3
1 ప్రియ సోదరులారా, ఈ రెండో ఉత్తరం మీకిప్పుడు రాస్తున్నాను. రెండు ఉత్తరాలలో మీకు జ్ఞాపకం చేసి మీ పవిత్ర మనసులను పురికొలుపుతున్నాను. 2 గతంలో పవిత్ర ప్రవక్తలు పలికిన మాటలు, ప్రభువైన రక్షకుని రాయబారులమైన మేమిచ్చిన ఆజ్ఞ మీరు మనసు పెట్టాలని నా ఉద్దేశం.
3 మొట్టమొదట ఇది తెలుసుకోండి – చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించే పరిహాసకులు వస్తారు. 4 “ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయింది? పూర్వీకులు కన్ను మూసినప్పటినుంచి, సృష్టి ఆరంభంనుంచి జరిగినట్టే అంతా జరుగుతూ ఉంది గదా” అని వారు చెపుతారు.
5 అయితే వారు బుద్ధిపూర్వకంగా మరచిపోయే విషయమేమిటంటే, చాలా కాలం క్రిందట దేవుని వాక్కువల్లే ఆకాశం ఉనికిలో ఉంది, భూమి నీళ్ళలోనుంచి నీళ్ళలో స్థిరంగా ఉంది. 6 నీళ్ళవల్ల కూడా అప్పటి లోకం వరదలో మునిగి నాశనమయింది. 7 కాని ఇప్పటి ఆకాశాలనూ భూమినీ అదే వాక్కువల్ల భద్రమై భక్తిలేనివారి తీర్పు, నాశనం జరిగే రోజు వరకు మంటలకోసం ఉంచబడి ఉన్నాయి.
8 అయితే, ప్రియ సోదరులారా, ఈ ఒక విషయం మరచిపోకండి: ప్రభువుకు ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలలాగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజులాగా ఉన్నాయి. 9 ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక. 10 అయితే ప్రభు దినం రాత్రివేళ దొంగ వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఆకాశాలు హోరుమని గతించిపోతాయి; పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి, భూలోకం, దాని మీది పనులు కాలిపోతాయి.
11 ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి గనుక మీరు పవిత్ర ప్రవర్తన, భక్తి విషయంలో ఎలాంటివారై ఉండాలో! 12 దేవుని దినం కోసం ఆశతో ఎదురుచూస్తూ దాని రాకడ శీఘ్రతరం చేస్తూ ఉండాలి. ఆ దినాన ఆకాశాలు మండుతూ లయమైపోతాయి. పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి. 13 అయితే ఆయన వాగ్దానాన్ని బట్టి మనం కొత్త ఆకాశాలకోసం, కొత్త భూమికోసం ఎదురు చూస్తున్నాం. వాటిలో న్యాయం నివాసముంటుంది.
14  ప్రియ స్నేహితులారా, మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక ఆయన దృష్టిలో కళంకం లేనివారై నింద లేని విధంగా, శాంతితో కనబడడానికి శ్రద్ధాసక్తులు వహించండి. 15 మన ప్రభు సహనం రక్షణకోసమే అని భావించండి. ఈ విధంగా మన ప్రియ సోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం మీకు రాశాడు. 16 అతడు తన ఉత్తరాలన్నిటిలో ఈ సంగతులను గురించి చెప్పేవాడు. అయితే వాటిలో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం. ఉపదేశం పొందనివారూ నిలకడలేని వారూ తక్కిన లేఖనాలను వక్రం చేస్తున్నట్టే వీటిని కూడా తమ నాశనానికి వక్రం చేస్తున్నారు.
17 ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు గనుక నీతి నియమం లేనివారి తప్పు చేత తొలగిపోయి మీ స్థిరమైన స్థితి నుంచి పడకుండా జాగ్రత్తగా చూచుకోండి. 18 మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు కృపలో, జ్ఞానంలో పెరుగుతూ ఉండండి. ఆయనకే మహిమ ఇప్పుడూ అనంత కాలమూ ఉంటుంది గాక! తథాస్తు.