2
1 ఈ విధంగా ఆకాశాలు, భూమి, వాటికి చెందినవన్నీ పరిపూర్ణం అయ్యాయి. 2 దేవుడు జరిగిస్తూ వచ్చిన తన పని అంతా సంపూర్తి చేసి ఏడో రోజున పని మానుకున్నాడు. 3 దేవుడు ఆ ఏడో రోజును ఆశీర్వాదకరంగా చేసి విశేష దినంగా ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు తాను సృజించి చేసిన తన పని అంతటినీ మానుకొన్నాడు.
4 ఆకాశాలూ, భూమి సృజించబడినప్పుడు ఇలా ఉంది: యెహోవా దేవుడు వాటిని చేసిన దినంలో 5 భూమిని సాగు చేయడానికి ఎవరూ లేరు. దేవుడు భూమిమీద వాన కురిపించలేదు కూడా. భూమిలోనుంచి నీరు పెల్లుబికి భూతలమంతా ముంచుతూ వచ్చేది. 6 కనుక భూమిమీద ఏ మొక్కా లేదు; ఏ చెట్టూ మొలవలేదు. 7 తరువాత యెహోవా దేవుడు నేల మట్టితో మానవుణ్ణి చేసి అతని ముక్కుపుటాల్లో ప్రాణశ్వాస ఊదాడు. ఆ విధంగా మానవుడు సజీవుడయ్యాడు.
8 యెహోవా దేవుడు తూర్పున ఏదెను అనే చోట ఒక తోట వేసి, తాను చేసిన మానవుణ్ణి దానిలో ఉంచాడు.
9 చూడడానికి రమ్యంగా, తినడానికి ఆకర్షణీయంగా ఉన్న అన్ని రకాల ఫలాలిచ్చే చెట్లనూ యెహోవా దేవుడు నేలనుంచి మొలిపించాడు. జీవవృక్షాన్నీ, మేలు కీడు తెలిపే వృక్షాన్ని కూడా ఆ తోట మధ్యలో మొలిపించాడు.
10 ఏదెనునుంచి ఒక నది పారుతూ ఆ తోటకు నీరు అందించింది. అక్కడ ఆ నది చీలిపోయి నాలుగు నదులయింది. 11 మొదటిదాని పేరు పీషోను. అది హవీలా ప్రాంతం అంతా చుట్టి పారుతూ ఉండేది. ఆ దేశంలో బంగారం ఉంది. 12 అక్కడి బంగారం మేలిరకం. అక్కడ శ్రేష్ఠమైన గుగ్గిలం, మిశ్రమవర్ణ రత్నాలు కూడా దొరికేవి. 13 రెండో నది పేరు గీహోను. అది కూషు దేశాన్నంతా చుట్టి పారుతూ ఉండేది. 14 మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు దేశానికి తూర్పుదిక్కుగా ప్రవహిస్తూ ఉండేది. నాలుగో నది యూఫ్రటీసు. 15 మానవుడు ఏదెనులోని తోటను సేద్యం చేస్తూ, భద్రంగా చూచుకోవాలని యెహోవా దేవుడు అతణ్ణి అందులో ఉంచాడు.
16 అంతే గాక, యెహోవాదేవుడు మానవునికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు పండైనా నీవు స్వేచ్ఛగా తినవచ్చు. 17 కాని, మేలు కీడు తెలిపే చెట్టు పండు మాత్రం తినకూడదు. నీవు దాన్ని తినే రోజున తప్పక చస్తావు సుమా.” 18 యెహోవాదేవుడు ఇంకా అన్నాడు: “ఈ మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికోసం సాటియైన సహకారిని చేస్తాను.”
19 యెహోవాదేవుడు ప్రతి విధమైన భూజంతువునూ, గాలిలో ఎగిరే ప్రతి రకమైన పక్షినీ నేలనుంచి రూపొందించి, వాటికి మానవుడు ఏ పేర్లు పెడతాడో చూడడానికి వాటిని అతడి దగ్గరకు తీసుకువచ్చాడు. పశు పక్షి మృగాదుల్లో ప్రతిదానికీ మానవుడు ఏయే పేరు పెట్టాడో దానికా పేరు స్థిరపడింది. 20 మానవుడు అన్ని రకాల పశువులకూ, గాలిలో ఎగిరే పక్షులకూ, అన్ని రకాల భూజంతువులకూ పేర్లు పెట్టాడు గాని మానవునికి తగ్గ సాటియైన సహకారి దొరకలేదు.
21 అప్పుడు యెహోవాదేవుడు మానవునికి గాఢ నిద్రపట్టేలా చేశాడు. అతడు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతడి పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ ఎముక స్థానంలో మాంసం పెట్టాడు. 22 ఆ మానవునిలోనుంచి తీసిన పక్కటెముకతో యెహోవాదేవుడు ఒక స్త్రీని చేసి ఆమెను మానవుని దగ్గరకు తెచ్చాడు.
23 మానవుడు, “ఆమె నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఈమెను తీసినది మనిషిలో నుంచి గనుక ఈమె పేరు ఆడమనిషి” అన్నాడు.
24 అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు. 25 అతడు, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు గాని, వారికి సిగ్గు అనిపించలేదు.