10
1 నోవహు కుమారులు షేము, హాము, యాపెతుల సంతతివారి వంశవృక్షం ఇది: జలప్రళయం తరువాత వారికి కొడుకులు పుట్టారు. 2 ✽యాపెతు కొడుకుల పేర్లు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 3 గోమెరు కొడుకుల పేర్లు అష్కనజు, రీఫతు, తోగర్మా. 4 యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీం, దాదోనీం. 5 వీరి సంతతివారు సముద్రతీర ప్రాంతాలకు, లంకలకు వెళ్తూ తమ తమ భాషల ప్రకారమూ వంశాల ప్రకారమూ వేరు వేరు ప్రజలయ్యారు.6 ✽హాము కొడుకుల పేర్లు కూషు, మిస్రాయిం, పూతు, కనాను. 7 కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తాకా. రాయమా కొడుకులు శెబా, దదాను. 8 ✽కూషుకు నిమ్రోదు కూడా పుట్టాడు. అతడు భూమిమీద పరాక్రమశాలి కాసాగాడు. 9 అతడు యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి. అందుచేత “యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి నిమ్రోదులాగా” అనే లోకోక్తి ఉంది. 10 అతడి రాజ్యం షీనారు దేశంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలతో ఆరంభమైంది. 11 ఆ దేశంనుంచి అష్షూరుకు వెళ్ళి నీనెవె, రహోబోతునగర్, కాలహూనూ, 12 నీనెవెకూ కాలహుకు మధ్య ఉన్న రెసెనునూ కట్టాడు. ఇవన్నీ కలిసి ఆ ఒకే గొప్ప పట్టణంగా ఉన్నాయి.
13 మిస్రాయిం ఈ వేరు వేరు ప్రజలకు ఆదిపురుషుడు – లూదీయ జాతివారు, అనాం, లెహాబు, నప్తుహు, పత్రసు, కస్లూహు, కఫ్తోరు జాతులవారు. 14 ✽కస్లూహు వారిలో నుంచి ఫిలిష్తీయవారు వచ్చారు. 15 ✽కనాను అనే వ్యక్తికి మొదట పుట్టినవాడు సీదోను. 16 కనాను హేతుజాతివారికి, యెబూసి, అమోరీ, గిర్గాషి, 17 హివ్వి, అర్కి, సిని, 18 అర్వాది, సెమారి, హమాతి జాతులవారికి కూడా ఆదిపురుషుడు. తరువాత కనానుకు చెందిన వంశాలు ఆయా ప్రాంతాలకు చెదరిపొయ్యాయి. 19 కనానుజాతివారి సరిహద్దులు సీదోను పట్టణం నుంచి గెరారు గ్రామం దిక్కున గాజావరకూ, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిం పట్టణాల వైపుగా లాషావరకూ ఉండేవి. 20 వీరంతా హాము సంతతివారు. వారి వంశాలూ భాషలూ దేశాలూ, జాతులూ ఇవే.
21 ✽షేముకు కూడా సంతానం కలిగింది. షేము యాపెతుకు అన్న, ఏబెరు కొడుకులందరికీ ఆదిపురుషుడు. 22 షేము కొడుకులు ఎవరంటే, ఏలాం, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాం. 23 ఆరాం కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాషు. 24 అర్పక్షదుకు షేలహు జన్మించాడు. షేలహుకు ఏబెరు జన్మించాడు. 25 ఏబెరుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ఒకడి పేరు పెలెగు✽. ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగమైంది. అతని తోబుట్టువు యొక్తాను. 26 యొక్తానుకు జన్మించిన వారు ఎవరంటే, అల్మోదాదు, శెలపు, హసరు, మావెతు, యెరహు, 27 హాదోరం, ఊజాలు, దిక్లాను, 28 ఓబాలు, అబీమాయేలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యొబాబు. వీరంతా యొక్తాను కొడుకులు. 30 వారు నివసించే ప్రాంతం మేషా నుంచి సపారా దిక్కుగా తూర్పు పర్వతం వరకూ ఉండేది. 31 వీరు షేము కొడుకులు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే.
32 ఇవి నోవహు కొడుకుల వంశాలు. వారి తరాలు, ప్రజలు, జలప్రళయం తరువాత వీరిలోనుంచి వచ్చినవారే లోకంలో వేరు వేరు ప్రజలుగా విడిపోయారు.