9
1 ✽దేవుడు నోవహునూ, అతని కొడుకులనూ దీవించి వారితో ఇలా అన్నాడు: “ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకం నిండా విస్తరించండి. 2 ✽మీకు అన్ని అడవి మృగాలూ గాలిలో ఎగిరే పక్షులూ భూమిమీద తిరిగే ప్రతిదీ సముద్రం చేపలూ హడలిపోతాయి, భయపడతాయి. వాటన్నిటిని మీ చేతికి అప్పగించాను. 3 చలించే ప్రతి జీవినీ మీరు తినవచ్చు. పచ్చని కూరమొక్కలను మీకిచ్చినట్టే వాటన్నిటినీ ఇస్తున్నాను. 4 ✝అయితే మాంసం దాని రక్తంతో మాత్రం తినకూడదు. రక్తమే దాని ప్రాణం. 5 ✝నేను ఇంకా మీ విషయం విధించేదేమంటే ఎవరైనా మరొకరి ప్రాణం తీస్తే వారు చావవలసిందే. అలాగే ప్రతి జంతువూ కూడా చావవలసిందే. సాటి మానవుణ్ణి చంపిన వాడికి మరణశిక్ష విధించాను. 6 ✽ దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు గనుక మానవుణ్ణి చంపేవాణ్ణి మానవుడే చంపాలి. 7 మీరైతే ఫలవంతంగా ఉండి సంతానాభివృద్ధి పొందండి. భూలోకం అంతటినీ విస్తరించి అధికం కండి.”8 దేవుడు నోవహుతోను, అతని కొడుకులతోను ఇంకా అన్నాడు: 9 ✽“ఇప్పుడు నేను మీతోను తరువాత కలిగే మీ సంతానంతోను నా ఒడంబడిక చేస్తున్నాను. 10 మీతో పాటు సజీవమైన ప్రతిదానితోను – పక్షులతో, పశువులతో, మృగాలతో, ఓడ బయటికి వచ్చిన ప్రతిదానితో, భూమిమీద తిరిగే వాటన్నిటితోకూడా నా ఒడంబడిక చేస్తున్నాను. 11 శరీరం ఉన్న ప్రతిదీ వరదలచేత ఇంకెన్నడూ నిర్మూలం కాదు. సర్వలోకాన్ని నాశనం చేసే జలప్రళయమే ఉండదు. మీతో నేను చేసే ఒడంబడిక ఇదే.”
12 ✽దేవుడు ఇంకా అన్నాడు: “నాకూ మీకూ మీతోపాటు ఉన్న సమస్త జీవరాసులకూ మధ్య తరతరాలన్నిటికీ నేను చేసే ఒడంబడిక గురుతు ఇదే. 13 మేఘాల్లో నా రంగులవిల్లు ఉంచాను. అది నాకూ భూలోకానికీ మధ్య ఉన్న ఒడంబడికకు గురుతుగా ఉంటుంది. 14 నేను భూమికి పైగా మేఘాలను రప్పిస్తాను. నా రంగులవిల్లు మేఘాల్లో కనబడితే నా ఒడంబడికను తలచుకొంటాను. 15 నాకూ, మీకూ శరీరం ఉన్న జీవరాసులకూ ఉన్న ఆ ఒడంబడికను తలచుకొంటాను. నీళ్ళు వరదలుగా వచ్చి శరీరం ఉన్న ప్రతిదాన్నీ ఇక నాశనం చేయవు. 16 ఆ విల్లు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూచినప్పుడు దేవునికీ, భూమిమీద ఉన్న శరీరం గల సర్వజీవరాసులకూ మధ్య ఉన్న నిత్యమైన ఒడంబడిక తలచుకొంటాను.” 17 దేవుడు నోవహుతో “నాకూ భూమిమీద శరీరం ఉన్న ప్రతిదానికీ నేను చేసే ఒడంబడిక గుర్తు ఇదే” అన్నాడు.
18 ఓడ బయటికి వచ్చిన నోవహు కొడుకులు ఎవరంటే, షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. 19 ✝ఆ ముగ్గురే నోవహు కొడుకులు. వారి సంతతివారు భూలోకమంతటా చెదిరిపొయ్యారు.
20 నోవహు కర్షకుడయ్యాడు. ఒక ద్రాక్షతోట వేశాడు. 21 ✽ఒకసారి ద్రాక్షమద్యం త్రాగి మత్తిల్లాడు. తన డేరాలో నగ్నంగా పడుకొన్నాడు. 22 ✽హాము (కనాను తండ్రి) తన తండ్రి దిగంబరత్వం చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ సంగతి తెలియజేశాడు. 23 షేము, యాపెతు ఒక వస్త్రం పట్టుకొని, తమ భుజాలపై వేసికొని వెనక్కు నడిచి, తమ తండ్రి దిగంబరత్వం కప్పివేశారు. వారి ముఖాలు వేరే దిక్కుగా ఉన్నాయి. గనుక వారు తమ తండ్రి దిగంబరత్వం చూడలేదు.
24 నోవహుకు మత్తు వదిలి, తన చిన్నకొడుకు చేసినది తెలిసికొని ఇలా అన్నాడు: 25 ✽“కనాను శాపగ్రస్తుడు. తన అన్నలకు దాసానుదాసుడు అవుతాడు.” 26 అతడింకా అన్నాడు: “షేము దేవుడైన యెహోవాకు స్తుతులు కలుగు గాక! కనాను అతడి దాసుడుగా ఉండు గాక! 27 దేవుడు, యాపెతు విస్తరించేటట్లు చేయు గాక! అతడు షేము గుడారాలలో కాపురముండు గాక! కనాను వారికి దాసుడుగా ఉండు గాక!”
28 జలప్రళయం తరువాత నోవహు ఇంకా మూడువందల యాభై ఏళ్ళు బ్రతికాడు. 29 నోవహు జీవించిన కాలం తొమ్మిది వందల యాభై ఏళ్ళు. అప్పుడు చనిపోయాడు.