2
1 ఏడో నెల ఇరవై ఒకటో రోజున హగ్గయి ప్రవక్తకు యెహోవానుంచి వచ్చిన వాక్కు ఇది: 2 “నీవు షయల్‌తీయేల్ కొడుకూ యూదా అధిపతీ అయిన జెరుబ్బాబెల్‌తోనూ యెహోజాదాక్ కొడుకూ ప్రముఖ యాజీ అయిన యెహోషువతోనూ మిగతా ప్రజలందరితోనూ ఇలా చెప్పు: 3 పూర్వం ఈ ఆలయానికి ఉన్న వైభవాన్ని చూచినవారు మీలో లేరా? ఇప్పుడిది మీ దృష్టికి ఎలా ఉంది? ఇది చూస్తే ఏమీ లేనట్టే అనిపిస్తుంది గదా! 4 అయితే యెహోవా చెప్పేదేమంటే, జెరుబ్బాబెల్, ధైర్యం తెచ్చుకో! యెహోజాదాక్ కొడుకూ ప్రముఖయాజీ యెహోషువ, ధైర్యం తెచ్చుకో! దేశంలో ఉన్న ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! ఈ పని చేయండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు. 5 మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ఇదే. నా ఆత్మ మీమధ్య ఉన్నాడు గనుక భయపడకండి.
6 “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, ఇంకా కొంత కాలానికి మరోసారి నేను ఆకాశాలనూ భూమినీ సముద్రాన్నీ ఎండిన నేలనూ కదలిస్తాను. 7 అన్ని దేశాలవారినీ వణికిస్తాను. అన్ని దేశాలవారు కోరేది రావడం జరుగుతుంది. నేను ఈ ఆలయాన్ని వైభవ మయంగా చేస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 8  వెండి నాది, బంగారం నాది అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. 9 ఈ ఆలయం వైభవం మునుపటికంటే చివరికి అధికం అవుతుందని సేనలప్రభువు యెహోవా అంటున్నాడు. ఈ స్థలంలో నేను శాంతి ప్రసాదిస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
10 దర్యావేషు పరిపాలించిన రెండో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాలుగో రోజున యెహోవానుంచి వాక్కు హగ్గయి ప్రవక్తకు వచ్చింది 11 “సేనలప్రభువు యెహోవా ఆదేశించేదేమంటే, నీవు ధర్మశాస్త్ర సంబంధమైన ఈ ప్రశ్న యాజులను అడుగు: 12 ఎవడైన ప్రతిష్ఠ చేసిన మాంసం బట్టల చెంగున కట్టుకొనిపోతున్నాడనుకోండి. ఆ చెంగు రొట్టెను గానీ ఎదైన వంటకాన్ని గానీ ద్రాక్షరసాన్ని గానీ నూనెను గానీ మరేదైన తిండిని గానీ తగిలితే ఆ తగిలినది ప్రతిష్ఠితం అవుతుందా?” అందుకు యాజులు “కాదు” అన్నారు.
13 అప్పుడు హగ్గయి ఇలా అడిగాడు: “ఎవరైనా శవాన్ని ముట్టడంవల్ల అశుద్ధుడై ఆ వస్తువులలో ఒకదానిని తాకితే ఆ తాకినది అశుద్ధమవుతుందా?”
అందుకు యాజులు “అది అశుద్ధమవుతుంది” అని జవాబిచ్చారు.
14 వారితో హగ్గయి ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమంటే, ఈ ప్రజ, ఈ జాతి నా దృష్టిలో అలాగే ఉన్నారు. వారు చేస్తూవుండేదంతా, అక్కడ సమర్పిస్తూ ఉండేదంతా అశుద్ధం. 15 ఈ రోజునుంచి మీరు దీన్ని గురించి బాగా ఆలోచించండి యెహోవా ఆలయంలో రాయిమీద రాయి ఉంచేముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి. 16 అప్పుడు ఇరవై తూముల కుప్ప దగ్గరికి పోతే పది తూములు మాత్రమే ఉండేవి, ద్రాక్ష గానుగ తొట్టిలోనుంచి యాభై లీటర్ల రసం తీసుకోవడానికి పోతే ఇరవై లీటర్లు మాత్రమే దొరికేవి. 17 మీ కష్టార్జితమంతటినీ తెగులుతో, బూజుతో, వడగండ్లతో నేను నాశనం చేశాను. అయినా మీరు నావైపుకు తిరగలేదు. ఇది యెహోవా వాక్కు. 18 మీరు బాగా ఆలోచించండి. ఈవేళ తొమ్మిదో నెల ఇరవై నాలుగో రోజు. ఈరోజునుంచి, యెహోవా ఆలయం పునాది వేయబడ్డ ఈరోజు నుంచి మీ పరిస్థితులను గురించి బాగా ఆలోచించండి. 19 గిడ్డంగిలో గింజలు లేవు. ద్రాక్షచెట్లు, అంజూరు చెట్లు, దానిమ్మ చెట్లు, ఆలీవ్ చెట్లు ఇంకా పండలేదు. ఈ రోజునుంచి మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాను.”
20 ఆ నెల ఇరవై నాలుగో రోజున హగ్గయికి యెహోవానుంచి వాక్కు రెండవ సారి వచ్చింది. ఏమంటే, 21 “యూదా అధికారి జెరుబ్బాబెల్‌తో ఇలా చెప్పు: నేను ఆకాశాలను భూమినీ కదలిస్తాను. 22 రాజ్యాల సింహాసనాలను క్రింద పడవేస్తాను. ఇతర జనాల రాజ్యాల బలాన్ని నాశనం చేస్తాను. రథాలనూ రథసారథులనూ క్రింద పడవేస్తాను. గుర్రాలూ రౌతులూ ఒకడి ఖడ్గంచేత ఒకడు కూలుతారు.
23 అయితే సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, షయల్‌తీయల్ కొడుకు జెరుబ్బాబెలూ! నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకొన్నాను గనుక ఆ రోజున నేను నిన్ను తీసుకొని నా ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.