4
1 ఆదాము తన భార్యయైన హవతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయి, కయీను అనేవాణ్ణి కన్నది. అప్పుడామె, “యెహోవా దయచేత నాకు కొడుకు కలిగాడు” అంది. 2 తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కన్నది. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను సేద్యగాడయ్యాడు. 3 కొంత కాలానికి కయీను పొలం పంటలో కొంత యెహోవాకు నైవేద్యంగా తెచ్చాడు.
4 హేబెలు కూడా తన మందలో మొదట పుట్టిన వాటిలో నుంచి మంచివాటిని తెచ్చాడు. యెహోవా హేబెలునూ అతని అర్పణనూ అంగీకరించాడు. 5 గాని, కయీన్నూ అతని నైవేద్యాన్నీ లక్ష్య పెట్టలేదు. అందుచేత కయీనుకు చాలా కోపం వచ్చింది. ముఖం చిన్నబోయింది.
6 యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నీకు కోపం ఎందుకు? నీ ముఖం చిన్నబోవడం దేనికి? 7 నీవు మంచిని చేస్తే తలెత్తుకోవా? మంచిని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. నిన్ను మింగివేయాలని దానికి నీమీద ఆశ ఉంది. కాని, నీవు దాన్ని లోబరుచుకోవాలి.”
8 కయీను తన తమ్ముడు హేబెలుతో ఆ విషయం చెప్పాడు. ఆ తరువాత వారిద్దరూ పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు పైబడి అతణ్ణి చంపివేశాడు.
9 యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. కయీను “నాకు తెలీదు. నా తమ్ముడికి నేను కావాలివాడినా?” అన్నాడు.
10 యెహోవా ఇలా అన్నాడు, “నీవు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తం స్వరమెత్తి నేలనుంచి నాకు మొరపెట్టుకొంటూ ఉంది. 11 కనుక నీవు చేతులారా ఒలికించిన నీ తమ్మున్ని రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ భూభాగంమీద ఉండకుండ ఇప్పుడు నీవు శాపగ్రస్థుడవుతావు. 12 ఇకనుంచి నీవు భూమిని సాగు చేసేటప్పుడు అది దాని సారం నీకివ్వదు. నీవు లోకంలో దేశదిమ్మరివి అవుతావు.”
13 కయీను యెహోవాకు ఇలా జవాబిచ్చాడు: “నా శిక్ష నేను సహించలేనంత గొప్పది. 14 ఇదిగో ఇప్పుడు నీవు నన్ను ఈ ప్రాంతంనుంచి వెళ్ళగొట్టేస్తున్నావు. ఇక నీ ముఖదర్శనం నాకు దొరకదు కూడా. నేను లోకంలో దేశదిమ్మరిని అవుతాను. నేను ఎవరికైనా చిక్కితే నన్ను చంపేస్తారు.”
15 అయితే యెహోవా అతనితో “కయీన్నూ ఎవరైనా చంపితే ఏడంతలు ప్రతీకారం తప్పదు” అన్నాడు. ఎవ్వరూ కయీనును చూచి అతణ్ణి చంపకుండేలా యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు.
16 కయీను యెహోవా సముఖంనుంచి ప్రయాణమై పోయి నోదు అనే ప్రాంతంలో నివసించాడు. అది ఏదెనుకు తూర్పు దిక్కున ఉంది. 17 కయీను తన భార్యతో ఏకం అయినప్పుడు ఆమె గర్భవతి అయి, హనోకును కన్నది. అప్పుడు కయీను ఒక ఊరు నిర్మిస్తూ ఉన్నాడు. దానికి తన కొడుకు పేరునుబట్టి “హనోకు” అనే పేరు పెట్టాడు. 18 హనోకుకు ఈరాదు జన్మించాడు. ఈరాదుకు మహూయాయేలు జన్మించాడు. మహూయాయేలుకు మతూషాయేలు జన్మించాడు. మతూషాయేలుకు లెమెకు జన్మించాడు. 19 లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్ళాడాడు. వాళ్ళలో ఒకామె పేరు ఆదా, ఇంకొకామె పేరు సిల్లా. 20 ఆదా యాబాలును కన్నది. పశువులు కలిగి గుడారాల్లో కాపురమున్న వారికి యాబాలు ఆదిపురుషుడు. 21 అతని తమ్ముడు యూబాలు. అతడు వేణువు, తంతి వాద్యాలు వాయించేవారికి ఆదిపురుషుడు. 22 సిల్లాకు కూడా సంతానం కలిగింది – తూబాలుకయీను. అతడు అన్ని విధాల పదునుగల ఇత్తడి, ఇనుప పనిముట్లు చేసేవాడు. తూబాలుకయీను తోబుట్టువు నయామా. 23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు:
 
“ఆదా! సిల్లా! నేను చెప్పేది వినండి.
నా భార్యలారా! నా మాటను ఆలకించండి.
నన్ను గాయపరచినందుకు ఓ మనిషిని చంపాను.
అవును, నన్ను దెబ్బకొట్టినందుకు
ఆ యువకుణ్ణి హతమార్చాను.
24 కయీను విషయంలో ప్రతీకారం ఏడంతలుగా కలిగితే,
లెమెకు విషయం డెబ్భై ఏడంతలుగా కలుగుతుంది.”
25 ఆదాముకు తన భార్యవల్ల మరో కొడుకు జన్మించాడు. ఆమె, “కయీను హేబెలును చంపినందుచేత దేవుడు అతనికి బదులుగా నాకు మరో సంతానాన్ని ప్రసాదించాడు” అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టింది. 26 షేతుకు కూడా ఒక కొడుకు జన్మించాడు. అతనికి ఎనోషు అనే పేరు పెట్టాడు. అప్పుడు మనుషులు యెహోవా పేరట ప్రార్థించడం మొదలు పెట్టారు.