15
1 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా అబ్రాముతో దర్శనంలో ఇలా మాట్లాడాడు: “అబ్రామూ, నీకు భయం ఉండకూడదు. నేనే నీకు డాలుగా ఉన్నాను. నీకు రాబొయ్యే ప్రతిఫలం చాలా గొప్పది.”
2 అబ్రాము అన్నాడు, “యెహోవా, ప్రభూ, నీవు నాకు ఏమిస్తే ఏం? నాకు సంతానం లేదు గదా. నా ఇంటికి వారసుడు దమస్కు పట్టణస్తుడైన ఎలియాజరు గదా.” 3 అబ్రాము ఇంకా అన్నాడు: “ఇదిగో నీవు నాకు సంతానాన్ని ప్రసాదించలేదు. ఇప్పుడు నా సేవకులలో ఒకడు నాకు వారసుడు.”
4 అప్పుడు యెహోవా అతనితో ఇలా మాట్లాడాడు: “అతడు నీకు వారసుడు కాడు. నీకు జన్మించబోయే కుమారుడే నీకు వారసుడవుతాడు.”
5 యెహోవా అతణ్ణి బయటకు తీసుకువచ్చి “ఆకాశంవైపు చూచి నీకు చేతనైతే ఆ నక్షత్రాలను లెక్కించు” అన్నాడు. “నీ సంతతివారు అలాగే ఉంటార”ని చెప్పాడు.
6 అతడు యెహోవామీద నమ్మకం ఉంచాడు. అతని నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.
7 ఆయన అతనితో “నీకీ దేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి నేను నిన్ను కల్దీయదేశంలోని ఊర్‌నుంచి రప్పించాను” అన్నాడు.
8 అతడు, “యెహోవా, ప్రభూ, ఇది నా వారసత్వమని ఎలా తెలుసుకుంటాను?” అని అడిగాడు.
9 ఆయన అన్నాడు: “మూడేళ్ళ పెయ్యనూ, మూడేళ్ళ మేకనూ, మూడేళ్ళ పొట్టేలునూ, ఒక గువ్వనూ, ఒక పావురం పిల్లనూ తీసుకురా.”
10 అబ్రాము వీటన్నిటినీ తీసుకువచ్చి ఒక్కొక్కదాన్ని రెండు ముక్కలు చేసి దేని సగం దాని సగానికి ఎదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం నరకలేదు. 11 గద్దలు ఆ శవాలపై వాలినప్పుడు అబ్రాము వాటిని వెళ్ళగొట్టాడు. 12 ప్రొద్దు క్రుంకుతూ ఉండగా అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. దానితోపాటు మహా భయాంధకారం ఆవరించింది.
13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ సంతానం తమది కాని దేశంలో కొంత కాలం పరాయివారుగా ఉంటారు. ఆ దేశస్తులు వారిని దాసులుగా చేసి నాలుగు వందల ఏళ్ళు బాధిస్తారు. 14 వారిని దాసులుగా చేసిన ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. ఆపైన నీ సంతతివారు చాలా ఆస్తితో బయటికి వస్తారు. 15 నీవైతే క్షేమంగా నీ పూర్వీకుల దగ్గరికి చేరుతావు. పండు ముసలితనంలో నిన్ను పాతిపెట్టడం జరుగుతుంది. 16 నీ నాలుగో తరంవారు ఇక్కడికి తిరిగి వస్తారు. ఎందుకంటే అమోరీప్రజల పాపం ఇంకా పండలేదు.”
17 ప్రొద్దు క్రుంకి కటిక చీకటి పడ్డాక కనిపించింది ఏమంటే, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న దివిటీ ఆ మాంస ఖండాల మధ్యగా దాటుతూ పొయ్యాయి.
18 ఆ రోజే యెహోవా అబ్రాముతో ఒడంబడిక చేస్తూ ఇలా అన్నాడు: “నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చాను. ఈజిప్ట్ నదినుంచి గొప్ప నది యూఫ్రటీసు వరకు 19 కేనీ జాతివారు, కనిజ్జ, కద్మోని, 20 హిత్తి, పెరిజ్జి, రెఫాయి, 21 అమోరీ, కనాను, గిర్గాషి, యెబూసి జాతులవారు కాపురమున్న ప్రదేశాలన్నిటినీ నీ సంతానానికి ఇచ్చాను.”