యేసు విశ్వాసులు ఏమి నమ్ముతారు?
దేవుడు ఈ విధంగా ఉన్నాడు
తండ్రియైన దేవుడు ఇలా ఉన్నాడు
మార్కు శుభవార్త 10:27
1
యేసు వారివైపు చూస్తూ “మనుషులకు ఇది అసాధ్యం గాని దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
మార్కు శుభవార్త 12:29-30
యేసు అతడికి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఇది: ‘ఇస్రాయేల్ ప్రజలారా, వినండి. ప్రభువు మన దేవుడు, ప్రభువు ఒక్కడే. హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా, బలమంతటితో మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.
లూకా శుభవార్త 1:37
దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.”
లూకా శుభవార్త 6:35-36
మీరైతే మీ పగవారిని ప్రేమతో చూడండి, వారికి మంచి చేయండి, మళ్ళీ కలుగుతుందని ఆశించకుండా అప్పివ్వండి. అప్పుడు మీకు గొప్ప బహుమతి దొరుకుతుంది. మీరు సర్వాతీతుని సంతానమై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేనివారిపట్లా దుర్మార్గులపట్లా దయ చూపుతాడు గదా! కాబట్టి మీ పరమ తండ్రి జాలిచూపేవాడై ఉన్నట్టే మీరూ జాలిచూపేవారై ఉండండి.
యోహాను శుభవార్త 4:23-24
నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. అలాంటి వారు తనను ఆరాధించాలని తండ్రి వారిని వెదకుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి.”
అపొస్తలుల కార్యాలు 14:14-17
ఈ సంగతి విని రాయబారులైన పౌలు బర్నబాలు తమ బట్టలు చింపుకొని గుంపులలోకి చొరబడి బిగ్గరగా ఇలా అన్నారు: “అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. గత కాలాలలో ఆయన అన్ని జాతులవారిని తమ తమ మార్గాలలో నడవనిచ్చాడు. అయినా ఆయన తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎలాగంటే మనకు ఆకాశంనుంచి వానలూ ఫలవంతమైన రుతువులూ ప్రసాదిస్తూ ఆహారంతోనూ ఉల్లాసంతోనూ మన హృదయాలను తృప్తిపరుస్తూ మంచి చేస్తూ వచ్చాడు.”
అపొస్తలుల కార్యాలు 17:22-31
అరేయోపగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. నేను అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది. ‘తెలియబడని దేవునికి’ అని దానిమీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయననే మీకు ప్రకటిస్తున్నాను. జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
“భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. వారు ప్రభువును వెదకాలని – తడవులాడి ఆయనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు. ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మీ కవులలో కొందరు చెప్పినట్టు ‘మనం ఆయన సంతానం.’ మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
రోమా వారికి లేఖ 1:18-23
దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది. ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
రోమా వారికి లేఖ 11:33-36
ఆహా, దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి! ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చిన వాడెవడు? సమస్తమూ ఆయననుంచీ, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
కొరింతువారికి లేఖ 1 8:4-6
అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు), మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
కొరింతువారికి లేఖ 2 1:3
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగుతుంది గాక. ఆయన కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణ అనుగ్రహించే దేవుడు.
తిమోతికి లేఖ 1 1:17
శాశ్వతుడైన రాజూ ఎన్నడూ మృతి చెందని అగోచరుడూ అయిన దేవునికి ఘనత, మహిమ శాశ్వతంగా ఉంటాయి గాక! తథాస్తు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు.
తిమోతికి లేఖ 1 6:15-16
ఏకైక దివ్య పరిపాలకుడైనవాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవ్వరూ సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్థ్యుడు ఆయన మాత్రమే. ఆయనను ఏ మనిషీ చూడలేదు, చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావం ఉంటాయి గాక! తథాస్తు.
హీబ్రూవారికి లేఖ 4:13
సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి సమస్తమూ తేటతెల్లంగా, బట్టబయలుగా కనిపిస్తుంది. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి.
హీబ్రూవారికి లేఖ 10:30-31
“పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా! జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
యాకోబు లేఖ 1:17
ప్రతి మంచి ఈవీ, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరమూ పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త అయిన తండ్రినుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు.
పేతురు లేఖ 1 1:14-17
విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే, “నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.
ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి.
యోహాను లేఖ 1 1:5
ఆయన చెప్పగా విని మేము మీకు ప్రకటించే సందేశమేమంటే, దేవుడు వెలుగు, ఆయనలో చీకటి అంటూ ఏమీ లేదు.
యోహాను లేఖ 1 4:7-12
ప్రియ సోదరులారా, ఒకరినొకరు ప్రేమతో చూచుకొందాం. ఎందుకంటే ప్రేమ దేవునికి చెందేది. ప్రేమతో చూచే ప్రతి ఒక్కరూ దేవునివల్ల జన్మించినవారు, దేవుణ్ణి ఎరిగినవారు. దేవుడు ప్రేమస్వరూపి గనుక ప్రేమతో చూడనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు. ప్రియ సోదరులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు గనుక మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఏ మనిషీ దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. మనం ఒకరినొకరం ప్రేమతో చూస్తూ ఉంటే దేవుడు మనలో ఉంటున్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉంది.
యోహాను లేఖ 1 4:16
దేవునికి మనమీద ఉన్న ప్రేమను మనం తెలుసుకొన్నాం, నమ్ముకొన్నాం. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలో ఉంటున్నవాడు దేవునిలో ఉంటున్నాడు, దేవుడు అతనిలో ఉంటున్నాడు.
యూదా లేఖ 24—25
మీరు తొట్రుపడకుండా మిమ్ములను కాపాడడానికీ తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టడానికీ సామర్థ్యం గల మన ముక్తిప్రదాత, ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి మహిమ, ఘనపూర్ణత, ప్రభుత్వం, అధికారం ఇప్పుడునూ శాశ్వతంగానూ ఉంటాయి గాక! తథాస్తు.
ప్రకటన 4:8-11
నాలుగు ప్రాణులలో ప్రతిదానికీ ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ, రెక్కలక్రింద కూడా, కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు మానక ఇలా అంటూ ఉన్నాయి: “పూర్వముండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అమిత శక్తిగల ప్రభువూ అయిన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు!”
శాశ్వతంగా జీవిస్తూ సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఆ ప్రాణులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎదుట సాగిలపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఈయనను ఆరాధిస్తారు. తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి ఇలా అంటారు:
“ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”
ప్రకటన 15:3-4
వారు దేవుని దాసుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా! అమిత శక్తిగలవాడా! నీ పనులు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. పవిత్రులకు రాజా! నీ త్రోవలు న్యాయమైనవి, యథార్థమైనవి. ప్రభూ! నీవు మాత్రమే పవిత్రుడవు గనుక నీకు ఎవరు భయపడకుండా ఉంటారు? నీ పేరును ఎవరు మహిమపరచకుండా ఉంటారు? నీ తీర్పులు వెల్లడి అయ్యాయి, గనుక జనాలన్నీ వచ్చి నీ సన్నిధిలో ఆరాధిస్తారు” అన్నారు.
దేవుని కుమారుడైన క్రీస్తుయేసు ఇలా ఉన్నాడు
యేసు క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు
మత్తయి శుభవార్త 11:27-30
“నా తండ్రి సమస్తమూ నాకు అప్పచెప్పాడు. తండ్రి తప్ప మరెవరూ కుమారుణ్ణి తెలుసుకోవడం లేదు. కుమారుడూ, తన ఇష్టప్రకారం తండ్రిని ఎవరికి వెల్లడి చేస్తాడో వారూ తప్ప మరెవరూ తండ్రిని తెలుసుకోవడం లేదు.
“భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరంతా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి మీమీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నేను సాధుశీలుణ్ణి, అహంభావం లేనివాణ్ణి, గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే, నా కాడి మృదువైనది, నా భారం తేలికైనది.”
మత్తయి శుభవార్త 16:13-17
సీజరియ ఫిలిప్పీ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకొంటున్నారు?”
వారు “బాప్తిసమిచ్చే యోహానువు అంటారు కొందరు. మరికొందరు ఏలీయావు, మరికొందరు యిర్మీయావు లేదా, ప్రవక్తలలో ఇంకొకడవు అంటారు” అన్నారు.
“అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటూ ఉన్నారు?” అని ఆయన వారినడిగాడు.
“నీవు అభిషిక్తుడవే! సజీవుడైన దేవుని కుమారుడవే!” అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు.
యేసు అతనికిలా జవాబిచ్చాడు: “యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకంటే, ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం, మాంసం కాదు.
లూకా శుభవార్త 1:35
దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది.
యోహాను శుభవార్త 1:1-18
ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడే. ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు.
ఆయనలో జీవం ఉంది. ఈ జీవం మనుషులకు వెలుగు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది గానీ చీకటి దానిని గ్రహించలేదు.
దేవుడు పంపిన మనిషి ఒకడు ఉన్నాడు. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరికీ నమ్మకం కుదరాలని ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి ఒక్కరినీ వెలిగించే వాస్తవమైన వెలుగు. ఆ వెలుగుగా ఉన్న ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయనమూలంగా కలిగిందే. అయినా లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంతదాని దగ్గరికి వచ్చాడు గానీ తన స్వజనం ఆయనను స్వీకరించలేదు. అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు. వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ఛవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.
“వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.
యోహాను ఆయనను గురించి సాక్ష్యం చెపుతూ ఇలా బిగ్గరగా అన్నాడు: “నా తరువాత వచ్చేవాడు నాకు మునుపు ఉన్నవాడు గనుక ఆయన నన్ను మించినవాడని నేను చెప్పినవాడు ఈయనే.”
మేమందరమూ ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందాం. ఎందుకంటే, ధర్మశాస్త్రం మోషేద్వారా ఇవ్వడం జరిగింది; కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగాయి. ఎవరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఒకే ఒక దేవుని కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఆయన దేవుణ్ణి వెల్లడి చేశాడు.
యోహాను శుభవార్త 5:19-29
అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
“ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
యోహాను శుభవార్త 6:35-40
యేసు వారికిలా చెప్పాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు, నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు. అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను.
“తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి త్రోసివేయను. నన్ను పంపినవాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగివచ్చాను గాని నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు. నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
యోహాను శుభవార్త 8:58
యేసు “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, అబ్రాహాము ఉండే ముందే నేను ‘ఉన్నవాడను’” అని వారికి చెప్పాడు.
యోహాను శుభవార్త 11:25-27
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
యోహాను శుభవార్త 14:5-11
అందుకు తోమా “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదే! మార్గం మాకెలా తెలుసు?” అని ఆయననడిగాడు.
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. నేనెవరినో మీరు తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవారే. ఇప్పటినుంచి మీరు ఆయనను తెలుసుకొంటున్నారు. ఆయనను చూశారు.”
ఫిలిప్పు ఆయనతో “ప్రభూ, తండ్రిని మాకు కనపరచు. అది మాకు చాలు” అన్నాడు.
యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పు, నేను మీతో ఇంత కాలం ఉన్నా ఇంకా నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు. ‘తండ్రిని మాకు కనపరచు’ అని నీవు అడుగుతున్నావేమిటి? నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి నాలో ఉన్నాడు. ఇది నీవు నమ్మడం లేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు. నేను తండ్రిలో ఉన్నాననీ తండ్రి నాలో ఉన్నాడనీ అనుకుంటే నన్ను నమ్మండి. లేదా, ఈ పనుల కారణంగానైనా నన్ను నమ్మండి.
యోహాను శుభవార్త 17:1-5
ఆ మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.
యోహాను శుభవార్త 20:26-31
ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు” అన్నాడు.
యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు. కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
అపొస్తలుల కార్యాలు 3:13-16
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు – మన పూర్వీకుల దేవుడు – తన సేవకుడైన యేసును గౌరవించాడు. మీరాయనను పిలాతుకు అప్పగించారు, ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు. పవిత్రుడూ న్యాయవంతుడూ అయినవాణ్ణి వద్దని చెప్పి హంతకుణ్ణి మీకు విడుదల చేయాలని కోరారు. మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం. యేసు పేరుమీద ఉన్న నమ్మకం వల్ల, ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది. ఇతణ్ణి మీరు చూస్తున్నారు. ఇతడెవరో మీకు తెలుసు. యేసుమూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుటా ఇతనికి ఈ పూర్తి ఆరోగ్యాన్ని కలిగించింది.
అపొస్తలుల కార్యాలు 4:10-12
మీరంతా, ఇస్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతువాడైన యేసు క్రీస్తు పేరటే ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు గానీ దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి లేపాడు. ఆయన ఎవరంటే, ‘కట్టేవారైన మీరు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.’
“పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
రోమా వారికి లేఖ 1:3-4
నేను యేసు క్రీస్తుకు దాసుణ్ణి, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందినవాణ్ణి, దేవుని శుభవార్తకోసం ప్రత్యేకించబడ్డవాణ్ణి.
దేవుడు తన కుమారుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు.
కొరింతువారికి లేఖ 1 3:11
వేసిన ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది గాక వేరేది ఎవ్వరూ వేయలేరు.
కొరింతువారికి లేఖ 2 4:4-6
విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గురించిన శుభవార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా అలా చేశాడు. కాబట్టి మేము మమ్ములను ప్రకటించుకోకుండా, ప్రభువైన క్రీస్తు యేసునూ మమ్మల్ని యేసుకోసం మీ దాసులుగానూ ప్రకటిస్తున్నాం. క్రీస్తు ముఖంలో ఉన్న దేవుని మహిమను గురించిన జ్ఞాన కాంతి మనకు ప్రసాదించడానికి, చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమని ఆజ్ఞాపించిన దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు.
కొరింతువారికి లేఖ 2 5:21
మనం ఆయనలో దేవుని నీతిన్యాయాలయ్యేలా దేవుడే ఏ పాపం లేని ఆయనను మనకోసం పాపంగా చేశాడు.
గలతీయవారికి లేఖ 4:4-5
అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విమోచించాలని – మనం దత్త పుత్రులమయ్యేలా – ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.
ఫిలిప్పీవారికి లేఖ 2:5-11
క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరూ కలిగి ఉండండి: ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు. గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకొని సేవకుని స్వరూపం ధరించి మనుషుల పోలికలో జన్మించాడు. మనిషి రూపంతో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకొని మరణం పొందడానికి – సిలువ మరణం పొందడానికి కూడా – విధేయుడయ్యాడు.
ఈ కారణంచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు. దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది, తండ్రి అయిన దేవుని మహిమకోసం ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది.
కొలస్సయివారికి లేఖ 1:15-20
ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వసృష్టికి ప్రముఖుడు. ఎందుకంటే ఆయనవల్ల సృష్టిలో అన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఆకాశాలలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడేవి, కనబడనివి, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా – సమస్తాన్నీ ఆయనద్వారా, ఆయనకోసం సృజించడం జరిగింది. ఆయనే అన్నిటికీ పూర్వమున్నవాడు, ఆయనలోనే అన్నీ ఒక దానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. అంతేకాదు శరీరానికి, అంటే, తన సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనే ప్రతిదానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని ఆయనే ఆది, చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవారందరిలోనూ ప్రముఖుడు. ఎందుకంటే, సంపూర్ణత అంతా ఆయనలో ఉండాలని తండ్రి అయిన దేవుని ఇష్టం. క్రీస్తు సిలువమీద చిందిన రక్తంద్వారా సంధి చేసి అన్నిటినీ తనతో సఖ్యపరచుకోవాలని కూడా తండ్రి ఇష్టం. “అన్నీ” అంటే, భూమిమీద ఉండేవీ, పరలోకంలో ఉండేవీ.
కొలస్సయివారికి లేఖ 2:9-10
క్రీస్తులోనైతే దేవుని సర్వ సంపూర్ణత శరీర రూపంలో నివసిస్తూ ఉంది. సర్వాధికారానికీ ప్రభుత్వానికీ పై అధికారి అయిన క్రీస్తులో మీరు సంపూర్ణులు.
హీబ్రూవారికి లేఖ 1:1-14
పూరాతన కాలంలో దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ చివరి రోజులలోనైతే తన కుమారునిద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడుగా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని సృజించాడు కూడా. ఆ కుమారుడు దేవుని మహిమాతేజస్సు, దేవుని స్వభావ స్వరూపం. ఆయన బలప్రభావాలు గల తన వాక్కుచేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసిన తరువాత ఆయన ఉన్నతస్థానంలో మహా ఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు.
దేవదూతలకంటే ఆయన వారసత్వంగా ఎంత శ్రేష్ఠమైన పేరు పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడయ్యాడు కూడా. దేవుడు దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను.” లేదా, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు.”
అంతే కాదు, ఆయన ఆ ప్రముఖుణ్ణి లోకంలోకి మళ్ళీ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి అన్నాడు. దేవదూతలను గురించి ఆయన ఇలా అంటున్నాడు: “తన దూతలను గాలివంటివారుగా, తన సేవకులను మంటలలాంటివారుగా చేసుకొనేవాడు.” తన కుమారునితో అయితే ఇలా అంటున్నాడు: “దేవా! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నీ రాజదండం న్యాయదండం. నీవు న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు. అందుచేత దేవుడు – నీ దేవుడు – నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించాడు”.
కుమారుణ్ణి గురించి ఇంకా అన్నాడు: “ప్రభూ! ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు. ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే. అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు. అవన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి. పైపంచె లాగా వాటిని మడిచివేస్తావు. అవి మార్చబడుతాయి. గానీ నీవు ఒకే తీరున ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతం అంటూ ఉండదు.”
దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీ శత్రువులను నీ పాదాలక్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.”
దేవదూతలంతా ముక్తి వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపబడి సేవ చేస్తున్న ఆత్మలే గదా?
హీబ్రూవారికి లేఖ 7:26-28
ఇలాంటి ప్రముఖయాజి మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు, ఆకాశాలకంటే ఉన్నతుడైనవాడు. మునుపటి ప్రముఖయాజుల లాగా ఆయన మొదట తన పాపాలకోసం బలులు సమర్పించనక్కరలేదు. తరువాత ప్రజల కోసం రోజు రోజూ బలులు సమర్పించనక్కరలేదు. తనను తాను సమర్పించుకొన్నప్పుడు ఒక్క సారే ఇది చేసి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనతగల మనుషులను యాజులుగా నియమించేది గాని ధర్మశాస్త్రం తరువాత ప్రమాణంతో వచ్చిన మాట దేవుని కుమారుణ్ణి యాజిగా నియమించింది. ఈయన శాశ్వతంగా పరిపూర్ణసిద్ధి పొందినవాడు.
యోహాను లేఖ 1 2:1-2
నా చిన్న పిల్లలారా, మీరు ఎలాంటి పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రిదగ్గర మన తరఫున న్యాయవాది ఒకడు మనకు ఉన్నాడు. ఆయనే న్యాయవంతుడైన యేసు క్రీస్తు. మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు – లోకమంతటికీ ఆయన కరుణాధారమైన బలి.
యోహాను లేఖ 1 5:20
మనం సత్యస్వరూపిని తెలుసుకొనేలా దేవుని కుమారుడు వచ్చాడనీ మనకు వివేచన ఇచ్చాడనీ కూడా తెలుసు. మనం ఆ సత్యస్వరూపిలో ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవమూ.
ప్రకటన 1:12-18
నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడడానికి అటువైపు మళ్ళుకొన్నాను. మళ్ళుకొన్నప్పుడు ఏడు బంగారు దీప స్తంభాలు చూశాను. దీపస్తంభాల మధ్య మానవ పుత్రుడిలాంటి వ్యక్తి కనిపించాడు. ఆయన తొడుక్కొన్న నిలువుటంగీ పాదాలవరకు ఉంది. ఆయన ఛాతీ మీద బంగారు దట్టి కట్టి ఉంది. ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలాగా, మంచంత తెల్లగా ఉన్నాయి. ఆయన కండ్లు మంటల్లాంటివి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ మెరుస్తున్న కంచులాగా ఉన్నాయి. ఆయన స్వరం అనేక జల ప్రవాహాల ధ్వనిలాంటిది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఆయనకున్నాయి. ఆయన నోట్లోనుంచి పదునైన రెండంచుల ఖడ్గం వస్తున్నది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం లాంటిది.
ఆయనను చూడగానే చచ్చినవానిలాగా నేను ఆయన పాదాల దగ్గర పడ్డాను. నామీద కుడి చేయి ఉంచి ఆయన నాతో ఇలా అన్నాడు: “భయపడకు, నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను సజీవుణ్ణి. చనిపోయాను గాని చూడు, యుగయుగాలకూ జీవిస్తున్నాను. తథాస్తు. మరణ పాతాళాలకు తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
ప్రకటన 19:11-16
అప్పుడు పరలోకం తెరచి ఉండడం చూశాను. వెంటనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తి పేరు “నమ్మకమైనవాడు, సత్యవంతుడు.” ఆయన న్యాయంతో తీర్పు తీరుస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు మంటలలాంటివి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. రాసి ఉన్న పేరు ఒకటి ఆయనకు ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు.
ఆయన తొడుక్కొన్న వస్త్రం రక్తంలో ముంచినది. ఆయనకు పెట్టిన పేరు “దేవుని వాక్కు.”
ఆయన వెంట పరలోక సైన్యాలు తెల్లని గుర్రాలమీద వస్తున్నాయి. వారు తొడుక్కొన్నవి శుభ్రమైన సున్నితమైన తెల్లని దుస్తులు.
జనాలను కొట్టడానికి ఆయన నోటనుంచి వాడిగల ఖడ్గం బయలువెడలుతూ ఉంది. ఆయన ఇనుప దండంతో జనాలను పరిపాలిస్తాడు. ఆయన అమిత శక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత ద్రాక్షగానుగ తొట్టి తొక్కుతున్నాడు. ఆయన వస్త్రం మీదా ఆయన తొడమీదా పేరు రాసి ఉంది: “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు”.
దేవుని కుమారుడు మనిషిగా జన్మించాడు
యోహాను శుభవార్త 1:14
“వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.
లూకా శుభవార్త 1:26-38
ఆమెకు ఆరో నెల అయినప్పుడు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను గలలీలో నజరేతు అనే గ్రామానికి, ఒక కన్య దగ్గరకు పంపాడు. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశికుడు. ఆ కన్య పేరు మరియ. దేవదూత లోపలికి వచ్చి “శుభం! నీవు దయ పొందినదానివి! ప్రభువు నీకు తోడై ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు” అన్నాడు.
అయితే ఆమె ఆయనను చూచినప్పుడు ఆ మాటలకు చాలా కంగారుపడి ఈ అభివందనం ఏమిటో అని తలపోసింది.
అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకు. దేవుని దయ నీకు లభించింది. ఇదిగో విను. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు. ఆయన గొప్పవాడై ఉంటాడు. ఆయనను సర్వాతీతుని కుమారుడు అనడం జరుగుతుంది. ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు.”
దేవదూతను మరియ “నేను ఏ పురుషుణ్ణి ఎరగను – ఇదెలా జరుగుతుంది?” అని అడిగింది.
దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది. ఇదిగో విను. మీ చుట్టం ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భంతో ఉంది, కొడుకును కనబోతుంది. గొడ్రాలనబడ్డ ఆమెకు ఇది ఆరో నెల. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.”
అందుకు మరియ “ఇదిగో ప్రభు చరణదాసిని. మీ మాట ప్రకారమే నాపట్ల జరగనివ్వండి” అంది. అప్పుడు దేవదూత ఆమె దగ్గరనుంచి వెళ్ళిపోయాడు.
మత్తయి శుభవార్త 1:18-25
ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ: ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది. ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు, గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకొన్నాడు. అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే, ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు: “యోసేపు! దావీదు కుమారా! మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది. ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాలనుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి.”
ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది: “ఇదిగో వినండి, ఒక కన్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ‘ఇమ్మానుయేల్’ అని నామకరణం చేస్తారు.” ఇమ్మానుయేల్‌ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు. అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు.
లూకా శుభవార్త 2:1-20
ఆ రోజుల్లో లోకమంతటా జనాభాలెక్కలు రాయాలని సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు. సిరియా దేశానికి కురేనియన్ అధిపతి అయి ఉన్న కాలంలో జనాభాలెక్కలు రాయడం ఇదే మొదటి సారి. అందరూ ఆ లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఎవరి గ్రామాలకు వారు వెళ్ళిపోయారు.
యోసేపు దావీదు వంశానికీ గోత్రానికీ చెందినవాడు గనుక గలలీలోని నజరేతు గ్రామంనుంచి యూదయలో బేత్‌లెహేం అనే దావీదు గ్రామానికి మరియతోపాటు పేర్లు రాయించుకోవడానికి అతడు వెళ్ళాడు. మరియ అతనికి ప్రధానం చేయబడ్డ భార్య. ఆమె గర్భవతి. వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు నెలలు నిండి కనే సమయం వచ్చింది. ఆమె తొలిచూలు కుమారుణ్ణి కన్నది. ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం లేదు.
ఆ ప్రాంతంలో గొర్రెల కాపరులు కొందరు పొలాల్లో ఉంటూ రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ఉన్నట్టుండి ప్రభు దేవదూత వారి ఎదుటే నిలిచాడు, ప్రభు మహిమాప్రకాశం వారి చుట్టూ మెరిసింది. వారు అధికంగా హడలిపోయారు.
అయితే దేవదూత అన్నాడు, “భయపడకండి! ఇదిగో వినండి, ప్రజలందరికోసమూ మహానందకరమైన శుభవార్త మీకు తెచ్చాను. ఈ రోజే దావీదు గ్రామంలో ముక్తిప్రదాత మీకోసం జన్మించాడు. ఈయన ప్రభువు, అభిషిక్తుడు. మీకు ఇదే ఆనవాలు: ఆ శిశువుకు పొత్తిగుడ్డలు చుట్టి ఉండడం, పశువుల తొట్టిలో ఆయన పడుకొని ఉండడం మీరు కనుగొంటారు.”
హఠాత్తుగా పరలోక సేన సమూహం ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి స్తుతిస్తూ “సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ! భూమిమీద శాంతి! మనుషులపట్ల మంచి సంకల్పం!” అన్నారు.
దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కాపరులు “జరిగినది ప్రభువు మనకు తెలిపాడు గదా. రండ్రా! బేత్‌లెహేం వెళ్ళి చూద్దాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
వారు త్వరగా వెళ్ళి మరియనూ యోసేపునూ తొట్టిలో పడుకొని ఉన్న శిశువునూ చూశారు. వారు చూచిన తరువాత ఆ శిశువును గురించి తమతో చెప్పబడినదంతా తెలియజేశారు. కాపరులు తమతో చెప్పినవి విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.
అయితే మరియ తన హృదయంలో ఈ మాటలన్నీ భద్రం చేసుకొని తలపోసుకొంటూ ఉంది. గొర్రెల కాపరులు చూచిందీ విన్నదంతా తమతో చెప్పబడినట్టే ఉంది గనుక ఆ సంగతులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయారు.
మత్తయి శుభవార్త 2:1-23
హేరోదురాజు కాలంలో యూదయలో ఉన్న బేత్‌లెహేంలో యేసు జన్మించాడు. ఆ తరువాత జ్ఞానులు కొందరు తూర్పు దిక్కునుంచి జెరుసలంకు వచ్చి ఇలా అన్నారు: “యూదులకు రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూశాం, ఆయనను ఆరాధించడానికి వచ్చాం.”
ఇది విని హేరోదురాజు అతడితోపాటు జెరుసలం వాళ్ళంతా కంగారుపడ్డారు. అతడు ప్రజల ప్రధాన యాజులనూ ధర్మశాస్త్ర పండితులనూ అందరినీ సమకూర్చి “అభిషిక్తుడు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.
వారు అతనికి ఇలా జవాబిచ్చారు: “యూదయలో ఉన్న బేత్‌లెహేంలో. ప్రవక్త రాసినదేమిటంటే, యూదాదేశంలోని బేత్‌లెహేం! యూదా పరిపాలకులలో నీవు దేనికీ తీసిపోవు. ఎందుకంటే నీలోనుంచే నా ప్రజలైన ఇస్రాయేల్‌కు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడు.”
అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారిమూలంగా తెలుసుకొన్నాడు. తరువాత వారిని బేత్‌లెహేంకు పంపిస్తూ “ఆ పిల్లవాడికోసం బాగా వెదకండి. నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించేలా మీరు ఆయనను కనుగొన్నాక నాకు వచ్చి చెప్పండి” అన్నాడు.
రాజు చెప్పినది విని వారు బయలుదేరారు. తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలానికి పైగా నిలిచింది. ఆ నక్షత్రం చూచి వారు అత్యధికంగా సంతోషించారు. ఇంట్లోకి వెళ్ళి శిశువునూ ఆయన తల్లి మరియనూ చూశారు, సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. తరువాత నిధుల పెట్టెలు విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా అర్పించారు. హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక విని వారు వేరే దారిన పడి స్వదేశానికి వెళ్ళిపోయారు.
వారు వెళ్ళిన తరువాత ప్రభు దేవదూత ఒకడు యోసేపుకు కలలో కనబడి ఇలా అన్నాడు: “హేరోదు ఈ శిశువును చంపడానికి అంతటా గాలిస్తాడు. లేచి శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు పారిపో. నేను మళ్ళీ నీకు చెప్పేంతవరకు అక్కడే ఉండు.”
కనుక యోసేపు లేచి రాత్రికి రాత్రే శిశువునూ ఆయన తల్లినీ తీసుకొని ఈజిప్ట్‌కు తరలివెళ్ళాడు. హేరోదు చనిపోయేవరకు అక్కడే ఉండిపోయాడు. “ఈజిప్ట్‌నుంచి నా కుమారుణ్ణి పిలిచాను” అని మునుపు ప్రభువు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు. ఈ మాట నెరవేరేందుకే ఇది జరిగింది.
ఆ జ్ఞానులు తనను నవ్వులపాలు చేశారని గ్రహించి హేరోదు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు. అతడు మనుషులను పంపి, జ్ఞానులవల్ల తెలుసుకొన్న కాలం ప్రకారం బేత్‌లెహేంలోనూ దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్ళు అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు. యిర్మీయాప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆ విధంగా నెరవేరింది – “రమాలో ఒక స్వరం, విలాపం, ఏడుపు, మహా రోదనం వినబడుతున్నాయి. రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉంది.”
హేరోదు మృతి చెందాక ప్రభు దేవదూత ఒకడు ఈజిప్ట్‌లో కాపురమున్న యోసేపుకు కలలో కనిపించి అన్నాడు, “ఈ పిల్లవాడి ప్రాణం తీయాలని చూచేవాళ్ళు మరణించారు, గనుక లేచి పిల్లవాణ్ణీ ఆయన తల్లినీ తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు.”
అలాగే అతడు లేచి శిశువునూ ఆయన తల్లినీ ఇస్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళాడు. అయితే అర్కిలావస్ అతడి తండ్రి హేరోదు స్థానంలో యూదయను పరిపాలిస్తున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి జంకాడు. కలద్వారా దేవుని హెచ్చరిక పొంది గలలీ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. నజరేతు అనే గ్రామం చేరి అక్కడ నివాసమున్నాడు. యేసును నజరేయుడంటారు అని ప్రవక్తల మూలంగా వచ్చిన మాట నెరవేరేందుకు ఈ విధంగా జరిగింది.
గలతీయవారికి లేఖ 4:4-5
అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విమోచించాలని – మనం దత్త పుత్రులమయ్యేలా – ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.
ఫిలిప్పీవారికి లేఖ 2:6-7
ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు. గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకొని సేవకుని స్వరూపం ధరించి మనుషుల పోలికలో జన్మించాడు.
హీబ్రూవారికి లేఖ 2:14-18
ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్నకారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణ శక్తి గలవాణ్ణి, అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలనీ మరణ భయంచేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైనవారిని విడిపించాలనీ అందులో ఆయన ఉద్దేశం. ఆయన చేపట్టినది దేవదూతలను కాదు గాని అబ్రాహాము సంతానాన్నే.
అందుచేత అన్నిట్లో ఆయనను తన సోదరుల లాంటివాణ్ణిగా చేయవలసివచ్చింది. ఎందుకని? ఆయన దేవుని విషయాలలో జాలి గల నమ్మకమైన ప్రముఖయాజి అయి ప్రజల పాపాలను గురించి తనను బలిగా సమర్పించి దేవుని కోపాన్ని తొలగించవలసివచ్చింది. ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.
యేసు ప్రజలకు బోధించాడు మరియు రోగులను బాగుచేశాడు
మత్తయి శుభవార్త 4:23-25
యేసు గలలీ ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ, వారి సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ, రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగుచేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రోగులందరినీ నానా విధాల వ్యాధులచేత యాతనలచేత పీడితులైన వారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు. గలలీ, దెకపొలి, జెరుసలం, యూదయ, యొర్దానుకు అవతలి ప్రదేశం – ఈ స్థలాలనుంచి పెద్ద జన సమూహాలు ఆయన వెంటవెళ్ళారు.
మత్తయి శుభవార్త 7:28-29
యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు.
మత్తయి శుభవార్త 9:35-36
యేసు అన్ని పట్టణాలకూ గ్రామాలకూ వెళ్తూ, వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలలో అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేస్తూ ఉన్నాడు. జన సమూహాలను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే, వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదరిపోయి ఉన్నారు.
మత్తయి శుభవార్త 11:1-6
యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తరువాత, వారి ఊళ్ళలో ఉపదేశించడానికి, ప్రకటించడానికి అక్కడనుంచి వెళ్ళాడు.
క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు. అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు: “రావలసినవాడవు నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా?”
యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు వస్తూ ఉంది, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధమౌతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారిని సజీవంగా లేపడం జరుగుతూ ఉంది. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది. నా విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యజీవి.”
లూకా శుభవార్త 4:14-44
అప్పుడు యేసు దేవుని ఆత్మ బలప్రభావాలతో గలలీకి తిరిగి వెళ్ళాడు. ఆయనను గురించిన కబురు ఆ ప్రాంతమంతటా ప్రాకిపోయింది. ఆయన వారి సమాజ కేంద్రాలలో ఉపదేశమిచ్చాడు. అందరూ ఆయనను కీర్తించారు.
అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు. యెషయాప్రవక్త గ్రంథం ఆయనకు వారందించారు. ఆయన గ్రంథం భాగాన్ని విప్పి ఈ మాటలు వ్రాసి ఉన్న స్థలాన్ని చూశాడు: “ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు శుభవార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. గుండె పగిలినవారిని బాగు చేయడానికీ, ఖైదీలకు విడుదల, గుడ్డివారికి చూపు కలుగుతుందని ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు. బాధితులను విడిపించడానికీ ప్రభు అనుగ్రహ సంవత్సరం చాటించడానికీ నన్ను పంపాడు.”
ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ కేంద్రంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూస్తూ ఉన్నారు. అప్పుడాయన వారితో “ఈ రోజే మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నాడు.
అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం చెప్పుకొన్నారు, ఆయన నోటనుంచి వెలువడ్డ దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కుమారుడు గదూ?” అని చెప్పుకొన్నారు.
వారితో ఆయన అన్నాడు “మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్‌నహూంలో ఏ కార్యకలాపాలు చేశావని మేము విన్నామో అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు.”
ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా అంటున్నాను – ఏ ప్రవక్తనూ తన స్వస్థలం స్వీకరించదు. సత్యమే మీతో చెపుతున్నాను. ఏలీయాప్రవక్త రోజుల్లో ఇస్రాయేల్‌లో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. అయినా, మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరవు వచ్చినప్పుడు వారిలో ఎవరి దగ్గరకూ ఏలీయా పంపబడలేదు. అతణ్ణి దేవుడు పంపినది సీదోను ప్రాంతంలోని సారెపతులో ఉన్న విధవరాలి దగ్గరికే. ఎలీషాప్రవక్త కాలంలో ఇస్రాయేల్‌లో అనేకమంది కుష్ఠురోగులు ఉన్నారు గాని వారిలో ఎవరూ స్వస్థత పొందలేదు. సిరియా దేశస్థుడైన నయమాను ఒక్కడే స్వస్థత పొందాడు.
ఈ సంగతులు విని సమాజకేంద్రంలో ఉన్న వారంతా ఆగ్రహంతో నిండిపోయారు. వారు లేచి నిలబడి ఆయనను గ్రామం బయటికి త్రోసుకువెళ్ళారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలంనుంచి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని దాని అంచుకు తీసుకు పోయారు. అయితే ఆయన వారి మధ్యనుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు.
అప్పుడాయన కపెర్‌నహూం వెళ్ళాడు. అది గలలీలో ఒక పట్టణం. విశ్రాంతి దినాల్లో ఆయన ప్రజలకు ఉపదేశమిచ్చాడు. ఆయన ఉపదేశానికి వారెంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ఆయన ఉపదేశం అధికారంతో ఉంది. అప్పుడా సమాజ కేంద్రంలో మలిన దయ్యం ఆత్మ పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు గొంతెత్తి ఇలా అరిచాడు: “మమ్మల్ని విడిచిపెట్టు నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!”
యేసు ఆ దయ్యాన్ని మందలిస్తూ “ఊరుకో! అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు. అప్పుడు దయ్యం ఆ మనిషిని వారిమధ్య పడద్రోసినా అతడికి హాని ఏమీ చేయకుండా అతడిలోనుంచి బయటికి వచ్చింది.
అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. “ఏమిటీ ఉపదేశం! ఇతడు మలిన పిశాచాలకు అధికారంతో బలప్రభావాలతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో బయటికి వస్తున్నాయి!” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అప్పుడు ఆయనను గురించి కబుర్లు ఆ ప్రాంతం చుట్టుప్రక్కల అంతటా వ్యాపించాయి.
ఆయన లేచి నిలబడి సమాజకేంద్రంనుంచి వెళ్ళి సీమోను ఇంట్లో ప్రవేశించాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమె విషయం వారాయనను వేడుకొన్నారు. ఆయన ఆమె దగ్గర నిలిచి జ్వరాన్ని మందలించగా అది ఆమె నుంచి పోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు అందరు ఆయా రకాల రోగాలతో ఉన్న తమ వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. వారిలో ప్రతి ఒక్కరిమీదా ఆయన చేతులుంచి వారిని బాగు చేశాడు. అనేకులలోనుంచి దయ్యాలు బయటికి వస్తూ “నీవు అభిషిక్తుడివి! దేవుని కుమారుడివి!” అని కేక పెట్టాయి. ఆయన అభిషిక్తుడు అని దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి నిర్జన స్థలానికి వెళ్ళాడు. జన సమూహం ఆయనను వెదకుతూ ఆయన దగ్గరకు చేరి తమను విడిచివెళ్ళకుండా ఆయనను ఆపివేయబోయారు. కానీ ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర గ్రామాలలో కూడా నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు నన్ను పంపినది దీని కోసం.”
ఆయన గలలీ సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ వచ్చాడు.
అపొస్తలుల కార్యాలు 10:36-38
“యేసు క్రీస్తు సమస్తానికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి శుభవార్త బోధిస్తూ ఇస్రాయేల్‌ప్రజలకు సందేశం పంపాడు. ఆ సందేశం మీకు తెలుసు. యోహాను బోధించిన బాప్తిసం తరువాత గలలీలో ఆరంభమై యూదయలో అంతటా ఆ సందేశం ప్రకటించడం జరిగింది. అంటే, దేవుడు నజరేతువాడైన యేసును పవిత్రాత్మతో బలప్రభావాలతో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడైవున్నాడు గనుక ఆయన మేలు చేస్తూ, అపనింద పిశాచం పీడించిన వారందరిని బాగు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు.
యోహాను శుభవార్త 20:30-31
యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు. కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు
మత్తయి శుభవార్త 8:1-4
ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు.
వెంటనే కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు” అన్నాడు. యేసు చేయి చాచి అతణ్ణి తాకి, “నాకిష్టమే. శుద్ధుడవు కమ్ము!” అన్నాడు. తక్షణమే అతని కుష్ఠు శుద్ధమైంది. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే విధించిన కానుక అర్పించు.”
మత్తయి శుభవార్త 8:5-13
యేసు కపెర్‌నహూంలో ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయనదగ్గరకు వచ్చాడు, “ప్రభూ, నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. తీవ్రంగా బాధపడుతున్నాడు” అంటూ ఆయనను బతిమాలుకొన్నాడు.
“నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనితో అన్నాడు.
అయితే ఆ శతాధిపతి ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీరు మాట మాత్రం అనండి, అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయం అవుతుంది. నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఎవణ్ణయినా ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఇది చేయి’ అంటే చేస్తాడు.”
ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు, తన వెంట వస్తున్నవారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇస్రాయేల్ ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు. తూర్పునుంచీ పడమరనుంచీ చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతోపాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెపుతున్నాను. కానీ ఆ రాజ్య సంబంధులను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.” అప్పుడు శతాధిపతితో యేసు అన్నాడు, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది.” అదే వేళకు అతని దాసునికి పూర్తిగా నయం అయింది.
మత్తయి శుభవార్త 8:14-15
తరువాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూశాడు. ఆయన ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం పోయింది. ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
మత్తయి శుభవార్త 8:23-27
అప్పుడు ఆయన పడవ ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. అకస్మాత్తుగా సరస్సుమీద పెద్ద తుఫాను చెలరేగసాగింది. అలలు ఆ పడవమీదికి ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు దగ్గరగా వెళ్ళి ఆయనను మేల్కొలిపి “స్వామీ! నశించిపోతున్నాం! మమ్మల్ని రక్షించు!” అన్నారు.
అందుకు ఆయన “అల్ప విశ్వాసం గలవారలారా, మీరెందుకు భయపడుతున్నారు?” అన్నాడు. అప్పుడాయన లేచి, గాలులను సరస్సునూ మందలించాడు. అంతా ప్రశాంతమైపోయింది.
ఆ మనుషులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఈయన ఎలాంటివాడో గాని గాలులు, సరస్సు కూడా ఈయనకు లోబడు తున్నాయే!” అని చెప్పుకొన్నారు.
మత్తయి శుభవార్త 8:28-33
ఆయన అవతలి ఒడ్డున ఉన్న గెర్గెసెనువారి ప్రదేశం చేరుకొన్నప్పుడు దయ్యాలు పట్టిన పురుషులు ఇద్దరు సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మహా భయంకరులు కావడంచేత ఆ దారిన ఎవరూ వెళ్ళలేకపోయేవారు. వెంటనే వారు “యేసు! దేవుని కుమారుడా! మా జోలి నీకెందుకు? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని అరిచారు.
వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. అప్పుడా దయ్యాలు “ఒకవేళ నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఆ పందుల మందలోకి వెళ్లనియ్యి!” అని యేసును ప్రాధేయపడ్డాయి.
ఆయన “పోండి!” అని వాటితో అన్నాడు. అప్పుడు అవి ఆ మనుషులలోనుంచి బయటికి వచ్చి ఆ పందులమందలో దూరాయి. వెంటనే ఆ పందులమందంతా నిటారుగా ఉన్న కొండమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి నీళ్ళలో చచ్చాయి. వాటి కాపరులు పారిపోయి గ్రామంలోకి వెళ్ళి జరిగినదంతా, దయ్యాలు పట్టినవారి సంగతి కూడా తెలియజేశారు.
మత్తయి శుభవార్త 9:1-7
యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నాడు. అప్పుడు కొందరు ఒక పక్షవాతరోగిని పడకమీదే ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, ధైర్యం తెచ్చుకో! నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొందరు “ఇతడు దేవదూషణ చేస్తున్నాడు” అని తమలో తాము చెప్పుకొన్నారు.
వారి తలంపులు తెలుసుకొని యేసు ఇలా అన్నాడు: “హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు? ఏది సులభమంటారు – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా? అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాతరోగితో “లేచి, నీ పడక ఎత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
అతడు లేచి ఇంటికి వెళ్ళాడు.
మత్తయి శుభవార్త 9:18-26
ఆయన ఈ సంగతులు వారితో చెపుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా, మీరు వచ్చి ఆమెమీద మీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
యేసు లేచి అతడివెంట వెళ్ళసాగాడు. శిష్యులు కూడా వచ్చారు. అప్పుడే, పన్నెండేళ్ళనుంచి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది. ఎందుకంటే, “ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా నయం అవుతుంది” అని ఆమె అనుకొంది.
యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. ఆ గడియనుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది.
యేసు ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళినతరువాత అక్కడ పిల్లనగ్రోవులు వాయించేవారినీ గోల చేస్తూ ఉన్న గుంపునూ చూచి వారితో ఇలా అన్నాడు: “వెళ్ళిపోండి! అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది.” వాళ్ళు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు. గుంపును బయటికి పంపివేసిన తరువాత ఆయన లోపలికి వెళ్ళి ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆమె లేచి నిలబడింది. దీన్ని గురించిన కబురు ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
మత్తయి శుభవార్త 9:27-31
అక్కడనుంచి యేసు వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివారు ఇద్దరు ఆయనను అనుసరిస్తూ “దావీదు కుమారా! మామీద దయ చూపు” అంటూ కేకలు వేశారు.
ఆయన ఇంట్లో ప్రవేశించాక ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. వారితో యేసు అన్నాడు, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” “అవును, స్వామీ!” అని వారు ఆయనతో అన్నారు.
అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి, “మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది గాక!” అన్నాడు. వెంటనే వారి కండ్లు తెరచుకొన్నాయి. “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండేం!” అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు. కానీ వారు బయటికి వెళ్ళి, ఆయన విషయం ఆ ప్రాంతం అంతటా చాటించారు.
మత్తయి శుభవార్త 9:32-33
వారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు. జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఇస్రాయేల్‌లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు” అని వారు చెప్పుకొన్నారు.
మత్తయి శుభవార్త 12:9-14
ఆయన అక్కడనుంచి వెళ్ళి వారి సమాజ కేంద్రంలో ప్రవేశించాడు. అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. యేసుపై నేరం మోపాలని వారు ఆయనను ఇలా అడిగారు: “విశ్రాంతి దినాన బాగు చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమేనా?”
ఆయన వారితో అన్నాడు, “మీలో ఎవనికైనా సరే గొర్రె ఒకటి ఉంది అనుకోండి. విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దానిని పట్టుకొని పైకి తీయడా? గొర్రెకంటే మనిషికి ఎంతో ఎక్కువ విలువ ఉంది గదా! గనుక విశ్రాంతి దినాన మంచి చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమే!”
అప్పుడాయన ఆ మనిషితో “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతడు దానిని చాపగానే అది పూర్వ స్థితికి మారి రెండో చేయిలాగా అయింది. కానీ పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనపై కుట్రపన్నారు.
మత్తయి శుభవార్త 12:22
అప్పుడు, దయ్యం పట్టిన ఒకణ్ణి ఆయన దగ్గరికి కొందరు తెచ్చారు. అతడు గుడ్డివాడూ మూగవాడూ. యేసు అతణ్ణి బాగు చేశాడు గనుక ఆ గుడ్డి, మూగవాడైన వ్యక్తి చూడటం మాట్లాడటం మొదలు పెట్టాడు.
మత్తయి శుభవార్త 14:15-21
సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, “ఇది అరణ్యం. ఇప్పటికే ప్రొద్దు పోయింది. ఈ జన సమూహాలు గ్రామాలకు వెళ్ళి తినుబండారాలు కొనుక్కోవడానికి వారిని పంపించండి.”
యేసు వారితో “వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు.
వారు “ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే” అని ఆయనతో అన్నారు.
ఆయన “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. జన సమూహం పచ్చికమీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. స్త్రీలు, పిల్లలు గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.
మత్తయి శుభవార్త 14:22-32
వెంటనే యేసు జన సమూహాలను పంపివేస్తూ, శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండడంవల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది. రాత్రి నాలుగో జామున యేసు సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి “అది భూతం!” అని భయంతో కేకలు పెట్టారు.
వెంటనే యేసు వారిని పలకరించి “ధైర్యం తెచ్చుకోండి! నేనే! భయపడకండి!” అన్నాడు.
పేతురు ఆయనతో “ప్రభూ, నీవే అయితే, నన్ను నీ దగ్గరికి నీళ్ళమీద నడచి రమ్మనండి!” అన్నాడు.
ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు. కానీ గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి, మునిగిపోబోయాడు. “ప్రభూ! నన్ను రక్షించు!” అని కేకపెట్టాడు.
వెంటనే యేసు చేయి చాచి అతణ్ణి పట్టుకొన్నాడు. “అల్ప విశ్వాసం గలవాడా సందేహపడ్డావేమిటి!” అని అతనితో అన్నాడు.
వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది.
మత్తయి శుభవార్త 15:22-28
అప్పుడు, ఆ ప్రాంతంలో నివసించే కనాను స్త్రీ ఒకతె వచ్చి ఆయనకు ఇలా బిగ్గరగా చెప్పింది: “స్వామీ! దావీదు కుమారుడా! నామీద దయ చూపండి. నా కూతురును దయ్యం ఘోరంగా పట్టింది.”
అందుకాయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి “ఆమెను పంపివేయండి. మా వెంటబడి కేకలు వేస్తూ ఉంది” అని ఆయనను ప్రాధేయ పడ్డారు.
ఆయన జవాబిచ్చాడు, “ఇస్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డాను.”
అయితే ఆమె వచ్చి ఆయనను ఆరాధించి “స్వామీ! నాకు సహాయం చెయ్యండి!” అంది.
అందుకాయన “పిల్లల భోజనం తీసి కుక్కపిల్లలకు వేయడం తగిన పని కాదు” అని జవాబిచ్చాడు.
ఆమె “నిజమే స్వామీ గాని కుక్కపిల్లలు సహా తమ యజమాని బల్లమీదనుంచి పడే ముక్కలు తింటాయి గదా!” అంది.
అప్పుడు యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరినట్టే నీకు జరుగుతుంది.” ఆ ఘడియలోనే ఆమె కూతురికి పూర్తిగా నయం అయింది.
మత్తయి శుభవార్త 15:32-38
తన శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని యేసు ఇలా అన్నాడు: “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తూ ఉంది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. వారిని ఆకలితోనే పంపివేయడం నాకిష్టం లేదు. దారిలో వారు శోష పోవచ్చు.”
ఆయన శిష్యులు ఆయనతో అన్నారు, “ఎవరూ కాపురం లేని ఈ స్థలంలో ఇంత పెద్ద గుంపు తృప్తిగా తినడానికి చాలినన్ని రొట్టెలు మనకు ఎక్కడ దొరుకుతాయి!”
యేసు “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారినడిగాడు. వారు “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి” అన్నారు.
జన సమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. అప్పుడు ఆ ఏడు రొట్టెలూ ఆ చేపలూ చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి తన శిష్యులకు అందించాడు. శిష్యులు జన సమూహానికి వడ్డించారు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం ఏడు పెద్ద గంపలు నిండాయి. తిన్న పురుషులు నాలుగు వేలమంది. వారితో పాటు స్త్రీలు, పిల్లలు తిన్నారు.
మత్తయి శుభవార్త 17:14-18
వారు జన సమూహం దగ్గరకు రాగానే ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి ఇలా అన్నాడు: “స్వామీ! నా కొడుకును దయ చూడండి. అతడు మూర్ఛ రోగంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నిప్పులో, నీళ్ళలో తరచుగా పడిపోతూ ఉంటాడు. అతణ్ణి మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను గాని వాళ్ళు అతణ్ణి బాగు చేయలేక పోయారు.”
యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! వక్రమార్గం పట్టిన తరమా! నేనెంతకాలం మీతో ఉంటాను! ఎందాక మిమ్ములను సహించాలి! ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకురా.”
యేసు ఆ దయ్యాన్ని గద్దించాడు. అది అతనిలో నుండి బయటికి వచ్చింది. వెంటనే అబ్బాయికి పూర్తిగా నయం అయింది.
మత్తయి శుభవార్త 20:29-34
వారు యెరికో నుంచి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద జన సమూహం ఆయనను అనుసరించింది. అప్పుడు దారిప్రక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చుని ఉన్నారు. యేసు తమ దగ్గర నుండి దాటి పోతున్నాడని విని, “స్వామీ! దావీదు కుమారుడా! మామీద దయ చూపండి!” అని కేక పెట్టారు.
“ఊరుకోండి” అని ప్రజలు వారిని గద్దించినా వారు ఇంకా బిగ్గరగా కేక పెట్టారు – “స్వామీ! దావీదు కుమారుడా! మామీద దయ చూపండి.”
యేసు ఆగి వారిని పిలిచి “మీ కోసం నన్నేమి చెయ్యమంటారు?” అని అడిగాడు.
వారు “స్వామీ, మాకు చూపు ప్రసాదించండి” అన్నారు.
యేసు వారిమీద జాలిపడి వారి కండ్లు ముట్టాడు. వెంటనే వారు చూపు పొంది, ఆయనవెంట వెళ్ళారు.
మత్తయి శుభవార్త 21:18-22
ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. దారి ప్రక్కన అంజూరచెట్టు ఒకటి కనిపించింది. ఆయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆయన దానితో “ఇకనుంచి నీవు ఎన్నడూ కాపు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూరచెట్టు ఎండిపోయింది.
అది చూచి శిష్యులు స్తంభించి “ఆ అంజూరచెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో!” అన్నారు.
యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, దేవుని మీద మీకు నమ్మకం గనుక ఉంటే, సందేహపడకుండా ఉంటే, అంజూరచెట్టుకు చేసినది మీరు కూడా చేయగలరు. ఇదిగాక, ఈ కొండను చూచి ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే అలాగే జరిగి తీరుతుంది. దొరుకుతాయని నమ్ముతూ, ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి.”
మార్కు శుభవార్త 1:21-28
వారు కపెర్‌నహూం వెళ్ళారు. వెంటనే, విశ్రాంతి దినాన, ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశించాడు. అక్కడివారు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర పండితులలాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన ఉపదేశించాడు. అప్పుడు వారి సమాజ కేంద్రంలో మలిన పిశాచం పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు “నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!” అంటూ బిగ్గరగా అరిచాడు.
యేసు ఆ పిశాచాన్ని మందలిస్తూ “ఊరుకో. అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు.
ఆ మలిన పిశాచం అతణ్ణి గిజగిజలాడించి పెడ బొబ్బ పెట్టి అతనిలోనుంచి బయటికి వచ్చింది. అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఏమిటిది! ఈ కొత్త ఉపదేశం ఏమిటి? ఆయన మలిన పిశాచాలకు సహా అధికారంతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో ఆయనకు లోబడుతున్నాయి!” అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొంటూ చెప్పుకొన్నారు. త్వరలోనే ఆయనను గురించి కబుర్లు గలలీ ప్రాంతం చుట్టుప్రక్కలా అంతటా వ్యాపించాయి.
మార్కు శుభవార్త 7:32-37
అక్కడ చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. ఆయన అతణ్ణి జనసమూహం నుంచి వేరుగా తీసుకువెళ్ళి అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి అతడి నాలుకను తాకాడు. అప్పుడు ఆకాశంవైపు తలెత్తి చూస్తూ నిట్టూర్చి అతడితో “ఎప్ఫతా!” అన్నాడు. ఆ మాటకు “తెరచుకో!” అని అర్థం.
వెంటనే అతడి చెవులు తెరచుకొన్నాయి. నాలుక సడలి అతడు తేటగా మాట్లాడాడు. ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారిని ఆదేశించాడు గానీ వారినెంత ఎక్కువగా ఆదేశించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు. వారు అమితంగా ఆశ్చర్యపడిపోయారు, “ఈయన అన్నిటినీ బాగు చేశాడు! చెవిటివాళ్ళు వినేలా చేస్తున్నాడు. మూగవాళ్ళను మాట్లాడిస్తున్నాడు!” అని చెప్పుకొన్నారు.
మార్కు శుభవార్త 8:22-25
ఆయన బేత్‌సయిదా చేరుకొన్నప్పుడు కొందరు ఒక గుడ్డివాణ్ణి ఆయనదగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి బయటికి తీసుకువెళ్ళాడు. అతడి కండ్లమీద ఉమ్మివేసి అతడి మీద చేతులుంచి “నీకేమైనా కనిపిస్తున్నదా?” అని అతణ్ణి అడిగాడు.
అతడు పైకి చూస్తూ “మనుషులు నడవడం నాకు కనిపిస్తున్నది. వారు చెట్లలాగా ఉన్నారు” అన్నాడు. మరో సారి ఆయన అతడి కండ్లమీద చేతులుంచి పైకి చూడమన్నాడు. అప్పుడతడు పూర్తిగా నయమయ్యాడు. అందరూ తేటగా అతనికి కనిపించారు.
లూకా శుభవార్త 5:4-8
మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమోనును చూచి “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
సీమోను జవాబిస్తూ “నాయకా, రాత్రంతా మేము శ్రమించాం గాని, చేపలు ఏమీ పడలేదు. అయినా నీ మాటనుబట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
వారు అలా చేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి, వారి వల తెగిపోబోయింది. అందుచేత మరో పడవలో ఉన్న వారి పాలివారు వచ్చి సహాయం చేయాలని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా నింపారు. పడవలు మునిగిపోసాగాయి.
అది చూచి సీమోను పేతురు యేసు మోకాళ్ళముందు పడి “ప్రభూ! నన్ను విడిచివెళ్ళు! నేను పాపాత్ముణ్ణి” అన్నాడు.
లూకా శుభవార్త 7:11-15
మరుసటి రోజున ఆయన నాయీను అనే ఊరికి వెళ్ళాడు. ఆయనతోకూడా ఆయన శిష్యులలో అనేకులూ పెద్ద జన సమూహమూ వెళ్ళారు. ఆయన ఊరి ద్వారం దగ్గరకు చేరినప్పుడే కొందరు చనిపోయినవాణ్ణి మోసుకువస్తూ ఉన్నారు. చనిపోయినవాడు తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. ఆమెతో కూడా గ్రామస్థులు పెద్దగుంపుగా వస్తూ ఉన్నారు. ఆమెను చూచి ప్రభువుకు జాలి వేసింది. ఆమెతో “ఏడవకమ్మా!” అన్నాడు. పాడెదగ్గరకు వెళ్ళి దానిని తాకాడు. దానిని మోస్తున్నవారు ఆగారు. అప్పుడాయన “అబ్బాయీ! నీతో నేనంటున్నాను, లే!” అన్నాడు.
చనిపోయినవాడు కూర్చుని మాట్లాడసాగాడు. యేసు అతణ్ణి తల్లికి అప్పచెప్పాడు.
లూకా శుభవార్త 13:10-13
ఒక విశ్రాంతి దినాన ఆయన ఒక సమాజ కేంద్రంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. పద్ధెనిమిది ఏళ్ళనుంచి ఒక పిశాచం వల్ల కలిగిన జబ్బుతో ఉన్న స్త్రీ ఒకతె అక్కడ ఉంది. నడుము వంగిపోయి ఆమె ఎంతమాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది.
యేసు ఆమెను చూచి దగ్గరకు పిలిచాడు, ఆమెతో “అమ్మా, నీ రోగంనుంచి నీకు విడుదల కలిగింది!” అన్నాడు. ఆమెమీద చేతులుంచగానే ఆమె తిన్నని వెన్నెముక గలిగి, దేవుణ్ణి స్తుతించసాగింది.
లూకా శుభవార్త 14:1-4
ఒక విశ్రాంతి దినాన ఇలా జరిగింది: ఆయన పరిసయ్యులలో ప్రముఖుడొకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆయనకు ఎదురుగానే వాపు రోగం ఉన్న మనిషి ఉన్నాడు. యేసు “విశ్రాంతి దినాన రోగులను బాగు చేయడం న్యాయ సమ్మతమా?” అని ధర్మశాస్త్ర విద్వాంసులనూ పరిసయ్యులనూ చూచి అన్నాడు.
వారు ఊరుకొన్నారు. అప్పుడాయన అతణ్ణి చేరదీసి బాగు చేశాడు, వెళ్ళనిచ్చాడు.
లూకా శుభవార్త 17:12-14
ఒక గ్రామంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే కుష్ఠురోగమున్న పదిమంది పురుషులు ఎదురుగా వస్తున్నారు. వారు దూరాన నిలుస్తూ కంఠమెత్తి ‘యేసూ! నాయకా! మామీద జాలి చూపు!’ అన్నారు.
వారిని చూచి ఆయన వారితో “మీరు వెళ్ళి యాజులకు కనబడండి” అన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉండగానే వారు శుద్ధమయ్యారు.
లూకా శుభవార్త 22:50-51
వారిలో ఒకడు ప్రముఖయాజి దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి నరికివేశాడు. అయితే యేసు “ఆగండి, ఇది కూడా జరగనియ్యి!” అని చెప్పి అతని చెవిని తాకి అతణ్ణి బాగు చేశాడు.
యోహాను శుభవార్త 2:1-11
మూడో రోజున గలలీలోని కానాలో పెండ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసునూ ఆయన శిష్యులనూ కూడా పెండ్లికి పిలిచారు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో “వారిదగ్గర ద్రాక్షరసం లేదు” అంది. యేసు ఆమెతో “అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. ఆయన తల్లి పనివారితో “మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సుమారు డెబ్భయి, లేదా నూరు లీటర్ల నీళ్ళు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం అక్కడ ఉంచారు. యేసు వారితో “ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో “ఇప్పుడు ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు ఎక్కడనుంచి వచ్చిందో ఆ నీళ్ళు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి ఇలా అన్నాడు: “ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం వడ్డిస్తారు. అతిథులు బాగా త్రాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు.”
యేసు చేసిన సూచనకోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలలీలోని కానాలో చేసి తన మహాత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయనమీద నమ్మకం ఉంచారు.
యోహాను శుభవార్త 4:46-54
మరో సారి ఆయన గలలీలోని కానాకు వచ్చాడు. ఆయన అక్కడే నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. అక్కడ ఒక రాజ్యాధికారి ఉండేవాడు. కపెర్‌నహూంలో అతని కొడుకుకు జబ్బు చేసింది. యేసు యూదయనుంచి గలలీకి వచ్చాడని విన్నప్పుడు ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు, తన కొడుకును బాగు చేయడానికి రావాలని మనవి చేసుకొన్నాడు. ఎందుకంటే అతని కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు.
యేసు అతనితో “మీరు సూచనలూ అద్భుతాలూ చూడకపోతే ఎంత మాత్రమూ నమ్మరు” అన్నాడు.
రాజ్యాధికారి ఆయనతో “స్వామీ, నా కొడుకు చనిపోకముందు రండి” అన్నాడు.
యేసు అతనితో “నీ దారిన వెళ్ళు! నీ కొడుకు బ్రతుకుతాడు” అన్నాడు. తనతో యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషి తన దారినవెళ్ళాడు.
అతడు వెళ్ళిపోతూ ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కొడుకు బ్రతికాడని చెప్పారు. అతడు బాగుపడడం మొదలైనప్పుడు ఎన్ని గంటలైందని వారిని అడిగాడు. వారు అతనితో “నిన్న ఒంటి గంటకు అతని జ్వరం పోయింది” అన్నారు.
“నీ కొడుకు బ్రతుకుతాడు” అని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రికి తెలుసు, గనుక అతడూ అతని ఇంటివారంతా యేసును నమ్ముకొన్నారు.
యూదయనుంచి గలలీకి వచ్చి యేసు చేసిన అద్భుతమైన సూచనలలో ఇది రెండోది.
యోహాను శుభవార్త 5:5-9
అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత ముప్ఫయి ఎనిమిదేళ్ళ నుంచి ఉంది. అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలంనుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు.
“నీకు బాగుపడాలని ఇష్టం ఉందా?” అని ఆయన అతణ్ణి అడిగాడు.
ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు: “అయ్యా, నీళ్ళను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు గనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు.”
యేసు అతనితో “లేచి నీ పడక ఎత్తుకొని నడువు” అన్నాడు.
వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు.
యోహాను శుభవార్త 9:1-7
ఆయన దారిన వెళ్తూ ఉన్నప్పుడు పుట్టు గుడ్డివాడు ఒకడు ఆయనకు కనబడ్డాడు. ఆయన శిష్యులు “గురువర్యా! ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు అపరాధం చేశారు? ఇతడా, ఇతడి తల్లిదండ్రులా?” అని ఆయననడిగారు. యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతడు లేదా ఇతని తల్లిదండ్రులు అపరాధం చేసినందుకు కాదు, గానీ దేవుని క్రియలు ఇతని మూలంగా వెల్లడి కావాలని. పగలు ఉన్నంతవరకూ నన్ను పంపినవాని క్రియలు నేను చేస్తూ ఉండాలి. రాత్రి వస్తూ ఉంది. అప్పుడు ఏ మనిషీ పని చేయలేడు. లోకంలో ఉన్నంతవరకూ నేను లోకానికి వెలుగును.” ఈ విధంగా చెప్పి ఆయన నేలపై ఉమ్మివేసి దానితో బురద చేసి గుడ్డివాని కండ్లకు ఆ బురద పూశాడు, “వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కో!” అని అతనితో అన్నాడు. (సిలోయం అంటే పంపబడిన వాడని తర్జుమా.) అతడు వెళ్ళి కడుక్కొని చూస్తూ తిరిగి వచ్చాడు.
యోహాను శుభవార్త 11:11-44
ఇలా చెప్పిన తరువాత ఆయన “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి మేల్కొలపడానికి వెళ్తాను” అని వారితో చెప్పాడు.
అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడుతాడు” అన్నారు.
యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు గాని సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారనుకొన్నారు. కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు:
“లాజరు చనిపోయాడు. నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీ మేలు విషయమే. అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతనిదగ్గరకు వెళ్దాం, పదండి.” అప్పుడు తోమా (అతణ్ణి ‘దిదుమ’ అని కూడా అంటారు) సాటి శిష్యులతో అన్నాడు “ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం.”
యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
“చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
ఇలా చెప్పి ఆమె వెళ్ళి తన సోదరి మరియను పిలిచి రహస్యంగా “గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు” అంది. ఆమె ఆ మాట విని గబాలున లేచి ఆయన దగ్గరికి తరలివెళ్ళింది. యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు. ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియ గబాలున లేచి బయటికి వెళ్ళడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడ్వడానికి వెళ్తుందని చెప్పి ఆమె వెంట వెళ్ళారు. యేసు ఉన్న స్థలానికి మరియ చేరి ఆయనను చూచి ఆయన పాదాలదగ్గర సాగిలపడి “ప్రభూ! ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు” అంది.
ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్వడం యేసు చూచి ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు: “అతణ్ణి మీరెక్కడ ఉంచారు?” వారు “ప్రభూ, వచ్చి చూడండి” అని ఆయనతో అన్నారు.
యేసు కన్నీళ్ళు విడిచాడు. అందువల్ల యూదులు “ఇదిగో అతడంటే ఈయనకు ఎంత ప్రేమో చూశారా!” అని చెప్పుకొన్నారు.
అయితే వారిలో కొంతమంది “ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేక పోయేవాడా?” అన్నారు.
మళ్ళీ తనలో పరితపిస్తూ యేసు సమాధి దగ్గరికి వచ్చాడు. అది గుహ. దానిమీద బండ ఉంది. యేసు “బండ తీసివేయండి” అన్నాడు. చనిపోయినవాని సోదరి మార్త “ప్రభూ, అతడు నాలుగు రోజులు నిర్జీవంగా ఉన్నాడు, గనుక కంపుకొడతుంది” అని ఆయనతో చెప్పింది.
యేసు “నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా?” అని ఆమెతో అన్నాడు.
అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
ఇలా చెప్పి ఆయన “లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.
చనిపోయినవాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్ళకూ చేతులకూ కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టివేసి ఉంది. యేసు వారితో “ఆ కట్లు విప్పి అతణ్ణి వెళ్ళనియ్యండి” అన్నాడు.
యోహాను శుభవార్త 21:4-6
ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిలుచున్నాడు గాని ఆయన యేసని శిష్యులు గుర్తుపట్టలేదు.
కనుక యేసు “అబ్బాయిలూ! తినడానికి మీదగ్గర ఏమైనా ఉందా?” అని వారితో అన్నాడు. “లేదండి” అని వారు ఆయనకు బదులు చెప్పారు.
అప్పుడాయన “పడవ కుడిప్రక్క వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని వారితో చెప్పాడు. వారలా వల వేసినప్పుడు బోలెడన్ని చేపలు పడడం చేత వల లాగలేక పోయారు.
అపొస్తలుల కార్యాలు 2:22
“ఇస్రాయేల్ మనుషులారా! ఈ మాటలు వినండి. దేవుడు నజరేతువాడైన యేసుచేత అద్భుతాలు, వింతలు, సూచకమైన క్రియలు మీమధ్య చేయించడంద్వారా ఆయన దేవుని దృష్టిలో యోగ్యుడై ఉన్నట్టు మీకు వెల్లడి చేశాడు. ఇది మీకే తెలుసు.
నాయకులు యేసుని బంధించి మరణ శిక్ష విధించారు
మత్తయి శుభవార్త 26:47-68
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల దగ్గరనుంచి, ప్రజల పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితో కూడా ఉన్నారు. వారు కత్తులూ కటార్లూ చేతపట్టుకొని ఉన్నారు. ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకోండి” అన్నాడు.
అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకుడా! నీకు శుభం!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు.
అయితే యేసు అతడితో “మిత్రుడా, నీవెందుకు వచ్చావు?” అన్నాడు. అప్పుడు వారు వచ్చి యేసును చేతులతో పట్టుకొన్నారు. వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.
యేసు అతడితో “నీ ఖడ్గం వరలో పెట్టు. ఖడ్గం పట్టుకొనేవారంతా ఖడ్గంతో నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొంటే, ఆయన వెంటనే పన్నెండు సేనావాహినుల కంటే ఎక్కువమంది దేవదూతలను నాకు అనుగ్రహించడనుకొంటున్నావా? గాని అలా చేస్తే ఈ విధంగా జరగాలనే లేఖనం నెరవేరడం ఎలాగు?” అన్నాడు.
ఆ సమయంలో యేసు ఆ గుంపులతో “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? ప్రతి రోజూ నేను మీ దగ్గర దేవాలయంలో కూర్చుని ఉపదేశం ఇచ్చేవాణ్ణే గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. గానీ ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి గనుక ఇదంతా జరిగింది” అన్నాడు.
అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు.
యేసును పట్టుకొన్నవాళ్ళు ఆయనను ప్రముఖయాజి అయిన కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పోగయి ఉన్నారు. పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖయాజి ఇంటి ముంగిటి వరకు వచ్చాడు. చివరికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆవరణంలోకి వెళ్ళి, భటులతో కూర్చున్నాడు.
ప్రధాన యాజులూ ప్రజల పెద్దలూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణ శిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు, అయినా సాక్ష్యం ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు అనేకులు ముందుకు వచ్చారు గానీ ఏమీ దొరకలేదు. చివరికి ఇద్దరు అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి “ఇతడు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి మూడు రోజులలో మళ్ళీ కట్టగలనన్నాడు” అన్నారు.
ప్రముఖయాజి నిలబడి, “నీవు జవాబేమీ చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని ఆయనను అడిగాడు. యేసు ఊరుకొన్నాడు. అప్పుడు ప్రముఖయాజి ఆయనతో ఇలా అన్నాడు: “నీవు ప్రమాణ పూర్వకంగా మాకు చెప్పాలని జీవంగల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాం – నీవు అభిషిక్తుడివా? దేవుని కుమారుడివా?”
అందుకు యేసు “నీవే అంటున్నావు గదా. వాస్తవంగా మీతో నేను చెపుతున్నాను, ఇకముందు మానవ పుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపు కూర్చుని ఉండడమూ, ఆకాశ మేఘాలమీద రావడమూ మీరు చూస్తారు” అన్నాడు.
అప్పుడు ప్రముఖయాజి తన వస్త్రాన్ని చింపుకొని “ఇతడు దేవదూషణ చేశాడు! మనకిక సాక్షులతో ఏం పని? చూడండి, ఇతడి దూషణ ఇప్పుడు విన్నారు గదా – మీరేమంటారు?” అన్నాడు.
“ఇతడు చావుకు తగినవాడే!” అని వారు జవాబిచ్చారు.
అప్పుడు వారు ఆయన ముఖంమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో చరిచి “అభిషిక్తుడా! నిన్ను కొట్టినది ఎవరు? ప్రవక్తగా పలుకు!” అన్నారు.
మత్తయి శుభవార్త 27:1-2
ఉదయం అయినప్పుడు ప్రధాన యాజులంతా ప్రజల పెద్దలంతా యేసును చంపించేందుకు ఆయనను గురించి సమాలోచన జరిపారు. ఆయనను బంధించి తీసుకువెళ్ళి అధిపతి పొంతి పిలాతుకు అప్పగించారు.
మత్తయి శుభవార్త 27:11-31
యేసు అధిపతి ముందర నిలిచాడు. “నీవు యూదుల రాజువా?” అని అధిపతి ఆయనను అడిగాడు.
“నీవే అంటున్నావు గదా” అని యేసు అతనితో అన్నాడు.
ప్రధాన యాజులూ పెద్దలూ తనమీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఆయన జవాబేమీ చెప్పలేదు.
కాబట్టి పిలాతు “నీకు వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని విషయాలగురించి సాక్ష్యమిస్తున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. అయితే అతనికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు గనుక అధిపతికి అత్యంత ఆశ్చర్యం కలిగింది.
ఆ పండుగలో ప్రజలు కోరుకొన్న ఖైదీ ఒకణ్ణి వారికి విడుదల చేయడం అధిపతికి వాడుక. ఆ కాలంలో పేరు మోసిన ఖైదీ ఒకడు చెరసాలలో ఉన్నాడు. అతడి పేరు బరబ్బ. గనుక ప్రజలు పోగై వచ్చినప్పుడు పిలాతు వారినిలా అడిగాడు:
“నేనెవణ్ణి మీకు విడుదల చేయాలని కోరుతున్నారు? బరబ్బనా? క్రీస్తు అనే యేసునా?”
ఎందుకంటే, వారు అసూయ కారణంగా ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.
అతడు న్యాయపీఠంమీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఇలా చెప్పి పంపింది: “ఆ న్యాయవంతుని జోలికి పోకండి. ఈవేళ ఆయన కారణంగా కలలో నేననేకమైన వాటితో బాధపడ్డాను.”
కానీ బరబ్బను విడుదల చేయండనీ, యేసును చంపించండనీ అడగడానికి ప్రధాన యాజులూ పెద్దలూ జనసమూహాలను పురికొలిపారు.
అధిపతి “ఈ ఇద్దరిలో నేనెవణ్ణి విడుదల చేయాలని కోరుతున్నారు?” అని అడిగినప్పుడు వారు “బరబ్బనే” అన్నారు.
అందుకు పిలాతు “అలాగైతే క్రీస్తు అనే యేసును నేనేం చేయాలి?” అని వారినడిగాడు.
అందరూ “అతణ్ణి సిలువ వేయాలి!” అన్నారు.
“ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు?” అని అధిపతి అడిగాడు.
వాళ్ళు “అతణ్ణి సిలువ వేయాలి!” అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు.
తన ప్రయత్నంవల్ల ప్రయోజనమేమీ లేదనీ, అల్లరి మాత్రం చెలరేగుతూ ఉందనీ పిలాతు గ్రహించాడు. గనుక నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఇలా అన్నాడు: “ఈ న్యాయవంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని. మీరే చూచుకోండి.”
అందుకు ప్రజలంతా ఇలా జవాబిచ్చారు: “అతడి రక్తం మామీద, మా సంతానం మీద ఉంటుంది గాక!”
అప్పుడతడు బరబ్బను వారికోసం విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. అప్పుడు అధిపతి సైనికులు యేసును అధిపతి భవనంలోకి తీసుకువెళ్ళి, తక్కిన సైనికుల గుంపునంతా ఆయన చుట్టూ పోగుచేశారు. వాళ్ళు ఆయన బట్టలు ఒలిచివేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. ముండ్ల కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో రెల్లుకర్ర ఒకటి ఉంచారు. అప్పుడు వాళ్ళు ఆయన ముందర మోకరించి “యూదుల రాజా, శుభం” అంటూ ఆయనను వెక్కిరించారు. వాళ్ళు ఆయనమీద ఉమ్మివేశారు. ఆ రెల్లుకర్ర పట్టుకొని ఆయన తలమీద కొట్టారు. ఆయనను వెక్కిరించిన తరువాత ఆ అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి, ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు.
మార్కు శుభవార్త 14:43-65
వెంటనే, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల, ధర్మశాస్త్ర పండితుల, పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితోకూడా ఉంది. వారికి కత్తులూ కటార్లూ ఉన్నాయి. ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా తీసుకువెళ్ళండి” అన్నాడు.
అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకా! బోధకా!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు. వారు ఆయనపైబడి చేతులతో పట్టుకొన్నారు. అయితే ప్రక్కగా నిలుచున్నవారిలో ఒకడు తన ఖడ్గం దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.
యేసు వారితో ఇలా అన్నాడు: “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? ప్రతి రోజూ నేను దేవాలయంలో ఉపదేశిస్తూ మీ దగ్గరే ఉండేవాణ్ణి గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. కానీ లేఖనాలు నెరవేరాలి.”
అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు. నారబట్ట మాత్రమే తన నగ్న శరీరంమీద వేసుకొన్న ఒక యువకుడు యేసు వెంట వచ్చాడు. యువకులు అతణ్ణి పట్టుకొన్నారు. కానీ అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి వారిదగ్గరనుంచి దిసమొలతో పారిపోయాడు.
వారు యేసును ప్రముఖ యాజి దగ్గరకు తీసుకువెళ్ళారు. అతడి దగ్గర ప్రధాన యాజులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ అందరూ సమకూడి ఉన్నారు. పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖ యాజి ఇంటి ముంగిటిలోకి వచ్చాడు. భటులతో కూర్చుని మంట దగ్గర చలి కాచుకొంటూ ఉన్నాడు.
ప్రధాన యాజులూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణశిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు గాని అది దొరకలేదు. అనేకులు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు గాని వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.
అప్పుడు కొందరు నిలబడి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెపుతూ “ఇతడు ‘చేతులతో చేసిన ఈ దేవాలయాన్ని నేను నాశనం చేసి మూడు రోజులలో చేతులతో కాకుండా మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం విన్నాం” అన్నారు. గానీ ఇందులో కూడా వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.
అప్పుడు ప్రముఖయాజి వారిమధ్య లేచి నిలబడి “నీవు జవాబేమీ చెప్పవా? ఈ మనుషులు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని యేసును అడిగాడు.
ఆయన ఊరుకొన్నాడు. జవాబేమీ చెప్పలేదు. మళ్ళీ ప్రముఖ యాజి ఆయనను ప్రశ్నించాడు, “నీవు దివ్యుడైన దేవుని కుమారుడివా? అభిషిక్తుడివా?”
అప్పుడు యేసు “నేనే ఆయనను. మానవపుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపున కూర్చుని ఉండడమూ ఆకాశ మేఘాలతో రావడమూ మీరు చూస్తారు.”
ప్రముఖ యాజి తన బట్టలు చింపుకొని “మనకిక సాక్షులతో ఏం పని? ఈ దేవదూషణ మీరు విన్నారు గదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన చావుకు తగినవాడని వారంతా తీర్పు చెప్పారు. అప్పుడు కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన కండ్లు కప్పి ఆయనను గుద్దసాగారు. “ప్రవక్తగా పలుకు!” అని ఆయనతో చెప్పారు. భటులు కూడా ఆయనను చేతులతో కొట్టారు.
మార్కు శుభవార్త 15:1-20
ఉదయం కాగానే ప్రధాన యాజులు పెద్దలతో, ధర్మశాస్త్ర పండితులతో, యూద సమాలోచన సభవారందరితో పాటు సమాలోచన జరిపారు. అప్పుడు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమన్ అధిపతి పిలాతుకు అప్పగించారు.
పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయన నడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతడికి జవాబిచ్చాడు.
ప్రధాన యాజులు ఆయనమీద అనేక నేరాలు మోపారు. అయితే ఆయన జవాబేమి చెప్పలేదు. కనుక పిలాతు మరో సారి ఆయనను ప్రశ్నిస్తూ “నీవేం జవాబు చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలిస్తున్నారో చూడు!” అన్నాడు.
అయితే యేసు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేదు గనుక పిలాతుకు ఆశ్చర్యం వేసింది. ఆ పండుగలో వారు తనను కోరిన ఒక ఖైదీని విడుదల చేయడం అతడికి అలవాటు. బరబ్బ అనేవాడు తన తోటి తిరుగుబాటుదారులతో కూడా ఖైదులో ఉన్నాడు. ఆ తిరుగుబాటులో వారు హత్య చేశారు.
జనసమూహం కేకలు పెట్టి ఎప్పటిలాగా తమ కోరిక ప్రకారం చేయాలని పిలాతును అడిగారు. వారికి పిలాతు జవాబిస్తూ “నేనీ యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అన్నాడు. ఎందుకంటే, ప్రధాన యాజులు అసూయ కారణంగా ఆయనను తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. అయితే యేసుకు బదులు బరబ్బను విడుదల చేయాలని కోరవలసిందిగా ప్రధాన యాజులు జన సమూహాన్ని పురికొలిపారు.
మరోసారి పిలాతు జవాబిస్తూ వారితో “అలాగైతే మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే యేసును నేనేం చేయాలని కోరుతున్నారు?” అన్నాడు.
వారు మళ్ళీ కేక వేస్తూ “అతణ్ణి సిలువ వేయండి!” అన్నారు.
వారితో పిలాతు “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు?” అన్నాడు. వారు “అతణ్ణి సిలువ వేయండి!” అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు.
అప్పుడు పిలాతు జన సమూహాన్ని మెప్పించాలని వారికోసం బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించిన తరువాత సిలువ వేయడానికి అప్పగించాడు. సైనికులు ఆయనను అధిపతి భవనంలోకి తీసుకువెళ్ళి తక్కిన సైనికుల గుంపునంతా అక్కడికి పిలిచారు. వారాయనకు ఊదారంగు అంగీ తొడిగారు. ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. “యూదుల రాజా! శుభం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. రెల్లుకర్రతో ఆయన తలమీద కొట్టారు, ఆయనమీద ఉమ్మివేశారు, మోకరించి ఆయనకు నమస్కరించారు. ఈ విధంగా వారు ఆయనను వెక్కిరించిన తరువాత ఊదారంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయడానికి బయటికి తీసుకువెళ్ళారు.
లూకా శుభవార్త 22:47-53
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే జనసమూహం, వారిముందు పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా నడిచి రావడం కనిపించింది. అతడు యేసును ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. “యూదా, ముద్దు పెట్టుకోవడం మూలంగా మానవ పుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తున్నావా?” అని యేసు అతనితో అన్నాడు.
జరగబోతున్నది గ్రహించి ఆయన చుట్టూ ఉన్నవారు “ప్రభూ! వీరిని కత్తితో కొట్టుదామంటావా?” అనడిగారు.
వారిలో ఒకడు ప్రముఖయాజి దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి నరికివేశాడు. అయితే యేసు “ఆగండి, ఇది కూడా జరగనియ్యి!” అని చెప్పి అతని చెవిని తాకి అతణ్ణి బాగు చేశాడు.
అప్పుడు యేసు తన దగ్గరకు వచ్చిన ప్రధాన యాజులతో, దేవాలయం కావలి అధికారులతో, పెద్దలతో “నేను దోపిడీ దొంగ అయినట్టు మీరు కత్తులూ కటారులతో వచ్చారేమిటి? ప్రతి రోజూ నేను మీతో కూడా దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, అంధకార ప్రభావం.”
లూకా శుభవార్త 22:63-71
యేసును నిర్భందించినవారు ఆయనను వెక్కిరించారు, కొట్టారు. ఆయన ముఖం కప్పి దానిమీద దెబ్బకొట్టి “నిన్ను కొట్టినదెవరు? ప్రవక్తగా చెప్పు” అని ఆయన నడిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఇంకా అనేక దూషణ మాటలు పలికారు.
ఉదయం కాగానే ప్రజల పెద్దలు – అంటే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ కలిసి ఆయనను తమ సభ కూడిన చోటికి తీసుకువెళ్ళారు. అక్కడ “నీవు అభిషిక్తుడివైతే అది మాతో చెప్పు!” అన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు: “ఒకవేళ నేను మీకు అలా చెప్పినా మీరు నమ్మరు. నేను మిమ్ములను ఏదైనా అడిగితే నాకు మీరేమీ జవాబు చెప్పరు, నన్ను విడుదల చేయరు. అయితే ఇకమీదట మానవపుత్రుడు బలప్రభావాలున్న దేవుని కుడివైపు కూర్చుని ఉంటాడు.”
అందుకు వారంతా “అలాగైతే నీవు దేవుని కుమారుడివా!” అన్నారు. వారితో ఆయన “మీరన్నట్టే నేనే ఆయనను” అన్నాడు.
అందుకు వారు “మనకిక సాక్ష్యంతో ఏం పని? ఇతడి నోటి మాట మనమే విన్నాం గదా!”
లూకా శుభవార్త 23:1-25
అప్పుడు వారి గుంపంతా లేచి ఆయనను పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు. “ఈ మనిషి ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. సీజర్‌కు పన్ను చెల్లించకూడదని అంటున్నాడు, తానే క్రీస్తును ఒక రాజును అంటున్నాడు. ఇదంతా మేము కనిపెట్టాం” అంటూ వారు ఆయనమీద నేరాలు మోపసాగారు.
పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతనికి జవాబిచ్చాడు.
పిలాతు ప్రధాన యాజులతో, ఆ సమూహంతో “ఈ మనిషిలో నాకెలాంటి దోషమూ కనిపించడం లేదు” అన్నాడు.
అయితే వారు మరీ తీవ్రతరంగా నొక్కి చెపుతూ “ఇతడు గలలీ మొదలుకొని ఈ స్థలం వరకు, యూదయ అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు!” అన్నారు.
గలలీ అనే మాట విని పిలాతు “ఈ మనిషి గలలీవాడా?” అని అడిగాడు. హేరోదు అధికార పరిధికి యేసు చెందినవాడని తెలుసుకొన్న వెంటనే పిలాతు ఆయనను హేరోదు దగ్గరకు పంపాడు. ఆ రోజుల్లో హేరోదు జెరుసలంలోనే ఉన్నాడు.
హేరోదు యేసును చూచి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే చాలా కాలంనుంచి ఆయనను గురించి అనేక సంగతులు వింటూ ఆయనను చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని ఆశిస్తూ ఉన్నాడు కూడా. అతడు ఆయనను అనేక మాటలతో ప్రశ్నించాడు గాని ఆయన అతనికేమీ జవాబు చెప్పలేదు. ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడ నిలుచుండి ఆయనమీద తీవ్రంగా నేరాలు మోపుతూ ఉన్నారు. తరువాత హేరోదు, అతని సైనికులు ఆయనను ధిక్కరించి వెక్కిరించి ఆయనకు శోభాయమాన వస్త్రాన్ని తొడిగించి మళ్ళీ పిలాతు దగ్గరకు పంపారు. ఆ రోజే హేరోదు, పిలాతు ఒకనికొకడు స్నేహితులయ్యారు. అంతకు ముందు వారి మధ్య వైరం ఉంది.
అప్పుడు పిలాతు ప్రధాన యాజులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు: “ప్రజలను తప్పుదారి పట్టించే వాడంటూ మీరీ మనిషిని నా దగ్గరికి తీసుకువచ్చారు. ఇదిగో వినండి, మీ ఎదుటే నేను అతణ్ణి విమర్శించాను గాని అతనిమీద మీరు మోపిన నేరాల విషయంలో ఏ దోషమూ ఈ మనిషిలో నాకు కనబడలేదు. హేరోదుకు కూడా కనబడలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ అతడి దగ్గరకు పంపాను గదా! చూడండి, ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదు. అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను.”
ఆ పండుగ సమయంలో అతడు వారికి ఎవరైనా ఒకడిని విడుదల చేయడం తప్పనిసరి.
అయితే వారంతా ఏకగ్రీవంగా “ఈ మనిషి ప్రాణాన్ని తీసెయ్యండి. మాకు బరబ్బను విడుదల చేయండి!” అని అరిచారు. ఈ బరబ్బ ఆ నగరంలో తిరుగుబాటు జరిగించినందుచేత, హత్య చేసినందుచేత ఖైదుపాలయిన వాడు.
యేసును విడుదల చేద్దామని ఆశించి పిలాతు వారితో మరో సారి మాట్లాడాడు. వారైతే “ఇతణ్ణి సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
అతడు మూడో సారి వారితో “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు? మరణశిక్షకు కారణమేమీ ఇతడిలో నాకు కనబడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.
వారైతే పట్టుబట్టి బిగ్గరగా కంఠమెత్తి ఆయనను సిలువ వేయాలని కోరారు. చివరికి ఈ మనుష్యుల, ప్రధాన యాజుల కంఠధ్వనులే నెగ్గాయి. వారు అడిగినట్టే జరగాలని పిలాతు తీర్పు చెప్పాడు. వారు కోరినవాణ్ణి – తిరుగుబాటు, హత్య కారణంగా ఖైదుపాలయిన ఆ మనిషిని – వారికి విడుదల చేశాడు, యేసును వారికిష్టం వచ్చినట్టే చేయడానికి వారికప్పగించాడు.
యోహాను శుభవార్త 18:1-14
యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కూడా కెద్రోను లోయ దాటివెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉంది. ఆయన, ఆయన శిష్యులు దానిలోకి వెళ్ళారు. యేసు ఆయన శిష్యులను తరచుగా అక్కడ కలుసుకొనేవాడు గనుక ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చే యూదాకు ఆ స్థలం తెలుసు.
అప్పుడు యూదా, సైనికుల గుంపునూ ప్రధాన యాజులూ పరిసయ్యులూ పంపిన దేవాలయ ఉద్యోగులనూ కొందరిని అక్కడికి తీసుకువచ్చాడు. వారికి దివిటీలతో, దీపాలతో, ఆయుధాలు ఉన్నాయి. తనమీదికి జరగబోయేది అంతా తెలిసి యేసు ముందుకు వెళ్ళి “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని వారితో అన్నాడు.
“నజరేతువాడైన యేసును” అని వారు ఆయనకు జవాబిచ్చారు.
యేసు వారితో “నేనే ఆయనను” అన్నాడు.
ఆయనను పట్టి ఇచ్చే యూదా వారి మధ్య నిలబడి ఉన్నాడు. యేసు “నేనే ఆయనను” అనగానే వారు వెనక్కు తగ్గి నేలమీద పడిపోయారు.
“మీరు వెదకుతున్నది ఎవరిని?” అని ఆయన వారిని మళ్ళీ అడిగాడు.
వారు “నజరేతువాడైన యేసును” అన్నారు.
“నేనే ఆయనని మీకు చెప్పాను గదా. నన్నే గనుక మీరు వెదకుతూ ఉంటే వీరిని వెళ్ళిపోనియ్యండి” అని యేసు బదులు చెప్పాడు. నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరినీ పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరేందుకు అలా అన్నాడు.
సీమోను పేతురు దగ్గర ఖడ్గం ఉంది. దానిని ఒరనుంచి దూసి అతడు ప్రముఖయాజి సేవకుణ్ణి కొట్టి అతడి కుడిచెవి తెగనరికాడు (ఆ సేవకుడి పేరు మల్కు).
“ఖడ్గం ఒరలో పెట్టు. తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగనా?” అని యేసు పేతురుతో చెప్పాడు.
అప్పుడు ఆ సైనికుల గుంపు, వారి అధిపతి, యూదుల ఉద్యోగులు ఆయనను పట్టుకొని బంధించారు. మొట్టమొదట కయపకు మామ అయిన అన్నా అనేవాడి దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళారు. ఆ సంవత్సరం కయప ప్రముఖ యాజిగా ఉన్నాడు. ప్రజలకోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకు సలహా చెప్పినది ఈ కయపే.
యోహాను శుభవార్త 18:19-24
ఇంతలో, ప్రముఖయాజి ఆయన ఉపదేశాన్ని గురించీ శిష్యులను గురించీ యేసును ప్రశ్నించాడు.
యేసు అతడికిలా జవాబిచ్చాడు: “నేను బాహాటంగా లోకానికి చెప్పాను. యూదులు ఎప్పుడూ సమకూడే సమాజ కేంద్రాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా నేనేమీ చెప్పలేదు. మీరు నన్ను ప్రశ్నించడమెందుకు? నా బోధ విన్నవారిని నేను వారికి చెప్పిన దాని గురించి అడుగు. నేను చెప్పినది వారికి తెలుసు.
