23
1 ఇవి దావీదు రచించిన చివరి మాటలు✽. ఇది యెష్షయి కొడుకైన దావీదు పలికిన దేవోక్తి. యాకోబుయొక్క దేవుడు అభిషేకించి✽ హెచ్చించినవాడూ ఇస్రాయేల్ ప్రజల ప్రియ గాయకుడూ✽ ఇలా పలికాడు:2 ✽ “యెహోవా ఆత్మ నా ద్వారా పలికాడు.
ఆయన వాక్కు నా నోట ఉంది.
3 ఇస్రాయేల్ ప్రజల దేవుడు మాట్లాడాడు.
ఇస్రాయేల్‌కు ఉన్న ఆధారశిల✽
నాతో ఇలా అన్నాడు:
‘దేవుడంటే భయభక్తులు✽ కలిగి
మనుషులను న్యాయంతో✽
పరిపాలించేవాడు
4 ప్రొద్దు పొడిచేటప్పుడు కనిపించే
ఉదయ కాంతి✽లాగా ఉంటాడు.
వాన పడి మబ్బులు పోయిన తరువాత,
భూమిలోనుంచి అంకురించిన
లేతగడ్డిని తళుకుమనేలా చేసే
ఉదయ ప్రకాశంలాగా ఉంటాడు.’
5 దేవుని దృష్టిలో నా రాజవంశం
అలాగే ఉంది గదా.
ఆయన నాతో శాశ్వతమైన ఒడంబడిక✽ చేశాడు.
ఆ ఒడంబడిక సర్వ సమగ్రమైనది, సుస్థిరమైనది.
ఆయన మూలంగానే నాకు రక్షణ చేకూరుతుంది.
ఆయన నా విషయమంతా
సఫలమయ్యేలా✽ చేస్తాడు.
6 ✝అయితే దుర్మార్గులు పారవేయబడ్డ
ముండ్లలాగా ఉన్నారు.
ఎవరూ చేతపట్టుకోలేని ముండ్లలాగా ఉన్నారు.
7 ఇనుప పనిముట్టు, ఈటెకోలతో గాని లేకుండా
ఎవరూ ముండ్లను ముట్టరు.
వాటన్నిటినీ ఉన్నచోటనే పూర్తిగా కాల్చడం
జరుగుతుంది.”
8 దావీదు వీరుల✽ పేర్లు ఇవి: తక్‌మోని వంశంవాడైన యోషేబ్‌బెషెతు ముగ్గురు✽ ముఖ్య వీరులలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో ఎనిమిది వందలమందిని తన ఈటెతో చంపాడు. 9 అతడి తరువాత అహోవ వంశంవాడైన దోదో కొడుకు ఎలియాజరు. అతడు ముగ్గురు ముఖ్య వీరులలో ఒకడుగా ఉండి, ఒకప్పుడు ఫిలిష్తీయవాళ్ళు యుద్ధానికి సమకూడి వస్తే అతడు దావీదుతో ఉన్నాడు. వాళ్ళను ధిక్కరించిన తరువాత ఇస్రాయేల్‌వారు వెనక్కు తీశారు. 10 కానీ ఎలియాజరు నిలబడి✽ చెయ్యి తిమ్మిరెక్కి కత్తికి అంటుకొనిపోయేదాకా ఫిలిష్తీయవాళ్ళను హతం చేస్తూ వచ్చాడు. ఆ రోజు యెహోవా ఇస్రాయేల్‌కు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దోపిడీసొమ్ము పట్టుకోవడానికి మాత్రం వారు ఎలియాజరు వెనుక వచ్చారు. 11 ఎలియాజరు తరువాత హరారు గ్రామంవాడైన ఆగే కొడుకు షమ్మా ఉన్నాడు. ఒకసారి ఫిలిష్తీయవాళ్ళు అలచందల పొలంలో సైనికులు గుంపుగా సమకూడినప్పుడు ఇస్రాయేల్‌వారు వాళ్ళ ఎదుట నిలబడలేక పారిపోయారు. 12 ✽అయితే షమ్మా పొలం మధ్యలో నిలుచుండి ఫిలిష్తీయవాళ్ళను దానిలో లేకుండా వెళ్ళగొట్టి హతం చేశాడు. యెహోవా ఇస్రాయేల్‌కు గొప్ప విజయాన్ని సాధించాడు.
13 ఒకసారి కోతకాలంలో ఫిలిష్తీయవాళ్ళ సైనికుల గుంపు రెఫాయిం లోయలో దిగారు. దావీదు అదుల్లాం✽ గుహలో ఉన్నాడు. ముప్ఫయిమంది ముఖ్య వీరులలో ముగ్గురు✽ దావీదు దగ్గరికి వచ్చారు. 14 ✝తన భద్రమైన స్థలంలో దావీదు ఉన్నప్పుడు ఫిలిష్తీయవాళ్ళ సైనికుల శిబిరం బేత్‌లెహేంలో ఉంది. 15 దావీదు నీళ్ళకోసం తహతహలాడుతూ, “బేత్‌లెహేం ద్వారందగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుంటుంది!” అన్నాడు.
