13
1 అబ్రాము తనకున్నదంతా తీసుకొని తన భార్యతోపాటు ఈజిప్ట్‌దేశాన్ని విడిచి, నెగెవ్✽కు వెళ్ళిపోయాడు. లోత్ కూడా వారితో వచ్చాడు. 2 అబ్రాము చాలా పశువులూ, వెండి బంగారాలు ఉన్నవాడు. 3 తన ప్రయాణాల్లో అతడు దక్షిణంనుంచి బేతేల్ ప్రాంతానికి, బేతేల్‌కూ హాయీకీ మధ్య మొదట్లో తన గుడారం వేసుకొన్న స్థలానికి, అంటే మొదట్లో తాను బలిపీఠం కట్టిన చోటుకు వెళ్ళాడు. 4 అక్కడ అబ్రాము యెహోవా పేర ప్రార్థన చేశాడు✽. 5 అబ్రాముతో వచ్చిన లోత్✽కు కూడా గొర్రెల మందలూ, గొడ్డు, గోదలూ, గుడారాలు ఉన్నాయి. 6 వారిద్దరూ కలిసి ఒక్కచోట కాపురం చేయడానికి చాలినంత భూమి లేకపోయింది. కలిసి నివసించ వీలులేనంత విస్తారమైన సంపద వారికి ఉండేదన్నమాట. 7 అబ్రాము మందలు కాసేవాళ్ళకూ లోత్ మందలు కాసేవాళ్ళకూ మధ్య జగడం వచ్చింది. అప్పటికే కనానువాళ్ళూ✽ పెరిజ్జివాళ్ళూ ఆ దేశంలో ఉన్నారు.8 అబ్రాము లోత్‌తో “నీకూ నాకూ మధ్య నీ కాపరులకూ, నా కాపరులకూ మధ్య జగడం✽ ఉండకూడదు. సమీపబంధువులం గదా మనం. 9 ✽ఈ దేశమంతా నీ ఎదుట లేదా? ఇప్పుడు వేరైపోదాం. నీవు ఎడమవైపుకు వెళ్ళిపోతే నేను కుడివైపుకు వెళ్తాను. నీవు కుడివైపుకు వెళ్ళిపోతే ఎడమవైపుకు వెళ్తాను” అన్నాడు.
10 ✽లోత్ తన తలెత్తి యొర్దాను మైదానాల ప్రాంతాన్నంతా చూశాడు. అది నీళ్ళు పారే ప్రదేశం. యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ముందు ఆ ప్రదేశం యెహోవా తోటలాగా ఉండేది. ఈజిప్ట్‌లో సోయరు దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశంలాగా ఉండేది. 11 ఇదంతా చూచి లోత్ ఆ యొర్దాను మైదానాల ప్రాంతాన్నంతా ఎన్నుకొని తూర్పుదిక్కుకు ప్రయాణమయ్యాడు. ఇలా వారు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు. 12 అబ్రాము కనానుదేశంలో కాపురమున్నాడు గానీ, లోత్ ఆ మైదానాల ప్రాంతం పట్టణాల మధ్యలో కాపురముంటూ తన గుడారం సొదొమ దగ్గరే వేసుకొన్నాడు. 13 అయితే సొదొమ మనుషులు దుర్మార్గులూ, యెహోవాకు విరోధంగా✽ ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు.
14 ✽లోత్ అబ్రాము దగ్గరనుంచి వేరైపోయిన తరువాత యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ తలెత్తి నీవున్న స్థలంనుంచి ఉత్తరంగానూ దక్షిణంగానూ తూర్పుగానూ పడమరగానూ చూడు. 15 ఎందుకంటే, నీవు చూస్తున్న ఈ భూమినంతా ఎల్లకాలం నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 16 అంతేగాక, నీ సంతానాన్ని ధూళి రేణువులంత విస్తారంగా చేస్తాను. ఎవరైనా ధూళి రేణువులు లెక్కపెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కపెట్టడం వీలవుతుంది. 17 ఇప్పుడు ఈ దేశమంతటా సంచరించు. ఎందుకంటే దీన్ని నీకిస్తాను.”
18 అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోను✽లో మమ్రేలో ఉన్న సిందూర వృక్షాల దగ్గరకు వెళ్ళి కాపురమున్నాడు. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం కట్టాడు.