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, దగ్గర నిలుచున్న అధికారి ఒకడు ఆయనను అరచేతితో చెంపదెబ్బ కొట్టి “ప్రముఖ యాజికి ఇలా జవాబిస్తున్నావేమిటి!” అన్నాడు.
యేసు జవాబిస్తూ “నేను చెప్పినదానిలో దోషం ఉంటే ఆ దోషం ఏదో సాక్ష్యం చెప్పు. అది సరిగా ఉంటే నన్ను కొట్టడం ఎందుకు?” అన్నాడు.
అప్పుడు అన్నా ఆయనను కట్లతోనే ప్రముఖయాజి అయిన కయప దగ్గరకు పంపాడు.
యోహాను శుభవార్త 18:28–19:16
యూదులు యేసును కయప దగ్గరనుంచి రోమన్ అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు. అప్పటికి ఉదయం అయింది. వారు మాత్రం అపవిత్రం కాకుండేలా భవనంలో ప్రవేశించలేదు. ఎందుకంటే, పస్కాను తినాలని ఉన్నారు. అందుచేత రోమన్ అధిపతి పిలాతు బయటికి వారిదగ్గరకు వచ్చి “ఈ మనిషిపై మీరు మోపే నేరం ఏమిటి?” అని అడిగాడు.
“ఇతడు నేరస్థుడు కాకపోతే ఇతణ్ణి మీకు అప్పగించేవారం కాము” అని వారు అతనికి బదులు చెప్పారు.
పిలాతు వారితో “మీరే అతణ్ణి తీసుకువెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు అతనితో “ఎవరికీ మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు” అన్నారు. తాను ఎలాంటి మరణానికి గురి అవుతాడో దాని విషయం యేసు సూచించి చెప్పిన మాట నెరవేరేలా అది జరిగింది.
అప్పుడు పిలాతు అధిపతి భవనంలోకి మళ్ళీ వెళ్ళి యేసును పిలిపించి ఆయనను ఇలా అడిగాడు: “యూదులకు రాజువు నీవేనా?”
“మీ అంతట మీరే ఆ మాట అంటున్నారా? లేదా, ఇతరులు నా విషయం మీతో చెప్పారా?” అని యేసు అతనికి జవాబిచ్చాడు.
“నేను యూదుడినా ఏం! నాకు నిన్ను అప్పగించినది నీ సొంత ప్రజలే, ప్రధాన యాజులే గదా. నీవు చేసినది ఏమిటి?” అని పిలాతు బదులు చెప్పాడు.
యేసు ఇలా జవాబిచ్చాడు: “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే గనుక అయితే నన్ను యూదులకు పట్టి ఇవ్వడం జరగకుండా నా సేవకులు పోరాడేవారే. కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడిది కాదు.”
అందుకు పిలాతు “అయితే నీవు రాజువా?” అని ఆయనను అడిగాడు.
యేసు జవాబిస్తూ “నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే. సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను, ఈ కారణం చేత ఈ లోకానికి వచ్చాను. నేను చెప్పేదానిని సత్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నా స్వరం వింటారు” అన్నాడు.
అందుకు పిలాతు “సత్యం అంటే ఏమిటి?” అని ఆయనతో అన్నాడు. అలా అని బయటికి యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి “అతనిలో ఎలాంటి దోషమూ నాకు కనిపించలేదు. అయితే పస్కా పండుగలో నేను ఎవడైనా ఒక ఖైదీని మీకు విడుదల చేసే వాడుక మీకు ఉంది గదా. నేను యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకిష్టమా?”
అందుకు వారు “ఈ మనిషిని కాదు, బరబ్బను విడుదల చేయండి” అని మళ్ళీ అరిచారు. బరబ్బ బందిపోటు దొంగ.
 
అప్పుడు పిలాతు యేసును స్వాధీనపరచుకొని కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. అప్పుడు “యూదుల రాజా, శుభం!” అన్నారు. ఆయనను చేతులతో కొట్టారు.
మరోసారి పిలాతు బయటికి వెళ్ళి యూదులతో ఇలా అన్నాడు: “చూడండి. ఇతనిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించలేదని మీరు తెలుసుకోవాలి, గనుక ఇతణ్ణి బయటికి మీ దగ్గరికి తెప్పిస్తున్నాను.”
ముండ్ల కిరీటం, ఊదారంగు వస్త్రం ధరించినవాడై యేసు బయటికి వచ్చినప్పుడు పిలాతు వారితో అన్నాడు “ఇడుగో ఈ మనిషి!”
ఆయనను చూడగానే ప్రధాన యాజులూ యూదుల అధికారులూ “సిలువ వెయ్యండి! సిలువ వెయ్యండి!” అని అరిచారు.
పిలాతు “మీరే అతణ్ణి తీసుకుపోయి సిలువ వేయండి. నాకు అతనిలో ఏ దోషమూ కనబడలేదు” అని వారితో చెప్పాడు.
అందుకు యూదులు “మాకో చట్టం ఉంది. మా చట్టం ప్రకారం అతడు చావాలి. ఎందుకంటే, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకొన్నాడు” అని జవాబిచ్చారు.
ఆ మాట విని పిలాతు మరి ఎక్కువగా భయపడ్డాడు. అధిపతి భవనంలోకి తిరిగి వెళ్ళి “నీవు ఎక్కడనుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. యేసు అతడికి ఏ జవాబూ ఇవ్వలేదు. పిలాతు ఆయనతో అన్నాడు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?”
అందుకు యేసు “ఆ అధికారం పైనుంచి నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు. కనుక నన్ను నీకు అప్పగించినవానికే ఎక్కువ పాపం ఉంది” అని జవాబిచ్చాడు.
అప్పటినుంచి ఆయనను విడిపించడానికి పిలాతు ప్రయత్నం చేశాడు, గానీ యూదులు ఇలా అరిచారు: “ఒకవేళ మీరు ఈ మనిషిని విడుదల చేస్తే మీరు సీజరుకు స్నేహితులు కారన్నమాటే! తాను రాజునని చెప్పుకొనేవాడెవడైనా చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడేవాడే!”
ఈ మాటలు విని పిలాతు యేసును బయటికి తెప్పించి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఆ స్థలానికి ‘రాళ్లు పరచిన స్థలం’ అని పేరు. హీబ్రూ భాషలో గబ్బతా అంటారు. ఆ రోజు పస్కా పండుగను సిద్ధం చేసే రోజు. ఉదయం సుమారు ఆరు గంటలయింది.
“ఇడుగో మీ రాజు!” అని పిలాతు యూదులతో చెప్పాడు.
అందుకు వారు “ఇతణ్ణి చంపండి! చంపండి! అతణ్ణి సిలువ వేయండి!” అని అరిచాడు.
“నేను మీ రాజును సిలువ వేయాలా?” అని పిలాతు వారిని అడిగాడు.
అందుకు ప్రధాన యాజులు “సీజరు తప్ప మాకు వేరే రాజు లేడు” అని జవాబిచ్చారు.
అప్పుడు సిలువ వేయడానికి ఇతడు ఆయనను వారికి అప్పగించాడు. అందుచేత వారు యేసును పట్టుకొని బయటికి తీసుకుపోయారు.
యేసు సిలువ వేయబడ్డాడు
మత్తయి శుభవార్త 27:32-56
వారు బయటికి వస్తూ ఉండగానే సీమోను అనే కురేనే ప్రాంతీయుడు కనబడ్డాడు. వారు బలవంతాన యేసు సిలువను అతనిచేత మోయించారు.
వారు గొల్గొతా అనే స్థలానికి వచ్చారు. గొల్గొతా అంటే ‘కపాల స్థలం’ అని అర్థం. అక్కడ వారు చేదు కలిపిన పుల్లని ద్రాక్షరసం ఆయనకు త్రాగడానికి ఇచ్చారు గాని, దానిని రుచి చూచినప్పుడు నిరాకరించాడు. వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలకోసం చీట్లు వేసి పంచుకొన్నారు. ప్రవక్త ఇలా చెప్పినది నెరవేరేలా ఇది జరిగింది: “నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేశారు.” అక్కడే కూర్చుని ఆయనకు కావలి కాస్తూ ఉన్నారు. ఆయనమీద మోపిన నేరం ఇలా వ్రాసి ఆయన తలకు పైగా ఉంచారు:
ఇతడు యూదుల రాజైన యేసు.
ఆయనతో కూడా ఇద్దరు దోపిడీ దొంగలను, ఒకణ్ణి ఆయన కుడివైపున, మరొకణ్ణి ఎడమవైపున సిలువ వేయడం జరిగింది.
ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, ఆయనను దూషిస్తూ ఇలా అన్నారు: “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా! నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుడి కుమారుడివైతే సిలువనుంచి దిగిరా!”
అలాగే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ ఆయనను వెక్కిరిస్తూ ఇలా అన్నారు: “ఇతడు ఇతరుల్ని రక్షించాడు, తనను రక్షించుకోలేడు! ఇతడు ఇస్రాయేల్ రాజయితే ఇప్పుడు అతణ్ణి సిలువ దిగిరానియ్యి. అప్పుడు అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిమీద నమ్మకం ఉంచాడు గదా! ‘నేను దేవుని కుమారుణ్ణి’ అన్నాడుగా. ఇతడంటే దేవునికి ఇష్టం ఉంటే ఇప్పుడు ఆయన ఇతణ్ణి తప్పిస్తాడు గాక!”
ఆయనతో సిలువ వేయబడ్డ దోపిడీదొంగలు కూడా అలాగే ఆయనను నిందించారు.
మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు ఇలా బిగ్గరగా కేక వేశాడు: “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” ఆ మాటలకు “నా దేవా! నా దేవా! నా చేయి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
అక్కడ నిలుచున్నవారిలో కొంతమంది అది విని “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొంటూ వెళ్ళి స్పంజీ తెచ్చి, పులిసిపోయిన ద్రాక్షరసంలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు.
తక్కినవారు “ఉండండి. ఏలీయా ఇతణ్ణి రక్షించడానికి వస్తాడో రాడో చూద్దాం” అన్నారు.
యేసు మళ్ళీ బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు.
ఆ క్షణమే దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చినగడం జరిగింది, భూమి కంపించింది, బండలు బ్రద్ధలయ్యాయి, సమాధులు తెరచుకొన్నాయి. కన్నుమూసిన అనేకులైన పవిత్రుల శరీరాలు సజీవంగా లేచాయి. యేసు సజీవంగా లేచిన తరువాత వారు సమాధుల స్థలంలోనుంచి బయటికి వచ్చారు. పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.
రోమన్‌ శతాధిపతి, అతడితో కూడా యేసుకు కావలి కాస్తూ ఉన్నవారు ఆ భూకంపం, జరిగినవి చూచినప్పుడు చాలా భయపడ్డారు, “నిజంగా ఈయన దేవుని కుమారుడు!” అన్నారు.
స్త్రీలు అనేకులు కూడా అక్కడ దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. వారు యేసుకు పరిచర్య చేస్తూ, గలలీనుంచి ఆయనవెంట వచ్చినవారు. వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసే అనేవారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
మార్కు శుభవార్త 15:21-41
అప్పుడు పల్లెసీమ నుంచి కురేనే ప్రాంతీయుడైన సీమోను ఆ త్రోవలో నడిచి వస్తూ ఉన్నాడు (అతడు అలెగ్జాండర్, రూఫస్‌ల తండ్రి). సైనికులు బలవంతాన యేసు సిలువను అతనిచేత మోయించారు. వారాయనను గొల్గొతా అనే స్థలానికి తీసుకువచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం అని తర్జుమా. అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోయారు గాని ఆయన దానిని పుచ్చుకోలేదు.
వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలకోసం ఏ బట్ట ఎవడికి కావాలో నిర్ణయించడానికి చీట్లు వేసి వాటిని పంచుకొన్నారు. ఆయనను సిలువ వేసినది ఉదయం తొమ్మిది గంటలకు. “యూదుల రాజు” అని ఆయనమీద మోపిన నేరం రాసి పైగా ఉంచారు. ఆయనతో కూడా ఇద్దరు దోపిడీ దొంగలను, ఒకణ్ణి ఆయన కుడి వైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు. అప్పుడు ఈ లేఖనం నెరవేరింది: “ఆయనను అక్రమకారులలో ఒకడిగా ఎంచడం జరిగింది.”
ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ ఆయనను దూషిస్తూ “ఓహో! దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా! నిన్ను నీవే రక్షించుకో! సిలువనుంచి దిగిరా!” అన్నారు.
అలాగే ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులతోపాటు ఆయనను వెక్కిరిస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు, తనను రక్షించుకోలేడు! ఈ ‘అభిషిక్తుడు’, ఈ ‘ఇస్రాయేల్ రాజు’ ఇప్పుడు సిలువ దిగిరావాలి. అది చూచి నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
ఆయనతోపాటు సిలువ వేయబడ్డవారు కూడా ఆయనను నిందించారు.
మధ్యాహ్నం పన్నెండు గంటలయినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. మూడు గంటలప్పుడు యేసు “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు “నా దేవా! నా దేవా! నా చేయి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
దగ్గరలో నిలుచున్నవారిలో కొంతమంది అది విని “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వారిలో ఒకడు పరుగెత్తుకొంటూ వెళ్ళి స్పంజీని పులిసిపోయిన ద్రాక్షరసంతో నింపి రెల్లుకర్రకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు “ఆయన్ను విడిచిపెట్టండి. ఏలీయా ఇతణ్ణి కిందికి దింపడానికి వస్తాడో రాడో చూద్దాం” అన్నాడు.
యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
అప్పుడు దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చినగడం జరిగింది.
యేసుకు ఎదురుగా రోమన్ సేన శతాధిపతి నిలిచి ఉండి, ఆయన ఈ విధంగా కేకవేసి ప్రాణం విడిచాడని చూచి “నిజంగా ఈ మనిషి దేవుని కుమారుడు!” అన్నాడు.
స్త్రీలు కొందరు కూడా దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియ, “చిన్న” యాకోబుకూ యోసేకూ తల్లి అయిన మరియ, సలోమి ఉన్నారు. యేసు గలలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను అనుసరిస్తూ ఆయనకు సేవ చేసేవారు. ఆయన వెంట జెరుసలంకు వచ్చిన ఇంకా అనేకమంది స్త్రీలు కూడా ఉన్నారు.
లూకా శుభవార్త 23:26-49
వారాయనను తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెసీమనుంచి వస్తున్న కురేనే ప్రాంతీయుడైన సీమోనును పట్టుకొన్నారు. యేసువెంట సిలువను మోయడానికి దానిని అతనిమీద పెట్టారు. పెద్ద జనసమూహం ఆయన వెంట వచ్చారు. వారిలో కొందరు స్త్రీలు ఉన్నారు. వీరు ఆయన విషయం గుండెలు బాదుకొంటూ రోదనం చేస్తూ ఉన్నారు కూడా.
యేసు వారివైపు తిరిగి “జెరుసలం కూతుళ్ళారా! నా కోసం ఏడవకండి – మీకోసం, మీ పిల్లలకోసం ఏడ్వండి! ఎందుకంటే, ‘గొడ్రాళ్ళు ధన్యులు! ఎన్నడూ కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం!’ అని జనం చెప్పుకొనే రోజులు వస్తాయి. అప్పుడు వారు పర్వతాలతో ‘మా మీద పడండి!’ కొండలతో ‘మమ్మల్ని మరుగు చేయండి!’ అని చెప్పనారంభిస్తారు. వారు పచ్చని చెట్టు ఉన్న సమయంలో ఇలా చేస్తే ఎండిన దాని సమయంలో ఏమి జరుగుతుందో?” అన్నాడు.
నేరస్థులను ఇద్దరిని కూడా ఆయనతోపాటు చంపడానికి తెచ్చారు.
వారు కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు వారాయనను అక్కడ సిలువ వేశారు. ఆ నేరస్థులను కూడా ఒకణ్ణి ఆయన కుడివైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు.
అప్పుడు యేసు “తండ్రీ! వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు” అన్నాడు. వారు ఆయన బట్టలకోసం చీట్లు వేసి పంచుకొన్నారు. ప్రజలు అక్కడ నిలుచుండి చూస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్న అధికారులైతే ఆయనను అపహాస్యం చేస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు. దేవుడు ఎన్నుకొన్న అభిషిక్తుడు ఇతడే అయితే తనను తాను రక్షించుకోవాలి!” అన్నారు.
సైనికులు కూడా ఆయనను వెక్కిరించారు. ఆయన దగ్గరకు వచ్చి పులిసిపోయిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోతూ “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అన్నారు.
“ఇతడు యూదుల రాజు” అని వ్రాసి ఆయనకు పైగా ఉంచారు. ఈ వ్రాత గ్రీక్, లాటిన్, హీబ్రూ అక్షరాలలో ఉంది.
వ్రేలాడుతున్న నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ “నువ్వు అభిషిక్తుడివైతే నిన్ను నీవే రక్షించుకో! మమ్మల్ని కూడా రక్షించు!” అన్నాడు.
అయితే రెండో నేరస్థుడు అతణ్ణి చీవాట్లు పెట్టి ఇలా జవాబిస్తూ అన్నాడు: “నువ్వూ ఇదే శిక్షావిధికింద ఉన్నావుగా. దేవుడంటే నీకేం భయం లేదా? మనకు ఈ శిక్ష న్యాయమే. మనం చేసినవాటికి తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం. కానీ ఈ మనిషి ఏ తప్పిదమూ చేయలేదు.”
అప్పుడతడు యేసుతో “ప్రభూ, మీరు మీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి” అన్నాడు.
అతనితో యేసు “నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఈ రోజే నీవు నాతో కూడా పరమానంద నివాసంలో ఉంటావు” అన్నాడు.
సుమారు మధ్యాహ్నం కావచ్చినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యమండలం అంధకారమయం అయింది, దేవాలయం తెర రెండుగా చింపబడింది.
అప్పుడు యేసు బిగ్గరగా కేక వేసి “తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను” అన్నాడు. అలా చెప్పి ప్రాణం విడిచాడు.
జరిగినది చూచి శతాధిపతి “ఈ మనిషి నిజంగా న్యాయవంతుడు” అంటూ దేవుణ్ణి కీర్తించాడు.
చూడడానికి పోగైన జనసమూహమంతా జరిగినది చూచి గుండెలు బాదుకొంటూ తిరిగి వెళ్ళిపోయారు. ఆయనతో పరిచయమున్న వారంతా, గలలీనుంచి ఆయనవెంట వచ్చిన స్త్రీలు కూడా, దూరంగా నిలుచుండి జరిగినవి చూస్తూ ఉన్నారు.
యోహాను శుభవార్త 19:17-37
తన సిలువను తానే మోసుకొంటూ ‘కపాలస్థలం’ అనే చోటికి ఆయన వెళ్ళాడు. హీబ్రూ భాషలో దానిని గొల్‌గొతా అంటారు. అక్కడ వారు ఆయనను సిలువ వేశారు. యేసును మధ్యలో ఉంచి ఆయనకు ఇరుప్రక్కల ఇంకా ఇద్దరిని సిలువ వేశారు. పిలాతు ఈ వ్రాత వ్రాయించి సిలువకు పైగా పెట్టించాడు: “నజరేతువాడైన యేసు, యూదుల రాజు” అది హీబ్రూ, గ్రీకు, రోమన్ భాషలలో వ్రాసి ఉంది. యేసును సిలువ వేసిన స్థలం నగరానికి దగ్గరగా ఉంది, గనుక యూదులు అనేకులు ఆ పై వ్రాతను చదివారు.
అప్పుడు యూదుల ప్రధాన యాజులు పిలాతుతో ఇలా అన్నారు: “యూదుల రాజు అని వ్రాయకండి. నేను యూదుల రాజునని అతడు అన్నాడు అని వ్రాయండి.”
పిలాతు “నేను రాసినదేదో రాశాను” అని బదులు చెప్పాడు.
యేసును సిలువ వేసిన తరువాత సైనికులు ఆయన బట్టలు తీసుకొన్నారు. ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు. ఆయన అంగీ కూడా తీసుకొన్నారు గాని అది కుట్టు లేకుండా పైభాగంనుంచి పూర్తిగా నేసినది కావడంచేత వారు “మనం దానిని చింపెయ్యకూడదు. అది ఎవడికి రావాలో దానికోసం చీట్లు వేద్దాం” అని చెప్పుకొన్నారు. “నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీకోసం చీట్లు వేస్తున్నారు” అనే లేఖనం నెరవేర్పు ఇలా జరిగింది. సైనికులు అలా చేసినది అందుకే.
యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్‌దలేనే మరియ ఆయన సిలువ దగ్గర నిలుచున్నారు. యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండడం చూచి “అమ్మా! అడుగో, నీ కొడుకు” అని తన తల్లితో అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడితో “అదిగో, నీ తల్లి” అన్నాడు. ఆ కాలంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొన్నాడు.
ఆ తరువాత, సమస్తమూ అప్పటికే అయిపోయిందని తెలిసి లేఖనం నెరవేరడానికి యేసు “నాకు దప్పి అవుతూ ఉంది” అన్నాడు. పులిసిపోయిన ద్రాక్షరసంతో నిండిన ఒక పాత్ర అక్కడ ఉంది. కాబట్టి వారు ఒక స్పంజి నిండా పులిసిపోయిన ద్రాక్షరసాన్ని పట్టించారు. దానిని హిస్సోపు మొక్క కాడకు తగిలించి ఆయన నోటికి అందజేశారు.
ఆ పులిసిపోయిన ద్రాక్షరసం తీసుకొన్న తరువాత యేసు “సమాప్తమయింది” అన్నాడు. అప్పుడు తల వంచి ప్రాణం విడిచాడు.
ఆ రోజు పస్కాను సిద్ధం చేసే రోజు. మరుసటి రోజు యూదులకు మహా విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మృత దేహాలు సిలువమీద ఉండకూడదనీ వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని సిలువనుంచి తీయించాలనీ యూదులు పిలాతును అడిగారు. కనుక సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడ్డ మొదటివాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగ్గొట్టారు. గానీ యేసు దగ్గరకు వచ్చి, అప్పటికే ఆయన చనిపోవడం చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. వెంటనే రక్తమూ నీళ్ళూ కారాయి. అది చూచినవాడు సాక్ష్యం చెప్పాడు. అతని సాక్ష్యం నిజం. మీరు కూడా నమ్మేలా అతడు సత్యం చెపుతున్నాడని అతనికి తెలుసు.
ఈ లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి: “ఆయన ఎముకలలో ఒకటైనా విరగగొట్టబడదు” మరో లేఖనం ఇలా అంటుంది.: “తాము పొడిచినవానివైపు వారు చూస్తారు.”
యేసు సమాధి చేయబడ్డాడు
మత్తయి శుభవార్త 27:57-66
సాయంకాలం అయినప్పుడు అరిమతయినుంచి యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు. అంతకు ముందు అతడు కూడా యేసు శిష్యుడయ్యాడు. ఈ మనిషి పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. పిలాతు ఆ దేహాన్ని అతనికివ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన సన్నని నారబట్టతో చుట్టాడు. తాను రాతి స్థలంలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు. సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి వెళ్ళిపోయాడు. మగ్దలేనే మరియ, ఆ మరో మరియ అక్కడ ఉండి ఆ సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
మరుసటి రోజున అంటే సిద్ధపడే రోజుకు తరువాతి రోజున – ప్రధాన యాజులూ పరిసయ్యులూ పోగై పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇలా అన్నారు: “అయ్యా, ఆ మోసగాడు బతికి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా లేస్తాను’ అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. అందుచేత మూడో రోజువరకు సమాధిని భద్రం చేయాలని ఆజ్ఞ జారీ చేయండి. లేకపోతే రాత్రి వేళ అతడి శిష్యులు వెళ్ళి అతణ్ణి ఎత్తుకుపోయి, ‘ఆయన చనిపోయినవాళ్ళలో నుంచి సజీవంగా లేచాడు’ అని ప్రజలతో అంటారేమో. అలాంటప్పుడు మొదటి వంచనకంటే చివరి వంచన చెడ్డదవుతుంది.”
పిలాతు వారితో, “కావలివారున్నారు గదా. మీరు వెళ్ళి మీ శాయశక్తులా సమాధిని భద్రం చేయండి” అన్నాడు.
వారు వెళ్ళి కావలివారిని ఉంచి రాతికి ముద్ర వేసి సమాధికి కావలివారిని ఉంచారు.
మార్కు శుభవార్త 15:42-47
అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. అప్పటికి సాయంకాలం అయింది గనుక అరిమతయి గ్రామం వాడైన యోసేపు వచ్చి ధైర్యం తెచ్చుకొని పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. ఈ యోసేపు యూద సమాలోచన సభలో గౌరవనీయుడైన సభ్యుడూ దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడూ.
ఇంతకు ముందే ఆయన చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి ఆయన అప్పటికే చనిపోయాడా అని అతణ్ణి అడిగాడు. ఆయన చనిపోయాడని శతాధిపతివల్ల తెలుసుకొని ఆయన దేహాన్ని యోసేపుకు ఇప్పించాడు.
యోసేపు సన్నని నారబట్ట కొని యేసును క్రిందకు దింపి ఆ బట్టతో చుట్టాడు. రాతిలో తొలిపించబడ్డ సమాధిలో ఆయనను పెట్టాడు. సమాధి ద్వారానికి రాయి దొర్లించాడు.
ఆయనను పెట్టిన చోటును మగ్దలేనే మరియ, యోసే తల్లి అయిన మరియ చూశారు.
లూకా శుభవార్త 23:50-56
యూద సమాలోచన సభలో యోసేపు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు మంచివాడు, న్యాయవంతుడు. అతడు ఆ సభ వారు చేసిన నిర్ణయానికీ క్రియకూ ఒప్పుకోలేదు. అతడు యూదుల గ్రామాలలో ఒకటైన అరిమతయి నివాసి, దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడు. ఈ మనిషి పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు. సిలువమీద నుంచి దానిని క్రిందకు దింపి సన్నని నారబట్టతో చుట్టాడు, తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు. దానిలో అంతకు ముందు ఎవరూ ఉంచబడలేదు. అది పండుగకు సిద్ధపడే దినం. విశ్రాంతి దినం మొదలు కాబోతూ వుంది. గలలీనుంచి ఆయనతోకూడా వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్ళి సమాధిని చూశారు, ఆయన దేహాన్ని దానిలో ఎలా ఉంచాడో గమనించారు. అప్పుడు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యాలూ పరిమళ తైలాలూ సిద్ధం చేసి దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినాన విశ్రమించారు.
యోహాను శుభవార్త 19:38-42
ఆ తరువాత అరిమతయి గ్రామం వాడైన యోసేపు యేసు మృత దేహాన్ని తీసుకుపోవడానికి పిలాతును అడిగాడు. పిలాతు అనుమతించాడు. యోసేపు యేసుకు శిష్యుడు గాని యూదులకు భయపడి రహస్యంగా శిష్యుడుగా ఉన్నాడు. అతడు వచ్చి యేసు మృత దేహాన్ని తీసుకువెళ్ళాడు. నీకొదేము కూడా వచ్చాడు. ఈ నీకొదేము అంతకు ముందు రాత్రివేళ యేసుదగ్గరకు వచ్చినవాడు. అతడు బోళంతో కలిపిన అగరు సుమారు నలభై అయిదు కిలోగ్రాములు తెచ్చాడు. వారు యేసు దేహాన్ని తీసుకొని యూదుల భూస్థాపన ఆచారం ప్రకారం ఆ సుగంధ ద్రవ్యాలు పెట్టి అవిసెనార గుడ్డలు చుట్టారు. ఆయనను సిలువ వేసిన స్థలంలో తోట ఉంది. తోటలో కొత్త సమాధి ఉంది. దానిలో అదివరకు ఎవరినీ ఉంచడం జరుగలేదు. ఆ సమాధి దగ్గరగా ఉండడంచేత, ఆ రోజు యూదులకు పస్కాను తయారు చేసే రోజు గనుక వారు ఆయనను దానిలో పెట్టారు.
యేసు మరణం నుండి లేచాడు మరియు ఇతరులకు కనిపించాడు
మత్తయి శుభవార్త 28:1-20
విశ్రాంతి దినం గడచిన తరువాత ఆదివారం నాడు తెల్లవారుతూ ఉండగానే మగ్దలేనే మరియ, ఆ మరో మరియ సమాధిని చూడడానికి వచ్చారు. అంతకుముందు ఒక పెద్ద భూకంపం కలిగింది. ఎందుకంటే ప్రభుదూత ఒకడు పరలోకంనుంచి దిగివచ్చి, ద్వారం నుంచి ఆ రాయి దొర్లించి దానిమీద కూర్చున్నాడు. అతడి రూపం మెరుపులాగా ఉంది, అతని వస్త్రం చలి మంచంత తెల్లగా ఉంది. అతని భయంచేత కావలివారికి వణకు పుట్టి చచ్చినంత పనైంది.
దేవదూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు: “భయపడకండి! సిలువ వేయబడ్డ యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన సజీవంగా లేచాడు. రండి, ప్రభువు పడుకొన్న స్థలం చూడండి. అప్పుడా దూత, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ‘ఆయన చనిపోయిన వారిలోనుంచి సజీవంగా లేచాడు. మీకంటే ముందుగా గలలీకి వెళ్ళబోతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. ఇదిగో, మీతో నేను ఇది చెపుతున్నాను.”
వారు భయంతో, గొప్ప సంతోషంతో సమాధినుంచి త్వరగా వెళ్ళి, ఆయన శిష్యులకు ఆ విషయం చెప్పడానికి పరుగెత్తారు. వారు ఆయన శిష్యులకు ఇలా చెప్పడానికి వెళ్ళిపోతుండగా యేసు వారిని ఎదుర్కొని, “శుభం!” అన్నాడు. వారు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆరాధించారు.
యేసు వారితో “భయపడకండి! వెళ్ళి నా సోదరులు గలలీకి వెళ్ళాలనీ అక్కడ వారు నన్ను చూస్తారనీ వారికి తెలియజేయండి” అన్నాడు.
వారు వెళ్తూ ఉన్నప్పుడే ఆ కావలివారిలో కొందరు నగరంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజులకు చెప్పారు. వారు పెద్దలతో సమకూడి సమాలోచన చేసినతరువాత, ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి ఇలా అన్నారు:
“మీరు వారితో ఈ విధంగా చెప్పండి – ‘రాత్రివేళ మేము నిద్రపోతూ ఉన్నప్పుడు అతడి శిష్యులు వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు.’ ఒకవేళ ఇది అధిపతి చెవిని పడితే మేము అతడికి నచ్చచెప్పి మీకేమీ తొందర రాకుండా చేస్తాం.”
వారు ఆ డబ్బు తీసుకొని తమకు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేశారు. ఈ కథ యూదులలో వ్యాపిస్తూ నేటివరకు ప్రచారంలో ఉంది.
పదకొండుమంది శిష్యులు గలలీకి వెళ్ళి యేసు వారికి నిర్ణయించిన కొండ చేరుకొన్నారు. ఆయనను చూచినప్పుడు వారు ఆయనను ఆరాధించారు. గానీ కొందరు సందేహించారు.
యేసు దగ్గరగా వచ్చి వారితో ఇలా అన్నాడు: “పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.
మార్కు శుభవార్త 16:1-8
విశ్రాంతి దినం తరువాత మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహాన్ని అభిషేకించుదామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం నాడు వారు తెల్లవారు జామున ప్రొద్దు పొడవడంతోనే సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. “మనకోసం ఎవరు సమాధి ద్వారంనుంచి ఆ రాయి దొర్లించివేస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అప్పుడు తలెత్తి చూస్తే ఆ రాయి – అది చాలా పెద్దది – దొర్లించి ఉండడం వారికి కనిపించింది. వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు తెల్లని అంగీ తొడుక్కొన్న యువకుడొకడు కుడి వైపున కూర్చుని ఉండడం వారు చూచి నిర్ఘాంతపోయారు.
అతడు వారితో ఇలా అన్నాడు: “నిర్ఘాంతపోకండి! మీరు వెదుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన సజీవంగా లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఇదిగో, వారు ఆయనను పెట్టిన స్థలం! వెళ్ళి ఆయన శిష్యులతో – పేతురుతో కూడా – ఇలా చెప్పండి: మీకంటే ముందుగా ఆయన గలలీకి వెళ్ళబోతున్నాడు. ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరాయనను చూస్తారు.”
వారు త్వరగా బయటికి వెళ్ళి సమాధినుంచి పారిపోయారు. ఎందుకంటే వారికి వణుకు, విస్మయం పట్టుకొన్నాయి. వారు భయం కారణంగా ఎవరితో ఏమీ చెప్పలేదు.
లూకా శుభవార్త 24:1-49
ఆదివారం నాడు తెల్లవారు జామున తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారు, మరి కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. సమాధిముందు నుంచి ఆ రాయి దొర్లించి ఉండడం వారికి కనిపించింది. అయితే వారు సమాధిలోకి వెళ్ళి చూచినప్పుడు ప్రభువైన యేసు శరీరం కనబడలేదు. దీన్ని గురించి వారు అధికంగా కలవరపడుతూ ఉంటే హఠాత్తుగా ధగధగ మెరిసిపోతున్న వస్త్రాలు తొడుక్కొన్న ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడ్డారు. ఆ స్త్రీలు భయపడి నేల వైపు తమ ముఖాలు వంచుకొన్నారు. అయితే ఆ వ్యక్తులు “సజీవుణ్ణి చనిపోయినవారిమధ్య ఎందుకు వెదకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. సజీవంగా లేచాడు. ఆయన ఇంకా గలలీలో ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే, మానవ పుత్రుణ్ణి పాపిష్టి మనుషుల చేతికి అప్పగించడం, సిలువ వేయడం, ఆయన మూడో రోజున మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి” అని వారితో చెప్పారు.
అప్పుడు ఆయన మాటలు వారికి జ్ఞప్తికి వచ్చాయి. వారు సమాధినుంచి తిరిగి వెళ్ళి పదకొండుమంది శిష్యులకూ తక్కినవారందరికీ ఇదంతా తెలియజేశారు. ఈ విధంగా క్రీస్తు రాయబారులకు ఈ సంగతులు చెప్పినది ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వారితోకూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరికి తెలివితక్కువ కబుర్లలాగా అనిపించాయి గనుక వీరు వారిని నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధిదగ్గరకు పరుగెత్తి వెళ్ళి వంగి చూశాడు.సన్నని నారబట్ట మాత్రం విడిగా ఉండడం అతనికి కనబడింది. జరిగినదానికి ఆశ్చర్యపడుతూ అతడు వెళ్ళి పోయాడు.
ఆ రోజే శిష్యులలో ఇద్దరు ఎమ్మాయస్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అది జెరుసలంకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. జరిగిన సంగతులన్నిటిని గురించీ వారు మాట్లాడుకొంటూ ఉన్నారు. అలా మాట్లాడుకొంటూ, చర్చించుకొంటూ ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారి కండ్లు మూతలు పడ్డట్లయింది గనుక వారాయనను గుర్తుపట్టలేదు.
“మీరు దుఃఖంతో నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న సంగతి ఏమిటి?” అని ఆయన వారినడిగాడు. వారిలో క్లెయొపా అనే ఒకడు ఆయనతో “జెరుసలంలో కాపురమున్న కొత్త వ్యక్తి మీరు ఒక్కరేనా? ఈ రోజుల్లో అక్కడ జరిగిన సంగతులు మీకు తెలియదా?” అన్నాడు.
ఆయన “ఏమి సంగతులని?” అని వారితో అన్నాడు. వారు ఆయనతో ఇలా అన్నారు: “నజరేతువాడైన యేసు సంగతులే! ఆయన దేవుని దృష్టిలోను ప్రజలందరి దృష్టిలోనూ మాటలలో, పనులలో బలప్రభావాలు ఉన్న ప్రవక్త. ప్రముఖ యాజులూ మన అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారు. ఇస్రాయేల్ ప్రజలకు విముక్తి కలిగించబోయేవాడు ఆయనే అని మేము ఆశతో ఎదురు చూశాం. అంతేకాదు, ఇదంతా జరిగి ఇప్పటికి మూడో రోజు. ఈవేళ మా గుంపులో కొందరు స్త్రీలు మాకు విస్మయం కలిగించారు. ఉదయాన పెందలకడే వారు సమాధి దగ్గరికి వెళ్లి చూస్తే ఆయన శరీరం వారికి కనిపించలేదు. వారు వచ్చి దేవదూతలు తమకు కనబడి ఆయన బతికి ఉన్నట్టు తమతో చెప్పారన్నారు. మా తోటివారిలో కొందరు సమాధికి వెళ్ళి చూచినప్పుడు అంతా ఆ స్త్రీలు చెప్పినట్లే ఉంది. ఆయనను మాత్రం వారు చూడలేదు.”
అందుకాయన వారితో అన్నాడు “మీరు తెలివి తక్కువవారు! ప్రవక్తలు చెప్పినదంతా నమ్మడంలో మంద మతులు! ఆ బాధలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం క్రీస్తుకు తప్పనిసరే గదా!”
అప్పుడు మోషే, ప్రవక్తలందరూ వ్రాసినవాటితో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో తనను గురించిన విషయాలు ఆయన వారికి వివరించాడు.
వారు వెళ్తున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా ముందుకు వెళ్ళబోయాడు. అయితే వారు “సాయంకాలం కావచ్చింది. పొద్దు కుంకుతూ ఉంది. మాతో ఉండిపోండి” అంటూ ఆయనను బలవంతం చేశారు. అందుచేత వారితో ఉండడానికి లోపలికి వెళ్ళాడు. వారితో కూడా ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని దాన్ని దీవించి విరిచి వారికి అందించాడు. వెంటనే వారి కండ్లు తెరుచుకొన్నాయి. వారాయనను గుర్తుపట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా అంతర్ధానమయ్యాడు.
అప్పుడు “తోవలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలు తేటపరుస్తూ ఉంటే మన గుండెలు దహించుకు పోతున్నట్లు అనిపించలేదా!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
ఆ ఘడియలోనే వారు లేచి జెరుసలం తిరిగి వెళ్ళారు. అక్కడ వారికి కనిపించినదేమంటే, ఆ పదకొండు మంది శిష్యులూ వారితో ఉన్నవారూ గుమికూడి “ప్రభువు వాస్తవంగా లేచాడు, సీమోనుకు కనబడ్డాడు!” అని చెప్పుకొంటున్నారు. అది విని వారు దారిన జరిగిన సంగతులూ ఆయన రొట్టె విరిచినప్పుడు ఆయన తమకు తెలిసిపోయిన సంగతి కూడా తెలిపారు.
వారీ సంగతులు చెపుతూ ఉండగానే యేసే వారిమధ్య నిలబడి “మీకు శాంతి!” అని వారితో అన్నాడు.
ఏదో ఆత్మ తమకు కనబడిందనుకొంటూ వారు హడలిపోయి భయాక్రాంతులయ్యారు.
అప్పుడాయన వారితో “మీకెందుకు ఈ కంగారు? మీ హృదయాలలో సందేహాలు ఎందుకు పుట్టాయి? నేనే గదా. నా చేతులూ పాదాలూ చూడండి. నన్ను తాకి చూడండి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలూ మాంసమూ ఒక ఆత్మకు ఉండవు” అన్నాడు. ఈ మాటలు చెప్పి తన చేతులూ పాదాలూ వారికి చూపెట్టాడు.
ఆనందం కారణంగా వారింకా నమ్మలేక ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన “తినడానికి ఇక్కడ ఏమైనా ఉందా?” అని వారినడిగాడు. కాల్చిన చేప ముక్కనూ కొంత తేనెపట్టునూ వారాయనకు అందించారు. ఆయన వాటిని తీసుకొని వారి కండ్లెదుటే తిన్నాడు.
అప్పుడాయన వారితో “మీ దగ్గర ఇంకా ఉన్నప్పుడు నేను ఈ మాటలు మీతో చెప్పాను: మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసి ఉన్న విషయాలన్నీ నెరవేరడం తప్పనిసరి” అన్నాడు.
వారు లేఖనాలు గ్రహించగలిగేలా వారి మనసులను తెరిచాడు. అప్పుడాయన “ఇలా రాసి ఉంది – ఇలా జరగడం తప్పనిసరి: అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలో నుంచి మూడో రోజున సజీవంగా లేవవలసిందే. జెరుసలం మొదలుకొని జనాలన్నిటికి ఆయన పేర పశ్చాత్తాపం, పాపక్షమాపణ ప్రకటించడం జరగాలి. మీరు ఈ విషయాలకు సాక్షులు. ఇదిగో వినండి, నా తండ్రి వాగ్దానం మీమీదికి పంపబోతున్నాను. పైనుంచి బలప్రభావాలు మిమ్ములను ఆవరించేంతవరకు జెరుసలం నగరంలోనే ఉండిపోండి” అని వారితో అన్నాడు.
యోహాను శుభవార్త 20:1–21:14
ఆదివారం నాడు పెందలకడ ఇంకా చీకటిగా ఉండగానే మగ్‌దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసివేసి ఉండడం చూచింది. గనుక ఆమె సీమోను పేతురు దగ్గరకూ యేసు ప్రేమించిన ఆ మరో శిష్యుని దగ్గరకూ పరుగెత్తి వెళ్ళింది. “వారు ప్రభువును సమాధిలో నుంచి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు” అంది.
అందుచేత పేతురు, ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి పరుగెత్తుతూ ఉన్నారు గాని ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి మొదట సమాధి చేరాడు. అతడు వంగి సమాధిలో ఆ అవిసెనార గుడ్డలు ఉండడం చూశాడు గాని లోపలికి వెళ్ళలేదు. అప్పుడు అతడి వెనకాలే సీమోను పేతురు వచ్చాడు. అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అవిసెనార బట్టలు చూశాడు. యేసు తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు. అది ఆ అవిసెనార బట్టలతో గాక వేరే చోట చుట్టిపెట్టి ఉంది. అప్పుడు, మొదట సమాధి దగ్గరికి చేరిన ఆ మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మాడు. ఆయన చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అనే లేఖనం అప్పటికి వారు గ్రహించలేదు.
అప్పుడు ఆ శిష్యులు మళ్ళీ తమ ఇండ్లకు వెళ్ళారు. మరియ సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ వంగి సమాధిలోకి చూచింది. తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారు. యేసు మృతదేహం మునుపు ఉన్న స్థలంలో తలవైపు ఒకరూ కాళ్ళవైపు మరొకరూ కూర్చుని ఉన్నారు. వారు ఆమెతో ఇలా అన్నారు: “అమ్మా! ఎందుకు ఏడుస్తూ ఉన్నావు?” ఆమె “వారు నా ప్రభువును తీసుకుపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అంది.
ఆమె అలా చెప్పి వెనక్కు తిరిగింది. యేసు అక్కడ నిలుచుండడం ఆమెకు కనిపించింది గాని యేసని ఆమె గుర్తుపట్టలేదు.
యేసు ఆమెతో “అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని వెదకుతున్నావు?” అన్నాడు. ఆయన తోటమాలి అనుకొని ఆమె ఆయనతో ఇలా అంది: “అయ్యా, ఆయనను మోసుకుపోయినది మీరే గనుక అయితే ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి. నేను ఆయనను తీసుకుపోతాను.”
అప్పుడు యేసు ఆమెతో “మరియా” అన్నాడు. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనతో “రబ్బోనీ!” అంది. ఆ మాటకు “గురువు” అని అర్థం.
యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నన్ను అంటిపెట్టుకొని ఉండబోకు. ఎందుకంటే నేను ఇంకా నా తండ్రిదగ్గరకు పైకి వెళ్ళలేదు. అయితే నా సోదరుల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు: నా తండ్రి, మీ తండ్రి దగ్గరకు, నా దేవుడు, మీ దేవుని దగ్గరకు పైకి వెళ్ళిపోతున్నాను.”
మగ్‌దలేనే మరియ వెళ్ళి తాను ప్రభువును చూశాననీ ఆయన తనతో ఆ విషయాలు చెప్పాడనీ శిష్యులకు తెలియజేసింది.
ఆ రోజు – ఆ ఆదివారం నాడు – సాయంకాల సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు. యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడియ వేసుకొని ఉన్నాయి. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. అలా చెప్పి వారికి తన చేతులనూ ప్రక్కనూ చూపెట్టాడు. ప్రభువును చూచి శిష్యులు ఆనందించారు.
యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “మీకు శాంతి కలుగుతుంది గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుతున్నాను.” ఆ విధంగా చెప్పి ఆయన వారిమీద ఊది “పవిత్రాత్మను స్వీకరించండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమాపణ పొందారు. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి” అన్నాడు.
యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా లేడు. (ఇతణ్ణి ‘దిదుమ’ అంటారు.) కాబట్టి తక్కిన శిష్యులు “మేము ప్రభువును చూశాం” అని అతనితో చెప్పారు. అతడైతే వారితో “ఆయన చేతులలో మేకుల మచ్చ నేను చూడకపోతే, ఆ మేకుల మచ్చలో నా వ్రేలు పెట్టకపోతే, ఆయన ప్రక్కన నా చేయి పెట్టకపోతే నేను నమ్మను” అన్నాడు.
ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు” అన్నాడు.
యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు. కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
 
ఆ తరువాత తిబెరియ సరస్సు ఒడ్డున యేసు తనను తన శిష్యులకు మరోసారి ప్రత్యక్షం చేసుకొన్నాడు. ప్రత్యక్షమైన విధం ఏమంటే, సీమోను పేతురు, దిదుమ అనే పేరు ఉన్న తోమా, గలలీలోని కానావాడైన నతనియేలు, జబదయి కొడుకులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు అంతా పోగయ్యారు.
సీమోను పేతురు వారితో “చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను” అన్నాడు. వారు “మేము నీతో కూడా వస్తాం” అన్నారు. వెంటనే వారు వెళ్ళి పడవ ఎక్కారు. ఆ రాత్రి వారు పట్టినది ఏమీ లేదు. ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిలుచున్నాడు గాని ఆయన యేసని శిష్యులు గుర్తుపట్టలేదు.
కనుక యేసు “అబ్బాయిలూ! తినడానికి మీదగ్గర ఏమైనా ఉందా?” అని వారితో అన్నాడు. “లేదండి” అని వారు ఆయనకు బదులు చెప్పారు.
అప్పుడాయన “పడవ కుడిప్రక్క వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని వారితో చెప్పాడు. వారలా వల వేసినప్పుడు బోలెడన్ని చేపలు పడడం చేత వల లాగలేక పోయారు.
అందుచేత యేసు ప్రేమించిన ఆ శిష్యుడు “ఆయన ప్రభువే!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే, మునుపు తీసివేసిన తన పై బట్ట వేసుకొని సరస్సులో దూకాడు. ఒడ్డు అక్కడికి చాలా దూరంలో లేదు – సుమారు రెండు వందల మూరల దూరం. కనుక తక్కిన శిష్యులు చేపలున్న వల లాక్కొంటూ ఆ చిన్న పడవలో వచ్చారు. ఒడ్డుకు చేరగానే అక్కడ నిప్పు, దానిమీద చేపలూ రొట్టెలూ వారికి కనిపించాయి.
యేసు “ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్నిటిని ఇటు తీసుకురండి” అని వారితో అన్నాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వల ఒడ్డుకు లాగాడు. వల పెద్ద చేపలతో నిండి ఉంది – మొత్తం నూట యాభై మూడు చేపలు. ఇన్ని ఉన్నా వల పిగలలేదు.
యేసు “వచ్చి భోం చేయండి” అని వారితో అన్నాడు. ఆయన ప్రభువని శిష్యులకు తెలుసు గనుక “మీరెవరు?” అని ఆయనను అడగడానికి ఎవరూ తెగించలేదు. యేసు వచ్చి రొట్టెలు చేతపట్టుకొని వారికి పంచి ఇచ్చాడు, అలాగే చేపలు కూడా ఇచ్చాడు. చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచిన తరువాత యేసు తన శిష్యులకు కనుపరచుకోవడం ఇది మూడో సారి.
అపొస్తలుల కార్యాలు 1:3-8
ఆయన బాధల తరువాత అనేక రుజువులచేత తనను సజీవంగా వారికి కనపరచుకొన్నాడు. నలభై రోజులపాటు ఆయన వారికి కనబడుతూ దేవుని రాజ్యానికి చెందే విషయాలను గురించి ఉపదేశించాడు.
ఆయన వారితో సమావేశమై వారు జెరుసలం విడిచి వెళ్ళకూడదనీ తండ్రి వాగ్దానం చేసినదాని కోసం చూస్తూ ఉండాలనీ వారికి ఆజ్ఞాపించాడు, “దాని గురించి నా వల్ల మీరు విన్నారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు” అన్నాడు.
వారు అలా సమకూడినప్పుడు “ప్రభూ, నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని ఆయనను అడిగారు.
అందుకు ఆయన వారితో అన్నాడు “తండ్రి తన అధికారంచేత కాలాలూ సమయాలూ నిర్ణయించాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బలప్రభావాలు పొందుతారు. జెరుసలంలో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు, భూమి కొనలవరకూ కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు.”
అపొస్తలుల కార్యాలు 2:24-32
అయితే మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు ఆయనను మరణ వేదనలనుంచి విడిపించి సజీవంగా లేపాడు. ఆయనను గురించి దావీదు ఇలా అన్నాడు:
ప్రభువును నా ఎదుటే నేనెప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక ఏదీ నన్ను కదల్చదు. అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక నా ఆనందాన్ని బయలుపరుస్తున్నది. నా శరీరం కూడా ఆశాభావంతో ఉంటుంది. ఎందుకంటే, నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు. నీ పవిత్రుణ్ణి కుళ్ళిపోనియ్యవు. జీవ పథాలు నీవు నాకు చూపావు. నీ సన్నిధానంలో నీవు నన్ను ఆనందంతో నింపుతావు.
“అయ్యలారా, సోదరులారా! పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి పాలయ్యాడు. నేటివరకు అతని సమాధి మన మధ్య ఉంది. అతడు ప్రవక్త. అతని సంతానంలో శరీర సంబంధంగా అతని సింహాసనం మీద కూర్చోవడానికి క్రీస్తును లేపుతానని దేవుడు శపథం చేసి తనతో ప్రమాణం చేసిన సంగతి అతనికి తెలుసు. అతడు భవిష్యత్తులోకి చూస్తూ, క్రీస్తును మృత్యులోకంలో విడిచిపెట్టడమూ ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడమూ జరగలేదని చెప్పాడు. క్రీస్తు సజీవంగా లేచిన సంగతిని గురించి చెప్పాడన్న మాటే.
“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
అపొస్తలుల కార్యాలు 3:15
మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం.
అపొస్తలుల కార్యాలు 4:10
మీరంతా, ఇస్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతువాడైన యేసు క్రీస్తు పేరటే ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు గానీ దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి లేపాడు.
అపొస్తలుల కార్యాలు 4:33
పునర్జీవితాన్ని గురించి యేసుప్రభుని క్రీస్తు రాయబారులు గొప్ప బలప్రభావాలతో సాక్ష్యమిచ్చారు. దేవుని కృప వారందరికి అధికంగా ఉంది.
అపొస్తలుల కార్యాలు 10:39-43
యూదుల దేశంలో, జెరుసలంలో ఆయన చేసినవాటన్నిటికీ మేము సాక్షులం. ఆయనను వారు మ్రానుకు వ్రేలాడదీసి చంపారు.
“మూడో రోజున దేవుడు ఆయనను సజీవంగా లేపి స్పష్టంగా కనబడేలా చేశాడు – ప్రజలందరికీ కాదు గాని సాక్షులుగా ఉండాలని దేవుడు మునుపు ఎన్నుకొన్న మాకే. చనిపోయిన వారిలోనుంచి ఆయన లేచిన తరువాత ఆయనతో మేము అన్నపానాలు పుచ్చుకొన్నాం. ప్రజలకు శుభవార్త ప్రకటించాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. బ్రతికివున్న వారికీ చనిపోయినవారికీ దేవుడు ఈయననే న్యాయాధిపతిగా నియమించిన సంగతిని గురించి మేము సాక్షులుగా హెచ్చరించాలని కూడా ఆజ్ఞాపించాడు. ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ ఆయన పేరు మూలంగా పాపక్షమాపణ దొరుకుతుందని ఆయనను గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పేవారు.”
అపొస్తలుల కార్యాలు 13:29-39
ఆయన విషయం రాసి ఉన్నదంతా వారు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుంచి దింపి సమాధిలో పెట్టారు.
“అయితే దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడు. తరువాత ఆయన, తనతో గలలీనుంచి జెరుసలంకు వచ్చినవారికి అనేక దినాలు కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన ప్రజలకు వారు ఆయన సాక్షులు. మేము మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. ఏమంటే, దేవుడు యేసును లేపి మన పూర్వీకులకు చేసిన వాగ్దానం వారి సంతానమైన మనకోసం నేరవేర్చాడు. దీనికి అనుగుణంగా రెండో కీర్తనలో ఇలా రాసి ఉంది: ‘నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను’.
“ఆయన శరీరం ఎన్నడూ కుళ్ళిపోకుండా ఆయనను చనిపోయినవారిలో నుంచి దేవుడు ఆయనను లేపిన సంగతిని గురించి ఇలా అన్నాడు: ‘దావీదు గురించిన నిశ్చయమైన దీవెనలు నీకిస్తాను.’
“అందుచేత మరో కీర్తనలో ఆయన ఇలా అన్నాడు: ‘నీ పవిత్రుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.’
“దావీదు దేవుని సంకల్పం ప్రకారం తన తరంవారికి సేవ చేసి కన్ను మూశాడు. తన పూర్వీకుల దగ్గర పూడ్చి పెట్టబడి కుళ్ళిపోయాడు. అయితే దేవుడు లేపినవాడు మాత్రం కుళ్ళిపోలేదు.
“అందుచేత, సోదరులారా, ఈ విషయం మీకు అర్థం కావాలని కోరుతున్నాంయేసుద్వారానే మీకు పాపక్షమాపణ దొరుకుతుందని ప్రకటిస్తున్నాం. మోషే ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏ విషయాలలో నిర్దోషులుగా ఎంచబడలేకపోయారో ఆ విషయాలన్నిటిలో, యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా నిర్దోషుల లెక్కలోకి వస్తారు.
అపొస్తలుల కార్యాలు 17:2-3
తన అలవాటు ప్రకారం పౌలు వారి సభకు వెళ్ళాడు. మూడు విశ్రాంతి దినాలు లేఖనాలలో నుంచి విషయాలెత్తి వారితో తర్కించాడు. అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అని వివరించి నిరూపించాడు. “మీకు నేను ప్రకటించే యేసే అభిషిక్తుడు” అన్నాడు.
అపొస్తలుల కార్యాలు 17:30-31
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
రోమా వారికి లేఖ 1:4
దేవుడు తన కుమారుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు.
రోమా వారికి లేఖ 4:24-25
మనకోసం కూడా రాసి ఉన్నాయి. చనిపోయినవారిలో నుంచి మన ప్రభువైన యేసును లేపినవానిమీద నమ్మకం ఉంచిన మనకు కూడా అది నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది. మన అపరాధాలకోసం యేసును మరణానికి అప్పగించడమూ మనం నిర్దోషులుగా ఎంచబడేలా ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది.
కొరింతువారికి లేఖ 1 15:3-8
నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలో మీకు అందించాను. ఏమంటే లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాలకోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడమూ, మూడో రోజున ఆయన సజీవంగా లేవడమూ జరిగింది. అప్పుడాయన కేఫాకు కనబడ్డాడు, తరువాత “పన్నెండుగురి”కి కనిపించాడు. ఆ తరువాత అయిదు వందలమందికి మించిన సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ బతికే ఉన్నారు గాని కొందరు కన్ను మూశారు. ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఆ తరువాత తన రాయబారులందరికీ కనిపించాడు. చివరగా నాకు – అకాలంగా జన్మించిన వాడిలాంటి నాకు కూడా కనిపించాడు.
కొరింతువారికి లేఖ 1 15:12-21
క్రీస్తును చనిపోయినవారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే, చనిపోయినవారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెపుతున్నారేమిటి? చనిపోయినవారు లేవడం అనేది లేదూ అంటే, క్రీస్తు కూడా లేవలేదన్న మాటే. క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం. అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే, గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాం గదా. చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే! మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్ను మూసినవారు నశించిపోయారు కూడా. క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టుకే గనుక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్ళం.
అయితే క్రీస్తు చనిపోయినవారిలో నుంచి లేచాడు. కన్ను మూసినవారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషిద్వారా కలిగింది.
ప్రకటన 1:18
నేను సజీవుణ్ణి. చనిపోయాను గాని చూడు, యుగయుగాలకూ జీవిస్తున్నాను. తథాస్తు. మరణ పాతాళాలకు తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమైయ్యాడు
లూకా శుభవార్త 24:50-51
అప్పుడాయన బేతనీ వరకు వారిని తీసుకువెళ్ళి తన చేతులెత్తి వారిని దీవించాడు. వారిని దీవిస్తూ ఉండగానే వారిలోనుంచి ఆయనను పరలోకానికి తీసుకు వెళ్ళడం జరిగింది.
అపొస్తలుల కార్యాలు 1:9-11
ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వారు చూస్తూ ఉండగానే ఆయనను పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన వారి కండ్లకు కనిపించకుండా మేఘం ఒకటి ఆయనను ఎత్తుకు పోయింది. ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశంవైపు తేరి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఇలా అన్నారు:
“గలలీ మనుషులారా! మీరెందుకు నిలుచుండి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు? మీ దగ్గరనుంచి యేసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది. ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు.”
అపొస్తలుల కార్యాలు 2:32-36
“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. ఆయనను దేవుని కుడిప్రక్కకు హెచ్చించడం జరిగింది. పవిత్రాత్మను గురించిన వాగ్దానం తండ్రి చేత ఆయన పొంది ఇప్పుడు మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న దీనిని కుమ్మరించాడు. దావీదు ఆకాశాలలోకి ఎక్కిపోలేదు గాని అతడు ఇలా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు: నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.’
“అందుచేత ఇస్రాయేల్‌ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయమేమంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగా, అభిషిక్తుడుగా దేవుడు నియమించాడు.”
అపొస్తలుల కార్యాలు 5:30-31
మీరు మ్రానుమీద వ్రేలాడవేసి చంపించిన యేసును మన పూర్వీకుల దేవుడు సజీవంగా లేపాడు. ఇస్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రసాదించాలని దేవుడు ఆయననే ప్రధానాధికారిగా, ముక్తిప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు.
రోమా వారికి లేఖ 8:34
ఎవరు శిక్ష విధించగలరు? వారికోసం చనిపోయింది క్రీస్తే. అంతే కాదు, సజీవంగా లేచినవాడు కూడా ఆయనే. దేవుని కుడిప్రక్కన కూర్చుని ఉండి మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే.
ఎఫెసువారికి లేఖ 1:20-23
ఆ బలప్రభావాలచేత ఆయన క్రీస్తును చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపి పరమ స్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు. సర్వాధిపత్యం కంటే, అధికారంకంటే, శక్తికంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలో గానీ వచ్చే యుగంలో గానీ పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడన్నమాటే. అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.
ఫిలిప్పీవారికి లేఖ 2:9-11
ఈ కారణంచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు. దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది, తండ్రి అయిన దేవుని మహిమకోసం ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది.
హీబ్రూవారికి లేఖ 1:3-11
ఆ కుమారుడు దేవుని మహిమాతేజస్సు, దేవుని స్వభావ స్వరూపం. ఆయన బలప్రభావాలు గల తన వాక్కుచేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసిన తరువాత ఆయన ఉన్నతస్థానంలో మహా ఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు.
దేవదూతలకంటే ఆయన వారసత్వంగా ఎంత శ్రేష్ఠమైన పేరు పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడయ్యాడు కూడా. దేవుడు దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను.” లేదా, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు.”
అంతే కాదు, ఆయన ఆ ప్రముఖుణ్ణి లోకంలోకి మళ్ళీ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి అన్నాడు. దేవదూతలను గురించి ఆయన ఇలా అంటున్నాడు: “తన దూతలను గాలివంటివారుగా, తన సేవకులను మంటలలాంటివారుగా చేసుకొనేవాడు.” తన కుమారునితో అయితే ఇలా అంటున్నాడు: “దేవా! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నీ రాజదండం న్యాయదండం. నీవు న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు. అందుచేత దేవుడు – నీ దేవుడు – నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించాడు”.
కుమారుణ్ణి గురించి ఇంకా అన్నాడు: “ప్రభూ! ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు. ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే. అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు. అవన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి.
హీబ్రూవారికి లేఖ 2:9
అయితే మనం చూచేది ఏమిటంటే, మరణబాధలు అనుభవించడానికి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ, ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహంవల్ల ప్రతి ఒక్కరికోసమూ ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం.
హీబ్రూవారికి లేఖ 4:14-16
అయితే మనకు గొప్ప ప్రముఖయాజి ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాం. ఎందుకంటే, మనకు ఉన్న ప్రముఖయాజి మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమపరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు. కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.
హీబ్రూవారికి లేఖ 7:25-26
ఈ కారణంచేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చినవారిని శాశ్వతంగా రక్షించగలవాడు. ఎందుకంటే వారి పక్షంగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు.
ఇలాంటి ప్రముఖయాజి మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు, ఆకాశాలకంటే ఉన్నతుడైనవాడు.
హీబ్రూవారికి లేఖ 10:12-14
ఈ మానవుడైతే పాపాలకోసం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే బలి ఇచ్చిన తరువాత దేవుని కుడివైపున కూర్చున్నాడు. అప్పటినుంచి ఆయన తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకే యజ్ఞంచేత ఈయన పవిత్రపరచబడుతున్నవారిని శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.
పేతురు లేఖ 1 3:22
ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతలమీద, అధికారులమీద, బలాఢ్యులమీద అధికారం కలిగింది.
పరిశుద్ధాత్మ ఈ విధంగా ఉన్నాడు
మత్తయి శుభవార్త 28:19
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి,
మార్కు శుభవార్త 1:9-11
ఆ రోజులలో యేసు గలలీలోని నజరేతు నుంచి వచ్చి యోహానుచేత యొర్దానులో బాప్తిసం పొందాడు. నీళ్ళ నుంచి ఆయన రాగానే ఆకాశం చీలిపోవడం, దేవుని ఆత్మ పావురంలాగా తన మీదికి దిగిరావడం చూశాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
మార్కు శుభవార్త 3:28-30
మీతో ఖచ్చితంగా అంటున్నాను, మనుషుల పాపాలన్నిటికీ వారు చెప్పే దూషణలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. కానీ దేవుని పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వ్యక్తికి క్షమాపణ అంటూ ఎన్నడూ దొరకదు. అలా చేసే వ్యక్తి శాశ్వత శిక్షావిధికి లోనయ్యేవాడు.” వారు తనకు మలిన పిశాచం పట్టిందని అన్నందుచేత ఆయన ఈ విధంగా చెప్పాడు.
లూకా శుభవార్త 1:35
దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది.
లూకా శుభవార్త 3:16
వారందరికీ యోహాను ఇచ్చిన జవాబిది: “నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నిజమే. గానీ నాకంటే బలప్రభావాలున్నవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పవిత్రాత్మలోనూ మంటల్లోనూ మీకు బాప్తిసమిస్తాడు.
లూకా శుభవార్త 4:1
యేసు పవిత్రాత్మతో నిండినవాడై యొర్దానునుంచి తిరిగి వచ్చాడు. అప్పుడా ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు.
లూకా శుభవార్త 11:13
“మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు మీ పరమ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా పవిత్రాత్మను ప్రసాదిస్తాడు గదా!”
లూకా శుభవార్త 12:12
ఎందుకంటే మీరేమి చెప్పాలో ఆ ఘడియలోనే పవిత్రాత్మ మీకు నేర్పుతాడు.”
యోహాను శుభవార్త 1:32-34
యోహాను ఇలా సాక్ష్యం చెప్పాడు: “పరలోకంలో నుంచి దేవుని ఆత్మ పావురంలాగా దిగిరావడం, ఆయన మీద నిలిచి ఉండడం నేను చూశాను. నేనాయనను గుర్తుపట్టలేదు గాని నీళ్ళలో బాప్తిసం ఇమ్మని నన్ను పంపినవాడు నాతో ఇలా అన్నాడు: ఎవరిమీద ఆత్మ దిగివచ్చి నిలిచి ఉండడం నీవు చూస్తావో ఆయనే పవిత్రాత్మలో బాప్తిసం ఇస్తాడు. దానిని నేను చూశాను. ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను.”
యోహాను శుభవార్త 3:5-8
యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”
యోహాను శుభవార్త 7:37-39
ఆ పండుగలో చివరి రోజున – ఆ మహా దినాన యేసు నిలబడి బిగ్గరగా ఇలా చెప్పాడు: “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి అంతరంగంలో నుంచి జీవ జల నదులు పారుతాయి. ఇది లేఖనాలు చెప్పిన ప్రకారమే.”
ఆయనమీద నమ్మకం ఉంచుతున్నవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అప్పటికి యేసు ఇంకా మహిమాస్థితి పొందలేదు గనుక పవిత్రాత్మను అనుగ్రహించడం ఇంకా జరుగలేదు.
యోహాను శుభవార్త 14:15-17
“నా మీద మీకు ప్రేమ గనుక ఉంటే నా ఆజ్ఞలను ఆచరించండి. నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. ఈయన సత్యాత్మ. లోకం ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు.
యోహాను శుభవార్త 14:26
తండ్రి నా పేర పంపబోయే ఆదరణకర్త మీకు అన్ని విషయాలు ఉపదేశిస్తాడు. ఆయన పవిత్రాత్మ. నేను మీతో చెప్పినవన్నీ మీ జ్ఞప్తికి తెస్తాడు.
యోహాను శుభవార్త 15:26
“నేను ఆదరణకర్తను మీ దగ్గరకు తండ్రినుంచి పంపుతాను. ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెపుతాడు. ఆయన తండ్రినుంచి బయలుదేరే సత్యాత్మ.
యోహాను శుభవార్త 16:7-15
అయినా నేను మీతో చెప్పేది సత్యమే – నేను వెళ్ళిపోవడం మీకు మేలు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిపోతే ఆయనను మీకు పంపుతాను.
“ఆయన వచ్చేటప్పుడు పాపాన్ని గురించీ న్యాయాన్ని గురించీ తీర్పును గురించీ లోకాన్ని ఒప్పిస్తాడు. వారు నా మీద నమ్మకం పెట్టడం లేదు, గనుక పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను, ఇకనుంచి మీరు నన్ను చూడరు గనుక న్యాయాన్ని గురించి ఒప్పిస్తాడు. ఈ లోక పాలకుడికి తీర్పు జరిగింది గనుక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
“నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన – సత్యాత్మ – వచ్చేటప్పుడు మిమ్ములను సర్వ సత్యంలోకి తీసుకువస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరగబోయేవి కూడా మీకు తెలియజేస్తాడు. నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేసి నాకు మహిమ కలిగిస్తాడు. తండ్రికి చెందేవన్నీ నావి. అందుచేతే నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.
యోహాను శుభవార్త 20:19-23
ఆ రోజు – ఆ ఆదివారం నాడు – సాయంకాల సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు. యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడియ వేసుకొని ఉన్నాయి. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. అలా చెప్పి వారికి తన చేతులనూ ప్రక్కనూ చూపెట్టాడు. ప్రభువును చూచి శిష్యులు ఆనందించారు.
యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “మీకు శాంతి కలుగుతుంది గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుతున్నాను.” ఆ విధంగా చెప్పి ఆయన వారిమీద ఊది “పవిత్రాత్మను స్వీకరించండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమాపణ పొందారు. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి” అన్నాడు.
అపొస్తలుల కార్యాలు 1:4-5
ఆయన వారితో సమావేశమై వారు జెరుసలం విడిచి వెళ్ళకూడదనీ తండ్రి వాగ్దానం చేసినదాని కోసం చూస్తూ ఉండాలనీ వారికి ఆజ్ఞాపించాడు, “దాని గురించి నా వల్ల మీరు విన్నారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు” అన్నాడు.
అపొస్తలుల కార్యాలు 1:8
అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బలప్రభావాలు పొందుతారు. జెరుసలంలో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు, భూమి కొనలవరకూ కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు.”
అపొస్తలుల కార్యాలు 2:1-18
పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారంతా ఏకగ్రీవంగా ఒక్క స్థలంలో సమకూడి ఉన్నారు. హఠాత్తుగా బలమైన గాలి హోరుమని వీచే విధంగా ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నింపివేసింది. అప్పుడు జ్వాలల్లాంటి నాలుకలు వారికి కనిపించాయి. అవి విడిపోయి వారిలో ప్రతి ఒక్కరిమీదా వాలాయి. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయారు. ఆ ఆత్మ వారికి మాట్లాడే శక్తి ఇచ్చిన ప్రకారం ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు.
ఆ కాలంలో, ఆకాశంక్రింద ఉన్న ప్రతి జనంలో నుంచి వచ్చిన యూదులు – భక్తిపరులైన పురుషులు – జెరుసలంలో నివాసమున్నారు. ఆ శబ్దం వినిపించినప్పుడు జన సమూహం అక్కడ గుమికూడారు. ప్రతి ఒక్కరూ తన మాతృభాషలోనే శిష్యులు మాట్లాడడం విని కలవరపడ్డారు. వారు ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయి ఒకరితో ఒకరు ఇలా అన్నారు:
“చూడండి! మాట్లాడుతున్న వీరంతా గలలీ ప్రాంతీయులే గదా. మనలో ప్రతి ఒక్కరమూ మన మాతృభాషలో వింటున్నామే. ఇదేమిటి? పార్తియ దేశస్థులు, మాదీయులు, ఏలాం దేశస్థులు, మెసొపొటేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్ట్ ప్రదేశాల నివాసులు, కురేనే దగ్గర ఉన్న లిబియ దేశవాసులు, రోమ్ నుంచి వచ్చి కాపురమున్నవారు, యూదులు, యూద మతంలో ప్రవేశించినవారు, క్రేతు, అరేబియా దేశాలవారు – మనం మన సొంత భాషలలో వీరు దేవుని మహాక్రియలను గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం!”
వారంతా ఆశ్చర్యపడ్డారు, విస్తుపోయారు, “దీని భావమేమిటి?” అని ఒకరినొకరు అడిగారు. కొందరైతే “వీరు కొత్త ద్రాక్షమద్యంతో నిండివున్నారు” అంటూ వేళాకోళం చేశారు.
అప్పుడు పేతురు పదకొండుమందితో కూడా నిలబడి స్వరమెత్తి వారితో ఇలా చెప్పాడు: “యూదయ మనుషులారా! జెరుసలం నివాసులారా! మీరంతా ఈ సంగతి తెలుసుకోవాలి – నేను చెప్పేది వినండి. మీరు అనుకొన్నట్టు వీరు మత్తుగా లేరు. ఇప్పుడు ప్రొద్దున తొమ్మిది గంటలయింది, అంతే.
“కానీ ఇది యోవేలుప్రవక్త చెప్పినది. అదేమంటే ‘దేవుడు అంటున్నాడు, చివరి రోజుల్లో నా ఆత్మను సర్వ ప్రజలమీద కుమ్మరిస్తాను. మీ కొడుకులూ కూతుళ్ళూ దేవునిమూలంగా పలుకుతారు. మీ యువకులకు దర్శనాలు కనిపిస్తాయి. మీ ముసలివారు కలలు కంటారు. ఆ రోజుల్లో నా సేవకులమీద, నా సేవికలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు దేవునిమూలంగా పలుకుతారు.
అపొస్తలుల కార్యాలు 2:38-39
పేతురు వారితో ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడండి! పాపక్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు. ఈ వాగ్దానం మీ కోసం, మీ సంతానం కోసం, దూరంగా ఉన్న వారందరి కోసం – అంటే, మన ప్రభువైన దేవుడు పిలిచేవారందరికోసం.”
అపొస్తలుల కార్యాలు 4:31
వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కంపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు.
అపొస్తలుల కార్యాలు 5:3-5
పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా! భూమి అమ్మిన డబ్బులో కొంత ఉంచుకొని పవిత్రాత్మకు అబద్ధం చెప్పడానికి సైతాను నీ హృదయాన్ని పూర్తిగా ఆక్రమించు కొన్నాడేమిటి? అది నీ అదుపులో ఉన్నంత వరకు నీదే గదా. అమ్మిన తరువాత కూడా ఆ డబ్బు నీ వశంలోనే ఉంది గదా. ఈ విషయం ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు అబద్ధమాడినది మనుషులతో కాదు, దేవునితోనే!”
ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి ప్రాణం విడిచాడు. ఈ విషయాల గురించి విన్నవారందరినీ మహా భయం ఆవరించింది.
అపొస్తలుల కార్యాలు 8:14-17
సమరయవారు దేవుని వాక్కు అంగీకరించారని విని జెరుసలంలో క్రీస్తురాయబారులు వారిదగ్గరకు పేతురు యోహానులను పంపారు. వీరు వచ్చి వారు పవిత్రాత్మను పొందేలా వారికోసం ప్రార్థన చేశారు. అంతకుముందు పవిత్రాత్మ వారిలో ఎవరిమీదికి రాలేదు. వారు యేసుప్రభువు పేర బాప్తిసం పొందారు అంతే. అప్పుడు పేతురు యోహానులు వారిమీద చేతులుంచారు, వారు పవిత్రాత్మను పొందారు.
అపొస్తలుల కార్యాలు 10:44-48
పేతురు ఈ మాటలు చెపుతూ ఉండగానే సందేశం విన్నవారందరి మీదికి పవిత్రాత్మ దిగి వచ్చాడు. పవిత్రాత్మ అనే ఉచిత వరాన్ని ఇతర ప్రజలమీద కూడా కుమ్మరించడం చూచి పేతురుతో వచ్చిన సున్నతి గల విశ్వాసులంతా విస్మయం చెందారు. ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడం విన్నారు.
అప్పుడు పేతురు “మనలాగే వీరు పవిత్రాత్మను పొందారు. వీరు నీళ్ళ బాప్తిసం పొందకుండా ఆటంకపెట్టగల వారెవరైనా ఉన్నారా?” అన్నాడు. ప్రభువు పేర బాప్తిసం పొందాలని వారికి ఆజ్ఞాపించాడు. తరువాత కొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతణ్ణి వేడుకొన్నారు.
అపొస్తలుల కార్యాలు 13:2-4
ఒకసారి వారు ప్రభువుకోసం సేవ చేస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మ ఇలా అన్నాడు: “నేను బర్నబానూ సౌలునూ పిలిచిన పనికోసం వారిని నాకు ప్రత్యేకించండి.” వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు.
పవిత్రాత్మ పంపగా వారు బయలుదేరి సెలూకయకు వెళ్ళారు. అక్కడ ఓడ ఎక్కి సైప్రస్ ప్రయాణం చేశారు.
అపొస్తలుల కార్యాలు 15:28
విగ్రహాలకు అర్పించినవాటిని మీరు నిరాకరించాలి. రక్తాన్నీ గొంతు పిసికి చంపినదానినీ తినకూడదు. వ్యభిచారం చేయకూడదు
అపొస్తలుల కార్యాలు 16:7-10
ముసియ సరిహద్దులకు చేరినప్పుడు బితూనియలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గాని యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అందుచేత వారు ముసియను దాటిపోయి త్రోయకు వెళ్ళారు.
అక్కడ రాత్రివేళ పౌలుకు స్వప్న దర్శనం కలిగింది. అందులో మాసిదోనియ దేశస్థుడొకడు నిలుచుండి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని అతణ్ణి వేడుకొంటూ పిలిచాడు. అతనికి ఆ దృశ్యం కలిగినప్పుడు, వారికి శుభవార్త ప్రకటించడానికి ప్రభువు మమ్ములను పిలిచాడని మేము నిశ్చయించుకొన్నాం. వెంటనే మాసిదోనియకు వెళ్ళడానికి పూనుకొన్నాం.
అపొస్తలుల కార్యాలు 19:1-7
అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఎత్తయిన ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఎఫెసుకు వెళ్ళాడు. అక్కడ కొందరు శిష్యులను చూచి “మీరు నమ్ముకొన్నప్పుడు పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.
అందుకు వారు “పవిత్రాత్మ ఉన్న విషయమే మేము వినలేదు” అని అతనితో చెప్పారు.
అప్పుడతడు “అయితే మీరు దేనిలోకి బాప్తిసం పొందారు?” అని వారిని అడిగాడు.
వారు “యోహాను బాప్తిసంలోకి” అన్నారు.
అందుకు పౌలు ఇలా అన్నాడు: “యోహాను పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిసం ఇచ్చాడు. తన వెనుక వచ్చేవానిమీద, అంటే క్రీస్తు యేసు మీద నమ్మకం ఉంచాలని అతడు ప్రజలతో చెప్పాడు.”
ఇది విని వారు యేసు పేరులోకి బాప్తిసం పొందారు.
పౌలు వారిమీద చేతులుంచినప్పుడు పవిత్రాత్మ వారిమీదికి వచ్చాడు. వారు వేరే భాషలలో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు. అంతా కలిసి వారు దాదాపు పన్నెండుగురు పురుషులు.
రోమా వారికి లేఖ 5:5
ఆశాభావం మనకు ఆశాభంగం కలిగించదు. ఎందుకంటే, మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది.
రోమా వారికి లేఖ 7:6
ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది. మనలను బంధించిన దాని విషయంలో చనిపోయాం. ఎందుకని? మనం దేవుని ఆత్మను అనుసరించే కొత్త విధానంలో సేవ చేయాలి గాని ధర్మశాస్త్రాన్ని అక్షరాల అనుసరించిన పాత విధానంలో కాదు.
రోమా వారికి లేఖ 8:9-16
అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక, ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరికైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు. క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం. చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
అందుచేత, సోదరులారా, శరీర స్వభావం ప్రకారంగా బ్రతకడానికి మనం దానికి బాకీపడ్డవారమేమీ కాము. మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే, చనిపోతారు గాని దేవుని ఆత్మమూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు. ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం. మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం. మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
రోమా వారికి లేఖ 8:26-27
అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే, తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలుకాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పం ప్రకారం పవిత్రులకోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు గనుక హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు.
కొరింతువారికి లేఖ 1 2:4
మీ విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాదు గాని దేవుని బలప్రభావాలే కావాలని నా ఉద్దేశం.
కొరింతువారికి లేఖ 1 2:9-16
రాసి ఉన్నదాని ప్రకారం, తనను ప్రేమించేవారికోసం దేవుడు సిద్ధం చేసినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మానవ హృదయంలోకి రాలేదు. అయితే వాటిని దేవుడు తన ఆత్మద్వారా మనకు వెల్లడి చేశాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు.
ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరే మనిషికి తెలుసు? అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవేవో తెలుసుకొనేలా మనం పొందినది లౌకికాత్మ కాదు గాని దేవునినుంచి వచ్చిన ఆత్మే. మేము ఆధ్యాత్మికమైన విషయాలను ఆధ్యాత్మికమైన వాటితో పోలుస్తూ మానవ జ్ఞానం నేర్పే మాటలలో కాక, దేవుని ఆత్మ నేర్పే మాటలలో వాటిని చెపుతాం.
సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలు స్వీకరించడు. అవి అతనికి తెలివితక్కువతనంగా అనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగా మాత్రమే విలువకట్టాలి గనుక అతడు వాటిని గ్రహించలేడు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటిని సరిగా పరిశీలించి అంచనా కడతాడు, గాని అతణ్ణి ఎవరూ సరిగా పరిశీలించి అంచనా కట్టరు. ప్రభు మనసు తెలుసుకొని ఆయనకు ఉపదేశించ గలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.
కొరింతువారికి లేఖ 1 3:16
మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
కొరింతువారికి లేఖ 1 6:11
గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
కొరింతువారికి లేఖ 1 6:19
మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా?
కొరింతువారికి లేఖ 1 12:1-13
సోదరులారా, దేవుడిచ్చే ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. పూర్వం మీరు ఇతర జనాలై ఎలాగైనా ఉన్నప్పుడు మూగ విగ్రహాల దగ్గరకు నడిపించబడి కొట్టుకుపోతూ ఉండేవారని మీకు తెలుసు. అందుచేత నేను మీకు తెలియజేసేదేమిటంటే, దేవుని ఆత్మవల్ల మాట్లడేవారెవరూ “యేసు శాపగ్రస్థుడు” అనరు. అంతేకాదు. పవిత్రాత్మవల్ల తప్ప ఎవరూ “యేసే ప్రభువు” అనలేరు.
దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన ఇచ్చే కృపావరాలు నానా విధాలు. ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు నానా విధాలు. అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే గాని కార్యకలాపాలు నానా విధాలు. దేవుని ఆత్మ ప్రభావ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరుగుతుంది. అది అందరి మేలుకోసమే. ఆత్మవల్ల ఒకరికి జ్ఞానవాక్కు ఇవ్వబడుతుంది. ఆ ఒకే ఆత్మ ద్వారా మరొకరికి తెలివైన మాట ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి. మరొకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం, మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం, మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం, మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం, మరొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది. ఆ ఒకే ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకు ఇష్టమున్నట్టే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు.
శరీరం ఒకటే అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి. ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైనా అన్నీ ఒకే శరీరం. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగంటే, మనం యూదులమైనా గ్రీసు దేశస్థులమైనా సరే, బానిసలమైనా స్వతంత్రులమైనా సరే, మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తిసం పొందాం. మనకందరికి ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది.
కొరింతువారికి లేఖ 2 1:21-22
క్రీస్తులో మిమ్ములనూ మమ్ములనూ సుస్థిరం చేస్తున్నది దేవుడే. మనలను అభిషేకించి మనకు ముద్ర వేసి మన హృదయంలో తన ఆత్మను హామీగా ప్రసాదించినది కూడా దేవుడే.
కొరింతువారికి లేఖ 2 5:5
ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే.
కొరింతువారికి లేఖ 2 13:14
ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉంటాయి గాక! తథాస్తు.
గలతీయవారికి లేఖ 3:2-5
ఈ ఒకే విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకుంది. మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర క్రియలచేతా? విశ్వాసంతో శుభవార్త వినడంవల్లా? మీరింత తెలివితక్కువవారా? దేవుని ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీర స్వభావంవల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా? మీరిన్ని బాధలుపడింది వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమవుతుందా? మీకు తన ఆత్మను ప్రసాదించి మీ మధ్య అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి అలా చేస్తున్నాడా? లేక మీరు విశ్వాసంతో వినడం బట్టేనా?
గలతీయవారికి లేఖ 4:6
మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో “తండ్రీ! తండ్రీ!” అని పిలుస్తున్నాడు.
గలతీయవారికి లేఖ 5:16-18
నేను చెప్పేదేమంటే, దేవుని ఆత్మకు లోబడి నడుచుకోండి. అప్పుడు శరీర స్వభావం కోరేవాటిని చేయరు. శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి – పరస్పర వైరం ఉంది, గనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు. గానీ దేవుని ఆత్మ మిమ్ములను నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు.
గలతీయవారికి లేఖ 5:22-25
దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు. క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితోకూడా దాని కోరికలనూ ఇచ్ఛలనూ సిలువ వేశారు. దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి నడుచుకొందాం.
ఎఫెసువారికి లేఖ 1:13-14
మీరు కూడా సత్య వాక్కు – మీ రక్షణ శుభవార్త – విన్నప్పుడు ఆయనమీద నమ్మకం ఉంచారు. మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీమీద పడింది. పవిత్రాత్మ మనకు మన వారసత్వం గురించి హామీగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలిగేందుకు తాను సంపాదించుకొన్న దాని విమోచన పూర్తి అయ్యేవరకూ ఈ హామీ ఉంటుంది.
ఎఫెసువారికి లేఖ 1:17
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు – మహిమ స్వరూపి అయి తండ్రి – ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఎఫెసువారికి లేఖ 3:16
విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మవల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఎఫెసువారికి లేఖ 4:3-4
దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.
క్రీస్తు శరీరం ఒక్కటే. దేవుని ఆత్మ ఒక్కడే. మీకందిన పిలుపు గురించిన ఆశాభావం కూడా ఒక్కటే.
ఎఫెసువారికి లేఖ 4:30
దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్ష దినంకోసం ఆయన మీమీద ముద్ర వేశాడు.
ఎఫెసువారికి లేఖ 5:18-20
మద్యంతో మత్తిల్లకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి. అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి. పాడుతూ మీ హృదయాలలో ప్రభువుకు గానం చేయండి. మన ప్రభువైన యేసు క్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెపుతూ ఉండండి.
ఎఫెసువారికి లేఖ 6:17-18
పాపవిముక్తి శిరస్త్రాణం ధరించుకోండి. దేవుని ఆత్మ ఖడ్గం చేతపట్టుకోండి – అది దేవుని వాక్కే. అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 1:5-6
ఎందుకంటే, మా శుభవార్త మీ దగ్గరకు వచ్చినది మాటతో మాత్రమే కాదు, బలప్రభావాలతో, పవిత్రాత్మతో, పూర్తి నిశ్చయతతో. అప్పుడు మీ మధ్య మీ మేలుకోసం ఉన్న మేము ఎలాంటివారమో మీకే తెలుసు. మీరు చాలా కష్టంలో పవిత్రాత్మ ఇచ్చే ఆనందంతో దేవుని వాక్కు అంగీకరించారు, మమ్ములనూ ప్రభువునూ పోలి ప్రవర్తించడానికి మొదలుపెట్టారు.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:19
దేవుని ఆత్మను ఆర్పకండి.
తెస్సలొనీకవారికి లేఖ 2 2:13
ప్రభువు ప్రేమిస్తున్న సోదరులారా, మేము మీ కోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసినవారం. ఎందుకంటే, తన ఆత్మ పవిత్రపరచే పని ద్వారా, మీరు సత్యం నమ్మడం ద్వారా మీకు పాపవిముక్తి లభించాలని దేవుడు మిమ్ములను మొదటినుంచి ఎన్నుకొన్నాడు.
తీతుకు లేఖ 3:5-6
ఆయన మనకు పాపవిముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే గాని మనం చేసిన నీతిన్యాయాల పనులు కాదు. కొత్త జన్మం అనే స్నానం ద్వారా, పవిత్రాత్మ మనకు నవీకరణ కలిగించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించాడు.
హీబ్రూవారికి లేఖ 2:4
దేవుడు కూడా తన ఇష్టప్రకారం సూచకమైన క్రియలూ వింతలూ నానా విధాల అద్భుతాలూ పవిత్రాత్మ ఉచిత వరాలు అనుగ్రహించడం ద్వారా వారితోపాటు సాక్ష్యం ఇచ్చాడు.
హీబ్రూవారికి లేఖ 9:14
ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతర్వాణిని జీవం గల దేవుని సేవకోసం నిర్జీవ క్రియలనుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మద్వారా తనను తానే నిష్కళంకుడుగా దేవునికి సమర్పించుకొన్నాడు.
పేతురు లేఖ 1 1:2
దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నది తన భవిష్యత్ జ్ఞానం ప్రకారం, తన ఆత్మ పవిత్రపరచే పనివల్ల, విధేయతకూ, యేసు క్రీస్తు రక్త ప్రోక్షణకూ. మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా కలుగుతాయి గాక!
పేతురు లేఖ 1 1:11
తమలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధలనూ వాటి తరువాత కలిగే మహిమగలవాటినీ ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు ఏ కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి విచారించారు
పేతురు లేఖ 2 1:20-21
అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి – లేఖనంలోని భవిష్యద్వాక్కుల్లో ఏదీ వ్యక్తిగత వివరణవల్ల అర్థం కాదు. ఎందుకంటే, భవిష్యద్వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మవశులై పలికారు.
యోహాను లేఖ 1 2:20
మీరైతే పవిత్రునిచేత అభిషేకం పొందినవారు గనుక విషయాలన్నీ తెలిసినవారు.
యోహాను లేఖ 1 3:24
ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటున్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు.
యోహాను లేఖ 1 4:13
ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. దీన్ని బట్టి మనం ఆయనలో ఉన్నామనీ ఆయన మనలో ఉన్నాడనీ మనకు తెలుసు.
యోహాను లేఖ 1 5:6-8
నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చినవాడు ఆయనే – అంటే యేసు క్రీస్తే. నీళ్ళద్వారా మాత్రమే కాదు, నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. దేవుని ఆత్మ సత్యస్వరూపి గనుక ఆత్మే సాక్ష్యం చెపుతున్నాడు. పరలోకంలో ముగ్గురు సాక్షులున్నారు – తండ్రి, “వాక్కు”, పవిత్రాత్మ. ఈ ముగ్గురూ ఒక్కటే. భూమిమీద కూడా మూడు సాక్ష్యాలు ఉన్నాయి – ఆత్మ, నీళ్ళు, రక్తం. ఈ మూడు ఏకీభవిస్తున్నాయి.
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు
మత్తయి శుభవార్త 19:4
అందుకాయన జవాబిస్తూ “మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు,
యోహాను శుభవార్త 1:3
సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు.
అపొస్తలుల కార్యాలు 14:15
“అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం.
అపొస్తలుల కార్యాలు 17:24-26
జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
“భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు.
కొరింతువారికి లేఖ 1 8:6
మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
కొలస్సయివారికి లేఖ 1:15-16
ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వసృష్టికి ప్రముఖుడు. ఎందుకంటే ఆయనవల్ల సృష్టిలో అన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఆకాశాలలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడేవి, కనబడనివి, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా – సమస్తాన్నీ ఆయనద్వారా, ఆయనకోసం సృజించడం జరిగింది.
హీబ్రూవారికి లేఖ 1:2
ఈ చివరి రోజులలోనైతే తన కుమారునిద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడుగా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని సృజించాడు కూడా.
హీబ్రూవారికి లేఖ 11:3
లోకం, దాని యుగాలు దేవుడు చెప్పిన మాట మూలంగానే రూపొందాయనీ కంటికి కనిపించేది కనిపించే వస్తువులతో నిర్మించబడలేదనీ నమ్మకంవల్లే గ్రహిస్తున్నాం.
ప్రకటన 4:11
“ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”
తరువాత దేవుడు అన్నిటినీ చూశాడు
మత్తయి శుభవార్త 6:25-34
“అందుచేత నేను మీతో చెప్పేదేమిటంటే, ‘ఏమి తింటాం? ఏమి తాగుతాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగ పెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ మీ శరీరాన్ని గురించి బెంగ పెట్టుకోకండి. తిండికంటే జీవితం ప్రధానం గదా! బట్టలకంటే శరీరం ముఖ్యం గదా! గాలిలో ఎగిరే పక్షులను చూడండి. అవి నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూడబెట్టుకోవు. అయినా, మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైనవారు గదా! చింతపడడం వల్ల మీలో ఎవరు తమ ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు?
“మీకు బట్టల విషయం చింత ఎందుకు? పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. అయినా, తన వైభవమంతటితో ఉన్న సొలొమోనుకు కూడా ఈ పూలలో ఒక్కదానికున్నంత అలంకారం లేదని మీతో చెపుతున్నాను. అల్ప విశ్వాసం ఉన్నవారలారా, ఈ వేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలం గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు గదా. కనుక ‘ఏం తింటామో? ఏం త్రాగుతామో? ఏం బట్టలు వేసుకొంటామో?’ అంటూ చింతించకండి. దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలు వీటికోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు. మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిన్యాయాలను వెదకండి. అప్పుడు వాటితోపాటు ఇవన్నీ మీకు చేకూరుతాయి. అందుచేత రేపటి విషయం చింతించకండి. దాని విషయం అదే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
మత్తయి శుభవార్త 10:29-31
“రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
అపొస్తలుల కార్యాలు 14:15-17
“అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. గత కాలాలలో ఆయన అన్ని జాతులవారిని తమ తమ మార్గాలలో నడవనిచ్చాడు. అయినా ఆయన తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎలాగంటే మనకు ఆకాశంనుంచి వానలూ ఫలవంతమైన రుతువులూ ప్రసాదిస్తూ ఆహారంతోనూ ఉల్లాసంతోనూ మన హృదయాలను తృప్తిపరుస్తూ మంచి చేస్తూ వచ్చాడు.”
రోమా వారికి లేఖ 8:28
దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచినవారికి, మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తున్నాయని మనకు తెలుసు.
రోమా వారికి లేఖ 11:36
సమస్తమూ ఆయననుంచీ, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
కొలస్సయివారికి లేఖ 1:17
ఆయనే అన్నిటికీ పూర్వమున్నవాడు, ఆయనలోనే అన్నీ ఒక దానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి.