16 ✽అప్పుడు ఆ ముగ్గురు వీరులు ఫిలిష్తీయవాళ్ళ బారులగుండా చొరబడి బేత్‌లెహేం ద్వారం దగ్గర ఉన్న బావినీళ్ళు చేది దావీదుదగ్గరికి తీసుకువచ్చారు. అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి యెహోవా సన్నిధానంలో పారబోశాడు.
17 “యెహోవా! ఈ నీళ్ళు త్రాగడం నాకు దూరమవుతుంది గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఈ నీళ్ళు వారి రక్తంతో సమానం” అని ప్రార్థన చేశాడు. ఆ ముగ్గురు వీరులు చేసిన క్రియలు ఇలాంటివే.
18 ✝సెరూయా కొడుకూ యోవాబు తమ్ముడూ అయిన అబీషై ముప్ఫయిమంది వీరులలో ముఖ్యుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడు వందలమందిని హతమార్చాడు. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు. 19 అతడు ఆ ముప్ఫయిమందిలో ఘనత కెక్కినవాడు. అతడు వారికి అధిపతి అయ్యాడు గాని ఆ మొదటి ముగ్గురికి సాటి కాలేదు.
20 ✝కబ్సేల్ ఊరివాడూ యెహోయాదా కొడుకూ అయిన బెనాయా కూడా పరాక్రమశాలి. అతడు సాహసక్రియలు చేసేవాడు. అతడు మోయాబువాళ్ళలో ఇద్దరు మహా శూరులను హతమార్చాడు. మరో సారి చలిమంచు కురుస్తూ ఉన్న రోజున ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. 21 మరొకప్పుడు అతడు బ్రహ్మాండమైన ఈజిప్ట్‌వాణ్ణి చంపాడు. ఆ ఈజిప్ట్‌వాడి చేతిలో ఈటె ఉన్నా, బెనాయా దుడ్డుకర్ర చేతపట్టుకొని వాడిమీదకి పోయాడు. ఈజిప్ట్‌వాడి చేతిలో ఉన్న ఈటెను ఊడలాగి దానితోనే వాణ్ణి చంపాడు. 22 యెహోయాదా కొడుకు బెనాయా చేసిన క్రియలు అలాంటివే. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు. 23 ఆ ముప్ఫయిమందిలో ఘనతకెక్కాడు. కానీ మొదటి ముగ్గురి✽కి సాటి కాలేదు. దావీదు అతణ్ణి తన దేహ రక్షక భటుల మీద అధిపతిగా నియమించాడు.
24 ఆ ముప్ఫయిమందిలో వీరు ఉన్నారు: యోవాబు తోబుట్టువు అశాహేల్✽; బేత్‌లెహేం పురవాసి దోదో కొడుకు ఎల్‌హానాను; 25 హరోదువాడు షమ్మా; హరోదువాడు ఎలీకా; 26 పత్తీవాడు హేలెసు; తెకోవగ్రామంవాడైన ఇక్కేష్ కొడుకు ఈరా; 27 అనాతోతు పురవాసి అబీయెజెరు; హుషా గ్రామంవాడు మోబున్నయి; 28 అహోవ వంశంవాడు సల్మోను; 29 నెటోపాతు గ్రామంవాడైన బయానా కొడుకు హేలెబు; బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియా ఊరివాడైన రీబై కొడుకు ఇత్తయి; 30 పిరాతోను గ్రామంవాడు బెనాయా; గాయుషు వాగుల ప్రదేశంవాడు హిద్దయి; 31 అర్బా ఊరివాడు అబీయల్బోను; బర్‌హుం గ్రామంవాడు అజ్‌మావెతు; 32 షాల్బోను గ్రామంవాడు ఎల్యాబా; యాషేను కొడుకులలో యోనాతాను; 33 హరారు గ్రామంవాడు షమ్మా; హరారు గ్రామంవాడైన షారారు కొడుకు అహీయాం; 34 మాయకా వాడైన అహసబయి కొడుకు ఎలీపేలెట్; గిలో గ్రామంవాడైన అహీతోపెల్ కొడుకు ఏలీయాం✽: 35 కర్మెల్ ఊరివాడు హెస్త్రె; అర్బీ గ్రామంవాడు పారై; 36 సోబా గ్రామంవాడైన నాతాను కొడుకు ఇగాల్; గాదు వంశంవాడు బానీ; 37 అమ్మోను జాతివాడు జెలెకు; బేరోతు ఊరివాడు నహరయి (అతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలను మోసేవాడు); 38 ఇత్రీ వంశంవాడు ఈరా; ఇత్రీ వంశంవాడు గారేబ్; 39 హిత్తి జాతివాడు ఊరియా✽. ఆ వీరుల సంఖ్య మొత్తం ముప్ఫయి ఏడు✽మంది.