హగ్గయి
1
1 పారసీకుల చక్రవర్తి దర్యావేషు✽ పరిపాలించిన రెండో సంవత్సరంలో ఆరో నెల మొదటిరోజున యెహోవా వాక్కు హగ్గయి ప్రవక్తద్వారా జెరుబ్బాబెల్✽కూ యెహోషువకూ వచ్చింది✽. జెరుబ్బాబెల్ షయల్‌తీయేల్ కొడుకు, యూదా మీద అధికారి. యెహోషువ✽ యెహోజాదాక్ కొడుకు. అతడు ప్రముఖ యాజి✽.2 సేనల ప్రభువు✽ యెహోవా చెప్పేదేమంటే✽, “ఈ ప్రజలు ఇలా అంటున్నారు: యెహోవాకు ఆలయాన్ని మళ్ళీ కట్టడానికి✽ సమయం ఇంకా రాలేదు.” 3 ✽అప్పుడు యెహోవా వాక్కు హగ్గయి ప్రవక్త ద్వారా వచ్చింది: 4 “ఈ ఆలయం పాడైపోయిన స్థితిలో ఉంది. మీరు బాగా కట్టుకున్న ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా?”
5 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “మీ ప్రవర్తన విషయం బాగా ఆలోచించండి✽. 6 ✽మీరు విత్తనాలు వేసినది ఎక్కువ గానీ మీకు పండినది కొంచమే. మీరు తింటారు గానీ ఆకలి తీరడానికి చాలినంత లేదు. త్రాగుతారు గానీ దాహం తీరడానికి చాలినంత లేదు. బట్టలు వేసుకుంటారు గానీ అవి చాలినంత వేడి ఇవ్వడం లేదు. జీతం సంపాదించు కొంటారు గానీ అది రంధ్రాలున్న డబ్బు సంచిలో వేసినట్టుగా ఉంది.”
7 ✽సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీ ప్రవర్తన విషయం బాగా ఆలోచించండి. 8 ఈ ఆలయంవల్ల నాకు సంతోషం, గౌరవం కలిగేలా మీరు పర్వతాలెక్కి కలప తీసుకువచ్చి దాన్ని కట్టండి. ఇది యెహోవా వాక్కు.” 9 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు ‘ఎక్కువ పండుతుంది’ అని ఎదురు చూస్తూ ఉన్నారు గాని పండేది కొంచెమే. మీరు ఇంటికి తెచ్చినదాన్ని కూడా నేను ఊది ఎగరగొట్టి✽వేస్తున్నాను. ఎందుకని? నా ఆలయం పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ఇంటిమీద ఆసక్తితో పని చేస్తూ ఉన్నారు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. 10 ✽అందుచేత, మీకారణంగా, ఆకాశంనుంచి మంచు కురవలేదు, భూమి పండలేదు. 11 నేను పొలాలకూ కొండలకూ అనావృష్టి కలిగించాను. ధాన్యం, ద్రాక్షరసం, నూనె, భూఫలం అనే వాటి విషయంలో, మనుషుల, పశువుల విషయంలో, మీరు చేతులతో చేసిన కష్టం విషయంలో కరవు కలిగించాను.”
12 ✽షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్, యెహోజాదాక్ కొడుకూ ప్రముఖయాజీ అయిన యెహోషువ, మిగిలిన ప్రజలంతా వారి దేవుడు యెహోవా మాట విన్నారు✽. వారి దేవుడు యెహోవా హగ్గయి ప్రవక్తను పంపినందుచేత వారు అతని మాటలకు కూడా లోబడ్డారు. యెహోవాపట్ల వారికి భయభక్తులు✽ కలిగాయి.
13 అప్పుడు యెహోవా పంపినవాడైన✽ హగ్గయి యెహోవా ఇచ్చిన ఈ సందేశం ప్రజకు చెప్పాడు: “యెహోవా చెప్పేదేమంటే, నేను మీకు తోడుగా✽ ఉన్నాను” 14 యెహోవా షయల్‌తీయేల్ కొడుకూ యూదా అధికారీ అయిన జెరుబ్బాబెల్ మనసునూ, యెహోజాదాక్ కొడుకూ ప్రముఖయాజీ అయిన యెహోషువ మనసునూ మిగతావారందరి మనసులనూ పురికొలిపాడు✽. 15 వారు వచ్చి సేనల ప్రభువూ వారి దేవుడూ అయిన యెహోవా ఆలయం పని మొదలుపెట్టారు. ఇది చక్రవర్తి దర్యావేషు పరిపాలించిన రెండో సంవత్సరం ఆరో నెల ఇరవై నాలుగో రోజున జరిగింది.