14
1 షీనారు✽ దేశం రాజైన అమ్రాపేలు, ఎల్లాస రాజైన అర్యోక్, ఏలాం✽ రాజైన కదొరులాయోమెరు, గోయీం రాజైన తిదాల్ ఏలేకాలంలో జరిగినదేమంటే, 2 వాళ్ళు సొదొమ రాజైన బెరాతొనూ, గొమొర్రా రాజైన బిర్షాతోనూ, అద్మా రాజైన షినాబ్‌తోనూ, సెబోయీంరాజైన షెమేబెరుతోనూ, బెలరాజుతోనూ (బెలను సోయర్ కూడా అంటారు) యుద్ధం జరిగించారు. 3 వీరంతా కలిసి సిద్దీం లోయకు వచ్చారు. “సిద్దీం” అంటే “ఉప్పు సముద్రం✽.” 4 పన్నెండేళ్ళుగా వారు కదొరులాయోమెరుకు లొంగి ఉన్నారు. గానీ, పదమూడో సంవత్సరంలో వాళ్ళు తిరగబడ్డారు. 5 పద్నాలుగో సంవత్సరంలో కదొరులాయోమెరు, అతడి పక్షాన ఉన్న రాజులు వచ్చి అష్తారోత్ కర్నాయింలో రెఫాయిం జాతివారిని, హాములో జూజీం జాతివారిని, షావేకర్యాతాయింలో ఏమీం జాతివారిని ఓడించారు.6 హోరి జాతివాళ్ళను కూడా శేయీరు కొండ సీమలో ఓడగొట్టి ఎడారిదగ్గర ఉన్న ఏల్‌పారాను వరకు తరిమారు. 7 అక్కడ నుంచి వెనక్కు తిరిగి ఏన్ మిష్పాతుకు, అంటే, కాదేషు✽కు చేరి, అమాలేకు జాతి✽వాళ్ళ ప్రాంతమంతటినీ, హస్సోనుతామారులో కాపురమున్న అమోరీ జాతి✽వాళ్ళను కూడా ఓడించారు.
8 సొదొమ రాజూ, గొమొర్రా రాజూ, అద్మా రాజూ, సెబోయీం రాజూ, బెల రాజూ (అంటే సోయర్ రాజు) బయలుదేరి వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్దీం లోయలో సైన్యవ్యూహం సిద్ధం చేశారు. 9 ఏలాం రాజు కదొరులాయోమెరు, గొయీం రాజు తిదాల్, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాస రాజు అర్యోకు – ఈ నలుగురు రాజులకూ ఆ అయిదుగురు రాజులకూ మధ్య యుద్ధం జరిగింది. 10 సిద్దీం లోయ అంతా తారు గుంటల✽ మయంగా ఉంది. సొదొమ రాజూ గొమెర్రా రాజూ పారిపోయి అక్కడ పడ్డారు. మిగతా వాళ్ళు పర్వతాలకు పరుగెత్తారు. 11 ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల సొత్తునంతా, వాళ్ళ భోజన పదార్థాలన్నీ పట్టుకుపోయారు. 12 ✽వాళ్ళు అబ్రాము తమ్ముని కొడుకైన లోత్‌ను కూడా, అతని సొత్తునంతా పట్టుకుపోయారు. లోత్ సొదొమలో కాపురముండేవాడు.
13 ✽తప్పించుకొన్న ఒక మనిషి వచ్చి హీబ్రూవాడైన అబ్రాముకు ఈ సంగతి తెలియజేశాడు. అబ్రాము అమోరీవాడైన మమ్రే సిందూర వృక్షాల దగ్గర కాపురముండేవాడు. మమ్రే, ఎష్కోల్, అనేరు అన్నదమ్ములు. వీళ్ళంతా అబ్రాముతో పరస్పర సహాయంకోసం సంధి చేసుకొన్నవారు. 14 ✽తన సమీప బంధువుణ్ణి బందీగా తీసుకువెళ్ళిన సంగతి అబ్రాము చెవిని పడడంతోనే అతడు తన పరివారంలో నిపుణులైన మనుషులను మూడు వందల పద్ధెనిమిది మందిని వెంటబెట్టుకొని, దాను వరకు ఆ రాజులను తరిమాడు. 15 అక్కడ అతడు తన దాసులను గుంపులుగా చేశాక వారంతా రాత్రివేళ ఆ రాజుల సేనపైబడి, కొట్టి, హోబా వరకు తరిమారు. హోబా దమస్కు పట్టణానికి పడమటగా ఉంది. 16 అబ్రాము ఆ సొత్తునంతా, తన సమీప బంధువుడైన లోత్‌నూ అతడి సొత్తునూ, స్త్రీలనూ, జనాన్నీ తీసుకువచ్చాడు.
17 కదొరులాయోమెరునూ అతడితో ఉన్న రాజులనూ హతమార్చి, తిరిగి వస్తూ ఉన్నప్పుడు సొదొమ రాజు అతణ్ణి కలుసుకోవడానికి షావే లోయ వరకు వెళ్ళాడు. (షావేలోయ అంటే “రాజులోయ.”) 18 అంతేగాక, షాలేం✽ నగరం రాజైన మెల్కీసెదెకు✽ రొట్టెలనూ ద్రాక్షరసాన్నీ తీసుకువచ్చాడు. అతడు సర్వాతీతుడైన దేవుని యాజి✽.
19 ఆయన అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు: “ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన దేవుడు✽ అబ్రామును దీవిస్తాడు గాక. 20 నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక.” అబ్రాము ఆయనకు అన్నిట్లో పదో భాగ✽మిచ్చాడు.
21 సొదొమ రాజు అబ్రాముతో “ఆ వ్యక్తుల్ని నాకిచ్చి, సొత్తును మీరే తీసుకోండి” అన్నాడు.
22 ✽అబ్రాము సొదొమ రాజుకు ఇలా జవాబు చెప్పాడు: “‘నేను అబ్రామును ధనికుడుగా చేశాన’ని మీరు చెప్పకుండేలా నేను ఒక్క దారం పోగు గానీ, పాదరక్ష తాడు గానీ, మీదాంట్లో దేన్నీ గానీ తీసుకోను. 23 తీసుకోనని నా చెయ్యి ఎత్తి ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన యెహోవాదేవునితో ప్రమాణం చేశాను. 24 ఈ యువకులు తిన్నది గాక, నాతో వెళ్ళిన అనేరు, ఎష్కోల్, మమ్రేలకు రావలసిన భాగాలను వారిని తీసుకోనివ్వండి.”