3
1 తుదకు, సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా✽ మా కోసం ప్రార్థన చేయండి✽. 2 ✽మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారినుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. 3 అయినా ప్రభువు నమ్మకమైనవాడు✽. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం✽ నుంచి కాపాడుతాడు. 4 మేము మీకిచ్చిన ఆదేశాల✽ ప్రకారం మీరు చేస్తున్నారనీ ఇక చేస్తూ ఉంటారనీ మీ గురించి ప్రభువుమీద మాకు నమ్మకం✽ ఉంది. 5 ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమ✽లోకి, క్రీస్తు ఓర్పు✽లోకి నడిపిస్తాడు గాక!6 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పేర✽ మేము మీకు ఇచ్చే ఆదేశమేమంటే, అతడు మావల్ల అందుకొన్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమ విరుద్ధంగా✽ చేస్తున్న ప్రతి సోదరునినుంచి వేరై ఉండండి✽. 7 మా ఆదర్శాన్ని ✽అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య క్రమానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. 8 డబ్బివ్వకుండా ఎవరి భోజనమూ తినలేదు. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పని చేశాం. 9 మీ ద్వారా సహాయం పొందడానికి మాకు హక్కు✽ లేదని కాదు గాని మీరు మాలాగా ప్రవర్తించేందుకు మీకు ఆదర్శంగా✽ ఉండాలని మా ఉద్దేశం. 10 మేము మీ దగ్గర ఉన్నప్పుడు కూడా “ఎవడికైనా పని చేయడం ఇష్టం లేకపోతే✽ అతడు తినకూడదు” అని మీకు ఆదేశమిచ్చాం గదా. 11 మీలో కొందరు ఏ పనీ చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ✽, క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వింటున్నాం. 12 అలాంటివారు ప్రశాంతంతో పని చేసుకొంటూ సొంతంగా ఆహారం సంపాదించుకొని తినాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ✽ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
13 ✝సోదరులారా, మీ మట్టుకైతే మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకండి. 14 ✽ఎవడైనా సరే మేము ఈ ఉత్తరంలో రాసిన ఉపదేశానికి లోబడకపోతే అతణ్ణి కనిపెట్టండి, అతడు సిగ్గుపడేలా అతనితో సహవాసం చేయకండి. 15 అయినా అతణ్ణి విరోధిగా ఎంచకుండా, సోదరుడని అతణ్ణి హెచ్చరించండి.
16 శాంతిప్రదాత✽ ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితులలోను మీకు శాంతి✽ అనుగ్రహిస్తాడు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడు గాక! 17 ✽నేను – పౌలును – నా సొంత చేతితో ఈ అభినందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి ఉత్తరంలోనూ ఈ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. నేను ఇలాగే రాస్తాను. 18 ✝మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడైవుంటుంది గాక! తథాస్తు.