24
1 ✝ఇంకోసారి ఇస్రాయేల్ ప్రజల మీద యెహోవాకు కోపం✽ రగులుకొంది. కనుక ఆయన “నీవు వెళ్ళి ఇస్రాయేల్‌వారినీ యూదావారినీ లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా పురికొలిపాడు✽. 2 అందుచేత రాజు తన సైన్యానికి అధిపతిగా ఉన్న యోవాబును పిలిచి ఇలా అన్నాడు: “జనాభాలెక్క ఎంతో నేను తెలుసుకోవాలి✽. దానునుంచి బేర్‌షెబా వరకు✽ ఇస్రాయేల్ గోత్రాల ప్రదేశాలన్నిటిలో నీవు సంచారం చేసి జనసంఖ్య వ్రాయి.”3 ✽అందుకు యోవాబు “నా యజమానుడూ రాజూ అయిన మీరు ఇంకా బతికి ఉండగానే మీ దేవుడు యెహోవా జనసంఖ్యను నూరంతలు వృద్ధి చేస్తాడు గాక. కానీ నా యజమానుడూ రాజూ అయిన నీవు ఇలా చేయాలని ఎందుకు కోరుతున్నావు?” అని రాజుతో అన్నాడు.
4 ✽అయితే రాజాజ్ఞ యోవాబునూ సైన్యాధిపతులనూ బలవంతం చేసింది గనుక ఇస్రాయేల్ జనసంఖ్య వ్రాయడానికి వాళ్ళు రాజు సముఖంనుంచి బయలుదేరారు.
5 వారు యొర్దాను దాటి అక్కడి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా ఉన్న ఆరోయేర్‌లో దిగారు. అప్పుడు వారు గాదు ప్రదేశం గుండా యాజేరుకు వెళ్ళారు. 6 అక్కడనుంచి గిలాదుకు, తతిమ్ హోద్షీ ప్రదేశానికి వెళ్ళారు. తరువాత దానాయానుకు, సీదోనుకు వెళ్ళారు. 7 అక్కడ నుండి కోటలున్న తూరుకు, హివ్వివాళ్ళ పట్టణాలన్నిటికీ కనానువాళ్ళ పట్టణాలన్నిటికీ వెళ్ళారు. యూదా ప్రదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న బేర్‌షెబా వరకు వారు సంచారం చేశారు. 8 వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి జెరుసలంకు చేరారు. 9 యోవాబు జనసంఖ్య వెరసి రాజుకు తెలియజేశాడు. ఇస్రాయేల్‌లో ఖడ్గం దూయగల దృఢగాత్రులు ఎనిమిది లక్షలమంది ఉన్నారు. యూదాలో అయిదు లక్షల మంది ఉన్నారు.
10 జనసంఖ్య వ్రాయించినందుచేత దావీదు అంతర్వాణి తనను గద్దించింది. కనుక అతడు యెహోవాకు ప్రార్థన చేసి “నేనిలా జరిగించడం పెద్ద పాపం✽. చాలా తెలివితక్కువ పని చేశాను. యెహోవా! దయ చూపి నీ దాసుడైన నా దోషాన్ని క్షమించు” అన్నాడు. 11 ప్రొద్దున దావీదు లేచేలోగా దావీదుయొక్క దీర్ఘదర్శి✽ అయిన గాదు✽ ప్రవక్తకు యెహోవానుంచి వాక్కు ఇలా వచ్చింది:
12 ✽ “నీవు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, మూడు విషయాలలో ఒకదానిని ఎన్నుకొనే అవకాశం నీకు ఇస్తున్నాను. నీవు ఏది కోరుకొంటావో అది నేను నీపట్ల జరిగిస్తాను.”
13 కనుక గాదు దావీదు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు: “నీవు నీ దేశం ఏడు సంవత్సరాలు కరవు అనుభవించాలను కొంటావా? నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నీవు వాళ్ళ బారినుంచి మూడు నెలలు పారిపోవాలనుకొంటావా? నీ దేశంలో మూడు రోజులు ఘోర వ్యాధి చెలరేగాలనుకొంటావా? ఆలోచించి నిశ్చయించుకో! నన్ను పంపినవానికి నేను జవాబిచ్చేలా నీ నిర్ణయం నాకు తెలియజెయ్యి.”
