7
1 నాది ఎంత బాధ! పండ్లకాలం తరువాత పండ్లను ఏరుకొనే వాడిలాంటివాణ్ణి. ద్రాక్ష పండ్ల పరిగె సేకరించే వాడిలాంటివాణ్ణి. ద్రాక్షపండ్ల గెల ఒక్కటి కూడా లేదు, నాకిష్టమైన క్రొత్త అంజూరు పండ్లేమీ లేవు. 2 భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజలో నిజాయితీపరుడు ఎవ్వడూ మిగలలేదు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతీవాడు సాటి మానవుణ్ణి వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. 3 వాళ్ళు రెండు చేతులతోను కీడు చేయడానికి ఆరితేరినవాళ్ళు. పరిపాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకొంటారు. గొప్పవాళ్ళు తమ దురాశలు తెలుపుతారు. వాళ్ళంతా ఒక్క చేయిగా ఉన్నారు. 4 వాళ్ళందరిలో మంచివాళ్ళు ముండ్లచెట్టులాంటివాళ్ళు, అందరిలో నిజాయితీపరులు ముండ్లకంచె కంటే కంటక మయులు. మీ కాపరులు చెప్పిన రోజు, మీరు శిక్షకు గురి అయ్యే రోజు వస్తున్నది. ఇప్పుడే ప్రజలు కలవరపడుతున్నారు. 5 పొరుగువాడిమీద నమ్మకం పెట్టకు. స్నేహితుణ్ణి నమ్ముకోకు. నీ కౌగిట పడుకొనే ఆమె ఎదుట కూడా నీ నోటికి కాపుపెట్టుకో! 6 కొడుకు తండ్రిని తృణీకారంతో చూస్తున్నాడు. కూతురు తల్లిమీదికి, కోడలు అత్తమీదికి లేస్తున్నారు. ఎవరి ఇంటివాళ్ళు వారికి శత్రువులు. 7 నేనైతే యెహోవావైపు చూస్తాను, నన్ను రక్షించే నా దేవుని కోసం ఆశతో ఎదురు చూస్తాను. నా దేవుడు నా ప్రార్థనలు వింటాడు.
8 నా పగవాడా! నామీద అతిశయించకు. నేను క్రింద పడ్డా తిరిగి లేస్తాను. నేను చీకటిలో ఉన్నా, యెహోవా నాకు వెలుగై ఉంటాడు. 9 నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేశాను గనుక ఆయన నాపక్షాన వాదించి న్యాయం తీర్చేవరకూ నేను ఆయన కోపాగ్నికి ఓర్చుకొంటాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. నేను ఆయన న్యాయాన్ని చూస్తాను.
10 నా శత్రువు - “నీ దేవుడు యెహోవా ఎక్కడ?” అని నాతో చెప్పిన ఆమె - ఇలా జరగడం చూచి సిగ్గుపాలవుతుంది. నా కళ్ళెదుటే, త్వరలోనే దానిని వీధిలో ఉన్న బురదలాగా త్రొక్కడం జరుగుతుంది. 11  మీ గోడలు మళ్ళీ కట్టేకాలం వస్తుంది. ఆ రోజులలో మీ సరిహద్దులు విశాలం అవుతాయి. 12 ఆ రోజుల్లో అష్షూరు నుంచీ ఈజిప్ట్ నగరాలనుంచీ మీ దగ్గరికి వస్తారు. ఈజిప్ట్ మొదలుకొని యూఫ్రటీస్ నదివరకున్న ప్రాంతం నుంచి, ఆ సముద్రం మొదలుకొని ఈ సముద్రం వరకున్న ప్రాంతంనుంచి, ఆయా పర్వత ప్రాంతాలనుంచి మీదగ్గరికి వస్తారు. 13 అయితే భూనివాసులు చేసిన క్రియల ఫలితంగా భూమి పాడవుతుంది.
14 దేవా, నీ దండం చేతపట్టుకొని నీ ప్రజకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. వారు కర్మెల్‌కు చెందిన అడవిలో ప్రత్యేకంగా నివసిస్తున్నారు. పూర్వకాలంలోలాగే వారిని బాషాను, గిలాదులలో పోషించబడనియ్యి. 15 “మీరు ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చిన రోజులలోలాగే నేను అద్భుతాలు ప్రజలకు మళ్ళీ చూపిస్తాను.” 16 ఇతర జనాలు అది చూచి తమకు బలం లేకపోవడం కారణంగా సిగ్గుపడతారు. చేయి నోటి మీద ఉంచుతారు. వాళ్ళ చెవులకు చెవుడు వస్తుంది. 17 పాములాగా, నేలమీద ప్రాకే ప్రాణులలాగా వాళ్ళు మట్టి నాకుతారు. తమ కోటల్లోనుంచి వణికిపోతూ వస్తారు. హడలిపోతూ, మన దేవుడు యెహోవావైపుకు తిరుగుతారు. నీకారణంగా భయపడతారు.
18 నీకు సాటి అయిన దేవుడెవడు? నీవు అపరాధాలను క్షమించే దేవుడివి. నీ సొత్తుగా ఉన్న ప్రజలో మిగిలిన వారి అతిక్రమాలను వదిలిపెట్టే దేవుడివి. నీవు సదాకాలం కోపగించవు. కరుణ చూపడంలో నీకు మహదానందం. 19 నీవు మమ్ములను మళ్ళీ కనికరిస్తావు. మా అపరాధాలను అణచివేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు పడవేస్తావు. 20 పూర్వ కాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకూ యాకోబుకూ ప్రమాణం చేసిన విశ్వసనీయత, అనుగ్రహం నీవు చూపుతావు.