1 తిమోతికి లేఖ
1
1 విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడైన తిమోతికి మన రక్షకుడైన దేవుడూ మన ఆశాభావమైన యేసు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. 2 తండ్రి అయిన దేవునినుంచీ మన ప్రభువైన క్రీస్తు యేసునుంచీ నీకు కృప, కరుణ, శాంతి కలుగుతాయి గాక.
3 నేను మాసిదోనియకు బయలుదేరినప్పుడు నీకు ఆలోచన చెప్పిన ప్రకారం ఎఫెసులో ఉండు. సత్యానికి వేరే సిద్ధాంతాలు నేర్పేవారిని అలా చేయకూడదని నీవు ఆజ్ఞాపించాలి. 4 వారు కల్పిత కథలూ అంతూపొంతూ లేని వంశ వృక్షాలూ లక్ష్యపెట్టకూడదని కూడా ఆజ్ఞాపించాలి. అలాంటివి భేదాభిప్రాయాలు పుట్టిస్తాయి గాని విశ్వాసంవల్ల అయిన దేవుని ఏర్పాటేమీ నెరవేర్చవు. 5 ఈ ఆజ్ఞలో గల ఉద్దేశమేమంటే, శుద్ధ హృదయంనుంచీ మంచి అంతర్వాణీ నుంచీ నిష్కపట విశ్వాసం నుంచీ వచ్చే ప్రేమభావమే. 6 కొందరు వీటినుంచి తొలగి పోయి వట్టి ముచ్చటలకు దిగారు. 7 తాము చెప్పేదేమిటో, పెద్ద నిశ్చయతతో పలికే విషయాలేవో వారికే తెలియదు. అయినా వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు కావాలని కోరుతూ ఉన్నారు.
8 దానిని తగిన విధంగా వినియోగిస్తే ధర్మశాస్త్రం మంచిదని మనకు తెలుసు. 9 ధర్మశాస్త్రం ఏర్పాటు న్యాయవంతులకోసం కాదని కూడా తెలుసు. అది ఎవరికోసం అంటే, న్యాయ విరోధులు, తిరుగుబాటుదారులు, భక్తిహీనులు, పాపాత్ములు, అపవిత్రులు, భ్రష్టులు, తండ్రిని గానీ తల్లిని గానీ చంపేవారు, హంతకులు, 10 వ్యభిచారులు, స్వజాతి సంపర్కులు, మనుషులను అపహరించేవారు, అబద్ధికులు, కపట సాక్షులు. 11 దివ్యుడైన దేవుని ఘనమైన శుభవార్త ప్రకారం సరైన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటిదాన్నయినా అనుసరించేవారి కోసం ధర్మశాస్త్రం ఉంది. ఈ శుభవార్త నాకు అప్పగించబడింది.
12 మన ప్రభువైన క్రీస్తు యేసు తన సేవకు నన్ను నియమించి నమ్మకమైనవాడుగా ఎంచాడు, నన్ను బలపరచాడు. అందుచేత ఆయనకు కృతజ్ఞతలు చెపుతూ ఉన్నాను. 13 మునుపు నేను దేవదూషకుణ్ణి, హింసకుణ్ణి, గర్వంగల దౌర్జన్యపరుణ్ణి. అయినా నేను కరుణ పొందాను. ఎందుకంటే చేసినది తెలియక అవిశ్వాసంలో చేశాను. 14 మన ప్రభువు నాపట్ల చూపిన కృప, క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం, ప్రేమతోపాటు ఎంతో సమృద్ధిగా ఉంది.
15 పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మతగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే. 16 అయినా, మొదట నా విషయంలో యేసు క్రీస్తు పరిపూర్ణమైన ఓర్పును ప్రదర్శించేందుకు నన్ను కరుణించాడు. శాశ్వత జీవం కోసం తన మీద నమ్మకం ఉంచబోయే వారికి ఇదంతా ఆదర్శంగా ఉండాలని ఆయన ఉద్దేశం. 17 శాశ్వతుడైన రాజూ ఎన్నడూ మృతి చెందని అగోచరుడూ అయిన దేవునికి ఘనత, మహిమ శాశ్వతంగా ఉంటాయి గాక! తథాస్తు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు.
18 తిమోతి, కుమారుడా, మునుపు నీ గురించి కొన్ని మాటలు దేవునిమూలంగా పలకడం జరిగింది. వాటిని అనుసరించి ఈ ఆదేశం నీకిస్తున్నాను: వాటినిబట్టి నీవు విశ్వాసాన్ని అంటిపెట్టుకొని మంచి అంతర్వాణి కలిగి మంచి పోరాటం సాగించు. 19  మంచి అంతర్వాణిని కొందరు త్రోసివేసి విశ్వాస సత్యాల విషయంలో పగిలిన ఓడలయ్యారు. 20 వారిలో హుమెనైయస్, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ చేయకుండా నేర్చుకొనేందుకు నేను వారిని సైతానుకు అప్పగించాను.