50
1 యోసేపు తన తండ్రి మీద వాలి అతని ముఖం ముద్దుపెట్టుకొని కన్నీళ్ళు విడిచాడు. 2 తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధపరచాలని తన సేవలో ఉన్న వైద్యులకు ఆదేశించాడు. ఆ వైద్యులు ఇస్రాయేల్ మృతదేహాన్ని అలా చేశారు. 3 ఆ పని పూర్తి చేయడానికి నలభై రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో ఒక మృతదేహాన్ని స్థిరపరచడంలో అంత కాలం పడుతుంది. అతని విషయం ఈజిప్ట్‌వాళ్ళు డెభ్భై రోజులు విలపించారు. 4 అతని విషయం విలపించే రోజులు గడిచాక యోసేపు ఫరో ఇంటివారిని చూచి, “మీరు నన్ను దయ చూస్తూవుంటే నా పక్షంగా చక్రవర్తితో ఇలా మాట్లాడండి: 5 ‘నా తండ్రి నా చేత శపథం చేయిస్తూ చెప్పినదేమిటంటే, నేను చనిపోతున్నాను, కనానుదేశంలో నేను నా కోసం తవ్వించుకొన్న సమాధిలో నీవు నన్ను పాతిపెట్టాలి. కనుక దయచేసి నా తండ్రిని సమాధి చేయడానికి నన్ను వెళ్ళనివ్వండి. ఆ తరువాత నేను తిరిగి వస్తాను’ అని చెప్పండి” అన్నాడు.
6 ఫరో “నీ తండ్రి నీచేత చేయించిన శపథం ప్రకారమే వెళ్ళి, నీ తండ్రిని సమాధి చెయ్యి” అన్నాడు. 7 యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతడే కాదు, ఫరో పరివారమంతా, ఫరో ఇంటి పెద్దలంతా, ఈజిప్ట్ నాయకులంతా, 8 యోసేపు ఇంటివారంతా, తన అన్నదమ్ములూ, తన తండ్రి ఇంటివారంతా అతనితోపాటు వెళ్ళారు. అయితే తమ చిన్నవాళ్ళనూ మందలనూ పశువులనూ మాత్రమే గోషెన్ ప్రదేశంలో విడిచిపెట్టారు. 9 రథాలు, రౌతులు కూడా అతనితోపాటు వెళ్ళారు. ఆ సమూహం చాలా పెద్దది. 10 వారు యొర్దాను నదికి పడమటగా ఉన్న ఆతదు అనే అతడి కళ్ళం దగ్గరికి చేరి, అక్కడ చాలా బిగ్గరగా తీవ్రంగా విలపించారు. యోసేపు తన తండ్రి విషయం ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాడు. 11 ఆ దేశవాసులైన కనానువాళ్ళు ఆతదు కళ్ళందగ్గర జరుగుతున్న ఆ విలాపాన్ని చూచి, “ఈజిప్ట్ వాళ్ళకు ఇది తీవ్రమైన విలాపమే” అన్నారు. అందుచేత ఆ స్థలానికి “ఆబేల్ మిస్రాయిం” అనే పేరు వచ్చింది. అది యొర్దాను నదికి పడమటగా ఉండేది. 12 యాకోబు వారికి ఆజ్ఞ ఇచ్చినట్టే అతని కొడుకులు అతని విషయం చేశారు. 13 కనానుదేశానికి అతని మృతదేహాన్ని తీసుకువెళ్ళారు. అబ్రాహాము తనకు శ్మశాన భూమిగా మమ్రే ఎదుట హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర కొనుక్కొన్న మక్పేలా మైదానంలోని గుహలో పాతిపెట్టారు.
14 యోసేపు తన తండ్రిని సమాధి చేశాక, అతడూ, అతని అన్నదమ్ములూ, అతని తండ్రిని సమాధి చేయడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఈజిప్ట్‌కు వచ్చారు. 15 తమ తండ్రి చనిపోయిన తరువాత యోసేపు అన్నలు, “ఒకవేళ యోసేపు మనల్ని విరోధభావంతో చూచి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేసి తీరుతాడేమో” అని చెప్పుకొన్నారు.
16 కనుక వారు యోసేపుకు ఇలా కబురు పంపారు: “మీ తండ్రి చనిపోయేముందు మాకో ఆజ్ఞ ఇచ్చాడు. 17 ఏమంటే, ‘మీరు యోసేపుతో ఈ విధంగా చెప్పాలి: నీ అన్నలు నీకు కీడు చేశారు నిజమే గానీ ఇప్పుడు వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమించు’. అందుచేత దయచేసి మీ తండ్రియొక్క దేవుని దాసులమైన మా అపరాధాన్ని క్షమించండి.” వారు చెప్పిన మాటలకు యోసేపు ఏడ్చాడు. 18 తరువాత అతని అన్నదమ్ములు వచ్చి, అతని ఎదుట సాష్టాంగపడి “మేము మీ దాసులం” అన్నారు.
19 యోసేపు వారితో “మీకు భయం ఉండకూడదు. నేను దేవుని స్థానంలో లేను గదా. 20 మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు గాని, ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అంటే, చాలామందిని సజీవంగా కాపాడడం దేవుని ఉద్దేశం. ఇది ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది గదా! 21 కనుక మీరు భయం మానండి. నేను మిమ్ములనూ మీ పిల్లలనూ పోషిస్తాను” అన్నాడు. వారిని ఆదరించాడు, వారితో దయగా మాట్లాడాడు.
22 యోసేపు, అతని తండ్రి కుటుంబంవారూ ఈజిప్ట్‌లోనే ఉండిపొయ్యారు. యోసేపు నూట పదేళ్ళు బ్రతికి, 23 ఎఫ్రాయిం సంతానాన్ని మూడో తరంవరకు చూడగలిగాడు. మనష్షే కొడుకు మాకీరుకు సంతానం కలిగినప్పుడు వారిని యోసేపు ఒడిలో ఉంచారు.
24 యోసేపు తన అన్నదమ్ములతో “నేను చనిపోతున్నాను. అయితే దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శించి, ఈ దేశంనుంచి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో శపథపూర్వకంగా ఇస్తానన్న దేశానికి తీసుకువెళ్తాడు” అన్నాడు.
25 యోసేపు “దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శిస్తాడు. మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకువెళ్ళాలి” అంటూ ఇస్రాయేల్ సంతానంచేత ఒక శపథం చేయించుకొన్నాడు.
26 యోసేపు నూట పదేళ్ళు బ్రతికి చనిపొయ్యాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరచి, ఈజిప్ట్‌దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.