హీబ్రూవారికి లేఖ 1:3
ఆ కుమారుడు దేవుని మహిమాతేజస్సు, దేవుని స్వభావ స్వరూపం. ఆయన బలప్రభావాలు గల తన వాక్కుచేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసిన తరువాత ఆయన ఉన్నతస్థానంలో మహా ఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు.
యాకోబు లేఖ 4:13-16
“ఈవేళో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించు కొంటాం” అని చెప్పుకొనేవారలారా, వినండి రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటిది. దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం” అనాలి. ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకొంటున్నారు. అలాంటి గర్వమంతా చెడ్డది.
ప్రజలు ఇలా ఉన్నారు
ప్రజలందరూ పాపం చేశారు
యోహాను శుభవార్త 8:7-9
వారు పట్టు విడువకుండా ఆయనను అడుగుతూ వచ్చారు గనుక ఆయన లేచి “మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు” అన్నాడు. అప్పుడాయన మళ్ళీ వంగి నేలమీద వ్రాశాడు.
ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయి – మొదట పెద్దలు నుండి చివరివాడి వరకు – ఒకరి తరువాత ఒకరు బయటికి వెళ్ళారు. చివరికి మధ్య నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే.
రోమా వారికి లేఖ 3:9-20
అలాగైతే మట్టుకేం? వారికంటే మేము మంచివారమా? ఎంత మాత్రమూ కాదు. యూదులైనా గ్రీసు దేశస్థులైనా అందరూ పాపంక్రింద ఉన్నారని ఇంతకుముందే నేరారోపణ చేశాం గదా. దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, న్యాయవంతుడు లేడు, ఒక్కడూ లేడు. గ్రహించేవారెవ్వరూ లేరు. దేవుణ్ణి వెదికేవారెవ్వరూ లేరు. అందరూ త్రోవ తప్పినవారు. అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు – ఒక్కడూ లేడు. వారి గొంతు తెరచి ఉన్న సమాధి. వారి నాలుకతో మోసం చేస్తూ ఉన్నారు. వారి పెదవులక్రింద నాగు విషం ఉంది. వారి నోళ్ళు శాపనార్థాలతో చేదు మాటలతో నిండి ఉన్నాయి. వారి పాదాలు రక్తం చిందించడానికి పరుగెత్తుతూ ఉన్నాయి. వారి త్రోవలలో నాశనం, ప్రాణగండం ఉన్నాయి. శాంతి మార్గం వారికి ఏమీ తెలియదు. వారి దృష్టిలో దేవుడంటే అసలు భయమే లేదు.
ప్రతి నోరూ మూతబడాలి, లోకమంతా దేవుని తీర్పు క్రిందికి రావాలి – అందుచేతే ధర్మశాస్త్రం చెప్పేదేదైనా ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి చెపుతూ ఉంది. ధర్మశాస్త్రంవల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. అంతే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల ఏ శరీరీ న్యాయవంతుడు అని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు.
రోమా వారికి లేఖ 3:23
ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు.
రోమా వారికి లేఖ 5:12
పాపమనేది ఒకే మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అలాగే అందరికీ చావు వచ్చింది.
గలతీయవారికి లేఖ 3:22
కానీ యేసు క్రీస్తు మీది విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం క్రింద మూసివేసింది.
యోహాను లేఖ 1 1:8-10
మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
ప్రజలు పాపం చేసినప్పుడు, వారిలా ఉంటారు
రోమా వారికి లేఖ 1:18-32
దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది. ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
ఆ కారణంచేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతోపాటు వారిని కల్మషానికి పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోనివాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తథాస్తు!
ఆ కారణంచేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహా సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకొన్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకొని ఒకణ్ణి ఒకడు మోహించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారు మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా.
దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడమంటే వారికి ఇష్టంగా లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి. వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు, తెలివితక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించనివారు, దయ చూపనివారు. ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు మరణానికి తగినవారనే దేవుని న్యాయనిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్నవారిని మెచ్చుకొంటారు.
రోమా వారికి లేఖ 8:5-8
శరీర స్వభావానికి లోనైనవారు శరీర స్వభావానికి చెందిన విశేషాల మీద మనసు పెట్టుకొంటారు. దేవుని ఆత్మకు లోనైనవారు ఆత్మ విశేషాలమీద మనసు పెట్టుకొంటారు. శరీర స్వభావానికి చెందే మనసు మరణం. దేవుని ఆత్మకు చెందే మనసు జీవమూ, శాంతీ. ఎందుకంటే, శరీర స్వభావానికి చెందే మనసు దేవునికి విరోధమే. అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదు, అలా లొంగడం అసాధ్యమే. గనుక శరీర స్వభావంలో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
ఎఫెసువారికి లేఖ 2:1-3
మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు. పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట. మునుపు మనమందరమూ వారితోపాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం, శరీర స్వభావానికీ మనసుకూ ఇష్టమైనవాటిని తీర్చుకొంటూ ఇతరులలాగే స్వభావసిద్ధంగా దేవుని కోపానికి పాత్రులుగా ఉండేవారం.
ఎఫెసువారికి లేఖ 5:3-5
కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు. అంతేగాక, బూతులు, పనికిమాలిన మాటలు, సరససల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు చెపుతూ ఉండాలి.
ఈ విషయం మీకు బాగా తెలుసు – ఏ వ్యభిచారి గానీ కల్మషుడు గానీ అత్యాశపరుడు (అతడు విగ్రహ పూజకుడు) గానీ దేవునికీ క్రీస్తుకూ చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండడు.
కొలస్సయివారికి లేఖ 3:5-10
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది. మునుపు వాటిలో బ్రతికినప్పుడు మీరూ వీటిని అనుసరించి నడుచుకొన్నారు. ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఎందుకంటే మీ పాత “మానవుణ్ణి” దాని పనులతోపాటు విసర్జించి సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో నవనూతన మవుతూ ఉన్న కొత్త “మానవుణ్ణి” ధరించుకొన్నారు.
యాకోబు లేఖ 4:17
కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం.
పేతురు లేఖ 1 4:3
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు.
యోహాను లేఖ 1 3:4-5
అపరాధం చేయడం అభ్యసించే ప్రతి ఒక్కరూ న్యాయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అపరాధమంటే న్యాయం లేనట్టు ప్రవర్తించడం. మన అపరాధాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు. ఆయనలో అపరాధమేమీ లేదు.
ప్రజలు, వారు చేసిన పాపాల శిక్ష నుండి రక్షించబడాలి
మత్తయి శుభవార్త 10:28
ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి. శరీరాన్నీ ఆత్మనూ కూడా నరకంలో నాశనం చేయగలవానికి, ఆయనకే భయపడండి.
మత్తయి శుభవార్త 13:41-42
మానవ పుత్రుడు తన దేవదూతలను పంపుతాడు. వారు తొట్రుపాటుకు కారణమైన ప్రతిదానినీ, దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలోనుంచి పోగుచేస్తారు. వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
యోహాను శుభవార్త 3:18-20
ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు. ఆ శిక్షావిధికి కారణం ఇదే – వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు. దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు.
యోహాను శుభవార్త 3:36
కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”
అపొస్తలుల కార్యాలు 17:30-31
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
రోమా వారికి లేఖ 1:18-19
దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది. ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు.
రోమా వారికి లేఖ 6:23
ఎందుకంటే, పాపంవల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.
గలతీయవారికి లేఖ 6:7-8
మోసపోకండి – దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం. మనిషి వెదజల్లే దానినే కోస్తాడు. శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశనం అనే పంట కోసుకొంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మనుంచి శాశ్వత జీవమనే పంట కోసుకొంటారు.
కొలస్సయివారికి లేఖ 3:5-6
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:7-9
కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు.
హీబ్రూవారికి లేఖ 9:27
మనుషులు ఒకే సారి చనిపోవాలనే నియమం ఉంది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది.
హీబ్రూవారికి లేఖ 10:26-31
ఎందుకంటే, సత్యాన్ని గురించి తెలుసుకొన్న తరువాత మనం బుద్ధి పూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే ఇకమీదట పాపాలకోసం బలి ఉండదు. అప్పుడు మిగిలినదేమంటే, న్యాయమైన తీర్పు గురించీ దేవుని విరోధులను దహించివేసే అగ్నిజ్వాలల్లాంటి ఆగ్రహాన్ని గురించీ భయంతో ఎదురు చూడడమే. ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఇద్దరి, ముగ్గురి సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది. అలాంటప్పుడు తన పాదాలక్రింద దేవుని కుమారుణ్ణి త్రొక్కివేసి తనను పవిత్రపరచిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించినవాడికింకా ఎంత ఎక్కువ కఠినమైన దండనకు తగినవాడని ఎంచబడతాడో! ఏమనుకొంటారు? “పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా! జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
పేతురు లేఖ 1 1:17
ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి.
పేతురు లేఖ 1 4:3-5
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
యూదా లేఖ 1:7
వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలూ లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా సశరీరులకు వెంటబడుతూ ఉండడంచేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండనపాలై ఉదాహరణగా ప్రదర్శించ బడుతున్నాయి.
ప్రకటన 20:11-15
అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.
దేవుడు ప్రజలను వారి పాపాల నుండి ఈ విధంగా రక్షించాడు
దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తూ వారు రక్షించబడాలని కోరుకుంటున్నాడు
యోహాను శుభవార్త 3:16
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
రోమా వారికి లేఖ 5:8
కానీ మనమింకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మనపట్ల చూపుతున్నాడు.
తిమోతికి లేఖ 1 2:3-6
ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
ఉన్నది ఒకే దేవుడు, దేవునికీ మనుషులకూ మధ్యవర్తి ఒక్కడే. ఆయన మానవుడైన క్రీస్తు యేసు. ఆయన అందరి కోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకొన్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయంలో చెప్పడం జరుగుతుంది.
పేతురు లేఖ 2 3:9
ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక.
యోహాను లేఖ 1 4:9-10
దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలను రక్షించుటకొరకై మరణించాడు
మార్కు శుభవార్త 10:45
ఎందుకంటే, మానవ పుత్రుడు సహా తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికే వచ్చాడు. ఇదీ గాక, అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధార పోయడానికి వచ్చాడు.”
యోహాను శుభవార్త 3:16
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
రోమా వారికి లేఖ 4:25
మన అపరాధాలకోసం యేసును మరణానికి అప్పగించడమూ మనం నిర్దోషులుగా ఎంచబడేలా ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది.
రోమా వారికి లేఖ 5:8
కానీ మనమింకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మనపట్ల చూపుతున్నాడు.
కొరింతువారికి లేఖ 1 15:3-4
నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలో మీకు అందించాను. ఏమంటే లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాలకోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడమూ, మూడో రోజున ఆయన సజీవంగా లేవడమూ జరిగింది.
కొరింతువారికి లేఖ 2 5:19-21
అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సఖ్యపరచుకొంటూ, వారిమీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు. సఖ్యపరచే సందేశం మాకప్పగించాడు.
అందుచేత మేము క్రీస్తుకు దూతలం. దేవుడు మాద్వారా వేడుకొంటూ ఉన్నట్టుంది. దేవునితో సఖ్యపడండి అంటూ క్రీస్తు పక్షంగా బతిమాలుతున్నాం. మనం ఆయనలో దేవుని నీతిన్యాయాలయ్యేలా దేవుడే ఏ పాపం లేని ఆయనను మనకోసం పాపంగా చేశాడు.
గలతీయవారికి లేఖ 3:13
ధర్మశాస్త్రం వల్ల అయిన శాపంనుంచి క్రీస్తు మనలను విమోచించాడు. ఎలాగంటే ఆయన మనకోసం శాపగ్రస్థుడయ్యాడు – “మ్రానుమీద వ్రేలాడే ప్రతి వాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
తిమోతికి లేఖ 1 2:5-6
ఉన్నది ఒకే దేవుడు, దేవునికీ మనుషులకూ మధ్యవర్తి ఒక్కడే. ఆయన మానవుడైన క్రీస్తు యేసు. ఆయన అందరి కోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకొన్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయంలో చెప్పడం జరుగుతుంది.
హీబ్రూవారికి లేఖ 2:9
అయితే మనం చూచేది ఏమిటంటే, మరణబాధలు అనుభవించడానికి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ, ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహంవల్ల ప్రతి ఒక్కరికోసమూ ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం.
హీబ్రూవారికి లేఖ 9:28
అలాగే క్రీస్తు కూడా ఒకే సారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తనకోసం ఎదురు చూచేవారికి ముక్తి ప్రసాదించడానికే రెండో సారి కనిపిస్తాడు.
పేతురు లేఖ 1 1:18-20
ఎందుకంటే మీకు తెలిసినదేమంటే, మీ పూర్వీకులనుంచి పారంపర్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్ములను విడిపించింది వెండి బంగారాలలాంటి నాశనమయ్యే వస్తువులతో కాదు గాని ఏ లోపమూ కళంకమూ లేని గొర్రెపిల్లలాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే. జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమించబడ్డాడు గాని ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షం అయ్యాడు.
పేతురు లేఖ 1 2:24-25
మనం పాపాల విషయంలో చనిపోయి నీతిన్యాయాలకోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది. ఎందుకంటే మీరు గొర్రెలలాగా త్రోవ తప్పిపోయారు గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా, పై విచారణకర్తగా ఉన్న ఆయన దగ్గరకు మళ్ళుకొని వచ్చారు.
పేతురు లేఖ 1 3:18
మనలను దేవుని దగ్గరకు తేవడానికి న్యాయవంతుడైన క్రీస్తు న్యాయం తప్పినవారికోసం పాపాల విషయంలో ఎప్పటికీ ఒకే సారి బాధలు అనుభవించాడు. శారీరకంగా ఆయన చంపబడ్డాడు. దేవుని ఆత్మచేత సజీవమయ్యాడు.
యోహాను లేఖ 1 2:2
మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు – లోకమంతటికీ ఆయన కరుణాధారమైన బలి.
ప్రకటన 5:8-10
ఆయన చుట్టి ఉన్న పత్రం తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులూ ఆ ఇరవై నలుగురు పెద్దలూ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. వారిలో ఒక్కొక్కరికి తంతి వాద్యం, ధూపంతో నిండిన బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ ధూపం పవిత్రుల ప్రార్థనలు. వారు కొత్త పాట పాడారు:
“చుట్టి ఉన్న ఆ పత్రం తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే నీవు వధ అయి, ప్రతి గోత్రంలో నుంచీ ప్రతి భాష మాట్లాడేవారిలోనుంచీ ప్రతి జాతిలోనుంచీ ప్రతి జనంలోనుంచీ మమ్మల్ని దేవునికోసం నీ రక్తంతో కొనుక్కొన్నావు, మమ్మల్ని మన దేవునికి రాజులుగా, యాజులుగా చేశావు. మనం భూమిమీద పరిపాలిస్తాం.”
యేసు మరణం (రక్తం) మన పాపల అపరాధాన్నంతా తొలగించి వేస్తుంది
మత్తయి శుభవార్త 26:26-29
వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని, దీవించి, దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. “దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.
అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు: “మీరందరూ దీనిలోది త్రాగండి. ఇది నా రక్తం – పాపక్షమాపణ కలిగేలా అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం. నేను మీతోకూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగనని మీతో చెపుతున్నాను.”
రోమా వారికి లేఖ 3:25
దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.
రోమా వారికి లేఖ 5:9-10
ఇప్పుడు మనం ఆయన రక్తంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చాం, గనుక మరీ నిశ్చయంగా ఆయనద్వారా దేవుని కోపం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. మనం దేవునికి విరోధులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం ద్వారా మనలను దేవునితో సఖ్యపరచడం జరిగింది. అలాంటప్పుడు ఆయనతో సఖ్యపడి, ఆ కుమారుడు జీవిస్తూ ఉండడంవల్ల మరి నిశ్చయంగా మనకు విముక్తి కలుగుతుంది.
ఎఫెసువారికి లేఖ 1:7
ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ, కలిగింది.
హీబ్రూవారికి లేఖ 9:11-14
అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలను గురించి ప్రముఖ యాజిగా పాత ఆరాధన గుడారం కంటే మరింత ఘనంగా, పరిపూర్ణంగా ఉన్నదాని ద్వారా వచ్చాడు. ఇది చేతులతో చేసినది కాదు. ఈ సృష్టికి సంబంధమైనది కాదన్నమాట. ఆయన మనుషుల కోసం శాశ్వత విముక్తి సంపాదించి మేకల రక్తంతో, ఎద్దుల రక్తంతో కాక తన సొంత రక్తంతోనే ఒక్క సారే అతి పవిత్ర స్థలంలో ప్రవేశించాడు. మేకల రక్తం, ఎద్దుల రక్తం, ఆవుదూడ బూడిద అశుద్ధమైన వారిమీద చల్లడం శరీర శుద్ధి విషయంలో పవిత్రపరచేది. ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతర్వాణిని జీవం గల దేవుని సేవకోసం నిర్జీవ క్రియలనుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మద్వారా తనను తానే నిష్కళంకుడుగా దేవునికి సమర్పించుకొన్నాడు.
యోహాను లేఖ 1 1:6-7
ఆయనతోకూడా మనకు సహవాసం ఉందని చెప్పుకొని చీకటిలో నడుస్తూ ఉంటే మనం అబద్ధమాడుతున్నాం, సత్యం ఆచరణలో పెట్టుకోవడం లేదు. కానీ, ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనకు పరస్పర సహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపంనుంచీ శుద్ధి చేస్తుంది.
ప్రకటన 7:14-17
“అయ్యా, మీకే తెలుసు” అని నేను అతనితో అన్నాను. అప్పుడతడు నాతో అన్నాడు “వీరు మహా బాధకాలంలో నుంచి వచ్చేవారే. గొర్రెపిల్ల రక్తంలో తమ అంగీలు ఉతుక్కొని తెల్లగా చేసుకొన్నారు. అందుచేత వారు దేవుని సింహాసనం ఎదుట ఉంటూ, ఆయన ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. సింహాసనంమీద కూర్చుని ఉన్నవాడు వారిమీద తన గుడారం కప్పుతాడు. వారికి ఇకనుంచి ఆకలి గానీ దప్పి గానీ ఉండదు. ఎండ గానీ మరే తీవ్రమైన వేడి గానీ వారికి తగలదు. ఎందుకంటే, సింహాసనం మధ్యన ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉంటాడు, జీవ జలాల ఊటలదగ్గరకు వారిని నడిపిస్తాడు. వారి కళ్ళ నుంచి కన్నీరంతా దేవుడు తానే తుడిచివేస్తాడు.”
దేవుడు మన పాపాలను క్షమిస్తాడు
అపొస్తలుల కార్యాలు 5:31
ఇస్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రసాదించాలని దేవుడు ఆయననే ప్రధానాధికారిగా, ముక్తిప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు.
అపొస్తలుల కార్యాలు 10:43
ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ ఆయన పేరు మూలంగా పాపక్షమాపణ దొరుకుతుందని ఆయనను గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పేవారు.”
అపొస్తలుల కార్యాలు 26:18
వారు చీకటిలోనుంచి వెలుగులోకీ, సైతాను అధికారం క్రిందనుంచి దేవునివైపుకు తిరిగేలా వారి కళ్ళు తెరవడానికీ ఇప్పుడు నిన్ను వారి దగ్గరకు పంపుతున్నాను. వారికి పాపక్షమాపణ కలగాలనీ, నామీద ఉంచిన నమ్మకంచేత పవిత్రం అయినవారిలో వారికి వారసత్వం లభించాలనీ నా ఉద్దేశం.’
ఎఫెసువారికి లేఖ 1:7
ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ, కలిగింది.
ఎఫెసువారికి లేఖ 4:32
ఒకరిమీద ఒకరు కరుణభావంతో దయ చూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 1:13-14
ఆయన మనలను చీకటి పరిపాలన నుంచి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. కుమారునిలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే, పాపక్షమాపణ ఉంది.
కొలస్సయివారికి లేఖ 2:13-14
మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనకు ప్రతికూలమైన రుణపత్రంగా రాసి ఉన్నదానిని – మనకు విరుద్ధమైన నిర్ణయాలను రద్దుచేసి పూర్తిగా తీసివేసి సిలువకు మేకులతో కొట్టి మన అతిక్రమక్రియలన్నీ క్షమించాడు.
హీబ్రూవారికి లేఖ 10:17-18
“వారి అపరాధాలనూ ధర్మవిరుద్ధ చర్యలను అప్పటినుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాలకోసం బలి ఇంకెన్నడూ ఉండదు.
యోహాను లేఖ 1 1:8-10
మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
దేవుడు తన ముందు మనలను నీతిమంతులనుగా మారుస్తాడు
అపొస్తలుల కార్యాలు 13:38-39
“అందుచేత, సోదరులారా, ఈ విషయం మీకు అర్థం కావాలని కోరుతున్నాంయేసుద్వారానే మీకు పాపక్షమాపణ దొరుకుతుందని ప్రకటిస్తున్నాం. మోషే ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏ విషయాలలో నిర్దోషులుగా ఎంచబడలేకపోయారో ఆ విషయాలన్నిటిలో, యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా నిర్దోషుల లెక్కలోకి వస్తారు.
రోమా వారికి లేఖ 1:16-17
క్రీస్తు శుభవార్తను గురించి నాకు సిగ్గు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే, నమ్మే ప్రతి ఒక్కరికీ – మొదట యూదులకు, తరువాత ఇతర ప్రజలకు కూడా – అది పాప విముక్తి, రక్షణ కోసం దేవుని బలప్రభావాలు. ఎందుకంటే, అందులో దేవుని న్యాయం విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడి అయింది. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: “న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు.”
రోమా వారికి లేఖ 3:21-26
ఇప్పుడైతే ధర్మశాస్త్రం లేకుండానే దేవుని న్యాయం వెల్లడి అయింది. ధర్మశాస్త్రమూ ప్రవక్తల లేఖనాలూ దానికి సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. ఆ న్యాయం యేసు క్రీస్తు మీది నమ్మకం ద్వారానే నమ్మేవారందరికీ వారందరిమీదా ఎంచబడే దేవుని న్యాయం. భేదమేమీ లేదు. ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. నమ్మకమున్నవారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృపవల్లే క్రీస్తు యేసులోని విమోచనం ద్వారానే విశ్వాసం మూలంగానే. దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. ఇప్పుడైతే తాను న్యాయవంతుణ్ణి అనీ, యేసు మీద నమ్మకం ఉన్నవారిని న్యాయవంతులుగా ఎంచేవాణ్ణి అనీ చూపించడానికి ఆయన ఆ విధంగా తన న్యాయాన్ని ప్రదర్శించాడు.
రోమా వారికి లేఖ 5:1
మనం విశ్వాసంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చినందుచేత మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉంది.
రోమా వారికి లేఖ 5:18-19
కనుక ఒకే అపరాధ ఫలితం మనుషులందరికీ శిక్షావిధి వచ్చినట్టే ఒకే న్యాయ క్రియ వలన మనుషులందరికీ ఆ ఉచిత వరం వచ్చింది. దాని ఫలితం జీవితం నిర్దోషంగా ఎంచబడడం. ఎలాగంటే, ఆ ఒకే మనిషి అవిధేయతవల్ల అనేకులు ఎలా పాపులయ్యారో అలాగే ఈ ఒకే మనిషి విధేయతవల్ల అనేకులు నిర్దోషులవుతారు.
గలతీయవారికి లేఖ 2:16
అయినా, మనిషి యేసు క్రీస్తుమీది నమ్మకం వల్లే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల నిర్దోషిగా న్యాయవంతుడుగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు, గనుక మనం కూడా ధర్మశాస్త్ర క్రియలవల్ల కాక క్రీస్తుమీది నమ్మకంవల్లే నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసుమీద నమ్మకం పెట్టాం. ధర్మశాస్త్ర క్రియలవల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు గదా.
గలతీయవారికి లేఖ 3:6-9
దీనికి అనుగుణంగా అబ్రాహాము “దేవునిమీద నమ్మకం ఉంచాడు. అతనికి ఆ నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.”
అందుచేత, విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానమని తెలుసుకోండి. దేవుడు ఇతర జనాలను విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచుతాడని దూరదృష్టితో లేఖనం ముందుగానే అబ్రాహాముకు “నీ మూలంగా జనాలన్నీ ధన్యమవుతాయి” అని శుభవార్త ప్రకటించింది. అలాగే విశ్వాస సంబంధులే విశ్వాసముంచిన అబ్రాహాముతోకూడా ధన్యులు.
తీతుకు లేఖ 3:7
ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి, శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి.
దేవుడు క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు
యోహాను శుభవార్త 3:1-16
పరిసయ్యులలో నీకొదేము అనే పేరు గల మనిషి ఉన్నాడు. అతడు యూదులకు ఒక అధికారి. ఈ మనిషి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు దేవుని దగ్గరనుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు. ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు.”
అందుకు యేసు జవాబిస్తూ “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని అతనితో చెప్పాడు.
నీకొదేము ఆయనతో “ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”
“ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము ఆయనకు చెప్పిన జవాబు.
యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “మీరు ఇస్రాయేల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు గ్రహించరా? మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మాకు తెలిసినవే చెపుతాం, చూచినవాటిని గురించే సాక్ష్యం చెపుతాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు. నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెపితే ఎలా నమ్ముతారు? పరలోకంనుంచి వచ్చినవాడు, అంటే పరలోకంలో ఉన్న మానవ పుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు.
“ఎడారిలో మోషే కంచు పామును పైకెత్తినట్టే మానవపుత్రుణ్ణి పైకెత్తడం తప్పనిసరి. ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
యోహాను శుభవార్త 5:19-29
అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
“ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
యోహాను శుభవార్త 10:10
దొంగ వచ్చే కారణం దొంగతనం, హత్య, నాశనం చేయడానికే. మనుషులకు జీవం కలగాలనీ అది సమృద్ధిగా కలగాలనీ నేను వచ్చాను.
యోహాను శుభవార్త 11:25-26
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
యోహాను శుభవార్త 14:6
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు.
యోహాను శుభవార్త 17:2-3
నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం.
యోహాను శుభవార్త 20:31
కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
రోమా వారికి లేఖ 5:21
ఈ విధంగా మరణంలో పాపం ఎలా ఏలిందో అలాగే నిర్దోషత్వం మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాశ్వత జీవానికి కృప ఏలుతుంది.
రోమా వారికి లేఖ 6:5-14
మనం ఆయనతో ఐక్యమై చనిపోయినట్టు ఉంటే, ఆయనతోకూడా సజీవంగా లేచినట్టు ఉంటాం. అనుమానం లేదు. మన పాప శరీరం ప్రభావం లేకుండా పోవాలనీ మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదనీ మన పాత మానవ స్వభావం క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు. ఆ విధంగా చనిపోయిన వ్యక్తి పాపంనుంచి విముక్తుడై ఉన్నాడు.
మనం క్రీస్తుతో చనిపోయామంటే ఆయనతో జీవిస్తాం అని కూడా నమ్ముతున్నాం. చనిపోయినవారిలో నుంచి లేచిన క్రీస్తు ఇంకెన్నడూ మళ్ళీ చనిపోడనీ ఇకనుంచి మరణానికి ఆయనమీద ప్రభుత్వమేమీ లేదనీ మనకు తెలుసు. ఎందుకంటే, ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలోనే చనిపోయాడు. చనిపోయింది ఎప్పటికీ ఒక్క సారే. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే ఈ జీవితం దేవునికోసమే.
ఆ ప్రకారమే మీరు పాపం విషయంలో చనిపోయారనీ దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి. అందుచేత చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి, శరీరం చెడ్డ కోరికలకు లోబడకండి. మీ శరీర భాగాలు దుర్మార్గ సాధనాలుగా పాపానికి ఇచ్చివేసుకోకండి గాని చనిపోయి సజీవంగా లేచినవారం అంటూ మిమ్ములను మీరే దేవునికే ఇచ్చివేసుకోండి, మీ అవయవాలు కూడా న్యాయ సాధనాలుగా దేవునికే ఇచ్చివేసుకోండి. పాపం మీ మీద అధికారం చెలాయించదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు గాని కృపక్రింద ఉన్నవారే.
రోమా వారికి లేఖ 8:10-17
క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం. చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
అందుచేత, సోదరులారా, శరీర స్వభావం ప్రకారంగా బ్రతకడానికి మనం దానికి బాకీపడ్డవారమేమీ కాము. మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే, చనిపోతారు గాని దేవుని ఆత్మమూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు. ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం. మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం. మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
మనం సంతానమైతే వారసులం కూడా, అంటే క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం.
కొరింతువారికి లేఖ 2 5:17
కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి కొత్త సృష్టి. పాతవి గతించాయి. ఇవిగో అన్నీ క్రొత్తవి అయ్యాయి.
గలతీయవారికి లేఖ 2:20
నేను క్రీస్తుతో కూడా సిలువ మరణం చెందాను. ఇకమీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు! శరీరంలో ఉన్న నా ఈ జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకొన్న దేవుని కుమారుని మీది విశ్వాసంవల్లే.
ఎఫెసువారికి లేఖ 2:1-6
మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు. పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట. మునుపు మనమందరమూ వారితోపాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం, శరీర స్వభావానికీ మనసుకూ ఇష్టమైనవాటిని తీర్చుకొంటూ ఇతరులలాగే స్వభావసిద్ధంగా దేవుని కోపానికి పాత్రులుగా ఉండేవారం.
కానీ దేవుడు! కరుణాసంపన్నుడు! ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహా ప్రేమనుబట్టి మనలను క్రీస్తుతోపాటు బ్రతికించాడు. (మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే.)
అంతేకాదు. ఆయనతోకూడా మనలను పైకెత్తి ఆయనతోకూడా పరమ స్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకొన్నాడు.
కొలస్సయివారికి లేఖ 2:13
మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు.
కొలస్సయివారికి లేఖ 3:1-4
మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఆ పైవాటిమీదే మీ మనస్సు నిలుపుకోండి గాని భూలోక విషయాలమీద కాదు. ఎందుకంటే, మీరు మృతి చెందినవారే! మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది. మన జీవమై ఉన్న క్రీస్తు కనిపించేటప్పుడు మీరూ ఆయనతోకూడా మహిమలో కనిపిస్తారు.
తిమోతికి లేఖ 2 1:10
ఇప్పుడైతే అది మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కావడంవల్ల వెల్లడి అయింది. ఆయనే చావును రద్దు చేసి శుభవార్త ద్వారా జీవాన్నీ అక్షయతనూ వెలుగులోకి తెచ్చాడు.
తీతుకు లేఖ 3:4-7
అయితే మానవుల పట్ల మన రక్షకుడైన దేవుని దయ, ప్రేమ కనిపించినప్పుడు, ఆయన మనకు పాపవిముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే గాని మనం చేసిన నీతిన్యాయాల పనులు కాదు. కొత్త జన్మం అనే స్నానం ద్వారా, పవిత్రాత్మ మనకు నవీకరణ కలిగించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి, శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి.
పేతురు లేఖ 1 1:23
ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజంనుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కానిదాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు.
యోహాను లేఖ 1 5:11-13
ఆ సాక్ష్యం ఇదే: దేవుడు శాశ్వత జీవం మనకిచ్చాడు. ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది. ఏ వ్యక్తికి దేవుని కుమారుడు ఉన్నాడో ఆ వ్యక్తికి జీవం ఉంది. ఏ వ్యక్తికి దేవుని కుమారుడు లేడో ఆ వ్యక్తికి జీవం లేదు.
దేవుని కుమారుని పేరు మీద నమ్మకం ఉంచిన మీరు శాశ్వత జీవం గలవారని మీకు తెలిసిపోవాలనీ దేవుని కుమారుని పేరుమీద ఇంకా నమ్మకం ఉంచాలనీ ఈ విషయాలు మీకు రాస్తున్నాను.
దేవుడు మనలను తన పిల్లలను చేస్తాడు
యోహాను శుభవార్త 1:12-13
అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు. వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ఛవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.
రోమా వారికి లేఖ 8:14-17
ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం. మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం. మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
మనం సంతానమైతే వారసులం కూడా, అంటే క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం.
గలతీయవారికి లేఖ 4:6-7
మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో “తండ్రీ! తండ్రీ!” అని పిలుస్తున్నాడు. కాబట్టి నీవింకా దాసుడివి కావు, కుమారుడివి. కుమారుడివైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా.
హీబ్రూవారికి లేఖ 12:5-11
అంతేగాక, కొడుకులతో చెప్పినట్టు మీతో చెప్పిన ప్రోత్సాహం మరచిపోయారు. అదేమిటంటే, నా కుమారా, ప్రభువు ఇచ్చే శిక్షను చిన్న చూపు చూడకు. ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు. తాను ప్రేమించేవారిని ప్రభువు శిక్షిస్తాడు, స్వీకరించిన ప్రతి కొడుకునూ కొరడా దెబ్బలకు గురి చేస్తాడు.
మీరు శిక్ష ఓర్చుకొంటూ ఉన్నారా, దేవుడు కొడుకులనుగా మిమ్మును చూస్తున్నాడన్న మాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు? కొడుకులందరికీ శిక్ష వచ్చేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు. అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు, వారిని గౌరవించాం. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా. వారేమో తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు.
ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది గాని సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందినవారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది.
యోహాను లేఖ 1 3:1-3
మనం దేవుని పిల్లలమని అనిపించుకొనేలా తండ్రి మనమీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి! ఈ కారణం చేత లోకం మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అయితే మనమిక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు గాని ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు. ఆయన మీద ఈ ఆశాభావం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను పవిత్రం చేసుకొంటారు.
దేవుడు మనం రక్షించబడాలని కోరుకుంటున్నాడని నేర్చుకున్నప్పుడు మనమేమి చేయాలి?
మనం పాపం చేశామని పశ్చత్తాపపడాలి మరియు పాపం చేయుట మానివేయాలి
మత్తయి శుభవార్త 4:17
అప్పటినుంచి యేసు “పరలోక రాజ్యం” దగ్గరగా ఉంది గనుక పశ్చాత్తాపపడండి అంటూ ప్రకటించడం మొదలు పెట్టాడు.
మార్కు శుభవార్త 6:12
అందుచేత వారు తరలివెళ్ళి పశ్చాత్తాపపడండి అంటూ ప్రకటించారు.
లూకా శుభవార్త 13:1-5
ఆ సమయంలో అక్కడున్న కొందరు ఆయనతో ఒక సంగతి చెప్పారు. ఏమిటంటే, పిలాతు గలలీ ప్రజలలో కొందరి రక్తాన్ని వారి బలులతో కలిపాడు. యేసు వారికిలా జవాబిచ్చాడు: “ఈ గలలీవారికి ఇలాంటివి పట్టినందుచేత గలలీ ప్రజలందరిలో వారే ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరనుకొంటున్నారా? కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాపపడకపొయ్యారా, మీరూ ఇలాగే నాశనమైపోతారు. సిలోయం గోపురం వారిమీద కూలినప్పుడు చనిపోయిన ఆ పద్ధెనిమిదిమంది జెరుసలం నివాసులందరిలో ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరను కొంటున్నారా? కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాప పడకపొయ్యారా, మీరూ అలాగే నాశనమైపోతారు.”
లూకా శుభవార్త 15:1-31
ఆయన ఉపదేశం వినడానికి సుంకంవారూ పాపులూ అంతా ఆయనకు దగ్గరగా వచ్చారు. అందుకు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ సణుగుతూ “ఈ మనిషి పాపులను దగ్గరకు చేర్చుకొంటాడు. వారితో కలిసి భోజనం చేస్తాడు” అన్నారు.
అందుచేత ఆయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు: “మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఆ తొంభై తొమ్మిది గొర్రెలను నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టి, తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా? అది కనబడ్డప్పుడు భుజాలమీద దానిని పెట్టుకొని సంతోషిస్తాడు. అతడు ఇంటికి వచ్చినప్పుడు మిత్రులనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటాడు.
“అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.
“ఒకామెకు పది వెండి నాణేలు ఉండి, వాటిలో ఒక నాణెం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంతవరకూ జాగ్రత్తగా వెదకదా? అది కనబడ్డప్పుడు స్నేహితురాండ్రనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘నేను పోగొట్టుకొన్న నాణెం నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటుంది. అలాగే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి దేవుని దూతల సముఖంలో ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.”
ఆయన ఇంకా అన్నాడు “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. చిన్నవాడు తండ్రితో ‘నాన్నా, ఆస్తిలో నాకు వచ్చే భాగమివ్వు’ అన్నాడు. తండ్రి తన జీవనాధారం వారికి పంచి ఇచ్చాడు.
“కొన్నాళ్ళకు చిన్నవాడు తనకు ఉన్నదంతా కూడగట్టుకొని దూర దేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేశాడు. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు అక్కరలో పడసాగాడు. అప్పుడు ఆ దేశ పౌరుడొకని దగ్గర చేరాడు. ఆ మనిషి పందులు మేపడానికి అతణ్ణి తన పొలాల్లోకి పంపాడు. పందులు మేపే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాలని ఆశించాడు, కాని అతనికి ఎవరూ ఏమీ పెట్టలేదు.
“అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇలా అనుకొన్నాడు: ‘మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి మనుషులకు బోలెడంత ఆహారం ఉంటుందే. నేనైతే ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను; నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకును అనిపించుకోవడానికి తగను. నన్ను నీ కూలి మనుషులలో ఒకడిగా పెట్టుకో! అంటాను.’
“అప్పుడతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
“అప్పుడా కొడుకు ‘నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకుననిపించుకోవడానికి తగను’ అని అతనితో అన్నాడు.
“అయితే తండ్రి తన దాసులను చూచి ‘అన్నిట్లో మంచి వస్త్రం తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని వ్రేలికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. తిందాం! సంబరపడదాం! ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు! తప్పిపోయి దొరికాడు!’ అన్నాడు. అప్పుడు వారు సంబరపడసాగారు.
“ఇంతలో పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు వచ్చి ఇంటికి దగ్గరగా చేరినప్పుడు సంగీత నాదం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి. అతడొక దాసుణ్ణి పిలిచి ‘వాటి అర్థమేమిటో!’ అని అడిగాడు.
“ఆ దాసుడు అతనితో ‘మీ తమ్ముడు వచ్చాడండి. తన దగ్గరకు క్షేమంగా చేరినందుచేత మీ తండ్రి కొవ్విన దూడను వధించాడండి’ అన్నాడు.
పెద్ద కొడుక్కు కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. కాబట్టి అతని తండ్రి బయటికి వచ్చి రమ్మని వేడుకొన్నాడు. కానీ తండ్రికి అతడు ‘చూడు, ఇన్ని ఏళ్ళపాటు నీకు చాకిరి చేస్తూ వచ్చాను. నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదు. అయినా నేను నా స్నేహితులతో సంబరపడేట్టు నీవు విందుకోసం మేకపిల్లనైనా ఎన్నడూ నాకివ్వలేదు. అయితే నీ జీవనాధారం వేశ్యలతో తినేసిన ఈ నీ కొడుకు రాగానే వాడికి కొవ్విన దూడను వధించావే!’ అని జవాబిచ్చాడు.
“అందుకు తండ్రి అతనితో ‘అబ్బాయి! నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే.
లూకా శుభవార్త 24:45-47
వారు లేఖనాలు గ్రహించగలిగేలా వారి మనసులను తెరిచాడు. అప్పుడాయన “ఇలా రాసి ఉంది – ఇలా జరగడం తప్పనిసరి: అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలో నుంచి మూడో రోజున సజీవంగా లేవవలసిందే. జెరుసలం మొదలుకొని జనాలన్నిటికి ఆయన పేర పశ్చాత్తాపం, పాపక్షమాపణ ప్రకటించడం జరగాలి.
అపొస్తలుల కార్యాలు 2:37-40
ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయింది. “పురుషులారా, సోదరులారా! మేమేం చేయాలి?” అని వారు పేతురునూ తక్కిన రాయబారులనూ అడిగారు.
పేతురు వారితో ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడండి! పాపక్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు. ఈ వాగ్దానం మీ కోసం, మీ సంతానం కోసం, దూరంగా ఉన్న వారందరి కోసం – అంటే, మన ప్రభువైన దేవుడు పిలిచేవారందరికోసం.”
అతడింకా అనేక మాటలతో గంబీరంగా సాక్ష్యమిచ్చి “వక్ర బుద్ధులైన ఈ తరం వారి నుంచి తప్పించుకోండి” అని వారిని హెచ్చరించాడు.
అపొస్తలుల కార్యాలు 3:19-20
“కనుక పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి! ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా, మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన యేసును ఆయన పంపేలా, మీ పాపాలు నిర్మూలం కావడానికి అలా చేయండి.
అపొస్తలుల కార్యాలు 17:29-31
మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
అపొస్తలుల కార్యాలు 20:21
దేవునిపట్ల పశ్చాత్తాపపడి మన ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులకూ గ్రీసు దేశస్థులకూ విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ వచ్చాను. ఇదంతా మీకు తెలుసు.
అపొస్తలుల కార్యాలు 26:19-20
“అందుచేత, అగ్రిప్పరాజా, పరలోక సంబంధమైన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. మొదట దమస్కులో ఉన్నవారికి, తరువాత జెరుసలంలో, యూదయ ప్రాంత మంతటిలో ఉన్నవారికి, యూదేతరులకు కూడా ప్రకటిస్తూ వారు పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనీ, పశ్చాత్తాపానికి తగిన పనులు చేయాలనీ చెపుతూ ఉన్నాను.
కొరింతువారికి లేఖ 2 7:8-11
నా ఉత్తరంవల్ల నేను మిమ్ములను దుఃఖపెట్టినా నాకు విచారం లేదు. ఆ ఉత్తరం మీకు కొద్ది కాలం దుఃఖం కలిగించిందని తెలిసి విచారపడ్డాను. ఇప్పుడైతే సంతోషిస్తున్నాను – మీకు దుఃఖం కలిగినందుచేత కాదు గాని మీరు పశ్చాత్తాపపడేటంతగా దుఃఖం కలిగినందుచేతనే. మీకు మావల్ల ఏ విషయంలోనూ నష్టం కాకుండా ఆ దుఃఖం కలిగింది దేవుని వల్ల అయింది. దేవునివల్ల అయిన దుఃఖం విముక్తికి దారితీసే పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. ఆ విషయంవల్ల విచారం కలగదు. కానీ లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది. ఈ విషయం ఆలోచించండి: దేవునివల్ల అయిన దుఃఖం మీకు కలిగింది. అది మీలో ఎంత శ్రద్ధ కలిగించిందో! ఎంత ప్రతివాదం! ఎంత కోపం! ఎంత భయం! ఎంత హృదయాభిలాష! ఎంత ఆసక్తి! ఎంత ప్రతిక్రియ! ఆ విషయంలో మీరు నిర్దోషులని అన్ని విధాలుగా రుజువు చేసుకొన్నారు.
పేతురు లేఖ 2 3:9
ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక.
ప్రకటన 9:20-21
ఈ దెబ్బలతో చావకుండా మనుషులలో మిగిలినవారు తమ చేతులతో చేసిన పనులను గురించి పశ్చాత్తాపపడలేదు. అంటే, దయ్యాలనూ, చూడలేని వినలేని నడవలేని బంగారు వెండి కంచు రాయి కొయ్యలతో చేసిన విగ్రహాలనూ పూజించడం మానలేదు. తమ హత్యలూ తమ మంత్రప్రయోగాలూ తమ వ్యభిచారాలూ తమ దొంగతనాల గురించి కూడా వారు పశ్చాత్తాపపడలేదు.
మనం రక్షించబడుటకు యేసుని విశ్వసిస్తున్నాం
యోహాను శుభవార్త 1:12
అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు.
యోహాను శుభవార్త 3:15-18
ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
“తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకంలోకి పంపాడు గాని లోకానికి శిక్ష విధించడానికి కాదు. ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు.
యోహాను శుభవార్త 3:36
కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”
యోహాను శుభవార్త 6:47
మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నామీద నమ్మకముంచినవారికి శాశ్వత జీవం ఉంది.
యోహాను శుభవార్త 14:6
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు.
యోహాను శుభవార్త 20:31
కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
అపొస్తలుల కార్యాలు 4:12
“పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
అపొస్తలుల కార్యాలు 16:30-31
అప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి “అయ్యలారా! పాపవిముక్తి నాకు కలిగేలా నేనేం చేయాలి?” అని అడిగాడు.
అందుకు వారు “ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం పెట్టు. అప్పుడు నీకు పాపవిముక్తి కలుగుతుంది. నీకు, నీ ఇంటివారికి కూడా కలుగుతుంది” అని చెప్పారు.
రోమా వారికి లేఖ 3:20-22
ధర్మశాస్త్రంవల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. అంతే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల ఏ శరీరీ న్యాయవంతుడు అని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు.
ఇప్పుడైతే ధర్మశాస్త్రం లేకుండానే దేవుని న్యాయం వెల్లడి అయింది. ధర్మశాస్త్రమూ ప్రవక్తల లేఖనాలూ దానికి సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. ఆ న్యాయం యేసు క్రీస్తు మీది నమ్మకం ద్వారానే నమ్మేవారందరికీ వారందరిమీదా ఎంచబడే దేవుని న్యాయం. భేదమేమీ లేదు.
రోమా వారికి లేఖ 10:9-10
అదేమంటే ప్రభువైన యేసును మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడని మీ హృదయంలో నమ్మితే మీరు పాపవిముక్తి, రక్షణ పొందుతారు. ఎందుకంటే, మనిషి హృదయంతో నమ్ముతాడు, దాని ఫలితం నిర్దోషత్వం. నోటితో ఒప్పుకొంటాడు. దాని ఫలితం పాపవిముక్తి.
గలతీయవారికి లేఖ 2:16
అయినా, మనిషి యేసు క్రీస్తుమీది నమ్మకం వల్లే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల నిర్దోషిగా న్యాయవంతుడుగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు, గనుక మనం కూడా ధర్మశాస్త్ర క్రియలవల్ల కాక క్రీస్తుమీది నమ్మకంవల్లే నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసుమీద నమ్మకం పెట్టాం. ధర్మశాస్త్ర క్రియలవల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు గదా.
ఎఫెసువారికి లేఖ 2:8-9
మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీవల్ల కలిగింది కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చినదే. ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియలవల్ల కలిగింది కాదు.
దేవున్ని తెలుసుకొనుటకు మరియు ఆయన మనలకు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అర్థంచేసుకొనుటకు పవిత్ర గ్రంథాన్ని చదువుతాము
మత్తయి శుభవార్త 4:1-4
అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమపరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
దుష్‌ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు!”
అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది.”
మత్తయి శుభవార్త 5:17-20
“ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దుచేయడానికి నేను వచ్చాననుకోకండి. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. నేను ఖచ్చితంగా మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు, భూమీ ఆకాశమూ నశించేవరకు, ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లు గానీ అర సున్న గానీ ఏదీ నశించదు. ఈ ఆజ్ఞలలో అతి స్వల్పమైన దానినైనా మీరి అలా చేయడం ఇతరులకు నేర్పేవారు పరలోక రాజ్యంలో అత్యల్పులుగా లెక్కలోకి వస్తారు. కానీ ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఉపదేశిస్తూ ఉండేవారు పరలోక రాజ్యంలో ఘనులుగా లెక్కలోకి వస్తారు. నేను మీతో చెపుతున్నాను, పరిసయ్యుల, ధర్మశాస్త్ర పండితుల నీతిన్యాయాలకంటే మీ నీతిన్యాయాలు మించి ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు.
మత్తయి శుభవార్త 22:29
యేసు వాళ్ళకు ఇలా జవాబిచ్చాడు: “లేఖనాలూ, దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు గనుక పొరబడుతున్నారు.
యోహాను శుభవార్త 8:31-32
అందుచేత, తనను నమ్మిన యూదులతో యేసు ఇలా అన్నాడు: “మీరు నా వాక్కులో నిలిచి ఉంటే నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు. అప్పుడు మీరు సత్యం గ్రహిస్తారు, సత్యం మీకు విడుదల కలిగిస్తుంది.”
యోహాను శుభవార్త 20:31
కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
అపొస్తలుల కార్యాలు 20:32
“ఇప్పుడు సోదరులారా, దేవునికీ ఆయన కృపవాక్కుకూ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీకు క్షేమాభివృద్ధి కలిగించి పవిత్రులైన వారందరితో కూడా వారసత్వం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు.
రోమా వారికి లేఖ 15:4
లేఖనాలు ఇచ్చే సహనం, ప్రోత్సాహంవల్లా మనం ఆశాభావం కలిగి ఉండాలని గతంలో పాత ఒడంబడికలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశంకోసం రాసి ఉన్నాయి.
రోమా వారికి లేఖ 16:26
ఈ రహస్య సత్యం ఇప్పుడు వెల్లడి అయింది. జనాలన్నీ ఈ విశ్వాస సత్యాలకు లోబడాలన్న శాశ్వతుడైన దేవుని ఆజ్ఞప్రకారం, ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియవచ్చింది.
కొలస్సయివారికి లేఖ 3:16
క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 2:13
ఈ కారణంచేత కూడా మేము ఎడతెగకుండా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాం: అంటే, మీరు మాచేత దేవుని వాక్కు విని అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్కుగా కాక దేవుని వాక్కుగానే అవలంబించారు. అది నిజంగా దేవుని వాక్కే. దాన్ని నమ్ముతున్న మీలో అది పని చేస్తూ ఉంది కూడా.
తిమోతికి లేఖ 1 4:13
నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు.
తిమోతికి లేఖ 2 3:14-17
నీవైతే నేర్చుకొని రూఢిగా నమ్ముకొన్నవి ఎవరివల్ల నేర్చుకొన్నావో నీకు తెలుసు. వాటిలో నిలకడగా ఉండాలి. చిన్నప్పటినుంచీ పవిత్ర లేఖనాలు ఎరిగినవాడివని కూడా నీకు తెలుసు. అవి క్రీస్తు యేసులో ఉంచిన నమ్మకం ద్వారా మోక్షం కోసమైన జ్ఞానం నీకు కలిగించగలవి.
బైబిలు లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగినవి, దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి. ఎలాగంటే ఉపదేశించడానికీ మందలించడానికీ తప్పులు సరిదిద్దడానికీ నీతిన్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమైనవి.
హీబ్రూవారికి లేఖ 4:12
ఎందుకంటే, దేవుని వాక్కు జీవం గలది, బలప్రభావాలు గలది, రెండంచుల ఎలాంటి ఖడ్గంకంటే కూడా వాడిగలది. అది లోపలికి దూసుకుపోతూ, ప్రాణాన్నీ ఆత్మనూ విభాగిస్తుంది, కీళ్ళనూ మూలుగనూ వేరు చేస్తుంది, తలంపులకూ హృదయభావాలకూ తీర్పు చేస్తుంది.
పేతురు లేఖ 1 1:22-25
మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడంచేత మీ హృదయాలను మీరు పవిత్రంగా చేసుకొన్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా, శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి. ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజంనుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కానిదాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు. ఎందుకంటే, “శరీరం ఉన్నవారంతా గడ్డిలాంటివారు, మానవ వైభవమంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది గాని ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.” మీకు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే.
పేతురు లేఖ 2 1:19-21
ఇంతే కాదు, నిశ్చయమైపోయిన భవిష్యద్వాక్కు కూడా మనకు ఉంది. అది చీకటిలో వెలుగిస్తున్న దీపంలాంటిది. అరుణోదయమై వేకువచుక్క మీ హృదయంలో ఉదయించేవరకు ఆ వాక్కు ను మీరు పట్టించుకొంటే మీకు మేలు. అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి – లేఖనంలోని భవిష్యద్వాక్కుల్లో ఏదీ వ్యక్తిగత వివరణవల్ల అర్థం కాదు. ఎందుకంటే, భవిష్యద్వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మవశులై పలికారు.
యోహాను లేఖ 2 9—10
ఎవరైనా అతిక్రమించి క్రీస్తు ఉపదేశంలో నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుడు లేనివాడే. క్రీస్తు ఉపదేశంలో నిలిచి ఉండే వ్యక్తికి తండ్రీ కుమారుడూ ఉన్నారు. ఈ ఉపదేశం తేకుండా ఎవడైనా మీదగ్గరకు వస్తే అతణ్ణి మీ ఇంట్లో స్వీకరించకండి, అతడికి అభివందనం చేయకండి.
ప్రకటన 1:3
దేవునిమూలంగా కలిగిన ఈ వాక్కులు చదివే వ్యక్తి, ఇది విని ఇందులో రాసి ఉన్న విషయాలను పాటించేవారు ధన్యజీవులు. ఎందుకంటే సమయం సమీపంగా ఉంది.
మనము బాప్తిస్మము పొందాము
మత్తయి శుభవార్త 28:18-20
యేసు దగ్గరగా వచ్చి వారితో ఇలా అన్నాడు: “పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.
యోహాను శుభవార్త 3:22
ఆ తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆయన వారితో కొంత కాలం గడుపుతూ బాప్తిసం ఇప్పిస్తూ ఉన్నాడు.
యోహాను శుభవార్త 4:1-2
యేసు యోహానుకంటే ఎక్కువమందిని శిష్యులుగా చేసుకొన్నట్టు, వారికి బాప్తిసం ఇస్తున్నట్టు పరిసయ్యులకు వినవచ్చింది. ఈ సంగతి ప్రభువుకు తెలిసింది. (యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు – ఆయన శిష్యులే ఇస్తూ ఉండేవారు.)
అపొస్తలుల కార్యాలు 2:37-42
ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయింది. “పురుషులారా, సోదరులారా! మేమేం చేయాలి?” అని వారు పేతురునూ తక్కిన రాయబారులనూ అడిగారు.
పేతురు వారితో ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడండి! పాపక్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు. ఈ వాగ్దానం మీ కోసం, మీ సంతానం కోసం, దూరంగా ఉన్న వారందరి కోసం – అంటే, మన ప్రభువైన దేవుడు పిలిచేవారందరికోసం.”
అతడింకా అనేక మాటలతో గంబీరంగా సాక్ష్యమిచ్చి “వక్ర బుద్ధులైన ఈ తరం వారి నుంచి తప్పించుకోండి” అని వారిని హెచ్చరించాడు. అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.
వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు.
అపొస్తలుల కార్యాలు 8:12
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించీ యేసు క్రీస్తు పేరును గురించీ ప్రకటించినప్పుడు వారు అతణ్ణి నమ్మారు, పురుషులూ స్త్రీలూ బాప్తిసం పొందారు.
అపొస్తలుల కార్యాలు 8:36-38
వారు దారిలో సాగిపోతూ ఉంటే నీళ్ళున్న చోటికి వచ్చారు. “ఇవిగో నీళ్ళు! నేను బాప్తిసం పొందడానికి ఆటంకమేమిటి?” అని నపుంసకుడు అన్నాడు. “నీవు హృదయపూర్వకంగా నమ్మితే బాప్తిసం పొందవచ్చు” అని ఫిలిప్పు చెప్పినప్పుడు అతడు “యేసు క్రీస్తే దేవుని కుమారుడని నమ్ముతున్నాను” అని జవాబిచ్చాడు. అప్పుడు రథం ఆపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు.
అపొస్తలుల కార్యాలు 10:44-48
పేతురు ఈ మాటలు చెపుతూ ఉండగానే సందేశం విన్నవారందరి మీదికి పవిత్రాత్మ దిగి వచ్చాడు. పవిత్రాత్మ అనే ఉచిత వరాన్ని ఇతర ప్రజలమీద కూడా కుమ్మరించడం చూచి పేతురుతో వచ్చిన సున్నతి గల విశ్వాసులంతా విస్మయం చెందారు. ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడం విన్నారు.
అప్పుడు పేతురు “మనలాగే వీరు పవిత్రాత్మను పొందారు. వీరు నీళ్ళ బాప్తిసం పొందకుండా ఆటంకపెట్టగల వారెవరైనా ఉన్నారా?” అన్నాడు. ప్రభువు పేర బాప్తిసం పొందాలని వారికి ఆజ్ఞాపించాడు. తరువాత కొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతణ్ణి వేడుకొన్నారు.
అపొస్తలుల కార్యాలు 16:14-15
లూదియ అనే స్త్రీ వింటూ ఉంది. ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు పొడి అమ్మే వర్తకురాలు, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె తన ఇంటివారితోపాటు బాప్తిసం పొందిన తరువాత మమ్ములను ఒత్తిడి చేస్తూ “నేను ప్రభువుకు విశ్వాసపాత్రనని మీరనుకొంటే నా ఇంటికి వచ్చి బస చేయండి” అంటూ మమ్ములను ఒప్పించింది.
అపొస్తలుల కార్యాలు 16:31-33
అందుకు వారు “ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం పెట్టు. అప్పుడు నీకు పాపవిముక్తి కలుగుతుంది. నీకు, నీ ఇంటివారికి కూడా కలుగుతుంది” అని చెప్పారు.
అప్పుడు వారు అతనికీ అతని ఇంట్లో వారందరికీ ప్రభు వాక్కు బోధించారు. ఆ రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగాడు. ఆ తరువాతే అతడు, అతని ఇంటివారంతా బాప్తిసం పొందారు.
అపొస్తలుల కార్యాలు 19:1-7
అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఎత్తయిన ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఎఫెసుకు వెళ్ళాడు. అక్కడ కొందరు శిష్యులను చూచి “మీరు నమ్ముకొన్నప్పుడు పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.
అందుకు వారు “పవిత్రాత్మ ఉన్న విషయమే మేము వినలేదు” అని అతనితో చెప్పారు.
అప్పుడతడు “అయితే మీరు దేనిలోకి బాప్తిసం పొందారు?” అని వారిని అడిగాడు.
వారు “యోహాను బాప్తిసంలోకి” అన్నారు.
అందుకు పౌలు ఇలా అన్నాడు: “యోహాను పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిసం ఇచ్చాడు. తన వెనుక వచ్చేవానిమీద, అంటే క్రీస్తు యేసు మీద నమ్మకం ఉంచాలని అతడు ప్రజలతో చెప్పాడు.”
ఇది విని వారు యేసు పేరులోకి బాప్తిసం పొందారు.
పౌలు వారిమీద చేతులుంచినప్పుడు పవిత్రాత్మ వారిమీదికి వచ్చాడు. వారు వేరే భాషలలో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు. అంతా కలిసి వారు దాదాపు పన్నెండుగురు పురుషులు.
అపొస్తలుల కార్యాలు 22:12-16
“అక్కడ అననీయ అనే వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రానికి అనుగుణంగా భయభక్తులున్నవాడు, అక్కడ నివసించే యూదులందరి మధ్య మంచి పేరు గడించినవాడు. అతడు నా దగ్గర నిలుచుండి ‘సోదరుడా! సౌలూ! దృష్టి పొందండి!’ అన్నాడు. వెంటనే దృష్టి వచ్చి అతణ్ణి చూశాను.
“అప్పుడతడు అన్నాడు ‘తన సంకల్పం తెలుసు కోవడానికీ, ఆ న్యాయవంతుణ్ణి చూడడానికీ, ఆయన నోటి మాట వినడానికీ మన పూర్వీకుల దేవుడు మిమ్ముల్ని ఎన్నుకొన్నాడు. ఎందుకంటే, మీరు చూచినవీ విన్నవీ చెపుతూ సర్వ ప్రజలకు ఆయన సాక్షిగా ఉంటారు. అయితే మీరింకా ఆలస్యం చేయడం దేనికి? లేచి బాప్తిసం పొందండి. ఆయన పేర ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగివేసుకోండి.’
రోమా వారికి లేఖ 6:1-4
అలాగైతే మనం ఇంకేమి చెప్పాలి? కృప వృద్ధి చెందాలని పాపంలో నిలిచి ఉందామా? అలా కానే కాదు! పాపం విషయంలో చనిపోయిన మనం అందులో ఇంకా ఎలా జీవించగలం? యేసు క్రీస్తులోకి బాప్తిసం పొందిన మనం, ఆయన మరణంలోకి బాప్తిసం పొందామని మీకు తెలియదా? గనుక మరణంలోకి బాప్తిసం పొందడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. ఎందుకంటే, తండ్రి అయిన దేవుని మహాత్యం క్రీస్తును చనిపోయినవారిలోనుంచి లేపినట్టే మనం కూడా క్రొత్త జీవంతో బ్రతకాలి.
గలతీయవారికి లేఖ 3:26-27
ఎందుకంటే, క్రీస్తు యేసు మీది నమ్మకం ద్వారా మీరంతా దేవుని కుమారులు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొన్నారు.
కొలస్సయివారికి లేఖ 2:12
మీరు బాప్తిసంలో ఆయనతోకూడా పాతిపెట్టబడ్డారు. ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపిన దేవుని బలప్రభావాలమీద మీరు నమ్మకం పెట్టడం ద్వారా ఆయనతో కూడా సజీవంగా లేపబడ్డారు.
పేతురు లేఖ 1 3:20-22
ఆ ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవహు రోజులలో, ఓడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో. ఆ ఓడలో కొద్దిమందినే, అంటే ఎనిమిదిమందినే నీళ్ళద్వారా రక్షించడం జరిగింది. దానికి అనుగుణమైన చిహ్నం – బాప్తిసం – ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. అది శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు గానీ దేవుని పట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు. ఈ రక్షణ యేసు క్రీస్తు పునర్జీవితం ద్వారానే కలిగేది. ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతలమీద, అధికారులమీద, బలాఢ్యులమీద అధికారం కలిగింది.
మనం ఇతర విశ్వాసులను కలిసి సహవాసం కలిగి ఉండాలి
మత్తయి శుభవార్త 18:19-20
ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
అపొస్తలుల కార్యాలు 2:41-47
అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.
వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు. ప్రతి ఒక్కరికీ భయం ముంచుకు వచ్చింది. క్రీస్తురాయబారులు అనేక ఆశ్చర్యకరమైన క్రియలు, సూచకమైన అద్భుతాలు చేశారు. విశ్వాసులంతా ఒకటిగా కలిసి తమకు కలిగినదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు. ఇదీ గాక, తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికీ అక్కరకొలది పంచి ఇస్తూ వచ్చారు. ప్రతి రోజూ ఎడతెగకుండా వారు ఏకమనస్సుతో దేవాలయంలో ఉన్నారు. ఇంటింట రొట్టె విరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆనందంతోనూ యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారు. ప్రజలంతా వారిని అభిమానించారు. పాపవిముక్తి పొందుతున్నవారిని ప్రతి రోజూ ప్రభువు తన సంఘంతో చేరుస్తూ వచ్చాడు.
రోమా వారికి లేఖ 12:4-8
ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం. ప్రత్యేకంగా ఒకరికొకరం అవయవాలై ఉన్నాం.
దేవుడు మనకు అనుగ్రహించిన కృపప్రకారం వేరువేరు కృపావరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వరం దేవునిమూలంగా పలకడం అయితే మన నమ్మకం కొలది అలా చేయాలి. అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి. ఉపదేశమైతే ఉపదేశించడంలో ఆ వరం ఉపయోగించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి. నాయకత్వం వహించేవాడు దానిని శ్రద్ధతో నిర్వహించాలి. దయ చూపేవాడు సంతోషంతో చూపాలి.
ఎఫెసువారికి లేఖ 1:22-23
అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.
ఎఫెసువారికి లేఖ 4:11-16
ఆయన తన రాయబారులుగా కొందరినీ, ప్రవక్తలను కొందరినీ, శుభవార్త ప్రచారకులను కొందరినీ, సంఘ కాపరులూ ఉపదేశకులూ అయిన కొందరినీ సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే, పవిత్రులు సేవ చేసేందుకు సమర్థులు కావాలనీ క్రీస్తు శరీరం పెంపొందాలనీ ఆయన ఉద్దేశం. మనమందరమూ నమ్మకంలో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది, సంపూర్ణ వృద్ధికి వచ్చేవరకూ – క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకొనేవరకూ ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. మనం ఇకనుంచి పసి పిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే, అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికీ ఎగిరిపోయేవారిలాగా మనముండకూడదు. మనుషులు కపటంచేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. గానీ ప్రేమతో సత్యం చెపుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు. ఆయననుంచి శరీరమంతా ప్రతి కీలూ అందించే దానిచేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అందులోని ప్రతి భాగమూ సరిగా దాని పని చేయడంవల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్థిల్లుతూ ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 3:15-17
మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞులై ఉండండి.
క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి. అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
తిమోతికి లేఖ 1 4:13
నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు.
హీబ్రూవారికి లేఖ 10:24-25
అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం. సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరచుకొంటూ, ఆ దినం దగ్గరపడడం చూచేకొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం.
మనం ఇతర విశ్వాసులతో కలిసి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలి
మత్తయి శుభవార్త 26:26-30
వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని, దీవించి, దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. “దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.
అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు: “మీరందరూ దీనిలోది త్రాగండి. ఇది నా రక్తం – పాపక్షమాపణ కలిగేలా అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం. నేను మీతోకూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగనని మీతో చెపుతున్నాను.”
వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్‌కొండకు వెళ్ళారు.
మార్కు శుభవార్త 14:22-26
వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని దీవించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి “దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.
అప్పుడాయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత వారికిచ్చాడు. పాత్రలోది వారందరూ త్రాగారు. వారితో ఆయన “ఇది నా రక్తం. అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం. మీతో ఖచ్చితంగా అంటున్నాను, దేవుని రాజ్యంలో ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగను” అన్నాడు.
వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్ కొండకు వెళ్ళారు.
లూకా శుభవార్త 22:14-20
ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన పన్నెండు మంది రాయబారులతోపాటు కూర్చున్నాడు. అప్పుడు ఆయన వారితో “నా బాధలకు ముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని మనఃపూర్వకంగా ఆశించాను. ఎందుకంటే, అది దేవుని రాజ్యంలో నెరవేరేవరకూ నేను మళ్ళీ దానిని తిననని మీతో చెపుతున్నాను” అన్నాడు.
అప్పుడాయన ఆ పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత “దీనిని తీసుకొని దీనిలోది మీలో పంచుకోండి. దేవుని రాజ్యం వచ్చేంతవరకూ నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెపుతున్నాను” అన్నాడు.
అప్పుడాయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత అర్పించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి “ఇది మీకోసం ధారదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయండి” అన్నాడు.
అలాగే, భోజనం తరువాత ఆ పాత్రను తీసుకొని ఇలా అన్నాడు: “ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తంమూలమైన క్రొత్త ఒడంబడిక.
కొరింతువారికి లేఖ 1 10:14-22
అందుచేత, నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజనుంచి పారిపోండి! మీరు తెలివైనవారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి.
మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? మనం అనేకులమైనా ఒకటే రొట్టె, ఒకటే శరీరం ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం.
శరీర సంబంధంగా ఇస్రాయేల్‌జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా. నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైనదానిలో గానీ ఏమైనా ఉందని చెపుతున్నానా? లేదు, గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్లమీద ఉన్నవాటిలో, పిశాచాల బల్లమీద ఉన్నవాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయనకంటే మనం బలవంతులమా?
కొరింతువారికి లేఖ 1 11:17-34
ఈ ఆదేశాలు ఇస్తూ మిమ్ములను మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే, మీరు సమకూడడం ఎక్కువ మేలు కోసం కాదు గాని తక్కువ మేలుకే. మొదటి విషయం ఏమిటంటే, మీరు సంఘంగా సమకూడేటప్పుడు మీలో మీకు కక్షలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే, మీలో దేవుడు మెచ్చుకొనేవారెవరో స్పష్టం కావడానికి మీలో విభేదాలు ఉండితీరాలి. అందుచేత మీరు ఒక చోట సమకూడేటప్పుడు అది ప్రభు భోజనం తినడానికి కాదు. మీరు తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఇతరులకోసం చూడకుండా ముందుగా తన సొంత భోజనం తింటారు. ఈ విధంగా ఒకరు ఆకలితో ఉండిపోతారు. మరొకరు మత్తుగా ఉంటారు. ఏమిటిది? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తున్నారా? ఏమీ లేనివారిని సిగ్గుపరుస్తారా ఏమిటి? నేను మీతో ఏమి చెప్పాలి? ఈ విషయంలో మిమ్ములను మెచ్చుకొంటానా? మెచ్చుకోను.
నేను మీకు అందించినది ప్రభువు నుంచి నాకు వచ్చింది: ప్రభువైన యేసును శత్రువులకు పట్టియిచ్చిన రాత్రి, ఆయన రొట్టె చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత చెప్పాడు. అప్పుడు రొట్టె విరిచి “ఇది తీసుకొని తినండి. ఇది మీకోసం విరిగి పోయిన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి” అన్నాడు. భోజనమైన తరువాత ఆ ప్రకారమే ఆయన పాత్ర చేతపట్టుకొని “ఈ పాత్ర నా రక్తం మూలమైన క్రొత్త ఒడంబడిక. మీరు దీనిలోనిది త్రాగేటప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి” అన్నాడు. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగేటప్పుడెల్లా తద్వారా ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.
అందుచేత ఎవరైతే తగని విధంగా ప్రభువుకు చెందిన ఈ రొట్టె తింటారో, పాత్రలోది త్రాగుతారో ప్రభు రక్త శరీరాల విషయంలో అపరాధులు అవుతారు. ప్రతి ఒక్కరూ తనను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగాలి. ఎందుకంటే, ప్రభు శరీరాన్ని గురించి సరిగా నిర్ణయించ కుండా, తగని విధంగా తిని త్రాగేవాడు తనమీదికి శిక్షావిధి తెచ్చుకొంటూ తిని త్రాగుతున్నారు. ఈ కారణంచేతే మీలో అనేకులు నీరసించి అనారోగ్యంగా ఉన్నారు. మరి అనేకులు కన్ను మూశారు. అయితే మనలను మనమే విమర్శ చేసుకొంటూ ఉంటే మనకు విమర్శ చేయడం జరగదు. మనకు విమర్శ జరిగినప్పుడు మనం లోకంతోపాటు శిక్షావిధికి గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి దిద్దుతున్నాడు.
అందుచేత, నా సోదరులారా, భోజనం చేయడానికి సమకూడినప్పుడు ఒకరి కోసం ఒకరు చూచి ఉండండి. మీరు సమకూడడం తీర్పుకు కారణం కాకుండా ఎవరికైనా ఆకలి ఉంటే తన ఇంటిలోనే తినాలి. నేను వచ్చేటప్పుడు తక్కిన సంగతులను సరి చేస్తాను.
యేసుక్రీస్తును విశ్వసించే మనం ఈ విధంగా జీవించాలి
మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుకు విధేయులమై ఉండాలి
యోహాను శుభవార్త 14:15
“నా మీద మీకు ప్రేమ గనుక ఉంటే నా ఆజ్ఞలను ఆచరించండి.
యోహాను శుభవార్త 14:21
నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
యోహాను శుభవార్త 14:23-24
యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రేమించేవారెవరైనా నా మాట ఆచరిస్తాడు. అలాంటి వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరకు మేము వస్తాం, అతనితో నివాసం చేస్తాం.
“నన్ను ప్రేమించనివాడు నా మాటలు ఆచరించడు. మీరు వింటున్న మాట నాది కాదు. నన్ను పంపిన తండ్రిదే.
యోహాను శుభవార్త 15:10-17
నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే నా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు. నా ఆనందం మీలో ఉండాలనీ మీ ఆనందం సంపూర్ణంగా ఉండాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను. నా ఆజ్ఞ ఇదే: నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం ధారపోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు. నేను మీకిచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు. ఇకమీదట మిమ్ములను దాసులని పిలవను. ఎందుకంటే, తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు. నేను నా తండ్రిచేత వినేదంతా మీకు తెలియజేశాను గనుక మిమ్ములను మిత్రులు అన్నాను.
“మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను నియమించాను. మీరు వెళ్ళి ఫలించాలనీ మీ ఫలం నిలిచి ఉండాలనీ నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకివ్వాలనీ నా ఉద్దేశం. ఇవి మీకు ఆదేశిస్తున్నాను: మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
రోమా వారికి లేఖ 13:8-10
ఎవరికీ ఏమి బాకీ పడి ఉండకండి – ఒకరినొకరు ప్రేమతో చూడడం అనే బాకీ తప్ప. ఇతరులను ప్రేమతో చూచేవాడు తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడయ్యాడు. “వ్యభిచారం చెయ్యకూడదు”, “హత్య చెయ్యకూడదు”, “దొంగతనం చెయ్యకూడదు”, “మీరు పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు”, “పొరుగువారిది ఆశించకూడదు” – ఈ ఆజ్ఞలు, మరే ఆజ్ఞ అయినా సరే ఈ వాక్కులోనే ఇమిడి ఉన్నాయి: “మిమ్ములను ప్రేమించుకొన్నట్టు మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” ప్రేమ పొరుగువారికి హాని ఏమీ చేయదు. అందుచేతే ప్రేమ ధర్మశాస్త్రానికి నెరవేర్పు.
పేతురు లేఖ 1 1:14-16
విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే, “నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.
యోహాను లేఖ 1 2:3-8
మనం ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటే ఆయనను తెలుసుకొని ఉన్నామని దీనిని బట్టి మనకు తెలుసు. “నేనాయనను తెలుసుకొని ఉన్నాను” అని ఎవరైనా చెప్పి ఆయన ఆజ్ఞలు శిరసావహించకపోతే అతడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. కానీ ఆయన వాక్కును ఎవరైనా ఆచరిస్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ పరిపూర్ణమయింది. మనం ఆయనలో ఉన్నామని దీన్నిబట్టి మనకు తెలుసు. “ఆయనలో నిలిచి ఉంటున్నాను” అనే వ్యక్తి ఆయన నడిచినట్టే నడవాలి.
సోదరులారా, నేను ఇప్పుడు మీకు రాస్తున్నది మొదటినుంచీ మీకున్న పాత ఆజ్ఞే గానీ కొత్తది కాదు. ఈ పాత ఆజ్ఞ మీరు మొదటి నుంచి విన్న వాక్కే. అయినా కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నాను. ఇది ఆయనలో మీలో కూడా సత్యమే. ఎందుకంటే చీకటి పోతూ ఉంది, నిజమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంది.
యోహాను లేఖ 1 3:22-24
అప్పుడు, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడంచేత, మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు.
ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పేరు మీద మనం నమ్మకముంచాలి. ఆయన మనకు ఆజ్ఞాపించినట్టే ఒకరినొకరం ప్రేమతో చూడాలి. ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటున్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు.
యోహాను లేఖ 2 5—6
అమ్మగారూ, నేను కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నట్టు కాదు గాని మొదటినుంచి మనకున్న ఆజ్ఞే రాస్తూ మనం ఒకరినొకరం ప్రేమతో చూచుకోవాలని విన్నవించుకొంటున్నాను. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే. మీరు మొదటినుంచి విన్నప్రకారం మీరు దానిలో నడుచుకోవాలనేదే ఆయన ఆజ్ఞ.
మనం దేవున్ని మరియు మన తోటివారిని ప్రేమించాలి
మత్తయి శుభవార్త 22:34-40
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు సమకూడి వచ్చారు. వాళ్ళలో ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ఈ ప్రశ్న అడిగాడు: “ఉపదేశకా, ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది?”
యేసు అతనితో అన్నాడు, “హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి. ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా. రెండో ఆజ్ఞ అలాంటిదే – మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలమీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలూ ఆధారపడి ఉన్నాయి.”
మార్కు శుభవార్త 12:28-34
ఈలోగా ధర్మశాస్త్ర పండితులలో ఒకడు వచ్చి వారు వాదించడం విన్నాడు. యేసు వారికి బాగా జవాబిచ్చాడని తెలిసి అతడు ఆయనను చూచి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది?” అని అడిగాడు.
యేసు అతడికి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఇది: ‘ఇస్రాయేల్ ప్రజలారా, వినండి. ప్రభువు మన దేవుడు, ప్రభువు ఒక్కడే. హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా, బలమంతటితో మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. రెండోది, దానిలాంటిది ఇది: ‘మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’. వీటికంటే గొప్ప ఆజ్ఞ మరేదీ లేదు” అని జవాబిచ్చాడు.
ఆ ధర్మశాస్త్ర పండితుడు ఆయనతో “ఉపదేశకా, మీరు బాగా చెప్పారు. దేవుడు ఒక్కడే అనీ ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పినది నిజమే. హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బుద్ధి అంతటితో, బలం అంతటితో ఆయనను ప్రేమించడమూ మనలను ప్రేమించుకొన్నట్టే పొరుగువారిని ప్రేమించడమూ అన్ని హోమాలకంటే, బలులకంటే అధికం” అన్నాడు.
అతడు జ్ఞానంతో జవాబివ్వడం చూచి యేసు అతడితో “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు.
ఆ తరువాత ఆయనను ఏ ప్రశ్నా అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది.
లూకా శుభవార్త 10:25-37
ఒకప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసుడొకడు లేచి ఆయనను పరీక్షిస్తూ “ఉపదేశకా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చేయాలి?” అని అడిగాడు.
ఆయన అతనితో “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? నీవు దాన్ని చదవడం వల్ల నీకు తోచేది ఏమిటి?” అన్నాడు.
అందుకు అతడు ఇలా జవాబిచ్చాడు: “హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి; మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.”
ఆయన అతనితో “సరిగ్గా చెప్పావు. అలాగే చేస్తూ ఉండు. అప్పుడు జీవిస్తావు” అన్నాడు.
తాను న్యాయవంతుడై ఉన్నట్టు చూపుకోవాలని అతడు “అయితే నా పొరుగువాడు ఎవరు?” అని యేసును అడిగాడు.
యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఒక మనిషి జెరుసలంనుంచి యెరికోకు ప్రయాణమైపోతూ దోపిడీదొంగల చేతికి చిక్కాడు. వారు అతని ఒంటిమీద బట్టలు ఒలుచుకొని అతణ్ణి గాయపరచి కొనప్రాణంతో అతణ్ణి విడిచి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తుగా ఒక యాజి ఆ దారిన వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అలాగే లేవీగోత్రికుడొకడు కూడా ఆ చోటికి వచ్చి అతణ్ణి చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అయితే సమరయ దేశస్థుడొకడు ప్రయాణంమీద ఉండి ఆ మనిషి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూచి జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చి అతని గాయాలకు నూనె, ద్రాక్షరసం పోసి కట్లు కట్టాడు, అతణ్ణి తన సొంత గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులు చూశాడు. మరుసటి రోజు అతడు బయలు దేరబోతుండగా రెండు వెండి నాణేలు తీసి సత్రం మనిషికిచ్చి ‘ఇతడి బాగోగులు చూడండి. ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు చెల్లిస్తాను’ అన్నాడు.
“నీకేమి తోస్తున్నది? – దోపిడీదొంగల చేతికి చిక్కిన మనిషికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉన్నారు?”
అతడు “అతనిపట్ల జాలి చూపినవాడే” అన్నాడు.
అతనితో యేసు “నీవు వెళ్ళి అలాగే చేస్తూ ఉండు” అన్నాడు.
యోహాను శుభవార్త 14:21
నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
యోహాను లేఖ 1 5:3
దేవుణ్ణి ప్రేమించడమంటే మనం ఆయన ఆజ్ఞలు శిరసావహించడమే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
మత్తయి శుభవార్త 5:43-48
“‘మీ పొరుగువారిని ప్రేమతో చూడండి. మీ పగవారిని ద్వేషించండి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా. మీతో నేనంటాను, మీ పగవారిని ప్రేమతో చూడండి. మిమ్ములను శపించేవారిని దీవించండి. మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి. దూషణతో మీపట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్ములను హింసించేవారి కోసం ప్రార్థన చేయండి. మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగిన సంతానంగా ఉండడానికి ఆ విధంగా చేయండి. ఎందుకంటే, ఆయన మంచివారికి, చెడ్డవారికి కూడా, సూర్యోదయం కలిగిస్తాడు. న్యాయవంతులకు, అన్యాయస్థులకు కూడా వాన కురిపిస్తాడు. మిమ్ములను ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏ బహుమానం దొరుకుతుంది? సుంకంవారు కూడా అలా చేస్తారు గదా. మీరు మీ సోదరులకే మర్యాదలు చేస్తే మీరు ఇతరులకంటే ఎక్కువ చేసినదేమిటి? సుంకంవారు కూడా అలా చేస్తారు గదా. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి.
యోహాను శుభవార్త 13:34-35
ఒక క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.”
యోహాను శుభవార్త 15:12-17
నా ఆజ్ఞ ఇదే: నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం ధారపోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు. నేను మీకిచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు. ఇకమీదట మిమ్ములను దాసులని పిలవను. ఎందుకంటే, తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు. నేను నా తండ్రిచేత వినేదంతా మీకు తెలియజేశాను గనుక మిమ్ములను మిత్రులు అన్నాను.
“మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను నియమించాను. మీరు వెళ్ళి ఫలించాలనీ మీ ఫలం నిలిచి ఉండాలనీ నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకివ్వాలనీ నా ఉద్దేశం. ఇవి మీకు ఆదేశిస్తున్నాను: మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
రోమా వారికి లేఖ 12:9-10
మీ ప్రేమలో కల్లాకపటాలంటూ ఉండకూడదు. దుష్టత్వాన్ని అసహ్యించుకోండి. మంచిని అంటిపెట్టుకొని ఉండండి. సోదర ప్రేమతో ఒకరిమీద ఒకరు అభిమానం చూపండి. గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి.
రోమా వారికి లేఖ 13:8-10
ఎవరికీ ఏమి బాకీ పడి ఉండకండి – ఒకరినొకరు ప్రేమతో చూడడం అనే బాకీ తప్ప. ఇతరులను ప్రేమతో చూచేవాడు తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడయ్యాడు. “వ్యభిచారం చెయ్యకూడదు”, “హత్య చెయ్యకూడదు”, “దొంగతనం చెయ్యకూడదు”, “మీరు పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు”, “పొరుగువారిది ఆశించకూడదు” – ఈ ఆజ్ఞలు, మరే ఆజ్ఞ అయినా సరే ఈ వాక్కులోనే ఇమిడి ఉన్నాయి: “మిమ్ములను ప్రేమించుకొన్నట్టు మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” ప్రేమ పొరుగువారికి హాని ఏమీ చేయదు. అందుచేతే ప్రేమ ధర్మశాస్త్రానికి నెరవేర్పు.
కొరింతువారికి లేఖ 1 13:1-3
ఒకవేళ నేను మనుషుల భాషలలో, దేవదూతల భాషలలో మాట్లాడినా నాకు దైవిక ప్రేమ లేకపోతే గణగణమనే గంటలాగా, టింగుటింగుమనే తాళంలాంటి వాడినే. ఒకవేళ నాకు దేవునిమూలంగా పలికే వరం ఉన్నా, అన్ని రహస్య సత్యాలూ జ్ఞానమంతా తెలిసినా, కొండలను తొలగించి వేసే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, దైవిక ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే. నా ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేసి బీదల పోషణకోసం ధార పోసినా, నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించినా, నాకు దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనమంటూ నాకేమీ ఉండదు.
కొరింతువారికి లేఖ 1 16:14
మీరు చేసేదంతా ప్రేమతో చేయండి.
గలతీయవారికి లేఖ 5:13-15
సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి. దానికి బదులు ప్రేమభావంతో ఒకరికొకరు సేవ చేయండి. ధర్మశాస్త్రమంతా ఒకే ఒక మాటలో ఇమిడి ఉంది. ఏమిటంటే, “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” గానీ మీరు ఒకరినొకరు కరచుకొంటూ దిగమింగివేస్తూ ఉంటే ఒకరివల్ల ఒకరు పూర్తిగా ధ్వంసమైపోతారేమో జాగ్రత్త!
తెస్సలొనీకవారికి లేఖ 1 4:9-10
సోదర ప్రేమ గురించి మీకు నేను రాయనక్కరలేదు. ఒకరినొకరు ప్రేమతో చూడాలని దేవుడే మీకు నేర్పాడు. నిజంగా మాసిదోనియ అంతటిలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమతో చూస్తూ ఉన్నారు. అయినా, సోదరులారా, ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం.
పేతురు లేఖ 1 1:8
మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు.
పేతురు లేఖ 1 4:8
ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమతో చూచుకోండి.
యోహాను లేఖ 1 2:9-11
“తాను వెలుగులో ఉన్నాను” అని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటివరకూ చీకటిలోనే ఉన్నాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూచేవాడు వెలుగులో ఉన్నాడు. అతనిలో తొట్రుపాటు కారణమేదీ లేదు. కాని, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. ఆ చీకటి అతని కండ్లకు గుడ్డితనం కలిగించింది గనుక ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తనకే తెలియదు.
యోహాను లేఖ 1 3:11-18
మనం ఒకరినొకరు ప్రేమతో చూడాలి అనేది మొదటినుంచి మీరు విన్న సందేశమే గదా. మనం కయీనులాగా ఉండకూడదు. అతడు దుర్మార్గుడికి చెందినవాడై తన సోదరుణ్ణి చంపాడు. అతణ్ణి ఎందుకు చంపాడు? తన పనులు చెడ్డవి, తోబుట్టువు పనులు న్యాయమైనవి, అందుచేతే.
సోదరులారా, మీరంటే లోకానికి ద్వేషం ఉంటే ఆశ్చర్యపడకండి. మనం సోదరులను ప్రేమతో చూస్తున్నాం గనుక మరణంలో నుంచి జీవంలోకి దాటామని మనకు తెలుసు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడైతే మరణంలోనే ఆగిపోతున్నాడు. తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతి ఒక్కడూ హంతకుడే! ఏ హంతకుడిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు.
యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్నిబట్టే మనకు తెలుసు. మనమూ సోదరులకోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యతగలవారం. అయితే ఈ లోకం బ్రతుకుదెరువు గలవాడెవడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతనిమీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
నా చిన్న పిల్లలారా, మాటతో భాషతో గాక వాస్తవంగా, క్రియతో ప్రేమ చూపుదాం.
యోహాను లేఖ 1 4:7-21
ప్రియ సోదరులారా, ఒకరినొకరు ప్రేమతో చూచుకొందాం. ఎందుకంటే ప్రేమ దేవునికి చెందేది. ప్రేమతో చూచే ప్రతి ఒక్కరూ దేవునివల్ల జన్మించినవారు, దేవుణ్ణి ఎరిగినవారు. దేవుడు ప్రేమస్వరూపి గనుక ప్రేమతో చూడనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు. ప్రియ సోదరులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు గనుక మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఏ మనిషీ దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. మనం ఒకరినొకరం ప్రేమతో చూస్తూ ఉంటే దేవుడు మనలో ఉంటున్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉంది.
ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. దీన్ని బట్టి మనం ఆయనలో ఉన్నామనీ ఆయన మనలో ఉన్నాడనీ మనకు తెలుసు. తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా పంపాడు. ఇది చూచి మేము సాక్ష్యం చెపుతున్నాం. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొన్నవాడెవరైనా దేవునిలో ఉంటున్నారు, దేవుడు ఆ వ్యక్తిలో ఉంటున్నాడు. దేవునికి మనమీద ఉన్న ప్రేమను మనం తెలుసుకొన్నాం, నమ్ముకొన్నాం. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలో ఉంటున్నవాడు దేవునిలో ఉంటున్నాడు, దేవుడు అతనిలో ఉంటున్నాడు. తీర్పు రోజున మనకు ధైర్యం ఉండేలా దీన్ని బట్టి మనమధ్య ప్రేమ పరిపూర్ణమై ఉంది. ఎందుకంటే, ఈ లోకంలో మనం ఆయనలాగా ఉన్నాం. ప్రేమలో భయమంటూ లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని బయటికి గెంటివేస్తుంది. భయానికి దండనతో సంబంధం ఉంది. భయం ఉన్నవాడు ప్రేమలో ఇంకా పరిపూర్ణుడు కాలేదు.
ఆయనే మనలను మొదట ప్రేమించాడు. అందుచేతే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. “దేవుడంటే నాకు ప్రేమ” అంటూ ఎవడైనా తన సోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటే అతడు అబద్ధికుడు. తాను చూచే సోదరుణ్ణి ప్రేమించనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలనే ఆజ్ఞ ఆయనవల్లే మనకు ఉంది.
క్రీస్తు ఎలా నడుచుకున్నాడో మనమూ అలానే ప్రవర్తించాలి
యోహాను శుభవార్త 13:34-35
ఒక క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.”
యోహాను శుభవార్త 14:27
“శాంతిని నేను మీకిచ్చి వెళ్ళిపోతాను. నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే ప్రకారం నేను మీకివ్వడం లేదు. మీ హృదయం ఆందోళన పడనియ్యకండి, భయపడనివ్వకండి.
రోమా వారికి లేఖ 12:9-13
మీ ప్రేమలో కల్లాకపటాలంటూ ఉండకూడదు. దుష్టత్వాన్ని అసహ్యించుకోండి. మంచిని అంటిపెట్టుకొని ఉండండి. సోదర ప్రేమతో ఒకరిమీద ఒకరు అభిమానం చూపండి. గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. శ్రద్ధాసక్తుల విషయంలో వెనుకపడకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుకు సేవ చేస్తూ వుండండి. ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి. పవిత్రుల అక్కరలలో సహాయపడుతూ ఉండండి. అతిథి సత్కారం చేయడానికి అవకాశాలు వెతకండి.
గలతీయవారికి లేఖ 5:22-26
దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు. క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితోకూడా దాని కోరికలనూ ఇచ్ఛలనూ సిలువ వేశారు. దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి నడుచుకొందాం. వట్టి డాంబికులం కాకుండా, ఒకరికొకరం కోపం రేపకుండా ఒకరిమీద ఒకరం అసూయపడకుండా ఉందాం.
కొలస్సయివారికి లేఖ 3:12-17
దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నాడు. మీరు పవిత్రులు, దేవుని ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి. వీటన్నిటికీ పైగా ప్రేమను దాల్చుకోండి. పరిపూర్ణ ఐక్యత కలిగించే బంధం ప్రేమే. మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞులై ఉండండి.
క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి. అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:16-18
ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం.
మనం ఎలా ప్రార్థించలో అలా ప్రార్థిస్తాం
మత్తయి శుభవార్త 6:5-13
“అదిగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట భక్తులలాగా ఉండకండి. మనుషులు తమను చూడాలని సమాజ కేంద్రాలలో, వీధుల మూలలలో నిలుచుండి ప్రార్థన చేయడం వారికి చాలా ఇష్టం. వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీరైతే ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్ళి, తలుపు వేసుకొని, రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యంలో జరిగేవాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాలలాగా వృథాగా పదే పదే పలకకండి. అవసరమైనవి ఎక్కువ మాటలు పలకడం కారణంగా వారి ప్రార్థన వినబడుతుందని వారి ఆలోచన. మీరు వారిలాగా ఉండకండి. ఎందుకంటే, మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవి మీ తండ్రికి తెలుసు.
అందుచేత ఈ విధంగా ప్రార్థన చేయాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక!
నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలో లాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక!
మా రోజువారీ ఆహారం ఈ రోజున మాకు ప్రసాదించు.
మాకు రుణపడ్డవారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను క్షమించు.
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
మత్తయి శుభవార్త 7:7-11
“అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది తెరవబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది. మీలో ఎవరైనా సరే కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా? చేపకోసం అడిగితే అతనికి పామునిస్తారా? మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా మంచివి ఇస్తాడు గదా.
మత్తయి శుభవార్త 18:19-20
ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
మార్కు శుభవార్త 11:24-25
అందుచేత మీతో అంటున్నాను, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా, పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైన దేదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి.
లూకా శుభవార్త 11:1-13
ఒకసారి ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఆయనతో “ప్రభూ! ఎలా ప్రార్థన చేయాలో యోహాను తన శిష్యులకు నేర్పాడు. నీవు మాకు నేర్పు” అన్నాడు.
ఆయన వారితో అన్నాడు, “మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనండి: పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక! నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలోలాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక! రోజువారి ఆహారం రోజు రోజు మాకు ప్రసాదించు. మాకు రుణపడ్డ ప్రతి వ్యక్తినీ మేము కూడా క్షమిస్తున్నాం గనుక మా అపరాధాలను క్షమించు. మమ్ములను దుష్ ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గత నుంచి మమ్ములను రక్షించు.”
