు ఎనభై ఆరేళ్ళు.