5
1 ✝ఇది ఆదాము వంశవృక్షం. దేవుడు మానవుణ్ణి సృజించి నప్పుడు తన పోలికలో అతణ్ణి చేశాడు. 2 పురుషుడుగా, స్త్రీగా వారిని సృజించాడు. వారిని సృజించిన రోజున✽ దేవుడు వారిని దీవించి వారి పేరు “మానవులు” అన్నాడు. 3 ✽ఆదాము నూట ముప్ఫై ఏళ్ళు బ్రతికిన తరువాత తన పోలికలో, తన స్వరూపంలో అతనికి ఒక కొడుకు జన్మించాడు. ఆదాము అతని పేరు “షేతు” అన్నాడు.4 ✽షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 5 ✽ఆదాము జీవించినకాలం తొమ్మిది వందల ముప్ఫయి ఏళ్ళు. అప్పుడు చనిపోయాడు.
6 షేతుకు అతని నూట అయిదో ఏట ఎనోషు జన్మించాడు. 7 ఎనోషు జన్మించిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 8 షేతు జీవించినకాలం తొమ్మిది వందల పన్నెండేళ్ళు. అప్పుడు చనిపోయాడు.
9 ఎనోషుకు అతని తొంభైయో ఏట కేయీనాను జన్మించాడు. 10 కేయీనాను జన్మించిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేడేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 11 ఎనోషు జీవించినకాలం తొమ్మిది వందల అయిదేళ్ళు. అప్పుడతడు చనిపోయాడు.
12 కేయీనానుకు అతని డెభ్బైయో ఏట మహలలేలు జన్మించాడు. 13 మహలలేలు జన్మించిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏళ్ళు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 14 కేయినాను జీవించినకాలం తొమ్మిదివందల పదేళ్ళు. అప్పుడతడు చనిపోయాడు.
15 మహలలేలుకు అతని అరవై అయిదో ఏట యెరెదు జన్మించాడు. 16 యెరెదు జన్మించిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫయి ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ, కూతుళ్ళూ జన్మించారు. 17 మహలలేలు జీవించినకాలం ఎనిమిది వందల తొంభై అయిదేళ్ళు, అప్పుడతడు చనిపోయాడు.
18 యెరెదుకు అతని నూట అయిదో ఏట హనోకు జన్మించాడు. 19 హనోకు జన్మించిన తరువాత యెరెదు ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 20 యెరెదు జీవించిన కాలం తొమ్మిది వందల అరవై రెండేళ్ళు. అప్పుడు చనిపోయాడు.
21 హనోకుకు అతని అరవై అయిదో ఏట మెతూషెల జన్మించాడు. 22 మెతూషెల జన్మించిన తరువాత హనోకు మూడు వందల ఏళ్ళు దేవుని సహవాసంలో నడిచాడు✽. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 23 హనోకు జీవించిన కాలం మూడు వందల అరవై అయిదేళ్ళు. 24 హనోకు దేవుని సహవాసంలో నడిచిన తరువాత దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు, గనుక అతడు లేకుండా పోయాడు.
25 మెతూషెలకు అతని నూట ఎనభైయో ఏట లెమెకు జన్మించాడు. 26 లెమెకు జన్మించిన తరువాత మెతూషెల ఏడు వందల ఎనభై ఏళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 27 మెతూషెల జీవించిన కాలం తొమ్మిది వందల అరవై తొమ్మిదేళ్ళు. అప్పుడు చనిపోయాడు.
28 లెమెకుకు అతని నూట ఎనభై రెండో ఏట ఒక కొడుకు జన్మించాడు. 29 అతడు ఆ కొడుకుకు నోవహు అనే పేరు పెట్టాడు. ఎందుకంటే, అతడు ఇలా అనుకొన్నాడు: “యెహోవా శపించిన భూమివల్ల కలిగే మా ప్రయాసం, మా కాయకష్టం విషయంలో ఇతడు మమ్ముల్ని ఆదరిస్తాడు.” 30 నోవహు జన్మించిన తరువాత లెమెకు అయిదు వందల తొంభై అయిదేళ్ళు బ్రతికాడు. అతనికింకా కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు. 31 లెమెకు జీవించిన కాలం ఏడు వందల డెబ్భై ఏడేళ్ళు. అప్పుడు చనిపోయాడు. 32 నోవహు అయిదు వందల ఏళ్ళు బ్రతికిన తరువాత అతనికి షేము, హాము, యాపెతు జన్మించారు.