6
1 పిల్లలారా! ప్రభువులో✽ మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది న్యాయం. 2 ✽ “మీకు క్షేమం కలిగేలా, భూమిమీద ఎక్కువ కాలం బ్రతికేలా 3 తండ్రినీ తల్లినీ సన్మానించాలి” – వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే.4 ✽తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు గురించిన ఉపదేశంతో, క్రమశిక్షణతో వారిని పెంచండి.
5 దాసులారా✽, క్రీస్తుపట్ల విధేయత చూపినట్టే శరీరరీతిగా మీ యజమానులపట్ల కపటం లేని హృదయంతో, భయంతో, వణకుతో విధేయత చూపండి. 6 ✽మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుట మాత్రమే కాక, క్రీస్తు దాసులై✽ ఉన్న ప్రకారం దేవుని చిత్తాన్ని హృదయపూర్తిగా జరిగించండి. 7 మీ సేవ మనుషులకు చేసినట్టు కాక, ప్రభువుకు చేసినట్టే మంచి మనసుతో చేయండి. 8 బానిసలయినా, స్వతంత్రులైనా ప్రతి ఒక్కరూ చేసిన మంచికి ప్రభువువల్ల ప్రతిఫలం✽ పొందుతారని మీకు తెలుసు.
9 ✽యజమానులారా, మీరు కూడా మీ దాసులపట్ల అలాగే వ్వవహరించండి. వారిని బెదిరించడం మానండి. మీకు యజమాని ఒకడు పరలోకంలో ఉన్నాడనీ ఆయనకు పక్షపాతమేమీ లేదనీ✽ మీకు తెలుసు.
10 తుదకు, నా సోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బలప్రభావాలచేత బలాఢ్యులై ఉండండి✽. 11 అపనింద పిశాచం కుతంత్రాలను✽ ఎదిరిస్తూ గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుడిచ్చే కవచమంతా✽ ధరించుకోండి. 12 ✽ఎందుకంటే, మనం పోరాడుతున్నది రక్త మాంసాలున్నవారితో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ఈ యుగ అంధకారాన్ని ఏలుతున్న నాథులతో, పరమ స్థలాలలో ఉన్న ఆత్మ రూపులైన దుష్టశక్తుల సేనలతో. 13 అందుచేత✽ మీరు దుర్దినం✽లో వారిని ఎదిరిస్తూ, చేయవలసినదంతా సాధించి గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుని కవచమంతా ధరించుకోండి.
14 కనుక స్థిరంగా నిలబడి ఉండండి!✽ మీ నడుముకు సత్యాన్ని దట్టిగా✽ కట్టుకోండి. నీతిన్యాయాలను కవచంగా ఛాతికి✽ ధరించుకోండి. 15 మీ పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత✽ అనే జోడు తొడుక్కోండి. 16 అన్నిటికి పైగా విశ్వాసం డాలు✽ చేతపట్టుకోండి. దానితో ఆ దుర్మార్గుడు ప్రయోగించే అగ్ని బాణాలన్ని ఆర్పివేయగలుగుతారు. 17 పాపవిముక్తి శిరస్త్రాణం✽ ధరించుకోండి. దేవుని ఆత్మ ఖడ్గం✽ చేతపట్టుకోండి – అది దేవుని వాక్కే. 18 ✽అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం✽ విన్నపాలు చేస్తూ ఉండండి.
19 అలాగే నాకోసం✽ కూడా ప్రార్థించండి. నేను శుభవార్త రహస్య సత్యాన్ని✽ ధైర్యంగా✽ తెలియజేయడానికి నోరు తెరిచేలా, నాకు మాటలు లభించేలా, 20 అందులో నేను ప్రకటించవలసిన విధంగా ధైర్యంతో ప్రకటించేలా ప్రార్థించండి. శుభవార్త కోసం నేను సంకెళ్ళపాలయిన ప్రతినిధిని✽.
21 నా పరిస్థితులు, నేను చేసేది మీరు కూడా తెలుసుకొనేలా ప్రియ సోదరుడు తుకికస్✽ అంతా మీకు తెలియజేస్తాడు. అతడు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. 22 మా విషయాలు మీరు తెలుసుకోవాలనీ, అతడు మీ హృదయాలను ఓదార్చాలనీ అతణ్ణి ఈ ఉద్దేశాన్ని బట్టే మీ దగ్గరకి పంపుతున్నాను.