ఆదికాండం (ఆరంభాలు)
1
1 ✽ఆదిలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృజించాడు. 2 అప్పుడు భూతలం శూన్యంగా రూపం లేకుండా✽ ఉంది. జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ✽ నీళ్ళపై చలిస్తూ ఉన్నాడు. 3 అప్పుడు దేవుడు “వెలుగు✽ ఉండాలి” అనగానే వెలుగు వచ్చింది. 4 ✝దేవుడు ఆ వెలుగు చూశాడు. అది బాగుంది. ఆయన ఆ వెలుగును చీకటినుంచి ప్రత్యేకించాడు. 5 ✝ఆ వెలుగును “పగలు”, ఆ చీకటిని “రాత్రి” అన్నాడు దేవుడు. సాయంకాలం అయింది, ఉదయం✽ అయింది – ఒక రోజు✽.6 ✝దేవుడు ఇలా అన్నాడు: “నీళ్ళ మధ్య విశాలం కలగాలి. ఆ విశాలం నీళ్ల నుంచి నీళ్ళను వేరు చేయాలి.” 7 దేవుడు ఆ విశాలాన్ని చేశాడు. ఆ విశాలంక్రింద ఉన్న నీళ్ళనుంచి దానిపై ఉన్న నీళ్ళను వేరుపరచాడు. అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాలాన్ని “ఆకాశం” అన్నాడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది – రెండో రోజు.
9 ✝దేవుడు “ఆకాశం క్రింద ఉన్న నీళ్ళు ఒకే స్థలంలో సమకూడాలి, ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలను “భూమి”, సమకూడిన నీళ్ళను “సముద్రాలు” అన్నాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది. 11 ✽“భూమి మొక్కలను మొలిపించాలి. భూమిమీద విత్తనాలు ఇచ్చే చెట్లూ, వాటి వాటి జాతిప్రకారమే కాయలు కాసే వృక్షాలు ఉండాలి. ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలు ఉండాలి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. 12 భూమి మొక్కలనూ, వాటి వాటి జాతిప్రకారమే విత్తనాలిచ్చే చెట్లనూ వాటి వాటి జాతిప్రకారమే ఫలించే వృక్షాలనూ (ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలున్నవి) మొలిపించింది. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది. 13 సాయంకాలం అయింది, ఉదయం అయింది – మూడో రోజు.
14 ✽ దేవుడు “పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. అవి సూచనలూ కాలాలూ దినాలూ సంవత్సరాలకోసం అలా ఉంటాయి. 15 అవి భూలోకంమీద వెలుగివ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి” అన్నాడు. అప్పుడు అలాగే జరిగింది. 16 దేవుడు రెండు గొప్ప జ్యోతులను చేశాడు. ఆ రెంటిలో పెద్దది పగటిని పాలించడానికీ, చిన్నది రాత్రిని పాలించడానికీ వాటిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూలోకంమీద వెలుగివ్వడానికీ, 18 పగటినీ రాత్రినీ పాలించడానికీ వెలుగును చీకటినుంచి వేరుపరచడానికీ దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది. 19 ✽సాయంకాలం అయింది, ఉదయం అయింది – నాలుగో రోజు.
20 దేవుడు ఇలా అన్నాడు: “ఆ నీళ్ళు జలచరాలతో నిండిపోవాలి. గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి.” 21 బ్రహ్మాండమైన చేపలనూ, ఆ నీళ్ళ నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలనూ వాటి వాటి జాతిప్రకారమే దేవుడు సృజించాడు. అన్ని విధాల పక్షులను కూడా వాటి వాటి జాతిప్రకారమే దేవుడు సృజించాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది. 22 దేవుడు వాటిని ఇలా దీవించాడు: “ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. సముద్రమంతా నింపండి. భూమిమీద పక్షులు అధికం కావాలి.” 23 సాయంకాలం అయింది, ఉదయం అయింది – అయిదో రోజు.
24 ✽“భూమి ప్రాణులను వాటి వాటి జాతిప్రకారమే ఉత్పత్తి చేయాలి; పశువులనూ ప్రాకే ప్రాణులనూ అడవి మృగాలనూ వాటి వాటి జాతిప్రకారమే ఉత్పత్తి చేయాలి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. 25 దేవుడు అడవి మృగాలనూ పశువులనూ నేలమీద తిరిగే ప్రతి విధమైనదాన్నీ, అన్నిటినీ వాటి వాటి జాతిప్రకారమే చేశాడు. దేవుడు అదంతా చూశాడు. అది బాగుంది.
26 ✽దేవుడు ఇలా అన్నాడు, “మనం మన స్వరూపంలో మన పోలికలో మానవుణ్ణి చేద్దాం. వారికి సముద్రంలోని చేపలమీదా గాలిలో ఎగిరే పక్షులమీదా పశువులమీదా భూలోకమంతటిమీదా భూమిపై తిరిగే ప్రతిదానిమీదా అధికారం ఉంటుంది.”
27 ✝అప్పుడు దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి సృజించాడు. స్త్రీగా, పురుషుడుగా వారిని సృజించాడు.
28 ✝దేవుడు వారిని దీవించి✽ వారితో ఇలా అన్నాడు: “మీరు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి. భూలోకమంతటా విస్తరించండి. దాన్ని లోబరుచుకోండి. సముద్రంలోని చేపలమీదా గాలిలో ఎగిరే పక్షులమీదా భూమిపై తిరిగే ప్రతిదానిమీదా పరిపాలన చేయండి.”
29 ✽ దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “ఇదిగో వినండి. భూమి అంతటా ఉన్న విత్తనాలు గల ప్రతి మొక్కనూ విత్తనాలిచ్చే ఫలాలు గల ప్రతి చెట్టునూ మీకిచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి. 30 భూమిమీద ఉన్న అన్ని జంతువులకూ గాలిలో ఎగిరే అన్ని పక్షులకూ భూమిపై తిరిగే అన్ని ప్రాణులకూ పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఇచ్చాను.” అలాగే జరిగింది.
31 ✽ ✽ దేవుడు తాను చేసినదంతా చూశాడు; అది చాలా బాగుంది. సాయంకాలం అయింది, ఉదయం అయింది – ఆరో రోజు.