ఆయన వారితో ఇంకా అన్నాడు “మీలో ఎవరో ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. అతడు మధ్యరాత్రి అతనిదగ్గరకు వెళ్ళి ‘స్నేహితుడా! నాకు మూడు రొట్టెలు బదులివ్వు. నా స్నేహితుడు ఒకడు ప్రయాణం మధ్యలో నాదగ్గరికి వచ్చాడు. అతడికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు’ అంటాడు అనుకోండి. లోపల నుంచి అతడు ‘నన్ను తొందరపెట్టకు! తలుపు మూసి ఉంది. నేనూ నా పిల్లలూ మంచం మీద పడుకొన్నాం. నేను లేచి నీకివ్వలేను’ అంటాడు అనుకోండి. నేను మీతో అంటున్నాను, అతడు తన స్నేహితుడు కావడంచేత ఇతడు లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గులేకుండా అడుగుతూ ఉంటే ఇతడు లేచి అతనికి కావలసినంత ఇస్తాడు.
“అందుచేత మీతో నేనంటున్నాను, దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, మీకు తెరవబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరువబడుతుంది. మీలో ఏ తండ్రినయినా కొడుకు రొట్టె కావాలని అడిగితే అతనికి రాయినిస్తాడా? చేప కావాలని అడిగితే చేపకు బదులుగా అతనికి పామునిస్తాడా? గుడ్డు కావాలని అతడు అడిగితే అతనికి తేలునిస్తాడా?
“మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు మీ పరమ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా పవిత్రాత్మను ప్రసాదిస్తాడు గదా!”
లూకా శుభవార్త 18:1-8
మనుషులు నిరుత్సాహపడకుండా నిత్యమూ ప్రార్థన చేస్తూ ఉండాలని వారికి నేర్పడానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక పట్టణంలో న్యాయాధిపతి ఒకడుండేవాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె అతని దగ్గరకు వస్తూ ‘నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయం జరిగించండి’ అని అడుగుతూ ఉండేది.
“కొంత కాలం అతడు అలా చేయడానికి ఇష్టపడలేదు. గాని తరువాత అతడు ‘ఈ విధవరాలు నన్ను విసిగిస్తూ ఉంది గనుక దేవుడంటే నాకు భయం లేకపోయినా మనుషులంటే లెక్క లేకపోయినా ఈమెకు న్యాయం జరిగిస్తాను. లేకపోతే అదే పనిగా వస్తూ నా ప్రాణం తోడేస్తుంది’ అనుకొన్నాడు.”
ప్రభువు ఇంకా అన్నాడు “న్యాయం లేని ఆ న్యాయాధిపతి చెప్పినది మీ చెవుల్లో పడనివ్వండి. మరి, దేవుడు తాను ఎన్నుకొన్న తన వారి విషయంలో దీర్ఘ సహనం చూపుతూ, వారు తనకు రాత్రింబగళ్ళు మొరపెట్టుకొంటూ ఉంటే ఆయన వారి కోసం న్యాయం జరిగించడా? వారికోసం ఆయన త్వరగా న్యాయం జరిగిస్తాడని మీతో చెపుతున్నాను. అయినా మానవ పుత్రుడు వచ్చేటప్పుడు విశ్వాసం అనేది భూమిమీద ఆయనకు వాస్తవంగా కనిపిస్తుందా?”
లూకా శుభవార్త 21:36
జరగబోయే వాటన్నిటిలోనుంచి మీరు తప్పించుకొని మానవపుత్రుని ఎదుట నిలబడడానికి తగినవారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి.”
యోహాను శుభవార్త 14:13-14
కాబట్టి నా పేర మీరు ఏది అడిగినా సరే, కుమారుని మూలంగా తండ్రికి మహిమ కలిగేందుకు అది నేను చేస్తాను. నా పేర మీరు ఏది అడిగితే అది చేస్తాను.
యోహాను శుభవార్త 15:7
“మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు. అది మీకు చేయబడుతుంది.
యోహాను శుభవార్త 16:23-26
ఆ రోజున మీరు నన్ను ఏమీ అడగరు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు తండ్రిని నా పేర ఏది అడిగినా అది ఆయన మీకిస్తాడు. ఇదివరకు మీరు నా పేర అడిగినది ఏదీ లేదు. అడగండి, మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
“అలంకారిక భాషలో ఈ విషయాలు మీతో చెప్పాను. అయితే ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో నేను అలంకారిక భాషలో మీతో మాట్లాడక, తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెపుతాను. ఆ రోజున నా పేర మీరు తండ్రిని అడుగుతారు. నేను మీకోసం తండ్రిని వేడుకొంటానని చెప్పడం లేదు.
రోమా వారికి లేఖ 8:26-27
అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే, తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలుకాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పం ప్రకారం పవిత్రులకోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు గనుక హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు.
రోమా వారికి లేఖ 12:12
ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి.
ఎఫెసువారికి లేఖ 2:18
ఆయన ద్వారా మీరూ మేమూ ఒకే ఆత్మద్వారా పరమ తండ్రి సన్నిధానంలోకి ప్రవేశం కలిగి ఉన్నవారము.
ఎఫెసువారికి లేఖ 6:18
అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.
ఫిలిప్పీవారికి లేఖ 4:6-7
ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి. అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసుద్వారా మీ హృదయాలకూ మనసులకూ కావలి ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 4:2
మెళకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:17
ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి.
తిమోతికి లేఖ 1 2:1-4
మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
తిమోతికి లేఖ 1 2:8
నేను ఆశించేదేమంటే ప్రతి స్థలంలోనూ పురుషులు కోపం, కలహభావం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి.
తిమోతికి లేఖ 1 4:4-5
దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.
హీబ్రూవారికి లేఖ 4:16
కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.
హీబ్రూవారికి లేఖ 10:19-22
సోదరులారా, యేసు తెరద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం అంకితం చేశాడు. కాబట్టి దాని గుండా యేసు రక్తంచేత అతి పవిత్రస్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. దేవుని ఇంటిమీద గొప్ప ప్రముఖ యాజి కూడా మనకున్నాడు. గనుక సంపూర్ణ విశ్వాస నిశ్చయతతో, యథార్థ హృదయంతో, మన శరీరం శుద్ధ జలంతో కడగబడి, అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుణ్ణి సమీపిద్దాం.
యాకోబు లేఖ 1:5-8
మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు.
అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు. ఆ మనిషి చపలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు. గనుక తనకు ప్రభువువల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు.
యాకోబు లేఖ 4:2-3
మీరు ఏవేవో కావాలని కోరుతారు. అవి లేవు గనుక హత్య చేస్తారు. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించు కోలేరు. పోట్లాటలూ జగడాలూ జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు. ఒక వేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు.
యాకోబు లేఖ 5:13-18
మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి. మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.
ఒకరితో ఒకరు మీ అతిక్రమాలు ఒప్పుకోండి. మీకు ఆరోగ్యం చేకూరేలా ఒకరికోసం ఒకరు ప్రార్థన చేయండి. న్యాయవంతుని ప్రార్థన పని చేయడంలో చాలా ప్రభావంగలది, ఫలవంతమైనది.
ఏలీయా మనలాంటి స్వభావం గలవాడే. వాన కురియకూడదని అతడు మనసారా ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాలపాటు ఆ దేశంలో వాన పడలేదు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వాన కురిపించింది, భూమి దాని పంట ఇచ్చింది.
పేతురు లేఖ 1 4:7
అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది, గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో, మెళకువగా ఉండండి.
యోహాను లేఖ 1 3:21-22
ప్రియ సోదరులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే దేవుని సన్నిధానంలో మనకు ధైర్యం ఉంటుంది. అప్పుడు, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడంచేత, మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు.
యోహాను లేఖ 1 5:14-15
ఆయనను గురించి మనకున్న నిశ్చయత ఏమంటే ఆయన చిత్త ప్రకారం మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడనేదే. మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడని మనకు తెలిసి ఉంటే ఆయనను అడిగినవి మనకు కలిగాయని కూడా తెలుసు.
ప్రజలు ఎలా ప్రార్థస్తారో అనుటకు ఇవి ఉదాహరణలు
మత్తయి శుభవార్త 11:25-26
ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ! భూమ్యాకాశాల ప్రభూ! నీవు ఈ సంగతులు జ్ఞానులకూ తెలివైనవారికీ చూపకుండా దాచిపెట్టి, చిన్నపిల్లలకు వెల్లడి చేశావు. అవును, తండ్రీ, అలా చేయడం నీ దృష్టిలో మంచిదై ఉంది. అందుచేత నిన్ను స్తుతిస్తున్నాను.
మత్తయి శుభవార్త 14:23
ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
మత్తయి శుభవార్త 19:13-15
యేసు తమ చిన్న పిల్లలమీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కానీ శిష్యులు వారిని మందలించారు. అయితే యేసు “చిన్న పిల్లలను నా దగ్గరకు రానియ్యండి. వారిని ఆటంకపరచవద్దు. ఇలాంటివారిదే పరలోక రాజ్యం” అన్నాడు.
చిన్న పిల్లలమీద చేతులుంచిన తరువాత ఆయన అక్కడనుంచి వెళ్ళాడు.
మార్కు శుభవార్త 1:35
వేకువ జామున, పగలుకు చాలా సేపటికి ముందు, ఆయన లేచి నిర్జన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
లూకా శుభవార్త 5:16
అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు.
లూకా శుభవార్త 6:12
ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడంలో రాత్రంతా గడిపాడు.
లూకా శుభవార్త 22:32
కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”
లూకా శుభవార్త 22:39-46
అప్పుడాయన బయటికి వచ్చి ఎప్పటిలాగా ఆలీవ్ కొండకు వెళ్ళాడు. ఆయనవెంట శిష్యులు వెళ్ళారు. ఆ స్థలం చేరుకొన్నప్పుడు ఆయన వారితో “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
అప్పుడు వారి దగ్గరనుంచి రాతివేత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేశాడు, “తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నానుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరనియ్యి” అన్నాడు.
అప్పుడు పరలోకంనుంచి వచ్చిన దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన యాతనపడుతూ మరీ తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట పెద్ద రక్త బిందువులలాగా అయి నేలమీద పడింది.
ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూచి ఆయన వారితో “మీరెందుకు నిద్రపోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా లేచి ప్రార్థన చేయండి” అన్నాడు.
యోహాను శుభవార్త 11:41-42
అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
యోహాను శుభవార్త 17:1-26
ఆ మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.
“లోకంనుంచి నీవు నాకిచ్చినవారికి నీ పేరును వెల్లడి చేశాను. పూర్వం వారు నీవారు. వారిని నాకు ఇచ్చావు. వారు నీ వాక్కును పాటించారు. నీవు నాకిచ్చిన మాటలు వారికిచ్చాను. వారు వాటిని అంగీకరించారు, నేను నీ దగ్గరనుంచి వచ్చానని వారు రూఢిగా తెలుసుకొన్నారు, నీవు నన్ను పంపావని నమ్ముకొన్నారు, కాబట్టి నీవు నాకిచ్చినవన్నీ నీనుంచి వచ్చినవని ఇప్పుడు వారికి తెలుసు.
“వీరికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు ఇచ్చినవారు నీవారే గనుక వారికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. వీరిమూలంగా నాకు మహిమ కలిగింది. ఇకమీదట నేను లోకంలో ఉండను గానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, మనం ఒక్కటిగా ఉన్నట్టే నీవు నాకిచ్చినవారు ఒక్కటిగా ఉండేలా నీ పేర వారిని కాపాడు. నేను లోకంలో వారితో ఉన్నప్పుడు నీ పేర వారిని కాపాడాను. నీవు నాకిచ్చినవారిని నేను కాపాడాను. వారిలో ఎవరూ నశించలేదు. అయితే లేఖనం నెరవేరేందుకు నాశనానికి తగినవాడే నశించాడు.
“ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. వీరిలో నా ఆనందం పూర్తిగా ఉండాలని ఈ మాటలు లోకంలో చెపుతున్నాను. నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.
“నేను ప్రార్థన చేస్తున్నది వీరికోసం మాత్రమే కాదు గాని వీరి మాటల మూలంగా నామీద నమ్మకం ఉంచబోయేవారి కోసం కూడా. వారందరూ ఒక్కటిగా ఉండాలని నా ప్రార్థన. తండ్రీ, నీవు నన్ను పంపావని లోకం నమ్మేలా నేను నీలో, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒక్కటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనము ఒక్కటిగా ఉన్నట్టే వారు ఒక్కటిగా ఉండేందుకు నీవు నాకిచ్చిన మహిమ వారికిచ్చాను. నీవు నన్ను పంపావనీ నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించావనీ లోకం తెలుసుకోవాలి గనుక వారిలో నేను, నాలో నీవు ఉండడంవల్ల వారు సంపూర్ణంగా ఒక్కటి కావాలని ఆ మహిమ వారికిచ్చాను. తండ్రీ, నీవు నాకు ఇచ్చినవారు నీవు నాకిచ్చిన మహిమను చూచేలా నేను ఎక్కడ ఉంటానో వారు నాతో అక్కడే ఉండాలని నా కోరిక. ఎందుకంటే, జగత్తు పునాదికి మునుపే నీవు నన్ను ప్రేమించావు.
“న్యాయవంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసు కోలేదు, గానీ నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీరు తెలుసుకొన్నారు. నామీద నీకు ఉన్న ప్రేమ వారిలో ఉండాలనీ నేను కూడా వారిలో ఉండాలనీ నీ పేరును వారికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”
అపొస్తలుల కార్యాలు 4:24-31
ఇది విని వారు ఏక మనసుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు: “ప్రభూ! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన దేవుడవు నీవు. నీవు నీ సేవకుడు అయిన దావీదు నోట ఇలా పలికించావు: జనాలు ఎందుకు అల్లరి చేశాయి? ప్రజలు ఎందుకు వృధాలోచనలు చేశారు? ప్రభువుకూ ఆయన అభిషిక్తుడికీ వ్యతిరేకంగా భూరాజులు నిలిచారు, పరిపాలకులు సమకూడారు.
“అలాగే ఈ నగరంలో హేరోదు, పొంతి పిలాతు, ఇస్రాయేల్ ప్రజలతోనూ ఇతర ప్రజలతోనూ కలిసి నీచేత అభిషేకం పొందిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఏది జరగాలని నీ అధికారంచేతా సంకల్పంచేతా ముందు నిర్ణయించావో అదే జరిగించడానికి సమకూడారు. ప్రభూ! ఇప్పుడు వారి బెదిరింపులు గుర్తించి రోగులను బాగు చేయడానికీ నీ పవిత్ర సేవకుడైన యేసు పేరట సూచకమైన అద్భుతాలూ వింతలూ జరిగించడానికీ నీ చేయి చాపు. తద్వారా నీ దాసులకు నీ వాక్కు ప్రకటించడానికి గొప్ప ధైర్యం ప్రసాదించు.”
వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కంపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు.
అపొస్తలుల కార్యాలు 16:25
అయితే మధ్యరాత్రి వేళ పౌలు సైలసులు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు.
అపొస్తలుల కార్యాలు 20:36
అతడు ఇలా చెప్పి, వారందరితోపాటు మోకాళ్ళూని ప్రార్థన చేశాడు.
అపొస్తలుల కార్యాలు 21:5
ఆ రోజులు గడిపిన తరువాత మేము ప్రయాణమై బయలుదేరినప్పుడు వారంతా భార్యలతో పిల్లలతో కూడా పట్టణం బయటికి మమ్ములను సాగనంపడానికి వచ్చారు. సముద్రం ఒడ్డున మేమంతా మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరినొకరం విడిపోయాం.
రోమా వారికి లేఖ 1:9-10
నా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ములను పేర్కొంటూ, ఎలాగైనా సరే దేవుని ఇష్టప్రకారం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకొంటూ ఉన్నాను. తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా నేను సేవిస్తున్న దేవుడే ఇందుకు నాకు సాక్షి.
రోమా వారికి లేఖ 10:1-2
సోదరులారా, ఇస్రాయేల్‌ ప్రజకు పాపవిముక్తి కలగాలనే నా హృదయాభిలాష, వారికోసం దేవునికి చేసే నా ప్రార్థన. వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉందని వారిని గురించిన నా సాక్ష్యం. అయితే వారి ఆసక్తి జ్ఞానానికి అనుగుణమైనది కాదు.
రోమా వారికి లేఖ 15:30-33
సోదరులారా, నా కోసం చేసే ప్రార్థనలలో మీరు నాతోపాటు ప్రయాసపడాలని ప్రభువైన యేసు క్రీస్తును బట్టీ దేవుని ఆత్మ ప్రేమను బట్టీ మిమ్ములను బతిమాలు కొంటున్నాను. అంటే, నేను యూదయలో అవిధేయుల చేతులలో నుంచి తప్పించుకొనేలా, జెరుసలంలో చేయబోయే నా పరిచర్య అక్కడి పవిత్రులకు అంగీకారంగా ఉండేలా దేవుని ఇష్టప్రకారం మీ దగ్గరకు సంతోషంతో వచ్చి మీతో కూడా సేద తీర్చుకోగలిగేలా ప్రార్థించండి. శాంతి ప్రదాత అయిన దేవుడు మీకందరికీ తోడై ఉంటాడు గాక! తథాస్తు.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఎఫెసువారికి లేఖ 1:15-20
ఈ కారణంచేత, ప్రభువైన యేసుమీద మీ నమ్మకాన్ని గురించీ, పవిత్రులందరిపట్లా మీ ప్రేమభావాన్ని గురించీ విన్నప్పటినుంచి నేను కూడా నా ప్రార్థనలలో మిమ్ములను జ్ఞాపకం ఉంచుకొంటూ, మీ గురించి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు – మహిమ స్వరూపి అయి తండ్రి – ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకొనేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలనీ పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో, తనను నమ్ముకొన్న మనపట్ల ఆయన బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యమెలాంటిదో మీరు తెలుసుకోవాలనీ నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకొన్న మహా బలప్రభావాల ప్రకారమే. ఆ బలప్రభావాలచేత ఆయన క్రీస్తును చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపి పరమ స్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు.
ఎఫెసువారికి లేఖ 3:14-21
ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను. పరలోకంలో, భూమిమీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మవల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి పవిత్రులందరితోపాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలనీ, జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలనీ మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయినవారు కావాలనీ ఆయనను ప్రార్థిస్తున్నాను.
మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
ఎఫెసువారికి లేఖ 6:19-20
అలాగే నాకోసం కూడా ప్రార్థించండి. నేను శుభవార్త రహస్య సత్యాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నోరు తెరిచేలా, నాకు మాటలు లభించేలా, అందులో నేను ప్రకటించవలసిన విధంగా ధైర్యంతో ప్రకటించేలా ప్రార్థించండి. శుభవార్త కోసం నేను సంకెళ్ళపాలయిన ప్రతినిధిని.
ఫిలిప్పీవారికి లేఖ 1:3-5
మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. మొదటి రోజునుంచి ఇదివరకు మీరు శుభవార్త విషయంలో భాగస్వాములు, గనుక నేను చేసే ప్రతి ప్రార్థనలోనూ మీకోసం ఎప్పుడూ ఆనందంతో ప్రార్థిస్తున్నాను.
ఫిలిప్పీవారికి లేఖ 1:9-11
నా ప్రార్థన ఏమిటంటే, దేవుని మహిమ, స్తుతులకోసం మీరు క్రీస్తు యేసువల్ల కలిగే నీతిన్యాయాల ఫలాలతో నిండి ఉండి క్రీస్తు దినం వరకూ నిష్కపటులై, ఏ అభ్యంతరమూ కలిగించనివారై ఉండేలా ఏవి శ్రేష్ఠమో వాటినే మెచ్చుకోవడానికి మీ ప్రేమ తెలివి, అన్ని రకాల వివేచనతో అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి.
కొలస్సయివారికి లేఖ 1:9-12
ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటినుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, తెలివి కలిగి ఆయన సంకల్పం పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుతూ ఉన్నాం. దీనిద్వారా మీరు ప్రభువుకు తగిన విధంగా నడుచుకొంటూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, అంతకంతకూ దేవుణ్ణి తెలుసుకొంటూ అన్ని విషయాలలో ప్రభువుకు ఆనందం కలిగించాలని ప్రార్థిస్తున్నాం. మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బలప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలని మా ప్రార్థన. వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలిభాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు.
కొలస్సయివారికి లేఖ 4:3-4
మా కోసం కూడా ప్రార్థించండి. క్రీస్తు రహస్య సత్యం కోసం నేను సంకెళ్ళ పాలయ్యాను. మేమీ సత్యం ప్రకటించడానికి దేవుడు తన వాక్కుకోసం మాకు తలుపు తెరిచేలా, నేను మాట్లాడవలసిన విధంగానే దానిని స్పష్టం చేసేలా ప్రార్థించండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 3:9-13
మన దేవుని ముందు మిమ్ములను బట్టి మాకున్న ఆనందమంతటి కోసం సరిపోయినంత కృతజ్ఞతలు దేవునికి ఎలా చెప్పగలం? మేము మీ ముఖాలను మళ్ళీ చూడాలని, మీ విశ్వాసంలో ఉన్న కొరత పూర్తిగా తీర్చడానికి అవకాశం కోసం రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొంటూ ఉన్నాం.
మన తండ్రి అయిన దేవుడు తానే, మన ప్రభువైన యేసు క్రీస్తు మమ్ములను మీ దగ్గరకు నడిపిస్తాడు గాక! మీ పట్ల మా ప్రేమ ఎలా సమృద్ధిగా పెరుగుతున్నదో అలాగే మీ పరస్పర ప్రేమ, మనుషులందరి పట్ల కూడా సమృద్ధిగా పెరిగేలా ప్రభువు చేస్తాడు గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు తన పవిత్రులందరితో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్రత విషయంలో అనింద్యులై ఉండేలా మీ హృదయాలను సుస్థిరం చేస్తాడు గాక!
తెస్సలొనీకవారికి లేఖ 2 1:11-12
ఈ కారణంచేత మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీకు అందిన పిలుపుకు మిమ్ములను తగినవారుగా మన దేవుడు ఎంచాలనీ ప్రతి మంచి ఉద్దేశాన్నీ నమ్మకం మూలమైన ప్రతి కార్యాన్నీ బలప్రభావాలతో పూర్తి చేయాలనీ మా ప్రార్థన. మన దేవుడూ ప్రభువైన యేసు క్రీస్తూ ప్రసాదించే కృప ప్రకారం మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుకు మీలోను, మీకు ఆయనలోను మహిమ కలగాలని మా ఉద్దేశం.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:1-5
తుదకు, సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి. మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారినుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు. మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారనీ ఇక చేస్తూ ఉంటారనీ మీ గురించి ప్రభువుమీద మాకు నమ్మకం ఉంది. ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి, క్రీస్తు ఓర్పులోకి నడిపిస్తాడు గాక!
హీబ్రూవారికి లేఖ 5:7
క్రీస్తు భూమిమీద సశరీరంగా ఉన్న రోజులలో తనను చావులోనుంచి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు.
హీబ్రూవారికి లేఖ 7:25
ఈ కారణంచేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చినవారిని శాశ్వతంగా రక్షించగలవాడు. ఎందుకంటే వారి పక్షంగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు.
తరచుగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి
లూకా శుభవార్త 17:11-19
ఆయన జెరుసలం ప్రయాణమైపోతూ సమరయ, గలలీ సరిహద్దులో సాగిపోతూ ఉన్నాడు. ఒక గ్రామంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే కుష్ఠురోగమున్న పదిమంది పురుషులు ఎదురుగా వస్తున్నారు. వారు దూరాన నిలుస్తూ కంఠమెత్తి ‘యేసూ! నాయకా! మామీద జాలి చూపు!’ అన్నారు.
వారిని చూచి ఆయన వారితో “మీరు వెళ్ళి యాజులకు కనబడండి” అన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉండగానే వారు శుద్ధమయ్యారు. వారిలో ఒకడు తన రోగం పూర్తిగా నయం కావడం చూచి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ వెనక్కు తిరిగి వచ్చాడు. యేసు పాదాలదగ్గర సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయ దేశస్థుడు.
అందుకు యేసు అన్నాడు “శుద్ధం అయిన వారు పదిమంది గదా! తక్కిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడకపోవడమేమిటి?” అప్పుడు అతనితో “లేచి నీ దారిన వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
యోహాను శుభవార్త 6:11
అప్పుడు యేసు ఆ రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు, శిష్యులకు పంచి ఇచ్చాడు. శిష్యులు కూర్చుని ఉన్నవారికి వడ్డించారు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతమట్టుకు వడ్డించారు.
రోమా వారికి లేఖ 1:21
ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి.
ఎఫెసువారికి లేఖ 5:20
మన ప్రభువైన యేసు క్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెపుతూ ఉండండి.
ఫిలిప్పీవారికి లేఖ 4:4-7
ప్రభువులో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెపుతాను, ఆనందిస్తూ ఉండండి. మనుషులందరికీ మీ సాత్వికం తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి. అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసుద్వారా మీ హృదయాలకూ మనసులకూ కావలి ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 2:7
ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుతూ, మీకు ఉపదేశం వచ్చినట్టే విశ్వాసంలో సుస్థిరమై దానిలో కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 3:17
అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
కొలస్సయివారికి లేఖ 4:2
మెళకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:18
అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం.
తిమోతికి లేఖ 1 2:1
మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి.
తిమోతికి లేఖ 1 4:4-5
దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.
మనం ఇతరులను సహాయం చేయాలి
మత్తయి శుభవార్త 6:1-4
“మనుషులు చూడాలని వారి ముందర మీ ఉపకార క్రియలు చేయకండి. అలా చేస్తే పరలోకంలో మీ తండ్రి మీకు ఏ ప్రతిఫలం ఇవ్వడు. కనుక మీరు ఉపకారక్రియలు చేసేటప్పుడు కపట భక్తులలాగా మీ ముందర బూర ఊదించుకోకండి. మనుషులు తమను గౌరవించాలని వారు సమాజ కేంద్రాలలో, వీధులలో అలా చేస్తారు. నేను ఖచ్చితంగా చెపుతున్నాను, వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టింది. మీరు ఉపకారక్రియ చేసేటప్పుడు అది రహస్యంగా ఉంచడానికి మీ కుడిచేతితో చేసేది ఎడమ చేతికి తెలియనియ్యకండి. అప్పుడు రహస్యంగా జరిగేవాటిని చూచే మీ తండ్రి తానే బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు.
మత్తయి శుభవార్త 7:12
“కాబట్టి అన్ని విషయాలలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని ఆశిస్తారో అదే వారికి చేయండి. ధర్మశాస్త్రమూ, ప్రవక్తల ఉపదేశ సారమూ ఇదే.
మత్తయి శుభవార్త 25:31-46
“మానవ పుత్రుడు తన మహిమతోనూ పవిత్ర దేవ దూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు జనాలన్నిటినీ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది. గొల్లవాడు మేకలలోనుంచి గొర్రెలను వేరు చేసినట్టే ఆయన వారిని ఒకరి దగ్గరనుంచి ఒకరిని వేరు చేస్తాడు. ‘గొర్రెలను’ తన కుడి ప్రక్కన, ‘మేకలను’ ఎడమ ప్రక్కన ఉంచుతాడు.
“అప్పుడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు: ‘నా తండ్రిచేత ఆశీస్సులు పొందిన వారలారా, రండి! ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులు కండి. ఎందుకంటే, నాకు ఆకలి వేసింది, మీరు నాకు తినడానికి ఇచ్చారు. దాహం వేసింది, త్రాగడానికి ఇచ్చారు. పరాయివాడుగా ఉన్నాను, మీరు నన్ను లోపల చేర్చుకొన్నారు. బట్టలు లేనప్పుడు నాకు బట్టలిచ్చారు. నాకు జబ్బు చేసింది, నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఖైదులో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు.’
“అప్పుడు ఆ న్యాయవంతులు ఆయనకిలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూచి భోజనం పెట్టాం? ఎప్పుడు దాహం వేయడం చూచి నీకు త్రాగడానికి ఇచ్చాం? ఎప్పుడు నీవు పరాయివాడుగా ఉండడం చూచి లోపల చేర్చుకొన్నాం? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూచి నీకు బట్టలిచ్చాం? ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూచి, నీవు ఖైదులో ఉండడం చూచి నీ దగ్గరికి వచ్చాం?’
“అందుకు రాజు ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. ఈ నా సోదరులలో ఒక అత్యల్పునికి కూడా మీరు చేసినది ఏదైనా నాకూ చేసినట్టే’ అని వారితో జవాబిచ్చి చెపుతాడు.
“అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో ఇలా అంటాడు: ‘శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి! ఎందుకంటే, నాకు ఆకలి వేసింది గానీ మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నాకు దాహం వేసింది గానీ, త్రాగడానికి మీరేమీ నాకివ్వలేదు. పరాయివాడుగా ఉన్నాను. మీరు నన్ను లోపల చేర్చుకోలేదు. బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నాకు జబ్బు చేసినది, నేను ఖైదులో ఉన్నాను. నన్ను చూడడానికి మీరు రాలేదు.
“వారు కూడా ఆయనకు ఇలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీవు ఆకలితో ఉండడం గానీ దాహంతో గానీ పరాయివాడుగా గానీ బట్టలు లేకుండా గానీ జబ్బుగా గానీ ఖైదులో గానీ ఉండడం చూచి నీకు సహాయం చేయలేదు?’ ఆయన వారికిలా జవాబిస్తాడు: ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. వీరిలో అత్యల్పునికి చేయనిది ఏదైనా నాకూ చేయనట్టే.’
“వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. న్యాయవంతులు శాశ్వత జీవంలో ప్రవేశిస్తారు.
లూకా శుభవార్త 3:10-11
ప్రజానీకం అతణ్ణి చూచి “అలాగైతే మేమేం చెయ్యాలి?” అని అడిగారు.
అతడు వారికిలా జవాబిచ్చాడు: “రెండు చొక్కాలున్న వాడు చొక్కా లేనివానికి ఒకటి ఇవ్వాలి. ఆహారమున్నవాడు కూడా అలాగే చేయాలి.”
లూకా శుభవార్త 6:38
“ఇవ్వండి, అప్పుడు మీకూ ఇవ్వడం జరుగుతుంది. మంచి కొలత – గట్టిగా అదిమి కుదించి పొర్లిపోయేంత కొలత మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలత ఉపయోగిస్తారో ఆ కొలతే మీకూ ఉపయోగించడం జరుగుతుంది.”
అపొస్తలుల కార్యాలు 11:27-30
ఆ రోజులలో ప్రవక్తలు కొందరు జెరుసలంనుంచి అంతియొకయకు వచ్చారు. వారిలో ఒకడైన అగబు అనేవాడు నిలబడి లోకమంతటికీ గొప్ప కరవు వస్తుందని దేవుని ఆత్మమూలంగా సూచించాడు. అది క్లౌదియ సీజర్ పరిపాలన కాలంలో జరిగింది. అప్పుడు శిష్యులు తమలో ప్రతి ఒక్కరూ శక్తికొలది ఇచ్చి యూదయలో కాపురమున్న సోదరుల సహాయంకోసం పంపాలని నిశ్చయించుకొన్నారు. వారు అలా చేసి బర్నబా సౌలుల చేతుల్లో ఉంచి ఆ సొమ్మును అక్కడి పెద్దల దగ్గరకు పంపించారు.
కొరింతువారికి లేఖ 1 10:24
స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు గాని ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి.
కొరింతువారికి లేఖ 2 8:1-15
ఇప్పుడు, సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియజేస్తాను. తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఉండి కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దరిద్రంలోనుంచి వారి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది. వారిని గురించి నా సాక్ష్యమేమిటంటే, తమంతట తామే ఇష్టపూర్వకంగానే వారు ఇవ్వగలిగినంతా ఇచ్చారు – అసలు దానికంటే ఎక్కువే ఇచ్చారు. అక్కరలో ఉన్న పవిత్రులకోసం ఈ ఉదారతను ఈ సేవలో తమ తోడ్పటును మేము స్వీకరించాలని మనసారా మమ్ములను వేడుకొన్నారు. ఇంతేకాదు. మేము ఆశించినట్టు మాత్రమే కాక, వారు మొదట ప్రభువుకు, దేవుని సంకల్పంవల్ల మాకు కూడా అర్పించుకొన్నారు.
తీతు మీలో ఈ ఉదారత మొదలుపెట్టాడు గనుక మీలో దీనిని సంపూర్తి చేయాలని కూడా మేమతణ్ణి పురికొల్పాం. మీకు ప్రతి విషయంలో – విశ్వాసంలో, మాటలో, తెలివిలో, సంపూర్ణ ఆసక్తిలో, మాపట్ల మీకున్న ప్రేమలో సమృద్ధి ఉంది. అలాగే ఈ ఉదారతలో కూడా సమృద్ధి ఉండేలా చూచుకోండి.
నేను ఆజ్ఞపూర్వకంగా చెప్పడం లేదు గాని ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమభావం ఎంత వాస్తవమో పరీక్షిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తెలుసు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీకోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రంవల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం.
మీరు ఇవ్వడం గురించి నా అభిప్రాయమిది: సంవత్సరం క్రిందటే మీరు ఏ ఉపకారక్రియ చేయాలని కోరి మొదలు పెట్టారో దాన్ని ఇంకా చేయడం మీకు మేలు. ఇప్పుడు దాన్ని చేస్తూ ముగించాలి. చేయాలని కోరడానికి సంసిద్ధత ఉన్నట్టు మీకున్నదానిలో నుంచి ఇచ్చి సంపూర్తి చేయాలి కూడా. మొదట సిద్ధమైన మనసు ఉంటే ఇచ్చేది అంగీకారంగా ఉంటుంది. ఈ అంగీకారం ఒక వ్యక్తికి ఉన్నదానినిబట్టే గాని లేనిదానినిబట్టి కాదు.
ఇతరుల విషయంలో శ్రమ నివారణ చేసి మీకు భారం కలిగించాలని కాదు. గాని సమానత ఉండాలని నా కోరిక. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరలకు సహాయకరంగా ఉండాలని నా భావం. అప్పుడు రాసి ఉన్న దానిప్రకారం సమానత ఉంటుంది – “ఎక్కువగా సేకరించినవారికి ఏమి మిగలలేదు, తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు.”
కొరింతువారికి లేఖ 2 9:1-15
పవిత్రులకోసమైన ఈ సేవ విషయం నేను మీకు రాయనక్కరలేదు. ఇందులో మీ సంసిద్ధత నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు సంవత్సరంనుంచి చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీ గురించి మాసిదోనియవారితో గొప్పగా చెపుతున్నాను. మీ ఆసక్తి వారిలో ఎక్కువమందికి ప్రోత్సాహం కలిగించింది. అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పుకొన్న సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ, నేను చెప్పినట్టే మీరు సిద్ధంగా ఉండాలనీ ఈ సోదరులను పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియవారిలో ఎవరైనా నాతో వచ్చి, మీరు సిద్ధంగా లేకపోతే అది చూస్తారనుకోండి. అలాంటప్పుడు మేము నమ్మకంతో గొప్పగా చెప్పిన దాని గురించి ఈ నమ్మకం వల్ల మాకు సిగ్గు కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందని వేరే చెప్పాలా! ఈ కారణంచేత సోదరులు ముందుగానే మీ దగ్గరకు వచ్చి, లోగడ ఇస్తామని మీరు చెప్పిన ధారాళమైన చందా జమ చేసేటందుకు వారిని ప్రోత్సహించడం అవసరమనుకొన్నాను. మీ చందా సిద్ధంగా ఉండాలనీ, అది పిసినిగొట్టుతనంగా ఇచ్చినది కాకుండా ధారాళమైనదిగా ఉండాలనీ నా ఉద్దేశం.
ఇందుకు ఒక ఉదాహరణ – కొద్దిగా వెదజల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు. ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే, ఉల్లాసంతో ఇచ్చే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు. అంతే కాదు. అన్నిట్లో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీపట్ల సర్వ కృప సమృద్ధిగా అధికం చేయగలడు. దీనిగురించి ఇలా రాసి ఉంది: “అతడు నలుదిక్కులకు వెదజల్లాడు. అక్కరలో ఉన్నవారికి ఇచ్చాడు. అతని నీతిన్యాయాలు శాశ్వతంగా నిలుస్తాయి.”
వెదజల్లే వారికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే దేవుడు చల్లడానికి విత్తనాలు మీకిస్తాడు, వృద్ధి చేస్తాడు, మీ న్యాయ ఫలాన్ని అధికం చేస్తాడు గాక. ఈ విధంగా ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వసమృద్ధి కలుగుతుంది. దీనివల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పే కారణం అవుతుంది. ఈ సేవ నిర్వహించడం పవిత్రుల అక్కరలను తీర్చడమే కాకుండా, దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు కలిగేలా చేస్తుంది. ఈ సేవ రుజువైనదనీ మీరు ఒప్పుకొన్న శుభవార్తకు మీ విధేయతనుబట్టీ తమకు, అందరికీ, మీరు ఉదారంగా పంచిపెట్టడం బట్టీ దేవునికి మహిమ కలిగిస్తారు. అంతేగాక, మీలో ఉన్న దేవుని అత్యధిక కృపను బట్టి వారు మీకోసం ప్రార్థన చేస్తూ, మీ మేలు మనసారా కోరతారు.
వివరించడానికి సాధ్యం కాని ఆయన ఉచితమైన బహుమతి గురించి దేవునికి కృతజ్ఞతలు!
గలతీయవారికి లేఖ 6:9-10
మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకొంటాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ – మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరినవారికి – మంచి చేస్తూ ఉందాం.
ఫిలిప్పీవారికి లేఖ 4:14-19
అయినా నా కష్టాలలో మీరు తోడ్పడడం మంచిదే. నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్ళిన తరువాత, ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘంవారు పాలివారు కాలేదని ఫిలిప్పీవాసులైన మీకే తెలుసు. నేను తెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటి మాటికి సహాయం పంపారు. నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను. నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన, ఇష్టమైన యజ్ఞం.
నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు.
హీబ్రూవారికి లేఖ 10:24
అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం.
హీబ్రూవారికి లేఖ 13:1-3
సోదర ప్రేమ చూపుతూ ఉండండి. పరాయివారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఖైదులో ఉన్నవారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకముంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనుక దౌర్జన్యానికి గురి అయినవారిని తలచుకోండి.
హీబ్రూవారికి లేఖ 13:16
ఉపకారాలూ దానధర్మాలూ చేయడం మరవకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే.
యాకోబు లేఖ 1:27
తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.
యాకోబు లేఖ 2:15-16
ఎవరైనా ఒక సోదరుడు గానీ సోదరి గానీ బట్టలూ, రోజూ కావలసిన ఆహారమూ లేకుండా ఉన్న పక్షంలో మీలో ఎవరైనా వారికి శరీర అవసరాలను తీర్చకుండా “క్షేమంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తిగా తిను” అని చెపితే ఏమి ప్రయోజనం?
యోహాను లేఖ 1 3:16-18
యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్నిబట్టే మనకు తెలుసు. మనమూ సోదరులకోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యతగలవారం. అయితే ఈ లోకం బ్రతుకుదెరువు గలవాడెవడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతనిమీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
నా చిన్న పిల్లలారా, మాటతో భాషతో గాక వాస్తవంగా, క్రియతో ప్రేమ చూపుదాం.
మనం అణకువ కలిగినవారం
మత్తయి శుభవార్త 5:3-12
తమ ఆధ్యాత్మిక దరిద్య్రాన్ని గుర్తించినవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
దుఃఖించేవారు ధన్యులు. వారికి ఓదార్పు కలుగుతుంది.
సాధుగుణం గలవారు ధన్యులు. భూలోకానికి వారు వారసులు.
నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారికి తృప్తి కలుగుతుంది.
కరుణ చూపేవారు ధన్యులు. వారికి కరుణ దొరుకుతుంది.
శుద్ధ హృదయులు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు.
సమాధానం చేకూర్చేవారు ధన్యులు. వారు దేవుని సంతానం అనిపించుకొంటారు.
నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
“నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
మత్తయి శుభవార్త 18:1-5
ఆ సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న అడిగారు: “పరలోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప?”
యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలిచి, వారిమధ్య నిలబెట్టి ఇలా అన్నాడు: “నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మార్పు చెంది, చిన్నవారిలాగా గనుక కాకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు. అందుచేత ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తమను తగ్గించుకొంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. అంతేగాక, ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారన్నమాట.
లూకా శుభవార్త 14:7-11
అక్కడ ఆహ్వానం అందినవారు అగ్ర స్థానాలను ఎన్నుకోవడం గమనించి ఆయన వారికి ఒక ఉదాహరణ చెపుతూ “పెండ్లి విందుకు నిన్ను ఎవరైనా పిలిస్తే అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ అతడు నీకంటే ఘనుణ్ణి పిలిచి ఉండవచ్చునేమో. అలాంటప్పుడు నిన్నూ అతణ్ణీ పిలిచినవాడు నీ దగ్గరకు వచ్చి ‘మీరు వీరికి ఈ చోటు ఇవ్వండి’ అంటాడేమో. అప్పుడు నీవు చిన్నబోయి చివరి స్థానంలో కూర్చోవడం ఆరంభిస్తావు. గనుక నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి నీతో ‘స్నేహితుడా! ఆ పై స్థానానికి వెళ్ళండి’ అనవచ్చు. అప్పుడు నీతోకూడా కూర్చుని ఉన్న వారి సమక్షంలో నీకు గౌరవం కలుగుతుంది. తనను గొప్ప చేసుకొనేవారిని తగ్గించడం, తనను తగ్గించుకొనేవారిని గొప్ప చేయడం జరుగుతుంది” అని వారితో అన్నాడు.
లూకా శుభవార్త 18:9-14
తామే న్యాయవంతులని తమలో నమ్మకం ఉంచుకొంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకంవాడు.
“పరిసయ్యుడు నిలుచుండి తనతో ఇలా ప్రార్థించాడు: ‘దేవా, ఇతరులు వంచకులూ అన్యాయస్థులూ వ్యభిచారులూ ఈ సుంకంవాడిలాంటివారూ. నేను వారివంటి వాణ్ణి కాను గనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. నేను వారానికి రెండు సార్లు ఉపవాసముంటాను, నా రాబడి అంతట్లో పదో భాగం చెల్లిస్తూ వున్నాను.’
“ఆ సుంకంవాడైతే దూరంగా నిలుచుండి ఆకాశంవైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకొంటూ ‘దేవా! నేను పాపినే. నన్ను కరుణించు!’ అన్నాడు.
“న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెపుతున్నాను. ఎందుకంటే, తనను గొప్ప చేసుకొనే ప్రతి ఒక్కరినీ తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.”
ఎఫెసువారికి లేఖ 4:2
పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరిపట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి.
ఫిలిప్పీవారికి లేఖ 2:3-11
కక్షచేత గానీ వట్టి డంబంచేత గానీ ఏమీ చేయకండి. దానికి బదులు, మీలో ప్రతి ఒక్కరూ తనకంటే ఇతరులు ఎక్కువవారని వినయంతో ఎంచండి. మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల విషయాలు కూడా చూడండి.
క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరూ కలిగి ఉండండి: ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు. గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకొని సేవకుని స్వరూపం ధరించి మనుషుల పోలికలో జన్మించాడు. మనిషి రూపంతో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకొని మరణం పొందడానికి – సిలువ మరణం పొందడానికి కూడా – విధేయుడయ్యాడు.
ఈ కారణంచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు. దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది, తండ్రి అయిన దేవుని మహిమకోసం ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది.
కొలస్సయివారికి లేఖ 3:12-13
దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నాడు. మీరు పవిత్రులు, దేవుని ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి.
యాకోబు లేఖ 4:5-10
మనలో నివసిస్తున్న ఆత్మ తీవ్రంగా ఆకాంక్షిస్తాడా? అని చెప్పిన లేఖనం వ్యర్థం అనుకొంటున్నారా? అయితే ఆయన మరెక్కువ కృప ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గానీ వినయవంతులకు కృప చూపుతాడని చెపుతాడు.
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. దుఃఖించండి, ఏడ్వండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి. ప్రభు సముఖంలో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్ములను పైకెత్తుతాడు.
పేతురు లేఖ 1 5:5-7
యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయం వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే, “దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయం గలవారికి కృప చూపుతాడు.” అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్ములను పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్ఠమైన చేతిక్రింద మిమ్ములను మీరే తగ్గించుకోండి. ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి.
ధన సంపదలను మనం ఇలా గౌరవించాలి
మత్తయి శుభవార్త 6:19-21
“భూమిమీద మీ కోసం సంపద కూడబెట్టుకోకండి. ఇక్కడ చిమ్మెటలు, తుప్పు తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దోచుకొంటారు. పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చిమ్మెట గాని, తుప్పు గాని తినివేయవు. దొంగలు కన్నం వేసి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
మత్తయి శుభవార్త 6:24-34
“ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.
“అందుచేత నేను మీతో చెప్పేదేమిటంటే, ‘ఏమి తింటాం? ఏమి తాగుతాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగ పెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ మీ శరీరాన్ని గురించి బెంగ పెట్టుకోకండి. తిండికంటే జీవితం ప్రధానం గదా! బట్టలకంటే శరీరం ముఖ్యం గదా! గాలిలో ఎగిరే పక్షులను చూడండి. అవి నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూడబెట్టుకోవు. అయినా, మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైనవారు గదా! చింతపడడం వల్ల మీలో ఎవరు తమ ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు?
“మీకు బట్టల విషయం చింత ఎందుకు? పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. అయినా, తన వైభవమంతటితో ఉన్న సొలొమోనుకు కూడా ఈ పూలలో ఒక్కదానికున్నంత అలంకారం లేదని మీతో చెపుతున్నాను. అల్ప విశ్వాసం ఉన్నవారలారా, ఈ వేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలం గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు గదా. కనుక ‘ఏం తింటామో? ఏం త్రాగుతామో? ఏం బట్టలు వేసుకొంటామో?’ అంటూ చింతించకండి. దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలు వీటికోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు. మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిన్యాయాలను వెదకండి. అప్పుడు వాటితోపాటు ఇవన్నీ మీకు చేకూరుతాయి. అందుచేత రేపటి విషయం చింతించకండి. దాని విషయం అదే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
లూకా శుభవార్త 12:13-21
గుంపులో ఎవరో ఒకడు ఆయనతో “ఉపదేశకా! వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నా భాగం పంచిపెట్టమని మా తోబుట్టువుకు చెప్పండి” అన్నాడు.
అందుకాయన అతనితో “అయ్యా, మీమీద నన్నెవరు తీర్పరిగా లేదా మధ్యవర్తిగా నియమించారు?” అన్నాడు. ఆయన వారితో “అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి! ఒకరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు” అన్నాడు.
అప్పుడాయన వారికొక ఉదాహరణ చెప్పాడు: “ఆస్తిపరుడొకడి భూమి బాగా పండింది, గనుక అతడిలా లోలోపల ఆలోచన చేశాడు: ‘నా పంట నిలవ చేయడానికి స్థలం లేదు. ఏం చెయ్యను? ఇలా చేస్తాను – నా గిడ్డంగులు పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యం, నా సరుకులు అన్నీ నిలవ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో నేనంటాను, ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు మంచి వస్తువులు కూడబెట్టబడ్డాయి. సుఖంగా ఉండు. తిను, తాగు, సంబరపడు!’ అని. అయితే అతనితో దేవుడు అన్నాడు ‘తెలివి తక్కువవాడా! ఈ రాత్రే నీ ప్రాణం అడగడం జరుగుతుంది. నీవు సిద్ధం చేసుకొన్నవి అప్పుడు ఎవరివవుతాయి?’ దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తనకోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే.”
లూకా శుభవార్త 12:32-34
“చిన్న మందా, భయంతో ఉండకు, తన రాజ్యాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. మీకున్నదాన్ని అమ్మి దానధర్మాలు చేయండి. పరలోకంలో మీకు పాతగిలిపోని డబ్బు సంచులు తయారు చేసుకోండి. అయిపోకుండా ఉండే సొమ్ము సమకూర్చుకోండి. అక్కడ దొంగ ఎవడూ దగ్గరకు రాడు, చిమ్మటలు కొట్టవు. మీ సొమ్ము ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
అపొస్తలుల కార్యాలు 20:35
ఇలా శ్రమిస్తూ మీరూ కష్టపడి బలహీనులకు సహాయం చేయాలని నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ‘తీసుకోవడంకంటే ఇవ్వడమే ధన్యం’ అని యేసుప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకముంచుకోండి.”
తిమోతికి లేఖ 1 6:6-10
ఉన్నదాన్ని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే. ఎందుకంటే, మనం లోకంలోకి దేనినీ తీసుకురాలేదు, లోకంనుంచి దేనినీ తీసుకుపోలేమని స్పష్టమే. అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తిపడతాం.
ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో, హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి. ఎందుకంటే డబ్బుమీది వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించు కొందామని విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి, అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకొన్నారు.
తిమోతికి లేఖ 1 6:17-19
ఇహలోకంలో ధనం ఉన్నవారు గర్విష్ఠులు కాకుండా అనిశ్చయమైన ధనంమీద నమ్మకం పెట్టుకోకుండా, జీవంగల దేవునిమీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు. సంతోషంతో అనుభవించడానికి ఆయన అన్నీ సమృద్ధిగా దయ చేసేవాడు. వారు మేలు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై, తమకున్న దానిలో కొంత పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండి, వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందిన దాన్ని సమకూర్చుకొంటూ ఉండాలి. వారు శాశ్వత జీవాన్ని చేపట్టాలన్న మాట.
హీబ్రూవారికి లేఖ 13:5-6
మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను. అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
యాకోబు లేఖ 2:1-9
నా సోదరులారా, మన ప్రభువూ మహిమ స్వరూపీ అయిన యేసు క్రీస్తుమీది నమ్మకం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి. బంగారు ఉంగరం పెట్టుకొని మేలి రకమైన బట్టలు తొడుక్కొన్నవాడు, మాసిన బట్టలు కట్టుకొన్న బీదవాడు – వీరిద్దరు మీ సభలోకి వస్తే, ఒకవేళ మీరు మేలిరకమైన బట్టలు తొడుక్కొన్న మనిషిని అభిమానంతో చూస్తూ “తమరు ఇక్కడ ఈ మంచి చోట కూర్చోండి” అని చెప్పి బీదవానితో “నీవు అక్కడ నిలబడు” లేదా, “నా పాదపీఠం దగ్గర కింద కూర్చో” అని చెపితే, మీలో మీరు భేదాలు చూపుతూ చెడ్డ ఉద్దేశాలతో నిర్ణయాలు చేసిన వారవుతారు గదా.
నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో ఉన్న బీదవారిని విశ్వాసం విషయంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించేవారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఎన్నుకోలేదా? మీరైతే బీదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్ములను అణగద్రొక్కేదీ, న్యాయస్థానాలకు ఈడ్చుకుపోయేదీ ధనవంతులే గదా! మీరు ఏ దివ్యమైన పేరునుబట్టి పిలువబడ్డారో ఆ పేరును దూషించేది కూడా వీరే గదా!
లేఖనంలో “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి” అనేది రాజాజ్ఞ. దీన్ని మీరు నెరవేరుస్తూ ఉంటే, బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారన్న మాటే. కాని, మీరు పక్షపాతం చూపుతూ ఉంటే మీరు పాపం చేస్తున్నారు. మీరు అతిక్రమకారులని ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది.
యాకోబు లేఖ 5:1-6
ఇదిగో వినండి, ఆస్తిపరులారా! మీమీదికి వచ్చే కడగండ్లను గురించి రోదనం చేయండి, ఏడ్వండి! మీ ఆస్తి మురిగిపోయింది. మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టాయి. మీ వెండి బంగారాలకు తుప్పు పట్టింది. వాటి తుప్పు మీమీద విరుద్ధ సాక్ష్యం పలుకుతూ ఉండి నిప్పులాగా మీ శరీరాలను తినివేస్తుంది. మీరు ధనం పోగు చేసుకొన్నది చివరి రోజులలోనే! ఇదిగో వినండి. మీ పొలాల పంట కోసినవారికి మీరు కూలి ఇవ్వకుండా వంచనతో బిగబట్టారు. ఆ కూలి కేకలు వేస్తూ ఉంది. కోతవారి మొరలు సేనలప్రభువు చెవులకు చేరాయి. మీరు భూమిమీద సుఖంగా విలాసాసక్తితో బ్రతికారు. వధ సమయంలో ఉన్నట్టు మీ హృదయాలను కొవ్వబెట్టుకొన్నారు. న్యాయవంతుణ్ణి నేరస్థాపనకు గురి చేశారు, చంపారు. అతడు మిమ్ములను ఎదిరించినవాడు కాదు.
వ్యాజ్యాలనుండి మనం సాధ్యమైనంత వరకు ప్రక్కకు తొలగాలి
మత్తయి శుభవార్త 5:25-26
“మీ ప్రత్యర్థితో న్యాయస్థానానికి పోయే త్రోవలోనే త్వరగా రాజీపడండి. లేకపోతే మీ ప్రత్యర్థి మిమ్ములను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో, న్యాయాధిపతి మిమ్ములను భటుడికి అప్పగించి ఖైదులో వేయిస్తాడేమో. అలాంటప్పుడు మీరు చివరి పైసాతో సహా చెల్లించేంతవరకు బయటికి రాలేరని నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను.
మత్తయి శుభవార్త 5:38-42
“‘కంటికి బదులుగా కన్ను, పంటికి బదులుగా పన్ను ఊడబెరకాలి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా. కానీ మీతో నేనంటాను, దుర్మార్గుణ్ణి ఎదిరించకండి. ఎవరైనా మిమ్ములను కుడిచెంపపై కొడితే, ఆ వ్యక్తికి ఎడమ చెంప కూడా త్రిప్పండి. ఎవరైనా మీ విషయం వ్యాజ్యం వేసి మీ అంగీని తీసుకోవాలని చూస్తే ఆ వ్యక్తికి మీ పై చొక్కాను కూడా ఇచ్చివేయండి. ఎవరైనా కిలోమీటరు దూరం వచ్చేలా మిమ్ములను బలవంతం చేస్తే, ఆ వ్యక్తితో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళండి. మిమ్మల్ని అడిగినవారికి ఇవ్వండి. అప్పుకోసం మీ దగ్గరికి వచ్చినవారికి పెడ ముఖం పెట్టుకోకండి.
మత్తయి శుభవార్త 18:15-17
“మరొకటి – మీ సోదరుడు మీకు విరోధంగా అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి మీరు అతడు ఒంటరిగానే అతనికి అతని తప్పిదం తెలియజేయండి. అతడు మీ మాట వింటే మీ సోదరుణ్ణి దక్కించుకొన్నారన్న మాట. ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఇంకా ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళండి. ‘ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే ప్రతి సంగతీ రూఢి కావాలి’ గనుక అలా చేయండి. ఒకవేళ అతడు వారి మాట కూడా వినకపోతే, అది సంఘానికి తెలియజేయండి. సంఘం మాట కూడా అతడు వినకపోతే, ఇతర ప్రజలలో ఒకడుగా, సుంకంవాడుగా అతణ్ణి ఎంచండి.
రోమా వారికి లేఖ 12:14-21
మిమ్ములను హింసించేవారిని దీవించండి. శపించకండి గాని దీవించండి. సంతోషించేవారితో సంతోషించండి. ఏడ్చేవారితో ఏడ్వండి. ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పతనాన్ని ఆలోచించక, దీనులతో సహవాసం చేయండి. మీరు వివేకులని అభిప్రాయపడకండి.
అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకొనే విషయాలను ఆలోచించండి. మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగతీర్చుకోకండి గాని దేవుని కోపానికి అవకాశమివ్వండి. పగతీర్చే పని నాదే అని ప్రభువు చెపుతున్నాడని రాసి ఉంది గదా. అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికెలు పోసినట్టే. కీడువల్ల అపజయం పాలుకాకండి గాని మేలుతో కీడును జయించండి.
కొరింతువారికి లేఖ 1 6:1-8
మీలో ఎవడికైనా మరొకడి మీద పరిష్కరించుకోవలసిన విషయం ఉంటే అతడు పవిత్రుల ఎదుటికి రాక, అన్యాయస్థుల ఎదుట వ్యాజ్యెమాడడానికి తెగిస్తాడా ఏమిటి? పవిత్రులు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా? లోకం మీ తీర్పుకు గురి అవుతుంది అంటే అతి స్వల్ప విషయాలను పరిష్కరించదగనివారా మీరు? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా? అలాగైతే ఈ జీవిత విషయాలను గురించి తీర్పు తీర్చవచ్చుననేది మరీ నిశ్చయం. ఈ జీవితానికి చెందే విషయాలు తీర్పుకోసం రావలసి ఉంటే వాటిని క్రీస్తు సంఘంలో తక్కువ గౌరవం గలవారిచేత పరిష్కారం చేయించుకొంటారా? మీకు సిగ్గు రావాలని ఇలా అంటున్నాను. సోదరుల మధ్య వివాద పరిష్కారం చేయగల తెలివైనవాడొక్కడు కూడా మీలో లేడా? సోదరుడు సోదరుడి మీద వ్యాజ్యెమాడుతాడు! తీర్పుకోసం అవిశ్వాసుల దగ్గరకు వెళ్తారు!
కాబట్టి, మీలో ఒకరిమీద ఒకరు వ్యాజ్యెమాడడంవల్ల ఇప్పటికే మీరు పూర్తిగా ఓడిపోయారన్న మాట. దానికి బదులు మీరెందుకు అన్యాయం ఓర్చుకోరు? ఎందుకు మీ వస్తువులు తినివేయడం జరగనియ్యరు? అది గాక మీరే అన్యాయం చేస్తున్నారు, ఇతరుల సొత్తు తినివేస్తున్నారు. మీరలా చేస్తున్నది సోదరులకే!
ఎవరైతే మనలను పరిపాలిస్తున్నారో వారిని గౌరవిస్తాం
మత్తయి శుభవార్త 22:15-22
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు. తరువాత తమ శిష్యులను హేరోదు పక్షంవాళ్ళతోపాటు ఆయనదగ్గరికి పంపారు. వారు ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు యథార్థవంతులనీ, ఎవరినీ లెక్కచేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారనీ, మనుషులను పక్షపాతంతో చూడరనీ మాకు తెలుసు. గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి – సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా కాదా?”
యేసు వాళ్ళ దుర్మార్గత పసికట్టి “కపట భక్తులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? సుంకం నాణెం ఒకటి నాకు చూపెట్టండి” అన్నాడు. వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు.
“ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.
“సీజర్‌వి” అని వారు ఆయనతో అన్నారు. ఆయన వారితో “అలాగైతే సీజర్‌వి సీజర్‌కూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
అపొస్తలుల కార్యాలు 5:27-29
వారిని తీసుకువచ్చి సమాలోచన సభలో నిలబెట్టారు. అప్పుడు ప్రముఖ యాజి వారిని ప్రశ్నిస్తూ ఇలా అన్నాడు: “ఆ పేరున ఉపదేశం చేయకూడదని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేయలేదా? అయినా, ఇదిగో! మీరు జెరుసలంను మీ ఉపదేశాలతో నింపేశారు. ఆ మనిషి రక్తవిషయమైన అపరాధం మామీదికి తేవాలని చూస్తున్నారు.”
అందుకు పేతురు, తక్కిన క్రీస్తురాయబారులు ఇలా జవాబిచ్చారు: “మేము దేవునికే లోబడాలి గానీ మనుషులకు కాదు.
రోమా వారికి లేఖ 13:1-7
ప్రతి ఒక్కరూ రాజ్యాధికారాలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవునివల్ల కలిగిన అధికారం తప్ప మరేదీ లేదు. ఉన్న ఆ అధికారాలను స్థాపించినది దేవుడే. ఈ కారణంచేత అధికారాన్ని ఎదిరించేవారు దేవుని నిర్ణయాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించేవారు తమమీదికి తామే తీర్పు తెచ్చిపెట్టుకొంటారు.
పరిపాలకులు మంచి పనుల విషయంలో బీకరులు కారు – చెడు పనుల విషయంలోనే. అధికారులంటే భయం లేకుండా ఉండాలనే కోరిక మీకు ఉందా? ఉంటే, మంచినే చేస్తూ ఉండండి. అప్పుడు వారు మిమ్ములను మెచ్చుకొంటారు. ఎందుకంటే, అధికారి మీ మేలుకోసం దేవుని పరిచారకుడు. కానీ, మీరు కీడు చేస్తే భయపడాలి. అతడు ఊరికే ఖడ్గం ధరించడు. అతడు కీడు చేసే వారిపై ఆగ్రహం చూపే దేవుని పరిచారకుడు. అందుచేత, వారికి లోబడి ఉండడం తప్పనిసరి – ఆ ఆగ్రహం కారణంగా మాత్రమే కాక అంతర్వాణిని బట్టి కూడా లోబడాలి.
ఇందువల్లే గదా మీరు సుంకాలు కూడా చెల్లించేది? అవును, పరిపాలకులు అదే పని సదా చేస్తున్న దేవుని పరిచారకులు. గనుక ప్రతి ఒక్కరికీ చెల్లించవలసినది ఇవ్వండి. ఎవరికీ సుంకమో వారికి సుంకం, ఎవరికి పన్నో వారికి పన్ను చెల్లించండి. ఎవరిపట్ల భయం చూపదగినది వారిపట్ల భయం చూపండి. ఎవరిని గౌరవించదగింది వారిని గౌరవించండి.
తిమోతికి లేఖ 1 2:1-4
మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
తీతుకు లేఖ 3:1
వారికి ఈ సంగతులు జ్ఞాపకం చెయ్యి: వారు పరిపాలకులకూ అధికారులకూ లోబడాలి, విధేయులై, ప్రతి మంచి పనికోసమూ సంసిద్ధంగా ఉండాలి.
పేతురు లేఖ 1 2:13-17
అందుచేత మనుషులలో నియమించిన ప్రతి అధికారానికీ ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందనీ ప్రాంతీయాధికారులు దుర్మార్గులను దండించడానికీ సన్మార్గులను మెచ్చుకోవడానికీ రాజు పంపినవారనీ వారికీ లోబడండి. ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా తెలివితక్కువగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి గాని దేవుని బానిసలుగా బ్రతకండి. అందరిపట్ల గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవునిమీది భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి.
మనం విగ్రహాలను పూజించము
మత్తయి శుభవార్త 4:10
“సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
అపొస్తలుల కార్యాలు 17:22-31
అరేయోపగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. నేను అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది. ‘తెలియబడని దేవునికి’ అని దానిమీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయననే మీకు ప్రకటిస్తున్నాను. జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
“భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. వారు ప్రభువును వెదకాలని – తడవులాడి ఆయనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు. ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మీ కవులలో కొందరు చెప్పినట్టు ‘మనం ఆయన సంతానం.’ మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
కొరింతువారికి లేఖ 1 5:11
ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
కొరింతువారికి లేఖ 1 6:9-11
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
కొరింతువారికి లేఖ 1 8:1-13
విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం: మనకందరికీ తెలివి ఉందని మనకు తెలుసు. తెలివి ఉప్పొంగ జేస్తుంది, ప్రేమ అయితే అభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసుననుకొంటే తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదన్న మాట. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఆ వ్యక్తి తెలుసు.
అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు), మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
అయినా ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతవరకు విగ్రహం గురించి స్మృతి కలిగి తాము తింటున్నది విగ్రహానికి అర్పితమైనట్టు భావించి తింటున్నారు. వారి అంతర్వాణికి చాలినంత వివేచనాశక్తి లేకపోవడంచేత అది అశుద్ధి అవుతుంది. గాని తిండి మనల్ని దేవునికి సిఫారసు చేయదు. మనం ఏదైనా తింటే ఎక్కువవారమూ కాము. తినకపోతే తక్కువవారము కాము.
అయినా మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూచుకోండి. సత్యం తెలిసిన మీరు విగ్రహమున్న స్థలంలో తింటే ఎవడైనా ఒకడు చూస్తాడనుకోండి. విశ్వాసంలో బలహీనుడైన అతడి అంతర్వాణికి విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే ధైర్యం కలగదా? క్రీస్తు ఎవరికోసం చనిపోయాడో విశ్వాసంలో ఆ బలహీన సోదరుడు మీ తెలివివల్ల పాడైపోవాలా? మీరు సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసి తక్కువ వివేచనశక్తి ఉన్నవారి అంతర్వాణికి దెబ్బ కొట్టడంవల్ల మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
కాబట్టి, తిండి నా సోదరుడు తప్పటడుగు వేయడానికి కారణమైతే, నా సోదరుడు తప్పటడుగు వేయకూడదని నేను ఇంకెన్నడూ మాంసం తినను.
కొరింతువారికి లేఖ 1 10:1-22
సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక: మన పూర్వీకులంతా మేఘం క్రింద ఉన్నారు, అందరూ సముద్రం గుండా వెళ్ళారు. అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తినేవారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే, తమవెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలోనుంచి వచ్చిన నీళ్ళు త్రాగేవారు. ఆ బండ క్రీస్తే. అయినా వారిలో ఎక్కువమందివల్ల దేవునికి సంతోషం కలగలేదు గనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి.
వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. మీరు వారిలో కొందరిలాగా విగ్రహపూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: “ప్రజలు తింటూ త్రాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు.” వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో ఇరవై మూడు వేలమంది ఒకే రోజున హతమై కూలారు. వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసినవారు పాముల కాటుచేత నాశనమయ్యారు. వారిలో కొందరు సణిగారు. మనం సణగకూడదు. సణిగినవారు సంహారకునిచేత నాశనమయ్యారు.
ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి. కనుక నిలుచున్నాననుకొనే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
అందుచేత, నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజనుంచి పారిపోండి! మీరు తెలివైనవారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి.
మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? మనం అనేకులమైనా ఒకటే రొట్టె, ఒకటే శరీరం ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం.
శరీర సంబంధంగా ఇస్రాయేల్‌జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా. నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైనదానిలో గానీ ఏమైనా ఉందని చెపుతున్నానా? లేదు, గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్లమీద ఉన్నవాటిలో, పిశాచాల బల్లమీద ఉన్నవాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయనకంటే మనం బలవంతులమా?
కొరింతువారికి లేఖ 2 6:14-18
నమ్మనివారితో మీరు జతగా ఉండకండి. న్యాయానికి అధర్మంతో వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు బెలియాల్‌తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి? మీరు జీవంగల దేవుని ఆలయం. ఇందుకు దేవుడు చెప్పినదేమిటంటే, నేను వారిలో నివాసముంటాను, వారితో నడుస్తాను. వారి దేవుణ్ణయి ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
అందుచేత వారిలో నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెపుతున్నాడు, కల్మషమైన దానిని ముట్టకండి. నేను మిమ్ములను స్వీకరిస్తాను. మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కొడుకులూ కూతుళ్ళై ఉంటారు అని అమిత శక్తిగల ప్రభువు అంటున్నాడు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
తెస్సలొనీకవారికి లేఖ 1 1:9-10
మీ మధ్యకు మా ప్రవేశం ఎలాంటిదో, మీరు జీవం గల సత్య దేవునికి సేవ చేయడానికీ పరలోకంనుంచి రాబోయే ఆయన కుమారుని కోసం ఎదురు చూడడానికీ ఏవిధంగా విగ్రహాలు విడిచిపెట్టి దేవునివైపు తిరిగారో వారే చెపుతున్నారు. దేవుడు ఆయనను – దేవుని కోపం నుంచి మనలను తప్పిస్తున్న యేసును – చనిపోయిన వారిలో నుంచి లేపాడు.
యోహాను లేఖ 1 5:21
చిన్న పిల్లలారా, విగ్రహాల బారినుంచి మిమ్ములను కాపాడుకోండి. తథాస్తు.
ప్రకటన 21:8
“కానీ పిరికివారు, విశ్వాసం లేనివారు, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధికులంతా అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు.”
ప్రకటన 22:15
నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు.
మనం బలులను అర్పించము
మత్తయి శుభవార్త 9:13
నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను గాని న్యాయవంతులను కాదు. కనుక మీరు వెళ్ళి ‘మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు’ అనే వాక్కు భావం నేర్చుకోండి.”
మార్కు శుభవార్త 12:33
హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బుద్ధి అంతటితో, బలం అంతటితో ఆయనను ప్రేమించడమూ మనలను ప్రేమించుకొన్నట్టే పొరుగువారిని ప్రేమించడమూ అన్ని హోమాలకంటే, బలులకంటే అధికం” అన్నాడు.
రోమా వారికి లేఖ 12:1
కాబట్టి, సోదరులారా, మీ శరీరాలను దేవునికి సమర్పించండని దేవుని కరుణాక్రియలను బట్టి మిమ్ములను బతిమాలుకొంటూ ఉన్నాను. ఈ అర్పణ సజీవమైనది, పవిత్రమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇలా చేయడం మీ యుక్తమైన సేవ.
హీబ్రూవారికి లేఖ 9:6–10:18
ఈ విధంగా ఇవన్నీ తయారైనప్పుడు యాజులు ఆరాధన గుడారంలోని ఆ ముందు భాగంలో ఎప్పుడూ ప్రవేశిస్తూ దైవిక సేవ జరిగిస్తూ ఉండేవారు. అయితే ఆ రెండో భాగంలోకి సంవత్సరానికి ఒక్క సారే ప్రముఖయాజి ఒకడే ప్రవేశించేవాడు. రక్తం లేకుండా ప్రవేశించలేదు. అతడా రక్తం తన కోసం, ప్రజలు తెలియక చేసిన పాపాల కోసం అర్పించాడు.
ఈ ప్రకారం, ఆ మొదటి ఆరాధన గుడారం నిలిచి ఉన్నప్పుడు అతి పవిత్ర స్థలంలోకి మార్గమేదో వెల్లడి కాలేదని పవిత్రాత్మ సూచిస్తున్నాడు. అదంతా ప్రస్తుత కాలానికి ఉదాహరణ లాంటిది. అర్పించిన ఆ అర్పణలూ బలులూ ఆ ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు. అవి అన్నపానాలూ నానా విధాల జల సంస్కారాలూ దేహ సంబంధమైన విధులకు సంబంధించినవీ మాత్రమే. అవి దిద్దుబాటు కాలం వరకే విధించబడేవి.
అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలను గురించి ప్రముఖ యాజిగా పాత ఆరాధన గుడారం కంటే మరింత ఘనంగా, పరిపూర్ణంగా ఉన్నదాని ద్వారా వచ్చాడు. ఇది చేతులతో చేసినది కాదు. ఈ సృష్టికి సంబంధమైనది కాదన్నమాట. ఆయన మనుషుల కోసం శాశ్వత విముక్తి సంపాదించి మేకల రక్తంతో, ఎద్దుల రక్తంతో కాక తన సొంత రక్తంతోనే ఒక్క సారే అతి పవిత్ర స్థలంలో ప్రవేశించాడు. మేకల రక్తం, ఎద్దుల రక్తం, ఆవుదూడ బూడిద అశుద్ధమైన వారిమీద చల్లడం శరీర శుద్ధి విషయంలో పవిత్రపరచేది. ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతర్వాణిని జీవం గల దేవుని సేవకోసం నిర్జీవ క్రియలనుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మద్వారా తనను తానే నిష్కళంకుడుగా దేవునికి సమర్పించుకొన్నాడు.
ఈ కారణంవల్ల ఆయన తన మరణం ద్వారా మొదటి ఒడంబడిక క్రింది అతిక్రమణల విముక్తికోసం, క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుని పిలుపు అందినవారికి శాశ్వతమైన వారసత్వాన్ని గురించిన వాగ్దానం లభించాలని ఆయన ఉద్దేశం.
మరణ శాసనం ఉంటే దానిని రాసినవాని మరణం తప్పనిసరి. అంటే, మరణ శాసనం రాసినవాడు బ్రతికి ఉన్నంతవరకు అది చెల్లనే చెల్లదు. అతడు చనిపోతేనే అది అమల్లోకి వస్తుంది. అందుచేతే ఆ మొదటి ఒడంబడికను కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించడం జరగలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞనూ ప్రజలందరికీ చెప్పిన తరువాత కోడెదూడల, మేకల రక్తం తీసుకొని నీళ్ళతో, ఎర్రని గొర్రెబొచ్చుతో, హిస్సోపు రెమ్మతో ధర్మశాస్త్ర గ్రంథంమీద, ప్రజలందరిమీదా దాన్ని చిలకరించాడు, ఇది దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఒడంబడిక రక్తమని చెప్పాడు. ఆ విధంగానే అతడు ఆరాధన గుడారముమీద, సేవా పాత్రలన్నిటిమీదా రక్తం చల్లాడు. ధర్మశాస్త్రం ప్రకారం సుమారు వస్తువులన్నీ రక్తంతో శుద్ధి అయ్యేవి. రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు.
పరలోకంలో ఉన్నవాటికి సూచనగా ఉన్నవి వాటిచేత శుద్ధి కావడం అవసరమే, గానీ ఆ పరలోక సంబంధమైనవి వాటి కంటే శ్రేష్ఠమైన యజ్ఞాలచేత శుద్ధి కావాలి. చేతులతో చేసిన పవిత్రస్థలాల్లో క్రీస్తు ప్రవేశించలేదు. ఆ స్థలాలు నిజమైనవాటికి మాదిరి మాత్రమే. ఇప్పుడు దేవుని సముఖంలో మనకోసం కనబడడానికి ఆయన పరలోకంలోనే ప్రవేశించాడు. అంతే కాదు, ప్రముఖయాజి ఏటేటా తనది కాని రక్తంతో అతి పవిత్ర స్థలంలో ప్రవేశించే ప్రకారం క్రీస్తు తరచుగా తనను తాను అర్పించుకోవాలని కాదు. అలా చేయాలంటే జగత్తుకు పునాది వేసినప్పటినుంచి ఆయన అనేక సార్లు బాధ అనుభవించవలసి వచ్చేది. గానీ ఇప్పుడు యుగాల అంతంలో ఒకే సారి తనను తాను బలిగా అర్పించుకోవడంవల్ల పాపం లేకుండా చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు.
మనుషులు ఒకే సారి చనిపోవాలనే నియమం ఉంది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా ఒకే సారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తనకోసం ఎదురు చూచేవారికి ముక్తి ప్రసాదించడానికే రెండో సారి కనిపిస్తాడు.
 
ధర్మశాస్త్రం సంభవించబోయే మంచి విషయాలకు నీడ గలది గాని ఆ విషయాల స్వరూపం దానికి లేదు. అందుచేత ధర్మశాస్త్రం, వారు ఏటేట నిత్యం అర్పించిన ఒకే రకం ఆ బలులచేత సమీపించేవారికి పరిపూర్ణత ఎన్నడూ కలిగించలేకపోయేది. ఒకవేళ కలిగించగలిగి ఉంటే ఆ బలులు ఇంకా అర్పించడం మానివేయడం జరిగి ఉండదా? ఆరాధించేవారు పూర్తిగా శుద్ధులైన తరువాత పాపాలను గురించి గద్దించే అంతర్వాణి వారికింకా ఉండి ఉండదు గదా. గానీ ఆ బలులు ఏటేటా పాపాలను గురించి జ్ఞాపకం చేస్తాయి. ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం.
అందుచేత ఆయన లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో అన్నాడు: “బలినీ యజ్ఞాన్నీ నీవు కోరలేదు. అయితే నా కోసం శరీరాన్ని తయారు చేశావు. హోమాలు, పాపాల కోసమైన అర్పణలు అంటే నీకు సంతోషం కలగలేదు. అప్పుడు నేనిలా చెప్పాను: ‘ఇదిగో నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది. ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను.’”
బలినీ యజ్ఞాన్నీ హోమాలను పాపాలకోసమైన అర్పణలను “నీవు కోరలేదు”, వాటిలో “నీకు సంతోషం కలగలేదు” అని ముందు చెప్పాడు – ధర్మశాస్త్రం ప్రకారం ఇవి అర్పించినవి. అప్పుడాయన “ఇదిగో ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను” అన్నాడు. ఇలా ఆయన ఆ రెండో దానిని స్థాపించడానికి ఆ మొదటిదానిని రద్దు చేశాడు. ఆ చిత్తంవల్ల, యేసు క్రీస్తు శరీరం బలి కావడం ద్వారా మనం ఎప్పటికీ ఒకే సారి పవిత్రమయ్యాం.
ప్రతి యాజీ రోజు రోజు నిలిచి సేవ చేస్తూ ఒకే రకం బలులు పదే పదే అర్పిస్తూ ఉన్నాడు. ఇవి పాపాలను ఎన్నడూ తీసివేయలేవు. ఈ మానవుడైతే పాపాలకోసం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే బలి ఇచ్చిన తరువాత దేవుని కుడివైపున కూర్చున్నాడు. అప్పటినుంచి ఆయన తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకే యజ్ఞంచేత ఈయన పవిత్రపరచబడుతున్నవారిని శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.
ఈ విషయంలో పవిత్రాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన “ఆ రోజులైన తరువాత నేను ఇస్రాయేల్‌ వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది ప్రభు వాక్కు – నేను నా శాసనాలు వారి హృదయాలలో ఉంచుతాను, వాటిని వారి మనసులమీద వ్రాస్తాను” అని చెప్పిన తరువాత “వారి అపరాధాలనూ ధర్మవిరుద్ధ చర్యలను అప్పటినుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాలకోసం బలి ఇంకెన్నడూ ఉండదు.
మనం వ్యభిచరించం మరియ వివాహేతర సంబంధాలను పెట్టుకోము
మత్తయి శుభవార్త 5:27-30
“వ్యభిచారం చేయకూడదని పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు గదా. కానీ మీతో నేను చెపుతున్నాను, ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపు చూస్తే, అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
“మీ కుడికన్ను మీకు పాపానికి కారణమైతే దాన్ని పీకి మీ దగ్గర నుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు. మీ కుడి చేయి మీకు పాపానికి కారణమైతే దాన్ని నరికి మీ దగ్గరనుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు.
యోహాను శుభవార్త 8:2-11
ప్రొద్దున పెందలకడ ఆయన దేవాలయంలోకి తిరిగి వచ్చాడు. ఆయన దగ్గరికి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకువచ్చారు. ఆమె వ్యభిచార క్రియలో పట్టుబడింది. వారు ఆమెను మధ్యలో నిలబెట్టి ఆయనతో ఇలా అన్నారు: “ఉపదేశకా! ఈ స్త్రీ వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది. ధర్మశాస్త్రంలో మోషే ఇలాంటి స్త్రీలను రాళ్ళు రువ్వి చంపాలని మనకాజ్ఞ ఇచ్చాడు. అయితే మీరేమంటారు?”
ఆయనమీద నేరం మోపడానికి కారణం కనుక్కోవాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. అయితే యేసు తాను ఆలకించనట్టు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు. వారు పట్టు విడువకుండా ఆయనను అడుగుతూ వచ్చారు గనుక ఆయన లేచి “మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు” అన్నాడు. అప్పుడాయన మళ్ళీ వంగి నేలమీద వ్రాశాడు.
ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయి – మొదట పెద్దలు నుండి చివరివాడి వరకు – ఒకరి తరువాత ఒకరు బయటికి వెళ్ళారు. చివరికి మధ్య నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే.
యేసు లేచి ఆ స్త్రీ తప్ప మరెవరినీ చూడకుండా “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధించలేదా?” అని అడిగాడు. ఆమె “లేదు ప్రభూ” అంది. యేసు “నేనూ నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి అపరాధం చేయకుండా ఉండు” అన్నాడు.
రోమా వారికి లేఖ 13:8-10
ఎవరికీ ఏమి బాకీ పడి ఉండకండి – ఒకరినొకరు ప్రేమతో చూడడం అనే బాకీ తప్ప. ఇతరులను ప్రేమతో చూచేవాడు తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడయ్యాడు. “వ్యభిచారం చెయ్యకూడదు”, “హత్య చెయ్యకూడదు”, “దొంగతనం చెయ్యకూడదు”, “మీరు పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు”, “పొరుగువారిది ఆశించకూడదు” – ఈ ఆజ్ఞలు, మరే ఆజ్ఞ అయినా సరే ఈ వాక్కులోనే ఇమిడి ఉన్నాయి: “మిమ్ములను ప్రేమించుకొన్నట్టు మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” ప్రేమ పొరుగువారికి హాని ఏమీ చేయదు. అందుచేతే ప్రేమ ధర్మశాస్త్రానికి నెరవేర్పు.
కొరింతువారికి లేఖ 1 5:9-11
నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసి మెలిసి ఉండకూడదని రాశాను. అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాశపరులతో, వంచకులతో, విగ్రహపూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలోనుంచి వెళ్ళిపోవలసి వస్తుంది! ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
కొరింతువారికి లేఖ 1 6:9-20
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. గాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. అయితే నన్ను ఏదీ వశపరచుకోనివ్వను. ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి, కడుపు ఆహారాలకోసం ఉంది. అయినా దేవుడు దానినీ వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం లైంగిక అవినీతికోసం కాదు గాని ప్రభువుకోసమే. ప్రభువు శరీరం కోసం. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు, తన బలప్రభావాలతో మనలను కూడా సజీవంగా లేపుతాడు.
మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా కానే కాదు. వేశ్యతో కలిసినవాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరమవుతార”ని దేవుడు అన్నాడు గదా. ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకటే ఆత్మ అయి ఉన్నాడు. లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతీది శరీరానికి బయటే ఉంది. లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు.
మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా? వెల పెట్టి మిమ్ములను కొనడం జరిగింది గనుక దేవునివై ఉన్న మీ శరీరంతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి.
గలతీయవారికి లేఖ 5:19
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం,
ఎఫెసువారికి లేఖ 5:3
కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు.
కొలస్సయివారికి లేఖ 3:5-6
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది.
తెస్సలొనీకవారికి లేఖ 1 4:1-8
మెట్టుకు, సోదరులారా, మేము ప్రభువైన యేసు అధికారంతో మీకిచ్చిన ఆదేశాలేవో మీకు తెలుసు. మీరెలా ప్రవర్తిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలో మాచేత ఉపదేశం పొందారు. ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్ములను ప్రభువైన యేసులో పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
దేవుని చిత్తం మీరు పవిత్రంగా ఉండడం, మీరు వ్యభిచారం విసర్జించడం, దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలాగా కామవికారంతో లేకుండా మీలో ప్రతి ఒక్కరూ తన పాత్రను పవిత్రంగా, ఘనంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం. ఈ విషయంలో ఎవ్వడూ ఆసరాగా తీసుకొని తన సోదరుణ్ణి వంచించకూడదు. ఇలాంటి విషయాలన్నిటిలో ప్రభువు ప్రతీకారం చేసేవాడు. మునుపు దీన్ని గురించి మేము చెప్పి సాక్షులుగా మిమ్ములను హెచ్చరించాం గదా. దేవుడు మనలను పిలిచింది కల్మషం కోసం కాదు గాని పవిత్రత కోసమే. కనుక ఈ ఉపదేశం నిరాకరించేవారు మనుషులను నిరాకరించడం లేదు గాని మనకు తన ఆత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నారు.
హీబ్రూవారికి లేఖ 13:4
వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
యూదా లేఖ 1:7
వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలూ లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా సశరీరులకు వెంటబడుతూ ఉండడంచేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండనపాలై ఉదాహరణగా ప్రదర్శించ బడుతున్నాయి.
మనం మధ్యపానం చేయము
రోమా వారికి లేఖ 13:13
పగటిలో నడిచినట్లు యోగ్యంగా నడచుకొందాం. అల్లరిచిల్లరగా తిరగకుండా, మత్తుగా త్రాగకుండా, లైంగిక అవినీతీ, పోకిరీ పనులూ, కక్షలూ, అసూయ లేకుండా ఉండిపోదాం.
కొరింతువారికి లేఖ 1 5:11
ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
కొరింతువారికి లేఖ 1 6:9-11
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
ఎఫెసువారికి లేఖ 5:18
మద్యంతో మత్తిల్లకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి.
తిమోతికి లేఖ 1 3:1-3
స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్ఠమైన పని చేయాలని కోరుతున్నాడన్న మాట నమ్మతగినదే. నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ, మర్యాదస్థుడూ, అతిథి సత్కారాలు చేసేవాడూ, ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి. అతడు సాత్వికుడై ఉండాలి గాని ఇతరులను కొట్టేవాడూ, త్రాగుబోతూ, జగడగొండీ, ధనాపేక్ష గలవాడూ పేరాశగలవాడూ అయి ఉండకూడదు.
తీతుకు లేఖ 1:7
ఎందుకంటే, సంఘ నాయకుడు దేవుని గృహ సేవ నిర్వహించేవాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు స్వార్థపరుడు, ముక్కోపి, త్రాగుబోతు, ఇతరులను కొట్టేవాడు, అక్రమ లాభం ఆశించేవాడు అయి ఉండకూడదు.
పేతురు లేఖ 1 4:3-5
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
దేవుని సంఘం ఈ విధంగా ఉంటుంది
దేవుని మందిరంలోని సభ్యులు ఈ విధంగా ఉంటారు
మత్తయి శుభవార్త 16:13-20
సీజరియ ఫిలిప్పీ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకొంటున్నారు?”
వారు “బాప్తిసమిచ్చే యోహానువు అంటారు కొందరు. మరికొందరు ఏలీయావు, మరికొందరు యిర్మీయావు లేదా, ప్రవక్తలలో ఇంకొకడవు అంటారు” అన్నారు.
“అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటూ ఉన్నారు?” అని ఆయన వారినడిగాడు.
“నీవు అభిషిక్తుడవే! సజీవుడైన దేవుని కుమారుడవే!” అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు.
యేసు అతనికిలా జవాబిచ్చాడు: “యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకంటే, ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం, మాంసం కాదు. ఇంకొకటి నీతో చెపుతాను. నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకొంటాను. పాతాళ ద్వారాలు దానిని ఎదిరించి నిలవలేవు. పరలోక రాజ్యానికి తాళం చెవులు నీకిస్తాను. నీవు భూమిమీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే. భూమిమీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే!”
అప్పుడు తాను – యేసు – అభిషిక్తుణ్ణని ఎవరికీ చెప్పకూడదని శిష్యులను ఆదేశించాడు.
అపొస్తలుల కార్యాలు 2:41-42
అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.
వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు.
రోమా వారికి లేఖ 12:4-8
ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం. ప్రత్యేకంగా ఒకరికొకరం అవయవాలై ఉన్నాం.
దేవుడు మనకు అనుగ్రహించిన కృపప్రకారం వేరువేరు కృపావరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వరం దేవునిమూలంగా పలకడం అయితే మన నమ్మకం కొలది అలా చేయాలి. అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి. ఉపదేశమైతే ఉపదేశించడంలో ఆ వరం ఉపయోగించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి. నాయకత్వం వహించేవాడు దానిని శ్రద్ధతో నిర్వహించాలి. దయ చూపేవాడు సంతోషంతో చూపాలి.
కొరింతువారికి లేఖ 1 12:12-30
శరీరం ఒకటే అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి. ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైనా అన్నీ ఒకే శరీరం. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగంటే, మనం యూదులమైనా గ్రీసు దేశస్థులమైనా సరే, బానిసలమైనా స్వతంత్రులమైనా సరే, మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తిసం పొందాం. మనకందరికి ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది.
శరీరమంటే ఒకే అవయవం కాదు గాని అనేక అవయవాలు. ఒక వేళ పాదం “నేను చేయిని కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? చెవి “నేను కన్నును కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? శరీరమంతా కన్నే అయితే వినడం ఎలా? అంతా వినడమైతే వాసన చూడడం ఎలా? కానీ దేవుడు తన ఇష్టప్రకారమే అవయవాలలో ప్రతిదానినీ శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒకటే అవయవమైతే శరీరం ఏమవుతుంది? ఇప్పుడైతే అవయవాలు అనేకం, శరీరం ఒక్కటే.
ఇలాంటప్పుడు కన్ను చేయితో “నువ్వు నాకక్కరలేదు” అనలేదు. తల పాదాలతో “మీరు నాకక్కరలేదు” అనలేదు. అసలు, శరీరంలో తక్కువ బలమున్నట్లు అనిపించుకొనే అవయవాలే ఎక్కువ అవసరం. మనం ఏ అవయవాలకు తక్కువ ఘనత ఉందనుకొంటామో వాటినే ఎక్కువగా ఘనపరుస్తాం. ఏ అవయవాలకు అందం లేదో వాటికే ఎక్కువ అందం కలిగిస్తాం. అందం ఉన్న అవయవాలకు అలా కలిగించడం అక్కర్లేదు. శరీరంలో ఏమీ అనైక్యత ఉండకూడదనీ, అవయవాలన్నీ ఒకదానికోసం ఒకటి ఒకే విధంగా శ్రద్ధ వహించాలనీ దేవుడు తక్కువదానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని రూపొందించాడు. శరీర అవయవాల్లో ఒకటి బాధపడితే దానితోకూడా తక్కిన అవయవాలన్నీ బాధపడుతాయి. ఒకదానికి గౌరవం కలిగితే తక్కిన అవయవాలన్నీ సంతోషిస్తాయి.
క్రీస్తు శరీరమంటే మీరు. మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక అవయవం. దేవుడు తన సంఘంలో నియమించినవారెవరంటే మొట్టమొదట క్రీస్తు రాయబారులు. రెండో గుంపువారు ప్రవక్తలు, మూడో గుంపువారు ఉపదేశకులు, తరువాత అద్భుతాలు చేసేవారు, తరువాత రోగులను బాగు చేసే కృపావరాలు గలవారు, ఉపకారాలు చేసేవారు, నాయకత్వం వహించగలవారు, నానా భాషలు మాట్లాడేవారు. అందరూ క్రీస్తురాయబారులు కారు గదా. అందరు ప్రవక్తలు కారు గదా. అందరూ ఉపదేశకులు కారు గదా. అందరూ అద్భుతాలు చేసేవారు కారు గదా. అందరూ రోగులను బాగు చేసే కృపా వరాలు గలవారు కారు గదా. అందరూ భాషలు మాట్లాడేవారు కారు గదా. అందరూ భాషల అర్థం చెప్పేవారు కారు గదా.
ఎఫెసువారికి లేఖ 1:22-23
అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.
ఎఫెసువారికి లేఖ 2:19-22
అందుచేత మీరు ఇకమీదట పరాయివారు కారు, బయటివారు కారు. మీరు పవిత్రులతోకూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులే! దేవుని ఇంటివారిలో ఉన్నవారే! క్రీస్తు రాయబారులూ ప్రవక్తలూ వేసిన పునాదిమీద మీరు కట్టబడి ఉన్నారు. దానికి యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఆయనలో ఈ కట్టడమంతా ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరినది. ఇది ప్రభువులో పెంపారుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ ఉంది. దేవుని ఆత్మలో దేవునికి నివాసంగా ఆయనలో మిమ్ములను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది.
ఎఫెసువారికి లేఖ 4:1-16
మీకు అందిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడు తున్నాను. పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరిపట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి. దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.
క్రీస్తు శరీరం ఒక్కటే. దేవుని ఆత్మ ఒక్కడే. మీకందిన పిలుపు గురించిన ఆశాభావం కూడా ఒక్కటే. ఒక్కడే ప్రభువు. ఒక్కటే విశ్వాసం. ఒక్కటే బాప్తిసం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ పైగా, అందరి ద్వారాను, మీలో ప్రతి వ్యక్తిలో ఉన్నాడు.
అయితే మనలో ప్రతి ఒక్కరికీ క్రీస్తు కొలిచి ఇచ్చిన వరం ప్రకారం కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన లేఖనంలో ఇలా చెపుతున్నాడు: ఆయన ఆరోహణం అయినప్పుడు ఖైదీలను ఊరేగింపులో తీసుకువెళ్ళాడు. మనుషులకు ఈవులిచ్చాడు. “ఆరోహణమయ్యాడు” అంటే మొదట ఆయన భూమి క్రింది భాగాలలోకి దిగాడని అర్థమిస్తుంది గదా. క్రిందికి దిగినవాడే సర్వాన్ని నింపేలా ఆకాశాలన్నిటికంటే ఎంతో పైకి ఎక్కిపోయాడు.
ఆయన తన రాయబారులుగా కొందరినీ, ప్రవక్తలను కొందరినీ, శుభవార్త ప్రచారకులను కొందరినీ, సంఘ కాపరులూ ఉపదేశకులూ అయిన కొందరినీ సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే, పవిత్రులు సేవ చేసేందుకు సమర్థులు కావాలనీ క్రీస్తు శరీరం పెంపొందాలనీ ఆయన ఉద్దేశం. మనమందరమూ నమ్మకంలో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది, సంపూర్ణ వృద్ధికి వచ్చేవరకూ – క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకొనేవరకూ ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. మనం ఇకనుంచి పసి పిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే, అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికీ ఎగిరిపోయేవారిలాగా మనముండకూడదు. మనుషులు కపటంచేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. గానీ ప్రేమతో సత్యం చెపుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు. ఆయననుంచి శరీరమంతా ప్రతి కీలూ అందించే దానిచేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అందులోని ప్రతి భాగమూ సరిగా దాని పని చేయడంవల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్థిల్లుతూ ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 1:18
అంతేకాదు శరీరానికి, అంటే, తన సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనే ప్రతిదానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని ఆయనే ఆది, చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవారందరిలోనూ ప్రముఖుడు.
