ఎజ్రా
1
1 యెహోవా తాను యిర్మీయా✽ ద్వారా పలికిన వాక్కును నెరవేర్చడానికి, పారసీక దేశం చక్రవర్తి అయిన కోరెషు పరిపాలనలో మొదటి సంవత్సరంలో✽ అతడి మనసు✽ను పురికొలిపాడు. తద్వారా పారసీక దేశం చక్రవర్తి కోరెషు రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించి, దానిని వ్రాయించాడు. ఆ ప్రకటన ఇది:2 “పారసీక దేశం చక్రవర్తి కోరెషు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు: పరలోకంలో ఉన్న దేవుడైన✽ యెహోవా లోకంలో ఉన్న అన్ని రాజ్యాలను నా వశం చేశాడు.✽ యూదాలో ఉన్న జెరుసలంలో తనకోసం ఆలయాన్ని కట్టించమని ఆయన నాకు ఆదేశించాడు. 3 మీలో ఆయన ప్రజలుగా ఉన్న వారికి వారి దేవుడు తోడుగా ఉంటాడు గాక! అలాంటివారు యూదాలో ఉన్న జెరుసలంకు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా ఆలయాన్ని కట్టాలి. ఆయనే జెరుసలంలో దేవుడు. 4 ఆయన ప్రజలలో మిగిలినవారు✽ ఎక్కడైతే కాపురముంటున్నారో అక్కడి ప్రజలు జెరుసలంలో ఆలయాన్ని కట్టించడానికి వారికి వెండి బంగారాలనూ ఆస్తిపాస్తులనూ పశువులనూ ఇష్టపూర్వకమైన కానుకలనూ ఇవ్వాలి.”
5 అప్పుడు యూదాగోత్రం పెద్దలూ, బెన్యామీను గోత్రం పెద్దలూ, యాజులూ, లేవీగోత్రికులూ✽ – ఎవరి మనసును దేవుడు పురికొలిపాడో✽ వారందరూ జెరుసలంకు వెళ్ళడానికి, యెహోవా ఆలయాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. 6 ✽వారి పొరుగువాళ్ళంతా ఇష్టపూర్వకమైన కానుకలు గాక, వెండి బంగారాలతో చేసిన వస్తువులనూ, ఆస్తిపాస్తులనూ, పశువులనూ ఇచ్చి వారిని ధైర్యపరచారు. 7 ✝అంతే గాక, నెబుకద్‌నెజరు జెరుసలంనుంచి తీసుకువచ్చి తన దేవుళ్ళ గుడిలో ఉంచిన యెహోవా ఆలయం వస్తువులను కోరెషుచక్రవర్తి బయటికి తెప్పించాడు. 8 పారసీకదేశం చక్రవర్తి కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతుచేత వాటిని బయటికి తెప్పించి, వాటిని లెక్క వేయించి, యూదావారి నాయకుడైన షేష్‌బజ్జరు✽కు ఇప్పించాడు. 9 ఆ వస్తువుల లెక్క ఏమిటంటే, ముప్ఫయి బంగారు పళ్ళేలూ, వెయ్యి వెండి పళ్ళేలూ, ఇరవై తొమ్మిది కత్తులూ, 10 ముప్ఫయి బంగారు గిన్నెలూ, నాలుగు వందల పది వెండితో చేసిన వేరే రకం గిన్నెలూ, వెయ్యి వేరు రకాల పాత్రలూ. 11 బంగారు వస్తువులూ వెండి వస్తువులూ అన్నీ ఐదు వేల నాలుగు వందలు✽. బబులోనులో విదేశీయులుగా ఉన్న ఆ జనం అక్కడనుంచి జెరుసలంకు ప్రయాణం చేసినప్పుడు షేష్‌బజ్జరు ఆ వస్తువులన్నీ తీసుకువచ్చాడు.