7
1 అప్పుడు యెహోవా నోవహుతో ఇలా అన్నాడు: “నీవూ, నీ ఇంటివారందరూ ఓడలోకి చేరుకోండి. ఈ తరంవాళ్ళలో కల్లా నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు. 2 నీవు అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ నీతో తీసుకుపోవాలి. శుద్ధం కాని జంతువులన్నిటినీ రెండు మగవాటినీ, రెండు ఆడవాటినీ కూడా తీసుకుపోవాలి. 3 గాలిలో ఎగిరే పక్షులను, ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ కూడా తీసుకు పోవాలి. వాటి జాతులు అంతరించకుండా, భూలోకమంతట్లో మళ్ళీ బ్రతికేలా అలా చేయాలి. 4 ఎందుకంటే ఇంకా ఏడు రోజులకు భూమిమీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ వర్షం కురిపిస్తాను. నేను చేసిన సర్వ జీవకోటిని భూతలంనుంచి నిర్మూలం చేస్తాను.”
5 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు. 6 జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.
7 ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నోవహు అతనితోపాటు అతని భార్యా, అతని కొడుకులూ, కోడళ్ళూ ఆ ఓడలోకి చేరుకొన్నారు. 8 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే శుద్ధమైన, అశుద్ధమైన ప్రతి రకం జంతువూ, ప్రతి రకం పక్షీ, భూమిమీద తిరిగే ప్రతి విధమైనదీ 9 జంట జంటలుగా మగవీ ఆడవీ నోవహుతో కూడా ఆ ఓడలోకి వెళ్ళాయి. 10 ఏడు రోజుల తరువాత భూమిమీదికి జలప్రళయం వచ్చింది.
11 నోవహు జీవితంలో ఆరు వందల సంవత్సరాల రెండు నెలల పదిహేడు రోజులు గడిచాయి. ఆ రోజే గొప్ప జలాగాధంలో ఉన్న ఊటలన్నీ ఒక్క పెట్టున బ్రద్దలయ్యాయి. ఆకాశ ద్వారాలు కూడా తెరచుకున్నాయి. 12 ప్రచండ వర్షం భూమిమీద నలభై రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది. 13 ఆ రోజే నోవహు, అతని కొడుకులు షేము, హాము, యాపెతు, అతని భార్య, అతని ముగ్గురు కోడళ్ళు ఓడలోకి వెళ్ళారు. 14 అన్ని జాతుల జంతువులూ, పశువులూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, అన్ని జాతుల పిట్టలూ, పక్షులూ కూడా ఓడలోకి వెళ్ళాయి. 15 ఊపిరి ఉన్న ప్రతిదీ రెండు రెండు ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్ళాయి. 16 దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ, మగవీ, ఆడవీ ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు.
17 జలప్రళయం భూమిమీద నలభై రోజులు ఉంది. నీళ్ళు అధికమై ఓడను పైకెత్తగా అది నేలపైనుంచి తేలుతూ ఉంది. 18 ఆ నీళ్ళు భూమిమీద చాలా అధికమై లోతు ఎక్కువైంది. ఓడ నీళ్ళమీద తేలుతూ వెళ్ళింది. 19 నీళ్ళ లోతు అత్యధికం కావడంచేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగి పొయ్యాయి. 20 నీళ్ళ మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది. పర్వతాలు మునిగిపొయ్యాయి. 21 శరీరం ఉన్న ప్రతిదీ – పక్షులూ, పశువులూ, జంతువులూ, భూమిమీద తిరిగే ప్రతిదీ, ప్రతి మనిషీ కూడా నశించడం జరిగింది. 22 నేలమీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. 23 భూతలం అంతటా జీవరాసులన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. మనుషులూ, పశువులూ, భూమిమీద తిరిగేవీ, గాలిలో ఎగిరే పక్షులూ, భూమిమీద లేకుండా నిర్మూలం అయ్యాయి. మిగిలింది నోవహు, అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే. 24 ఆ నీళ్ళు భూమిమీద నూట యాభై రోజులు నిలిచాయి.