హీబ్రూవారికి లేఖ 10:24-25
అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం. సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరచుకొంటూ, ఆ దినం దగ్గరపడడం చూచేకొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం.
పేతురు లేఖ 1 2:4-10
ఆయన సజీవమైన రాయి. ఆయనను మనుషులు వద్దన్నారు గానీ దేవుడు ఎన్నుకొన్నాడు, ప్రియంగా ఎంచాడు. ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి, యేసు క్రీస్తుద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశం.
అందుచేత ఈ లేఖనంలో కూడా ఇది ఉంది, ఇదిగో, నేను ఎన్నుకొని ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సీయోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచినవాడు ఎన్నడూ కలవరానికి గురికాబోడు.
నమ్మకముంచుతున్న మీకు ఈ “రాయి” ప్రియమైనది గానీ నమ్మకాన్ని నిరాకరించేవారి విషయమైతే ఈ మాట చెల్లుతుంది: “కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.” “ఆయన తగిలే రాయిగా, తొట్రుపాటు బండగా ఉంటాడు.” వారు వాక్కుకు అవిధేయులు గనుకనే తొట్రుపడుతున్నారు. ఇది వారికి నియమించిన విధి.
మీరైతే ఎన్నికైన వంశం, పరలోక రాజుకు చెందిన యాజుల సమూహం, పవిత్ర జనం, దేవుని సొత్తయిన ప్రజ. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, చీకటిలోనుంచి తన అద్భుతమైన వెలుగులోకి మిమ్ములను పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు మీరు చాటించాలి.
ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు. ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు కరుణ పొందనివారు. ఇప్పుడైతే కరుణ పొందినవారు.
ప్రకటన 19:5-10
అప్పుడు సింహాసనం నుంచి ఒక స్వరం ఇలా చెప్పడం వినిపిచ్చింది: “దేవుని దాసులారా! ఆయనంటే భయభక్తులున్న వారలారా!, అల్పులేమీ ఘనులేమీ మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.” అప్పుడు పెద్ద జన సమూహం శబ్దమా అన్నట్టు అనేక జల ప్రవాహాల ధ్వనిలాగా, గొప్ప ఉరుముల ధ్వనిలాగా ఇలా చెప్పడం విన్నాను: “హల్లెలూయా! అమిత శక్తిమంతుడూ ప్రభువూ అయిన దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు! ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది. ఆయన భార్య తనను సిద్ధం చేసుకొంది, గనుక ఆనందిస్తూ సంబరపడుతూ దేవుణ్ణి కీర్తించుదాం.”
ప్రకాశమానమైన, శుభ్రమైన, సున్నితమైన బట్టలు తొడుక్కోవడానికి ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆ సున్నితమైన బట్టలు పవిత్రుల న్యాయ క్రియలు.
ఆ దేవదూత “ఇలా రాయి: గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలుపు అందినవారు ధన్యజీవులు” అని నాతో అన్నాడు. “ఇవి దేవుని సత్య వాక్కులు” అని కూడా నాతో అన్నాడు.
అందుకు నేను అతనికి మ్రొక్కడానికి అతని పాదాలముందు పడ్డాను గాని అతడు “వద్దు సుమా! దేవునికే మ్రొక్కు, నేను నీ సహ దాసుణ్ణి, యేసును గురించిన సాక్ష్యం చెపుతున్న నీ సోదరుల తోటి దాసుణ్ణి. ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం దేవుని మూలమైన సందేశ సారం” అని నాతో చెప్పాడు.
మనం ఎన్నుకున్న సంఘ సభ్యులు ఈ విధంగా ఉంటారు
అపొస్తలుల కార్యాలు 6:1-6
ఆ రోజులలో శిష్యుల సంఖ్య వృద్ధి అవుతూ ఉన్నప్పుడు గ్రీక్ భాష మాట్లాడే యూదులు హీబ్రూ మాట్లాడే యూదులమీద సణుక్కొన్నారు. ఎందుకంటే రోజూ భోజనాదులు పంచిపెట్టేటప్పుడు తమలో ఉన్న విధవరాండ్రను నిర్లక్ష్యం చేయడం జరిగింది. కనుక ఆ పన్నెండుమంది క్రీస్తు రాయబారులు శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నారు: “మేము బల్లలదగ్గర సేవ చేసేందుకు దేవుని వాక్కు ఉపదేశించడం విడిచిపెట్టడం సరి కాదు. అందుచేత, సోదరులారా, మంచి పేరుగల ఏడుగురిని మీలోనుంచి ఎన్నుకోండి. వారు పవిత్రాత్మతో, జ్ఞానంతో నిండినవారై ఉండాలి. మేము వారిని ఆ పనిమీద నియమిస్తాం. మేమైతే ప్రార్థన, వాక్కు విషయమైన సేవ ఎడతెగకుండా చేస్తూ ఉంటాం.”
ఆ సమూహమంతటికీ ఆ మాట నచ్చింది. వారు వీరిని ఎన్నుకొన్నారు: స్తెఫను (ఇతడు విశ్వాసంతో, పవిత్రాత్మతో నిండినవాడు), ఫిలిప్పు, ప్రొకొరస్, నీకానోర్, తీమోన్, పర్‌మెనాస్, నీకొలాస్ (ఇతడు అంతియొకయ పట్టణం నుంచి వచ్చినవాడు, మునుపు యూద మతంలో ప్రవేశించినవాడు). వారిని క్రీస్తురాయబారుల ముందు నిలబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారిమీద చేతులు ఉంచారు.
అపొస్తలుల కార్యాలు 14:23
వారు ప్రతి సంఘంలో వారికోసం పెద్దలను నియమించారు, ఉపవాసముండి ప్రార్థన చేస్తూ వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
తిమోతికి లేఖ 1 3:1-13
స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్ఠమైన పని చేయాలని కోరుతున్నాడన్న మాట నమ్మతగినదే. నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ, మర్యాదస్థుడూ, అతిథి సత్కారాలు చేసేవాడూ, ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి. అతడు సాత్వికుడై ఉండాలి గాని ఇతరులను కొట్టేవాడూ, త్రాగుబోతూ, జగడగొండీ, ధనాపేక్ష గలవాడూ పేరాశగలవాడూ అయి ఉండకూడదు. తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకొనేవాడై ఉండాలి. ఎవడైనా సరే తన కుటుంబానికి నాయకత్వం నిర్వహించుకోవడమెలాగో తెలియనివాడైతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూచుకోగలడు? అతడు కొత్తగా చేరినవాడుగా ఉండకూడదు. లేకపోతే అతడు విర్రవీగి అపనింద పిశాచం తీర్పుకు గురి అవుతాడేమో. అంతే కాక, అతడు నిందపాలై అపనింద పిశాచం ఉరిలో చిక్కుపడకుండా బయట ఉన్న వారిమధ్య మంచి పేరు పొందినవాడై ఉండాలి.
అలాగే పరిచారకులు కూడా గౌరవానికి తగినవారూ నిష్కపటులూ అయి ఉండాలి. త్రాగుబోతులూ, అక్రమలాభం ఆశించేవారూ అయి ఉండకూడదు. వారు స్వచ్ఛమైన అంతర్వాణితో విశ్వాస సంబంధమైన రహస్య సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అంతే కాదు, మొదట వారిని పరీక్షించాలి. అప్పుడు వారు నిందకు చోటివ్వనివారై ఉంటే పరిచారకులుగా సేవ చేయవచ్చు.
అలాగే వారి భార్యలు కూడా గౌరవానికి తగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ, కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాలలో నమ్మకమైనవారూ అయి ఉండాలి.
పరిచారకులు ఏకపత్నీ పురుషులై ఉండాలి. వారు తమ సంతానానికీ కుటుంబానికీ నాయకత్వం సరిగా నిర్వహించు కొనేవారై ఉండాలి. పరిచారకులుగా సేవ బాగా చేసేవారికి మంచి గౌరవం, క్రీస్తు యేసుమీది విశ్వాసంలో గొప్ప ధైర్యం లభిస్తాయి.
తీతుకు లేఖ 1:5-9
నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చిన కారణమేమంటే, నేను నీకు ఆదేశించినట్లు నీవు లోపాలను చక్కపెట్టి, ప్రతి పట్టణంలో క్రీస్తు సంఘంలో పెద్దలను నియమించాలని. సంఘం పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతను ఏకపత్నీ పురుషుడై ఉండాలి. అతని సంతానం విశ్వాసులై దుబారా చేసేవారని తిరగబడేవారనే నిందకు గురి కానివారై ఉండాలి. ఎందుకంటే, సంఘ నాయకుడు దేవుని గృహ సేవ నిర్వహించేవాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు స్వార్థపరుడు, ముక్కోపి, త్రాగుబోతు, ఇతరులను కొట్టేవాడు, అక్రమ లాభం ఆశించేవాడు అయి ఉండకూడదు. అతిథి మర్యాదలు చేసేవాడు, మంచిని ప్రేమభావంతో చూచేవాడు, మనసు అదుపులో ఉంచుకొనే వాడు, న్యాయవంతుడు, పవిత్రుడు, తన ఆశలు అదుపులో ఉంచుకొనేవాడై ఉండాలి. అతడు క్షేమకరమైన సిద్ధాంతాలతో ప్రోత్సాహ పరచడానికీ ఎదురాడేవారిని ఒప్పించడానికీ సమర్థుడయ్యేలా తనకు వచ్చిన ఉపదేశం ప్రకారం నమ్మకమైన వాక్కును గట్టిగా చేపట్టి ఉండేవాడై ఉండాలి.
సంఘ పెద్దలు ఈ విధంగా జీవించాలి
మత్తయి శుభవార్త 28:18-20
యేసు దగ్గరగా వచ్చి వారితో ఇలా అన్నాడు: “పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.
లూకా శుభవార్త 22:24-27
తమలో ఎవడు ప్రముఖుడుగా ఎంచబడాలో అని కూడా వారి మధ్య జగడం పుట్టింది. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర ప్రజల రాజులు వారిమీద ప్రభుత్వం చేస్తారు, వారిమీద అధికారం చెలాయించే వారిని ‘ఉపకారులు’ అంటారు. మీరు మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు అందరిలో చిన్నవానిలాగా ఉండాలి, నాయకుడు సేవకునిలాగా ఉండాలి. ఎవరు ప్రముఖుడు – భోజనానికి కూర్చునేవాడా? ఊడిగం చేసేవాడా? భోజనానికి కూర్చునేవాడే గదా? అయినా మీ మధ్య నేను ఊడిగం చేసేవానిలాగా ఉన్నాను.
అపొస్తలుల కార్యాలు 20:17-35
మిలేతస్ నుంచి అతడు ఎఫెసుకు కబురంపి సంఘం పెద్దలను పిలిపించాడు. వారు తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు:
“నేను ఆసియాలో అడుగు పెట్టిన ఆ మొదటి రోజునుంచి ఇప్పటిదాకా మీమధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు. యూదుల కుట్రలవల్ల నాకు విషమ పరీక్షలు కలిగినా, కన్నీళ్ళు విడుస్తూ పూర్ణ వినయభావంతో ప్రభువుకు సేవ చేశాను. మీకు మేలు కలిగించేదేదీ చెప్పకుండా వెనక్కు తీయలేదు గాని దాన్ని ప్రకటిస్తూ బహిరంగంగా, ఇంటింటా మీకు ఉపదేశిస్తూ వచ్చాను. దేవునిపట్ల పశ్చాత్తాపపడి మన ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులకూ గ్రీసు దేశస్థులకూ విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ వచ్చాను. ఇదంతా మీకు తెలుసు.
“ఇదిగో వినండి, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంవల్ల జెరుసలం వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఒక సంగతి మాత్రమే తెలుసు. సంకెళ్ళూ బాధలూ నాకోసం కాచుకొని ఉన్నాయని పవిత్రాత్మ ప్రతి పట్టణంలో విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ ఉన్నాడు. అయితే ఈ విషయాల్లో ఏదీ నన్ను కదిలించదు. నా జీవితం నాకు ప్రియమని ఎంచుకోవడం లేదు. నా లక్ష్యాన్ని ఆనందంతో పూర్తిగా నెరవేర్చాలనీ, యేసుప్రభువు నాకిచ్చిన సేవను, అంటే నేను సాక్షిగా దేవుని కృప శుభవార్త తెలియజేయడం అనే సేవను తుదముట్టించాలనీ ఉన్నాను.
“ఇదిగో వినండి, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ నేను మీ మధ్య సంచరిస్తూ వచ్చాను గాని ఇకమీదట మీలో ఎవరూ నా ముఖం చూడరని నాకు తెలుసు. కనుక నేను అందరి రక్తం విషయంలో నిర్దోషినని ఈవేళ మీతో సాక్షిగా చెపుతున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పమంతా మీకు తెలియజేయడంలో నేనేమీ వెనక్కు తీయలేదు.
“దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకొన్న ఆయన సంఘానికి మీరు కాపరులుగా ఉండాలని పవిత్రాత్మ మిమ్మల్ని నాయకులుగా చేశాడు. అందువల్ల మిమ్మల్ని గురించీ మంద అంతటిని గురించీ జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళలాంటివారు మీమధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు. వారు మంద మీద ఏమీ జాలి చూపరు. అంతేగాక, శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని మీలోనే మనుషులు తలెత్తి కుటిలమైన మాటలు చెపుతారు. కాబట్టి మెళకువగా ఉండండి! నేను మూడేళ్ళు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ప్రతి ఒక్కరినీ హెచ్చరించడం మానలేదని జ్ఞాపకం ఉంచుకోండి.
“ఇప్పుడు సోదరులారా, దేవునికీ ఆయన కృపవాక్కుకూ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీకు క్షేమాభివృద్ధి కలిగించి పవిత్రులైన వారందరితో కూడా వారసత్వం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు. నేను ఎవరి వెండి గానీ బంగారం గానీ వస్త్రాలు గానీ ఆశించలేదు. అసలు, నా అక్కరలు, నాతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి ఈ చేతులు పని చేశాయి అని మీకే తెలుసు. ఇలా శ్రమిస్తూ మీరూ కష్టపడి బలహీనులకు సహాయం చేయాలని నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ‘తీసుకోవడంకంటే ఇవ్వడమే ధన్యం’ అని యేసుప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకముంచుకోండి.”
తెస్సలొనీకవారికి లేఖ 1 2:1-12
సోదరులారా, మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. అంతకు ముందు మేము ఫిలిప్పీలో బాధలు అనుభవించి అవమానం పాలయ్యాం. ఇది కూడా మీకు తెలుసు. అయినా తీవ్రమైన పోరాటానికి గురై మీకు దేవుని శుభవార్త ప్రకటించడానికి మన దేవునిలో ధైర్యం తెచ్చుకొన్నాం.
ఎందుకంటే, మేము ఇచ్చే ప్రోత్సాహం భ్రమనుంచి గానీ కల్మషంనుంచి గానీ జిత్తులమారి మనసునుంచి గానీ కలిగింది కాదు. దేవుడు మమ్ములను తగినవారుగా ఎంచి శుభవార్త మాకు అప్పగించాడు. ఇలాంటివారమై మనుషులను సంతోషపెట్టడానికి కాదు గాని మన హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టడానికే మాట్లాడుతాం. మేము ఇచ్చకం మాటలు ఎన్నడూ పలకలేదని మీకు తెలుసు. అత్యాశను కప్పివేయడానికి వేషాలు వేసుకోలేదు కూడా. దేవుడే ఇందుకు సాక్షి. అంతే కాదు. క్రీస్తు రాయబారులై ఉన్న మాకు అధికారం చేసే హక్కు ఉన్నా, మనుషులవల్ల – మీవల్ల గానీ ఇంకెవరివల్లా గానీ – ఘనతకోసం మేము చూడలేదు. కానీ పాలిచ్చే తల్లి తన పసి పిల్లలను పోషించినట్టే మేము మీ మధ్య మృదువుగా వ్యవహరించాం. మీరంటే ఇలాంటి వాత్సల్యం ఉంది గనుక మీకు దేవుని శుభవార్త మాత్రమే కాదు – మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరంటే మాకు అంత ప్రీతి కలిగింది.
సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకమే గదా. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని మేము రాత్రింబగళ్ళు పాటుపడి జీవనం చేస్తూ, మీకు దేవుని శుభవార్త ప్రకటించాం. విశ్వాసులైన మీపట్ల మా ప్రవర్తన ఎంత పవిత్రంగా, నిజాయితీగా అనింద్యంగా ఉందో దానికి మీరు సాక్షులు, దేవుడూ సాక్షి. తన రాజ్యంలోకీ మహిమలోకీ మిమ్ములను పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని తండ్రి తన సొంత పిల్లలపట్ల వ్యవహరించినట్టు మీలో ప్రతి ఒకరినీ ప్రోత్సహిస్తూ, ఓదారుస్తూ, హెచ్చరిస్తూ వచ్చాం.
తిమోతికి లేఖ 1 4:1-16
దేవుని ఆత్మ తేటతెల్లంగా చెప్పేదేమంటే, తరువాతి కాలాలలో కొందరు విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మలను, దయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు. వారు కపటులై అబద్ధాలు చెపుతారు. వారికి వాతవేయబడ్డ అంతర్వాణి ఉంది. వారు పెళ్ళి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మినవారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు. దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.
ఈ సంగతులు సోదరులకు వివరించి చెపితే, నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సిద్ధాంతాలవల్ల, సవ్యమైన ఉపదేశాలవల్ల పెంపారుతూ, యేసు క్రీస్తుకు మంచి సేవకుడివై ఉంటావు. ముసలమ్మల ముచ్చట్లూ లౌకికమైన కల్పిత కథలూ విసర్జించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. శరీర శిక్షణలో కొంచెం ప్రయోజనం ఉంది. దైవభక్తి అయితే అన్ని విషయాలలోనూ ప్రయోజనకరమే. అందులో ఇప్పటి జీవితం గురించీ వచ్చే జీవితం గురించీ వాగ్దానం ఉంది. ఈ మాట విశ్వసనీయం, పూర్తిగా అంగీకరించదగినది. ఈ కారణంచేత ప్రయాసపడుతూ తిరస్కారానికి గురై ఉన్నాం. ఎందుకంటే మనం జీవం గల దేవునిమీదే మన నమ్మకం ఉంచాం. ఆయన మనుషులందరికీ, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు.
ఈ సంగతులు ఆదేశించి నేర్పు. నీ యువ ప్రాయాన్ని బట్టి ఎవరూ నిన్ను చిన్నచూపు చూడనియ్యకు, గాని విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావంలో, ఆత్మ విషయాలలో నమ్మకంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు. నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు. క్రీస్తుసంఘం పెద్దలు నీమీద చేతులుంచినప్పుడు దేవుని మూలంగా పలికిన మాట ద్వారా నీలో ఉన్న ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆ విషయాలమీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది. నీ గురించీ ఉపదేశాల గురించీ పట్టుదలతో జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే నిన్ను రక్షించుకొంటావు. నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు.
తిమోతికి లేఖ 2 2:1-26
నా కుమారుడా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడై ఉండు. చాలామంది సాక్షుల సముఖంలో నావల్ల నీవు విన్న సంగతులను ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పు.
క్రీస్తు యేసు మంచి సైనికునిలాగా కడగండ్లు అనుభవించు. యుద్ధానికి వెళ్ళేవాడెవడూ మామూలు జీవిత విషయాలలో చిక్కుకోడు. తనను సైనికుడుగా నమోదు చేసినవాణ్ణి సంతోషపెట్టాలని అతడి ఆశ. మరొకటి – ఎవడైనా సరే ఆటల పోటీలో పాల్గొంటూ ఉంటే అతడు నియమాల ప్రకారం చేయకపోతే అతడికి కిరీటం లభించదు. ప్రయాసపడే రైతుకు మొదటి పంటలో పాలు రావాలి. నేను చెప్పేది ఆలోచించుకో, ప్రభువు అన్ని విషయాలలో నీకు గ్రహింపు దయ చేస్తాడు గాక.
నా శుభవార్త ప్రకారంగా, దావీదు సంతానమైన యేసు క్రీస్తు చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేచాడని జ్ఞాపకం ఉంచుకో. శుభవార్తకోసం నేను నేరస్థుడిలాగా సంకెళ్లపాలై కష్టాలు అనుభవిస్తూ వున్నాను గానీ దేవుని వాక్కు సంకెళ్ళపాలు కాలేదు. అందువల్ల దేవునిచేత ఎన్నికైనవారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి, రక్షణ, దానితోపాటు శాశ్వత మహిమ కలగాలని వారికోసం అన్నీ ఓర్చుకొంటున్నాను.
ఈ మాట నమ్మతగినది: మనం ఆయనతో చనిపోయినవారమైతే ఆయనతో జీవిస్తాం కూడా. సహించేవారమైతే ఆయనతో పరిపాలన చేస్తాం కూడా. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనంటాడు. మనం అపనమ్మకస్థులమైనా ఆయన నమ్మకమైనవాడుగానే ఉండిపోతాడు. తనను తాను ఎరగననలేడు.
ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. ప్రభు సమక్షంలో వారిని ప్రోత్సహిస్తూ ఏవేవో మాటల గురించి జగడమాడకూడదని వారికి చెప్పు. అలాంటి జగడం వ్యర్థమైనది, వినేవారిని చెడగొట్టేది. నీవైతే యోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్కు సరిగా ప్రయోగించేవాడుగా నిన్ను నీవు దేవునికి కనబరచుకోవడానికి ఆసక్తితో కృషి చేయి.
అపవిత్రమైన వట్టి వదరుబోతుతనం విసర్జించు. అలా మాట్లాడేవారు అంతకంతకు భక్తిహీనులవుతారు. వారి మాటలు కుళ్ళు చేసే కొరుకు పుండులాగా ప్రాకిపోతాయి. అలాంటివారిలో హుమెనైయస్, ఫిలేతస్ ఉన్నారు. వారు సత్యం నుంచి వైదొలగి, చనిపోయినవారు లేచే కాలం ఇంతకుముందే గతించిందని చెపుతూ కొందరి విశ్వాసాన్ని తారుమారు చేస్తున్నారు. అయినా, దేవుడు వేసిన గట్టి పునాది నిలిచే ఉంది. దానిమీద ముద్రగా ఇలా రాసి ఉంది: “తనవారు ప్రభువుకు తెలుసు”; “క్రీస్తు పేరు ఒప్పుకునే ప్రతి ఒక్కరూ దుర్మార్గంనుంచి వైదొలగాలి”.
గొప్ప ఇంటిలో బంగారు, వెండి పాత్రలు మాత్రమే కాకుండా, చెక్కతో, మట్టితో చేసినవి కూడా ఉన్నాయి. కొన్ని ఘనతకోసం, మరి కొన్ని ఘనహీనతకోసం ఉన్నాయి. ఎవడైనా ఈ రెండో గుంపుకు వేరై తనను శుద్ధి చేసుకొంటే, అతడు ఘనతకోసమైన పాత్ర అయి ఉంటాడు, పవిత్రమై, యజమానికి ఉపయోగకరమైనవాడై ప్రతి మంచి పనికీ తయారవుతాడు.
యువకులకు కలిగే చెడు కోరికలనుంచి పారిపో, శుద్ధ హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కూడా నీతిన్యాయాలను, నమ్మకాన్ని, ప్రేమను, శాంతిని ఆసక్తితో అనుసరించు. తెలివితక్కువ మూర్ఖ వివాదాలనుంచి తప్పుకో. అవి జగడాలను పుట్టిస్తాయని నీకు తెలుసు. ప్రభు సేవకుడు జగడమాడకూడదు గాని అందరిమీద దయ చూపాలి. ఉపదేశించగలవాడై ఉండాలి. అపకారాన్ని సహించాలి. ఎదిరించేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. సత్యం తెలుసుకోవడానికి దారితీసే పశ్చాత్తాపం వారికి దేవుడు అనుగ్రహిస్తాడేమో. తన ఇష్టప్రకారం చేయడానికి వారిని చెరపట్టిన అపనింద పిశాచం వలలో నుంచి వారు బుద్ధి తెచ్చుకొని తప్పించుకొంటారేమో.
తిమోతికి లేఖ 2 3:10-17
నీవైతే నా ఉపదేశం, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, ఓర్పు, ప్రేమభావం, సహనశీలత, అంతియొకయలో ఈకొనియలో లుస్త్రలో నాకు కలిగిన హింసలూ కడగండ్లూ – ఎలాంటి హింసలు నేను అనుభవించానో – ఇదంతా తెలుసుకొని శ్రద్ధతో అనుసరించావు. అన్ని హింసలలో నుంచి ప్రభువు నన్ను విడిపించాడు. వాస్తవంగా, క్రీస్తు యేసులో దైవభక్తితో బ్రతకడానికి ఇష్టమున్నవారంతా హింసకు గురి అవుతారు. దుర్మార్గులూ వంచకులూ అయితే మోసపరుస్తూ, మోసపోతూ అంతకంతకూ చెడిపోతూ ఉంటారు.
నీవైతే నేర్చుకొని రూఢిగా నమ్ముకొన్నవి ఎవరివల్ల నేర్చుకొన్నావో నీకు తెలుసు. వాటిలో నిలకడగా ఉండాలి. చిన్నప్పటినుంచీ పవిత్ర లేఖనాలు ఎరిగినవాడివని కూడా నీకు తెలుసు. అవి క్రీస్తు యేసులో ఉంచిన నమ్మకం ద్వారా మోక్షం కోసమైన జ్ఞానం నీకు కలిగించగలవి.
బైబిలు లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగినవి, దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి. ఎలాగంటే ఉపదేశించడానికీ మందలించడానికీ తప్పులు సరిదిద్దడానికీ నీతిన్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమైనవి.
తిమోతికి లేఖ 2 4:1-5
కాబట్టి దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షం, రాజ్యం సమయంలో సజీవులకూ చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నీకీ ఆదేశం ఇస్తున్నాను. దేవుని వాక్కు ప్రకటించు, యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో ఒప్పించు, మందలించు, ప్రోత్సహించు. ఎందుకంటే, ప్రజలు క్షేమకరమైన సిద్ధాంతాలను సహించని సమయం వస్తుంది. వారు దురద చెవులు కలిగి తమ చెడ్డ కోరికల ప్రకారం గురువులను తమకోసం పోగు చేసుకొంటారు. వాళ్ళు తమ చెవులను సత్యం నుంచి త్రిప్పుకొని కల్పిత కథలవైపు తొలగిపోతారు. నీవైతే అన్నిటిలోనూ మందమతి కాకుండా ఉండు. కష్టాలు ఓర్చుకో. శుభవార్త ప్రచారకుడి పని చెయ్యి. నీ సేవను నెరవేర్చు.
తీతుకు లేఖ 2:7-8
మనలను ఎదిరించేవారు నీ గురించి చెడ్డ మాట ఏదీ చెప్పలేక సిగ్గుపడాలి, గనుక అన్ని విషయాలలో మంచినే చేయడంలో నీవు ఆదర్శంగా ఉండు. ఉపదేశంలో న్యాయ బుద్ధినీ గంబీరతనూ చిత్త శుద్ధినీ కనుపరచుకో, నిందించరాని సవ్యమైన మాటలు వినియోగించు.
పేతురు లేఖ 1 5:1-4
మీలో సంఘం పెద్దలకు సాటి పెద్దనూ క్రీస్తు బాధలను చూచినవాణ్ణీ వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణీ అయిన నేను ఈ ప్రోత్సాహం ఇస్తున్నాను: మీదగ్గర ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకంగానే, దుర్లాభం కావాలని కాదు గాని ఆసక్తితో నాయకులుగా సేవ చేయండి. మీ బాధ్యత క్రింద ఉంచబడ్డవారిమీద ప్రభువులాగా ఉండకుండా మందకు ఆదర్శంగా ఉండండి. ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
సంఘ పెద్దలను మనం గౌరవిస్తాము
కొరింతువారికి లేఖ 1 9:14
అలాగే శుభవార్త ప్రకటించేవారికి శుభవార్తవల్లే జీవనోపాధి కలగాలని ప్రభువు విధించాడు.
గలతీయవారికి లేఖ 6:6
వాక్యోపదేశం పొందిన వ్యక్తి తన మంచి వస్తువులన్నిట్లో ఉపదేశమిచ్చేవానికి కొంత ఇవ్వాలి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:12-13
సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ, ప్రభువులో మీమీద నాయకత్వం వహించి మీకు బుద్ధి చెపుతూ ఉన్నవారిని గుర్తించి వారి పనిని బట్టి వారిని ప్రేమభావంతో గొప్పగా గౌరవించండని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.
తిమోతికి లేఖ 1 5:17-22
క్రీస్తు సంఘం నాయకత్వం బాగా వహించే పెద్దలు విశేషంగా వాక్కు ప్రకటించడంలో, నేర్పడంలో ప్రయాసపడే పెద్దలు రెట్టింపు గౌరవానికి యోగ్యులని భావించాలి. లేఖనం ఇలా అంటుంది గదా: “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు”. “పనివాడు తన జీతానికి యోగ్యుడు.” ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప సంఘం పెద్దమీద నిందారోపణ అంగీకరించకు. అపరాధం చేయడానికి ఇతరులు భయపడేలా అపరాధం చేస్తున్నవారిని అందరి ఎదుటా మందలించు.
పక్షపాతం గానీ అభిమాన ప్రదర్శన గానీ ఏమీ లేకుండా ఈ నియమాలను పాటించు, దేవుని ఎదుట, ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఎవరిమీదా చేతులుంచడానికి త్వరపడకు, ఇతరుల అపరాధాలలో పాలిభాగస్తుడివి కాకు, ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా నిన్ను నీవే కాపాడుకో.
హీబ్రూవారికి లేఖ 13:7
మీకు దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని మనసులో ఉంచుకోండి. వారి జీవిత విధాన ఫలితం తలపోస్తూ వారి విశ్వాస మార్గాన్ని అనుసరించండి.
హీబ్రూవారికి లేఖ 13:17
మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి. ఎందుకంటే, వారు లెక్క అప్పచెప్పవలసినవారుగా మీ ఆత్మలకు కావలి కాస్తున్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారు ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాట వినండి.
కుటుంబం ఈ విధంగా ఉంటుంది
భర్తలు, భార్యలు ఈ విధంగా ఉండాలి
మత్తయి శుభవార్త 19:4-6
అందుకాయన జవాబిస్తూ “మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు, ‘అందుకే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు’ ఇది మీరు చదవలేదా? కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒక్కటే శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు ఏకంగా చేసినవారిని మనిషి వేరు చేయకూడదు” అని వారితో అన్నాడు.
కొరింతువారికి లేఖ 1 7:1-16
మీరు నాకు రాసినవాటి విషయం – స్త్రీని ముట్టకపోవడం పురుషుడికి మేలు. అయినా జారత్వం ఉన్న సంగతినిబట్టి ప్రతి పురుషుడు సొంత భార్య, ప్రతి స్త్రీ సొంత భర్త కలిగి ఉండవచ్చు. భర్త తన భార్యపట్ల వివాహధర్మం నెరవేరుస్తూ ఉండాలి, తన భర్తపట్ల భార్యకూడా అలాగే చేయాలి. భార్యకు తన శరీరంమీద అధికారం లేదు – అది భర్తకే ఉంది. అలాగే భర్తకు తన శరీరం మీద అధికారం లేదు – అది భార్యకే ఉంది. మీకు ఉపవాసం, ప్రార్థన కోసం సావకాశం కలిగించుకోవడానికి కొంత కాలంవరకు ఇద్దరూ సమ్మతిస్తేనే తప్ప ఒకరికి ఒకరు లొంగిపోకుండా ఉండకూడదు. ఆ తరువాత, మీ కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం బట్టి సైతాను మిమ్ములను శోధించ కుండేలా మళ్ళీ కలుసుకోండి.
నేనిది ఆజ్ఞగా చెప్పడం లేదు, గాని అనుమతిగా మాత్రమే. అయినా మనుషులంతా నాలాగే ఉండాలని నా కోరిక. అయితే ప్రతి ఒక్కరికి దేవుని నుంచి సొంత కృపావరం ఉంది. ఇది ఒకరికి ఒక విధంగా మరొకరికి ఇంకో విధంగా ఉంటుంది. కానీ నాలాగే ఉండిపోతే మంచిదని పెళ్ళికాని వారితో, విధవరాండ్రతో అంటున్నాను. అయినా కోరికలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే పెళ్ళి చేసుకోవచ్చు. కామాగ్నితో మాడిపోతూ ఉండడం కంటే పెళ్ళి చేసుకోవడం మంచిది.
పెళ్ళైనవారికి నేనిచ్చే ఆదేశమిదే – అసలు, ఇచ్చేది నేను కాదు, ప్రభువే: “భార్య భర్తకు వేరైపోకూడదు.” ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి. లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు.
తక్కినవారితో ప్రభువు కాదు, నేనే ఇలా చెపుతున్నాను: ఒక సోదరునికి ప్రభువును నమ్మని భార్య ఉందనుకోండి. ఆమెకు అతనితో కాపురం చేయడం ఇష్టమైతే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఒకామెకు ప్రభువును నమ్మని భర్త ఉన్నాడనుకోండి. అతనికి ఆమెతో కాపుర ముండడం ఇష్టమైతే ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నమ్మని భర్త నమ్మిన భార్య కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినవాడు నమ్మని భార్య నమ్మిన భర్త కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినది. లేకపోతే మీ పిల్లలు అశుద్ధులుగా ఉండి ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు.
ఒకవేళ నమ్మని వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. అలాంటి పరిస్థితిలో సోదరునికి గానీ సోదరికి గానీ బంధనం లేదు. దేవుడు మనలను శాంతి అనుభవించడానికి పిలిచాడు. పెళ్ళైన స్త్రీ! నీద్వారా నీ భర్తకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు? పెళ్ళైన పురుషుడా! నీ ద్వారా నీ భార్యకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు?
ఎఫెసువారికి లేఖ 5:21-33
దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి.
పెళ్ళి అయిన స్త్రీలారా, ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరస్సు, శరీరానికి రక్షకుడు. అలాగే భర్త భార్యకు శిరస్సు. గనుక తన సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో లోబడివుండాలి.
పెండ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. దేవుని వాక్కు అనే నీళ్ళతో స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచేందుకు క్రీస్తు దానికోసం తనను అర్పించుకొన్నాడు. సంఘం పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలనీ మచ్చ, మడత, అలాంటి మరేదీ లేకుండా దివ్యమైనదిగా దానిని తనముందు నిలబెట్టుకోవాలనీ ఆయన అలా చేశాడు. అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలనులాగే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకొంటున్నాడన్నమాట. సొంత శరీరాన్ని ద్వేషించుకొనేవాడెవడూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొంటాడు. ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకొంటాడు. ఎందుకంటే మనం ఆయన మాంసం, ఎముకలలో ఆయన శరీరంలోని భాగాలం.
“అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరమవుతారు.” ఈ రహస్య సత్యం గొప్పది. అయితే నేను క్రీస్తునూ సంఘాన్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అయినా మీలో ప్రతివాడూ తనలాగే తన భార్యను ప్రేమించాలి. భార్య భర్తను గౌరవించాలి.
కొలస్సయివారికి లేఖ 3:18-19
పెళ్ళి అయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. పెళ్ళి అయిన పురుషులారా, మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. వారికి కష్టం కలిగించకండి.
తీతుకు లేఖ 2:3-5
అలాగే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలు కాకుండా, ద్రాక్షమద్యం వశంలో ఉండకుండా, నడవడిలో భయభక్తులు గలవారై మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. వారు యువ స్త్రీలకు బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుని వాక్కు దూషణకు గురి కాకుండా వారు తమ భర్తలనూ సంతానాన్నీ ప్రేమతో చూడాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, పవిత్ర శీలవతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయ గలవారై ఉండాలి. తమ భర్తలకు లోబడి ఉండాలి.
హీబ్రూవారికి లేఖ 13:4
వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
పేతురు లేఖ 1 3:1-7
అలాగే పెండ్లయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనమూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు. భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు. జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం – మీది ఇలాంటి బయటి అలంకారం కాకూడదు. దానికి బదులు మీ లోపలి స్వభావం – శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఇలాగే గతంలో దేవునిమీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకొనేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు. ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలయింది. మీరు ఎలాంటి బీతిభయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు.
పెండ్లయిన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురముండండి. కృపవల్ల కలిగిన జీవంలో వారు మీతోకూడా పాలివారనీ మీకంటే బలహీనమైన పాత్రలనీ వారిని గౌరవించండి.
పిల్లలు ఈ విధంగా ఉండాలి
మత్తయి శుభవార్త 15:3-6
అందుకాయన వారికిలా బదులు చెప్పాడు: “మీరు మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను మీరుతున్నారెందుకు? దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణశిక్ష విధించి తీరాలి. మీరైతే ఇలా అంటారు: ఎవడైనా తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా దేవునికి అర్పించబడింది’ అని చెపితే అలాంటివాడు ఆ విషయంలో తండ్రిని గానీ తల్లిని గానీ గౌరవించనక్కరలేదన్న మాట. ఈ విధంగా మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తున్నారు.
లూకా శుభవార్త 2:51
అప్పుడు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతు వెళ్ళాడు. అక్కడ వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొంది.
ఎఫెసువారికి లేఖ 6:1-3
పిల్లలారా! ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది న్యాయం. “మీకు క్షేమం కలిగేలా, భూమిమీద ఎక్కువ కాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి” – వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే.
కొలస్సయివారికి లేఖ 3:20
పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే ఇది ప్రభువుకు సంతోషకరం.
తిమోతికి లేఖ 1 5:4
అయితే ఒక విధవరాలికి పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఉంటే, వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది.
తిమోతికి లేఖ 1 5:8
ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేనివాడికంటే చెడ్డవాడు.
హీబ్రూవారికి లేఖ 12:7-11
మీరు శిక్ష ఓర్చుకొంటూ ఉన్నారా, దేవుడు కొడుకులనుగా మిమ్మును చూస్తున్నాడన్న మాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు? కొడుకులందరికీ శిక్ష వచ్చేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు. అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు, వారిని గౌరవించాం. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా. వారేమో తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు.
ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది గాని సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందినవారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది.
తల్లిదండ్రులు ఈ విధంగా ఉండాలి
ఎఫెసువారికి లేఖ 6:4
తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు గురించిన ఉపదేశంతో, క్రమశిక్షణతో వారిని పెంచండి.
కొలస్సయివారికి లేఖ 3:21
తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహ పడకుండా వారిని చికాకుపరచకండి.
తిమోతికి లేఖ 1 3:4-5
తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకొనేవాడై ఉండాలి. ఎవడైనా సరే తన కుటుంబానికి నాయకత్వం నిర్వహించుకోవడమెలాగో తెలియనివాడైతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూచుకోగలడు?
విధవరాండ్రు ఈ విధంగా ఉండాలి
అపొస్తలుల కార్యాలు 6:1
ఆ రోజులలో శిష్యుల సంఖ్య వృద్ధి అవుతూ ఉన్నప్పుడు గ్రీక్ భాష మాట్లాడే యూదులు హీబ్రూ మాట్లాడే యూదులమీద సణుక్కొన్నారు. ఎందుకంటే రోజూ భోజనాదులు పంచిపెట్టేటప్పుడు తమలో ఉన్న విధవరాండ్రను నిర్లక్ష్యం చేయడం జరిగింది.
రోమా వారికి లేఖ 7:2-3
పెండ్లయిన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంతవరకూ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది గాని భర్త చనిపోతే భర్తను గురించిన చట్టంనుంచి ఆమె విడుదల అవుతుంది. అయితే భర్త ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఆమె మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొంటే ఆమెను వ్యభిచారిణి అనడం జరుగుతుంది. భర్త చనిపోతే ఆమెకు ఆ చట్టం నుంచి విడుదల కలుగుతుంది గనుక మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొన్నా ఆమె వ్యభిచారిణి కాదు.
కొరింతువారికి లేఖ 1 7:39-40
భర్త బ్రతికి ఉన్నంతవరకూ భార్య చట్టం ప్రకారం అతడికి కట్టుబడి ఉంటుంది. ఒక వేళ భర్త చనిపోతే ఆమెకు నచ్చినవాణ్ణి వివాహమాడడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంది, గాని ప్రభువులో ఉన్నవాణ్ణి మాత్రమే వివాహమాడాలి. అయినా ఆమె ఉన్న పరిస్థితిలోనే ఉండిపోతే ఎక్కువ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇందులో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా భావన.
తిమోతికి లేఖ 1 5:3-16
నిజంగా దిక్కులేని విధవరాండ్రను గౌరవంతో ఆదుకో. అయితే ఒక విధవరాలికి పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఉంటే, వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది. నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవునిమీదే నమ్మకం ఉంచి రాత్రింబగళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ సుఖాసక్తితో బ్రతుకుతున్న ఆమె జీవచ్ఛవం లాంటిదే. వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు.
ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేనివాడికంటే చెడ్డవాడు.
అరవై ఏళ్ళకంటే తక్కువ వయస్సు ఉన్న విధవరాలిని జాబితాలో నమోదు చేయకూడదు. అంతే కాక మునుపు ఆమె ఒక్కరినే పెళ్ళాడి ఉండాలి, మంచి పనులకు పేరు పొంది ఉండాలి – అంటే, పిల్లలను పెంచడం, పరాయి వ్యక్తులకు అతిథి సత్కారం చూపడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్ని రకాల మంచి పనులకు పూనుకోవడం.
తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రను ఆ జాబితాలో నమోదు చేయకు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాలవైపు మొగ్గి పెళ్ళి చేసుకోవాలని ఆశిస్తారు. అలా వారు తమ మొదటి నిశ్చయతను విడిచిపెట్టి తలమీదికి తీర్పు తెచ్చుకొంటారు. అంతే కాదు. వారు ఇంటింటా తిరుగుతూ వృథా కాలయాపన చేయడం నేర్చుకొంటారు. కాలయాపన చేసేవారుగా మాత్రమే గాక చెప్పకూడని సంగతులు చెపుతూ, వదరుబోతులుగా ఇతరుల జోలికి పోయేవారుగా తయారౌతారు.
అందుచేత తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రు పెళ్ళి చేసుకొని పిల్లలను కని ఇంటి వ్యవహారాలు నిర్వహించుకొంటూ, శత్రువుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా ఆశ. ఇంతకుముందే కొందరు సైతాను వెంట తొలగారు. విశ్వాసం ఉన్న పురుషుడు గానీ స్త్రీ గానీ కుటుంబంలోని విధవరాండ్రుంటే వారికి సహాయం చేయాలి. ఆ భారం క్రీస్తు సంఘం మీదికి రాకూడదు. అప్పుడు సంఘం నిజంగా దిక్కులేని విధవరాండ్రకు సహాయం చేయగలదు.
యాకోబు లేఖ 1:27
తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.
మన భర్తలకు, భార్యలకు విడకులు ఇవ్వము
మత్తయి శుభవార్త 5:31-32
“భార్యతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెకు విడాకులు ఇవ్వాలనేది కూడా పూర్వం చెప్పిన మాట. కానీ మీతో నేను చెపుతున్నాను, భార్య వ్యభిచరించి నందుచేత తప్ప మరో కారణంవల్ల ఆమెతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. అలా తెగతెంపులయిన ఒక స్త్రీని పెళ్ళాడేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
మత్తయి శుభవార్త 19:3-9
పరిసయ్యులు కొందరు కూడా ఆయనదగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలని ఇలా అడిగారు: “ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యతో తెగతెంపులు చేసుకోవడం ధర్మమా?”
అందుకాయన జవాబిస్తూ “మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు, ‘అందుకే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు’ ఇది మీరు చదవలేదా? కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒక్కటే శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు ఏకంగా చేసినవారిని మనిషి వేరు చేయకూడదు” అని వారితో అన్నాడు.
వారు “అయితే విడాకులిచ్చి ఆమెతో తెగతెంపులు చేసుకొమ్మని మోషే ఎందుకు ఆదేశించాడు?” అని ఆయనను అడిగారు.
యేసు వారితో అన్నాడు, “మోషే మీ హృదయాలు బండబారిపోవడం కారణంగా మీ భార్యలతో తెగతెంపులు చేసుకోవడానికి అనుమతించాడు. కానీ ఆరంభంనుంచి అలా లేదు. మీతో నేను అంటాను, ఎవడైనా భార్య వ్యభిచారం చేసినందుకు తప్ప ఆమెతో తెగతెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడితే వ్యభిచరిస్తున్నాడు. తెగతెంపులకు గురి అయిన ఆమెను పెండ్లి చేసుకొనేవాడు వ్యభిచరిస్తున్నాడు.”
లూకా శుభవార్త 16:18
“తన భార్యకు విడాకులిచ్చి మరో స్త్రీని పెండ్లి చేసుకొనే వాడెవరైనా వ్యభిచరిస్తున్నాడు. విడాకులు తీసుకొన్న ఆమెను పెండ్లి చేసుకొన్న వాడెవడైనా వ్యభిచరిస్తున్నాడు.
రోమా వారికి లేఖ 7:2-3
పెండ్లయిన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంతవరకూ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది గాని భర్త చనిపోతే భర్తను గురించిన చట్టంనుంచి ఆమె విడుదల అవుతుంది. అయితే భర్త ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఆమె మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొంటే ఆమెను వ్యభిచారిణి అనడం జరుగుతుంది. భర్త చనిపోతే ఆమెకు ఆ చట్టం నుంచి విడుదల కలుగుతుంది గనుక మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొన్నా ఆమె వ్యభిచారిణి కాదు.
కొరింతువారికి లేఖ 1 7:10-16
పెళ్ళైనవారికి నేనిచ్చే ఆదేశమిదే – అసలు, ఇచ్చేది నేను కాదు, ప్రభువే: “భార్య భర్తకు వేరైపోకూడదు.” ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి. లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు.
తక్కినవారితో ప్రభువు కాదు, నేనే ఇలా చెపుతున్నాను: ఒక సోదరునికి ప్రభువును నమ్మని భార్య ఉందనుకోండి. ఆమెకు అతనితో కాపురం చేయడం ఇష్టమైతే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఒకామెకు ప్రభువును నమ్మని భర్త ఉన్నాడనుకోండి. అతనికి ఆమెతో కాపుర ముండడం ఇష్టమైతే ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నమ్మని భర్త నమ్మిన భార్య కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినవాడు నమ్మని భార్య నమ్మిన భర్త కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినది. లేకపోతే మీ పిల్లలు అశుద్ధులుగా ఉండి ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు.
ఒకవేళ నమ్మని వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. అలాంటి పరిస్థితిలో సోదరునికి గానీ సోదరికి గానీ బంధనం లేదు. దేవుడు మనలను శాంతి అనుభవించడానికి పిలిచాడు. పెళ్ళైన స్త్రీ! నీద్వారా నీ భర్తకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు? పెళ్ళైన పురుషుడా! నీ ద్వారా నీ భార్యకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు?
క్రైస్తవులు తరచుగా శ్రమలను కలిగి ఉంటారు
వారు కష్టాలను ఎదుర్కొనుటకు ఎప్పుడూ సంసిద్దులుగా ఉంటారు
రోమా వారికి లేఖ 8:18-25
ఇప్పటి మన బాధలు తరువాత మనలో వెల్లడి కాబొయ్యే మహిమతో పోల్చతగ్గవి కావని నా అంచనా. దేవుని సంతానం వెల్లడి అయ్యే సమయంకోసం సృష్టి నిరీక్షణతో చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంది. సృష్టి వ్యర్థమైన పరిస్థితికి ఆధీనమైంది – తనంతట తానే కాదు గాని దానిని ఆశాభావంతో ఆధీనం చేసిన దేవుని ద్వారానే. ఎందుకంటే సృష్టి కూడా నాశన బంధకాలనుంచి విడుదల అయి, దేవుని సంతతివారి మహిమగల విముక్తిలో పాల్గొంటుంది. సృష్టి యావత్తూ ఇదివరకు ఏకంగా ప్రసవ వేదనలు పడుతూ ఉన్నట్టుండి, మూలుగుతున్నదని మనకు తెలుసు.
అంత మాత్రమే కాదు. మనం కూడా – దేవుని ఆత్మ ప్రథమ ఫలాలు గల మనం కూడా దత్తస్వీకారం కోసం, అంటే, మన దేహ విమోచనం కోసం చూస్తూ లోలోపల మూలుగుతున్నాం. మనం ఈ ఆశాభావంతో రక్షణ పొందాం. అయితే నెరవేరి కనబడ్డ ఆశాభావం ఆశాభావం కాదు. తమ ఎదుటే కనిపిస్తున్న దానికోసం ఎవరైనా ఎదురు చూడడమెందుకు? కానీ చూడనిదాని కోసం మనకు ఆశాభావం ఉంటే దానికోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాం.
రోమా వారికి లేఖ 8:28
దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచినవారికి, మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తున్నాయని మనకు తెలుసు.
కొరింతువారికి లేఖ 2 1:4
ఆయన మమ్ములను మా కష్టాలన్నిటిలోనూ ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఈ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టంలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
కొరింతువారికి లేఖ 2 4:16-18
అందుచేత మేము నిరుత్సాహం చెందము. శారీరకంగా క్షీణించిపోతూ ఉన్నా ఆంతర్యంలో మాకు రోజు రోజుకూ కొత్తదనం కలుగుతూ ఉంది. మేము కనిపించేవాటిమీద దృష్టి ఉంచకుండా కనిపించనివాటిమీదే దృష్టి ఉంచు కొంటున్నాం గనుక క్షణికమైన, చులకనైన మా బాధ దానికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమభారాన్ని మా కోసం కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి గాని కనిపించనివి శాశ్వతమైనవి.
యాకోబు లేఖ 1:2-4
నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడెల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి.
క్రీస్తుమీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుందని మీకు తెలుసు గదా. మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి.
పేతురు లేఖ 1 1:6-9
దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షలవల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో. ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే, ఎంతో విలువగలది. దానికి జ్వాలలచేత పరీక్ష కలిగినా, అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణంగా కనబడాలి. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. మీరు మీ విశ్వాస ఫలితం, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు.
పేతురు లేఖ 1 2:19-21
ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవునిపట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకొంటే అది మెచ్చుకోదగిన సంగతి. తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకొంటే మీకేం కీర్తి? గానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకొంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదే. మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే గదా.
ఎందుకంటే, క్రీస్తు సహా మనకోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు.
పేతురు లేఖ 1 5:8-10
స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా. మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత, సర్వ కృపానిధి అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు.
వారు తమ దేవుని కొరకు హింసలను ఎదుర్కొనుటకు ఎప్పుడూ సంసిద్దులుగా ఉంటారు
మత్తయి శుభవార్త 5:10-12
నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
“నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
మార్కు శుభవార్త 13:9-13
“మీరు జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే, వారు మిమ్ములను ఆలోచన సభలకు పట్టి ఇస్తారు. సమాజ కేంద్రాలలో మిమ్ములను కొట్టడం జరుగుతుంది. నాకోసం వారికి సాక్ష్యంగా మీరు ప్రాంతీయాధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతానికి ముందుగా శుభవార్త అన్ని జనాలకూ ప్రకటించడం జరగాలి. వారు మిమ్ములను పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు ఏమి చెప్పాలా అని ముందుగా బెంబేలు పడకండి, పూర్వాలోచన చేయకండి. ఆ సమయంలో మీకు ఏ మాటలు ఇవ్వబడుతాయో అవే అనండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గాని దేవుని పవిత్రాత్మే.
“సోదరుడు సోదరుణ్ణీ, తండ్రి తన సంతానాన్నీ మరణానికి పట్టి ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని చంపిస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్ములను ద్వేషిస్తారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.
లూకా శుభవార్త 12:4-9
“నా స్నేహితులారా, మీతో నేను చెప్పేదేమంటే శరీరాన్ని చంపేవారికి భయపడకండి. ఆ తరువాత వారు చేయగలిగేది ఏమీ లేదు. మీరెవరికి భయపడాలో మీకు చెపుతాను – ఆయన చంపిన తరువాత నరకంలో పడవేయడానికి అధికారం గల వ్యక్తికే. ఆయనకే భయపడండి అని మీతో అంటున్నాను.”
“అయిదు పిచ్చుకలు రెండు చిన్న నాణాలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక పిచ్చుక కూడా దేవుని సన్నిధిలో మరవబడదు. మీ తలవెండ్రుకలెన్నో లెక్క ఉంది. అందుచేత మీరేమీ భయపడకండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
“ఇంకొకటి మీతో నేనంటున్నాను, నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఎవరైనా ఒప్పుకొంటే అతణ్ణి మానవ పుత్రుడు దేవదూతల ఎదుట ఎరుగుదునని ఒప్పుకొంటాడు. కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వాణ్ణి దేవదూతల ఎదుట నేనూ ఎరగనంటాను.
యోహాను శుభవార్త 15:18-21
“లోకం మిమ్ములను ద్వేషిస్తే, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు. ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది. కానీ మీరు లోకానికి చెందినవారు కారు. మిమ్ములను లోకంలోనుంచి ఎన్నుకొన్నాను. లోకం మిమ్ములను ద్వేషించే కారణం ఇదే. నేను మీతో చెప్పిన ఈ మాట జ్ఞాపకముంచుకోండి – ‘దాసుడు తన యజమానికంటే మించినవాడు కాడు.’ వారు నన్ను హింసించారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు. అయితే నన్ను పంపినవాణ్ణి వారు ఎరుగరు గనుక నా పేరుకారణంగా అవన్నీ మీపట్ల జరిగిస్తారు.
యోహాను శుభవార్త 16:1-4
“మీరు తొట్రుపడకూడదని నేను ఈ విషయాలు మీతో చెప్పాను. వారు మిమ్ములను సమాజ కేంద్రాలనుంచి వెలివేస్తారు. మిమ్ములను ఎవరైనా చంపితే తాను దేవునికి సేవ చేస్తున్నట్టు అనుకొనేకాలం కూడా వస్తూ ఉంది. వారు తండ్రినీ నన్నూ తెలుసుకోలేదు గనుక ఆ విధంగా మీకు చేస్తారు. ఆ కాలం వచ్చేటప్పుడు ఈ విషయాలు మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వీటిని గురించి మీతో చెపుతున్నాను. మొదట్లో ఈ విషయాలు మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను.
అపొస్తలుల కార్యాలు 5:41
ఆయన పేరుకోసం అవమానానికి పాత్రులుగా ఎంచబడినందుచేత వారు ఆనందిస్తూ సమాలోచన సభనుంచి వెళ్ళిపోయారు.
రోమా వారికి లేఖ 8:35-37
క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
రోమా వారికి లేఖ 12:12-14
ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి. పవిత్రుల అక్కరలలో సహాయపడుతూ ఉండండి. అతిథి సత్కారం చేయడానికి అవకాశాలు వెతకండి.
మిమ్ములను హింసించేవారిని దీవించండి. శపించకండి గాని దీవించండి.
రోమా వారికి లేఖ 12:17-21
అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకొనే విషయాలను ఆలోచించండి. మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగతీర్చుకోకండి గాని దేవుని కోపానికి అవకాశమివ్వండి. పగతీర్చే పని నాదే అని ప్రభువు చెపుతున్నాడని రాసి ఉంది గదా. అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికెలు పోసినట్టే. కీడువల్ల అపజయం పాలుకాకండి గాని మేలుతో కీడును జయించండి.
కొరింతువారికి లేఖ 1 4:11-13
ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం. సరిపోని దుస్తులు తొడుక్కొంటున్నాం. పిడిగుద్దులు తింటున్నాం. నిలువ నీడ లేకుండా ఉన్నాం. సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాం. నిందల పాలయినప్పుడు దీవిస్తాం. హింసలకు గురి అయితే ఓర్చుకొంటాం. అపనిందలు వచ్చినప్పుడు వేడుకొంటాం. ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఉన్నాం.
కొరింతువారికి లేఖ 2 4:8-11
అన్ని వైపులా ఒత్తిడి మామీదికి వస్తూ ఉంది గాని మేము ఇరుక్కొనిపోవడం లేదు. ఆందోళన పడుతున్నాం గాని నిరాశ చెందడం లేదు. హింసలకు గురి అవుతూ ఉన్నాం గాని విడిచిపెట్టబడ్డవారం కాము. మమ్ములను పడద్రోయడం జరుగుతూ ఉంది గాని మేము నాశనం కావడం లేదు. యేసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణం కూడా మా శరీరంలో ఎప్పుడూ భరిస్తూ ఉన్నాం. ఎలాగంటే, చావుకు లోనయ్యే మా శరీరాలలో యేసు జీవం వెల్లడి అయ్యేలా సజీవులమైన మమ్ములను యేసుకోసం మరణానికి అప్పగించడం ఎప్పుడూ జరుగుతూ ఉంది.
కొరింతువారికి లేఖ 2 12:10
నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఫిలిప్పీవారికి లేఖ 1:28-29
ఇలాంటి ప్రవర్తన మీ విరోధులకు నాశనం, మీకు మోక్షం, దేవుని నుంచి మోక్షం, కలుగుతాయని రుజువుగా ఉంది. మునుపు మీరు నాలో పోరాటం ఉండడం చూశారు, అది ఇప్పుడు కూడా నాలో ఉందని విన్నారు. ఆ పోరాటమే మీకు కూడా ఉంది.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:4-8
అందుచేత మీరు భరిస్తూ వచ్చిన అన్ని హింసలలో బాధలలో మీకున్న ఓర్పు, నమ్మకం కారణంగా మేము దేవుని సంఘాలలో అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాం. దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువు గా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి తగినవారుగా లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే.
దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:2-4
మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారినుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు. మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారనీ ఇక చేస్తూ ఉంటారనీ మీ గురించి ప్రభువుమీద మాకు నమ్మకం ఉంది.
తిమోతికి లేఖ 2 3:10-13
నీవైతే నా ఉపదేశం, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, ఓర్పు, ప్రేమభావం, సహనశీలత, అంతియొకయలో ఈకొనియలో లుస్త్రలో నాకు కలిగిన హింసలూ కడగండ్లూ – ఎలాంటి హింసలు నేను అనుభవించానో – ఇదంతా తెలుసుకొని శ్రద్ధతో అనుసరించావు. అన్ని హింసలలో నుంచి ప్రభువు నన్ను విడిపించాడు. వాస్తవంగా, క్రీస్తు యేసులో దైవభక్తితో బ్రతకడానికి ఇష్టమున్నవారంతా హింసకు గురి అవుతారు. దుర్మార్గులూ వంచకులూ అయితే మోసపరుస్తూ, మోసపోతూ అంతకంతకూ చెడిపోతూ ఉంటారు.
హీబ్రూవారికి లేఖ 10:32-39
మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తరువాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం ఓర్చుకొన్నారు. దానిలో కొంత మీరు నిందలకూ కడగండ్లకూ గురి అయి బహిరంగంగా వింత దృశ్యం కావడంవల్ల కలిగింది. మరి కొంత మీరు అలాంటివాటికి గురి అయినవారితో సహవాసం చేసినందువల్ల కలిగింది. ఎలాగంటే, మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు. మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే, దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకొన్నారు.
అందుచేత మీ ధైర్యాన్ని వదలిపెట్టకండి. దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది. మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం. “ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు, ఆలస్యం చేయడు. గానీ న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు. ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో నాకు సంతోషం ఉండదు.”
అయితే మనం నాశనానికి వెనక్కు తీసేవారం కాము గాని ఆత్మ రక్షణకు నమ్మేవారమే.
హీబ్రూవారికి లేఖ 12:3-4
మీ ప్రాణాలకు అలసట, నిరుత్సాహం కలగకుండా పాపాత్ములవల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓర్చుకున్న ఆయనను బాగా తలపోయండి.
పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చిందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు.
పేతురు లేఖ 1 3:13-17
మీరు మేలైనదాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు? ఒకవేళ నీతినిజాయితీకోసం బాధలకు గురి కావలసివచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారుపడవద్దు. మీ హృదయాలలో ప్రభువైన దేవుణ్ణి ప్రతిష్టించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికీ సాత్వికంతో భయభక్తులతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకొనే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి. ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే, చెడుతనం చేసి బాధలకు గురి కావడం కంటే అది మేలు.
పేతురు లేఖ 1 4:12-19
ప్రియ సోదరులారా, మీమధ్య వాటిల్లుతూ ఉన్న మంటల్లాంటి విపత్తు మిమ్ములను పరీక్షించడానికే. మీకేదో విపరీతం జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకండి. అయితే క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో ఉప్పొంగిపోయేలా ఇప్పుడు ఆయన బాధలలో మీరు పాలివారై ఉన్నంతగా ఆనందించండి. ఒకవేళ క్రీస్తు పేరుకోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీమీద నిలిచి ఉన్నాడన్నమాట. వారివైపున ఆయన దూషించబడుతున్నాడు, మీవైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. కానీ మీలో ఎవరూ హంతకుడుగా గానీ దొంగగా గానీ దుర్మార్గుడుగా గానీ పరుల జోలికి పోయేవాడుగా గానీ బాధలు అనుభవించకూడదు. ఎవరైనా క్రైస్తవుడైనందుచేత బాధలు అనుభవించవలసివస్తే సిగ్గుపడకూడదు. అయితే ఈ విషయంలో దేవుణ్ణి కీర్తించాలి.
దేవుని ఇంటివారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమయితే దేవుని శుభవార్తకు విధేయత చూపనివారి అంతం ఏమవుతుంది! న్యాయవంతునికే రక్షణ, విముక్తి కలగడం కష్టమైతే భక్తిహీనులూ పాపులూ ఎక్కడ కనిపిస్తారో! అందుచేత దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవిస్తున్నవారు మంచి చేస్తూ తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి.
ప్రకటన 2:10
నీకు రాబోయే కష్టాలకు భయపడకు. ఇదిగో విను, అపవాద పిశాచం మీలో కొందరిని ఖైదులో వేయించ బోతున్నాడు. ఇది మీ పరీక్షకోసమే. పది రోజులపాటు మీరు బాధలకు గురి అవుతారు. మరణంవరకు నమ్మకంగా ఉండు. నీకు జీవ కిరీటం ఇస్తాను.
వారికి మరణానానికి భయపడరు
యోహాను శుభవార్త 6:39-40
నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
యోహాను శుభవార్త 11:17-27
యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
“చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
యోహాను శుభవార్త 14:1-4
“మీ హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద కూడా నమ్మకం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అది మీకు తెలుసు, ఆ మార్గం కూడా మీకు తెలుసు.”
రోమా వారికి లేఖ 8:10-11
క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం. చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
రోమా వారికి లేఖ 8:38-39
నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.
రోమా వారికి లేఖ 14:7-9
మనలో ఏ ఒక్కరూ తన మట్టుకు తానే బ్రతకరు, తన మట్టుకు తానే చనిపోరు. మనం బ్రతుకుతూ ఉంటే ప్రభువు సంబంధంగా బ్రతుకుతున్నాం. చనిపోతే ప్రభువు సంబంధంగా చనిపోతాం. కాబట్టి బ్రతికినా, చనిపోయినా మనం ప్రభువుకే చెందేవారం. తాను చనిపోయినవారికీ బ్రతికి ఉన్నవారికీ ప్రభువై ఉండాలనే కారణంచేత క్రీస్తు చనిపోయి లేచి మళ్ళీ బ్రతికాడు.
కొరింతువారికి లేఖ 1 15:12-58
క్రీస్తును చనిపోయినవారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే, చనిపోయినవారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెపుతున్నారేమిటి? చనిపోయినవారు లేవడం అనేది లేదూ అంటే, క్రీస్తు కూడా లేవలేదన్న మాటే. క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం. అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే, గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాం గదా. చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే! మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్ను మూసినవారు నశించిపోయారు కూడా. క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టుకే గనుక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్ళం.
అయితే క్రీస్తు చనిపోయినవారిలో నుంచి లేచాడు. కన్ను మూసినవారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషిద్వారా కలిగింది. ఆదాములో అందరూ చనిపోతారు. అలాగే క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ తన వరుస ప్రకారమే అలా జరిగేదిమొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు, తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు.
ఆ తరువాత, ఆయన సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, శక్తినీ రద్దుచేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత, అంతం వస్తుంది. ఎందుకంటే విరోధులందరినీ తన పాదాలక్రింద పెట్టుకొనేవరకూ క్రీస్తు రాజ్యం చేయాలి. చివరగా నాశనం కాబోయే విరోధి మరణం. దేవుడు ఆయన పాదాలక్రింద సమస్తమూ ఉంచాడు. అయితే ఆయన క్రింద సమస్తమూ ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తమూ ఉంచినవాడు ఉండడని తేటతెల్లమే. సమస్తమూ కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తమూ ఉంచిన ఆయనకు వశమవుతాడు.
ఒకవేళ అలా కాకపోతే చనిపోయినవారికోసం బాప్తిసం పొందినవారు చేసేదేమిటి? చనిపోయినవారు ఎంత మాత్రం లేవరూ అంటే వారికోసం బాప్తిసం పొందడమెందుకని?
అంతేకాదు. మేము ఘడియ ఘడియకూ ప్రాణాపాయంలో ఎందుకుండాలి? మన ప్రభువైన క్రీస్తు యేసులో మీగురించి నాకున్న అతిశయాన్నిబట్టి నొక్కి చెపుతున్నాను – నేను ప్రతి రోజూ చావుకు గురి అవుతున్నాను. నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే గనుక అయితే నాకు లాభమేమిటి? చనిపోయిన వారు లేవకుండా ఉంటే “రేపు చచ్చిపోతాం గనుక తిందాం, తాగుతాం”. మోసపోకండి – “చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడతుంది”. దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు – మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెపుతున్నాను – గనుక నీతిన్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి.
అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు: “చనిపోయినవారిని లేపడమెలాగు? వారికెలాంటి దేహం ఉంటుంది?”
తెలివితక్కువవాడా, మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు గదా. అంతేకాదు, మీరు విత్తేది – అది గోధుమ గింజ కానివ్వండి, మరే గింజయినా కానివ్వండి – గింజే గాని కలగబోయే ఆకారం మీరు విత్తరు. దేవుడు ఆ గింజలోనుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు, విత్తనాలలో ప్రతి దానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు. అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం ఒక రకం, మృగ మాంసం వేరే రకం, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు. అలాగే ఆకాశంలో ఆకారాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి. అయితే ఆకాశంలో ఉన్నవాటి వైభవం ఒక తీరు. భూమిమీద ఉన్నవాటి వైభవం మరో తీరు. సూర్యమండలం వైభవం ఒక తీరు, చంద్రబింబం వైభవం మరో తీరు, నక్షత్రాల వైభవం ఇంకో తీరు. వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది.
చనిపోయినవారు సజీవంగా లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించే శరీరాన్ని విత్తడం, నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది. దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం, దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది. దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం, బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది. ఈ ప్రకృతిసిద్ధమైన శరీరంగా దానిని విత్తడం, ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది. ఈ సందర్భంలో, మొదటి మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది. అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ.
మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదు గాని ప్రకృతి సిద్ధమైనదీ. తరువాత ఆధ్యాత్మికమైనది కలిగేది. మొదటి మానవుడు భూసంబంధి, మట్టినుంచి రూపొందినవాడు. రెండో మానవుడు పరలోకంనుంచి వచ్చిన ప్రభువు. మట్టివారు ఆ మట్టివానిలాంటివారు, పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధిలాంటివారు. మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకొంటాం.
సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, రక్తమాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు. నశించేదానికి నశించనిదానిలో వారసత్వముండదు. ఇదిగో వినండి, ఒక రహస్య సత్యం మీకు తెలియజేస్తున్నాను – మనమంతా కన్ను మూయము గాని మనమంతా మార్పు చెందుతాం. ఇది ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటునే, చివరి బూర సమయంలోనే జరుగుతుంది. ఆ బూర మ్రోగుతుంది, చనిపోయినవారిని నశించనివారుగా లేపడం జరుగుతుంది, మనకు మార్పు కలుగుతుంది. ఈ నశించేది నశించనిదానిని ధరించు కోవాలి, ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి. ఈ నశించేది నశించనిదాన్ని ధరించుకొని ఈ మరణించేది మరణించనిదాన్ని ధరించు కొన్నప్పుడు, రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది: విజయం మృత్యువును మ్రింగివేసింది. “ఓ మరణమా, నీ విషపుకొండి ఎక్కడ? మృత్యులోకమా, నీ విజయమెక్కడ?”
మరణం కొండి అపరాధమే. అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. కాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు! ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనకు విజయం ఇస్తున్నాడు! అందుచేత, నా ప్రియ సోదరులారా, సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండండి.
కొరింతువారికి లేఖ 2 5:1-10
భూమిమీద మన నివాసమైన గుడారం నాశనమైపోతే దేవునివల్ల అయిన కట్టడం, చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు. పరలోకసంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం. నిజంగా దానిని ధరించు కొన్నప్పుడు మనం దిగంబరంగా కనబడము. “గుడారం”లో ఉన్న మనం భారంక్రింద మూలుగుతూ ఉన్నాం. ఇది తొలగించబడాలని కాదు గాని ఆ నివాసాన్ని ధరించు కోవాలని – చావుకు లోనయ్యేది జీవంవల్ల మింగివేయబడాలని మన ఆశ.
ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే. ఈ కారణంచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం. మనం శరీరంలో నివాసమున్నంత కాలం ప్రభువుతో లేమని తెలుసు – కంటికి కనిపించేవాటివల్ల కాదు గాని విశ్వాసంవల్లే నడుచుకొంటున్నాం. నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటే శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో, ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం.
అందుచేత మేము పెట్టుకొన్న లక్ష్యం ఏమిటంటే, శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే. ఎందుకంటే, మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు – చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే – చేసిన వాటి ప్రకారం పొందాలి.
ఫిలిప్పీవారికి లేఖ 1:20-24
నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా – నా జీవితంవల్ల గానీ మరణంవల్ల గానీ – పూర్ణ ధైర్యంతో నా శరీరంలో క్రీస్తుకు ఘనత కలుగుతుందని ఒకే పట్టుగా అధిక ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నా మట్టుకైతే జీవించడమంటే క్రీస్తే మరణించడమంటే లాభమే.
అయినా నేను శరీరంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఫలవంతమైన పని ఉంటుంది. నేనేమి కోరుకోవాలో నాకు తెలియదు. నేను ఈ రెంటిమధ్య చిక్కుబడి ఉన్నాను – లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. అయినా నేను శరీరంతో ఇంకా ఉండడం మీ కోసం మరీ అవసరం.
తెస్సలొనీకవారికి లేఖ 1 4:13-18
సోదరులారా, కన్ను మూసినవారిని గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులలాగా మీరు శోకించకూడదు. యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాం గదా. ఆ ప్రకారమే యేసులో కన్నుమూసినవారిని ఆయనతోకూడా దేవుడు తీసుకువస్తాడు. ప్రభువు మాటగా మేము మీకు చెప్పేదేమంటే, ప్రభువు రాకడ వరకూ బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనం కన్ను మూసినవారికంటే ముందరివారంగా ఉండం. ఎలాగంటే, ఆజ్ఞాపూర్వకమైన కేకతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దంతో ప్రభువు తానే పరలోకం నుంచి దిగివస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయినవారు మొదట లేస్తారు. ఆ తరువాత ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి ఇంకా బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనలను వారితోపాటు మేఘాలలో పైకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం. కాబట్టి ఈ మాటలచేత ఒకరినొకరు ఓదార్చుకోండి.
హీబ్రూవారికి లేఖ 2:14-15
ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్నకారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణ శక్తి గలవాణ్ణి, అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలనీ మరణ భయంచేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైనవారిని విడిపించాలనీ అందులో ఆయన ఉద్దేశం.
ప్రకటన 14:13
అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం నాకు వినిపించి “ఈ విధంగా రాయి: ఇప్పటినుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు” అంది. “అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి” అని దేవుని ఆత్మ చెపుతున్నాడు.
ప్రకటన 21:1-4
అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి నాకు కనిపించాయి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేదు. నేను – యోహానును – పవిత్ర నగరమైన కొత్త జెరుసలం కూడా చూశాను. అది తన భర్తకోసం అలంకరించుకొన్న పెళ్ళికూతురులాగా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి వస్తూ ఉంది.
అప్పుడు పరలోకంనుంచి ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను: “ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో నివసిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు. దేవుడు వారి కళ్ళలో నుంచి కన్నీళ్ళన్నీ తుడిచివేస్తాడు. అప్పటినుంచి చావు, దుఃఖం, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు. పూర్వమున్న విషయాలు గతించిపోయాయి.”
ప్రకటన 22:1-5
అప్పుడతడు స్ఫటికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవజల నది నాకు చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు. వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది. అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు.
వారికి దేవుడు సహాయమునూ మరియు అతిసమీపంగానూ ఉంటాడు
మత్తయి శుభవార్త 18:19-20
ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
మత్తయి శుభవార్త 28:19-20
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.
యోహాను శుభవార్త 14:16-23
నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. ఈయన సత్యాత్మ. లోకం ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. నేను మిమ్ములను అనాథలనుగా విడిచివెళ్ళను. మీ దగ్గరకు వస్తాను. ఇంకా కొద్ది కాలం అయిందంటే లోకం నన్ను చూడనే చూడదు. మీరైతే నన్ను చూస్తారు. నేను బ్రతుకుతున్నాను గనుక మీరూ బ్రతుకుతారు. నేను నా తండ్రిలో ఉన్నాననీ మీరు నాలో ఉన్నారనీ నేను మీలో ఉన్నాననీ ఆ రోజున మీరు తెలుసుకొంటారు. నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
ఇస్కరియోతు కాని యూదా “ప్రభూ, దేనివల్ల లోకానికి కాక, మాకే నిన్ను వెల్లడి చేసుకుంటావు?” అని ఆయనను అడిగాడు.
యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రేమించేవారెవరైనా నా మాట ఆచరిస్తాడు. అలాంటి వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరకు మేము వస్తాం, అతనితో నివాసం చేస్తాం.
రోమా వారికి లేఖ 8:35-39
క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.
కొరింతువారికి లేఖ 2 6:16-18
దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి? మీరు జీవంగల దేవుని ఆలయం. ఇందుకు దేవుడు చెప్పినదేమిటంటే, నేను వారిలో నివాసముంటాను, వారితో నడుస్తాను. వారి దేవుణ్ణయి ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
అందుచేత వారిలో నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెపుతున్నాడు, కల్మషమైన దానిని ముట్టకండి. నేను మిమ్ములను స్వీకరిస్తాను. మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కొడుకులూ కూతుళ్ళై ఉంటారు అని అమిత శక్తిగల ప్రభువు అంటున్నాడు.
ఎఫెసువారికి లేఖ 3:17-19
మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి పవిత్రులందరితోపాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలనీ, జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలనీ మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయినవారు కావాలనీ ఆయనను ప్రార్థిస్తున్నాను.
ఫిలిప్పీవారికి లేఖ 4:13
నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను.
కొలస్సయివారికి లేఖ 2:6-7
మీరు ప్రభువైన క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే ఆయనలో నడుచుకొంటూ ఉండండి. ఆయనలో వేరుపారి అభివృద్ధి పొందుతూ, మీకు ఉపదేశం వచ్చినట్టే విశ్వాసంలో సుస్థిరమై దానిలో కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:16
శాంతిప్రదాత ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితులలోను మీకు శాంతి అనుగ్రహిస్తాడు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడు గాక!
హీబ్రూవారికి లేఖ 13:5-6
మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను. అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
అపవాది వారికి హాని కలిగించుటకు వెదకుతూ ఉంటాడు
మత్తయి శుభవార్త 13:19
పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తినదానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి.
లూకా శుభవార్త 4:1-13
యేసు పవిత్రాత్మతో నిండినవాడై యొర్దానునుంచి తిరిగి వచ్చాడు. అప్పుడా ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ నలభై రోజులపాటు అపనింద పిశాచంచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. ఆ నలభై రోజులూ ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
అప్పుడు అపనింద పిశాచం ఆయనతో అన్నాడు “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అయిపొమ్మని ఆజ్ఞాపించు!”
యేసు “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది” అని వాడికి జవాబిచ్చాడు.
అపనింద పిశాచం ఆయనను ఎత్తయిన పర్వతం మీదికి తీసుకువెళ్ళి క్షణంలో ఆయనకు భూలోక రాజ్యాలన్నీ చూపించాడు. “ఈ రాజ్యాధికారమంతా, ఈ రాజ్యాల వైభవమంతా నీకిస్తాను. అదంతా నాకప్పగించబడింది. అది ఎవరికివ్వాలని నేను ఇష్టపడతానో వారికిస్తాను. అందుచేత నీవు నన్ను పూజిస్తే అదంతా నీదవుతుంది” అని అపనింద పిశాచం ఆయనతో చెప్పాడు.
అందుకు యేసు “సైతానూ! నా వెనక్కు పో! ఇలా వ్రాసి ఉంది: నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే సేవ చేయాలి” అని వాడికి జవాబిచ్చాడు.
వాడు ఆయనను జెరుసలంకు తీసుకువెళ్ళి దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడనుంచి క్రిందికి దూకేసెయ్యి! ఇలా రాసి ఉంది గదా – ఆయన నిన్ను కాపాడాలని నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొంటారు” అని ఆయనతో అన్నాడు.
యేసు వాడికిలా జవాబిచ్చాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని చెప్పబడి ఉన్నది.”
అపనింద పిశాచం ప్రతి విషమ పరీక్ష పెట్టడం ముగించి మరో అవకాశం చిక్కేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
లూకా శుభవార్త 22:3-4
అప్పుడు సైతాను ఇస్కరియోతు అనే ఇంటిపేరున్న యూదాలో చొరబడ్డాడు. అతడు పన్నెండుమంది శిష్యుల లెక్కలో చేరిన ఒకడు. అతడు ప్రధాన యాజుల దగ్గరికీ దేవాలయం కావలి అధికారుల దగ్గరికీ వెళ్ళి, యేసును వారికెలా పట్టి ఇవ్వాలా అని వారితో మాట్లాడాడు.
యోహాను శుభవార్త 8:42-44
యేసు వారితో అన్నాడు “దేవుడే గనుక మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమతో చూచేవారే. ఎందుకంటే, నేను దేవుని దగ్గరనుంచి బయలుదేరి వచ్చాను. నా అంతట నేనే రాలేదు. ఆయన నన్ను పంపాడు. నేను చెప్పేది మీరు ఎందుకు గ్రహించరు? నా మాట వినలేకపోవడమే దానికి కారణం. మీరు మీ తండ్రి అపనింద పిశాచానికి చెందినవారు. మీ తండ్రి ఇచ్ఛల ప్రకారం జరిగించాలని కోరుతూ ఉన్నారు. మొదటినుంచి వాడు హంతకుడు, సత్యంలో నిలవనివాడు. సత్యం వాడిలో బొత్తిగా లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. వాడు అబద్ధం చెప్పినప్పుడెల్లా వాడి సొంతస్వభావంలోనుంచి చెపుతాడు.
కొరింతువారికి లేఖ 2 2:10-11
మీరు ఎవరినైనా దేనిగురించైనా క్షమిస్తే ఆ వ్యక్తిని నేనూ క్షమిస్తాను. నేను దేనినైనా క్షమించి ఉంటే అది మీ కోసం, క్రీస్తు సముఖంలో ఆ వ్యక్తిని క్షమించాను. సైతాను మనమీద దురుద్దేశం సాధించకూడదని అలా చేశాను. సైతాను తంత్రాలు ఎలాంటివో మనం తెలియనివారం కాము.
కొరింతువారికి లేఖ 2 4:4
విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గురించిన శుభవార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా అలా చేశాడు.
కొరింతువారికి లేఖ 2 11:13-15
అలాంటివారు వాస్తవమైన క్రీస్తు రాయబారులు కారు. మోసంగా పని చేసేవారు. క్రీస్తు రాయబారులుగా అనిపించుకోవాలని మారు వేషం వేసుకొనేవారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకొనేవాడు. అందుచేత వాడి సేవకులు తాము నీతిన్యాయాలకు సేవకులుగా కనబడేలా మారువేషం వేసుకోవడం వింత ఏమీ కాదు. వారి అంతం వారి పనుల ప్రకారమే ఉంటుంది.
ఎఫెసువారికి లేఖ 2:2
పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట.
తెస్సలొనీకవారికి లేఖ 1 2:18
మీ దగ్గరకు రావాలని మేము ఆశించినా, పౌలనే నాకు ఈ ఆశ తరచుగా కలిగినా, సైతాను మమ్ములను ఆటంకపరచాడు.
తెస్సలొనీకవారికి లేఖ 2 2:9-12
న్యాయవిరోధి రాకడ సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది; సామర్థ్యమంతటితో, సూచకమైన క్రియలతో, మోసకరమైన అద్భుతాలతో ఉంటుంది; నశిస్తున్నవారి మధ్య భ్రమపరిచే దుర్మార్గమంతటితో ఉంటుంది. ఎందుకంటే, వారు తమకు పాపవిముక్తి కలిగేలా సత్యం గురించిన ప్రేమను స్వీకరించలేదు.
ఈ కారణంచేతే వారు ఆ అబద్ధం నమ్మేలా శక్తిమంతమైన భ్రమ వారికి దేవుడు పంపిస్తాడు. సత్యం నమ్మకుండా దుర్మార్గంలో సంతోషించేవారందరికీ శిక్షావిధి కలగాలని ఇందులో దేవుని ఉద్దేశం.
పేతురు లేఖ 1 5:8-9
స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా.
యోహాను లేఖ 1 3:8-10
అపరాధం చేస్తూ ఉండేవాడు అపనింద పిశాచానికి చెందినవాడు. అపనింద పిశాచం మొదటినుంచి పాపం చేస్తూ ఉన్నాడు. అపనింద పిశాచం పనులు నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునివల్ల జన్మించిన వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ వుండడు. ఎందుకంటే దేవుని విత్తనం అతనిలో నిలిచి ఉంటుంది. అతడు దేవునివల్ల జన్మించినవాడు గనుక అపరాధం చేస్తూ ఉండలేడు. దీన్నిబట్టి దేవుని పిల్లలెవరో అపనింద పిశాచం పిల్లలెవరో తేటతెల్లమవుతుంది. న్యాయంగా ప్రవర్తించనివాడు దేవునికి చెందినవాడు కాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడు కూడా అంతే.
ప్రకటన 12:7-12
పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేల్, అతని దూతలు రెక్కలున్న సర్పంమీద యుద్ధం జరిగించారు. రెక్కలున్న సర్పం, దాని దూతలు ఎదురు పోరాటం జరిపారు గాని గెలవలేకపోయారు గనుక అప్పటినుంచి పరలోకంలో వారికి చోటు లేకుండా పోయింది. రెక్కలున్న ఆ మహా సర్పం పడద్రోయబడింది. అది ఆదిసర్పం. దానికి అపనింద పిశాచం, సైతాను అని పేరు. అది సర్వ లోకాన్ని మోసగిస్తూ ఉంది. వాణ్ణి వాడితోపాటు వాడి దూతలనూ భూమిమీదికి పడద్రోయడం జరిగింది.
అప్పుడు పరలోకంలో గొప్ప స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఇప్పుడు దేవుని రక్షణ, ప్రభావం, రాజ్యం, ఆయన అభిషిక్తుని అధికారం వచ్చాయి! ఎందుకంటే, మన సోదరుల మీద నేరాలు మోపేవాడు పడద్రోయబడ్డాడు. రాత్రింబగళ్ళు వాడు మన దేవుని ఎదుట వారిమీద నేరాలు మోపుతూ వచ్చాడు. అయితే వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టీ తాము చెపుతున్న సాక్ష్యాన్ని బట్టీ వాణ్ణి ఓడించారు. మరణంవరకూ తమ ప్రాణాలమీద వారికి ప్రీతి లేకపోయింది. ఇందుకు, ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా, ఆనందించండి! అయితే భూమి, సముద్రం నివాసులకు అయ్యో, విపత్తు! ఎందుకంటే, అపవాద పిశాచం తనకు కొద్ది కాలమే మిగిలిందని తెలిసి తీవ్ర కోపంతో మీ దగ్గరకు దిగివచ్చాడు.”
ప్రకటన 20:1-3
అప్పుడు ఒక దేవదూత పరలోకంనుంచి దిగిరావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి తాళంచెవి, పెద్ద గొలుసు ఉన్నాయి. అతడు రెక్కలున్న సర్పాన్ని – అపనింద పిశాచమూ సైతానూ అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని వెయ్యేళ్ళకు బంధించి వాణ్ణి అగాధంలో పడవేశాడు. ఆ వెయ్యేళ్ళు గడిచేంతవరకూ వాడు ఇక జనాలను మోసగించకుండా ఆ దేవదూత అగాధం మూసివేసి వాడిపైగా ముద్ర వేశాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగితీరాలి.
ప్రకటన 20:10
వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని మృగమూ కపట ప్రవక్తా ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు.
వారికి దేవుడు అపవాదిని ఎదిరించే శక్తినీ మరియ కష్టాలను భరించే సామర్థ్యాన్ని ఇస్తాడు
మత్తయి శుభవార్త 4:1-11
అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమపరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
దుష్‌ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు!”
అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది.”
అప్పుడు అపనింద పిశాచం ఆయనను పవిత్ర నగరానికి తీసుకువెళ్ళి దేవాలయం శిఖరంమీద నిలబెట్టాడు.
“నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకేసెయ్యి! ఎందుకంటే ఇలా రాసి ఉంది – ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొంటారు అని ఆయనతో అన్నాడు.”
అందుకు యేసు వాడితో ఇలా చెప్పాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని కూడా వ్రాసి ఉంది.”
ఇంకా అపనింద పిశాచం ఆయనను చాలా ఎత్తయిన పర్వతంమీదికి తీసుకువెళ్ళి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్నీ చూపించాడు. అప్పుడు వాడు ఆయనతో “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను” అన్నాడు.
“సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
అప్పుడు అపనింద పిశాచం ఆయనను విడిచివెళ్ళాడు. దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేశారు.
మత్తయి శుభవార్త 6:13
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
లూకా శుభవార్త 22:31-32
ప్రభువు ఇంకా అన్నాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో విను. సైతాను మిమ్ములను గోధుమలలాగా జల్లించాలని మిమ్ములను కోరాడు. కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”
యోహాను శుభవార్త 17:14-19
నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.
రోమా వారికి లేఖ 8:31-39
ఈ విషయాలను గురించి మనం ఏమనాలి? దేవుడే గనుక మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక్కు తీయకుండా మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోపాటు అన్నిటినీ మనకు ఎలా ఉచితంగా ఇవ్వకుండా ఉంటాడు? దేవుడు ఎన్నుకొన్నవారి మీద ఎవరు నేరం మోపుతారు? వారిని నిర్దోషులుగా ఎంచేది దేవుడే! ఎవరు శిక్ష విధించగలరు? వారికోసం చనిపోయింది క్రీస్తే. అంతే కాదు, సజీవంగా లేచినవాడు కూడా ఆయనే. దేవుని కుడిప్రక్కన కూర్చుని ఉండి మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే.
క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.
రోమా వారికి లేఖ 12:12
ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి.
రోమా వారికి లేఖ 16:19-20
మీ విధేయతను గురించి అందరికీ వినిపించింది గనుక మీ విషయం నేనానందిస్తున్నాను. అయితే మీరు మంచి విషయాలలో తెలివైనవారు, చెడు విషయాలలో నిర్దోషులు కావాలని నా కోరిక.
శాంతి ప్రదాత అయిన దేవుడు మీ పాదాలక్రింద సైతానును త్వరగా చితగ్గొట్టివేస్తాడు. మన ప్రభువైన యేసు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక.
కొరింతువారికి లేఖ 1 10:12-13
కనుక నిలుచున్నాననుకొనే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
కొరింతువారికి లేఖ 1 16:13
మెళుకువగా ఉండండి. విశ్వాస సత్యాలలో నిలకడగా ఉండండి. పౌరుషంగా ఉండండి. బలంగా ఉండండి.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఎఫెసువారికి లేఖ 3:20-21
మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
ఎఫెసువారికి లేఖ 6:10-18
తుదకు, నా సోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బలప్రభావాలచేత బలాఢ్యులై ఉండండి. అపనింద పిశాచం కుతంత్రాలను ఎదిరిస్తూ గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుడిచ్చే కవచమంతా ధరించుకోండి. ఎందుకంటే, మనం పోరాడుతున్నది రక్త మాంసాలున్నవారితో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ఈ యుగ అంధకారాన్ని ఏలుతున్న నాథులతో, పరమ స్థలాలలో ఉన్న ఆత్మ రూపులైన దుష్టశక్తుల సేనలతో. అందుచేత మీరు దుర్దినంలో వారిని ఎదిరిస్తూ, చేయవలసినదంతా సాధించి గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుని కవచమంతా ధరించుకోండి.
కనుక స్థిరంగా నిలబడి ఉండండి! మీ నడుముకు సత్యాన్ని దట్టిగా కట్టుకోండి. నీతిన్యాయాలను కవచంగా ఛాతికి ధరించుకోండి. మీ పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత అనే జోడు తొడుక్కోండి. అన్నిటికి పైగా విశ్వాసం డాలు చేతపట్టుకోండి. దానితో ఆ దుర్మార్గుడు ప్రయోగించే అగ్ని బాణాలన్ని ఆర్పివేయగలుగుతారు. పాపవిముక్తి శిరస్త్రాణం ధరించుకోండి. దేవుని ఆత్మ ఖడ్గం చేతపట్టుకోండి – అది దేవుని వాక్కే. అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.
ఫిలిప్పీవారికి లేఖ 4:13
నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను.
తెస్సలొనీకవారికి లేఖ 1 3:5-8
ఈ కారణంచేత నేనిక తట్టుకోలేక, మీ విశ్వాసం గురించి తెలుసుకొందామని అతణ్ణి పంపాను. ఒకవేళ దుష్ట ప్రేరేపణలు చేసేవాడు మిమ్ములను ప్రేరేపించాడేమో అనీ మా ప్రయాస వ్యర్థమై పోయిందేమో అనీ మా ఆందోళన.
కానీ తిమోతి ఇప్పుడు మీ దగ్గరనుంచి వచ్చి మీ విశ్వాసం, ప్రేమ గురించీ మంచి కబురు తెచ్చాడు. మిమ్ములను చూడడానికి మాకెలా తీవ్ర ఆశ ఉందో అలాగే మమ్ములను చూడడానికి మీకూ తీవ్ర ఆశ ఉందనీ మీరు ఎప్పుడూ మా గురించి మంచిని జ్ఞాపకం చేసుకొంటున్నారనీ చెప్పాడు. అందుచేత, సోదరులారా, మా బాధలు, కడగండ్లన్నిటిలో మీ విశ్వాసం కారణంగా మీ గురించి మాకు ఓదార్పు కలిగింది. ఎందుకంటే, ప్రభువులో మీరు నిలకడగా ఉంటే ఇప్పుడు మేము నిజంగా బ్రతుకుతూ ఉన్నాం.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:3
అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు.
తిమోతికి లేఖ 2 1:7-8
ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినది పిరికితనం పుట్టించే ఆత్మ కాదు గాని బలం, ప్రేమభావం, నిగ్రహం కలిగించే ఆత్మే.
కాబట్టి మన ప్రభువును గురించిన సాక్ష్యం విషయంలో, ఆయనకోసం ఖైదీనైన నా విషయంలో సిగ్గుపడకు, గాని శుభవార్తకోసం కడగండ్లలో దేవుని బలప్రభావాలను బట్టి నాతో కూడా పాలిభాగస్తుడివై ఉండు.
హీబ్రూవారికి లేఖ 2:18
ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.
హీబ్రూవారికి లేఖ 4:14-16
అయితే మనకు గొప్ప ప్రముఖయాజి ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాం. ఎందుకంటే, మనకు ఉన్న ప్రముఖయాజి మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమపరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు. కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.
