6
1 లోకంలో జనాభా విస్తరించడం ఆరంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు 2 మనుషుల కూతుళ్ళు అందకత్తెలని దైవకుమారులు✽ చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను చేపట్టారు.3 అప్పుడు యెహోవా “నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండడు✽. ఎందుకంటే వారు శరీర స్వభావులు. గనుక ఇక వారి కాలం నూట ఇరవై ఏళ్ళు✽ అవుతుంది.”
4 ఆ రోజుల్లో బ్రహ్మాండమైన మనుషులు లోకంలో ఉన్నారు. ఆ తరువాత కూడా ఉన్నారు. దైవకుమారులు మానవ కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు వారివల్ల పిల్లలను కన్నారు. పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీళ్ళే. 5 ✽ మనుషుల చెడుతనం లోకంలో అధికం కావడం, వాళ్ళ అంతరంగంలోని తలంపుల ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండడం యెహోవా చూశాడు. 6 ✽తాను మానవుణ్ణి లోకంలో చేసినందుచేత యెహోవాకు పరితాపమూ హృదయంలో దుఃఖమూ కలిగాయి.
7 ✽యెహోవా “నేను సృజించిన మనుషులను లోకంలో ఉండకుండా నాశనం చేస్తాను. మానవులతోపాటు పశువులనూ, ప్రాకే జంతువులనూ, గాలిలో ఎగిరే పక్షులనూ కూడా నాశనం చేస్తాను. వాళ్ళను చేసినందుకు నాకు పరితాపం కలిగింది” అన్నాడు. 8 ✝అయితే నోవహును యెహోవా దయగా చూశాడు.
9 ✽ ఇది నోవహు చరిత్ర: నోవహు తన తరంవారిలో న్యాయవంతుడూ, నిందారహితుడూ. నోవహు దేవుని సహవాసంలో నడిచాడు. 10 నోవహుకు ముగ్గురు కొడుకులు జన్మించారు – షేము, హాము, యాపెతు. 11 ✝దేవుని దృష్టిలో లోకం భ్రష్టమైపోయి దౌర్జన్యంతో నిండి ఉంది. 12 ✽మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకొన్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. 13 దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: “మనుషులవల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది. గనుక నా సముఖంనుంచి ప్రతి శరీరి నిర్మూలమైపోవాలి. నేను మానవాళిని భూమితోపాటు నాశనం చేస్తాను. 14 నీవైతే తమాల మ్రానుతో ఒక ఓడను నీకోసం చేసుకో. గదులు గదులుగా ఆ ఓడను చేసి లోపలా బయటా దానికి కీలు✽ పూయాలి. 15 ✽నీవు దాన్ని చేయవలసిన విధమిదే: ఆ ఓడ పొడుగు మూడు వందల మూరలు. దాని వెడల్పు యాభై మూరలు. దాని ఎత్తు ముప్ఫయి మూరలు ఉండాలి. 16 ఓడలో వెలుగు కోసం ఒక కిటికీ చేయాలి. దాన్ని పైకప్పు నుంచి మూరెడు క్రిందికి పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి. ఓడను మూడంతస్తులుగా కట్టాలి. 17 ✝నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరినీ, ఊపిరి ఉన్న ప్రతిదానిని ఆకాశం క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. లోకంలో ఉన్నదంతా నాశనం అవుతుంది.
18 ✽“అయితే నేను నీతో నా ఒడంబడిక చేస్తాను. నీవూ, నీతోపాటు నీ కొడుకులూ, నీ భార్యా, నీ కోడళ్ళూ ఓడలోకి చేరుకోవాలి. 19 అంతేకాక, జంతుజాలంలో ప్రతి జాతిలోనివి రెండు రెండు నీతోకూడా బ్రతికేలా వాటిని ఓడలోకి తేవాలి. ప్రతి జాతిలో మగది, ఆడది ఉండాలి. 20 వాటి వాటి జాతులప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమిమీద తిరిగే ప్రతి దానిలో రెండు రెండు బ్రతికేలా నీదగ్గరికి వస్తాయి. 21 నీ కోసం, వాటి కోసం ప్రతివిధమైన మేతనూ భోజన పదార్థాలనూ కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. దాన్ని అవీ మీరూ తింటారు.”
22 ✽నోవహు అలా చేశాడు. దేవుడు అతనికాజ్ఞాపించినట్టే అంతా సాధించాడు.