12
1 యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీవు నీ దేశంనుంచీ, నీ బంధువుల దగ్గరనుంచీ, నీ తండ్రి ఇంటినుంచీ బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. 2 నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను దీవించి, నీ పేరు గొప్ప చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు. 3 నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను. నిన్ను శపించేవారిని శపిస్తాను. నీమూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యం అవుతాయి.”
4 యెహోవా తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాము బయలుదేరాడు. అతనితో కూడా లోత్ వెళ్ళాడు. అబ్రాము హారాను నుంచి బయలుదేరినప్పుడు అతడు డెబ్భయి అయిదేళ్ళ వాడు. 5 అబ్రాము తన భార్య శారైనీ, తన తమ్ముని కొడుకు లోత్‌నూ, హారానులో వారంతా గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని కనాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరాడు. 6 అబ్రాము ఆ దేశంమీదుగా దాటిపోతూ షెకెంకూ, మోరేలో ఉన్న సిందూర వృక్షందగ్గరికీ వచ్చాడు. అప్పటికే కనానువాళ్ళు ఆ దేశంలో ఉన్నారు.
7 అక్కడ యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై “నేనీ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను” అన్నాడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. 8 అతడక్కడ నుంచి బేతేల్‌కు తూర్పున ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళి తన గుడారం వేసుకొన్నాడు. దానికి పడమట బేతేల్, తూర్పున హాయీ ఉన్నాయి. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా పేర ప్రార్థించాడు. 9 అబ్రాము ఇంకా నెగెవ్ వైపుకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు.
10 ఆ దేశంలో కరవు వచ్చింది. అది తీవ్రతరం కావడం చేత అబ్రాము ఈజిప్ట్‌దేశంలో కొంతకాలం ఉండడానికి అక్కడికి వెళ్ళాడు.
11 ఈజిప్ట్ సరిహద్దుల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాము తన భార్య శారైతో ఇలా అన్నాడు: “ఇదిగో విను, నీవు చక్కనిదానివని నాకు తెలుసు. 12 ఈజిప్ట్‌వారు నిన్ను చూచి, ‘ఈమె అతడి భార్య’ అని చెప్పి, నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. 13 కనుక నిన్ను బట్టి నేను క్షేమంగా ఉండేందుకూ, నీకారణంగా నేను చావకుండా ఉండేందుకూ నీవు నా చెల్లెలివని వారికి చెప్పు.”
14 ఆమె చాలా అందకత్తె. అబ్రాము ఈజిప్ట్‌కు వచ్చిన తరువాత ఈజిప్ట్‌వారు ఇది చూశారు. 15 ఫరో అధిపతులు ఆమెను చూచి చక్రవర్తి ఎదుట శ్లాఘించారు. గనుక చక్రవర్తి భవనానికి ఆమెను తీసుకుపోవడం జరిగింది. 16 ఆమెనుబట్టి చక్రవర్తి అబ్రాముకు మేలు చేశాడు. అతనికి గొర్రెలూ, ఎడ్లూ, గాడిదలూ, పనివాళ్ళూ, పనికత్తెలూ, ఒంటెలూ లభించాయి.
17 అబ్రాము భార్య శారై కారణంగా యెహోవా చక్రవర్తినీ, అతడి ఇంటివాళ్ళనూ ఘోరమైన రోగాలతో బాధించాడు. 18 అందుచేత చక్రవర్తి అబ్రామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు: “నీవు నాకు చేసినదేమిటి? ఆమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదూ? 19 నీవు ‘ఆమె నా చెల్లెల’ని చెప్పావేం? ఆమెను నా భార్యగా స్వీకరించేందుకు ఆమెను తీసుకొన్నాను. ఇదిగో నీ భార్య. ఇప్పుడు నీవు ఆమెను తీసుకుని వెళ్ళిపో.”
20 అప్పుడు చక్రవర్తి అతణ్ణి గురించి తన మనుషులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతనికున్నంతటినీ తీసుకుపోనిచ్చారు. అతణ్ణీ, అతని భార్యనూ పంపించివేశారు.