హీబ్రూవారికి లేఖ 12:1-2
ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతిదాన్నీ, సుళువుగా చిక్కులుపెట్టే పాపాన్నీ త్రోసిపుచ్చి యేసువైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరుగెత్తుదాం. నమ్మకానికి కర్త, దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన తన ముందున్న ఆనందంకోసం సిలువను ఓర్చుకొని ఆ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు.
యాకోబు లేఖ 4:7
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
పేతురు లేఖ 1 1:5
కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం, నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి.
పేతురు లేఖ 1 5:8-11
స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా. మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత, సర్వ కృపానిధి అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయనకే మహిమ అధికారం యుగయుగాలకు ఉంటుంది గాక! తథాస్తు.
యోహాను లేఖ 1 4:4
చిన్న పిల్లలారా, మీరు దేవునికి చెందేవారు, లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు అధికుడు గనుక మీరు ఆ కపట ప్రవక్తలను జయించారు.
యోహాను లేఖ 1 5:3-5
దేవుణ్ణి ప్రేమించడమంటే మనం ఆయన ఆజ్ఞలు శిరసావహించడమే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే, దేవునివల్ల జన్మించిన సంతతివారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించినది మన నమ్మకమే. లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడని నమ్మే వ్యక్తే!
ప్రకటన 12:7-12
పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేల్, అతని దూతలు రెక్కలున్న సర్పంమీద యుద్ధం జరిగించారు. రెక్కలున్న సర్పం, దాని దూతలు ఎదురు పోరాటం జరిపారు గాని గెలవలేకపోయారు గనుక అప్పటినుంచి పరలోకంలో వారికి చోటు లేకుండా పోయింది. రెక్కలున్న ఆ మహా సర్పం పడద్రోయబడింది. అది ఆదిసర్పం. దానికి అపనింద పిశాచం, సైతాను అని పేరు. అది సర్వ లోకాన్ని మోసగిస్తూ ఉంది. వాణ్ణి వాడితోపాటు వాడి దూతలనూ భూమిమీదికి పడద్రోయడం జరిగింది.
అప్పుడు పరలోకంలో గొప్ప స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఇప్పుడు దేవుని రక్షణ, ప్రభావం, రాజ్యం, ఆయన అభిషిక్తుని అధికారం వచ్చాయి! ఎందుకంటే, మన సోదరుల మీద నేరాలు మోపేవాడు పడద్రోయబడ్డాడు. రాత్రింబగళ్ళు వాడు మన దేవుని ఎదుట వారిమీద నేరాలు మోపుతూ వచ్చాడు. అయితే వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టీ తాము చెపుతున్న సాక్ష్యాన్ని బట్టీ వాణ్ణి ఓడించారు. మరణంవరకూ తమ ప్రాణాలమీద వారికి ప్రీతి లేకపోయింది. ఇందుకు, ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా, ఆనందించండి! అయితే భూమి, సముద్రం నివాసులకు అయ్యో, విపత్తు! ఎందుకంటే, అపవాద పిశాచం తనకు కొద్ది కాలమే మిగిలిందని తెలిసి తీవ్ర కోపంతో మీ దగ్గరకు దిగివచ్చాడు.”
తరచుగా దేవుడు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను బాగు చేస్తాడు
మత్తయి శుభవార్త 4:23-25
యేసు గలలీ ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ, వారి సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ, రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగుచేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రోగులందరినీ నానా విధాల వ్యాధులచేత యాతనలచేత పీడితులైన వారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు. గలలీ, దెకపొలి, జెరుసలం, యూదయ, యొర్దానుకు అవతలి ప్రదేశం – ఈ స్థలాలనుంచి పెద్ద జన సమూహాలు ఆయన వెంటవెళ్ళారు.
మత్తయి శుభవార్త 9:35
యేసు అన్ని పట్టణాలకూ గ్రామాలకూ వెళ్తూ, వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలలో అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేస్తూ ఉన్నాడు.
మత్తయి శుభవార్త 11:2-5
క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు. అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు: “రావలసినవాడవు నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా?”
యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు వస్తూ ఉంది, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధమౌతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారిని సజీవంగా లేపడం జరుగుతూ ఉంది. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.
అపొస్తలుల కార్యాలు 3:1-6
ఒకప్పుడు ప్రార్థన కాలంలో – పగలు మూడు గంటలకు – పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడే కొందరు పుట్టు కుంటి మనిషిని ఒకణ్ణి మోసుకువస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళే వారిదగ్గర బిచ్చం అడుక్కోవడానికి వారు అతణ్ణి ప్రతి రోజూ సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు.
పేతురు, యోహానుతోపాటు అతణ్ణి తేరిపార చూస్తూ “మావైపు చూడు” అన్నాడు. తనకు వారిదగ్గర ఏదైనా దొరుకుతుందని వారివైపు శ్రద్ధతో చూశాడు.
అప్పుడు పేతురు “నేను వెండి బంగారాలు ఉన్నవాణ్ణి కాను గాని నాకున్నదేదో అదే నీకిస్తాను. నజరేతువాడైన యేసు క్రీస్తు పేర లేచి నడువు!” అన్నాడు,
అపొస్తలుల కార్యాలు 8:4-8
చెదరిపోయినవారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు విని, చూచి అక్కడి జన సమూహాలు ఏకగ్రీవంగా అతడు చెప్పిన విషయాలు శ్రద్ధతో విన్నారు. చాలామందికి పట్టిన మలిన పిశాచాలు పెడ బొబ్బలు పెట్టి వారిలోనుంచి బయటికి వెళ్ళాయి. పక్షవాత రోగులూ కుంటివారూ అనేకులు పూర్తిగా నయమయ్యారు. అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది.
అపొస్తలుల కార్యాలు 19:11-16
పౌలుచేత దేవుడు అసాధారణ అద్భుతాలు చేయించాడు – అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గానీ నడికట్లు గానీ రోగుల దగ్గరకు తెచ్చినప్పుడు రోగాలు వారిని విడిచాయి. దయ్యాలు వారిలో నుంచి వెళ్ళాయి.
అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై “పౌలు ప్రకటించే యేసు పేర ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. యూద ప్రధానయాజి ఒకడైన స్కెవ కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో “యేసంటే నాకు తెలుసు. పౌలు కూడా తెలుసు గానీ మీరెవరు?” అంది. అప్పుడు దయ్యం ఎవరిలో ఉన్నదో అతడు వారిమీద ఎగిరి దూకి వారిని అణచివేసి ఓడగొట్టాడు గనుక గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు.
అపొస్తలుల కార్యాలు 28:8-9
పొప్లి తండ్రి జ్వరంతో, రక్తవిరేచనాలతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. పౌలు లోపలికి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తరువాత అతనిమీద చేతులుంచి అతణ్ణి బాగు చేశాడు. ఇలా జరిగిన తరువాత ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు.
కొరింతువారికి లేఖ 1 12:9
ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి.
కొరింతువారికి లేఖ 1 12:29-30
అందరూ క్రీస్తురాయబారులు కారు గదా. అందరు ప్రవక్తలు కారు గదా. అందరూ ఉపదేశకులు కారు గదా. అందరూ అద్భుతాలు చేసేవారు కారు గదా. అందరూ రోగులను బాగు చేసే కృపా వరాలు గలవారు కారు గదా. అందరూ భాషలు మాట్లాడేవారు కారు గదా. అందరూ భాషల అర్థం చెప్పేవారు కారు గదా.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
తిమోతికి లేఖ 1 5:23
ఇకనుంచి నీళ్ళు మాత్రమే త్రాగక, నీ కడుపుకోసం, తరచుగా వచ్చే జబ్బులకోసం కొంచెం ద్రాక్షరసం కూడా వినియోగించు.
తిమోతికి లేఖ 2 4:20
ఎరస్తస్ కొరింతులో ఆగిపోయాడు. త్రోఫిమస్ అనారోగ్యంగా ఉన్నాడు. నేనతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
యాకోబు లేఖ 5:14-15
మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.
భవిష్యత్తులో ఏమి సంభవిస్తుంది?
యేసు మరలా భూమి మీదకు తిరిగి వస్తాడు
మత్తయి శుభవార్త 24:29-44
“ఆ రోజుల బాధ అయిపోయిన వెంటనే సూర్య మండలాన్ని చీకటి కమ్ముతుంది. చంద్రబింబం కాంతి ఇవ్వదు. ఆకాశంనుంచి చుక్కలు రాలుతాయి. ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. అప్పుడు మానవ పుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు భూమిమీద ఉన్న అన్ని జాతులవారు గుండెలు బాదుకొంటారు, మానవ పుత్రుడు ఆకాశ మేఘాలమీద బలప్రభావాలతో, మహా మహిమా ప్రకాశంతో రావడం చూస్తారు. ఆయన తన దేవదూతలను గొప్ప బూరధ్వనితో పంపుతాడు. వారు ఆయన ఎన్నుకొన్న వారిని నలుదిక్కులనుంచీ ఆకాశం ఆ చివరనుంచి ఈ చివరవరకు సమకూరుస్తారు.
“అంజూరచెట్టు ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా తయారై ఆకులు పెట్టినప్పుడు వసంతకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది. అలాగే ఈ సంగతులన్నీ జరగడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలోనే, తలుపుల దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. మీతో నేను ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఎంత మాత్రమూ గతించదు. ఆకాశం, భూమి గతిస్తాయి గానీ నా మాటలు ఎన్నటికీ గతించవు.
“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడోమనిషికీ తెలియదు. పరలోక దేవదూతలకూ తెలియదు. నా తండ్రికి మాత్రమే తెలుసు. మానవపుత్రుని రాకడ నోవహు రోజులలాగే ఉంటుంది. ఎలా అంటే, జలప్రళయానికి ముందు రోజుల్లో నోవహు ఓడలోకి వెళ్ళే రోజు వరకూ ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు. జల ప్రళయం వచ్చి వారందరినీ తీసుకుపోయేవరకు వారు గ్రహించలేదు. మానవ పుత్రుని రాకడ అలాగే ఉంటుంది. అప్పుడు ఇద్దరు పురుషులు పొలంలో ఉంటారు. ఒకణ్ణి తీసుకుపోవడం, మరొకణ్ణి విడిచిపెట్టడం జరుగుతుంది. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. ఒకతెను తీసుకుపోవడం, ఒకతెను విడిచిపెట్టడం జరుగుతుంది.
“మీ ప్రభువు ఏ గడియ వస్తాడో మీకు తెలియదు గనుక, మెళుకువగా ఉండండి. ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడు. మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.
యోహాను శుభవార్త 14:1-3
“మీ హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద కూడా నమ్మకం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను.
అపొస్తలుల కార్యాలు 1:10-11
ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశంవైపు తేరి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఇలా అన్నారు:
“గలలీ మనుషులారా! మీరెందుకు నిలుచుండి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు? మీ దగ్గరనుంచి యేసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది. ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు.”
అపొస్తలుల కార్యాలు 3:19-21
“కనుక పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి! ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా, మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన యేసును ఆయన పంపేలా, మీ పాపాలు నిర్మూలం కావడానికి అలా చేయండి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని లోకారంభం నుంచి దేవుడు తన పవిత్ర ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండాలి.
ఫిలిప్పీవారికి లేఖ 3:20-21
మనమైతే పరలోక పౌరులం. అక్కడనుంచే ముక్తిప్రదాత, రక్షకుడు వస్తాడని ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన సమస్తాన్ని తనకు వశం చేసుకోగల బలప్రభావాన్ని ప్రయోగించి తన దివ్య శరీరాన్ని పోలి ఉండేలా మన దీన శరీరాన్ని మార్చివేస్తాడు.
కొలస్సయివారికి లేఖ 3:4
మన జీవమై ఉన్న క్రీస్తు కనిపించేటప్పుడు మీరూ ఆయనతోకూడా మహిమలో కనిపిస్తారు.
తెస్సలొనీకవారికి లేఖ 1 1:9-10
మీ మధ్యకు మా ప్రవేశం ఎలాంటిదో, మీరు జీవం గల సత్య దేవునికి సేవ చేయడానికీ పరలోకంనుంచి రాబోయే ఆయన కుమారుని కోసం ఎదురు చూడడానికీ ఏవిధంగా విగ్రహాలు విడిచిపెట్టి దేవునివైపు తిరిగారో వారే చెపుతున్నారు. దేవుడు ఆయనను – దేవుని కోపం నుంచి మనలను తప్పిస్తున్న యేసును – చనిపోయిన వారిలో నుంచి లేపాడు.
తెస్సలొనీకవారికి లేఖ 1 3:13
మన ప్రభువైన యేసు క్రీస్తు తన పవిత్రులందరితో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్రత విషయంలో అనింద్యులై ఉండేలా మీ హృదయాలను సుస్థిరం చేస్తాడు గాక!
తెస్సలొనీకవారికి లేఖ 1 4:13–5:11
సోదరులారా, కన్ను మూసినవారిని గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులలాగా మీరు శోకించకూడదు. యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాం గదా. ఆ ప్రకారమే యేసులో కన్నుమూసినవారిని ఆయనతోకూడా దేవుడు తీసుకువస్తాడు. ప్రభువు మాటగా మేము మీకు చెప్పేదేమంటే, ప్రభువు రాకడ వరకూ బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనం కన్ను మూసినవారికంటే ముందరివారంగా ఉండం. ఎలాగంటే, ఆజ్ఞాపూర్వకమైన కేకతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దంతో ప్రభువు తానే పరలోకం నుంచి దిగివస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయినవారు మొదట లేస్తారు. ఆ తరువాత ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి ఇంకా బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనలను వారితోపాటు మేఘాలలో పైకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం. కాబట్టి ఈ మాటలచేత ఒకరినొకరు ఓదార్చుకోండి.
 
సోదరులారా, ఆ కాలాలను సమయాలను గురించి నేను మీకు రాయనక్కరలేదు. రాత్రి పూట దొంగ వచ్చినట్టే ప్రభు దినం వస్తుందని మీకు బాగా తెలుసు. వారు “శాంతి, భద్రత మనకున్నాయి” అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి కాన్పునొప్పులు వచ్చినట్టు హఠాత్తుగా నాశనం వారిమీదికి వచ్చి పడుతుంది. వారు ఏ మాత్రమూ తప్పించుకోరు.
అయితే, సోదరులారా, ఆ దినం దొంగలాగా మీమీదికి రావడానికి మీరు చీకటిలో లేరు. మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రికీ చీకటికీ చెందినవారం కాము. కనుక నిద్రపోయిన ఇతరులలాగా కాక, మత్తులం కాక, మెళకువగా ఉందాం. నిద్రపోయేవారు నిద్రపోయేది రాత్రివేళ. త్రాగి మత్తిల్లేవారు మత్తిల్లేది రాత్రివేళ. మనం పగటికి చెందినవారమై ఉండి మత్తులం కాకుండా ఉందాం, విశ్వాసం, ప్రేమ అనే చాతీ కవచం, విముక్తి కోసమైన ఆశాభావం అనే శిరస్త్రాణం ధరించుకొందాం. ఎందుకంటే, దేవుడు మనలను నియమించినది మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందడానికే గాని కోపానికి కాదు. మనం కన్ను తెరచి ఉన్నా కన్ను మూసినా తనతో బ్రతకాలని క్రీస్తు మనకోసం చనిపోయాడు. అందుచేత మీరిప్పుడు చేస్తున్న విధంగానే ఒకరికొకరు ప్రోత్సాహం, అభివృద్ధి కలిగించుకోండి.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:6-10
దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు. ఆయన తన పవిత్ర ప్రజలో మహిమ పొందడానికి తనను నమ్మినవారందరిలో ఆశ్చర్య కారణంగా ఉండడానికి ఆ దినంలో వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గదా.
తెస్సలొనీకవారికి లేఖ 2 2:1-4
ఇప్పుడు, సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ, ఆయన దగ్గరకు మనం సమకూడడం గురించి ఒక మాట: క్రీస్తు దినం వచ్చిందని ఏదైనా ఆత్మవల్ల వచ్చిన మాటచేత గానీ, వార్తచేత గానీ, మా దగ్గరనుంచి వచ్చినట్టు ఉన్న ఉత్తరంచేత గానీ తొందరపడి మనసులో ఆందోళన చెందకండి, కంగారుపడకండి అని మిమ్ములను వేడుతున్నాం. ఏ విధంచేతనైనా ఎవరూ మిమ్ములను మోసగించకుండా చూచుకోండి. మొదట తిరుగుబాటు లేచి “అపరాధ మనిషి” వెల్లడి అయ్యేవరకూ క్రీస్తు దినం రాదు. వాడు నాశనపుత్రుడు. “దేవుడు” అనే పేరు ఉన్న ప్రతిదానినీ, మనుషులు పూజించే ప్రతిదానినీ వాడు ఎదిరిస్తూ దానంతటికీ పైగా తనను హెచ్చించుకొంటాడు, దేవుడుగా తనను ప్రదర్శించుకొంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు.
తిమోతికి లేఖ 1 6:13-15
సమస్తానికి జీవం పోసే దేవుని సమక్షంలో, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యం చెప్పిన క్రీస్తు యేసు సమక్షంలో నీకు ఈ ఆదేశం ఇస్తున్నాను: మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షం అయ్యేవరకు ఆజ్ఞను నిష్కళంకంగా అనింద్యంగా పాటించు.
ఏకైక దివ్య పరిపాలకుడైనవాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
తిమోతికి లేఖ 2 4:8
ఇకమీదట నీతిన్యాయాల కిరీటం నాకోసం ఉంచబడి ఉంది. ఆ రోజున ప్రభువు – న్యాయవంతుడైన ఆ న్యాయాధిపతి – దానిని నాకిస్తాడు. నాకే కాదు, ఆయన ప్రత్యక్షత అంటే ప్రేమభావం గలవారందరికీ ఇస్తాడు.
హీబ్రూవారికి లేఖ 9:28
అలాగే క్రీస్తు కూడా ఒకే సారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తనకోసం ఎదురు చూచేవారికి ముక్తి ప్రసాదించడానికే రెండో సారి కనిపిస్తాడు.
పేతురు లేఖ 2 3:1-18
ప్రియ సోదరులారా, ఈ రెండో ఉత్తరం మీకిప్పుడు రాస్తున్నాను. రెండు ఉత్తరాలలో మీకు జ్ఞాపకం చేసి మీ పవిత్ర మనసులను పురికొలుపుతున్నాను. గతంలో పవిత్ర ప్రవక్తలు పలికిన మాటలు, ప్రభువైన రక్షకుని రాయబారులమైన మేమిచ్చిన ఆజ్ఞ మీరు మనసు పెట్టాలని నా ఉద్దేశం.
మొట్టమొదట ఇది తెలుసుకోండి – చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించే పరిహాసకులు వస్తారు. “ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయింది? పూర్వీకులు కన్ను మూసినప్పటినుంచి, సృష్టి ఆరంభంనుంచి జరిగినట్టే అంతా జరుగుతూ ఉంది గదా” అని వారు చెపుతారు.
అయితే వారు బుద్ధిపూర్వకంగా మరచిపోయే విషయమేమిటంటే, చాలా కాలం క్రిందట దేవుని వాక్కువల్లే ఆకాశం ఉనికిలో ఉంది, భూమి నీళ్ళలోనుంచి నీళ్ళలో స్థిరంగా ఉంది. నీళ్ళవల్ల కూడా అప్పటి లోకం వరదలో మునిగి నాశనమయింది. కాని ఇప్పటి ఆకాశాలనూ భూమినీ అదే వాక్కువల్ల భద్రమై భక్తిలేనివారి తీర్పు, నాశనం జరిగే రోజు వరకు మంటలకోసం ఉంచబడి ఉన్నాయి.
అయితే, ప్రియ సోదరులారా, ఈ ఒక విషయం మరచిపోకండి: ప్రభువుకు ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలలాగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజులాగా ఉన్నాయి. ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక. అయితే ప్రభు దినం రాత్రివేళ దొంగ వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఆకాశాలు హోరుమని గతించిపోతాయి; పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి, భూలోకం, దాని మీది పనులు కాలిపోతాయి.
ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి గనుక మీరు పవిత్ర ప్రవర్తన, భక్తి విషయంలో ఎలాంటివారై ఉండాలో! దేవుని దినం కోసం ఆశతో ఎదురుచూస్తూ దాని రాకడ శీఘ్రతరం చేస్తూ ఉండాలి. ఆ దినాన ఆకాశాలు మండుతూ లయమైపోతాయి. పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి. అయితే ఆయన వాగ్దానాన్ని బట్టి మనం కొత్త ఆకాశాలకోసం, కొత్త భూమికోసం ఎదురు చూస్తున్నాం. వాటిలో న్యాయం నివాసముంటుంది.
ప్రియ స్నేహితులారా, మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక ఆయన దృష్టిలో కళంకం లేనివారై నింద లేని విధంగా, శాంతితో కనబడడానికి శ్రద్ధాసక్తులు వహించండి. మన ప్రభు సహనం రక్షణకోసమే అని భావించండి. ఈ విధంగా మన ప్రియ సోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం మీకు రాశాడు. అతడు తన ఉత్తరాలన్నిటిలో ఈ సంగతులను గురించి చెప్పేవాడు. అయితే వాటిలో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం. ఉపదేశం పొందనివారూ నిలకడలేని వారూ తక్కిన లేఖనాలను వక్రం చేస్తున్నట్టే వీటిని కూడా తమ నాశనానికి వక్రం చేస్తున్నారు.
ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు గనుక నీతి నియమం లేనివారి తప్పు చేత తొలగిపోయి మీ స్థిరమైన స్థితి నుంచి పడకుండా జాగ్రత్తగా చూచుకోండి. మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు కృపలో, జ్ఞానంలో పెరుగుతూ ఉండండి. ఆయనకే మహిమ ఇప్పుడూ అనంత కాలమూ ఉంటుంది గాక! తథాస్తు.
యోహాను లేఖ 1 3:1-3
మనం దేవుని పిల్లలమని అనిపించుకొనేలా తండ్రి మనమీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి! ఈ కారణం చేత లోకం మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అయితే మనమిక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు గాని ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు. ఆయన మీద ఈ ఆశాభావం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను పవిత్రం చేసుకొంటారు.
ప్రకటన 1:7
ఇడుగో, ఆయన మేఘాలతో వస్తున్నాడు, ప్రతి కన్నూ ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచినవారు కూడా ఆయనను చూస్తారు. భూజనాలన్నీ ఆయనను బట్టి గుండెలు బాదుకొంటారు. అవును, తథాస్తు.
ప్రకటన 22:12-13
“ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసినదాని ప్రకారమే ప్రసాదించడానికి నేనిచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉంటుంది. నేను ‘అల్ఫా’ను, ‘ఒమేగ’ను, ఆదిని, అంతాన్ని, మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
దేవుడు అందరినీ యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు
మత్తయి శుభవార్త 7:21-23
“నన్ను ‘ప్రభూ, ప్రభూ!’ అనే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో ఇలా అంటారు: ‘ప్రభూ, ప్రభూ! మేము నీ పేర ప్రవక్తలుగా ప్రకటించలేదా? నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ పేర అనేక అద్భుతాలు చేయలేదా? అప్పుడు నేను వాళ్ళతో ఇలా అంటాను: ‘అక్రమకారులారా, మీరు ఎన్నడూ నేనెరిగినవారు కారు! నా దగ్గరనుంచి పొండి!’
మత్తయి శుభవార్త 16:24-27
అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఎవరైనా సరే నా వెంట రావాలనుకొంటే, తనను తిరస్కరించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి. తన కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దానిని కనుక్కొంటాడు. ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే అతనికి లాభమేమి? మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు? మానవ పుత్రుడు తన తండ్రి ప్రతాపంతోనూ దేవదూతలతోనూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ వారి పనులప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
మత్తయి శుభవార్త 25:31-46
“మానవ పుత్రుడు తన మహిమతోనూ పవిత్ర దేవ దూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు జనాలన్నిటినీ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది. గొల్లవాడు మేకలలోనుంచి గొర్రెలను వేరు చేసినట్టే ఆయన వారిని ఒకరి దగ్గరనుంచి ఒకరిని వేరు చేస్తాడు. ‘గొర్రెలను’ తన కుడి ప్రక్కన, ‘మేకలను’ ఎడమ ప్రక్కన ఉంచుతాడు.
“అప్పుడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు: ‘నా తండ్రిచేత ఆశీస్సులు పొందిన వారలారా, రండి! ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులు కండి. ఎందుకంటే, నాకు ఆకలి వేసింది, మీరు నాకు తినడానికి ఇచ్చారు. దాహం వేసింది, త్రాగడానికి ఇచ్చారు. పరాయివాడుగా ఉన్నాను, మీరు నన్ను లోపల చేర్చుకొన్నారు. బట్టలు లేనప్పుడు నాకు బట్టలిచ్చారు. నాకు జబ్బు చేసింది, నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఖైదులో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు.’
“అప్పుడు ఆ న్యాయవంతులు ఆయనకిలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూచి భోజనం పెట్టాం? ఎప్పుడు దాహం వేయడం చూచి నీకు త్రాగడానికి ఇచ్చాం? ఎప్పుడు నీవు పరాయివాడుగా ఉండడం చూచి లోపల చేర్చుకొన్నాం? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూచి నీకు బట్టలిచ్చాం? ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూచి, నీవు ఖైదులో ఉండడం చూచి నీ దగ్గరికి వచ్చాం?’
“అందుకు రాజు ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. ఈ నా సోదరులలో ఒక అత్యల్పునికి కూడా మీరు చేసినది ఏదైనా నాకూ చేసినట్టే’ అని వారితో జవాబిచ్చి చెపుతాడు.
“అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో ఇలా అంటాడు: ‘శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి! ఎందుకంటే, నాకు ఆకలి వేసింది గానీ మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నాకు దాహం వేసింది గానీ, త్రాగడానికి మీరేమీ నాకివ్వలేదు. పరాయివాడుగా ఉన్నాను. మీరు నన్ను లోపల చేర్చుకోలేదు. బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నాకు జబ్బు చేసినది, నేను ఖైదులో ఉన్నాను. నన్ను చూడడానికి మీరు రాలేదు.
“వారు కూడా ఆయనకు ఇలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీవు ఆకలితో ఉండడం గానీ దాహంతో గానీ పరాయివాడుగా గానీ బట్టలు లేకుండా గానీ జబ్బుగా గానీ ఖైదులో గానీ ఉండడం చూచి నీకు సహాయం చేయలేదు?’ ఆయన వారికిలా జవాబిస్తాడు: ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. వీరిలో అత్యల్పునికి చేయనిది ఏదైనా నాకూ చేయనట్టే.’
“వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. న్యాయవంతులు శాశ్వత జీవంలో ప్రవేశిస్తారు.
యోహాను శుభవార్త 3:18-21
ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు. ఆ శిక్షావిధికి కారణం ఇదే – వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు. దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు. గానీ సత్యాన్ని అనుసరించి చేసేవాడు తన పనులు దేవుని మూలంగా జరిగాయని వెల్లడి అయ్యేలా వెలుగు దగ్గరికి వస్తాడు.”
యోహాను శుభవార్త 5:24-29
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
“ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
అపొస్తలుల కార్యాలు 17:30-31
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
రోమా వారికి లేఖ 2:1-11
అందుచేత ఓ మానవుడా, నీవెవరైనా సరే ఇతరులకు తీర్పు తీర్చావు అంటే సాకు చెప్పలేని వ్యక్తివై ఉన్నావు. మరొకరికి దేనిలో తీర్పు తీరుస్తావో దానిలో నీమీద నీవే నేరం మోపుకొన్నట్టే. ఎందుకంటే, తీర్పు తీర్చే నీవు ఆ పనులే చేస్తున్నావు. అవి చేసేవారికి వ్యతిరేకంగా ఉన్న దేవుని తీర్పు సత్య సమ్మతమే అని మనకు తెలుసు.
ఓ మానవుడా, అవి చేసేవారికి తీర్పు తీరుస్తూ అవే చేస్తూ ఉన్న నీవు దేవుని తీర్పు తప్పించుకొంటానని అనుకొంటున్నావా? నీవు పశ్చాత్తాపపడడానికి దేవుని దయ దారి తీస్తుందని నీకు తెలియదా? ఆయన దయాసమృద్ధినీ సహనాన్నీ ఓర్పునూ చిన్నచూపు చూస్తున్నావా? దేవుని కోప దినం కోసం – ఆయన న్యాయమైన తీర్పు బయలుపడే ఆ దినం కోసం – నీ కాఠిన్యాన్నిబట్టీ పశ్చాత్తాపపడని నీ హృదయాన్ని బట్టీ నీకు నీవే దేవుని కోపాన్ని పోగు చేసుకొంటూ ఉన్నావు. ఆయన ప్రతి ఒక్కరికీ వారి వారి చర్యలప్రకారం ప్రతిఫలమిస్తాడు. ఓర్పుతో మేలు చేస్తూ ఉండడం వల్ల దేవుడిచ్చే మహిమనూ గౌరవాన్నీ నశించని స్థితినీ వెదికేవారికి శాశ్వత జీవాన్ని ఇస్తాడు. కానీ ఎదురాడుతూ సత్యానికి లోబడకుండా దుర్మార్గానికి లొంగినవారిమీదికి కోపం, ఆగ్రహం వస్తాయి. దుష్టత్వం చేసే ప్రతి ఒక్కరికి బాధ, యాతన వస్తుంది. మొదట యూదులకు, తరువాత గ్రీసుదేశస్థులకు కూడా అంతే. అయితే మంచి చేసే ప్రతి ఒక్కరికీ మొదట యూదులకు, తరువాత గ్రీసు దేశస్థులకు కూడా మహిమ, గౌరవం, శాంతి కలుగుతాయి.
దేవునికి పక్షపాతమేమీ లేదు.
రోమా వారికి లేఖ 14:10-12
అయితే మీరు మీ సోదరునికి తీర్పు తీర్చడమెందుకని? లేదా, మీ సోదరుణ్ణి తృణీకరించడం ఎందుకని? మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతాం. ఇలా రాసి ఉంది: “ప్రభువు చెప్పేదేమిటంటే, నా జీవంతోడు, ప్రతి మోకాలూ నా ముందు వంగుతుంది, ప్రతి నాలుకా దేవున్ని ఒప్పుకొంటుంది.” కనుక మనలో ప్రతి ఒక్కరూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసివస్తుంది.
కొరింతువారికి లేఖ 1 3:10-15
దేవుడు నాకు ప్రసాదించిన కృపప్రకారం నేను నేర్పుగల నిర్మాతనై పునాది వేశాను. మరొకడు దానిమీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కట్టే ప్రతి ఒక్కరూ తాను ఎలా నిర్మిస్తున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. వేసిన ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది గాక వేరేది ఎవ్వరూ వేయలేరు. ఎవరైనా ఈ పునాదిమీద బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, గడ్డి, కసవు – ఇలాంటివాటితో నిర్మిస్తే, ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఆ రోజు దాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అది మంటలచేత వెల్లడి అవుతుంది. ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో ఆ మంటలు పరీక్షిస్తాయి. ఎవరైనా పునాదిమీద కట్టినది నిలిస్తే, అతనికి ప్రతిఫలం లభిస్తుంది. తాను కట్టినది కాలిపోతే ఆ వ్యక్తి నష్టం అనుభవిస్తాడు. తన మట్టుకు తనకు విముక్తి ఉంటుంది గాని అది మంటలద్వారా వచ్చినట్టే ఉంటుంది.
కొరింతువారికి లేఖ 1 4:5
ఆ కాలం రాకముందే ప్రభువు వచ్చేంతవరకు దేనికీ తీర్పు తీర్చకండి. ఆయన చీకటిలో దాగివున్నవాటిని వెలుగులోకి తీసుకువస్తాడు, మనుషుల అంతరంగాలలో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన మెప్పు దేవునివల్ల కలుగుతుంది.
కొరింతువారికి లేఖ 2 5:9-10
అందుచేత మేము పెట్టుకొన్న లక్ష్యం ఏమిటంటే, శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే. ఎందుకంటే, మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు – చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే – చేసిన వాటి ప్రకారం పొందాలి.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:5-10
దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువు గా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి తగినవారుగా లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే.
దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు. ఆయన తన పవిత్ర ప్రజలో మహిమ పొందడానికి తనను నమ్మినవారందరిలో ఆశ్చర్య కారణంగా ఉండడానికి ఆ దినంలో వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గదా.
హీబ్రూవారికి లేఖ 9:27-28
మనుషులు ఒకే సారి చనిపోవాలనే నియమం ఉంది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా ఒకే సారి అనేకుల అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తనకోసం ఎదురు చూచేవారికి ముక్తి ప్రసాదించడానికే రెండో సారి కనిపిస్తాడు.
హీబ్రూవారికి లేఖ 10:26-31
ఎందుకంటే, సత్యాన్ని గురించి తెలుసుకొన్న తరువాత మనం బుద్ధి పూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే ఇకమీదట పాపాలకోసం బలి ఉండదు. అప్పుడు మిగిలినదేమంటే, న్యాయమైన తీర్పు గురించీ దేవుని విరోధులను దహించివేసే అగ్నిజ్వాలల్లాంటి ఆగ్రహాన్ని గురించీ భయంతో ఎదురు చూడడమే. ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఇద్దరి, ముగ్గురి సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది. అలాంటప్పుడు తన పాదాలక్రింద దేవుని కుమారుణ్ణి త్రొక్కివేసి తనను పవిత్రపరచిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించినవాడికింకా ఎంత ఎక్కువ కఠినమైన దండనకు తగినవాడని ఎంచబడతాడో! ఏమనుకొంటారు? “పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా! జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
పేతురు లేఖ 1 1:17
ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి.
పేతురు లేఖ 1 4:3-5
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
ప్రకటన 20:11-15
అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.
ఎవరైతే రక్షించబడతారో వారు పరలోకంలో శాశ్వతకాలం జీవిస్తారు
లూకా శుభవార్త 12:32-34
“చిన్న మందా, భయంతో ఉండకు, తన రాజ్యాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. మీకున్నదాన్ని అమ్మి దానధర్మాలు చేయండి. పరలోకంలో మీకు పాతగిలిపోని డబ్బు సంచులు తయారు చేసుకోండి. అయిపోకుండా ఉండే సొమ్ము సమకూర్చుకోండి. అక్కడ దొంగ ఎవడూ దగ్గరకు రాడు, చిమ్మటలు కొట్టవు. మీ సొమ్ము ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
యోహాను శుభవార్త 14:1-3
“మీ హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద కూడా నమ్మకం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను.
కొరింతువారికి లేఖ 2 5:1-8
భూమిమీద మన నివాసమైన గుడారం నాశనమైపోతే దేవునివల్ల అయిన కట్టడం, చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు. పరలోకసంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం. నిజంగా దానిని ధరించు కొన్నప్పుడు మనం దిగంబరంగా కనబడము. “గుడారం”లో ఉన్న మనం భారంక్రింద మూలుగుతూ ఉన్నాం. ఇది తొలగించబడాలని కాదు గాని ఆ నివాసాన్ని ధరించు కోవాలని – చావుకు లోనయ్యేది జీవంవల్ల మింగివేయబడాలని మన ఆశ.
ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే. ఈ కారణంచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం. మనం శరీరంలో నివాసమున్నంత కాలం ప్రభువుతో లేమని తెలుసు – కంటికి కనిపించేవాటివల్ల కాదు గాని విశ్వాసంవల్లే నడుచుకొంటున్నాం. నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటే శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో, ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం.
ఫిలిప్పీవారికి లేఖ 1:23
నేను ఈ రెంటిమధ్య చిక్కుబడి ఉన్నాను – లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
పేతురు లేఖ 1 1:4-5
నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికీ. ఈ వారసత్వం మీ కోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది. కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం, నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి.
ప్రకటన 4:1-11
ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో తెరచి ఉన్న ఒక తలుపు కనిపించింది. నేను మొదట విన్న స్వరం బూర ధ్వని లాగే నాతో మాట్లాడడం విన్నాను. ఆ స్వరం “ఇక్కడికి ఎక్కి రా, తరువాత ఉండవలసినవి నీకు చూపుతాను” అంది. వెంటనే నేను దేవుని ఆత్మవశుడనయ్యాను. అప్పుడు పరలోకంలో నిలిచి ఉన్న సింహాసనాన్ని, సింహాసనం మీద కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూశాను. అక్కడ కూర్చుని ఉన్న ఆ వ్యక్తి చూడడానికి సూర్య కాంతం లాగా, కెంపులాగా ఉన్నాడు. సింహాసనాన్ని రంగుల విల్లు ఒకటి చుట్టుకొని ఉంది. అది పచ్చరాయిలాగా కనిపించింది. సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాలమీద తెల్లని దుస్తులు తొడుక్కొన్న ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉండడం చూశాను. వారి తలలమీద బంగారు కిరీటాలు ఉన్నాయి.
సింహాసనంనుంచి మెరుపులూ ఉరుములూ శబ్దాలూ బయలుదేరుతూ ఉన్నాయి. సింహాసనం ఎదుట ఏడు కాగడాలు మండుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. సింహాసనానికి ఎదురుగా స్ఫటికాన్ని పోలిన గాజు సముద్రం ఉంది. సింహాసనం మధ్య, దాని చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందూ వెనుకా అంతటా కండ్లు ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలాంటిది. రెండో ప్రాణి కోడెదూడలాంటిది. మూడో ప్రాణి మనిషి ముఖంలాంటి ముఖం గలది. నాలుగో ప్రాణి ఎగురుతూ ఉన్న గరుడపక్షిలాంటిది. నాలుగు ప్రాణులలో ప్రతిదానికీ ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ, రెక్కలక్రింద కూడా, కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు మానక ఇలా అంటూ ఉన్నాయి: “పూర్వముండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అమిత శక్తిగల ప్రభువూ అయిన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు!”
శాశ్వతంగా జీవిస్తూ సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఆ ప్రాణులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎదుట సాగిలపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఈయనను ఆరాధిస్తారు. తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి ఇలా అంటారు:
“ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”
ప్రకటన 21:1-4
అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి నాకు కనిపించాయి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేదు. నేను – యోహానును – పవిత్ర నగరమైన కొత్త జెరుసలం కూడా చూశాను. అది తన భర్తకోసం అలంకరించుకొన్న పెళ్ళికూతురులాగా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి వస్తూ ఉంది.
అప్పుడు పరలోకంనుంచి ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను: “ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో నివసిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు. దేవుడు వారి కళ్ళలో నుంచి కన్నీళ్ళన్నీ తుడిచివేస్తాడు. అప్పటినుంచి చావు, దుఃఖం, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు. పూర్వమున్న విషయాలు గతించిపోయాయి.”
ప్రకటన 21:22–22:5
నగరంలో ఏ దేవాలయమూ నాకు కనిపించలేదు. దాని దేవాలయం అమిత శక్తిగలవాడూ ప్రభువూ అయిన దేవుడే, గొర్రెపిల్లే. నగరం మీద ప్రకాశించడానికి సూర్యుడూ చంద్రుడూ దానికి అక్కర లేనే లేదు. ఎందుకంటే, దేవుని మహిమాప్రకాశమే దానిలో వెలిగిస్తూ ఉంది. గొర్రెపిల్లే దానికి దీపం. దాని వెలుగులో రక్షించబడ్డ జాతులు నడుస్తాయి. నగరంలోకి భూరాజులు తమ వైభవం, ఘనత తీసుకువస్తారు. అక్కడ రాత్రి అంటూ ఏమీ ఉండదు గనుక పగలు దాని ద్వారాలు ఎంత మాత్రమూ మూసి ఉండవు. దానిలోకి వారు జాతుల వైభవం, ఘనత తెస్తారు. దానిలోకి అపవిత్రమైనదేదీ, అసహ్య కార్యం చేసేవారూ అబద్ధమాడేవారూ రానే రారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉన్నవారే దానిలో ప్రవేశిస్తారు.
 
అప్పుడతడు స్ఫటికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవజల నది నాకు చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు. వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది. అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు.
ప్రకటన 22:14-15
జీవ వృక్షానికి హక్కుగలవారై ద్వారాల గుండా నగరంలో ప్రవేశించేలా ఆయన ఆదేశాల ప్రకారం ప్రవర్తించే వారు ధన్యజీవులు. నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు.
ఎవరైతే రక్షించబడలేదో వారు నరకంలో ఎల్లకాలం జీవిస్తారు
మత్తయి శుభవార్త 10:28
ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి. శరీరాన్నీ ఆత్మనూ కూడా నరకంలో నాశనం చేయగలవానికి, ఆయనకే భయపడండి.
మత్తయి శుభవార్త 13:41-42,47-50
మానవ పుత్రుడు తన దేవదూతలను పంపుతాడు. వారు తొట్రుపాటుకు కారణమైన ప్రతిదానినీ, దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలోనుంచి పోగుచేస్తారు. వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. “ఇంకొకటి – వల సరస్సులో వేసి ఉంది. దానిలో అన్ని రకాల చేపలు పడ్డాయి. వల నిండినతరువాత దానిని ఒడ్డుకు లాగారు. కూర్చుని మంచి చేపలు బుట్టల్లో వేసుకొన్నారు, పనికిమాలినవి అవతల పారవేశారు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. ఈ యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, న్యాయవంతుల మధ్యనుంచి చెడ్డవారిని వేరుపరుస్తారు. వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
మత్తయి శుభవార్త 25:41
“అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో ఇలా అంటాడు: ‘శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి!
లూకా శుభవార్త 16:23-26
అతడు పాతాళంలో యాతనపడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రాహాము, అబ్రాహాము ప్రక్కన ఉన్న లాజరు కనబడ్డారు.
“అప్పుడు ధనవంతుడు ‘తండ్రి అబ్రాహాము! నా మీద జాలి చూపు! ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను! గనుక తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించు!’ అని మొరపెట్టి చెప్పాడు.
అందుకు అబ్రాహాము ‘కొడుకా, నీవు బ్రతికినన్నాళ్ళూ మంచివాటిని అనుభవించావు. లాజరైతే కష్టాలు అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో! ఇప్పుడితడు ఓదార్పు పొందుతున్నాడు, నీవేమో అల్లాడిపోతున్నావు. ఇవన్నీ కాక మరో విషయం – నీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడనుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకొనేవారికి సాధ్యం కాదు, అక్కడివారికి మా దగ్గరకు దాటిరావడం కూడా సాధ్యం కాదు’ అన్నాడు.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:9
వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు.
ప్రకటన 20:10-15
వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని మృగమూ కపట ప్రవక్తా ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు.
అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.
ప్రకటన 21:8
“కానీ పిరికివారు, విశ్వాసం లేనివారు, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధికులంతా అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు.”
వివిధరకాలైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ వాక్యభాగాలు తెలియ చేస్తాయి
దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసు కోవాలి అంటే ఈ వాక్యభాగాలను చదవండి
అపొస్తలుల కార్యాలు 14:14-17
ఈ సంగతి విని రాయబారులైన పౌలు బర్నబాలు తమ బట్టలు చింపుకొని గుంపులలోకి చొరబడి బిగ్గరగా ఇలా అన్నారు: “అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. గత కాలాలలో ఆయన అన్ని జాతులవారిని తమ తమ మార్గాలలో నడవనిచ్చాడు. అయినా ఆయన తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎలాగంటే మనకు ఆకాశంనుంచి వానలూ ఫలవంతమైన రుతువులూ ప్రసాదిస్తూ ఆహారంతోనూ ఉల్లాసంతోనూ మన హృదయాలను తృప్తిపరుస్తూ మంచి చేస్తూ వచ్చాడు.”
అపొస్తలుల కార్యాలు 17:22-31
అరేయోపగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. నేను అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది. ‘తెలియబడని దేవునికి’ అని దానిమీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయననే మీకు ప్రకటిస్తున్నాను. జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
“భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. వారు ప్రభువును వెదకాలని – తడవులాడి ఆయనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు. ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మీ కవులలో కొందరు చెప్పినట్టు ‘మనం ఆయన సంతానం.’ మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
రోమా వారికి లేఖ 1:18-23
దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది. ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
రోమా వారికి లేఖ 11:33-36
ఆహా, దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి! ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చిన వాడెవడు? సమస్తమూ ఆయననుంచీ, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
కొరింతువారికి లేఖ 1 8:4-6
అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు), మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
మార్కు శుభవార్త 12:29-30
యేసు అతడికి “ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఇది: ‘ఇస్రాయేల్ ప్రజలారా, వినండి. ప్రభువు మన దేవుడు, ప్రభువు ఒక్కడే. హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా, బలమంతటితో మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.
యోహాను శుభవార్త 4:23-24
నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. అలాంటి వారు తనను ఆరాధించాలని తండ్రి వారిని వెదకుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి.”
తిమోతికి లేఖ 1 1:17
శాశ్వతుడైన రాజూ ఎన్నడూ మృతి చెందని అగోచరుడూ అయిన దేవునికి ఘనత, మహిమ శాశ్వతంగా ఉంటాయి గాక! తథాస్తు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు.
తిమోతికి లేఖ 1 6:15-16
ఏకైక దివ్య పరిపాలకుడైనవాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవ్వరూ సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్థ్యుడు ఆయన మాత్రమే. ఆయనను ఏ మనిషీ చూడలేదు, చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావం ఉంటాయి గాక! తథాస్తు.
హీబ్రూవారికి లేఖ 4:13
సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి సమస్తమూ తేటతెల్లంగా, బట్టబయలుగా కనిపిస్తుంది. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి.
హీబ్రూవారికి లేఖ 10:30-31
“పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా! జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
యాకోబు లేఖ 1:17
ప్రతి మంచి ఈవీ, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరమూ పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త అయిన తండ్రినుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు.
పేతురు లేఖ 1 1:14-17
విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే, “నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.
ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి.
యోహాను లేఖ 1 1:5
ఆయన చెప్పగా విని మేము మీకు ప్రకటించే సందేశమేమంటే, దేవుడు వెలుగు, ఆయనలో చీకటి అంటూ ఏమీ లేదు.
యోహాను లేఖ 1 4:7-12
ప్రియ సోదరులారా, ఒకరినొకరు ప్రేమతో చూచుకొందాం. ఎందుకంటే ప్రేమ దేవునికి చెందేది. ప్రేమతో చూచే ప్రతి ఒక్కరూ దేవునివల్ల జన్మించినవారు, దేవుణ్ణి ఎరిగినవారు. దేవుడు ప్రేమస్వరూపి గనుక ప్రేమతో చూడనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు. ప్రియ సోదరులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు గనుక మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఏ మనిషీ దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. మనం ఒకరినొకరం ప్రేమతో చూస్తూ ఉంటే దేవుడు మనలో ఉంటున్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉంది.
యోహాను లేఖ 1 4:16
దేవునికి మనమీద ఉన్న ప్రేమను మనం తెలుసుకొన్నాం, నమ్ముకొన్నాం. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలో ఉంటున్నవాడు దేవునిలో ఉంటున్నాడు, దేవుడు అతనిలో ఉంటున్నాడు.
కొరింతువారికి లేఖ 2 1:3
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగుతుంది గాక. ఆయన కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణ అనుగ్రహించే దేవుడు.
యూదా లేఖ 24—25
మీరు తొట్రుపడకుండా మిమ్ములను కాపాడడానికీ తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టడానికీ సామర్థ్యం గల మన ముక్తిప్రదాత, ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి మహిమ, ఘనపూర్ణత, ప్రభుత్వం, అధికారం ఇప్పుడునూ శాశ్వతంగానూ ఉంటాయి గాక! తథాస్తు.
ప్రకటన 4:8-11
నాలుగు ప్రాణులలో ప్రతిదానికీ ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ, రెక్కలక్రింద కూడా, కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు మానక ఇలా అంటూ ఉన్నాయి: “పూర్వముండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అమిత శక్తిగల ప్రభువూ అయిన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు!”
శాశ్వతంగా జీవిస్తూ సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఆ ప్రాణులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎదుట సాగిలపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఈయనను ఆరాధిస్తారు. తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి ఇలా అంటారు:
“ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”
ప్రకటన 15:3-4
వారు దేవుని దాసుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా! అమిత శక్తిగలవాడా! నీ పనులు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. పవిత్రులకు రాజా! నీ త్రోవలు న్యాయమైనవి, యథార్థమైనవి. ప్రభూ! నీవు మాత్రమే పవిత్రుడవు గనుక నీకు ఎవరు భయపడకుండా ఉంటారు? నీ పేరును ఎవరు మహిమపరచకుండా ఉంటారు? నీ తీర్పులు వెల్లడి అయ్యాయి, గనుక జనాలన్నీ వచ్చి నీ సన్నిధిలో ఆరాధిస్తారు” అన్నారు.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మరింత ఎక్కువగా తెలుసు కోవాలి అంటే ఈ వాక్యభాగాలను చదవండి
యోహాను శుభవార్త 1:1-18
ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడే. ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు.
ఆయనలో జీవం ఉంది. ఈ జీవం మనుషులకు వెలుగు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది గానీ చీకటి దానిని గ్రహించలేదు.
దేవుడు పంపిన మనిషి ఒకడు ఉన్నాడు. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరికీ నమ్మకం కుదరాలని ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి ఒక్కరినీ వెలిగించే వాస్తవమైన వెలుగు. ఆ వెలుగుగా ఉన్న ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయనమూలంగా కలిగిందే. అయినా లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంతదాని దగ్గరికి వచ్చాడు గానీ తన స్వజనం ఆయనను స్వీకరించలేదు. అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు. వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ఛవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.
“వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.
యోహాను ఆయనను గురించి సాక్ష్యం చెపుతూ ఇలా బిగ్గరగా అన్నాడు: “నా తరువాత వచ్చేవాడు నాకు మునుపు ఉన్నవాడు గనుక ఆయన నన్ను మించినవాడని నేను చెప్పినవాడు ఈయనే.”
మేమందరమూ ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందాం. ఎందుకంటే, ధర్మశాస్త్రం మోషేద్వారా ఇవ్వడం జరిగింది; కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగాయి. ఎవరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఒకే ఒక దేవుని కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఆయన దేవుణ్ణి వెల్లడి చేశాడు.
ఫిలిప్పీవారికి లేఖ 2:5-11
క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరూ కలిగి ఉండండి: ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు. గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకొని సేవకుని స్వరూపం ధరించి మనుషుల పోలికలో జన్మించాడు. మనిషి రూపంతో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకొని మరణం పొందడానికి – సిలువ మరణం పొందడానికి కూడా – విధేయుడయ్యాడు.
ఈ కారణంచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు. దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది, తండ్రి అయిన దేవుని మహిమకోసం ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది.
కొలస్సయివారికి లేఖ 1:15-20
ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వసృష్టికి ప్రముఖుడు. ఎందుకంటే ఆయనవల్ల సృష్టిలో అన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఆకాశాలలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడేవి, కనబడనివి, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా – సమస్తాన్నీ ఆయనద్వారా, ఆయనకోసం సృజించడం జరిగింది. ఆయనే అన్నిటికీ పూర్వమున్నవాడు, ఆయనలోనే అన్నీ ఒక దానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. అంతేకాదు శరీరానికి, అంటే, తన సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనే ప్రతిదానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని ఆయనే ఆది, చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవారందరిలోనూ ప్రముఖుడు. ఎందుకంటే, సంపూర్ణత అంతా ఆయనలో ఉండాలని తండ్రి అయిన దేవుని ఇష్టం. క్రీస్తు సిలువమీద చిందిన రక్తంద్వారా సంధి చేసి అన్నిటినీ తనతో సఖ్యపరచుకోవాలని కూడా తండ్రి ఇష్టం. “అన్నీ” అంటే, భూమిమీద ఉండేవీ, పరలోకంలో ఉండేవీ.
కొలస్సయివారికి లేఖ 2:9-10
క్రీస్తులోనైతే దేవుని సర్వ సంపూర్ణత శరీర రూపంలో నివసిస్తూ ఉంది. సర్వాధికారానికీ ప్రభుత్వానికీ పై అధికారి అయిన క్రీస్తులో మీరు సంపూర్ణులు.
హీబ్రూవారికి లేఖ 1:1-14
పూరాతన కాలంలో దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ చివరి రోజులలోనైతే తన కుమారునిద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడుగా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని సృజించాడు కూడా. ఆ కుమారుడు దేవుని మహిమాతేజస్సు, దేవుని స్వభావ స్వరూపం. ఆయన బలప్రభావాలు గల తన వాక్కుచేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసిన తరువాత ఆయన ఉన్నతస్థానంలో మహా ఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు.
దేవదూతలకంటే ఆయన వారసత్వంగా ఎంత శ్రేష్ఠమైన పేరు పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడయ్యాడు కూడా. దేవుడు దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను.” లేదా, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు.”
అంతే కాదు, ఆయన ఆ ప్రముఖుణ్ణి లోకంలోకి మళ్ళీ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి అన్నాడు. దేవదూతలను గురించి ఆయన ఇలా అంటున్నాడు: “తన దూతలను గాలివంటివారుగా, తన సేవకులను మంటలలాంటివారుగా చేసుకొనేవాడు.” తన కుమారునితో అయితే ఇలా అంటున్నాడు: “దేవా! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నీ రాజదండం న్యాయదండం. నీవు న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు. అందుచేత దేవుడు – నీ దేవుడు – నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించాడు”.
కుమారుణ్ణి గురించి ఇంకా అన్నాడు: “ప్రభూ! ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు. ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే. అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు. అవన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి. పైపంచె లాగా వాటిని మడిచివేస్తావు. అవి మార్చబడుతాయి. గానీ నీవు ఒకే తీరున ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతం అంటూ ఉండదు.”
దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీ శత్రువులను నీ పాదాలక్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.”
దేవదూతలంతా ముక్తి వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపబడి సేవ చేస్తున్న ఆత్మలే గదా?
రోమా వారికి లేఖ 1:3-4
నేను యేసు క్రీస్తుకు దాసుణ్ణి, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందినవాణ్ణి, దేవుని శుభవార్తకోసం ప్రత్యేకించబడ్డవాణ్ణి.
దేవుడు తన కుమారుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు.
కొరింతువారికి లేఖ 2 4:4-6
విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గురించిన శుభవార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా అలా చేశాడు. కాబట్టి మేము మమ్ములను ప్రకటించుకోకుండా, ప్రభువైన క్రీస్తు యేసునూ మమ్మల్ని యేసుకోసం మీ దాసులుగానూ ప్రకటిస్తున్నాం. క్రీస్తు ముఖంలో ఉన్న దేవుని మహిమను గురించిన జ్ఞాన కాంతి మనకు ప్రసాదించడానికి, చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమని ఆజ్ఞాపించిన దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు.
లూకా శుభవార్త 1:26-38
ఆమెకు ఆరో నెల అయినప్పుడు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను గలలీలో నజరేతు అనే గ్రామానికి, ఒక కన్య దగ్గరకు పంపాడు. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశికుడు. ఆ కన్య పేరు మరియ. దేవదూత లోపలికి వచ్చి “శుభం! నీవు దయ పొందినదానివి! ప్రభువు నీకు తోడై ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు” అన్నాడు.
అయితే ఆమె ఆయనను చూచినప్పుడు ఆ మాటలకు చాలా కంగారుపడి ఈ అభివందనం ఏమిటో అని తలపోసింది.
అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకు. దేవుని దయ నీకు లభించింది. ఇదిగో విను. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు. ఆయన గొప్పవాడై ఉంటాడు. ఆయనను సర్వాతీతుని కుమారుడు అనడం జరుగుతుంది. ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు.”
దేవదూతను మరియ “నేను ఏ పురుషుణ్ణి ఎరగను – ఇదెలా జరుగుతుంది?” అని అడిగింది.
దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది. ఇదిగో విను. మీ చుట్టం ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భంతో ఉంది, కొడుకును కనబోతుంది. గొడ్రాలనబడ్డ ఆమెకు ఇది ఆరో నెల. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.”
అందుకు మరియ “ఇదిగో ప్రభు చరణదాసిని. మీ మాట ప్రకారమే నాపట్ల జరగనివ్వండి” అంది. అప్పుడు దేవదూత ఆమె దగ్గరనుంచి వెళ్ళిపోయాడు.
గలతీయవారికి లేఖ 4:4-5
అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విమోచించాలని – మనం దత్త పుత్రులమయ్యేలా – ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.
మత్తయి శుభవార్త 16:13-17
సీజరియ ఫిలిప్పీ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకొంటున్నారు?”
వారు “బాప్తిసమిచ్చే యోహానువు అంటారు కొందరు. మరికొందరు ఏలీయావు, మరికొందరు యిర్మీయావు లేదా, ప్రవక్తలలో ఇంకొకడవు అంటారు” అన్నారు.
“అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటూ ఉన్నారు?” అని ఆయన వారినడిగాడు.
“నీవు అభిషిక్తుడవే! సజీవుడైన దేవుని కుమారుడవే!” అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు.
యేసు అతనికిలా జవాబిచ్చాడు: “యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకంటే, ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం, మాంసం కాదు.
యోహాను శుభవార్త 5:19-29
అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
“ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
యోహాను శుభవార్త 6:35-40
యేసు వారికిలా చెప్పాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు, నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు. అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను.
“తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి త్రోసివేయను. నన్ను పంపినవాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగివచ్చాను గాని నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు. నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
యోహాను శుభవార్త 11:25-27
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
యోహాను శుభవార్త 14:5-11
అందుకు తోమా “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదే! మార్గం మాకెలా తెలుసు?” అని ఆయననడిగాడు.
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. నేనెవరినో మీరు తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవారే. ఇప్పటినుంచి మీరు ఆయనను తెలుసుకొంటున్నారు. ఆయనను చూశారు.”
ఫిలిప్పు ఆయనతో “ప్రభూ, తండ్రిని మాకు కనపరచు. అది మాకు చాలు” అన్నాడు.
యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పు, నేను మీతో ఇంత కాలం ఉన్నా ఇంకా నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు. ‘తండ్రిని మాకు కనపరచు’ అని నీవు అడుగుతున్నావేమిటి? నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి నాలో ఉన్నాడు. ఇది నీవు నమ్మడం లేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు. నేను తండ్రిలో ఉన్నాననీ తండ్రి నాలో ఉన్నాడనీ అనుకుంటే నన్ను నమ్మండి. లేదా, ఈ పనుల కారణంగానైనా నన్ను నమ్మండి.
యోహాను శుభవార్త 17:1-5
ఆ మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.
యోహాను శుభవార్త 20:26-31
ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు” అన్నాడు.
యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు. కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
అపొస్తలుల కార్యాలు 3:13-16
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు – మన పూర్వీకుల దేవుడు – తన సేవకుడైన యేసును గౌరవించాడు. మీరాయనను పిలాతుకు అప్పగించారు, ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు. పవిత్రుడూ న్యాయవంతుడూ అయినవాణ్ణి వద్దని చెప్పి హంతకుణ్ణి మీకు విడుదల చేయాలని కోరారు. మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం. యేసు పేరుమీద ఉన్న నమ్మకం వల్ల, ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది. ఇతణ్ణి మీరు చూస్తున్నారు. ఇతడెవరో మీకు తెలుసు. యేసుమూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుటా ఇతనికి ఈ పూర్తి ఆరోగ్యాన్ని కలిగించింది.
అపొస్తలుల కార్యాలు 4:10-12
మీరంతా, ఇస్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతువాడైన యేసు క్రీస్తు పేరటే ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు గానీ దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి లేపాడు. ఆయన ఎవరంటే, ‘కట్టేవారైన మీరు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.’
“పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
యోహాను లేఖ 1 2:1-2
నా చిన్న పిల్లలారా, మీరు ఎలాంటి పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రిదగ్గర మన తరఫున న్యాయవాది ఒకడు మనకు ఉన్నాడు. ఆయనే న్యాయవంతుడైన యేసు క్రీస్తు. మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు – లోకమంతటికీ ఆయన కరుణాధారమైన బలి.
యోహాను లేఖ 1 5:20
మనం సత్యస్వరూపిని తెలుసుకొనేలా దేవుని కుమారుడు వచ్చాడనీ మనకు వివేచన ఇచ్చాడనీ కూడా తెలుసు. మనం ఆ సత్యస్వరూపిలో ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవమూ.
ప్రకటన 19:11-16
అప్పుడు పరలోకం తెరచి ఉండడం చూశాను. వెంటనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తి పేరు “నమ్మకమైనవాడు, సత్యవంతుడు.” ఆయన న్యాయంతో తీర్పు తీరుస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు మంటలలాంటివి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. రాసి ఉన్న పేరు ఒకటి ఆయనకు ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు.
ఆయన తొడుక్కొన్న వస్త్రం రక్తంలో ముంచినది. ఆయనకు పెట్టిన పేరు “దేవుని వాక్కు.”
ఆయన వెంట పరలోక సైన్యాలు తెల్లని గుర్రాలమీద వస్తున్నాయి. వారు తొడుక్కొన్నవి శుభ్రమైన సున్నితమైన తెల్లని దుస్తులు.
జనాలను కొట్టడానికి ఆయన నోటనుంచి వాడిగల ఖడ్గం బయలువెడలుతూ ఉంది. ఆయన ఇనుప దండంతో జనాలను పరిపాలిస్తాడు. ఆయన అమిత శక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత ద్రాక్షగానుగ తొట్టి తొక్కుతున్నాడు. ఆయన వస్త్రం మీదా ఆయన తొడమీదా పేరు రాసి ఉంది: “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు”.
ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకొనుటలేదని నీవు అనుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలను పఠించు
యోహాను లేఖ 1 4:9-10
దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు.
రోమా వారికి లేఖ 5:8
కానీ మనమింకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మనపట్ల చూపుతున్నాడు.
యోహాను శుభవార్త 3:16
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
తిమోతికి లేఖ 1 2:3-6
ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
ఉన్నది ఒకే దేవుడు, దేవునికీ మనుషులకూ మధ్యవర్తి ఒక్కడే. ఆయన మానవుడైన క్రీస్తు యేసు. ఆయన అందరి కోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకొన్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయంలో చెప్పడం జరుగుతుంది.
పేతురు లేఖ 2 3:9
ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక.
నేను ఎన్నడూ పాపం చేయలేద'ని నీవు అంటున్నట్లైతే ఈ వాక్య భాగాలను చదువు
రోమా వారికి లేఖ 3:10-12
దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, న్యాయవంతుడు లేడు, ఒక్కడూ లేడు. గ్రహించేవారెవ్వరూ లేరు. దేవుణ్ణి వెదికేవారెవ్వరూ లేరు. అందరూ త్రోవ తప్పినవారు. అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు – ఒక్కడూ లేడు.
రోమా వారికి లేఖ 3:23-24
ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. నమ్మకమున్నవారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృపవల్లే క్రీస్తు యేసులోని విమోచనం ద్వారానే విశ్వాసం మూలంగానే.
రోమా వారికి లేఖ 5:12
పాపమనేది ఒకే మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అలాగే అందరికీ చావు వచ్చింది.
గలతీయవారికి లేఖ 3:22
కానీ యేసు క్రీస్తు మీది విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం క్రింద మూసివేసింది.
యోహాను లేఖ 1 1:8-10
మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
యోహాను శుభవార్త 3:18-20
ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు. ఆ శిక్షావిధికి కారణం ఇదే – వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు. దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు.
యోహాను శుభవార్త 3:36
కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”
అపొస్తలుల కార్యాలు 17:30-31
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
కొలస్సయివారికి లేఖ 3:5-10
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది. మునుపు వాటిలో బ్రతికినప్పుడు మీరూ వీటిని అనుసరించి నడుచుకొన్నారు. ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఎందుకంటే మీ పాత “మానవుణ్ణి” దాని పనులతోపాటు విసర్జించి సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో నవనూతన మవుతూ ఉన్న కొత్త “మానవుణ్ణి” ధరించుకొన్నారు.
రోమా వారికి లేఖ 6:23
ఎందుకంటే, పాపంవల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.
గలతీయవారికి లేఖ 6:7-8
మోసపోకండి – దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం. మనిషి వెదజల్లే దానినే కోస్తాడు. శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశనం అనే పంట కోసుకొంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మనుంచి శాశ్వత జీవమనే పంట కోసుకొంటారు.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:7-9
కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు.
పేతురు లేఖ 1 4:3-5
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
ప్రకటన 20:11-15
అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు. అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు. సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు. ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.
దేవుడు నా ఘోర పాపాలను క్షమించడు' అని నీవు తలపోస్తున్నట్లైతే ఈ వాక్యభాగాలను ధ్యానించు
అపొస్తలుల కార్యాలు 5:31
ఇస్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రసాదించాలని దేవుడు ఆయననే ప్రధానాధికారిగా, ముక్తిప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు.
అపొస్తలుల కార్యాలు 10:43
ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ ఆయన పేరు మూలంగా పాపక్షమాపణ దొరుకుతుందని ఆయనను గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పేవారు.”
అపొస్తలుల కార్యాలు 26:18
వారు చీకటిలోనుంచి వెలుగులోకీ, సైతాను అధికారం క్రిందనుంచి దేవునివైపుకు తిరిగేలా వారి కళ్ళు తెరవడానికీ ఇప్పుడు నిన్ను వారి దగ్గరకు పంపుతున్నాను. వారికి పాపక్షమాపణ కలగాలనీ, నామీద ఉంచిన నమ్మకంచేత పవిత్రం అయినవారిలో వారికి వారసత్వం లభించాలనీ నా ఉద్దేశం.’
ఎఫెసువారికి లేఖ 1:7
ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ, కలిగింది.
కొలస్సయివారికి లేఖ 1:13-14
ఆయన మనలను చీకటి పరిపాలన నుంచి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. కుమారునిలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే, పాపక్షమాపణ ఉంది.
కొలస్సయివారికి లేఖ 2:13-14
మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనకు ప్రతికూలమైన రుణపత్రంగా రాసి ఉన్నదానిని – మనకు విరుద్ధమైన నిర్ణయాలను రద్దుచేసి పూర్తిగా తీసివేసి సిలువకు మేకులతో కొట్టి మన అతిక్రమక్రియలన్నీ క్షమించాడు.
తిమోతికి లేఖ 1 1:15-16
పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మతగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే. అయినా, మొదట నా విషయంలో యేసు క్రీస్తు పరిపూర్ణమైన ఓర్పును ప్రదర్శించేందుకు నన్ను కరుణించాడు. శాశ్వత జీవం కోసం తన మీద నమ్మకం ఉంచబోయే వారికి ఇదంతా ఆదర్శంగా ఉండాలని ఆయన ఉద్దేశం.
హీబ్రూవారికి లేఖ 10:17-18
“వారి అపరాధాలనూ ధర్మవిరుద్ధ చర్యలను అప్పటినుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాలకోసం బలి ఇంకెన్నడూ ఉండదు.
యోహాను లేఖ 1 1:8-10
మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
యేసు క్రీస్తు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలను చదువు
యోహాను శుభవార్త 1:12
అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు.
యోహాను శుభవార్త 3:15-18
ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
“తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకంలోకి పంపాడు గాని లోకానికి శిక్ష విధించడానికి కాదు. ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు.
యోహాను శుభవార్త 3:36
కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”
యోహాను శుభవార్త 14:6
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు.
యోహాను శుభవార్త 20:31
కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
అపొస్తలుల కార్యాలు 4:12
“పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
అపొస్తలుల కార్యాలు 16:30-31
అప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి “అయ్యలారా! పాపవిముక్తి నాకు కలిగేలా నేనేం చేయాలి?” అని అడిగాడు.
అందుకు వారు “ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం పెట్టు. అప్పుడు నీకు పాపవిముక్తి కలుగుతుంది. నీకు, నీ ఇంటివారికి కూడా కలుగుతుంది” అని చెప్పారు.
రోమా వారికి లేఖ 3:20-22
ధర్మశాస్త్రంవల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. అంతే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల ఏ శరీరీ న్యాయవంతుడు అని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు.
ఇప్పుడైతే ధర్మశాస్త్రం లేకుండానే దేవుని న్యాయం వెల్లడి అయింది. ధర్మశాస్త్రమూ ప్రవక్తల లేఖనాలూ దానికి సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. ఆ న్యాయం యేసు క్రీస్తు మీది నమ్మకం ద్వారానే నమ్మేవారందరికీ వారందరిమీదా ఎంచబడే దేవుని న్యాయం. భేదమేమీ లేదు.
రోమా వారికి లేఖ 10:9-10
అదేమంటే ప్రభువైన యేసును మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడని మీ హృదయంలో నమ్మితే మీరు పాపవిముక్తి, రక్షణ పొందుతారు. ఎందుకంటే, మనిషి హృదయంతో నమ్ముతాడు, దాని ఫలితం నిర్దోషత్వం. నోటితో ఒప్పుకొంటాడు. దాని ఫలితం పాపవిముక్తి.
గలతీయవారికి లేఖ 2:16
అయినా, మనిషి యేసు క్రీస్తుమీది నమ్మకం వల్లే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల నిర్దోషిగా న్యాయవంతుడుగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు, గనుక మనం కూడా ధర్మశాస్త్ర క్రియలవల్ల కాక క్రీస్తుమీది నమ్మకంవల్లే నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసుమీద నమ్మకం పెట్టాం. ధర్మశాస్త్ర క్రియలవల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు గదా.
ఎఫెసువారికి లేఖ 2:8-9
మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీవల్ల కలిగింది కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చినదే. ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియలవల్ల కలిగింది కాదు.
నీ నిత్యజీవం గూర్చి సరైన నిర్ణయానికి రాలేక పోతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
యోహాను శుభవార్త 3:1-16
పరిసయ్యులలో నీకొదేము అనే పేరు గల మనిషి ఉన్నాడు. అతడు యూదులకు ఒక అధికారి. ఈ మనిషి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు దేవుని దగ్గరనుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు. ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు.”
అందుకు యేసు జవాబిస్తూ “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని అతనితో చెప్పాడు.
నీకొదేము ఆయనతో “ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”
“ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము ఆయనకు చెప్పిన జవాబు.
యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “మీరు ఇస్రాయేల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు గ్రహించరా? మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మాకు తెలిసినవే చెపుతాం, చూచినవాటిని గురించే సాక్ష్యం చెపుతాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు. నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెపితే ఎలా నమ్ముతారు? పరలోకంనుంచి వచ్చినవాడు, అంటే పరలోకంలో ఉన్న మానవ పుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు.
“ఎడారిలో మోషే కంచు పామును పైకెత్తినట్టే మానవపుత్రుణ్ణి పైకెత్తడం తప్పనిసరి. ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
“దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
యోహాను శుభవార్త 5:19-29
అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
“ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
యోహాను శుభవార్త 11:25-26
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
యోహాను శుభవార్త 14:6
యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు.
యోహాను శుభవార్త 17:2-3
నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం.
యోహాను శుభవార్త 20:31
కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.
రోమా వారికి లేఖ 8:10-17
క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం. చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
అందుచేత, సోదరులారా, శరీర స్వభావం ప్రకారంగా బ్రతకడానికి మనం దానికి బాకీపడ్డవారమేమీ కాము. మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే, చనిపోతారు గాని దేవుని ఆత్మమూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు. ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం. మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం. మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
మనం సంతానమైతే వారసులం కూడా, అంటే క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం.
కొరింతువారికి లేఖ 2 5:17
కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి కొత్త సృష్టి. పాతవి గతించాయి. ఇవిగో అన్నీ క్రొత్తవి అయ్యాయి.
ఎఫెసువారికి లేఖ 2:1-6
మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు. పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట. మునుపు మనమందరమూ వారితోపాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం, శరీర స్వభావానికీ మనసుకూ ఇష్టమైనవాటిని తీర్చుకొంటూ ఇతరులలాగే స్వభావసిద్ధంగా దేవుని కోపానికి పాత్రులుగా ఉండేవారం.
కానీ దేవుడు! కరుణాసంపన్నుడు! ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహా ప్రేమనుబట్టి మనలను క్రీస్తుతోపాటు బ్రతికించాడు. (మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే.)
అంతేకాదు. ఆయనతోకూడా మనలను పైకెత్తి ఆయనతోకూడా పరమ స్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకొన్నాడు.
కొలస్సయివారికి లేఖ 2:13
మీరు మీ అపరాధాలలో, శరీర సంబంధమైన సున్నతి లేని స్థితిలో ఆధ్యాత్మికంగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు.
తీతుకు లేఖ 3:4-7
అయితే మానవుల పట్ల మన రక్షకుడైన దేవుని దయ, ప్రేమ కనిపించినప్పుడు, ఆయన మనకు పాపవిముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే గాని మనం చేసిన నీతిన్యాయాల పనులు కాదు. కొత్త జన్మం అనే స్నానం ద్వారా, పవిత్రాత్మ మనకు నవీకరణ కలిగించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి, శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి.
యోహాను లేఖ 1 5:11-13
ఆ సాక్ష్యం ఇదే: దేవుడు శాశ్వత జీవం మనకిచ్చాడు. ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది. ఏ వ్యక్తికి దేవుని కుమారుడు ఉన్నాడో ఆ వ్యక్తికి జీవం ఉంది. ఏ వ్యక్తికి దేవుని కుమారుడు లేడో ఆ వ్యక్తికి జీవం లేదు.
దేవుని కుమారుని పేరు మీద నమ్మకం ఉంచిన మీరు శాశ్వత జీవం గలవారని మీకు తెలిసిపోవాలనీ దేవుని కుమారుని పేరుమీద ఇంకా నమ్మకం ఉంచాలనీ ఈ విషయాలు మీకు రాస్తున్నాను.
నీవు తప్పక ప్రార్థించాలని తెలుసుకోవాలి అంటే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 6:5-13
“అదిగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట భక్తులలాగా ఉండకండి. మనుషులు తమను చూడాలని సమాజ కేంద్రాలలో, వీధుల మూలలలో నిలుచుండి ప్రార్థన చేయడం వారికి చాలా ఇష్టం. వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీరైతే ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్ళి, తలుపు వేసుకొని, రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యంలో జరిగేవాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాక, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాలలాగా వృథాగా పదే పదే పలకకండి. అవసరమైనవి ఎక్కువ మాటలు పలకడం కారణంగా వారి ప్రార్థన వినబడుతుందని వారి ఆలోచన. మీరు వారిలాగా ఉండకండి. ఎందుకంటే, మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవి మీ తండ్రికి తెలుసు.
అందుచేత ఈ విధంగా ప్రార్థన చేయాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక!
నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలో లాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక!
మా రోజువారీ ఆహారం ఈ రోజున మాకు ప్రసాదించు.
మాకు రుణపడ్డవారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను క్షమించు.
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
మత్తయి శుభవార్త 7:7-11
“అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది తెరవబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది. మీలో ఎవరైనా సరే కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా? చేపకోసం అడిగితే అతనికి పామునిస్తారా? మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా మంచివి ఇస్తాడు గదా.
మత్తయి శుభవార్త 14:23
ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
మత్తయి శుభవార్త 18:19-20
ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
మార్కు శుభవార్త 1:35
వేకువ జామున, పగలుకు చాలా సేపటికి ముందు, ఆయన లేచి నిర్జన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మార్కు శుభవార్త 11:24-25
అందుచేత మీతో అంటున్నాను, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా, పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైన దేదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి.
లూకా శుభవార్త 5:16
అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు.
లూకా శుభవార్త 6:12
ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడంలో రాత్రంతా గడిపాడు.
లూకా శుభవార్త 18:1-8
మనుషులు నిరుత్సాహపడకుండా నిత్యమూ ప్రార్థన చేస్తూ ఉండాలని వారికి నేర్పడానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక పట్టణంలో న్యాయాధిపతి ఒకడుండేవాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె అతని దగ్గరకు వస్తూ ‘నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయం జరిగించండి’ అని అడుగుతూ ఉండేది.
“కొంత కాలం అతడు అలా చేయడానికి ఇష్టపడలేదు. గాని తరువాత అతడు ‘ఈ విధవరాలు నన్ను విసిగిస్తూ ఉంది గనుక దేవుడంటే నాకు భయం లేకపోయినా మనుషులంటే లెక్క లేకపోయినా ఈమెకు న్యాయం జరిగిస్తాను. లేకపోతే అదే పనిగా వస్తూ నా ప్రాణం తోడేస్తుంది’ అనుకొన్నాడు.”
ప్రభువు ఇంకా అన్నాడు “న్యాయం లేని ఆ న్యాయాధిపతి చెప్పినది మీ చెవుల్లో పడనివ్వండి. మరి, దేవుడు తాను ఎన్నుకొన్న తన వారి విషయంలో దీర్ఘ సహనం చూపుతూ, వారు తనకు రాత్రింబగళ్ళు మొరపెట్టుకొంటూ ఉంటే ఆయన వారి కోసం న్యాయం జరిగించడా? వారికోసం ఆయన త్వరగా న్యాయం జరిగిస్తాడని మీతో చెపుతున్నాను. అయినా మానవ పుత్రుడు వచ్చేటప్పుడు విశ్వాసం అనేది భూమిమీద ఆయనకు వాస్తవంగా కనిపిస్తుందా?”
లూకా శుభవార్త 21:36
జరగబోయే వాటన్నిటిలోనుంచి మీరు తప్పించుకొని మానవపుత్రుని ఎదుట నిలబడడానికి తగినవారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి.”
యోహాను శుభవార్త 14:13-14
కాబట్టి నా పేర మీరు ఏది అడిగినా సరే, కుమారుని మూలంగా తండ్రికి మహిమ కలిగేందుకు అది నేను చేస్తాను. నా పేర మీరు ఏది అడిగితే అది చేస్తాను.
యోహాను శుభవార్త 15:7
“మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు. అది మీకు చేయబడుతుంది.
యోహాను శుభవార్త 16:23-24
ఆ రోజున మీరు నన్ను ఏమీ అడగరు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు తండ్రిని నా పేర ఏది అడిగినా అది ఆయన మీకిస్తాడు. ఇదివరకు మీరు నా పేర అడిగినది ఏదీ లేదు. అడగండి, మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
రోమా వారికి లేఖ 8:26-27
అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే, తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలుకాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పం ప్రకారం పవిత్రులకోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు గనుక హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు.
రోమా వారికి లేఖ 12:12
ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి.
ఎఫెసువారికి లేఖ 6:18
అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.
ఫిలిప్పీవారికి లేఖ 4:6-7
ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి. అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసుద్వారా మీ హృదయాలకూ మనసులకూ కావలి ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 4:2
మెళకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:17
ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి.
తిమోతికి లేఖ 1 2:1-4
మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
తిమోతికి లేఖ 1 2:8
నేను ఆశించేదేమంటే ప్రతి స్థలంలోనూ పురుషులు కోపం, కలహభావం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి.
తిమోతికి లేఖ 1 4:4-5
దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.
హీబ్రూవారికి లేఖ 4:16
కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.
హీబ్రూవారికి లేఖ 10:19-22
సోదరులారా, యేసు తెరద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం అంకితం చేశాడు. కాబట్టి దాని గుండా యేసు రక్తంచేత అతి పవిత్రస్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. దేవుని ఇంటిమీద గొప్ప ప్రముఖ యాజి కూడా మనకున్నాడు. గనుక సంపూర్ణ విశ్వాస నిశ్చయతతో, యథార్థ హృదయంతో, మన శరీరం శుద్ధ జలంతో కడగబడి, అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుణ్ణి సమీపిద్దాం.
యాకోబు లేఖ 1:5-8
మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు.
అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు. ఆ మనిషి చపలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు. గనుక తనకు ప్రభువువల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు.
యాకోబు లేఖ 4:2-3
మీరు ఏవేవో కావాలని కోరుతారు. అవి లేవు గనుక హత్య చేస్తారు. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించు కోలేరు. పోట్లాటలూ జగడాలూ జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు. ఒక వేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు.
యాకోబు లేఖ 5:13-18
మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి. మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.
ఒకరితో ఒకరు మీ అతిక్రమాలు ఒప్పుకోండి. మీకు ఆరోగ్యం చేకూరేలా ఒకరికోసం ఒకరు ప్రార్థన చేయండి. న్యాయవంతుని ప్రార్థన పని చేయడంలో చాలా ప్రభావంగలది, ఫలవంతమైనది.
ఏలీయా మనలాంటి స్వభావం గలవాడే. వాన కురియకూడదని అతడు మనసారా ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాలపాటు ఆ దేశంలో వాన పడలేదు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వాన కురిపించింది, భూమి దాని పంట ఇచ్చింది.
పేతురు లేఖ 1 4:7
అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది, గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో, మెళకువగా ఉండండి.
యోహాను లేఖ 1 3:21-22
ప్రియ సోదరులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే దేవుని సన్నిధానంలో మనకు ధైర్యం ఉంటుంది. అప్పుడు, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడంచేత, మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు.
యోహాను లేఖ 1 5:14-15
ఆయనను గురించి మనకున్న నిశ్చయత ఏమంటే ఆయన చిత్త ప్రకారం మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడనేదే. మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడని మనకు తెలిసి ఉంటే ఆయనను అడిగినవి మనకు కలిగాయని కూడా తెలుసు.
ఏ విషయాలను గూర్చి ప్రార్థించాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మాదిరి ప్రార్థనలను చదువు
లూకా శుభవార్త 11:1-4
ఒకసారి ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఆయనతో “ప్రభూ! ఎలా ప్రార్థన చేయాలో యోహాను తన శిష్యులకు నేర్పాడు. నీవు మాకు నేర్పు” అన్నాడు.
ఆయన వారితో అన్నాడు, “మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనండి: పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక! నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలోలాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక! రోజువారి ఆహారం రోజు రోజు మాకు ప్రసాదించు. మాకు రుణపడ్డ ప్రతి వ్యక్తినీ మేము కూడా క్షమిస్తున్నాం గనుక మా అపరాధాలను క్షమించు. మమ్ములను దుష్ ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గత నుంచి మమ్ములను రక్షించు.”
లూకా శుభవార్త 22:32
కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”
లూకా శుభవార్త 22:39-45
అప్పుడాయన బయటికి వచ్చి ఎప్పటిలాగా ఆలీవ్ కొండకు వెళ్ళాడు. ఆయనవెంట శిష్యులు వెళ్ళారు. ఆ స్థలం చేరుకొన్నప్పుడు ఆయన వారితో “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.
అప్పుడు వారి దగ్గరనుంచి రాతివేత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేశాడు, “తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నానుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరనియ్యి” అన్నాడు.
అప్పుడు పరలోకంనుంచి వచ్చిన దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన యాతనపడుతూ మరీ తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట పెద్ద రక్త బిందువులలాగా అయి నేలమీద పడింది.
ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూచి
యోహాను శుభవార్త 17:1-26
ఆ మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.
“లోకంనుంచి నీవు నాకిచ్చినవారికి నీ పేరును వెల్లడి చేశాను. పూర్వం వారు నీవారు. వారిని నాకు ఇచ్చావు. వారు నీ వాక్కును పాటించారు. నీవు నాకిచ్చిన మాటలు వారికిచ్చాను. వారు వాటిని అంగీకరించారు, నేను నీ దగ్గరనుంచి వచ్చానని వారు రూఢిగా తెలుసుకొన్నారు, నీవు నన్ను పంపావని నమ్ముకొన్నారు, కాబట్టి నీవు నాకిచ్చినవన్నీ నీనుంచి వచ్చినవని ఇప్పుడు వారికి తెలుసు.
“వీరికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు ఇచ్చినవారు నీవారే గనుక వారికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. వీరిమూలంగా నాకు మహిమ కలిగింది. ఇకమీదట నేను లోకంలో ఉండను గానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, మనం ఒక్కటిగా ఉన్నట్టే నీవు నాకిచ్చినవారు ఒక్కటిగా ఉండేలా నీ పేర వారిని కాపాడు. నేను లోకంలో వారితో ఉన్నప్పుడు నీ పేర వారిని కాపాడాను. నీవు నాకిచ్చినవారిని నేను కాపాడాను. వారిలో ఎవరూ నశించలేదు. అయితే లేఖనం నెరవేరేందుకు నాశనానికి తగినవాడే నశించాడు.
“ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. వీరిలో నా ఆనందం పూర్తిగా ఉండాలని ఈ మాటలు లోకంలో చెపుతున్నాను. నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.
“నేను ప్రార్థన చేస్తున్నది వీరికోసం మాత్రమే కాదు గాని వీరి మాటల మూలంగా నామీద నమ్మకం ఉంచబోయేవారి కోసం కూడా. వారందరూ ఒక్కటిగా ఉండాలని నా ప్రార్థన. తండ్రీ, నీవు నన్ను పంపావని లోకం నమ్మేలా నేను నీలో, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒక్కటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనము ఒక్కటిగా ఉన్నట్టే వారు ఒక్కటిగా ఉండేందుకు నీవు నాకిచ్చిన మహిమ వారికిచ్చాను. నీవు నన్ను పంపావనీ నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించావనీ లోకం తెలుసుకోవాలి గనుక వారిలో నేను, నాలో నీవు ఉండడంవల్ల వారు సంపూర్ణంగా ఒక్కటి కావాలని ఆ మహిమ వారికిచ్చాను. తండ్రీ, నీవు నాకు ఇచ్చినవారు నీవు నాకిచ్చిన మహిమను చూచేలా నేను ఎక్కడ ఉంటానో వారు నాతో అక్కడే ఉండాలని నా కోరిక. ఎందుకంటే, జగత్తు పునాదికి మునుపే నీవు నన్ను ప్రేమించావు.
“న్యాయవంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసు కోలేదు, గానీ నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీరు తెలుసుకొన్నారు. నామీద నీకు ఉన్న ప్రేమ వారిలో ఉండాలనీ నేను కూడా వారిలో ఉండాలనీ నీ పేరును వారికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”
అపొస్తలుల కార్యాలు 4:24-31
ఇది విని వారు ఏక మనసుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు: “ప్రభూ! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన దేవుడవు నీవు. నీవు నీ సేవకుడు అయిన దావీదు నోట ఇలా పలికించావు: జనాలు ఎందుకు అల్లరి చేశాయి? ప్రజలు ఎందుకు వృధాలోచనలు చేశారు? ప్రభువుకూ ఆయన అభిషిక్తుడికీ వ్యతిరేకంగా భూరాజులు నిలిచారు, పరిపాలకులు సమకూడారు.
“అలాగే ఈ నగరంలో హేరోదు, పొంతి పిలాతు, ఇస్రాయేల్ ప్రజలతోనూ ఇతర ప్రజలతోనూ కలిసి నీచేత అభిషేకం పొందిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఏది జరగాలని నీ అధికారంచేతా సంకల్పంచేతా ముందు నిర్ణయించావో అదే జరిగించడానికి సమకూడారు. ప్రభూ! ఇప్పుడు వారి బెదిరింపులు గుర్తించి రోగులను బాగు చేయడానికీ నీ పవిత్ర సేవకుడైన యేసు పేరట సూచకమైన అద్భుతాలూ వింతలూ జరిగించడానికీ నీ చేయి చాపు. తద్వారా నీ దాసులకు నీ వాక్కు ప్రకటించడానికి గొప్ప ధైర్యం ప్రసాదించు.”
వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కంపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు.
అపొస్తలుల కార్యాలు 16:25
అయితే మధ్యరాత్రి వేళ పౌలు సైలసులు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు.
రోమా వారికి లేఖ 1:9-10
నా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ములను పేర్కొంటూ, ఎలాగైనా సరే దేవుని ఇష్టప్రకారం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకొంటూ ఉన్నాను. తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా నేను సేవిస్తున్న దేవుడే ఇందుకు నాకు సాక్షి.
రోమా వారికి లేఖ 10:1-2
సోదరులారా, ఇస్రాయేల్‌ ప్రజకు పాపవిముక్తి కలగాలనే నా హృదయాభిలాష, వారికోసం దేవునికి చేసే నా ప్రార్థన. వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉందని వారిని గురించిన నా సాక్ష్యం. అయితే వారి ఆసక్తి జ్ఞానానికి అనుగుణమైనది కాదు.
రోమా వారికి లేఖ 15:30-33
సోదరులారా, నా కోసం చేసే ప్రార్థనలలో మీరు నాతోపాటు ప్రయాసపడాలని ప్రభువైన యేసు క్రీస్తును బట్టీ దేవుని ఆత్మ ప్రేమను బట్టీ మిమ్ములను బతిమాలు కొంటున్నాను. అంటే, నేను యూదయలో అవిధేయుల చేతులలో నుంచి తప్పించుకొనేలా, జెరుసలంలో చేయబోయే నా పరిచర్య అక్కడి పవిత్రులకు అంగీకారంగా ఉండేలా దేవుని ఇష్టప్రకారం మీ దగ్గరకు సంతోషంతో వచ్చి మీతో కూడా సేద తీర్చుకోగలిగేలా ప్రార్థించండి. శాంతి ప్రదాత అయిన దేవుడు మీకందరికీ తోడై ఉంటాడు గాక! తథాస్తు.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఎఫెసువారికి లేఖ 1:15-20
ఈ కారణంచేత, ప్రభువైన యేసుమీద మీ నమ్మకాన్ని గురించీ, పవిత్రులందరిపట్లా మీ ప్రేమభావాన్ని గురించీ విన్నప్పటినుంచి నేను కూడా నా ప్రార్థనలలో మిమ్ములను జ్ఞాపకం ఉంచుకొంటూ, మీ గురించి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు – మహిమ స్వరూపి అయి తండ్రి – ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకొనేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలనీ పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో, తనను నమ్ముకొన్న మనపట్ల ఆయన బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యమెలాంటిదో మీరు తెలుసుకోవాలనీ నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకొన్న మహా బలప్రభావాల ప్రకారమే. ఆ బలప్రభావాలచేత ఆయన క్రీస్తును చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపి పరమ స్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు.
ఎఫెసువారికి లేఖ 3:14-21
ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను. పరలోకంలో, భూమిమీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మవల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి పవిత్రులందరితోపాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలనీ, జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలనీ మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయినవారు కావాలనీ ఆయనను ప్రార్థిస్తున్నాను.
మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
ఎఫెసువారికి లేఖ 6:19-20
అలాగే నాకోసం కూడా ప్రార్థించండి. నేను శుభవార్త రహస్య సత్యాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నోరు తెరిచేలా, నాకు మాటలు లభించేలా, అందులో నేను ప్రకటించవలసిన విధంగా ధైర్యంతో ప్రకటించేలా ప్రార్థించండి. శుభవార్త కోసం నేను సంకెళ్ళపాలయిన ప్రతినిధిని.
ఫిలిప్పీవారికి లేఖ 1:3-5
మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. మొదటి రోజునుంచి ఇదివరకు మీరు శుభవార్త విషయంలో భాగస్వాములు, గనుక నేను చేసే ప్రతి ప్రార్థనలోనూ మీకోసం ఎప్పుడూ ఆనందంతో ప్రార్థిస్తున్నాను.
ఫిలిప్పీవారికి లేఖ 1:9-11
నా ప్రార్థన ఏమిటంటే, దేవుని మహిమ, స్తుతులకోసం మీరు క్రీస్తు యేసువల్ల కలిగే నీతిన్యాయాల ఫలాలతో నిండి ఉండి క్రీస్తు దినం వరకూ నిష్కపటులై, ఏ అభ్యంతరమూ కలిగించనివారై ఉండేలా ఏవి శ్రేష్ఠమో వాటినే మెచ్చుకోవడానికి మీ ప్రేమ తెలివి, అన్ని రకాల వివేచనతో అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి.
కొలస్సయివారికి లేఖ 1:9-12
ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటినుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, తెలివి కలిగి ఆయన సంకల్పం పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుతూ ఉన్నాం. దీనిద్వారా మీరు ప్రభువుకు తగిన విధంగా నడుచుకొంటూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, అంతకంతకూ దేవుణ్ణి తెలుసుకొంటూ అన్ని విషయాలలో ప్రభువుకు ఆనందం కలిగించాలని ప్రార్థిస్తున్నాం. మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బలప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలని మా ప్రార్థన. వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలిభాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు.
