యోబు
గ్రంథకర్త
యోబు గ్రంథం ఎవరు రాశారో తెలియదు. ఫలానా అని ఎక్కడా చెప్పలేదు. ఇద్దరు, అంతకన్నా ఎక్కువ గ్రంథకర్తలు ఉండవచ్చు. బైబిలు పుస్తకాలన్నిటిలోకీ ఇది అత్యంత ప్రాచీన గ్రంథం అనుకోవచ్చు. యోబు మంచివాడు, భక్తిపరుడు. భరించరాని విషాద సంఘటనలు అతనికి దాపురించాయి. అతనికి అలాటి ఉపద్రవాలు ఎందుకు వచ్చాయో యోబు, అతని స్నేహితులు తర్కించడానికి ప్రయత్నించారు. ఇందులోని ముఖ్య పాత్రలు యోబు, తేమానీయుడు ఎలిఫజు, షుహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు, బూజీయిడు ఎలీహు.
రచనా కాలం, ప్రదేశం
క్రీ. పూ. 2100 - 1800
ఇందులోని చాలా భాగాలు అటు తరువాతి కాలంలో రాసిన సంగతులను తెలియజేస్తున్నాయి. బబులోను చెర కాలంలో లేక చెర అనంతరం ఈ పుస్తకం రాసి ఉండవచ్చు. ఎలీహు మాట్లాడిన అధ్యాయాలు ఇంకా తరువాతి కాలంలో రాసి ఉండవచ్చు.
స్వీకర్త
ప్రాచీన యూదులు, ప్రస్తుత బైబిలు చదువరులు. ఈజిప్టులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జాతి వారిని ఉద్దేశించి ఈ పుస్తకం రాశారని పండితులు అభిప్రాయం. ఈజిప్టు వారి చేతుల్లో బాధలు అనుభవిస్తున్న జాతికి కొంత ఊరట కలిగించాలని మోషే ఉద్దేశించి ఉండవచ్చు.
ప్రయోజనం
యోబు గ్రంథం మనకి ఈ క్రింద విషయాలు అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది. సైతానుకు ఆర్ధిక, శారీరిక నష్టం కలిగించే శక్తి లేదు. సైతాను చేయలేని విషయాలపై దేవునికి అదుపు ఉంది. లోకంలో ఉన్న బాధలన్నిటికి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం మానవ అవగాహనకు మించినది. దుష్టులకు తగిన ప్రతిదండన లభిస్తుంది. మన ఆత్మను పరిక్షించడానికి, ఉపదేశించడానికి, పవిత్రపరచడానికి దృఢపరచడానికి కొన్నిసార్లు దేవుడు బాధలను అనుమతిస్తాడు.
ముఖ్యాంశం
బాధల ద్వారా దీవెనలు.
విభాగాలు
1. పరిచయం, సాతాను దాడి – 1:1-2:13
2. యోబు తన ముగ్గురు మిత్రులతో తన బాధలను చర్చించడం. – 3:1-31:40
3. ఎలీహు దేవుని మంచితనాన్నివర్ణించడం – 32:1-37:24
4. దేవుడు యోబుకు తన సార్వభౌమిక అధికారాన్ని వెల్లడించడం – 38:1-41:34
5. దేవుడు యోబుకు పూర్వక్షేమ స్థితి కలిగించడం – 42:1-17