11
1 ✽అప్పుడు లోకమంతటా భాష ఒక్కటే, మాటలు ఒకటే. 2 ✽మనుషులు తూర్పు దిక్కుకు ప్రయాణమై పోయినప్పుడు షీనారు దేశంలో ఒక మైదానం చూచి ఆ స్థలంలో కాపురమేర్పరచుకొన్నారు.3 అప్పుడు ఒకడితో ఒకడు “మనం ఇటికలు చేసి బాగా కాల్చుదాం” అని చెప్పుకొన్నారు. వారికి రాళ్ళుగా ఇటికలూ, అడుసుకు మట్టికీలూ ఉన్నాయి.
4 ✽వాళ్ళు “మనం భూతలమంతటా చెదరిపోకుండేలా ఒక నగరాన్ని కట్టుకుందాం. ఆకాశన్నంటే గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందాం” అని కూడా చెప్పుకొన్నారు.
5 మానవ సంతానం కట్టుకొంటున్న నగరాన్నీ గోపురాన్నీ చూడడానికి యెహోవా దిగివచ్చాడు✽.
6 ✽“ఇదిగో వీరు ఒకే ప్రజ. వీరందరికీ భాష ఒకటే. ఇప్పుడు వీరు ఈ పని చెయ్యడం ఆరంభించారు. ఇక వారు తలపెట్టే ఏ పనికైనా ఆటంకాలు ఉండవు. 7 రండి దిగిపోదాం. అక్కడ ఒకరి పలుకు ఒకరికి అర్థం కాకుండేలా వారి భాషను తారుమారు చేద్దాం” అన్నాడు యెహోవా.
8 ✽అందుచేత యెహోవా వాళ్ళను అక్కడనుంచి భూతలమంతటా చెదరగొట్టాడు. వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకొన్నారు. 9 ✽ లోకమంతట్లో ఉండే భాషను యెహోవా అక్కడ తారుమారు చేసినందుచేత ఆ నగరానికి “బాబెలు” అనే పేరు వచ్చింది. యెహోవా వాళ్ళను అక్కడ నుంచి భూతలమంతటా చెదరగొట్టాడు.
10 ✽షేము సంతతివారి వంశావళి ఇది: జలప్రళయానికి రెండేళ్ళ తరువాత, షేముకు అతని నూరో ఏట అర్పక్షదు జన్మించాడు. 11 అర్పక్షదు జన్మించిన తరువాత షేము అయిదు వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 12 అర్పక్షదుకు అతని ముప్ఫయి అయిదో ఏట షేలహు జన్మించాడు. 13 షేలహు జన్మించిన తరువాత అర్పక్షదు నాలుగు వందల మూడేళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 14 షేలహుకు అతని ముప్ఫయ్యో ఏట ఏబెరు జన్మించాడు. 15 ఏబెరు జన్మించిన తరువాత షేలహు నాలుగు వందల మూడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 16 ✽ఏబెరుకు అతని ముప్ఫయి నాలుగో ఏట పెలెగు జన్మించాడు. 17 పెలెగు జన్మించిన తరువాత ఏబెరు నాలుగు వందల ముప్ఫయ్యెళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 18 పెలెగుకు అతని ముప్ఫయ్యో ఏట రయూ జన్మించాడు. 19 రయూ జన్మించిన తరువాత పెలుగు రెండు వందల తొమ్మిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 20 రయూకు అతని ముప్ఫయి రెండో ఏట సెరూగు జన్మించాడు. 21 సెరూగు జన్మించిన తరువాత రయూ రెండు వందల ఏడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 22 సెరూగుకు అతని ముప్ఫయ్యో ఏట నాహోరు జన్మించాడు. 23 నాహోరు జన్మించిన తరువాత సెరూగు రెండు వందల యేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 24 నాహోరుకు అతని ఇరవై తొమ్మిదో ఏట తెరహు జన్మించాడు. 25 తెరహు జన్మించిన తరువాత నాహోరు నూట పందొమ్మిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 26 డెబ్భయి ఏళ్ళవాడయ్యాక తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు.
27 తెరహు సంతతివారి వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను జన్మించారు. హారానుకు లోత్ జన్మించాడు. 28 హారాను తన తండ్రి తెరహు సముఖంలో, తాను పుట్టిన దేశంలో, అంటే కల్దీయవారి దేశంలోని ఊర్✽ పట్టణంలో చనిపొయ్యాడు. 29 అబ్రాము వివాహమాడాడు. అతడి భార్య పేరు శారై. నాహోరు కూడా వివాహమాడాడు. అతడి భార్య పేరు మిల్కా. ఆమె హారాను కూతురు. హారాను ఇస్కాకు కూడా తండ్రి. 30 శారై గొడ్రాలు; ఆమెకు పిల్లలు లేరు. 31 తెరహు తన కొడుకు అబ్రామునూ, తన మనుమడూ హారాను✽ కొడుకూ అయిన లోత్‌నూ, తన కోడలు (తన కొడుకు అబ్రాము భార్య) శారైనీ వెంటబెట్టుకొని కనాను దేశానికి వెళ్ళడానికి కల్దీయవారి దేశంలోని ఊర్‌నుంచి బయలుదేరారు. వారు హారాను చేరి అక్కడ కాపురమున్నారు. 32 తెరహు జీవించిన కాలం రెండు వందల అయిదేళ్ళు. తెరహు హారానులో చనిపొయ్యాడు.