కొలస్సయివారికి లేఖ 4:3-4
మా కోసం కూడా ప్రార్థించండి. క్రీస్తు రహస్య సత్యం కోసం నేను సంకెళ్ళ పాలయ్యాను. మేమీ సత్యం ప్రకటించడానికి దేవుడు తన వాక్కుకోసం మాకు తలుపు తెరిచేలా, నేను మాట్లాడవలసిన విధంగానే దానిని స్పష్టం చేసేలా ప్రార్థించండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 3:9-13
మన దేవుని ముందు మిమ్ములను బట్టి మాకున్న ఆనందమంతటి కోసం సరిపోయినంత కృతజ్ఞతలు దేవునికి ఎలా చెప్పగలం? మేము మీ ముఖాలను మళ్ళీ చూడాలని, మీ విశ్వాసంలో ఉన్న కొరత పూర్తిగా తీర్చడానికి అవకాశం కోసం రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొంటూ ఉన్నాం.
మన తండ్రి అయిన దేవుడు తానే, మన ప్రభువైన యేసు క్రీస్తు మమ్ములను మీ దగ్గరకు నడిపిస్తాడు గాక! మీ పట్ల మా ప్రేమ ఎలా సమృద్ధిగా పెరుగుతున్నదో అలాగే మీ పరస్పర ప్రేమ, మనుషులందరి పట్ల కూడా సమృద్ధిగా పెరిగేలా ప్రభువు చేస్తాడు గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు తన పవిత్రులందరితో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్రత విషయంలో అనింద్యులై ఉండేలా మీ హృదయాలను సుస్థిరం చేస్తాడు గాక!
తెస్సలొనీకవారికి లేఖ 2 1:11-12
ఈ కారణంచేత మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీకు అందిన పిలుపుకు మిమ్ములను తగినవారుగా మన దేవుడు ఎంచాలనీ ప్రతి మంచి ఉద్దేశాన్నీ నమ్మకం మూలమైన ప్రతి కార్యాన్నీ బలప్రభావాలతో పూర్తి చేయాలనీ మా ప్రార్థన. మన దేవుడూ ప్రభువైన యేసు క్రీస్తూ ప్రసాదించే కృప ప్రకారం మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుకు మీలోను, మీకు ఆయనలోను మహిమ కలగాలని మా ఉద్దేశం.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:1-2
తుదకు, సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి. మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారినుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు.
హీబ్రూవారికి లేఖ 5:7
క్రీస్తు భూమిమీద సశరీరంగా ఉన్న రోజులలో తనను చావులోనుంచి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు.
హీబ్రూవారికి లేఖ 7:25
ఈ కారణంచేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చినవారిని శాశ్వతంగా రక్షించగలవాడు. ఎందుకంటే వారి పక్షంగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు.
నీకు సమస్యలు, కష్టాలు ఉన్నట్లైతే ఈ వచనాలను చదువు
రోమా వారికి లేఖ 8:18-25
ఇప్పటి మన బాధలు తరువాత మనలో వెల్లడి కాబొయ్యే మహిమతో పోల్చతగ్గవి కావని నా అంచనా. దేవుని సంతానం వెల్లడి అయ్యే సమయంకోసం సృష్టి నిరీక్షణతో చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంది. సృష్టి వ్యర్థమైన పరిస్థితికి ఆధీనమైంది – తనంతట తానే కాదు గాని దానిని ఆశాభావంతో ఆధీనం చేసిన దేవుని ద్వారానే. ఎందుకంటే సృష్టి కూడా నాశన బంధకాలనుంచి విడుదల అయి, దేవుని సంతతివారి మహిమగల విముక్తిలో పాల్గొంటుంది. సృష్టి యావత్తూ ఇదివరకు ఏకంగా ప్రసవ వేదనలు పడుతూ ఉన్నట్టుండి, మూలుగుతున్నదని మనకు తెలుసు.
అంత మాత్రమే కాదు. మనం కూడా – దేవుని ఆత్మ ప్రథమ ఫలాలు గల మనం కూడా దత్తస్వీకారం కోసం, అంటే, మన దేహ విమోచనం కోసం చూస్తూ లోలోపల మూలుగుతున్నాం. మనం ఈ ఆశాభావంతో రక్షణ పొందాం. అయితే నెరవేరి కనబడ్డ ఆశాభావం ఆశాభావం కాదు. తమ ఎదుటే కనిపిస్తున్న దానికోసం ఎవరైనా ఎదురు చూడడమెందుకు? కానీ చూడనిదాని కోసం మనకు ఆశాభావం ఉంటే దానికోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాం.
రోమా వారికి లేఖ 8:28
దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచినవారికి, మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తున్నాయని మనకు తెలుసు.
రోమా వారికి లేఖ 8:35-37
క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
రోమా వారికి లేఖ 12:12
ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి.
కొరింతువారికి లేఖ 2 1:3-5
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగుతుంది గాక. ఆయన కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆయన మమ్ములను మా కష్టాలన్నిటిలోనూ ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఈ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టంలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. క్రీస్తు బాధలు మాలో అధికమవుతూ ఉన్నాయి గాని ఆ ప్రకారమే క్రీస్తుద్వారా మా ఆదరణ కూడా అధికమవుతూ ఉంది.
కొరింతువారికి లేఖ 2 4:16-18
అందుచేత మేము నిరుత్సాహం చెందము. శారీరకంగా క్షీణించిపోతూ ఉన్నా ఆంతర్యంలో మాకు రోజు రోజుకూ కొత్తదనం కలుగుతూ ఉంది. మేము కనిపించేవాటిమీద దృష్టి ఉంచకుండా కనిపించనివాటిమీదే దృష్టి ఉంచు కొంటున్నాం గనుక క్షణికమైన, చులకనైన మా బాధ దానికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమభారాన్ని మా కోసం కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి గాని కనిపించనివి శాశ్వతమైనవి.
యాకోబు లేఖ 1:2-4
నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడెల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి.
క్రీస్తుమీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుందని మీకు తెలుసు గదా. మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి.
పేతురు లేఖ 1 1:3-9
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక! యేసు క్రీస్తును చనిపోయిన వారిలోనుంచి లేపడం ద్వారా, దేవుడు తన మహా కరుణ ప్రకారం మనకు కొత్త జన్మం కలిగించాడు. ఇది సజీవమైన ఆశాభావానికీ నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికీ. ఈ వారసత్వం మీ కోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది. కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం, నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి.
దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షలవల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో. ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే, ఎంతో విలువగలది. దానికి జ్వాలలచేత పరీక్ష కలిగినా, అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణంగా కనబడాలి. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. మీరు మీ విశ్వాస ఫలితం, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు.
పేతురు లేఖ 1 2:19-23
ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవునిపట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకొంటే అది మెచ్చుకోదగిన సంగతి. తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకొంటే మీకేం కీర్తి? గానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకొంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదే. మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే గదా.
ఎందుకంటే, క్రీస్తు సహా మనకోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన ఏమీ పాపం చేయలేదు. ఆయన నోట ఏమీ మోసం లేదు. దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు, బాధలకు గురి అయినప్పుడు బెదరించలేదు గాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకొన్నాడు.
పేతురు లేఖ 1 5:8-10
స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా. మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత, సర్వ కృపానిధి అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు.
రోగంచేత బాధపడుతున్నట్లైతే ఈ వాక్యభాగాలను జ్ఞాపకం చేసుకో
మత్తయి శుభవార్త 4:23-25
యేసు గలలీ ప్రదేశం అంతటా ప్రయాణాలు చేస్తూ, వారి సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ, రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగుచేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రోగులందరినీ నానా విధాల వ్యాధులచేత యాతనలచేత పీడితులైన వారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు. గలలీ, దెకపొలి, జెరుసలం, యూదయ, యొర్దానుకు అవతలి ప్రదేశం – ఈ స్థలాలనుంచి పెద్ద జన సమూహాలు ఆయన వెంటవెళ్ళారు.
మత్తయి శుభవార్త 9:35
యేసు అన్ని పట్టణాలకూ గ్రామాలకూ వెళ్తూ, వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలలో అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేస్తూ ఉన్నాడు.
మత్తయి శుభవార్త 11:2-5
క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు. అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు: “రావలసినవాడవు నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా?”
యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు వస్తూ ఉంది, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధమౌతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారిని సజీవంగా లేపడం జరుగుతూ ఉంది. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.
అపొస్తలుల కార్యాలు 3:1-6
ఒకప్పుడు ప్రార్థన కాలంలో – పగలు మూడు గంటలకు – పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడే కొందరు పుట్టు కుంటి మనిషిని ఒకణ్ణి మోసుకువస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళే వారిదగ్గర బిచ్చం అడుక్కోవడానికి వారు అతణ్ణి ప్రతి రోజూ సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు.
పేతురు, యోహానుతోపాటు అతణ్ణి తేరిపార చూస్తూ “మావైపు చూడు” అన్నాడు. తనకు వారిదగ్గర ఏదైనా దొరుకుతుందని వారివైపు శ్రద్ధతో చూశాడు.
అప్పుడు పేతురు “నేను వెండి బంగారాలు ఉన్నవాణ్ణి కాను గాని నాకున్నదేదో అదే నీకిస్తాను. నజరేతువాడైన యేసు క్రీస్తు పేర లేచి నడువు!” అన్నాడు,
అపొస్తలుల కార్యాలు 8:4-8
చెదరిపోయినవారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు విని, చూచి అక్కడి జన సమూహాలు ఏకగ్రీవంగా అతడు చెప్పిన విషయాలు శ్రద్ధతో విన్నారు. చాలామందికి పట్టిన మలిన పిశాచాలు పెడ బొబ్బలు పెట్టి వారిలోనుంచి బయటికి వెళ్ళాయి. పక్షవాత రోగులూ కుంటివారూ అనేకులు పూర్తిగా నయమయ్యారు. అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది.
అపొస్తలుల కార్యాలు 19:11-16
పౌలుచేత దేవుడు అసాధారణ అద్భుతాలు చేయించాడు – అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గానీ నడికట్లు గానీ రోగుల దగ్గరకు తెచ్చినప్పుడు రోగాలు వారిని విడిచాయి. దయ్యాలు వారిలో నుంచి వెళ్ళాయి.
అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై “పౌలు ప్రకటించే యేసు పేర ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. యూద ప్రధానయాజి ఒకడైన స్కెవ కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో “యేసంటే నాకు తెలుసు. పౌలు కూడా తెలుసు గానీ మీరెవరు?” అంది. అప్పుడు దయ్యం ఎవరిలో ఉన్నదో అతడు వారిమీద ఎగిరి దూకి వారిని అణచివేసి ఓడగొట్టాడు గనుక గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు.
అపొస్తలుల కార్యాలు 28:8-9
పొప్లి తండ్రి జ్వరంతో, రక్తవిరేచనాలతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. పౌలు లోపలికి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తరువాత అతనిమీద చేతులుంచి అతణ్ణి బాగు చేశాడు. ఇలా జరిగిన తరువాత ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు.
కొరింతువారికి లేఖ 1 12:9
ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి.
కొరింతువారికి లేఖ 1 12:29-30
అందరూ క్రీస్తురాయబారులు కారు గదా. అందరు ప్రవక్తలు కారు గదా. అందరూ ఉపదేశకులు కారు గదా. అందరూ అద్భుతాలు చేసేవారు కారు గదా. అందరూ రోగులను బాగు చేసే కృపా వరాలు గలవారు కారు గదా. అందరూ భాషలు మాట్లాడేవారు కారు గదా. అందరూ భాషల అర్థం చెప్పేవారు కారు గదా.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
తిమోతికి లేఖ 1 5:23
ఇకనుంచి నీళ్ళు మాత్రమే త్రాగక, నీ కడుపుకోసం, తరచుగా వచ్చే జబ్బులకోసం కొంచెం ద్రాక్షరసం కూడా వినియోగించు.
తిమోతికి లేఖ 2 4:20
ఎరస్తస్ కొరింతులో ఆగిపోయాడు. త్రోఫిమస్ అనారోగ్యంగా ఉన్నాడు. నేనతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
యాకోబు లేఖ 5:14-15
మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.
చనిపోతానని భయపడుతున్నట్లైతే ఈ వాక్యాలను గుర్తుపెట్టుకో
యోహాను శుభవార్త 6:39-40
నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
యోహాను శుభవార్త 11:17-27
యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
“చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
యోహాను శుభవార్త 14:1-4
“మీ హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద కూడా నమ్మకం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అది మీకు తెలుసు, ఆ మార్గం కూడా మీకు తెలుసు.”
రోమా వారికి లేఖ 8:38-39
నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.
రోమా వారికి లేఖ 14:7-9
మనలో ఏ ఒక్కరూ తన మట్టుకు తానే బ్రతకరు, తన మట్టుకు తానే చనిపోరు. మనం బ్రతుకుతూ ఉంటే ప్రభువు సంబంధంగా బ్రతుకుతున్నాం. చనిపోతే ప్రభువు సంబంధంగా చనిపోతాం. కాబట్టి బ్రతికినా, చనిపోయినా మనం ప్రభువుకే చెందేవారం. తాను చనిపోయినవారికీ బ్రతికి ఉన్నవారికీ ప్రభువై ఉండాలనే కారణంచేత క్రీస్తు చనిపోయి లేచి మళ్ళీ బ్రతికాడు.
కొరింతువారికి లేఖ 1 15:12-58
క్రీస్తును చనిపోయినవారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే, చనిపోయినవారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెపుతున్నారేమిటి? చనిపోయినవారు లేవడం అనేది లేదూ అంటే, క్రీస్తు కూడా లేవలేదన్న మాటే. క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం. అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే, గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాం గదా. చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే! మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్ను మూసినవారు నశించిపోయారు కూడా. క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టుకే గనుక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్ళం.
అయితే క్రీస్తు చనిపోయినవారిలో నుంచి లేచాడు. కన్ను మూసినవారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషిద్వారా కలిగింది. ఆదాములో అందరూ చనిపోతారు. అలాగే క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ తన వరుస ప్రకారమే అలా జరిగేదిమొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు, తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు.
ఆ తరువాత, ఆయన సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, శక్తినీ రద్దుచేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత, అంతం వస్తుంది. ఎందుకంటే విరోధులందరినీ తన పాదాలక్రింద పెట్టుకొనేవరకూ క్రీస్తు రాజ్యం చేయాలి. చివరగా నాశనం కాబోయే విరోధి మరణం. దేవుడు ఆయన పాదాలక్రింద సమస్తమూ ఉంచాడు. అయితే ఆయన క్రింద సమస్తమూ ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తమూ ఉంచినవాడు ఉండడని తేటతెల్లమే. సమస్తమూ కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తమూ ఉంచిన ఆయనకు వశమవుతాడు.
ఒకవేళ అలా కాకపోతే చనిపోయినవారికోసం బాప్తిసం పొందినవారు చేసేదేమిటి? చనిపోయినవారు ఎంత మాత్రం లేవరూ అంటే వారికోసం బాప్తిసం పొందడమెందుకని?
అంతేకాదు. మేము ఘడియ ఘడియకూ ప్రాణాపాయంలో ఎందుకుండాలి? మన ప్రభువైన క్రీస్తు యేసులో మీగురించి నాకున్న అతిశయాన్నిబట్టి నొక్కి చెపుతున్నాను – నేను ప్రతి రోజూ చావుకు గురి అవుతున్నాను. నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే గనుక అయితే నాకు లాభమేమిటి? చనిపోయిన వారు లేవకుండా ఉంటే “రేపు చచ్చిపోతాం గనుక తిందాం, తాగుతాం”. మోసపోకండి – “చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడతుంది”. దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు – మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెపుతున్నాను – గనుక నీతిన్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి.
అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు: “చనిపోయినవారిని లేపడమెలాగు? వారికెలాంటి దేహం ఉంటుంది?”
తెలివితక్కువవాడా, మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు గదా. అంతేకాదు, మీరు విత్తేది – అది గోధుమ గింజ కానివ్వండి, మరే గింజయినా కానివ్వండి – గింజే గాని కలగబోయే ఆకారం మీరు విత్తరు. దేవుడు ఆ గింజలోనుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు, విత్తనాలలో ప్రతి దానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు. అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం ఒక రకం, మృగ మాంసం వేరే రకం, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు. అలాగే ఆకాశంలో ఆకారాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి. అయితే ఆకాశంలో ఉన్నవాటి వైభవం ఒక తీరు. భూమిమీద ఉన్నవాటి వైభవం మరో తీరు. సూర్యమండలం వైభవం ఒక తీరు, చంద్రబింబం వైభవం మరో తీరు, నక్షత్రాల వైభవం ఇంకో తీరు. వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది.
చనిపోయినవారు సజీవంగా లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించే శరీరాన్ని విత్తడం, నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది. దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం, దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది. దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం, బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది. ఈ ప్రకృతిసిద్ధమైన శరీరంగా దానిని విత్తడం, ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది. ఈ సందర్భంలో, మొదటి మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది. అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ.
మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదు గాని ప్రకృతి సిద్ధమైనదీ. తరువాత ఆధ్యాత్మికమైనది కలిగేది. మొదటి మానవుడు భూసంబంధి, మట్టినుంచి రూపొందినవాడు. రెండో మానవుడు పరలోకంనుంచి వచ్చిన ప్రభువు. మట్టివారు ఆ మట్టివానిలాంటివారు, పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధిలాంటివారు. మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకొంటాం.
సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, రక్తమాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు. నశించేదానికి నశించనిదానిలో వారసత్వముండదు. ఇదిగో వినండి, ఒక రహస్య సత్యం మీకు తెలియజేస్తున్నాను – మనమంతా కన్ను మూయము గాని మనమంతా మార్పు చెందుతాం. ఇది ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటునే, చివరి బూర సమయంలోనే జరుగుతుంది. ఆ బూర మ్రోగుతుంది, చనిపోయినవారిని నశించనివారుగా లేపడం జరుగుతుంది, మనకు మార్పు కలుగుతుంది. ఈ నశించేది నశించనిదానిని ధరించు కోవాలి, ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి. ఈ నశించేది నశించనిదాన్ని ధరించుకొని ఈ మరణించేది మరణించనిదాన్ని ధరించు కొన్నప్పుడు, రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది: విజయం మృత్యువును మ్రింగివేసింది. “ఓ మరణమా, నీ విషపుకొండి ఎక్కడ? మృత్యులోకమా, నీ విజయమెక్కడ?”
మరణం కొండి అపరాధమే. అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. కాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు! ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనకు విజయం ఇస్తున్నాడు! అందుచేత, నా ప్రియ సోదరులారా, సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండండి.
కొరింతువారికి లేఖ 2 5:1-10
భూమిమీద మన నివాసమైన గుడారం నాశనమైపోతే దేవునివల్ల అయిన కట్టడం, చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు. పరలోకసంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం. నిజంగా దానిని ధరించు కొన్నప్పుడు మనం దిగంబరంగా కనబడము. “గుడారం”లో ఉన్న మనం భారంక్రింద మూలుగుతూ ఉన్నాం. ఇది తొలగించబడాలని కాదు గాని ఆ నివాసాన్ని ధరించు కోవాలని – చావుకు లోనయ్యేది జీవంవల్ల మింగివేయబడాలని మన ఆశ.
ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే. ఈ కారణంచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం. మనం శరీరంలో నివాసమున్నంత కాలం ప్రభువుతో లేమని తెలుసు – కంటికి కనిపించేవాటివల్ల కాదు గాని విశ్వాసంవల్లే నడుచుకొంటున్నాం. నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటే శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో, ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం.
అందుచేత మేము పెట్టుకొన్న లక్ష్యం ఏమిటంటే, శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే. ఎందుకంటే, మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు – చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే – చేసిన వాటి ప్రకారం పొందాలి.
ఫిలిప్పీవారికి లేఖ 1:20-24
నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా – నా జీవితంవల్ల గానీ మరణంవల్ల గానీ – పూర్ణ ధైర్యంతో నా శరీరంలో క్రీస్తుకు ఘనత కలుగుతుందని ఒకే పట్టుగా అధిక ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నా మట్టుకైతే జీవించడమంటే క్రీస్తే మరణించడమంటే లాభమే.
అయినా నేను శరీరంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఫలవంతమైన పని ఉంటుంది. నేనేమి కోరుకోవాలో నాకు తెలియదు. నేను ఈ రెంటిమధ్య చిక్కుబడి ఉన్నాను – లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. అయినా నేను శరీరంతో ఇంకా ఉండడం మీ కోసం మరీ అవసరం.
తెస్సలొనీకవారికి లేఖ 1 4:13-18
సోదరులారా, కన్ను మూసినవారిని గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులలాగా మీరు శోకించకూడదు. యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాం గదా. ఆ ప్రకారమే యేసులో కన్నుమూసినవారిని ఆయనతోకూడా దేవుడు తీసుకువస్తాడు. ప్రభువు మాటగా మేము మీకు చెప్పేదేమంటే, ప్రభువు రాకడ వరకూ బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనం కన్ను మూసినవారికంటే ముందరివారంగా ఉండం. ఎలాగంటే, ఆజ్ఞాపూర్వకమైన కేకతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దంతో ప్రభువు తానే పరలోకం నుంచి దిగివస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయినవారు మొదట లేస్తారు. ఆ తరువాత ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి ఇంకా బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనలను వారితోపాటు మేఘాలలో పైకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం. కాబట్టి ఈ మాటలచేత ఒకరినొకరు ఓదార్చుకోండి.
హీబ్రూవారికి లేఖ 2:14-15
ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్నకారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణ శక్తి గలవాణ్ణి, అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలనీ మరణ భయంచేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైనవారిని విడిపించాలనీ అందులో ఆయన ఉద్దేశం.
ప్రకటన 14:13
అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం నాకు వినిపించి “ఈ విధంగా రాయి: ఇప్పటినుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు” అంది. “అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి” అని దేవుని ఆత్మ చెపుతున్నాడు.
ప్రకటన 21:1-4
అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమి నాకు కనిపించాయి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేదు. నేను – యోహానును – పవిత్ర నగరమైన కొత్త జెరుసలం కూడా చూశాను. అది తన భర్తకోసం అలంకరించుకొన్న పెళ్ళికూతురులాగా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుంచి వస్తూ ఉంది.
అప్పుడు పరలోకంనుంచి ఒక గొప్ప స్వరం ఇలా చెప్పగా విన్నాను: “ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో నివసిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు. దేవుడు వారి కళ్ళలో నుంచి కన్నీళ్ళన్నీ తుడిచివేస్తాడు. అప్పటినుంచి చావు, దుఃఖం, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు. పూర్వమున్న విషయాలు గతించిపోయాయి.”
ప్రకటన 22:1-5
అప్పుడతడు స్ఫటికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవజల నది నాకు చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు. వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది. అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు.
ఒక క్రైస్తవుడు ఎలా జీవించాల'ని తెలుసుకోవాలనుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
యోహాను శుభవార్త 13:34-35
ఒక క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.”
రోమా వారికి లేఖ 12:9-13
మీ ప్రేమలో కల్లాకపటాలంటూ ఉండకూడదు. దుష్టత్వాన్ని అసహ్యించుకోండి. మంచిని అంటిపెట్టుకొని ఉండండి. సోదర ప్రేమతో ఒకరిమీద ఒకరు అభిమానం చూపండి. గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. శ్రద్ధాసక్తుల విషయంలో వెనుకపడకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుకు సేవ చేస్తూ వుండండి. ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి. పవిత్రుల అక్కరలలో సహాయపడుతూ ఉండండి. అతిథి సత్కారం చేయడానికి అవకాశాలు వెతకండి.
గలతీయవారికి లేఖ 5:22-26
దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు. క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితోకూడా దాని కోరికలనూ ఇచ్ఛలనూ సిలువ వేశారు. దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి నడుచుకొందాం. వట్టి డాంబికులం కాకుండా, ఒకరికొకరం కోపం రేపకుండా ఒకరిమీద ఒకరం అసూయపడకుండా ఉందాం.
ఎఫెసువారికి లేఖ 4:25-32
అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం, గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి. కోపపడండి గాని అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దు క్రుంకే ముందే అంతరించాలి. అపనింద పిశాచానికి చోటివ్వకండి. పూర్వం దొంగతనం చేసినవారు ఇకనుంచి దొంగతనం చేయకూడదు. అతడు అక్కరలో ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పని చేయాలి.
చెడ్డ మాటలేవీ మీ నోటినుంచి రానివ్వకండి గాని వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి. దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్ష దినంకోసం ఆయన మీమీద ముద్ర వేశాడు. సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి. ఒకరిమీద ఒకరు కరుణభావంతో దయ చూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 3:12-17
దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నాడు. మీరు పవిత్రులు, దేవుని ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి. వీటన్నిటికీ పైగా ప్రేమను దాల్చుకోండి. పరిపూర్ణ ఐక్యత కలిగించే బంధం ప్రేమే. మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞులై ఉండండి.
క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి. అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:12-22
సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ, ప్రభువులో మీమీద నాయకత్వం వహించి మీకు బుద్ధి చెపుతూ ఉన్నవారిని గుర్తించి వారి పనిని బట్టి వారిని ప్రేమభావంతో గొప్పగా గౌరవించండని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.
సోదరులారా! అక్రమంగా ప్రవర్తించేవారిని హెచ్చరించండి. క్రుంగిపోయినవారిని ప్రోత్సహించండి. దుర్బలులకు సహాయం చేయండి. అందరిపట్ల ఓర్పు చూపండి. ఎవరూ ఎవరికైనా అపకారానికి అపకారం చేయకుండా చూచుకోండి. ఒకరికొకరు, మనుషులందరికీ మేలైనదాన్ని అనుసరించండి. ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం. దేవుని ఆత్మను ఆర్పకండి. దేవుని మూలంగా పలికే వాటిని తృణీకరించకండి. అన్నిటినీ పరీక్షించండి, మంచివాటిని చేపట్టి ఉండండి. ప్రతి విధమైన దుష్టత్వాన్ని విసర్జించండి.
తీతుకు లేఖ 2:11-14
ఎందుకంటే, పాపవిముక్తి, రక్షణ తెచ్చే దేవుని కృప మనుషులందరికీ వెల్లడి అయింది. అది మనకు నేర్పుతున్నది ఏమంటే, మనం భక్తిహీనతనూ లోక సంబంధమైన ఇచ్ఛలనూ విసర్జించి ఈ యుగంలో మనసును అదుపులో ఉంచుకొంటూ ఉండాలి; నీతిన్యాయాలతో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి; దివ్యమైన ఆశాభావం కోసం, మన గొప్ప దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మనలను దుర్మార్గమంతటి నుంచీ విమోచించి, తన సొంత ప్రత్యేక ప్రజగా ఆసక్తితో మంచి పనులు చేసేవారుగా తన కోసం పవిత్రపరచుకోవాలని మనకోసం తనను తాను అర్పించుకొన్నాడు.
యాకోబు లేఖ 3:13-18
మీలో ఎవరికి తెలివి, గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తనచేత జ్ఞాన మూలమైన వినయంతో చేసిన క్రియలను కనుపరచాలి. కాని, తీవ్రమైన అసూయ, కలహభావం మీ హృదయంలో ఉంటే అతిశయంగా మాట్లాడకండి, సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి. ఈ “జ్ఞానం” పైనుంచి దిగి వచ్చేది కాదు. ఇది ఇహలోక సంబంధమైనది, సహజసిద్దమైనది, దయ్యాలచేత కలిగేది. ఎందుకంటే అసూయ, కలహ భావం ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్రమ పరిస్థితులు, ప్రతి విధమైన దురాచారం ఉంటాయి.
పైనుంచి వచ్చే జ్ఞానం ముఖ్యంగా పవిత్రంగా ఉండేది. అది శాంతికరమైనది, మృధువైనది, అణుకువ గలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది కపటం లేనిది. సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తినదానివల్ల నీతిన్యాయాల ఫలం కలుగుతుంది.
పేతురు లేఖ 2 1:3-9
తన మహిమను సుగుణాన్ని బట్టీ మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవానికీ భక్తికీ కావలసిన దంతా ఆయన దైవిక బలప్రభావాలు మనకు ఇచ్చాయి. ఆ మహిమ, సుగుణాలను బట్టి ఆయన ఎంతో గొప్ప ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మీరు లోకంలో దురాశవల్ల కలిగిన భ్రష్టత్వంనుంచి తప్పించుకొని దైవిక స్వభావంలో పాలివారు కావాలని ఆయన ఉద్దేశం.
ఈ కారణంచేతనే మీరు పూర్ణ శ్రద్ధాసక్తులు కలిగి మీ విశ్వాసంతో సుగుణం సమకూర్చుకోండి. సుగుణంతో జ్ఞానం, జ్ఞానంలో నిగ్రహం, నిగ్రహంతో సహనం, సహనంతో భక్తి, భక్తితో సోదరులపట్ల అనురాగం, ఆ అనురాగంతో దైవిక ప్రేమ సమకూర్చుకోండి. ఇవి మీకు ఉండి అధికం అవుతూ ఉంటే మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో వ్యర్థంగా, నిష్‌ఫలంగా ఉండరు. కానీ ఇవి లేని వ్యక్తి తన గత పాపాలకు శుద్ధి కలిగిన విషయం మరచిపోయినవాడు, గుడ్డివాడు, లేదా, దూరదృష్టి లేనివాడు.
ఏదో తప్పు చేయాలనుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలు చదవి తెలుసుకో
రోమా వారికి లేఖ 1:18-32
దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది. ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
ఆ కారణంచేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతోపాటు వారిని కల్మషానికి పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోనివాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తథాస్తు!
ఆ కారణంచేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహా సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకొన్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకొని ఒకణ్ణి ఒకడు మోహించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారు మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా.
దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడమంటే వారికి ఇష్టంగా లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి. వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు, తెలివితక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించనివారు, దయ చూపనివారు. ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు మరణానికి తగినవారనే దేవుని న్యాయనిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్నవారిని మెచ్చుకొంటారు.
కొరింతువారికి లేఖ 1 6:9-11
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
ఎఫెసువారికి లేఖ 5:3-5
కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు. అంతేగాక, బూతులు, పనికిమాలిన మాటలు, సరససల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు చెపుతూ ఉండాలి.
ఈ విషయం మీకు బాగా తెలుసు – ఏ వ్యభిచారి గానీ కల్మషుడు గానీ అత్యాశపరుడు (అతడు విగ్రహ పూజకుడు) గానీ దేవునికీ క్రీస్తుకూ చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండడు.
కొలస్సయివారికి లేఖ 3:5-10
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది. మునుపు వాటిలో బ్రతికినప్పుడు మీరూ వీటిని అనుసరించి నడుచుకొన్నారు. ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఎందుకంటే మీ పాత “మానవుణ్ణి” దాని పనులతోపాటు విసర్జించి సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో నవనూతన మవుతూ ఉన్న కొత్త “మానవుణ్ణి” ధరించుకొన్నారు.
యాకోబు లేఖ 4:17
కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం.
పేతురు లేఖ 1 4:3
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు.
యోహాను లేఖ 1 2:15-17
లోకాన్ని గానీ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో పరమ తండ్రి ప్రేమ లేదు. ఎందుకంటే, లోకంలో ఉన్నదంతా, అంటే శరీర స్వభావం కోరికలూ కండ్ల కోరికలూ జీవితాన్ని గురించిన బడాయిలూ తండ్రివల్ల కలిగేవి కావు గాని లోకంవల్లే కలిగేవి. లోకమూ దాని కోరికా గతించిపోతూ ఉన్నాయి గాని దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడు.
యోహాను లేఖ 1 3:4-5
అపరాధం చేయడం అభ్యసించే ప్రతి ఒక్కరూ న్యాయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అపరాధమంటే న్యాయం లేనట్టు ప్రవర్తించడం. మన అపరాధాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు. ఆయనలో అపరాధమేమీ లేదు.
దేవుడు ఆశించినంతగా జీవించలేకపోతున్నానని అనుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
యోహాను శుభవార్త 14:16-23
నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. ఈయన సత్యాత్మ. లోకం ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. నేను మిమ్ములను అనాథలనుగా విడిచివెళ్ళను. మీ దగ్గరకు వస్తాను. ఇంకా కొద్ది కాలం అయిందంటే లోకం నన్ను చూడనే చూడదు. మీరైతే నన్ను చూస్తారు. నేను బ్రతుకుతున్నాను గనుక మీరూ బ్రతుకుతారు. నేను నా తండ్రిలో ఉన్నాననీ మీరు నాలో ఉన్నారనీ నేను మీలో ఉన్నాననీ ఆ రోజున మీరు తెలుసుకొంటారు. నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
ఇస్కరియోతు కాని యూదా “ప్రభూ, దేనివల్ల లోకానికి కాక, మాకే నిన్ను వెల్లడి చేసుకుంటావు?” అని ఆయనను అడిగాడు.
యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రేమించేవారెవరైనా నా మాట ఆచరిస్తాడు. అలాంటి వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరకు మేము వస్తాం, అతనితో నివాసం చేస్తాం.
కొరింతువారికి లేఖ 1 10:13
మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
ఎఫెసువారికి లేఖ 3:20-21
మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
ఫిలిప్పీవారికి లేఖ 1:6
మీలో మంచి పని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినంవరకూ దాన్ని కొనసాగించుకొంటూ పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.
ఫిలిప్పీవారికి లేఖ 4:13
నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను.
కొలస్సయివారికి లేఖ 1:11-12
మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బలప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలని మా ప్రార్థన. వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలిభాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు.
తెస్సలొనీకవారికి లేఖ 1 5:23-24
శాంతిప్రదాత దేవుడు తానే మిమ్ములను పూర్తిగా పవిత్రపరుస్తాడు గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేటప్పుడు మీ ఆత్మ, ప్రాణం, శరీరం యావత్తూ నిందారహితంగా ఉండేలా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు గాక! మిమ్ములను పిలిచినవాడు నమ్మకమైనవాడు, ఆయన అలా చేస్తాడు.
హీబ్రూవారికి లేఖ 13:5-6
మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను. అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
యోహాను లేఖ 1 5:3-5
దేవుణ్ణి ప్రేమించడమంటే మనం ఆయన ఆజ్ఞలు శిరసావహించడమే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే, దేవునివల్ల జన్మించిన సంతతివారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించినది మన నమ్మకమే. లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడని నమ్మే వ్యక్తే!
క్రైస్తవుడైనందుకు హింసలు పొందుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 5:10-12
నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
“నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
మార్కు శుభవార్త 13:9-13
“మీరు జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే, వారు మిమ్ములను ఆలోచన సభలకు పట్టి ఇస్తారు. సమాజ కేంద్రాలలో మిమ్ములను కొట్టడం జరుగుతుంది. నాకోసం వారికి సాక్ష్యంగా మీరు ప్రాంతీయాధికారుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతానికి ముందుగా శుభవార్త అన్ని జనాలకూ ప్రకటించడం జరగాలి. వారు మిమ్ములను పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు ఏమి చెప్పాలా అని ముందుగా బెంబేలు పడకండి, పూర్వాలోచన చేయకండి. ఆ సమయంలో మీకు ఏ మాటలు ఇవ్వబడుతాయో అవే అనండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు గాని దేవుని పవిత్రాత్మే.
“సోదరుడు సోదరుణ్ణీ, తండ్రి తన సంతానాన్నీ మరణానికి పట్టి ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని చంపిస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్ములను ద్వేషిస్తారు. అయితే అంతంవరకు సహించేవారికి విముక్తి లభిస్తుంది.
లూకా శుభవార్త 12:4-9
“నా స్నేహితులారా, మీతో నేను చెప్పేదేమంటే శరీరాన్ని చంపేవారికి భయపడకండి. ఆ తరువాత వారు చేయగలిగేది ఏమీ లేదు. మీరెవరికి భయపడాలో మీకు చెపుతాను – ఆయన చంపిన తరువాత నరకంలో పడవేయడానికి అధికారం గల వ్యక్తికే. ఆయనకే భయపడండి అని మీతో అంటున్నాను.”
“అయిదు పిచ్చుకలు రెండు చిన్న నాణాలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక పిచ్చుక కూడా దేవుని సన్నిధిలో మరవబడదు. మీ తలవెండ్రుకలెన్నో లెక్క ఉంది. అందుచేత మీరేమీ భయపడకండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
“ఇంకొకటి మీతో నేనంటున్నాను, నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఎవరైనా ఒప్పుకొంటే అతణ్ణి మానవ పుత్రుడు దేవదూతల ఎదుట ఎరుగుదునని ఒప్పుకొంటాడు. కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వాణ్ణి దేవదూతల ఎదుట నేనూ ఎరగనంటాను.
యోహాను శుభవార్త 15:18-21
“లోకం మిమ్ములను ద్వేషిస్తే, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు. ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది. కానీ మీరు లోకానికి చెందినవారు కారు. మిమ్ములను లోకంలోనుంచి ఎన్నుకొన్నాను. లోకం మిమ్ములను ద్వేషించే కారణం ఇదే. నేను మీతో చెప్పిన ఈ మాట జ్ఞాపకముంచుకోండి – ‘దాసుడు తన యజమానికంటే మించినవాడు కాడు.’ వారు నన్ను హింసించారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు. అయితే నన్ను పంపినవాణ్ణి వారు ఎరుగరు గనుక నా పేరుకారణంగా అవన్నీ మీపట్ల జరిగిస్తారు.
యోహాను శుభవార్త 16:1-4
“మీరు తొట్రుపడకూడదని నేను ఈ విషయాలు మీతో చెప్పాను. వారు మిమ్ములను సమాజ కేంద్రాలనుంచి వెలివేస్తారు. మిమ్ములను ఎవరైనా చంపితే తాను దేవునికి సేవ చేస్తున్నట్టు అనుకొనేకాలం కూడా వస్తూ ఉంది. వారు తండ్రినీ నన్నూ తెలుసుకోలేదు గనుక ఆ విధంగా మీకు చేస్తారు. ఆ కాలం వచ్చేటప్పుడు ఈ విషయాలు మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వీటిని గురించి మీతో చెపుతున్నాను. మొదట్లో ఈ విషయాలు మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను.
అపొస్తలుల కార్యాలు 5:41
ఆయన పేరుకోసం అవమానానికి పాత్రులుగా ఎంచబడినందుచేత వారు ఆనందిస్తూ సమాలోచన సభనుంచి వెళ్ళిపోయారు.
రోమా వారికి లేఖ 8:35-37
క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
రోమా వారికి లేఖ 12:14
మిమ్ములను హింసించేవారిని దీవించండి. శపించకండి గాని దీవించండి.
రోమా వారికి లేఖ 12:17-21
అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకొనే విషయాలను ఆలోచించండి. మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగతీర్చుకోకండి గాని దేవుని కోపానికి అవకాశమివ్వండి. పగతీర్చే పని నాదే అని ప్రభువు చెపుతున్నాడని రాసి ఉంది గదా. అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికెలు పోసినట్టే. కీడువల్ల అపజయం పాలుకాకండి గాని మేలుతో కీడును జయించండి.
కొరింతువారికి లేఖ 1 4:11-13
ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం. సరిపోని దుస్తులు తొడుక్కొంటున్నాం. పిడిగుద్దులు తింటున్నాం. నిలువ నీడ లేకుండా ఉన్నాం. సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాం. నిందల పాలయినప్పుడు దీవిస్తాం. హింసలకు గురి అయితే ఓర్చుకొంటాం. అపనిందలు వచ్చినప్పుడు వేడుకొంటాం. ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఉన్నాం.
కొరింతువారికి లేఖ 2 4:8-12
అన్ని వైపులా ఒత్తిడి మామీదికి వస్తూ ఉంది గాని మేము ఇరుక్కొనిపోవడం లేదు. ఆందోళన పడుతున్నాం గాని నిరాశ చెందడం లేదు. హింసలకు గురి అవుతూ ఉన్నాం గాని విడిచిపెట్టబడ్డవారం కాము. మమ్ములను పడద్రోయడం జరుగుతూ ఉంది గాని మేము నాశనం కావడం లేదు. యేసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణం కూడా మా శరీరంలో ఎప్పుడూ భరిస్తూ ఉన్నాం. ఎలాగంటే, చావుకు లోనయ్యే మా శరీరాలలో యేసు జీవం వెల్లడి అయ్యేలా సజీవులమైన మమ్ములను యేసుకోసం మరణానికి అప్పగించడం ఎప్పుడూ జరుగుతూ ఉంది. అందుచేత మాలో మరణం, మీలో జీవం పని చేస్తూ ఉన్నాయి.
కొరింతువారికి లేఖ 2 12:10
నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఫిలిప్పీవారికి లేఖ 1:28-29
ఇలాంటి ప్రవర్తన మీ విరోధులకు నాశనం, మీకు మోక్షం, దేవుని నుంచి మోక్షం, కలుగుతాయని రుజువుగా ఉంది. మునుపు మీరు నాలో పోరాటం ఉండడం చూశారు, అది ఇప్పుడు కూడా నాలో ఉందని విన్నారు. ఆ పోరాటమే మీకు కూడా ఉంది.
తెస్సలొనీకవారికి లేఖ 2 1:4-8
అందుచేత మీరు భరిస్తూ వచ్చిన అన్ని హింసలలో బాధలలో మీకున్న ఓర్పు, నమ్మకం కారణంగా మేము దేవుని సంఘాలలో అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాం. దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువు గా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి తగినవారుగా లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే.
దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది. దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు.
తిమోతికి లేఖ 2 3:10-13
నీవైతే నా ఉపదేశం, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, ఓర్పు, ప్రేమభావం, సహనశీలత, అంతియొకయలో ఈకొనియలో లుస్త్రలో నాకు కలిగిన హింసలూ కడగండ్లూ – ఎలాంటి హింసలు నేను అనుభవించానో – ఇదంతా తెలుసుకొని శ్రద్ధతో అనుసరించావు. అన్ని హింసలలో నుంచి ప్రభువు నన్ను విడిపించాడు. వాస్తవంగా, క్రీస్తు యేసులో దైవభక్తితో బ్రతకడానికి ఇష్టమున్నవారంతా హింసకు గురి అవుతారు. దుర్మార్గులూ వంచకులూ అయితే మోసపరుస్తూ, మోసపోతూ అంతకంతకూ చెడిపోతూ ఉంటారు.
హీబ్రూవారికి లేఖ 10:32-39
మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తరువాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం ఓర్చుకొన్నారు. దానిలో కొంత మీరు నిందలకూ కడగండ్లకూ గురి అయి బహిరంగంగా వింత దృశ్యం కావడంవల్ల కలిగింది. మరి కొంత మీరు అలాంటివాటికి గురి అయినవారితో సహవాసం చేసినందువల్ల కలిగింది. ఎలాగంటే, మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు. మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే, దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకొన్నారు.
అందుచేత మీ ధైర్యాన్ని వదలిపెట్టకండి. దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది. మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం. “ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు, ఆలస్యం చేయడు. గానీ న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు. ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో నాకు సంతోషం ఉండదు.”
అయితే మనం నాశనానికి వెనక్కు తీసేవారం కాము గాని ఆత్మ రక్షణకు నమ్మేవారమే.
హీబ్రూవారికి లేఖ 12:3-4
మీ ప్రాణాలకు అలసట, నిరుత్సాహం కలగకుండా పాపాత్ములవల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓర్చుకున్న ఆయనను బాగా తలపోయండి.
పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చిందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు.
పేతురు లేఖ 1 3:13-17
మీరు మేలైనదాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు? ఒకవేళ నీతినిజాయితీకోసం బాధలకు గురి కావలసివచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారుపడవద్దు. మీ హృదయాలలో ప్రభువైన దేవుణ్ణి ప్రతిష్టించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికీ సాత్వికంతో భయభక్తులతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకొనే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి. ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే, చెడుతనం చేసి బాధలకు గురి కావడం కంటే అది మేలు.
పేతురు లేఖ 1 4:12-19
ప్రియ సోదరులారా, మీమధ్య వాటిల్లుతూ ఉన్న మంటల్లాంటి విపత్తు మిమ్ములను పరీక్షించడానికే. మీకేదో విపరీతం జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకండి. అయితే క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో ఉప్పొంగిపోయేలా ఇప్పుడు ఆయన బాధలలో మీరు పాలివారై ఉన్నంతగా ఆనందించండి. ఒకవేళ క్రీస్తు పేరుకోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీమీద నిలిచి ఉన్నాడన్నమాట. వారివైపున ఆయన దూషించబడుతున్నాడు, మీవైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. కానీ మీలో ఎవరూ హంతకుడుగా గానీ దొంగగా గానీ దుర్మార్గుడుగా గానీ పరుల జోలికి పోయేవాడుగా గానీ బాధలు అనుభవించకూడదు. ఎవరైనా క్రైస్తవుడైనందుచేత బాధలు అనుభవించవలసివస్తే సిగ్గుపడకూడదు. అయితే ఈ విషయంలో దేవుణ్ణి కీర్తించాలి.
దేవుని ఇంటివారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమయితే దేవుని శుభవార్తకు విధేయత చూపనివారి అంతం ఏమవుతుంది! న్యాయవంతునికే రక్షణ, విముక్తి కలగడం కష్టమైతే భక్తిహీనులూ పాపులూ ఎక్కడ కనిపిస్తారో! అందుచేత దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవిస్తున్నవారు మంచి చేస్తూ తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి.
ప్రకటన 2:10
నీకు రాబోయే కష్టాలకు భయపడకు. ఇదిగో విను, అపవాద పిశాచం మీలో కొందరిని ఖైదులో వేయించ బోతున్నాడు. ఇది మీ పరీక్షకోసమే. పది రోజులపాటు మీరు బాధలకు గురి అవుతారు. మరణంవరకు నమ్మకంగా ఉండు. నీకు జీవ కిరీటం ఇస్తాను.
సహ విశ్వాసులను తరచుగా కలుసుకోవాలని అవసరం లేదని నీవు భావిస్తున్నట్లైతే ఈ వాక్యభాగాలను మననం చేసుకో
మత్తయి శుభవార్త 18:19-20
ఇంకొకటి మీతో చెపుతాను, భూమిమీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే, పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు. ఎందుకంటే, నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూడుతారో అక్కడ నేనూ వారి మధ్య ఉంటాను.”
అపొస్తలుల కార్యాలు 2:41-47
అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.
వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు. ప్రతి ఒక్కరికీ భయం ముంచుకు వచ్చింది. క్రీస్తురాయబారులు అనేక ఆశ్చర్యకరమైన క్రియలు, సూచకమైన అద్భుతాలు చేశారు. విశ్వాసులంతా ఒకటిగా కలిసి తమకు కలిగినదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు. ఇదీ గాక, తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికీ అక్కరకొలది పంచి ఇస్తూ వచ్చారు. ప్రతి రోజూ ఎడతెగకుండా వారు ఏకమనస్సుతో దేవాలయంలో ఉన్నారు. ఇంటింట రొట్టె విరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆనందంతోనూ యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారు. ప్రజలంతా వారిని అభిమానించారు. పాపవిముక్తి పొందుతున్నవారిని ప్రతి రోజూ ప్రభువు తన సంఘంతో చేరుస్తూ వచ్చాడు.
రోమా వారికి లేఖ 12:4-8
ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం. ప్రత్యేకంగా ఒకరికొకరం అవయవాలై ఉన్నాం.
దేవుడు మనకు అనుగ్రహించిన కృపప్రకారం వేరువేరు కృపావరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వరం దేవునిమూలంగా పలకడం అయితే మన నమ్మకం కొలది అలా చేయాలి. అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి. ఉపదేశమైతే ఉపదేశించడంలో ఆ వరం ఉపయోగించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి. నాయకత్వం వహించేవాడు దానిని శ్రద్ధతో నిర్వహించాలి. దయ చూపేవాడు సంతోషంతో చూపాలి.
ఎఫెసువారికి లేఖ 1:22-23
అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.
ఎఫెసువారికి లేఖ 4:11-16
ఆయన తన రాయబారులుగా కొందరినీ, ప్రవక్తలను కొందరినీ, శుభవార్త ప్రచారకులను కొందరినీ, సంఘ కాపరులూ ఉపదేశకులూ అయిన కొందరినీ సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే, పవిత్రులు సేవ చేసేందుకు సమర్థులు కావాలనీ క్రీస్తు శరీరం పెంపొందాలనీ ఆయన ఉద్దేశం. మనమందరమూ నమ్మకంలో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది, సంపూర్ణ వృద్ధికి వచ్చేవరకూ – క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకొనేవరకూ ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. మనం ఇకనుంచి పసి పిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే, అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికీ ఎగిరిపోయేవారిలాగా మనముండకూడదు. మనుషులు కపటంచేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. గానీ ప్రేమతో సత్యం చెపుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు. ఆయననుంచి శరీరమంతా ప్రతి కీలూ అందించే దానిచేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అందులోని ప్రతి భాగమూ సరిగా దాని పని చేయడంవల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్థిల్లుతూ ఉంటుంది.
కొలస్సయివారికి లేఖ 3:15-17
మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞులై ఉండండి.
క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి. అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
తిమోతికి లేఖ 1 4:13
నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు.
హీబ్రూవారికి లేఖ 10:24-25
అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం. సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరచుకొంటూ, ఆ దినం దగ్గరపడడం చూచేకొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం.
నీకు ఎవరైనా హాని కలిగిస్తే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 6:12-15
మాకు రుణపడ్డవారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను క్షమించు.
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
“మనుషులు మీ విషయంలో చేసిన తప్పిదాలను బట్టి మీరు వారిని క్షమిస్తే మీ పరమ తండ్రి మిమ్ములనూ క్షమిస్తాడు. కానీ మనుషులు చేసిన తప్పిదాలను మీరు క్షమించకపోతే, మీ తప్పిదాలు మీ పరమ తండ్రి క్షమించడు.
మత్తయి శుభవార్త 18:21-35
ఆ సమయాన పేతురు వచ్చి ఆయనను ఇలా అడిగాడు: “ప్రభూ, నా సోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే నేను ఎన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్ల వరకా?”
ఇది అతనికి యేసు ఇచ్చిన జవాబు: “ఏడు సార్ల మట్టుకే కాదు – ఏడు డెబ్భైల వరకు అని నీతో అంటున్నాను. కాబట్టి, పరలోక రాజ్యం ఇలా ఉన్నది: ఒక రాజు తన దాసుల విషయం లెక్కలు చూడాలని కోరాడు. లెక్కలు పరిష్కారం చేయడం ఆరంభించినప్పుడు అతనికి పది వేల తలాంతులు బాకీపడ్డ దాసుణ్ణి అతని దగ్గరకు తెచ్చారు. బాకీ తీర్చుకోవడానికి ఆ దాసుని దగ్గర ఏమీ లేదు, గనుక అతణ్ణీ అతని భార్యాబిడ్డలనూ అతనికి కలిగినదంతా అమ్మి బాకీ తీర్చాలని అతని యజమాని ఆజ్ఞ జారీ చేశాడు. గనుక ఆ దాసుడు యజమాని ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ‘యజమానీ, నా విషయం ఓపిక పట్టండి. మీకు అంతా చెల్లిస్తాను’ అన్నాడు. ఆ దాసుని యజమానికి జాలి వేసింది. బాకీ రద్దు చేసి అతణ్ణి విడిచిపెట్టాడు.
“అయితే ఆ దాసుడే బయటికి వెళ్ళి, సాటి దాసులలో తనకు నూరు దేనారాలు బాకీపడ్డ ఒకణ్ణి చూచి అతణ్ణి జప్తుచేసి ‘నాకు బాకీ తీర్చు’ అంటూ అతని గొంతు పట్టుకొన్నాడు. ఆ సాటి దాసుడు అతని పాదాల దగ్గర సాగిలపడి, ‘నా విషయం ఓపిక పట్టు. నీకు అంతా చెల్లిస్తాను’ అని వేడుకొన్నాడు. అతడు ఒప్పుకోలేదు. అతడు బాకీ తీర్చేవరకు అతణ్ణి ఖైదులో వేయించాడు. అయితే అతని సాటి దాసులు జరిగినది చూచి, చాలా విచారపడుతూ తమ యజమాని దగ్గరకు వెళ్ళి అతనికి జరిగినదంతా తెలియజేశారు. అప్పుడు అతని యజమాని అతణ్ణి పిలిపించి అతనితో ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొన్నందుచేత నీ అప్పు అంతా రద్దు చేశానే! నేను నీమీద దయ చూపినట్టే నీ సాటి దాసుడిమీద జాలి చూపకూడదా ఏమిటి?” అతని యజమాని కోపగించి తన బాకీ అంతా తీర్చేవరకు చిత్రహింస పెట్టేవారికి అతణ్ణి అప్పగించాడు.
“మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుణ్ణి అతని అతిక్రమాల విషయం హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరమ తండ్రి మీకు అలాగే చేస్తాడు.”
మార్కు శుభవార్త 11:25
అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా, పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైన దేదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి.
లూకా శుభవార్త 17:3-4
“మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. అతడు పశ్చాత్తాపపడితే అతణ్ణి క్షమించండి. ఒకవేళ అతడు మీకు వ్యతిరేకంగా ఒక్క రోజునే ఏడు సార్లు అపరాధం చేసి ఒక్క రోజునే ఏడు సార్లు మీ దగ్గరకు వచ్చి ‘పశ్చాత్తాపపడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
రోమా వారికి లేఖ 12:17-21
అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకొనే విషయాలను ఆలోచించండి. మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగతీర్చుకోకండి గాని దేవుని కోపానికి అవకాశమివ్వండి. పగతీర్చే పని నాదే అని ప్రభువు చెపుతున్నాడని రాసి ఉంది గదా. అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికెలు పోసినట్టే. కీడువల్ల అపజయం పాలుకాకండి గాని మేలుతో కీడును జయించండి.
ఎఫెసువారికి లేఖ 4:31-32
సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి. ఒకరిమీద ఒకరు కరుణభావంతో దయ చూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 3:13
ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి.
నీకు వివాహమైనట్లైతే ఈ వాక్యాలను చదువు
కొరింతువారికి లేఖ 1 7:1-16
మీరు నాకు రాసినవాటి విషయం – స్త్రీని ముట్టకపోవడం పురుషుడికి మేలు. అయినా జారత్వం ఉన్న సంగతినిబట్టి ప్రతి పురుషుడు సొంత భార్య, ప్రతి స్త్రీ సొంత భర్త కలిగి ఉండవచ్చు. భర్త తన భార్యపట్ల వివాహధర్మం నెరవేరుస్తూ ఉండాలి, తన భర్తపట్ల భార్యకూడా అలాగే చేయాలి. భార్యకు తన శరీరంమీద అధికారం లేదు – అది భర్తకే ఉంది. అలాగే భర్తకు తన శరీరం మీద అధికారం లేదు – అది భార్యకే ఉంది. మీకు ఉపవాసం, ప్రార్థన కోసం సావకాశం కలిగించుకోవడానికి కొంత కాలంవరకు ఇద్దరూ సమ్మతిస్తేనే తప్ప ఒకరికి ఒకరు లొంగిపోకుండా ఉండకూడదు. ఆ తరువాత, మీ కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం బట్టి సైతాను మిమ్ములను శోధించ కుండేలా మళ్ళీ కలుసుకోండి.
నేనిది ఆజ్ఞగా చెప్పడం లేదు, గాని అనుమతిగా మాత్రమే. అయినా మనుషులంతా నాలాగే ఉండాలని నా కోరిక. అయితే ప్రతి ఒక్కరికి దేవుని నుంచి సొంత కృపావరం ఉంది. ఇది ఒకరికి ఒక విధంగా మరొకరికి ఇంకో విధంగా ఉంటుంది. కానీ నాలాగే ఉండిపోతే మంచిదని పెళ్ళికాని వారితో, విధవరాండ్రతో అంటున్నాను. అయినా కోరికలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే పెళ్ళి చేసుకోవచ్చు. కామాగ్నితో మాడిపోతూ ఉండడం కంటే పెళ్ళి చేసుకోవడం మంచిది.
పెళ్ళైనవారికి నేనిచ్చే ఆదేశమిదే – అసలు, ఇచ్చేది నేను కాదు, ప్రభువే: “భార్య భర్తకు వేరైపోకూడదు.” ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి. లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు.
తక్కినవారితో ప్రభువు కాదు, నేనే ఇలా చెపుతున్నాను: ఒక సోదరునికి ప్రభువును నమ్మని భార్య ఉందనుకోండి. ఆమెకు అతనితో కాపురం చేయడం ఇష్టమైతే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఒకామెకు ప్రభువును నమ్మని భర్త ఉన్నాడనుకోండి. అతనికి ఆమెతో కాపుర ముండడం ఇష్టమైతే ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నమ్మని భర్త నమ్మిన భార్య కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినవాడు నమ్మని భార్య నమ్మిన భర్త కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినది. లేకపోతే మీ పిల్లలు అశుద్ధులుగా ఉండి ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు.
ఒకవేళ నమ్మని వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. అలాంటి పరిస్థితిలో సోదరునికి గానీ సోదరికి గానీ బంధనం లేదు. దేవుడు మనలను శాంతి అనుభవించడానికి పిలిచాడు. పెళ్ళైన స్త్రీ! నీద్వారా నీ భర్తకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు? పెళ్ళైన పురుషుడా! నీ ద్వారా నీ భార్యకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు?
ఎఫెసువారికి లేఖ 5:21-33
దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి.
పెళ్ళి అయిన స్త్రీలారా, ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరస్సు, శరీరానికి రక్షకుడు. అలాగే భర్త భార్యకు శిరస్సు. గనుక తన సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో లోబడివుండాలి.
పెండ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. దేవుని వాక్కు అనే నీళ్ళతో స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచేందుకు క్రీస్తు దానికోసం తనను అర్పించుకొన్నాడు. సంఘం పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలనీ మచ్చ, మడత, అలాంటి మరేదీ లేకుండా దివ్యమైనదిగా దానిని తనముందు నిలబెట్టుకోవాలనీ ఆయన అలా చేశాడు. అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలనులాగే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకొంటున్నాడన్నమాట. సొంత శరీరాన్ని ద్వేషించుకొనేవాడెవడూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొంటాడు. ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకొంటాడు. ఎందుకంటే మనం ఆయన మాంసం, ఎముకలలో ఆయన శరీరంలోని భాగాలం.
“అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరమవుతారు.” ఈ రహస్య సత్యం గొప్పది. అయితే నేను క్రీస్తునూ సంఘాన్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అయినా మీలో ప్రతివాడూ తనలాగే తన భార్యను ప్రేమించాలి. భార్య భర్తను గౌరవించాలి.
కొలస్సయివారికి లేఖ 3:18-19
పెళ్ళి అయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. పెళ్ళి అయిన పురుషులారా, మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. వారికి కష్టం కలిగించకండి.
తీతుకు లేఖ 2:3-5
అలాగే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలు కాకుండా, ద్రాక్షమద్యం వశంలో ఉండకుండా, నడవడిలో భయభక్తులు గలవారై మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. వారు యువ స్త్రీలకు బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుని వాక్కు దూషణకు గురి కాకుండా వారు తమ భర్తలనూ సంతానాన్నీ ప్రేమతో చూడాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, పవిత్ర శీలవతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయ గలవారై ఉండాలి. తమ భర్తలకు లోబడి ఉండాలి.
హీబ్రూవారికి లేఖ 13:4
వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
పేతురు లేఖ 1 3:1-7
అలాగే పెండ్లయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనమూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు. భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు. జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం – మీది ఇలాంటి బయటి అలంకారం కాకూడదు. దానికి బదులు మీ లోపలి స్వభావం – శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఇలాగే గతంలో దేవునిమీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకొనేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు. ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలయింది. మీరు ఎలాంటి బీతిభయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు.
పెండ్లయిన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురముండండి. కృపవల్ల కలిగిన జీవంలో వారు మీతోకూడా పాలివారనీ మీకంటే బలహీనమైన పాత్రలనీ వారిని గౌరవించండి.
మత్తయి శుభవార్త 5:31-32
“భార్యతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెకు విడాకులు ఇవ్వాలనేది కూడా పూర్వం చెప్పిన మాట. కానీ మీతో నేను చెపుతున్నాను, భార్య వ్యభిచరించి నందుచేత తప్ప మరో కారణంవల్ల ఆమెతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. అలా తెగతెంపులయిన ఒక స్త్రీని పెళ్ళాడేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
మత్తయి శుభవార్త 19:3-9
పరిసయ్యులు కొందరు కూడా ఆయనదగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలని ఇలా అడిగారు: “ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యతో తెగతెంపులు చేసుకోవడం ధర్మమా?”
అందుకాయన జవాబిస్తూ “మొదట్లో సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చేశాడు, ‘అందుకే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అన్నాడు’ ఇది మీరు చదవలేదా? కాబట్టి అప్పటినుంచి వారు ఇద్దరు కాదు గాని ఒక్కటే శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు ఏకంగా చేసినవారిని మనిషి వేరు చేయకూడదు” అని వారితో అన్నాడు.
వారు “అయితే విడాకులిచ్చి ఆమెతో తెగతెంపులు చేసుకొమ్మని మోషే ఎందుకు ఆదేశించాడు?” అని ఆయనను అడిగారు.
యేసు వారితో అన్నాడు, “మోషే మీ హృదయాలు బండబారిపోవడం కారణంగా మీ భార్యలతో తెగతెంపులు చేసుకోవడానికి అనుమతించాడు. కానీ ఆరంభంనుంచి అలా లేదు. మీతో నేను అంటాను, ఎవడైనా భార్య వ్యభిచారం చేసినందుకు తప్ప ఆమెతో తెగతెంపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడితే వ్యభిచరిస్తున్నాడు. తెగతెంపులకు గురి అయిన ఆమెను పెండ్లి చేసుకొనేవాడు వ్యభిచరిస్తున్నాడు.”
లూకా శుభవార్త 16:18
“తన భార్యకు విడాకులిచ్చి మరో స్త్రీని పెండ్లి చేసుకొనే వాడెవరైనా వ్యభిచరిస్తున్నాడు. విడాకులు తీసుకొన్న ఆమెను పెండ్లి చేసుకొన్న వాడెవడైనా వ్యభిచరిస్తున్నాడు.
రోమా వారికి లేఖ 7:2-3
పెండ్లయిన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంతవరకూ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది గాని భర్త చనిపోతే భర్తను గురించిన చట్టంనుంచి ఆమె విడుదల అవుతుంది. అయితే భర్త ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఆమె మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొంటే ఆమెను వ్యభిచారిణి అనడం జరుగుతుంది. భర్త చనిపోతే ఆమెకు ఆ చట్టం నుంచి విడుదల కలుగుతుంది గనుక మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొన్నా ఆమె వ్యభిచారిణి కాదు.
ఎవరివలనైనా లైంగికపరమైన శోధనకు ప్రేరేపించ బడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 5:27-28
“వ్యభిచారం చేయకూడదని పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు గదా. కానీ మీతో నేను చెపుతున్నాను, ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపు చూస్తే, అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
యోహాను శుభవార్త 8:2-11
ప్రొద్దున పెందలకడ ఆయన దేవాలయంలోకి తిరిగి వచ్చాడు. ఆయన దగ్గరికి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకువచ్చారు. ఆమె వ్యభిచార క్రియలో పట్టుబడింది. వారు ఆమెను మధ్యలో నిలబెట్టి ఆయనతో ఇలా అన్నారు: “ఉపదేశకా! ఈ స్త్రీ వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది. ధర్మశాస్త్రంలో మోషే ఇలాంటి స్త్రీలను రాళ్ళు రువ్వి చంపాలని మనకాజ్ఞ ఇచ్చాడు. అయితే మీరేమంటారు?”
ఆయనమీద నేరం మోపడానికి కారణం కనుక్కోవాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. అయితే యేసు తాను ఆలకించనట్టు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు. వారు పట్టు విడువకుండా ఆయనను అడుగుతూ వచ్చారు గనుక ఆయన లేచి “మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు” అన్నాడు. అప్పుడాయన మళ్ళీ వంగి నేలమీద వ్రాశాడు.
ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయి – మొదట పెద్దలు నుండి చివరివాడి వరకు – ఒకరి తరువాత ఒకరు బయటికి వెళ్ళారు. చివరికి మధ్య నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే.
యేసు లేచి ఆ స్త్రీ తప్ప మరెవరినీ చూడకుండా “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధించలేదా?” అని అడిగాడు. ఆమె “లేదు ప్రభూ” అంది. యేసు “నేనూ నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి అపరాధం చేయకుండా ఉండు” అన్నాడు.
రోమా వారికి లేఖ 13:8-10
ఎవరికీ ఏమి బాకీ పడి ఉండకండి – ఒకరినొకరు ప్రేమతో చూడడం అనే బాకీ తప్ప. ఇతరులను ప్రేమతో చూచేవాడు తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడయ్యాడు. “వ్యభిచారం చెయ్యకూడదు”, “హత్య చెయ్యకూడదు”, “దొంగతనం చెయ్యకూడదు”, “మీరు పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు”, “పొరుగువారిది ఆశించకూడదు” – ఈ ఆజ్ఞలు, మరే ఆజ్ఞ అయినా సరే ఈ వాక్కులోనే ఇమిడి ఉన్నాయి: “మిమ్ములను ప్రేమించుకొన్నట్టు మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” ప్రేమ పొరుగువారికి హాని ఏమీ చేయదు. అందుచేతే ప్రేమ ధర్మశాస్త్రానికి నెరవేర్పు.
కొరింతువారికి లేఖ 1 6:9-20
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. గాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. అయితే నన్ను ఏదీ వశపరచుకోనివ్వను. ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి, కడుపు ఆహారాలకోసం ఉంది. అయినా దేవుడు దానినీ వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం లైంగిక అవినీతికోసం కాదు గాని ప్రభువుకోసమే. ప్రభువు శరీరం కోసం. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు, తన బలప్రభావాలతో మనలను కూడా సజీవంగా లేపుతాడు.
మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా కానే కాదు. వేశ్యతో కలిసినవాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరమవుతార”ని దేవుడు అన్నాడు గదా. ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకటే ఆత్మ అయి ఉన్నాడు. లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతీది శరీరానికి బయటే ఉంది. లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు.
మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా? వెల పెట్టి మిమ్ములను కొనడం జరిగింది గనుక దేవునివై ఉన్న మీ శరీరంతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి.
గలతీయవారికి లేఖ 5:19
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం,
ఎఫెసువారికి లేఖ 5:3
కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు.
కొలస్సయివారికి లేఖ 3:5-6
అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది.
తెస్సలొనీకవారికి లేఖ 1 4:1-8
మెట్టుకు, సోదరులారా, మేము ప్రభువైన యేసు అధికారంతో మీకిచ్చిన ఆదేశాలేవో మీకు తెలుసు. మీరెలా ప్రవర్తిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలో మాచేత ఉపదేశం పొందారు. ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్ములను ప్రభువైన యేసులో పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
దేవుని చిత్తం మీరు పవిత్రంగా ఉండడం, మీరు వ్యభిచారం విసర్జించడం, దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలాగా కామవికారంతో లేకుండా మీలో ప్రతి ఒక్కరూ తన పాత్రను పవిత్రంగా, ఘనంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం. ఈ విషయంలో ఎవ్వడూ ఆసరాగా తీసుకొని తన సోదరుణ్ణి వంచించకూడదు. ఇలాంటి విషయాలన్నిటిలో ప్రభువు ప్రతీకారం చేసేవాడు. మునుపు దీన్ని గురించి మేము చెప్పి సాక్షులుగా మిమ్ములను హెచ్చరించాం గదా. దేవుడు మనలను పిలిచింది కల్మషం కోసం కాదు గాని పవిత్రత కోసమే. కనుక ఈ ఉపదేశం నిరాకరించేవారు మనుషులను నిరాకరించడం లేదు గాని మనకు తన ఆత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నారు.
హీబ్రూవారికి లేఖ 13:4
వివాహమంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు.
యూదా లేఖ 1:7
వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలూ లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా సశరీరులకు వెంటబడుతూ ఉండడంచేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండనపాలై ఉదాహరణగా ప్రదర్శించ బడుతున్నాయి.
నీకు బిడ్డలు ఉన్నట్లైతే ఈ వాక్యాలను చదువు
ఎఫెసువారికి లేఖ 6:1-4
పిల్లలారా! ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది న్యాయం. “మీకు క్షేమం కలిగేలా, భూమిమీద ఎక్కువ కాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి” – వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే.
తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు గురించిన ఉపదేశంతో, క్రమశిక్షణతో వారిని పెంచండి.
కొలస్సయివారికి లేఖ 3:20-21
పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే ఇది ప్రభువుకు సంతోషకరం. తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహ పడకుండా వారిని చికాకుపరచకండి.
తిమోతికి లేఖ 1 3:4-5
తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకొనేవాడై ఉండాలి. ఎవడైనా సరే తన కుటుంబానికి నాయకత్వం నిర్వహించుకోవడమెలాగో తెలియనివాడైతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూచుకోగలడు?
నీ తల్లిదండ్రులు ఇంకా జీవించివున్నయెడల ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 15:3-6
అందుకాయన వారికిలా బదులు చెప్పాడు: “మీరు మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను మీరుతున్నారెందుకు? దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు గదా: మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిని గానీ తండ్రిని గానీ దూషించేవారికి మరణశిక్ష విధించి తీరాలి. మీరైతే ఇలా అంటారు: ఎవడైనా తండ్రిని గానీ తల్లిని గానీ చూచి ‘నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్తా దేవునికి అర్పించబడింది’ అని చెపితే అలాంటివాడు ఆ విషయంలో తండ్రిని గానీ తల్లిని గానీ గౌరవించనక్కరలేదన్న మాట. ఈ విధంగా మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తున్నారు.
ఎఫెసువారికి లేఖ 6:1-3
పిల్లలారా! ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది న్యాయం. “మీకు క్షేమం కలిగేలా, భూమిమీద ఎక్కువ కాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి” – వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే.
కొలస్సయివారికి లేఖ 3:20
పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే ఇది ప్రభువుకు సంతోషకరం.
తిమోతికి లేఖ 1 5:4-8
అయితే ఒక విధవరాలికి పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఉంటే, వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది. నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవునిమీదే నమ్మకం ఉంచి రాత్రింబగళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ సుఖాసక్తితో బ్రతుకుతున్న ఆమె జీవచ్ఛవం లాంటిదే. వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు.
ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేనివాడికంటే చెడ్డవాడు.
ఎవరైనా నీ సహాయం కోరుకుంటున్నట్లైతే ఈ వాక్యా భాగాలను చదువు
మత్తయి శుభవార్త 7:12
“కాబట్టి అన్ని విషయాలలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని ఆశిస్తారో అదే వారికి చేయండి. ధర్మశాస్త్రమూ, ప్రవక్తల ఉపదేశ సారమూ ఇదే.
మత్తయి శుభవార్త 25:31-46
“మానవ పుత్రుడు తన మహిమతోనూ పవిత్ర దేవ దూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు జనాలన్నిటినీ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది. గొల్లవాడు మేకలలోనుంచి గొర్రెలను వేరు చేసినట్టే ఆయన వారిని ఒకరి దగ్గరనుంచి ఒకరిని వేరు చేస్తాడు. ‘గొర్రెలను’ తన కుడి ప్రక్కన, ‘మేకలను’ ఎడమ ప్రక్కన ఉంచుతాడు.
“అప్పుడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు: ‘నా తండ్రిచేత ఆశీస్సులు పొందిన వారలారా, రండి! ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులు కండి. ఎందుకంటే, నాకు ఆకలి వేసింది, మీరు నాకు తినడానికి ఇచ్చారు. దాహం వేసింది, త్రాగడానికి ఇచ్చారు. పరాయివాడుగా ఉన్నాను, మీరు నన్ను లోపల చేర్చుకొన్నారు. బట్టలు లేనప్పుడు నాకు బట్టలిచ్చారు. నాకు జబ్బు చేసింది, నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఖైదులో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు.’
“అప్పుడు ఆ న్యాయవంతులు ఆయనకిలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూచి భోజనం పెట్టాం? ఎప్పుడు దాహం వేయడం చూచి నీకు త్రాగడానికి ఇచ్చాం? ఎప్పుడు నీవు పరాయివాడుగా ఉండడం చూచి లోపల చేర్చుకొన్నాం? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూచి నీకు బట్టలిచ్చాం? ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూచి, నీవు ఖైదులో ఉండడం చూచి నీ దగ్గరికి వచ్చాం?’
“అందుకు రాజు ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. ఈ నా సోదరులలో ఒక అత్యల్పునికి కూడా మీరు చేసినది ఏదైనా నాకూ చేసినట్టే’ అని వారితో జవాబిచ్చి చెపుతాడు.
“అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో ఇలా అంటాడు: ‘శాపానికి గురి అయిన వారలారా! నా దగ్గరనుంచి పోండి! అపనింద పిశాచానికీ వాడి దూతలకూ సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పోండి! ఎందుకంటే, నాకు ఆకలి వేసింది గానీ మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నాకు దాహం వేసింది గానీ, త్రాగడానికి మీరేమీ నాకివ్వలేదు. పరాయివాడుగా ఉన్నాను. మీరు నన్ను లోపల చేర్చుకోలేదు. బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నాకు జబ్బు చేసినది, నేను ఖైదులో ఉన్నాను. నన్ను చూడడానికి మీరు రాలేదు.
“వారు కూడా ఆయనకు ఇలా జవాబిస్తారు: ‘ప్రభూ! ఎప్పుడు నీవు ఆకలితో ఉండడం గానీ దాహంతో గానీ పరాయివాడుగా గానీ బట్టలు లేకుండా గానీ జబ్బుగా గానీ ఖైదులో గానీ ఉండడం చూచి నీకు సహాయం చేయలేదు?’ ఆయన వారికిలా జవాబిస్తాడు: ‘మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. వీరిలో అత్యల్పునికి చేయనిది ఏదైనా నాకూ చేయనట్టే.’
“వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. న్యాయవంతులు శాశ్వత జీవంలో ప్రవేశిస్తారు.
లూకా శుభవార్త 3:10-11
ప్రజానీకం అతణ్ణి చూచి “అలాగైతే మేమేం చెయ్యాలి?” అని అడిగారు.
అతడు వారికిలా జవాబిచ్చాడు: “రెండు చొక్కాలున్న వాడు చొక్కా లేనివానికి ఒకటి ఇవ్వాలి. ఆహారమున్నవాడు కూడా అలాగే చేయాలి.”
లూకా శుభవార్త 6:38
“ఇవ్వండి, అప్పుడు మీకూ ఇవ్వడం జరుగుతుంది. మంచి కొలత – గట్టిగా అదిమి కుదించి పొర్లిపోయేంత కొలత మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలత ఉపయోగిస్తారో ఆ కొలతే మీకూ ఉపయోగించడం జరుగుతుంది.”
అపొస్తలుల కార్యాలు 11:27-30
ఆ రోజులలో ప్రవక్తలు కొందరు జెరుసలంనుంచి అంతియొకయకు వచ్చారు. వారిలో ఒకడైన అగబు అనేవాడు నిలబడి లోకమంతటికీ గొప్ప కరవు వస్తుందని దేవుని ఆత్మమూలంగా సూచించాడు. అది క్లౌదియ సీజర్ పరిపాలన కాలంలో జరిగింది. అప్పుడు శిష్యులు తమలో ప్రతి ఒక్కరూ శక్తికొలది ఇచ్చి యూదయలో కాపురమున్న సోదరుల సహాయంకోసం పంపాలని నిశ్చయించుకొన్నారు. వారు అలా చేసి బర్నబా సౌలుల చేతుల్లో ఉంచి ఆ సొమ్మును అక్కడి పెద్దల దగ్గరకు పంపించారు.
కొరింతువారికి లేఖ 1 10:24
స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు గాని ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి.
కొరింతువారికి లేఖ 2 8:1-15
ఇప్పుడు, సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియజేస్తాను. తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఉండి కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దరిద్రంలోనుంచి వారి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది. వారిని గురించి నా సాక్ష్యమేమిటంటే, తమంతట తామే ఇష్టపూర్వకంగానే వారు ఇవ్వగలిగినంతా ఇచ్చారు – అసలు దానికంటే ఎక్కువే ఇచ్చారు. అక్కరలో ఉన్న పవిత్రులకోసం ఈ ఉదారతను ఈ సేవలో తమ తోడ్పటును మేము స్వీకరించాలని మనసారా మమ్ములను వేడుకొన్నారు. ఇంతేకాదు. మేము ఆశించినట్టు మాత్రమే కాక, వారు మొదట ప్రభువుకు, దేవుని సంకల్పంవల్ల మాకు కూడా అర్పించుకొన్నారు.
తీతు మీలో ఈ ఉదారత మొదలుపెట్టాడు గనుక మీలో దీనిని సంపూర్తి చేయాలని కూడా మేమతణ్ణి పురికొల్పాం. మీకు ప్రతి విషయంలో – విశ్వాసంలో, మాటలో, తెలివిలో, సంపూర్ణ ఆసక్తిలో, మాపట్ల మీకున్న ప్రేమలో సమృద్ధి ఉంది. అలాగే ఈ ఉదారతలో కూడా సమృద్ధి ఉండేలా చూచుకోండి.
నేను ఆజ్ఞపూర్వకంగా చెప్పడం లేదు గాని ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమభావం ఎంత వాస్తవమో పరీక్షిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తెలుసు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీకోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రంవల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం.
మీరు ఇవ్వడం గురించి నా అభిప్రాయమిది: సంవత్సరం క్రిందటే మీరు ఏ ఉపకారక్రియ చేయాలని కోరి మొదలు పెట్టారో దాన్ని ఇంకా చేయడం మీకు మేలు. ఇప్పుడు దాన్ని చేస్తూ ముగించాలి. చేయాలని కోరడానికి సంసిద్ధత ఉన్నట్టు మీకున్నదానిలో నుంచి ఇచ్చి సంపూర్తి చేయాలి కూడా. మొదట సిద్ధమైన మనసు ఉంటే ఇచ్చేది అంగీకారంగా ఉంటుంది. ఈ అంగీకారం ఒక వ్యక్తికి ఉన్నదానినిబట్టే గాని లేనిదానినిబట్టి కాదు.
ఇతరుల విషయంలో శ్రమ నివారణ చేసి మీకు భారం కలిగించాలని కాదు. గాని సమానత ఉండాలని నా కోరిక. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరలకు సహాయకరంగా ఉండాలని నా భావం. అప్పుడు రాసి ఉన్న దానిప్రకారం సమానత ఉంటుంది – “ఎక్కువగా సేకరించినవారికి ఏమి మిగలలేదు, తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు.”
కొరింతువారికి లేఖ 2 9:1-15
పవిత్రులకోసమైన ఈ సేవ విషయం నేను మీకు రాయనక్కరలేదు. ఇందులో మీ సంసిద్ధత నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు సంవత్సరంనుంచి చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీ గురించి మాసిదోనియవారితో గొప్పగా చెపుతున్నాను. మీ ఆసక్తి వారిలో ఎక్కువమందికి ప్రోత్సాహం కలిగించింది. అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పుకొన్న సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ, నేను చెప్పినట్టే మీరు సిద్ధంగా ఉండాలనీ ఈ సోదరులను పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియవారిలో ఎవరైనా నాతో వచ్చి, మీరు సిద్ధంగా లేకపోతే అది చూస్తారనుకోండి. అలాంటప్పుడు మేము నమ్మకంతో గొప్పగా చెప్పిన దాని గురించి ఈ నమ్మకం వల్ల మాకు సిగ్గు కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందని వేరే చెప్పాలా! ఈ కారణంచేత సోదరులు ముందుగానే మీ దగ్గరకు వచ్చి, లోగడ ఇస్తామని మీరు చెప్పిన ధారాళమైన చందా జమ చేసేటందుకు వారిని ప్రోత్సహించడం అవసరమనుకొన్నాను. మీ చందా సిద్ధంగా ఉండాలనీ, అది పిసినిగొట్టుతనంగా ఇచ్చినది కాకుండా ధారాళమైనదిగా ఉండాలనీ నా ఉద్దేశం.
ఇందుకు ఒక ఉదాహరణ – కొద్దిగా వెదజల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు. ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే, ఉల్లాసంతో ఇచ్చే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు. అంతే కాదు. అన్నిట్లో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీపట్ల సర్వ కృప సమృద్ధిగా అధికం చేయగలడు. దీనిగురించి ఇలా రాసి ఉంది: “అతడు నలుదిక్కులకు వెదజల్లాడు. అక్కరలో ఉన్నవారికి ఇచ్చాడు. అతని నీతిన్యాయాలు శాశ్వతంగా నిలుస్తాయి.”
వెదజల్లే వారికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే దేవుడు చల్లడానికి విత్తనాలు మీకిస్తాడు, వృద్ధి చేస్తాడు, మీ న్యాయ ఫలాన్ని అధికం చేస్తాడు గాక. ఈ విధంగా ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వసమృద్ధి కలుగుతుంది. దీనివల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పే కారణం అవుతుంది. ఈ సేవ నిర్వహించడం పవిత్రుల అక్కరలను తీర్చడమే కాకుండా, దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు కలిగేలా చేస్తుంది. ఈ సేవ రుజువైనదనీ మీరు ఒప్పుకొన్న శుభవార్తకు మీ విధేయతనుబట్టీ తమకు, అందరికీ, మీరు ఉదారంగా పంచిపెట్టడం బట్టీ దేవునికి మహిమ కలిగిస్తారు. అంతేగాక, మీలో ఉన్న దేవుని అత్యధిక కృపను బట్టి వారు మీకోసం ప్రార్థన చేస్తూ, మీ మేలు మనసారా కోరతారు.
వివరించడానికి సాధ్యం కాని ఆయన ఉచితమైన బహుమతి గురించి దేవునికి కృతజ్ఞతలు!
గలతీయవారికి లేఖ 6:9-10
మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకొంటాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ – మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరినవారికి – మంచి చేస్తూ ఉందాం.
ఫిలిప్పీవారికి లేఖ 4:14-19
అయినా నా కష్టాలలో మీరు తోడ్పడడం మంచిదే. నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్ళిన తరువాత, ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘంవారు పాలివారు కాలేదని ఫిలిప్పీవాసులైన మీకే తెలుసు. నేను తెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటి మాటికి సహాయం పంపారు. నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను. నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన, ఇష్టమైన యజ్ఞం.
నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు.
హీబ్రూవారికి లేఖ 10:24
అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం.
హీబ్రూవారికి లేఖ 13:1-3
సోదర ప్రేమ చూపుతూ ఉండండి. పరాయివారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఖైదులో ఉన్నవారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకముంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనుక దౌర్జన్యానికి గురి అయినవారిని తలచుకోండి.
హీబ్రూవారికి లేఖ 13:16
ఉపకారాలూ దానధర్మాలూ చేయడం మరవకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే.
యాకోబు లేఖ 1:27
తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.
యాకోబు లేఖ 2:15-16
ఎవరైనా ఒక సోదరుడు గానీ సోదరి గానీ బట్టలూ, రోజూ కావలసిన ఆహారమూ లేకుండా ఉన్న పక్షంలో మీలో ఎవరైనా వారికి శరీర అవసరాలను తీర్చకుండా “క్షేమంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తిగా తిను” అని చెపితే ఏమి ప్రయోజనం?
యోహాను లేఖ 1 3:16-18
యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్నిబట్టే మనకు తెలుసు. మనమూ సోదరులకోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యతగలవారం. అయితే ఈ లోకం బ్రతుకుదెరువు గలవాడెవడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతనిమీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
నా చిన్న పిల్లలారా, మాటతో భాషతో గాక వాస్తవంగా, క్రియతో ప్రేమ చూపుదాం.
పాపం చేత శోధించబడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 6:13
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
మత్తయి శుభవార్త 26:41
మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే గాని, శరీరం దుర్బలం” అని పేతురుతో అన్నాడు.
కొరింతువారికి లేఖ 1 10:13
మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
హీబ్రూవారికి లేఖ 2:18
ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.
హీబ్రూవారికి లేఖ 4:14-16
అయితే మనకు గొప్ప ప్రముఖయాజి ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాం. ఎందుకంటే, మనకు ఉన్న ప్రముఖయాజి మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమపరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు. కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.
యాకోబు లేఖ 1:12-15
విషమపరీక్షను ఓర్చుకొనే మనిషి ధన్యజీవి. ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తరువాత అతనికి జీవ కిరీటం లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించేవారికి దానిని వాగ్దానం చేశాడు.
ఎవరికైనా దుష్ట ప్రేరేపణ వస్తే ఆ వ్యక్తి “ఈ దుష్ట ప్రేరేపణ దేవుడు నాకు కలిగిస్తున్నాడు” అనకూడదు. ఎందుకంటే, దుర్మార్గత చేయడానికి దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. అలాంటి ప్రేరేపణ ఎవరికీ కలిగించడు కూడా. ప్రతి ఒక్కరూ తన కోరికలు తనను ఆకర్షించి ఈడ్వడంవల్లే దుష్ట ప్రేరేపణకు గురి కావడం జరుగుతుంది. కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి చావును కంటుంది.
నీవు పాపం చేస్తే ఈ వాక్యాలను చదువు
లూకా శుభవార్త 15:11-24
ఆయన ఇంకా అన్నాడు “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. చిన్నవాడు తండ్రితో ‘నాన్నా, ఆస్తిలో నాకు వచ్చే భాగమివ్వు’ అన్నాడు. తండ్రి తన జీవనాధారం వారికి పంచి ఇచ్చాడు.
“కొన్నాళ్ళకు చిన్నవాడు తనకు ఉన్నదంతా కూడగట్టుకొని దూర దేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేశాడు. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు అక్కరలో పడసాగాడు. అప్పుడు ఆ దేశ పౌరుడొకని దగ్గర చేరాడు. ఆ మనిషి పందులు మేపడానికి అతణ్ణి తన పొలాల్లోకి పంపాడు. పందులు మేపే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాలని ఆశించాడు, కాని అతనికి ఎవరూ ఏమీ పెట్టలేదు.
“అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇలా అనుకొన్నాడు: ‘మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి మనుషులకు బోలెడంత ఆహారం ఉంటుందే. నేనైతే ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను; నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకును అనిపించుకోవడానికి తగను. నన్ను నీ కూలి మనుషులలో ఒకడిగా పెట్టుకో! అంటాను.’
“అప్పుడతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
“అప్పుడా కొడుకు ‘నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకుననిపించుకోవడానికి తగను’ అని అతనితో అన్నాడు.
“అయితే తండ్రి తన దాసులను చూచి ‘అన్నిట్లో మంచి వస్త్రం తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని వ్రేలికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. తిందాం! సంబరపడదాం! ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు! తప్పిపోయి దొరికాడు!’ అన్నాడు. అప్పుడు వారు సంబరపడసాగారు.
రోమా వారికి లేఖ 6:1-23
అలాగైతే మనం ఇంకేమి చెప్పాలి? కృప వృద్ధి చెందాలని పాపంలో నిలిచి ఉందామా? అలా కానే కాదు! పాపం విషయంలో చనిపోయిన మనం అందులో ఇంకా ఎలా జీవించగలం? యేసు క్రీస్తులోకి బాప్తిసం పొందిన మనం, ఆయన మరణంలోకి బాప్తిసం పొందామని మీకు తెలియదా? గనుక మరణంలోకి బాప్తిసం పొందడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. ఎందుకంటే, తండ్రి అయిన దేవుని మహాత్యం క్రీస్తును చనిపోయినవారిలోనుంచి లేపినట్టే మనం కూడా క్రొత్త జీవంతో బ్రతకాలి.
మనం ఆయనతో ఐక్యమై చనిపోయినట్టు ఉంటే, ఆయనతోకూడా సజీవంగా లేచినట్టు ఉంటాం. అనుమానం లేదు. మన పాప శరీరం ప్రభావం లేకుండా పోవాలనీ మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదనీ మన పాత మానవ స్వభావం క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు. ఆ విధంగా చనిపోయిన వ్యక్తి పాపంనుంచి విముక్తుడై ఉన్నాడు.
మనం క్రీస్తుతో చనిపోయామంటే ఆయనతో జీవిస్తాం అని కూడా నమ్ముతున్నాం. చనిపోయినవారిలో నుంచి లేచిన క్రీస్తు ఇంకెన్నడూ మళ్ళీ చనిపోడనీ ఇకనుంచి మరణానికి ఆయనమీద ప్రభుత్వమేమీ లేదనీ మనకు తెలుసు. ఎందుకంటే, ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలోనే చనిపోయాడు. చనిపోయింది ఎప్పటికీ ఒక్క సారే. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే ఈ జీవితం దేవునికోసమే.
ఆ ప్రకారమే మీరు పాపం విషయంలో చనిపోయారనీ దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి. అందుచేత చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి, శరీరం చెడ్డ కోరికలకు లోబడకండి. మీ శరీర భాగాలు దుర్మార్గ సాధనాలుగా పాపానికి ఇచ్చివేసుకోకండి గాని చనిపోయి సజీవంగా లేచినవారం అంటూ మిమ్ములను మీరే దేవునికే ఇచ్చివేసుకోండి, మీ అవయవాలు కూడా న్యాయ సాధనాలుగా దేవునికే ఇచ్చివేసుకోండి. పాపం మీ మీద అధికారం చెలాయించదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు గాని కృపక్రింద ఉన్నవారే.
అలాగైతే ధర్మశాస్త్రం క్రింద ఉండక కృప క్రిందే ఉన్నామంటూ పాపం చేద్దామా? అలా కానే కాదు. లోబడేందుకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా ఇచ్చివేసుకొంటారో దేనికి లోబడుతారో దానికే దాసులై ఉన్నారని మీకు తెలియదా? పాపానికి దాసులైతే దాని ఫలితం మరణం. విధేయతకు దాసులైతే దాని ఫలితం నిర్దోషత్వం. మునుపు మీరు పాపానికే దాసులు. అయినా ఏ బోధన మూసకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయ పూర్వకంగా విధేయులయ్యారు. ఆ విధంగా పాపంనుంచి విడుదల అయి నీతిన్యాయాలకు దాసులయ్యారు. అందుకు దేవునికి స్తుతులు!
మీ శరీర స్వభావం బలహీనతను బట్టి మామూలు మానవ ధోరణిలో మాట్లాడుతున్నాను. మునుపు మీరు మీ అవయవాలను దాసులుగా కల్మషానికీ అక్రమానికీ ఇచ్చివేసు కొన్నారు. అది ఇంకా అక్రమానికి దారి తీసింది. ఇప్పుడు అలాగే మీ అవయవాలను దాసులుగా నీతిన్యాయాలకు పవిత్రతకోసం ఇచ్చివేసుకోండి. మీరు పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతిన్యాయాలతో నిమిత్తం లేనివారు.
అప్పటి పనులవల్ల మీకేమి ప్రయోజనం? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు గదా. అలాంటి వాటి ఫలితం చావే. ఇప్పుడైతే మీరు పాపం నుంచి విడుదల అయి దేవునికి దాసులయ్యారు. దీనివల్ల మీకు కలిగే ఫలం పవిత్రత, చివరి ఫలితం శాశ్వత జీవం.
ఎందుకంటే, పాపంవల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.
యోహాను లేఖ 1 1:9–2:2
మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ. ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.
 
నా చిన్న పిల్లలారా, మీరు ఎలాంటి పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రిదగ్గర మన తరఫున న్యాయవాది ఒకడు మనకు ఉన్నాడు. ఆయనే న్యాయవంతుడైన యేసు క్రీస్తు. మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు – లోకమంతటికీ ఆయన కరుణాధారమైన బలి.
యాకోబు లేఖ 4:7-10
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. దుఃఖించండి, ఏడ్వండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి. ప్రభు సముఖంలో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్ములను పైకెత్తుతాడు.
ప్రకటన 3:19-20
నేను ప్రేమించేవారందరినీ మందలించి శిక్షిస్తాను. గనుక ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.
“ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుతూ ఉన్నాను. ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఆ వ్యక్తితో నేను, నాతో ఆ వ్యక్తి భోజనం చేస్తాం.
హీబ్రూవారికి లేఖ 12:1-2
ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతిదాన్నీ, సుళువుగా చిక్కులుపెట్టే పాపాన్నీ త్రోసిపుచ్చి యేసువైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరుగెత్తుదాం. నమ్మకానికి కర్త, దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన తన ముందున్న ఆనందంకోసం సిలువను ఓర్చుకొని ఆ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు.
