3
1 యెహోవాదేవుడు చేసిన అన్ని భూజంతువుల్లో పాము యుక్తి గలది. అది ఆ స్త్రీతో ఇలా అంది: “తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా?”
2 ఆ స్త్రీ పాముతో “తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు. 3 కాని, తోటమధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు – ‘మీరు చావకుండేలా దాన్ని తినకూడదు; దాన్ని తాకకూడదు, సుమా’” అని చెప్పింది.
4 పాము ఆ స్త్రీతో, “మీరు చావనే చావరు. 5 కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి. మీరు మేలు కీడు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు” అంది.
6  ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదనీ, చూడడానికి రమ్యంగా ఉందనీ, జ్ఞానంకోసం కోరతగ్గదనీ ఆ స్త్రీకి కనబడడంతో దాని ఫలం తీసికొని తిన్నది. తనతోపాటు తన భర్తకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
7 వారిద్దరికి మనోనేత్రాలు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని తమకు తెలిసిపోయింది. వాళ్ళు అంజూరు ఆకులను కుట్టి మొలకు చుట్టుకున్నారు.
8 సాయంకాలం యెహోవాదేవుడు తోటలో నడుస్తూ ఉన్న చప్పుడు వారికి వినిపించింది. ఆ మానవుడు, అతని భార్య యెహోవాదేవునికి కనిపించకుండేలా తోట చెట్లలో దాక్కొన్నారు.
9 యెహోవాదేవుడు ఆ మానవుణ్ణి పిలిచి “నీవెక్కడ ఉన్నావు”? అని అడిగాడు.
10 మానవుడు “తోటలో నీ శబ్దం నాకు వినిపించినప్పుడు భయం వేసింది. ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను. గనుక నేను దాక్కున్నాను” అన్నాడు.
11 దేవుడు “నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసినదెవరు? నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా?” అన్నాడు.
12 మానవుడు ఇలా జవాబిచ్చాడు, “నాతోపాటు ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది. నేను తిన్నాను.”
13 యెహోవాదేవుడు ఆ స్త్రీతో “నీవు చేసినదేమిటి?” అన్నాడు. ఆ స్త్రీ “ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది. గనుక తిన్నాను” అంది.
14 యెహోవాదేవుడు ఆ పాముతో అన్నాడు, “నీవు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీకు ఎక్కువ శాపం తగిలింది. నీ బ్రతుకంతా నోట్లో ధూళిపడి కడుపుతో పాకుతూ ఉంటావు. 15 అంతేగాక, నీకూ స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ విరోధభావాన్ని కలిగిస్తాను. ఆయన నీ తలమీద దెబ్బతీస్తాడు. నీవు ఆయన కాలి మడమమీద దెబ్బతీస్తావు.”
16 ఆ స్త్రీతో దేవుడన్నాడు, “నీ ప్రసవ వేదనను నేను తప్పక అధికం చేస్తాను. నీవు బాధతో పిల్లలను కంటావు. నీ భర్తపట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతనికి నీపై అధికారం ఉంటుంది.”
17 ఆ మనిషితో దేవుడు అన్నాడు: “నీవు నీ భార్య మాట విని, నేను నీకాజ్ఞాపించి ‘తినవద్ద’న్న చెట్టు ఫలాన్ని తిన్నావు, గనుక నీకోసం భూమి శాపానికి గురి అయింది. నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు. 18 భూమి ముళ్ళతుప్పలనూ, గచ్చపొదలనూ నీకు మొలిపిస్తుంది. నీవు పొలం పంటను తింటావు. 19 నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది. నిన్ను నేలనుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకూ ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి; మట్టికి తిరిగి పోతావు.”
20 ఆదాము తన భార్యకు “హవ” అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె మానవ జాతికంతటికీ తల్లి. 21 యెహోవాదేవుడు ఆ మనిషికోసం, అతడి భార్యకోసం తోలు బట్టలను చేసి వారికి తొడిగించాడు.
22 యెహోవాదేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో, ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మనవంటివాడయ్యాడు. ఇప్పుడతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకొని, తిని శాశ్వతంగా బ్రతకకూడదు.”
23 అందుచేత యెహోవాదేవుడు అతణ్ణి ఏదెను తోటనుంచి పంపివేసి అతడు ఏ నేలనుంచి తీయబడ్డాడో దాన్ని సాగు చేయడానికి విధించాడు. 24 ఆయన ఆ మనిషిని బయటికి పంపించివేశాడు. జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి కెరూబులనూ అన్ని దిక్కులకూ తిరిగే మంటలాంటి ఖడ్గాన్నీ ఏదెను తోటకు తూర్పుదిక్కున ఉంచాడు.