8
1 దేవుడు నోవహునూ అతనితో ఓడలోని సమస్త జీవులనూ పశువులన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొన్నాడు✽. ఆయన భూమిమీద గాలి వీచేలా చేయగా నీళ్ళు తగ్గిపోసాగాయి. 2 జలాగాధం ఊటలూ, ఆకాశద్వారాలూ మూసుకున్నాయి. ఆకాశం నుంచి ఆ ప్రచండ వర్షం ఆగిపోయింది. 3 నీళ్ళు భూమిమీదనుంచి క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. నూట యాభై రోజుల తరువాత ఆ నీళ్ళు తక్కువ అయ్యాయి. 4 ✽ఏడో నెల పదిహేడో రోజున ఆ ఓడ అరారాత్ పర్వతపంక్తి మీద నిలిచింది. 5 పదో నెలవరకు నీళ్ళు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయి. పదో నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.6 నలభై రోజుల తరువాత నోవహు తాను ఓడకు చేసిన కిటికీ తెరచి ఒక బొంతకాకిని బయటకు వదలి పెట్టాడు. 7 భూమిమీద నీళ్ళు ఆరిపొయ్యేవరకూ ఆ బొంతకాకి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. 8 అప్పుడు భూమిమీది నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోవహు ఒక పావురాన్ని బయటకు వదలిపెట్టాడు. 9 అయితే భూతలం అంతటా నీళ్ళుండడంవల్ల దానికి వాలే చోటు దొరకలేదు, గనుక అది ఓడలోకి నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు.
10 ఇంకో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని ఓడలోనుంచి మళ్ళీ బయటకు వదలిపెట్టాడు. 11 సాయంకాలానికి అది అతనిదగ్గరకి వచ్చింది. అప్పుడే తెంపిన ఆలీవ్ చెట్టు ఆకు దాని నోట ఉంది, గనుక భూమిమీది నీళ్ళు పూర్తిగా తగ్గిపొయ్యాయని నోవహుకు తెలిసింది. 12 మరో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని బయటకు మళ్ళీ వదలిపెట్టాడు. అది అతనిదగ్గరకు తిరిగి రాలేదు. 13 ✽నోవహు వయసులో ఆరు వందల ఒకటో ఏట మొదటి నెల మొదటి రోజున భూమిమీద నీరు ఆరిపోయింది. నోవహు ఓడ కప్పు తీసివేసి బయటికి చూస్తే భూమి ఆరిపోయి ఉంది. 14 రెండో నెల ఇరవయ్యేడో రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: 16 “నీవు, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలో నుంచి దిగండి. 17 నీ దగ్గర ఉన్న సమస్త జీవులనూ – పక్షులనూ పశువులనూ భూమిమీద తిరిగే ప్రతి దాన్నీ – బయటికి తీసుకురా. అవి భూమి అంతటా విస్తరించి, ఫలిస్తూ, సంఖ్యలో అధికం కావాలి.”
18 నోవహు అతనితో కూడా అతని కొడుకులూ, భార్యా, కోడళ్ళూ బయటికి వచ్చారు. 19 ప్రతి జంతువూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, ప్రతి పక్షి (వాటి వాటి జాతుల ప్రకారం) ఓడ బయటికి వచ్చాయి. 20 అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం✽ కట్టి, అన్ని శుద్ధ జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకొని ఆ వేదికపై హోమ బలులు అర్పించాడు.
21 యెహోవా ఇంపైన సువాసన✽ చూచి మనసులో అనుకున్నాడు: “మనిషి అంతరంగంలో ఉద్దేశాలన్నీ బాల్యం✽ నుంచి చెడ్డవి, గనుక ఇక నేను మనిషి కారణంగా భూమిని మళ్ళీ శపించను. నేనిప్పుడు చేసినట్టు ఇకనుంచి సజీవమైన ప్రతిదానినీ మళ్ళీ నాశనం చేయను. 22 భూలోకం నిలిచేంతవరకు విత్తనాలు వేసేకాలం, కోతకాలం, చలి, వేడిమి, ఎండకాలం, శీతకాలం, పగలు, రాత్రి ఉంటాయి.”