14 అందుకు దావీదు “నేను పెద్ద చిక్కులో ఉన్నాను అయితే యెహోవా కరుణాసంపద✽ గలవాడు. ఆయన చేతిలోనే మనం పడాలి గానీ మనుషుల చేతిలో నేను పడకూడదు” అని గాదుతో అన్నాడు.
15 అందుచేత యెహోవా ఇస్రాయేల్‌ప్రజల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఆ ఉదయం నుంచి నియామక కాలం ముగింపువరకు అది జరుగుతూ ఉంది. దానునుంచి బేర్‌షెబావరకు డెబ్భై వేలమంది✽ చనిపోయారు. 16 దేవదూత✽ జెరుసలంను నాశనం చేయడానికి దాని మీద చెయ్యి చాపినప్పుడు, యెహోవా ఆ విపత్తు విషయం పరితపించాడు✽. ఆయన “అంతే చాలు! నీ చెయ్యి వెనక్కు తీయి!” అని ప్రజలలో నాశనం చేస్తూ ఉన్న ఆ దేవదూతకు ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు యెహోవా దూత యెబూసివాడైన అరౌనా కళ్ళందగ్గర ఉన్నాడు. 17 ప్రజలను హతం చేస్తూ ఉన్న దూతను చూచి దావీదు యెహోవాకు ప్రార్థన చేశాడు: “పాపం చేసినది, అక్రమకార్యం జరిగించినది నేనే. ఈ ప్రజలు గొర్రెలలాంటి వాళ్ళు✽. వాళ్ళు ఏమీ చేయలేదు గదా. నన్నూ నా తండ్రి వంశంవాళ్ళనూ శిక్షించు.”
18 ఆ రోజే గాదు✽ దావీదుదగ్గరికి వచ్చి “నీవు వెళ్ళి యెబూసివాడైన✽ అరౌనా కళ్ళంలో యెహోవాకు బలిపీఠం✽ కట్టించు” అని చెప్పాడు.
19 గాదు చేత యెహోవా ఇప్పించిన ఆజ్ఞప్రకారం దావీదు అక్కడికి వెళ్ళాడు. 20 రాజు, అతని పరివారం తనవైపుకు రావడం చూచి అరౌనా బయలుదేరి రాజు ఎదుట సాష్టాంగపడ్డాడు. 21 “నా యజమానుడైన రాజు తన దాసుడైన నా దగ్గరికి రావడమెందుకు?” అని అరౌనా అడిగాడు.
అందుకు దావీదు “నీ దగ్గర ఈ కళ్ళం కొనడానికి వచ్చాను. ప్రజలమీదికి వచ్చిన ఈ విపత్తు నిలిపివేయడానికి✽ ఇక్కడ నేను యెహోవాకు బలిపీఠం కట్టించాలి” అన్నాడు.
22 అరౌనా “నా యజమానీ రాజూ అయిన మీరు చూచి ఏది మీకు ఇష్టమో దానిని తీసుకొని బలి అర్పించండి. ఇదిగో, హోమబలికి ఎడ్లు ఉన్నాయి, కట్టెలుగా నూర్చుకర్ర సామాను, ఎడ్ల కాడి ఉన్నాయి. 23 రాజా! నేను – అరౌనాను – ఇవన్నీ రాజుకు ఇస్తున్నాను” అని దావీదుతో అన్నాడు.
అతడు ఇంకా అన్నాడు “మీ దేవుడు యెహోవా మిమ్మల్ని అంగీకరిస్తాడు గాక!”
24 ✽రాజు “నేను అలా తీసుకోను. నీకు వెల ఇచ్చి వాటిని కొంటాను. వెల ఇవ్వక నాకు కలిగినదానిని నా దేవుడు యెహోవాకు హోమబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పాడు.