దురాత్మలను గూర్చి, అపవాదిని గూర్చి భయపడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 4:1-11
అప్పుడు యేసును అపనింద పిశాచం వల్ల విషమపరీక్షలకు గురి కావడానికి దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసు నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
దుష్‌ప్రేరేపణ చేసేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు!”
అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు: “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది.”
అప్పుడు అపనింద పిశాచం ఆయనను పవిత్ర నగరానికి తీసుకువెళ్ళి దేవాలయం శిఖరంమీద నిలబెట్టాడు.
“నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకేసెయ్యి! ఎందుకంటే ఇలా రాసి ఉంది – ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొంటారు అని ఆయనతో అన్నాడు.”
అందుకు యేసు వాడితో ఇలా చెప్పాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని కూడా వ్రాసి ఉంది.”
ఇంకా అపనింద పిశాచం ఆయనను చాలా ఎత్తయిన పర్వతంమీదికి తీసుకువెళ్ళి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్నీ చూపించాడు. అప్పుడు వాడు ఆయనతో “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను” అన్నాడు.
“సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
అప్పుడు అపనింద పిశాచం ఆయనను విడిచివెళ్ళాడు. దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేశారు.
మత్తయి శుభవార్త 6:13
మమ్ములను దుష్‌ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు. శాశ్వతంగా రాజ్యం, బలప్రభావాలు, మహిమ నీకే. తథాస్తు!
లూకా శుభవార్త 22:31-32
ప్రభువు ఇంకా అన్నాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో విను. సైతాను మిమ్ములను గోధుమలలాగా జల్లించాలని మిమ్ములను కోరాడు. కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”
యోహాను శుభవార్త 17:14-19
నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.
రోమా వారికి లేఖ 16:19-20
మీ విధేయతను గురించి అందరికీ వినిపించింది గనుక మీ విషయం నేనానందిస్తున్నాను. అయితే మీరు మంచి విషయాలలో తెలివైనవారు, చెడు విషయాలలో నిర్దోషులు కావాలని నా కోరిక.
శాంతి ప్రదాత అయిన దేవుడు మీ పాదాలక్రింద సైతానును త్వరగా చితగ్గొట్టివేస్తాడు. మన ప్రభువైన యేసు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక.
కొరింతువారికి లేఖ 1 16:13
మెళుకువగా ఉండండి. విశ్వాస సత్యాలలో నిలకడగా ఉండండి. పౌరుషంగా ఉండండి. బలంగా ఉండండి.
కొరింతువారికి లేఖ 2 12:7-10
వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది.“ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను.
ఎఫెసువారికి లేఖ 3:20-21
మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.
ఎఫెసువారికి లేఖ 6:10-18
తుదకు, నా సోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బలప్రభావాలచేత బలాఢ్యులై ఉండండి. అపనింద పిశాచం కుతంత్రాలను ఎదిరిస్తూ గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుడిచ్చే కవచమంతా ధరించుకోండి. ఎందుకంటే, మనం పోరాడుతున్నది రక్త మాంసాలున్నవారితో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ఈ యుగ అంధకారాన్ని ఏలుతున్న నాథులతో, పరమ స్థలాలలో ఉన్న ఆత్మ రూపులైన దుష్టశక్తుల సేనలతో. అందుచేత మీరు దుర్దినంలో వారిని ఎదిరిస్తూ, చేయవలసినదంతా సాధించి గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుని కవచమంతా ధరించుకోండి.
కనుక స్థిరంగా నిలబడి ఉండండి! మీ నడుముకు సత్యాన్ని దట్టిగా కట్టుకోండి. నీతిన్యాయాలను కవచంగా ఛాతికి ధరించుకోండి. మీ పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత అనే జోడు తొడుక్కోండి. అన్నిటికి పైగా విశ్వాసం డాలు చేతపట్టుకోండి. దానితో ఆ దుర్మార్గుడు ప్రయోగించే అగ్ని బాణాలన్ని ఆర్పివేయగలుగుతారు. పాపవిముక్తి శిరస్త్రాణం ధరించుకోండి. దేవుని ఆత్మ ఖడ్గం చేతపట్టుకోండి – అది దేవుని వాక్కే. అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.
తెస్సలొనీకవారికి లేఖ 1 3:5-8
ఈ కారణంచేత నేనిక తట్టుకోలేక, మీ విశ్వాసం గురించి తెలుసుకొందామని అతణ్ణి పంపాను. ఒకవేళ దుష్ట ప్రేరేపణలు చేసేవాడు మిమ్ములను ప్రేరేపించాడేమో అనీ మా ప్రయాస వ్యర్థమై పోయిందేమో అనీ మా ఆందోళన.
కానీ తిమోతి ఇప్పుడు మీ దగ్గరనుంచి వచ్చి మీ విశ్వాసం, ప్రేమ గురించీ మంచి కబురు తెచ్చాడు. మిమ్ములను చూడడానికి మాకెలా తీవ్ర ఆశ ఉందో అలాగే మమ్ములను చూడడానికి మీకూ తీవ్ర ఆశ ఉందనీ మీరు ఎప్పుడూ మా గురించి మంచిని జ్ఞాపకం చేసుకొంటున్నారనీ చెప్పాడు. అందుచేత, సోదరులారా, మా బాధలు, కడగండ్లన్నిటిలో మీ విశ్వాసం కారణంగా మీ గురించి మాకు ఓదార్పు కలిగింది. ఎందుకంటే, ప్రభువులో మీరు నిలకడగా ఉంటే ఇప్పుడు మేము నిజంగా బ్రతుకుతూ ఉన్నాం.
తెస్సలొనీకవారికి లేఖ 2 3:3
అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు.
యాకోబు లేఖ 4:7-8
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి.
పేతురు లేఖ 1 5:8-11
స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా. మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత, సర్వ కృపానిధి అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయనకే మహిమ అధికారం యుగయుగాలకు ఉంటుంది గాక! తథాస్తు.
యోహాను లేఖ 1 4:4
చిన్న పిల్లలారా, మీరు దేవునికి చెందేవారు, లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు అధికుడు గనుక మీరు ఆ కపట ప్రవక్తలను జయించారు.
ప్రకటన 12:7-12
పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేల్, అతని దూతలు రెక్కలున్న సర్పంమీద యుద్ధం జరిగించారు. రెక్కలున్న సర్పం, దాని దూతలు ఎదురు పోరాటం జరిపారు గాని గెలవలేకపోయారు గనుక అప్పటినుంచి పరలోకంలో వారికి చోటు లేకుండా పోయింది. రెక్కలున్న ఆ మహా సర్పం పడద్రోయబడింది. అది ఆదిసర్పం. దానికి అపనింద పిశాచం, సైతాను అని పేరు. అది సర్వ లోకాన్ని మోసగిస్తూ ఉంది. వాణ్ణి వాడితోపాటు వాడి దూతలనూ భూమిమీదికి పడద్రోయడం జరిగింది.
అప్పుడు పరలోకంలో గొప్ప స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఇప్పుడు దేవుని రక్షణ, ప్రభావం, రాజ్యం, ఆయన అభిషిక్తుని అధికారం వచ్చాయి! ఎందుకంటే, మన సోదరుల మీద నేరాలు మోపేవాడు పడద్రోయబడ్డాడు. రాత్రింబగళ్ళు వాడు మన దేవుని ఎదుట వారిమీద నేరాలు మోపుతూ వచ్చాడు. అయితే వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టీ తాము చెపుతున్న సాక్ష్యాన్ని బట్టీ వాణ్ణి ఓడించారు. మరణంవరకూ తమ ప్రాణాలమీద వారికి ప్రీతి లేకపోయింది. ఇందుకు, ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా, ఆనందించండి! అయితే భూమి, సముద్రం నివాసులకు అయ్యో, విపత్తు! ఎందుకంటే, అపవాద పిశాచం తనకు కొద్ది కాలమే మిగిలిందని తెలిసి తీవ్ర కోపంతో మీ దగ్గరకు దిగివచ్చాడు.”
ఎవరిమీదైనా కోపం నీకు ఉన్నట్లైతే ఈ వాక్యాలను చదువు
గలతీయవారికి లేఖ 5:22-23
దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు.
ఎఫెసువారికి లేఖ 4:26
కోపపడండి గాని అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దు క్రుంకే ముందే అంతరించాలి.
కొలస్సయివారికి లేఖ 3:8
ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి.
కొలస్సయివారికి లేఖ 3:13
ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి.
యాకోబు లేఖ 1:19-20
అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వినడానికి ఆతురంగా, మాట్లాడడానికీ కోపగించడానికీ నిదానంగా ఉండాలి. ఎందుకంటే మనిషి కోపం దేవుని న్యాయాన్ని సాధించదు.
నీ గూర్చి నీవు గొప్పలు పలుకుతూ, గర్వంగా ప్రవర్తిస్తున్నట్లైతే ఈ వాక్యలను చూడు
మత్తయి శుభవార్త 5:3-12
తమ ఆధ్యాత్మిక దరిద్య్రాన్ని గుర్తించినవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
దుఃఖించేవారు ధన్యులు. వారికి ఓదార్పు కలుగుతుంది.
సాధుగుణం గలవారు ధన్యులు. భూలోకానికి వారు వారసులు.
నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారికి తృప్తి కలుగుతుంది.
కరుణ చూపేవారు ధన్యులు. వారికి కరుణ దొరుకుతుంది.
శుద్ధ హృదయులు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు.
సమాధానం చేకూర్చేవారు ధన్యులు. వారు దేవుని సంతానం అనిపించుకొంటారు.
నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
“నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
మత్తయి శుభవార్త 18:1-5
ఆ సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న అడిగారు: “పరలోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప?”
యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలిచి, వారిమధ్య నిలబెట్టి ఇలా అన్నాడు: “నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మార్పు చెంది, చిన్నవారిలాగా గనుక కాకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు. అందుచేత ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తమను తగ్గించుకొంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. అంతేగాక, ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారన్నమాట.
లూకా శుభవార్త 14:7-11
అక్కడ ఆహ్వానం అందినవారు అగ్ర స్థానాలను ఎన్నుకోవడం గమనించి ఆయన వారికి ఒక ఉదాహరణ చెపుతూ “పెండ్లి విందుకు నిన్ను ఎవరైనా పిలిస్తే అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ అతడు నీకంటే ఘనుణ్ణి పిలిచి ఉండవచ్చునేమో. అలాంటప్పుడు నిన్నూ అతణ్ణీ పిలిచినవాడు నీ దగ్గరకు వచ్చి ‘మీరు వీరికి ఈ చోటు ఇవ్వండి’ అంటాడేమో. అప్పుడు నీవు చిన్నబోయి చివరి స్థానంలో కూర్చోవడం ఆరంభిస్తావు. గనుక నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి నీతో ‘స్నేహితుడా! ఆ పై స్థానానికి వెళ్ళండి’ అనవచ్చు. అప్పుడు నీతోకూడా కూర్చుని ఉన్న వారి సమక్షంలో నీకు గౌరవం కలుగుతుంది. తనను గొప్ప చేసుకొనేవారిని తగ్గించడం, తనను తగ్గించుకొనేవారిని గొప్ప చేయడం జరుగుతుంది” అని వారితో అన్నాడు.
లూకా శుభవార్త 18:9-14
తామే న్యాయవంతులని తమలో నమ్మకం ఉంచుకొంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకంవాడు.
“పరిసయ్యుడు నిలుచుండి తనతో ఇలా ప్రార్థించాడు: ‘దేవా, ఇతరులు వంచకులూ అన్యాయస్థులూ వ్యభిచారులూ ఈ సుంకంవాడిలాంటివారూ. నేను వారివంటి వాణ్ణి కాను గనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. నేను వారానికి రెండు సార్లు ఉపవాసముంటాను, నా రాబడి అంతట్లో పదో భాగం చెల్లిస్తూ వున్నాను.’
“ఆ సుంకంవాడైతే దూరంగా నిలుచుండి ఆకాశంవైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకొంటూ ‘దేవా! నేను పాపినే. నన్ను కరుణించు!’ అన్నాడు.
“న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెపుతున్నాను. ఎందుకంటే, తనను గొప్ప చేసుకొనే ప్రతి ఒక్కరినీ తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.”
రోమా వారికి లేఖ 12:16
ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పతనాన్ని ఆలోచించక, దీనులతో సహవాసం చేయండి. మీరు వివేకులని అభిప్రాయపడకండి.
కొరింతువారికి లేఖ 1 4:7
నిన్ను ఏకైక వాణ్ణిగా చేసినదెవరు? నీవు దేవుని నుంచి పొందినది తప్ప నీకు మరేం కలిగి ఉంది? అది పొందినదే గనుక అయితే పొందినది కానట్టే గొప్పలు చెప్పుకొంటున్నావేం?
కొరింతువారికి లేఖ 2 10:17-18
“అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలి.” తనను తాను మెచ్చుకొనేవాడు కాదు గాని ప్రభువు మెచ్చుకొనేవాడే ఆమోదయోగ్యుడు.
ఎఫెసువారికి లేఖ 4:2
పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరిపట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 3:12-13
దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నాడు. మీరు పవిత్రులు, దేవుని ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి.
యాకోబు లేఖ 4:6
అయితే ఆయన మరెక్కువ కృప ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గానీ వినయవంతులకు కృప చూపుతాడని చెపుతాడు.
యాకోబు లేఖ 4:13-16
“ఈవేళో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించు కొంటాం” అని చెప్పుకొనేవారలారా, వినండి రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటిది. దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం” అనాలి. ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకొంటున్నారు. అలాంటి గర్వమంతా చెడ్డది.
పేతురు లేఖ 1 5:5-7
యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయం వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే, “దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయం గలవారికి కృప చూపుతాడు.” అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్ములను పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్ఠమైన చేతిక్రింద మిమ్ములను మీరే తగ్గించుకోండి. ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి.
చెడ్డ మాటలు పలుకుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
ఎఫెసువారికి లేఖ 4:29
చెడ్డ మాటలేవీ మీ నోటినుంచి రానివ్వకండి గాని వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి.
ఎఫెసువారికి లేఖ 5:4
అంతేగాక, బూతులు, పనికిమాలిన మాటలు, సరససల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు చెపుతూ ఉండాలి.
ఫిలిప్పీవారికి లేఖ 4:8
చివరగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచిపేరు గలవో – శ్రేష్ఠమైనవేవైనా, మెప్పుకు తగినవేవైనా ఉంటే – అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
కొలస్సయివారికి లేఖ 3:8
ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి.
తిమోతికి లేఖ 1 4:12
నీ యువ ప్రాయాన్ని బట్టి ఎవరూ నిన్ను చిన్నచూపు చూడనియ్యకు, గాని విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావంలో, ఆత్మ విషయాలలో నమ్మకంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
యాకోబు లేఖ 1:26
మీలో ఎవరైనా తాను మత నిష్ఠ గలవాణ్ణి అనుకొంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసగించుకొంటే అతడి మతం వట్టిదే!
యాకోబు లేఖ 3:9-10
దానితో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని పోలికలో ఉనికిలోకి వచ్చిన మనుషులను దానితో శపిస్తాం. ఒకే నోటినుంచి స్తుతి, శాపం వెలువడతాయి. నా సోదరులారా, ఈ విధంగా ఉండకూడదు.
అబద్ధం చెప్పుటకు ప్రేరేపించబడుతున్నట్లైతే ఈ వాక్యాలు చదువు
ఎఫెసువారికి లేఖ 4:25
అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం, గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి.
కొలస్సయివారికి లేఖ 3:9
ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఎందుకంటే మీ పాత “మానవుణ్ణి” దాని పనులతోపాటు విసర్జించి
పేతురు లేఖ 1 3:10
బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచి రోజులు చూడగోరేవారెవరైనా తమ నాలుకను చెడు నుంచి, పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకోవాలి.
యోహాను శుభవార్త 8:44
మీరు మీ తండ్రి అపనింద పిశాచానికి చెందినవారు. మీ తండ్రి ఇచ్ఛల ప్రకారం జరిగించాలని కోరుతూ ఉన్నారు. మొదటినుంచి వాడు హంతకుడు, సత్యంలో నిలవనివాడు. సత్యం వాడిలో బొత్తిగా లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. వాడు అబద్ధం చెప్పినప్పుడెల్లా వాడి సొంతస్వభావంలోనుంచి చెపుతాడు.
ప్రకటన 21:8
“కానీ పిరికివారు, విశ్వాసం లేనివారు, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధికులంతా అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు.”
ప్రకటన 22:15
నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు.
తాగుబోతులు తమతో తాగమని నిన్ను వత్తిడి చేస్తున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
రోమా వారికి లేఖ 13:13
పగటిలో నడిచినట్లు యోగ్యంగా నడచుకొందాం. అల్లరిచిల్లరగా తిరగకుండా, మత్తుగా త్రాగకుండా, లైంగిక అవినీతీ, పోకిరీ పనులూ, కక్షలూ, అసూయ లేకుండా ఉండిపోదాం.
కొరింతువారికి లేఖ 1 5:9-11
నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసి మెలిసి ఉండకూడదని రాశాను. అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాశపరులతో, వంచకులతో, విగ్రహపూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలోనుంచి వెళ్ళిపోవలసి వస్తుంది! ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
కొరింతువారికి లేఖ 1 6:9-10
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
ఎఫెసువారికి లేఖ 5:18
మద్యంతో మత్తిల్లకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి.
తిమోతికి లేఖ 1 3:1-3
స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్ఠమైన పని చేయాలని కోరుతున్నాడన్న మాట నమ్మతగినదే. నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ, మర్యాదస్థుడూ, అతిథి సత్కారాలు చేసేవాడూ, ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి. అతడు సాత్వికుడై ఉండాలి గాని ఇతరులను కొట్టేవాడూ, త్రాగుబోతూ, జగడగొండీ, ధనాపేక్ష గలవాడూ పేరాశగలవాడూ అయి ఉండకూడదు.
తీతుకు లేఖ 1:7
ఎందుకంటే, సంఘ నాయకుడు దేవుని గృహ సేవ నిర్వహించేవాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు స్వార్థపరుడు, ముక్కోపి, త్రాగుబోతు, ఇతరులను కొట్టేవాడు, అక్రమ లాభం ఆశించేవాడు అయి ఉండకూడదు.
పేతురు లేఖ 1 4:3-5
మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
నీకున్న స్థితిని గూర్చి నీవు ఎక్కువగా ఊహించుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 6:19-21
“భూమిమీద మీ కోసం సంపద కూడబెట్టుకోకండి. ఇక్కడ చిమ్మెటలు, తుప్పు తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దోచుకొంటారు. పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చిమ్మెట గాని, తుప్పు గాని తినివేయవు. దొంగలు కన్నం వేసి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
మత్తయి శుభవార్త 6:24-34
“ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.
“అందుచేత నేను మీతో చెప్పేదేమిటంటే, ‘ఏమి తింటాం? ఏమి తాగుతాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగ పెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ మీ శరీరాన్ని గురించి బెంగ పెట్టుకోకండి. తిండికంటే జీవితం ప్రధానం గదా! బట్టలకంటే శరీరం ముఖ్యం గదా! గాలిలో ఎగిరే పక్షులను చూడండి. అవి నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూడబెట్టుకోవు. అయినా, మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైనవారు గదా! చింతపడడం వల్ల మీలో ఎవరు తమ ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు?
“మీకు బట్టల విషయం చింత ఎందుకు? పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. అయినా, తన వైభవమంతటితో ఉన్న సొలొమోనుకు కూడా ఈ పూలలో ఒక్కదానికున్నంత అలంకారం లేదని మీతో చెపుతున్నాను. అల్ప విశ్వాసం ఉన్నవారలారా, ఈ వేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలం గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు గదా. కనుక ‘ఏం తింటామో? ఏం త్రాగుతామో? ఏం బట్టలు వేసుకొంటామో?’ అంటూ చింతించకండి. దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలు వీటికోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు. మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిన్యాయాలను వెదకండి. అప్పుడు వాటితోపాటు ఇవన్నీ మీకు చేకూరుతాయి. అందుచేత రేపటి విషయం చింతించకండి. దాని విషయం అదే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
లూకా శుభవార్త 12:13-21
గుంపులో ఎవరో ఒకడు ఆయనతో “ఉపదేశకా! వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నా భాగం పంచిపెట్టమని మా తోబుట్టువుకు చెప్పండి” అన్నాడు.
అందుకాయన అతనితో “అయ్యా, మీమీద నన్నెవరు తీర్పరిగా లేదా మధ్యవర్తిగా నియమించారు?” అన్నాడు. ఆయన వారితో “అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి! ఒకరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు” అన్నాడు.
అప్పుడాయన వారికొక ఉదాహరణ చెప్పాడు: “ఆస్తిపరుడొకడి భూమి బాగా పండింది, గనుక అతడిలా లోలోపల ఆలోచన చేశాడు: ‘నా పంట నిలవ చేయడానికి స్థలం లేదు. ఏం చెయ్యను? ఇలా చేస్తాను – నా గిడ్డంగులు పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యం, నా సరుకులు అన్నీ నిలవ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో నేనంటాను, ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు మంచి వస్తువులు కూడబెట్టబడ్డాయి. సుఖంగా ఉండు. తిను, తాగు, సంబరపడు!’ అని. అయితే అతనితో దేవుడు అన్నాడు ‘తెలివి తక్కువవాడా! ఈ రాత్రే నీ ప్రాణం అడగడం జరుగుతుంది. నీవు సిద్ధం చేసుకొన్నవి అప్పుడు ఎవరివవుతాయి?’ దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తనకోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే.”
లూకా శుభవార్త 12:32-34
“చిన్న మందా, భయంతో ఉండకు, తన రాజ్యాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. మీకున్నదాన్ని అమ్మి దానధర్మాలు చేయండి. పరలోకంలో మీకు పాతగిలిపోని డబ్బు సంచులు తయారు చేసుకోండి. అయిపోకుండా ఉండే సొమ్ము సమకూర్చుకోండి. అక్కడ దొంగ ఎవడూ దగ్గరకు రాడు, చిమ్మటలు కొట్టవు. మీ సొమ్ము ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
అపొస్తలుల కార్యాలు 20:35
ఇలా శ్రమిస్తూ మీరూ కష్టపడి బలహీనులకు సహాయం చేయాలని నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ‘తీసుకోవడంకంటే ఇవ్వడమే ధన్యం’ అని యేసుప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకముంచుకోండి.”
తిమోతికి లేఖ 1 6:6-10
ఉన్నదాన్ని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే. ఎందుకంటే, మనం లోకంలోకి దేనినీ తీసుకురాలేదు, లోకంనుంచి దేనినీ తీసుకుపోలేమని స్పష్టమే. అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తిపడతాం.
ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో, హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి. ఎందుకంటే డబ్బుమీది వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించు కొందామని విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి, అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకొన్నారు.
తిమోతికి లేఖ 1 6:17-19
ఇహలోకంలో ధనం ఉన్నవారు గర్విష్ఠులు కాకుండా అనిశ్చయమైన ధనంమీద నమ్మకం పెట్టుకోకుండా, జీవంగల దేవునిమీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు. సంతోషంతో అనుభవించడానికి ఆయన అన్నీ సమృద్ధిగా దయ చేసేవాడు. వారు మేలు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై, తమకున్న దానిలో కొంత పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండి, వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందిన దాన్ని సమకూర్చుకొంటూ ఉండాలి. వారు శాశ్వత జీవాన్ని చేపట్టాలన్న మాట.
హీబ్రూవారికి లేఖ 13:5-6
మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను. అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
విగ్రహారాధన చేయమని ప్రజలు నిన్ను ప్రేరేపిస్తున్నట్లైతే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 4:10
“సైతానూ! అవతలికి పో! నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది” అని యేసు వాడితో చెప్పాడు.
అపొస్తలుల కార్యాలు 17:22-31
అరేయోపగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. నేను అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది. ‘తెలియబడని దేవునికి’ అని దానిమీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయననే మీకు ప్రకటిస్తున్నాను. జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
“భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. వారు ప్రభువును వెదకాలని – తడవులాడి ఆయనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు. ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మీ కవులలో కొందరు చెప్పినట్టు ‘మనం ఆయన సంతానం.’ మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
“జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
కొరింతువారికి లేఖ 1 5:11
ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
కొరింతువారికి లేఖ 1 6:9-11
న్యాయం అనుసరించనివారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గానీ విగ్రహ పూజకులు గానీ వ్యభిచారులు గానీ ఆడంగివారు గానీ స్వలింగ సంపర్కులు గానీ దొంగలు గానీ పేరాశపరులు గానీ త్రాగుబోతులు గానీ తిట్టుబోతులు గానీ దోపిడీదారులు గానీ దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటివారే. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పేర మన దేవుని ఆత్మవల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు.
కొరింతువారికి లేఖ 1 8:1-13
విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం: మనకందరికీ తెలివి ఉందని మనకు తెలుసు. తెలివి ఉప్పొంగ జేస్తుంది, ప్రేమ అయితే అభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసుననుకొంటే తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదన్న మాట. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఆ వ్యక్తి తెలుసు.
అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు), మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
అయినా ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతవరకు విగ్రహం గురించి స్మృతి కలిగి తాము తింటున్నది విగ్రహానికి అర్పితమైనట్టు భావించి తింటున్నారు. వారి అంతర్వాణికి చాలినంత వివేచనాశక్తి లేకపోవడంచేత అది అశుద్ధి అవుతుంది. గాని తిండి మనల్ని దేవునికి సిఫారసు చేయదు. మనం ఏదైనా తింటే ఎక్కువవారమూ కాము. తినకపోతే తక్కువవారము కాము.
అయినా మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూచుకోండి. సత్యం తెలిసిన మీరు విగ్రహమున్న స్థలంలో తింటే ఎవడైనా ఒకడు చూస్తాడనుకోండి. విశ్వాసంలో బలహీనుడైన అతడి అంతర్వాణికి విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే ధైర్యం కలగదా? క్రీస్తు ఎవరికోసం చనిపోయాడో విశ్వాసంలో ఆ బలహీన సోదరుడు మీ తెలివివల్ల పాడైపోవాలా? మీరు సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసి తక్కువ వివేచనశక్తి ఉన్నవారి అంతర్వాణికి దెబ్బ కొట్టడంవల్ల మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
కాబట్టి, తిండి నా సోదరుడు తప్పటడుగు వేయడానికి కారణమైతే, నా సోదరుడు తప్పటడుగు వేయకూడదని నేను ఇంకెన్నడూ మాంసం తినను.
కొరింతువారికి లేఖ 1 10:1-22
సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక: మన పూర్వీకులంతా మేఘం క్రింద ఉన్నారు, అందరూ సముద్రం గుండా వెళ్ళారు. అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తినేవారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే, తమవెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలోనుంచి వచ్చిన నీళ్ళు త్రాగేవారు. ఆ బండ క్రీస్తే. అయినా వారిలో ఎక్కువమందివల్ల దేవునికి సంతోషం కలగలేదు గనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి.
వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. మీరు వారిలో కొందరిలాగా విగ్రహపూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: “ప్రజలు తింటూ త్రాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు.” వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో ఇరవై మూడు వేలమంది ఒకే రోజున హతమై కూలారు. వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసినవారు పాముల కాటుచేత నాశనమయ్యారు. వారిలో కొందరు సణిగారు. మనం సణగకూడదు. సణిగినవారు సంహారకునిచేత నాశనమయ్యారు.
ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి. కనుక నిలుచున్నాననుకొనే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
అందుచేత, నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజనుంచి పారిపోండి! మీరు తెలివైనవారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి.
మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? మనం అనేకులమైనా ఒకటే రొట్టె, ఒకటే శరీరం ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం.
శరీర సంబంధంగా ఇస్రాయేల్‌జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా. నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైనదానిలో గానీ ఏమైనా ఉందని చెపుతున్నానా? లేదు, గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్లమీద ఉన్నవాటిలో, పిశాచాల బల్లమీద ఉన్నవాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయనకంటే మనం బలవంతులమా?
కొరింతువారికి లేఖ 2 6:14-18
నమ్మనివారితో మీరు జతగా ఉండకండి. న్యాయానికి అధర్మంతో వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు బెలియాల్‌తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి? మీరు జీవంగల దేవుని ఆలయం. ఇందుకు దేవుడు చెప్పినదేమిటంటే, నేను వారిలో నివాసముంటాను, వారితో నడుస్తాను. వారి దేవుణ్ణయి ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
అందుచేత వారిలో నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెపుతున్నాడు, కల్మషమైన దానిని ముట్టకండి. నేను మిమ్ములను స్వీకరిస్తాను. మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కొడుకులూ కూతుళ్ళై ఉంటారు అని అమిత శక్తిగల ప్రభువు అంటున్నాడు.
గలతీయవారికి లేఖ 5:19-21
శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
తెస్సలొనీకవారికి లేఖ 1 1:9-10
మీ మధ్యకు మా ప్రవేశం ఎలాంటిదో, మీరు జీవం గల సత్య దేవునికి సేవ చేయడానికీ పరలోకంనుంచి రాబోయే ఆయన కుమారుని కోసం ఎదురు చూడడానికీ ఏవిధంగా విగ్రహాలు విడిచిపెట్టి దేవునివైపు తిరిగారో వారే చెపుతున్నారు. దేవుడు ఆయనను – దేవుని కోపం నుంచి మనలను తప్పిస్తున్న యేసును – చనిపోయిన వారిలో నుంచి లేపాడు.
యోహాను లేఖ 1 5:21
చిన్న పిల్లలారా, విగ్రహాల బారినుంచి మిమ్ములను కాపాడుకోండి. తథాస్తు.
ప్రకటన 21:8
“కానీ పిరికివారు, విశ్వాసం లేనివారు, అసహ్యులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ పూజ చేసేవారు, అబద్ధికులంతా అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది రెండో చావు.”
ప్రకటన 22:15
నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు.
నీపై ఉన్న నాయకులతో నీవు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలంటే ఈ వాక్యాలను చదువు
మత్తయి శుభవార్త 22:15-22
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు. తరువాత తమ శిష్యులను హేరోదు పక్షంవాళ్ళతోపాటు ఆయనదగ్గరికి పంపారు. వారు ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు యథార్థవంతులనీ, ఎవరినీ లెక్కచేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారనీ, మనుషులను పక్షపాతంతో చూడరనీ మాకు తెలుసు. గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి – సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా కాదా?”
యేసు వాళ్ళ దుర్మార్గత పసికట్టి “కపట భక్తులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? సుంకం నాణెం ఒకటి నాకు చూపెట్టండి” అన్నాడు. వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు.
“ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.
“సీజర్‌వి” అని వారు ఆయనతో అన్నారు. ఆయన వారితో “అలాగైతే సీజర్‌వి సీజర్‌కూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
రోమా వారికి లేఖ 13:1-7
ప్రతి ఒక్కరూ రాజ్యాధికారాలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవునివల్ల కలిగిన అధికారం తప్ప మరేదీ లేదు. ఉన్న ఆ అధికారాలను స్థాపించినది దేవుడే. ఈ కారణంచేత అధికారాన్ని ఎదిరించేవారు దేవుని నిర్ణయాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించేవారు తమమీదికి తామే తీర్పు తెచ్చిపెట్టుకొంటారు.
పరిపాలకులు మంచి పనుల విషయంలో బీకరులు కారు – చెడు పనుల విషయంలోనే. అధికారులంటే భయం లేకుండా ఉండాలనే కోరిక మీకు ఉందా? ఉంటే, మంచినే చేస్తూ ఉండండి. అప్పుడు వారు మిమ్ములను మెచ్చుకొంటారు. ఎందుకంటే, అధికారి మీ మేలుకోసం దేవుని పరిచారకుడు. కానీ, మీరు కీడు చేస్తే భయపడాలి. అతడు ఊరికే ఖడ్గం ధరించడు. అతడు కీడు చేసే వారిపై ఆగ్రహం చూపే దేవుని పరిచారకుడు. అందుచేత, వారికి లోబడి ఉండడం తప్పనిసరి – ఆ ఆగ్రహం కారణంగా మాత్రమే కాక అంతర్వాణిని బట్టి కూడా లోబడాలి.
ఇందువల్లే గదా మీరు సుంకాలు కూడా చెల్లించేది? అవును, పరిపాలకులు అదే పని సదా చేస్తున్న దేవుని పరిచారకులు. గనుక ప్రతి ఒక్కరికీ చెల్లించవలసినది ఇవ్వండి. ఎవరికీ సుంకమో వారికి సుంకం, ఎవరికి పన్నో వారికి పన్ను చెల్లించండి. ఎవరిపట్ల భయం చూపదగినది వారిపట్ల భయం చూపండి. ఎవరిని గౌరవించదగింది వారిని గౌరవించండి.
తిమోతికి లేఖ 1 2:1-4
మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.
తీతుకు లేఖ 3:1
వారికి ఈ సంగతులు జ్ఞాపకం చెయ్యి: వారు పరిపాలకులకూ అధికారులకూ లోబడాలి, విధేయులై, ప్రతి మంచి పనికోసమూ సంసిద్ధంగా ఉండాలి.
హీబ్రూవారికి లేఖ 13:17
మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి. ఎందుకంటే, వారు లెక్క అప్పచెప్పవలసినవారుగా మీ ఆత్మలకు కావలి కాస్తున్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారు ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాట వినండి.
పేతురు లేఖ 1 2:13-17
అందుచేత మనుషులలో నియమించిన ప్రతి అధికారానికీ ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందనీ ప్రాంతీయాధికారులు దుర్మార్గులను దండించడానికీ సన్మార్గులను మెచ్చుకోవడానికీ రాజు పంపినవారనీ వారికీ లోబడండి. ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా తెలివితక్కువగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి గాని దేవుని బానిసలుగా బ్రతకండి. అందరిపట్ల గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవునిమీది భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి.
యేసు చేసిన అద్భుతాలు
స్వస్థతనొందిన రోగగ్రస్థులు
ఆధికారి కుమారుని స్వస్థత
యోహాను శుభవార్త 4:46-54
మరో సారి ఆయన గలలీలోని కానాకు వచ్చాడు. ఆయన అక్కడే నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. అక్కడ ఒక రాజ్యాధికారి ఉండేవాడు. కపెర్‌నహూంలో అతని కొడుకుకు జబ్బు చేసింది. యేసు యూదయనుంచి గలలీకి వచ్చాడని విన్నప్పుడు ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు, తన కొడుకును బాగు చేయడానికి రావాలని మనవి చేసుకొన్నాడు. ఎందుకంటే అతని కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు.
యేసు అతనితో “మీరు సూచనలూ అద్భుతాలూ చూడకపోతే ఎంత మాత్రమూ నమ్మరు” అన్నాడు.
రాజ్యాధికారి ఆయనతో “స్వామీ, నా కొడుకు చనిపోకముందు రండి” అన్నాడు.
యేసు అతనితో “నీ దారిన వెళ్ళు! నీ కొడుకు బ్రతుకుతాడు” అన్నాడు. తనతో యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషి తన దారినవెళ్ళాడు.
అతడు వెళ్ళిపోతూ ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కొడుకు బ్రతికాడని చెప్పారు. అతడు బాగుపడడం మొదలైనప్పుడు ఎన్ని గంటలైందని వారిని అడిగాడు. వారు అతనితో “నిన్న ఒంటి గంటకు అతని జ్వరం పోయింది” అన్నారు.
“నీ కొడుకు బ్రతుకుతాడు” అని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రికి తెలుసు, గనుక అతడూ అతని ఇంటివారంతా యేసును నమ్ముకొన్నారు.
యూదయనుంచి గలలీకి వచ్చి యేసు చేసిన అద్భుతమైన సూచనలలో ఇది రెండోది.
పక్షవాతం మనిషి స్వస్థత
యోహాను శుభవార్త 5:1-18
ఆ తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు జెరుసలం వెళ్ళాడు. జెరుసలంలో ‘గొర్రెల ద్వారం’ దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతెస్థ. దానికి అయిదు మంటపాలు ఉన్నాయి. వాటిలో రోగులూ గుడ్డివారూ కుంటివారూ కాళ్ళు చేతులు ఊచబారిపోయినవారూ గుంపులుగా పడి ఉన్నారు. వారు నీళ్ళ కదలికకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే, ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్ళు కదలించిన తరువాత మొట్టమొదట నీళ్ళలో దిగిన రోగి – ఎలాంటి రోగంతో ఉన్నా – పూర్తిగా నయం కావడం జరిగేది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత ముప్ఫయి ఎనిమిదేళ్ళ నుంచి ఉంది. అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలంనుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు.
“నీకు బాగుపడాలని ఇష్టం ఉందా?” అని ఆయన అతణ్ణి అడిగాడు.
ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు: “అయ్యా, నీళ్ళను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు గనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు.”
యేసు అతనితో “లేచి నీ పడక ఎత్తుకొని నడువు” అన్నాడు.
వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు. ఆ రోజు విశ్రాంతి దినం గనుక యూదులు బాగుపడిన ఆ మనిషితో “ఇది విశ్రాంతి దినం. నువ్వు నీ పడక మోయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం” అన్నారు.
అందుకు అతడు “నన్ను బాగు చేసినవాడు ‘నీ పడక ఎత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
“నీ పడక ఎత్తుకొని నడవమని నీతో చెప్పినదెవరు?” అని వాళ్ళు అతణ్ణి అడిగారు.
ఆయన ఎవరో బాగుపడినవానికి తెలియదు. ఎందుకంటే, అక్కడ ఉన్న పెద్ద గుంపులోనుంచి యేసు తప్పుకొన్నాడు.
తరువాత యేసు అతణ్ణి దేవాలయంలో చూచి అతనితో “ఇదిగో విను, నీవు బాగయ్యావు. మునుపటి కంటే ఎక్కువ కీడు నీ మీదికి రాకుండా ఇకనుంచి అపరాధం చేయకు” అన్నాడు.
ఆ మనిషి వెళ్ళి తనను బాగు చేసినవాడు యేసు అని యూదులకు తెలియజేశాడు.
యేసు విశ్రాంతి దినాన ఈ పనులు చేసినందుచేత యూదులు ఆయనను హింసించారు, చంపడానికి చూశారు. అయితే యేసు వారికిలా బదులు చెప్పాడు: “ఇప్పటి వరకు నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేనూ పని చేస్తూ ఉన్నాను.”
ఈ కారణంచేత యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా కోరారు – ఆయన విశ్రాంతి దినాచారాలు మీరడం మాత్రమే గాక, దేవుణ్ణి తన తండ్రి అంటూ తనను దేవునితో సమానుడుగా చేసుకొన్నాడు.
దయ్యాలను వెళ్ళగట్టుట
మార్కు శుభవార్త 1:21-28
వారు కపెర్‌నహూం వెళ్ళారు. వెంటనే, విశ్రాంతి దినాన, ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశించాడు. అక్కడివారు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర పండితులలాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన ఉపదేశించాడు. అప్పుడు వారి సమాజ కేంద్రంలో మలిన పిశాచం పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు “నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!” అంటూ బిగ్గరగా అరిచాడు.
యేసు ఆ పిశాచాన్ని మందలిస్తూ “ఊరుకో. అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు.
ఆ మలిన పిశాచం అతణ్ణి గిజగిజలాడించి పెడ బొబ్బ పెట్టి అతనిలోనుంచి బయటికి వచ్చింది. అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఏమిటిది! ఈ కొత్త ఉపదేశం ఏమిటి? ఆయన మలిన పిశాచాలకు సహా అధికారంతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో ఆయనకు లోబడుతున్నాయి!” అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొంటూ చెప్పుకొన్నారు. త్వరలోనే ఆయనను గురించి కబుర్లు గలలీ ప్రాంతం చుట్టుప్రక్కలా అంతటా వ్యాపించాయి.
లూకా శుభవార్త 4:31-37
అప్పుడాయన కపెర్‌నహూం వెళ్ళాడు. అది గలలీలో ఒక పట్టణం. విశ్రాంతి దినాల్లో ఆయన ప్రజలకు ఉపదేశమిచ్చాడు. ఆయన ఉపదేశానికి వారెంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ఆయన ఉపదేశం అధికారంతో ఉంది. అప్పుడా సమాజ కేంద్రంలో మలిన దయ్యం ఆత్మ పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు గొంతెత్తి ఇలా అరిచాడు: “మమ్మల్ని విడిచిపెట్టు నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!”
యేసు ఆ దయ్యాన్ని మందలిస్తూ “ఊరుకో! అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు. అప్పుడు దయ్యం ఆ మనిషిని వారిమధ్య పడద్రోసినా అతడికి హాని ఏమీ చేయకుండా అతడిలోనుంచి బయటికి వచ్చింది.
అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. “ఏమిటీ ఉపదేశం! ఇతడు మలిన పిశాచాలకు అధికారంతో బలప్రభావాలతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో బయటికి వస్తున్నాయి!” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అప్పుడు ఆయనను గురించి కబుర్లు ఆ ప్రాంతం చుట్టుప్రక్కల అంతటా వ్యాపించాయి.
కుష్ఠురోగం కలిగిన వ్యక్తి స్వస్థత
మత్తయి శుభవార్త 8:1-4
ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద గుంపులుగా ఆయనను అనుసరించారు.
వెంటనే కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధం చేయగలరు” అన్నాడు. యేసు చేయి చాచి అతణ్ణి తాకి, “నాకిష్టమే. శుద్ధుడవు కమ్ము!” అన్నాడు. తక్షణమే అతని కుష్ఠు శుద్ధమైంది. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే విధించిన కానుక అర్పించు.”
మార్కు శుభవార్త 1:40-45
కుష్ఠురోగి ఒకడు ఆయనదగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి “మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ బ్రతిమిలాడాడు.
యేసుకు జాలి వేసింది. చేయి చాచి అతణ్ణి తాకి అతడితో “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు.
ఆయన మాట్లాడిన వెంటనే అతడి కుష్ఠు పోయింది, అతడు శుద్ధమయ్యాడు. అతణ్ణి వెంటనే పంపివేస్తూ ఆయన ఇలా గట్టిగా హెచ్చరిస్తూ అతడితో అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరితో ఏమీ చెప్పకు! అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా నీ శుద్ధికోసం మోషే ధర్మశాస్త్రంలో విధించినవాటిని అర్పించు.”
కానీ అతడు వెళ్ళి ఈ సంగతి అధికంగా చాటిస్తూ విస్తరింపజేయసాగాడు. అందుచేత యేసు ఏ పట్టణంలోకీ బహిరంగంగా వెళ్ళలేక నిర్జన ప్రదేశాలలో ఉండిపోవలసి వచ్చింది. అయినా నలుదిక్కుల నుంచీ జనులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.
లూకా శుభవార్త 5:12-14
ఆయన ఒకానొక గ్రామంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక మనిషి వచ్చాడు. అతనికి ఒళ్ళంతా కుష్ఠు. యేసును చూడగానే అతడు సాష్టాంగపడి “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ ఆయనను బ్రతిమాలు కొన్నాడు.
ఆయన చేయి చాపి అతనిమీద ఉంచి “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు. వెంటనే అతని కుష్ఠు పోయింది.
ఆయన “ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు నీ శుద్ధికోసం మోషే విధించినదాన్ని అర్పించు” అని అతనికి ఆదేశించాడు.
సైన్యాధికారి కుమారుడు బాగుపడుట
మత్తయి శుభవార్త 8:5-13
యేసు కపెర్‌నహూంలో ప్రవేశించినప్పుడు రోమ్ సైన్యంలో ఒక శతాధిపతి ఆయనదగ్గరకు వచ్చాడు, “ప్రభూ, నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. తీవ్రంగా బాధపడుతున్నాడు” అంటూ ఆయనను బతిమాలుకొన్నాడు.
“నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనితో అన్నాడు.
అయితే ఆ శతాధిపతి ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీరు మాట మాత్రం అనండి, అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయం అవుతుంది. నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఎవణ్ణయినా ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఇది చేయి’ అంటే చేస్తాడు.”
ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు, తన వెంట వస్తున్నవారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇస్రాయేల్ ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు. తూర్పునుంచీ పడమరనుంచీ చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతోపాటు విందులో కూర్చుంటారని నేను మీతో చెపుతున్నాను. కానీ ఆ రాజ్య సంబంధులను బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.” అప్పుడు శతాధిపతితో యేసు అన్నాడు, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది.” అదే వేళకు అతని దాసునికి పూర్తిగా నయం అయింది.
లూకా శుభవార్త 7:1-10
తన మాటలన్నీ ప్రజలకు వినిపించడం ముగించిన తరువాత ఆయన కపెర్‌నహూంలో ప్రవేశించాడు. అక్కడ రోమన్ సైన్యంలోని శతాధిపతి దాసుడొకడు జబ్బుపడి చావుబ్రతుకులలో ఉన్నాడు. అతడంటే యజమానికి చాలా ఇష్టం. యేసును గురించి విని శతాధిపతి యూదుల పెద్దలను కొందరిని ఆయన దగ్గరకు పంపి, ఆయన వచ్చి తన దాసుణ్ణి బాగు చేయమని వారిద్వారా విన్నవించుకొన్నాడు.
వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను మనసారా వేడుకొంటూ “మీరు మేలు చేయవలసింది. ఈ వ్యక్తి యోగ్యుడు. మన ప్రజలంటే అతనికి ప్రేమ. మా సమాజ కేంద్రం కట్టించినది ఇతడే” అన్నారు.
యేసు వారితోకూడా వెళ్ళి శతాధిపతి ఇంటికి ఎక్కువ దూరం లేనప్పుడు అతడు స్నేహితులను కొందరిని ఆయన దగ్గరకు పంపి వారిచేత ఆయనతో ఇలా చెప్పించాడు: “స్వామీ, శ్రమ తీసుకోకండి. మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుణ్ణని నేననుకోలేదు. మీరు మాట మాత్రం అనండి. అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయమవుతుంది. నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతిక్రింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఈ పని చెయ్యి’ అంటే చేస్తాడు.”
ఈ మాటలు విని యేసు ఆ మనిషి విషయం ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న జన సమూహం వైపు తిరిగి, “మీతో నేను చెప్పేదేమిటంటే ఇస్రాయేల్ ప్రజల్లో, ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు” అన్నాడు.
పంపబడ్డవారు ఇంటికి తిరిగి వచ్చి జబ్బుపడ్డ ఆ దాసుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు.
యౌవనస్తుడు మరణం నుండి తిరిగి లేచుట
లూకా శుభవార్త 7:11-15
మరుసటి రోజున ఆయన నాయీను అనే ఊరికి వెళ్ళాడు. ఆయనతోకూడా ఆయన శిష్యులలో అనేకులూ పెద్ద జన సమూహమూ వెళ్ళారు. ఆయన ఊరి ద్వారం దగ్గరకు చేరినప్పుడే కొందరు చనిపోయినవాణ్ణి మోసుకువస్తూ ఉన్నారు. చనిపోయినవాడు తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. ఆమెతో కూడా గ్రామస్థులు పెద్దగుంపుగా వస్తూ ఉన్నారు. ఆమెను చూచి ప్రభువుకు జాలి వేసింది. ఆమెతో “ఏడవకమ్మా!” అన్నాడు. పాడెదగ్గరకు వెళ్ళి దానిని తాకాడు. దానిని మోస్తున్నవారు ఆగారు. అప్పుడాయన “అబ్బాయీ! నీతో నేనంటున్నాను, లే!” అన్నాడు.
చనిపోయినవాడు కూర్చుని మాట్లాడసాగాడు. యేసు అతణ్ణి తల్లికి అప్పచెప్పాడు.
పేతురు అత్త మరియు అనేకుల స్వస్థత
మత్తయి శుభవార్త 8:14-15
తరువాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూశాడు. ఆయన ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం పోయింది. ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
మార్కు శుభవార్త 1:29-31
సమాజ కేంద్రంనుంచి బయటికి వచ్చిన వెంటనే వారు సీమోను అంద్రెయల ఇంటికి వెళ్ళారు. వారితోపాటు యాకోబు, యోహాను వచ్చారు. సీమోను అత్త జ్వరంతో పడి ఉంది. వెంటనే ఆమెను గురించి వారాయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమెను లేవనెత్తగానే జ్వరం పోయింది. ఆమె వారికి పరిచర్య చేయసాగింది.
లూకా శుభవార్త 4:38-39
ఆయన లేచి నిలబడి సమాజకేంద్రంనుంచి వెళ్ళి సీమోను ఇంట్లో ప్రవేశించాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమె విషయం వారాయనను వేడుకొన్నారు. ఆయన ఆమె దగ్గర నిలిచి జ్వరాన్ని మందలించగా అది ఆమె నుంచి పోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
దయ్యాలు పట్టిన మనిషి బాగుపడుట
మార్కు శుభవార్త 5:1-20
వారు సరస్సు ఒడ్డున ఉన్న గదరెనివారి ప్రాంతానికి వచ్చారు. ఆయన పడవ దిగినవెంటనే మలిన పిశాచం పట్టిన ఒక మనిషి సమాధులలో నుంచి ఆయనకు ఎదురుగా వచ్చాడు. సమాధులలోనే అతడి నివాసం. అతణ్ణి ఎవరూ సంకెళ్ళతో సహా కట్టలేకపోయారు. అంతకుముందు తరచుగా అతణ్ణి కట్లతో, సంకెళ్ళతో కట్టారు గానీ అతడు సంకెళ్ళను తెంపివేశాడు, కట్లను ముక్కలు చేశాడు. అతణ్ణి లొంగదీసేది ఎవరిచేతా కాలేదు. రాత్రింబగళ్ళు అతడు సమాధులలో, కొండలలో ఉండి ఎప్పుడూ కేకలు వేస్తూ రాళ్ళతో తనను గాయపరచుకొంటూ ఉన్నాడు.
అతడు దూరంనుంచి యేసును చూచినప్పుడు పరుగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు, “యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నాతో నీకేం పని? నన్ను వేధించనని దేవుని పేర నిన్ను ఒట్టు పెట్టిస్తున్నాను!” అంటూ గొంతెత్తి అరిచాడు. ఎందుకంటే ఆయన అతణ్ణి చూచి “మలిన పిశాచమా! ఆ మనిషిని విడిచి బయటికి రా!” అన్నాడు.
ఆయన “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలామందిమి” అని అతడు జవాబిచ్చాడు. అతడు ఆ దేశంనుంచి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలుకొన్నాడు.
అక్కడ కొండలదగ్గర ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. “మేము పందులలో దూరేలా మమ్మల్ని వాటిలోకి పంపెయ్యి” అని ఆ దయ్యాలంతా ఆయనను వేడుకొన్నాయి. వెంటనే యేసు వాటికి సెలవిచ్చాడు. ఆ మలిన పిశాచాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద ఆ నిట్రమైన స్థలం మీద నుంచి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి మునిగి చచ్చాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి.
పందులు మేపేవారు పారిపోయి ఆ సంగతి ఊరిలో, పల్లెసీమలో చెప్పారు. జరిగినదేమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు. యేసు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది. జరిగినది చూచినవారు దయ్యాలు పట్టిన ఆ మనిషి విషయంలో సంభవించినది, పందుల సంగతి కూడా వారికి తెలియజేశారు. అప్పుడు వారు యేసును చూచి తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకోసాగారు.
ఆయన పడవ ఎక్కుతూ ఉంటే అంతకుముందు దయ్యాలు పట్టినవాడు ఆయనదగ్గర తనను ఉండనిమ్మని బ్రతిమిలాడాడు. కానీ యేసు అతణ్ణి రానివ్వలేదు. దానికి బదులు అతడితో “నీవు ఇంటికి వెళ్ళి ప్రభువు నీమీద జాలి చూపి నీకెంత గొప్ప క్రియలు చేశాడో నీవారికి చెప్పు” అన్నాడు. అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో అదంతా దెకపొలిలో చాటించసాగాడు. అందరికి ఎంతో ఆశ్చర్యం వేసింది.
లూకా శుభవార్త 8:26-39
వారు పడవ నడుపుతూ గలలీకి ఎదురుగా ఉన్న గడారీన్‌వారి ప్రాంతం చేరారు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ గ్రామానికి చెందినవాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. అతడు చాలా కాలంపాటు దయ్యాలు పట్టినవాడు. అతడు బట్టలు తొడుక్కోకుండా, ఏ ఇంటిపట్టున ఉండకుండా సమాధులలోనే నివసించేవాడు.
యేసును చూచి అతడు కేక పెట్టి ఆయన ముందు సాగిలపడి “యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నా జోలి నీకెందుకు? నన్ను వేధించకని నిన్ను వేడుకొంటున్నాను!” అని అరిచాడు.
ఎందుకంటే ఆయన “ఈ మనిషిలోనుంచి బయటికి రా!” అని ఆ మలిన పిశాచానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పిశాచం అతణ్ణి తరచుగా పట్టేది. అక్కడివారు అతణ్ణి గొలుసులతో, కాలి సంకెళ్ళతో కట్టి కాపలా కాచినా అతడు బంధకాలు తెంపి ఆ దయ్యంచేత నిర్జన ప్రదేశాలకు తీసుకుపోబడ్డాడు.
యేసు “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. అతడు “సేన” అన్నాడు. ఎందుకంటే అతనిలో చొరబడినది అనేక పిశాచాలు. అవి తమను అగాధంలోకి పోవడానికి ఆజ్ఞాపించవద్దని ఆయనను ప్రాధేయపడ్డాయి. అక్కడ కొండమీద ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. వాటిలో ప్రవేశించడానికి తమకు సెలవిమ్మని పిశాచాలు ఆయనను ప్రాధేయపడ్డాయి. ఆయన వాటికి సెలవిచ్చాడు. ఆ దయ్యాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి ఆ పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద నిటారమైన ఆ స్థలంమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరసులో పడి మునిగి చచ్చాయి.
పందులు మేపేవారు జరిగినది చూచి పారిపోయి ఆ సంగతి ఊరిలో, ఆ పల్లెసీమలో చెప్పారు. జరిగినది ఏమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు. యేసు దగ్గరకు చేరినప్పుడు, దయ్యాలు వదలిపోయిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో యేసు పాదాలదగ్గర కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది. జరిగినది చూచినవారు దయ్యాలు పట్టినవాడు ఎలా ఆరోగ్యం పొందాడో వారికి తెలియజేశారు. అప్పుడు తమ దగ్గరనుంచి వెళ్ళిపొమ్మని గడారీన్‌వారి ప్రాంతీయులంతా ఆయనను కోరారు. ఎందుకంటే వారినెంతో భయం ఆవరించింది.
ఆయన పడవ ఎక్కి బయలుదేరాడు. ఆయనతో ఉండనిమ్మని దయ్యాలు వదలిపోయినవాడు ఆయనను వేడుకొన్నాడు గాని యేసు అతణ్ణి పంపివేస్తూ “నీవు నీ సొంత ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెంత గొప్ప క్రియలు చేశాడో తెలియజెయ్యి” అన్నాడు. అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో ఊరంతటా చెప్పాడు.
కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి స్వస్థత
మత్తయి శుభవార్త 9:1-8
యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నాడు. అప్పుడు కొందరు ఒక పక్షవాతరోగిని పడకమీదే ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, ధైర్యం తెచ్చుకో! నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొందరు “ఇతడు దేవదూషణ చేస్తున్నాడు” అని తమలో తాము చెప్పుకొన్నారు.
వారి తలంపులు తెలుసుకొని యేసు ఇలా అన్నాడు: “హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు? ఏది సులభమంటారు – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా? అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాతరోగితో “లేచి, నీ పడక ఎత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
అతడు లేచి ఇంటికి వెళ్ళాడు. ఇది చూచి జన సమూహాలకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అధికారం మనుషులకు ఇచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
మార్కు శుభవార్త 2:1-12
కొన్ని రోజులయిన తరువాత ఆయన కపెర్‌నహూంకు తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చి నప్పుడు తక్షణమే చాలామంది అక్కడ గుమికూడారు. వారికి ఇంట్లో చేరడానికి తలుపుదగ్గర కూడా స్థలం లేకపోయింది. ఆయన వారికి దేవుని వాక్కు ప్రకటించాడు. అప్పుడు ఒక పక్షవాత రోగిని నలుగురు మనుషులు ఆయన ఉన్న ఇంటికి మోసుకువచ్చారు. జన సమూహం ఒత్తిడిని బట్టి యేసుదగ్గరకు అతణ్ణి తీసుకురాలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు ఊడదీసి సందు చేసి దాని గుండా పక్షవాత రోగి పడుకొని ఉన్న పరుపును దింపారు.
యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
ధర్మశాస్త్ర పండితులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు. వారి హృదయాలలో ఇలా ఆలోచించుకొన్నారు: “ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి! దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు?”
వారు లోలోపల అలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వెంటనే వారితో అన్నాడు, “మీ హృదయాలలో ఈ విషయాలు ఆలోచించడం ఎందుకు? ఏది సులభం? పక్షవాత రోగితో ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అనడమా? అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళు.”
అతడు వెంటనే లేచి పరుపెత్తుకొని వారందరి సమక్షంలో బయటికి నడుస్తూ వెళ్ళాడు. గనుక వారంతా విస్మయం చెంది, “మనం ఇలాంటిదేదీ ఎన్నడూ చూడలేదు” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
లూకా శుభవార్త 5:17-26
ఒక రోజున ఆయన ఉపదేశమిస్తూ ఉన్నాడు. రోగాలు బాగు చేసే ప్రభు శక్తి అక్కడ ఉంది. గలలీలోని ప్రతి గ్రామం నుంచీ యూదయ, జెరుసలంనుంచీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్ర బోధకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా కొందరు మనుషులు పక్షవాత రోగిని పడకమీద తీసుకు వచ్చారు. అతణ్ణి ఇంటి లోపలికి తెచ్చి యేసు ముందు ఉంచాలని చూశారు. అయితే ఆ జనసమూహం ఉండడంవల్ల అతణ్ణి లోపలికి తేవడానికి మరో మార్గం చూడలేక వారు ఇంటి కప్పుమీదికెక్కారు. పెంకులు తీసి అతణ్ణి పడకతోపాటు వారి మధ్యకు యేసు ముందే దింపారు.
యేసు వారి విశ్వాసం చూచి అతనితో “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఇలా తలపోయడం మొదలుపెట్టారు: “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు క్షమించగల వారెవరు?”
వారి తలంపులు తెలిసి యేసు వారితో “మీ హృదయాలలో ఇలా ఆలోచించడం ఎందుకు? ఏది సులభం? – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా? అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. అప్పుడు ఆయన పక్షవాత రోగితో “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
వెంటనే అతడు వారి ఎదుటే లేచి నిలబడ్డాడు. తాను పడుకొన్న పరుపెత్తుకొని దేవుణ్ణి కీర్తిస్తూ తన సొంత ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయమొంది “ఈవేళ వింత విషయాలు చూశాం” అంటూ దేవుణ్ణి కీర్తించి భయంతో నిండిపోయారు.
స్త్రీ స్వస్థత
మత్తయి శుభవార్త 9:20-22
అప్పుడే, పన్నెండేళ్ళనుంచి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది. ఎందుకంటే, “ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా నయం అవుతుంది” అని ఆమె అనుకొంది.
యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. ఆ గడియనుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది.
మార్కు శుభవార్త 5:25-34
పన్నెండేళ్ళనుంచి రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఈమె అనేకమంది వైద్యులచేత అనేక బాధలు అనుభవిస్తూ తనకు కలిగినదంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఎక్కువైంది. ఆమె యేసును గురించి విని, “ఆయన బట్టలను తాకితే చాలు, నాకు పూర్తిగా నయమవుతుంది” అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమయిన అనుభవం శరీరంలో కలిగింది.
వెంటనే యేసు తనలోనుంచి ప్రభావం వెలువడిందని గ్రహించి జన సమూహం వైపుకు తిరిగి “నా బట్టలను తాకినదెవరు?” అన్నాడు.
ఆయన శిష్యులు ఆయనతో “ఈ గుంపు నీమీద విరగబడుతూ ఉండడం చూస్తున్నావు గదా. మరి, ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావా?” అన్నారు. ఆయనైతే అలా చేసిన ఆమెను చూడడానికి చుట్టూ కలియజూశాడు. ఆ స్త్రీ తనకు జరిగినది గ్రహించి భయంతో వణకుతూ వచ్చి ఆయన ముందు పడి నిజమంతా చెప్పుకొంది.
ఆయన ఆమెతో అన్నాడు “కుమారీ, నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. బాధ నివారణ పొంది శాంతితో వెళ్ళు.”
లూకా శుభవార్త 8:43-48
పన్నెండేళ్ళనుంచి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తన బ్రతుకుదెరువంతా వైద్యుల దగ్గర ఖర్చు చేసింది గాని వారిలో ఎవరిచేత స్వస్థత పొందలేకపోయింది. ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచు తాకింది. వెంటనే ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.
“నన్ను తాకినదెవరు?” అని యేసు అడిగాడు.
అందరూ తాము కాదు అన్నారు.
పేతురు, అతనితో ఉన్నవారు “నాయకా! ఈ జనసమూహాలు కిక్కిరిసి నీమీద పడుతూ ఉన్నారు గదా! అయినా నీవు ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావు.”
అయితే యేసు అన్నాడు “ఎవరో నన్ను తాకారు. నాలో నుంచి ప్రభావం బయలుదేరిందని నాకు తెలిసింది.”
తాను దాగి ఉండలేనని గ్రహించి ఆ స్త్రీ వణకుతూ వచ్చి ఆయన ముందు సాగిల పడింది. తానెందుకు యేసును తాకినదీ, తన వ్యాధి ఎలా వెంటనే పూర్తిగా నయమైనదీ ప్రజలందరి ఎదుట ఆయనకు చెప్పింది.
అప్పుడాయన ఆమెతో “కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.
మరణం నుండి తిరిగి లేచిన బాలిక
మత్తయి శుభవార్త 9:18-26
ఆయన ఈ సంగతులు వారితో చెపుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా, మీరు వచ్చి ఆమెమీద మీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
యేసు లేచి అతడివెంట వెళ్ళసాగాడు. శిష్యులు కూడా వచ్చారు. అప్పుడే, పన్నెండేళ్ళనుంచి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది. ఎందుకంటే, “ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా నయం అవుతుంది” అని ఆమె అనుకొంది.
యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. ఆ గడియనుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది.
యేసు ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళినతరువాత అక్కడ పిల్లనగ్రోవులు వాయించేవారినీ గోల చేస్తూ ఉన్న గుంపునూ చూచి వారితో ఇలా అన్నాడు: “వెళ్ళిపోండి! అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది.” వాళ్ళు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు. గుంపును బయటికి పంపివేసిన తరువాత ఆయన లోపలికి వెళ్ళి ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆమె లేచి నిలబడింది. దీన్ని గురించిన కబురు ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
మార్కు శుభవార్త 5:21-43
యేసు పడవలో అవతలి ఒడ్డుకు మళ్ళీ చేరినప్పుడు పెద్ద జన సమూహం ఆయన దగ్గర సమకూడింది. ఆయన సరస్సు ఒడ్డున ఉన్నాడు. అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఆ అధికారి పేరు యాయీరు. “నా చిన్న కూతురు చావుబతుకుల్లో ఉంది. ఆమె బాగుపడి బతికేలా మీరు వచ్చి ఆమెమీద చేతులు ఉంచండి” అంటూ యేసును హృదయ పూర్వకంగా బతిమాలుకొన్నాడు.
ఆయన అతడితోకూడా వెళ్ళాడు. పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళింది. జనం ఆయనమీద విరగబడుతూ ఉన్నారు. పన్నెండేళ్ళనుంచి రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఈమె అనేకమంది వైద్యులచేత అనేక బాధలు అనుభవిస్తూ తనకు కలిగినదంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఎక్కువైంది. ఆమె యేసును గురించి విని, “ఆయన బట్టలను తాకితే చాలు, నాకు పూర్తిగా నయమవుతుంది” అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమయిన అనుభవం శరీరంలో కలిగింది.
వెంటనే యేసు తనలోనుంచి ప్రభావం వెలువడిందని గ్రహించి జన సమూహం వైపుకు తిరిగి “నా బట్టలను తాకినదెవరు?” అన్నాడు.
ఆయన శిష్యులు ఆయనతో “ఈ గుంపు నీమీద విరగబడుతూ ఉండడం చూస్తున్నావు గదా. మరి, ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావా?” అన్నారు. ఆయనైతే అలా చేసిన ఆమెను చూడడానికి చుట్టూ కలియజూశాడు. ఆ స్త్రీ తనకు జరిగినది గ్రహించి భయంతో వణకుతూ వచ్చి ఆయన ముందు పడి నిజమంతా చెప్పుకొంది.
ఆయన ఆమెతో అన్నాడు “కుమారీ, నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. బాధ నివారణ పొంది శాంతితో వెళ్ళు.”
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి కొందరు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఇక బోధకుణ్ణి తొందర పెట్టడమెందుకు?” అన్నారు.
వారు చెప్పిన మాట యేసు విన్న వెంటనే సమాజకేంద్రం అధికారితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.
ఆయన పేతురునూ యాకోబునూ యాకోబు తోబుట్టువైన యోహానునూ తప్ప ఇంకెవరినీ తనవెంట రానివ్వలేదు. ఆయన సమాజకేంద్రం అధికారి ఇంటిదగ్గర చేరినప్పుడు సందడిగా ఉండడం ఆయన చూశాడు. అక్కడివారు బిగ్గరగా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో ప్రవేశించి “ఎందుకు సందడి చేస్తూ ఏడుస్తూ ఉన్నారు? పిల్ల చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే” అన్నాడు. వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.
ఆయన వారందరినీ బయటికి పంపిన తరువాత, ఆ పిల్ల తల్లిదండ్రులనూ తనతో ఉన్నవారినీ వెంటబెట్టుకొని పిల్ల పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొని “తలితా కుమీ!” అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు “చిన్న పిల్లా, నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.
వెంటనే ఆ పిల్ల లేచి నడిచింది (ఆమె వయస్సు పన్నెండేళ్ళు). దీనితో వారు ఎంతో విస్మయం చెందారు. ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదని ఆయన వారిని గట్టిగా ఆదేశించి ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు.
లూకా శుభవార్త 8:40-56
అవతలి ఒడ్డున జనసమూహం యేసు కోసం చూస్తూ ఉన్నారు గనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను సంతోషంతో స్వీకరించారు. అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసు పాదాల దగ్గర సాగిలపడి తన ఇంటికి రమ్మని ఆయనను ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే అతని ఒకే ఒక కూతురు సుమారు పన్నెండేళ్ళ బాలిక చావు బ్రతుకులలో ఉంది. ఆయన వెళ్తూ ఉంటే జనసమూహాలు ఆయనమీద విరగబడుతూ ఉన్నారు.
పన్నెండేళ్ళనుంచి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తన బ్రతుకుదెరువంతా వైద్యుల దగ్గర ఖర్చు చేసింది గాని వారిలో ఎవరిచేత స్వస్థత పొందలేకపోయింది. ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచు తాకింది. వెంటనే ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.
“నన్ను తాకినదెవరు?” అని యేసు అడిగాడు.
అందరూ తాము కాదు అన్నారు.
పేతురు, అతనితో ఉన్నవారు “నాయకా! ఈ జనసమూహాలు కిక్కిరిసి నీమీద పడుతూ ఉన్నారు గదా! అయినా నీవు ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావు.”
అయితే యేసు అన్నాడు “ఎవరో నన్ను తాకారు. నాలో నుంచి ప్రభావం బయలుదేరిందని నాకు తెలిసింది.”
తాను దాగి ఉండలేనని గ్రహించి ఆ స్త్రీ వణకుతూ వచ్చి ఆయన ముందు సాగిల పడింది. తానెందుకు యేసును తాకినదీ, తన వ్యాధి ఎలా వెంటనే పూర్తిగా నయమైనదీ ప్రజలందరి ఎదుట ఆయనకు చెప్పింది.
అప్పుడాయన ఆమెతో “కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి ఒకడు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఉపదేశకుణ్ణి తొందర పెట్టకండి” అన్నాడు.
అది విని యేసు అతనితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు. అప్పుడామె బాగుపడుతుంది” అని జవాబిచ్చాడు.
ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పేతురునూ యాకోబునూ యోహానునూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అమ్మాయిని గురించి అక్కడివారంతా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు. ఆయన “ఏడవకండి. ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. ఆమె చనిపోయిందని తెలిసి వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.
అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “చిన్నపిల్లా! లే!” అన్నాడు. ఆమెకు తన ఆత్మ తిరిగి వచ్చి ఆమె వెంటనే లేచింది. ఆమెకు తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులకు ఎంతో విస్మయం కలిగింది. కానీ జరిగినది ఎవరికీ చెప్పకండని ఆయన వారిని ఆదేశించాడు.
మూగ మనిషి స్వస్థత
మత్తయి శుభవార్త 9:32-34
వారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు. జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఇస్రాయేల్‌లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు” అని వారు చెప్పుకొన్నారు.
అయితే పరిసయ్యులు “దయ్యాల నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడతున్నాడు” అన్నారు.
పక్షవాతం చేయి కలిగిన మనిషి స్వస్థత
మత్తయి శుభవార్త 12:9-14
ఆయన అక్కడనుంచి వెళ్ళి వారి సమాజ కేంద్రంలో ప్రవేశించాడు. అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. యేసుపై నేరం మోపాలని వారు ఆయనను ఇలా అడిగారు: “విశ్రాంతి దినాన బాగు చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమేనా?”
ఆయన వారితో అన్నాడు, “మీలో ఎవనికైనా సరే గొర్రె ఒకటి ఉంది అనుకోండి. విశ్రాంతి దినాన అది గుంటలో పడితే దానిని పట్టుకొని పైకి తీయడా? గొర్రెకంటే మనిషికి ఎంతో ఎక్కువ విలువ ఉంది గదా! గనుక విశ్రాంతి దినాన మంచి చేయడం ధర్మశాస్త్రానికి అనుగుణమే!”
అప్పుడాయన ఆ మనిషితో “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతడు దానిని చాపగానే అది పూర్వ స్థితికి మారి రెండో చేయిలాగా అయింది. కానీ పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనపై కుట్రపన్నారు.
మార్కు శుభవార్త 3:1-6
మరో సారి ఆయన సమాజ కేంద్రంలోకి వెళ్ళాడు. అక్కడ చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినాన అతణ్ణి బాగు చేస్తాడేమో అని వారాయనను చూస్తూ ఉన్నారు. ఆయనమీద నేరం మోపాలని వారి ఉద్దేశం.
ఆయన చేయి ఎండిపోయినవాడితో “ఇటు దగ్గరకు రా!” అన్నాడు. అప్పుడాయన వారితో అన్నాడు, “విశ్రాంతి దినాన మేలు చేయడం, కీడు చేయడం, ప్రాణాన్ని దక్కించడం, చంపడం ఏది ధర్మం?” అందుకు వారు ఊరుకొన్నారు.
ఆయన వారి హృదయ కాఠిన్యానికి నొచ్చుకొని వారివైపు కోపంతో కలయజూశాడు. అప్పుడా మనిషితో “నీ చేయి చాపు!” అన్నాడు. అతడు దానిని చాపగానే అది మరో చేయి ఎంత బాగుగా ఉందో అంత పూర్తిగా నయమయింది. అప్పుడు పరిసయ్యులు బయటికి వెళ్ళి, వెంటనే హేరోదురాజు పక్షంవారితో కలిసి యేసును ఎలా రూపుమాపుదామా అని ఆయనమీద కుట్ర పన్నారు.
లూకా శుభవార్త 6:6-11
మరో విశ్రాంతి దినాన కూడా ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశమిచ్చాడు. అక్కడ కుడి చేయి ఎండిపోయినవాడొకడు ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినాన ఎవరినైనా బాగు చేస్తాడేమో అని ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయనను చూస్తూ ఉన్నారు. ఎలాగైనా ఆయనమీద నేరం మోపాలని వారి ఉద్దేశం.
వారి తలంపులు తెలిసి ఆయన ఎండిపోయిన చేయి ఉన్నమనిషితో “లేచి మధ్యలో నిలబడు!” అన్నాడు. కనుక అతడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యేసు వారితో “మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. విశ్రాంతి దినాన మంచి చేయడం, కీడు చేయడం, ప్రాణాన్ని దక్కించడం, నాశనం చేయడం ఏది ధర్మం?” అన్నాడు.
ఆయన వారందరివైపు కలయ చూచి ఆ మనిషితో “నీ చేయి చాపు!” అన్నాడు. అతడు ఆ విధంగా చేయగానే అతడి చేయి మరో దానిలాగా పూర్తిగా నయమయింది. వారైతే వెర్రి కోపంతో నిండిపోయి యేసును ఏమి చెయ్యాలా అని తమలో తాము మాట్లాడుకొన్నారు.
దయ్యాలు పట్టిన మూగ మనిషి బాగుపడుట
మత్తయి శుభవార్త 12:22-23
అప్పుడు, దయ్యం పట్టిన ఒకణ్ణి ఆయన దగ్గరికి కొందరు తెచ్చారు. అతడు గుడ్డివాడూ మూగవాడూ. యేసు అతణ్ణి బాగు చేశాడు గనుక ఆ గుడ్డి, మూగవాడైన వ్యక్తి చూడటం మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి “ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి?” అని చెప్పుకొన్నారు.
లూకా శుభవార్త 11:14
ఒకప్పుడు ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అది మూగది. దయ్యం బయటికి వెళ్ళిపోయిన తరువాత మూగవాడు మాట్లాడాడు. అందుకా జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది.
వేరొక తెగకు చెందిన స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత
మత్తయి శుభవార్త 15:21-28
యేసు అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు, ఆ ప్రాంతంలో నివసించే కనాను స్త్రీ ఒకతె వచ్చి ఆయనకు ఇలా బిగ్గరగా చెప్పింది: “స్వామీ! దావీదు కుమారుడా! నామీద దయ చూపండి. నా కూతురును దయ్యం ఘోరంగా పట్టింది.”
అందుకాయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి “ఆమెను పంపివేయండి. మా వెంటబడి కేకలు వేస్తూ ఉంది” అని ఆయనను ప్రాధేయ పడ్డారు.
ఆయన జవాబిచ్చాడు, “ఇస్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డాను.”
అయితే ఆమె వచ్చి ఆయనను ఆరాధించి “స్వామీ! నాకు సహాయం చెయ్యండి!” అంది.
అందుకాయన “పిల్లల భోజనం తీసి కుక్కపిల్లలకు వేయడం తగిన పని కాదు” అని జవాబిచ్చాడు.
ఆమె “నిజమే స్వామీ గాని కుక్కపిల్లలు సహా తమ యజమాని బల్లమీదనుంచి పడే ముక్కలు తింటాయి గదా!” అంది.
అప్పుడు యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరినట్టే నీకు జరుగుతుంది.” ఆ ఘడియలోనే ఆమె కూతురికి పూర్తిగా నయం అయింది.
మార్కు శుభవార్త 7:24-30
ఆయన అక్కడనుంచి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. ఒకామె ఆయనను గురించి విని వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడింది. ఆమె చిన్న కూతురుకు మలిన పిశాచం పట్టింది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయ ప్రాంతంలో పుట్టిన గ్రీస్ దేశస్థురాలు. తన కూతురిలోనుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆమె యేసును బ్రతిమిలాడింది.
అయితే యేసు ఆమెతో “మొదట పిల్లలను తృప్తిగా తిననియ్యి. పిల్లల భోజనం తీసి కుక్క పిల్లలకు వేయడం తగదు” అన్నాడు.
అందుకామె ఆయనతో “స్వామీ, నిజమే గానీ బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు సహా పిల్లలు పడేసే ముక్కలు తింటాయి గదా!” అని జవాబిచ్చింది.
అప్పుడాయన ఆమెతో “ఆ మాట చెప్పినందుచేత నీవు వెళ్ళవచ్చు. నీ కూతురిలోనుంచి దయ్యం వెళ్ళిపోయింది” అన్నాడు.
ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే దయ్యం వెళ్ళిపోయి ఆమె కూతురు పడకమీద పడుకొని ఉండడం కనిపించింది.
చెవిటి మూగ వ్యక్తి స్వస్థత
మార్కు శుభవార్త 7:31-37
యేసు తూరు, సీదోను ప్రాంతంనుంచి మళ్ళీ బయలుదేరి దెకపొలి ప్రదేశం గుండా గలలీ సరస్సు దగ్గరికి వచ్చాడు. అక్కడ చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. ఆయన అతణ్ణి జనసమూహం నుంచి వేరుగా తీసుకువెళ్ళి అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి అతడి నాలుకను తాకాడు. అప్పుడు ఆకాశంవైపు తలెత్తి చూస్తూ నిట్టూర్చి అతడితో “ఎప్ఫతా!” అన్నాడు. ఆ మాటకు “తెరచుకో!” అని అర్థం.
వెంటనే అతడి చెవులు తెరచుకొన్నాయి. నాలుక సడలి అతడు తేటగా మాట్లాడాడు. ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారిని ఆదేశించాడు గానీ వారినెంత ఎక్కువగా ఆదేశించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు. వారు అమితంగా ఆశ్చర్యపడిపోయారు, “ఈయన అన్నిటినీ బాగు చేశాడు! చెవిటివాళ్ళు వినేలా చేస్తున్నాడు. మూగవాళ్ళను మాట్లాడిస్తున్నాడు!” అని చెప్పుకొన్నారు.
బెత్సైదాలో ఉన్న గుడ్డి మనిషి స్వస్థత
మార్కు శుభవార్త 8:22-26
ఆయన బేత్‌సయిదా చేరుకొన్నప్పుడు కొందరు ఒక గుడ్డివాణ్ణి ఆయనదగ్గరకు తీసుకువచ్చి అతడిమీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు. ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి బయటికి తీసుకువెళ్ళాడు. అతడి కండ్లమీద ఉమ్మివేసి అతడి మీద చేతులుంచి “నీకేమైనా కనిపిస్తున్నదా?” అని అతణ్ణి అడిగాడు.
అతడు పైకి చూస్తూ “మనుషులు నడవడం నాకు కనిపిస్తున్నది. వారు చెట్లలాగా ఉన్నారు” అన్నాడు. మరో సారి ఆయన అతడి కండ్లమీద చేతులుంచి పైకి చూడమన్నాడు. అప్పుడతడు పూర్తిగా నయమయ్యాడు. అందరూ తేటగా అతనికి కనిపించారు. అతణ్ణి అతని ఇంటికి పంపిస్తూ ఆయన “ఊరిలోకి వెళ్ళకు, ఈ సంగతి ఊరిలో ఎవరికి చెప్పకు” అన్నాడు.
దయ్యాలు పట్టిన చిన్నవాని స్వస్థత
మత్తయి శుభవార్త 17:14-20
వారు జన సమూహం దగ్గరకు రాగానే ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి ఇలా అన్నాడు: “స్వామీ! నా కొడుకును దయ చూడండి. అతడు మూర్ఛ రోగంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నిప్పులో, నీళ్ళలో తరచుగా పడిపోతూ ఉంటాడు. అతణ్ణి మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను గాని వాళ్ళు అతణ్ణి బాగు చేయలేక పోయారు.”
యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! వక్రమార్గం పట్టిన తరమా! నేనెంతకాలం మీతో ఉంటాను! ఎందాక మిమ్ములను సహించాలి! ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకురా.”
యేసు ఆ దయ్యాన్ని గద్దించాడు. అది అతనిలో నుండి బయటికి వచ్చింది. వెంటనే అబ్బాయికి పూర్తిగా నయం అయింది.
తరువాత శిష్యులు ఒంటరిగా యేసుదగ్గరికి వచ్చి “మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.
వారితో ఆయన “దేవుని మీద మీకున్న అపనమ్మకం వల్లే నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీకు ఆవగింజంత నమ్మకం ఉంటే చాలు – మీరు ఈ కొండతో ‘ఇక్కడనుండి అక్కడికి పో!’ అంటే అది పోతుంది. అంతేకాదు, మీకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.
మార్కు శుభవార్త 9:14-29
శిష్యుల దగ్గరకు ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జన సమూహం ఉండడం, వారితో కొందరు ధర్మశాస్త్ర పండితులు వాదించడం చూశాడు. జన సమూహమంతా ఆయనను చూచిన వెంటనే అధికంగా ఆశ్చర్యపడిపోతూ ఆయనదగ్గరకు పరుగెత్తివచ్చి ఆయనకు నమస్కరించారు.
ఆయన “వారితో దేన్ని గురించి వాదిస్తున్నారు?” అని ధర్మశాస్త్ర పండితులనడిగాడు.
జన సమూహంలో ఒకడు ఆయనకిలా జవాబు చెప్పాడు: “బోధకుడా, తమరిదగ్గరికి నా కొడుకును తీసుకువచ్చాను. అతడు దయ్యం పట్టి మూగవాడయ్యాడు. అది అతణ్ణి పూనినప్పుడెల్లా అతణ్ణి కింద పడేస్తుంది. అతని నోటివెంట నురుగు కారుతుంది. పండ్లు పటపటా కొరుక్కొంటాడు. ఒళ్ళంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని తమరి శిష్యులతో మాట్లాడాను గాని వారు అలా చేయలేకపోయారు.”
ఆయన అతనికిలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను! ఎందాకా మిమ్ములను సహించాలి! అతణ్ణి నా దగ్గరకు తీసుకురండి.”
వారతణ్ణి ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. అతడు ఆయనను చూచినవెంటనే ఆ దయ్యం అతణ్ణి విలవిల లాడించింది. అతడు నేలమీద పడి నురుగు కక్కుతూ సుడులు తిరిగాడు.
ఆయన “ఇతనికి ఇది ఎంత కాలంనుంచి ఉంది?” అని అతడి తండ్రిని అడిగాడు. అతడు అన్నాడు “చిన్నప్పటి నుంచీ ఉందండి. పదేపదే అది అతణ్ణి నిప్పులో, నీళ్ళలో పడేసి నాశనం చేయజూసింది. తమరు ఏమైనా చేయగలిగితే మామీద జాలి చూపి సహాయం చెయ్యండి.”
యేసు అతడితో “నీవు నమ్మగలిగితే – దేవుణ్ణి నమ్మే వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
వెంటనే ఆ పిల్లవాడి తండ్రి కన్నీరు కారుస్తూ బిగ్గరగా అన్నాడు “నేను నమ్ముతున్నాను. నా అపనమ్మకం విషయంలో సహాయం చెయ్యండి.”
అక్కడికి జనం పరుగెత్తి రావడం చూచి యేసు ఆ మలిన పిశాచాన్ని గద్దించి దానితో “మూగ, చెవిటి దయ్యమా! అతనిలో నుంచి బయటికి వచ్చి ఇంకెన్నడూ అతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
అది పెడ బొబ్బలు పెట్టి ఆ పిల్లవాణ్ణి అధికంగా విలవిలలాడించి అతనిలోనుంచి బయటికి వచ్చింది. అప్పుడతడు చచ్చినవాడిలాగా అయ్యాడు, గనుక “వాడు చనిపోయాడు” అని చాలామంది చెప్పుకొన్నారు. అయితే యేసు అతడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. అతడు లేచి నిలబడ్డాడు.
ఆయన ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఒంటరిగా ఆయనను ఇలా అడిగారు: “మేము దానినెందుకు బయటికి వెళ్ళగొట్టలేకపోయాం?”
ఆయన వారితో “అలాంటిది ప్రార్థనవల్ల, ఉపవాసంవల్ల తప్ప మరి దేనివల్లా బయటికి రాదు” అన్నాడు.
లూకా శుభవార్త 9:37-43
మర్నాడు వారు పర్వతం దిగి వచ్చినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకెదురుగా వచ్చారు. ఆకస్మికంగా జన సమూహంలో ఒక మనిషి కంఠమెత్తి “ఉపదేశకా! వచ్చి నా కొడుకును కటాక్షించండని తమరిని వేడుకొంటున్నాను. నాకు అతడొక్కడే కొడుకు. అతణ్ణి ఒక ఆత్మ పూనుతుంది. ఉన్నట్టుండి అతడు పెడ బొబ్బలు పెడతాడు. అతడి నోటి వెంట నురుగు కారుతుంది. ఎందుకంటే అది అతణ్ణి విలవిలలాడిస్తుంది. అది అతణ్ణి నలగగొడుతూ చాలా కష్టంతో విడిచిపోతుంది. దానిని వెళ్ళగొట్టండని తమరి శిష్యులను వేడుకొన్నాను గాని వారిచేత కాలేదు” అన్నాడు.
యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని వక్ర తరమా! నేనెంతకాలం మీతో ఉండి మిమ్ములను సహించాలి! నీ కొడుకును ఇక్కడికి తీసుకురా.”
అబ్బాయి వస్తూ ఉండగానే ఆ పిశాచం అతణ్ణి క్రింద పడవేసి విలవిలలాడించింది. అయితే యేసు ఆ మలిన ఆత్మను మందలించి అబ్బాయిని బాగు చేసి తండ్రికి అప్పచెప్పాడు. అందరూ దేవుని మహత్యానికి ఎంతో విస్మయమొందారు. యేసు చేస్తున్నదానంతటి విషయం ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను చూచి
గుడ్డి మనిషి స్వస్థత
మార్కు శుభవార్త 10:46-52
వారు యెరికో చేరారు, యెరికోనుంచి తన శిష్యులతో, పెద్ద జన సమూహంతో బయలుదేరుతూ ఉంటే ఒక గుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండి బిచ్చమెత్తుతున్నాడు. అతడు తీమయి కొడుకు బర్‌తీమయి. వస్తున్నది నజరేతువాడైన యేసు అని విని అతడు “యేసూ! దావీదు కుమారా! నామీద దయ చూపండి!” అని కేకలు పెట్టసాగాడు.
ఊరుకొమ్మని అనేకులు అతణ్ణి గద్దించారు గాని అతడు “దావీదు కుమారా! నామీద దయ చూపండి” అంటూ మరీ ఎక్కువగా కేకలు పెట్టాడు.
యేసు ఆగి “అతణ్ణి పిలవండి” అని ఆదేశించాడు. వారా గుడ్డివాణ్ణి పిలిచి “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు.
అతడు తన పైబట్ట అవతల పారవేసి గబాలున లేచి యేసుదగ్గరికి వచ్చాడు. అందుకు యేసు “నీకోసం నన్నేమి చెయ్యమంటావు?” అని అతణ్ణి అడిగాడు.
గుడ్డివాడు ఆయనతో “బోధకుడా, నాకు చూపు కలిగేలా చేయండి” అన్నాడు.
యేసు అతడితో “నీవు వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. వెంటనే అతడికి చూపు వచ్చింది. అతడు దారిన యేసు వెంట వెళ్ళాడు.
లూకా శుభవార్త 18:35-43
ఆయన యెరికో దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు దారి ప్రక్కన గుడ్డివాడు కూర్చుని బిచ్చమడుక్కొంటూ ఉన్నాడు. జన సమూహం అటువైపు వెళ్ళిపోతున్న చప్పుడు విని “ఏమిటి ఇదంతా?” అని అడిగాడు.
నజరేతువాడైన యేసు అటువైపు వెళ్తున్నాడని ఎవరో అతనికి తెలిపారు. అప్పుడతడు “యేసూ! దావీదు కుమారా! నామీద దయ చూపండి!” అని కేకలు వేశాడు.
ముందు నడుస్తున్నవారు ఊరుకోమంటూ అతణ్ణి గద్దించారు. అయితే అతడు మరీ ఎక్కువగా “దావీదు కుమారా! నా మీద దయ చూపండి!” అని కేకలు పెట్టాడు.
యేసు ఆగి అతణ్ణి తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశించాడు. అతడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన “నీ కోసం నేనేమి చేయాలని కోరుతున్నావు?” అని అతణ్ణి అడిగాడు.
అతడు “ప్రభూ, నేను చూపు పొందాలని కోరుతున్నాను” అన్నాడు.
యేసు అతనితో “చూపు పొందు! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
వెంటనే అతడు చూపు పొందాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన వెంట వచ్చాడు. అది చూచి ప్రజలంతా దేవుణ్ణి స్తుతించారు.
విశ్రాంతి దినాన్న స్వస్థత పొందిన స్త్రీ
లూకా శుభవార్త 13:10-17
ఒక విశ్రాంతి దినాన ఆయన ఒక సమాజ కేంద్రంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. పద్ధెనిమిది ఏళ్ళనుంచి ఒక పిశాచం వల్ల కలిగిన జబ్బుతో ఉన్న స్త్రీ ఒకతె అక్కడ ఉంది. నడుము వంగిపోయి ఆమె ఎంతమాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది.
యేసు ఆమెను చూచి దగ్గరకు పిలిచాడు, ఆమెతో “అమ్మా, నీ రోగంనుంచి నీకు విడుదల కలిగింది!” అన్నాడు. ఆమెమీద చేతులుంచగానే ఆమె తిన్నని వెన్నెముక గలిగి, దేవుణ్ణి స్తుతించసాగింది.
విశ్రాంతి దినాన యేసు రోగిని బాగు చేసినందుచేత సమాజ కేంద్రం అధికారి కోపంతో మండిపడి జన సమూహంతో “పని చేయడానికి వారంలో ఆరు రోజులున్నాయి గదా! ఆ రోజుల్లో వచ్చి మీ రోగాలు బాగు చేయించుకోండి గాని విశ్రాంతి దినాన కాదు” అన్నాడు.
అందుకు జవాబిస్తూ ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “కపట భక్తుడా! విశ్రాంతి దినాన మీలో ప్రతి ఒక్కడూ ఎద్దును గానీ గాడిదను గానీ విప్పి కొట్టంనుంచి నీళ్ళకు తోలుకు పోతారు గదా! పద్ధెనిమిది ఏళ్ళపాటు సైతాను బంధించిన ఈ స్త్రీ, అబ్రాహాము వంశికురాలైన ఈ స్త్రీ ఆ బంధకం నుంచి విశ్రాంతి దినాన విడిపించబడకూడదా ఏమిటి?”
ఆయన అలా అన్నప్పుడు ఆయన వ్యతిరేకులు అవమానం పాలయ్యారు గాని జనమంతా ఆయన చేస్తున్న ఘన కార్యాలన్నిటికీ సంతోషించారు.
రోగియైన మనిషి స్వస్థత
లూకా శుభవార్త 14:1-6
ఒక విశ్రాంతి దినాన ఇలా జరిగింది: ఆయన పరిసయ్యులలో ప్రముఖుడొకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆయనకు ఎదురుగానే వాపు రోగం ఉన్న మనిషి ఉన్నాడు. యేసు “విశ్రాంతి దినాన రోగులను బాగు చేయడం న్యాయ సమ్మతమా?” అని ధర్మశాస్త్ర విద్వాంసులనూ పరిసయ్యులనూ చూచి అన్నాడు.
వారు ఊరుకొన్నారు. అప్పుడాయన అతణ్ణి చేరదీసి బాగు చేశాడు, వెళ్ళనిచ్చాడు. అప్పుడు ఆయన “విశ్రాంతి దినాన మీలో ఎవరు తన గాడిదయినా, ఎద్దయినా గుంటలో పడితే వెంటనే దానిని బయటికి లాగరు?” అని వారినడిగాడు. ఆయనకు వారు ఆ సంగతుల గురించి ఏమీ జవాబు చెప్పలేకపోయారు.
పుట్టు గుడ్డి మనిషి స్వస్థత
యోహాను శుభవార్త 9:1-41
ఆయన దారిన వెళ్తూ ఉన్నప్పుడు పుట్టు గుడ్డివాడు ఒకడు ఆయనకు కనబడ్డాడు. ఆయన శిష్యులు “గురువర్యా! ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు అపరాధం చేశారు? ఇతడా, ఇతడి తల్లిదండ్రులా?” అని ఆయననడిగారు. యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతడు లేదా ఇతని తల్లిదండ్రులు అపరాధం చేసినందుకు కాదు, గానీ దేవుని క్రియలు ఇతని మూలంగా వెల్లడి కావాలని. పగలు ఉన్నంతవరకూ నన్ను పంపినవాని క్రియలు నేను చేస్తూ ఉండాలి. రాత్రి వస్తూ ఉంది. అప్పుడు ఏ మనిషీ పని చేయలేడు. లోకంలో ఉన్నంతవరకూ నేను లోకానికి వెలుగును.” ఈ విధంగా చెప్పి ఆయన నేలపై ఉమ్మివేసి దానితో బురద చేసి గుడ్డివాని కండ్లకు ఆ బురద పూశాడు, “వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కో!” అని అతనితో అన్నాడు. (సిలోయం అంటే పంపబడిన వాడని తర్జుమా.) అతడు వెళ్ళి కడుక్కొని చూస్తూ తిరిగి వచ్చాడు.
అందుచేత ఇరుగుపొరుగువారు, మునుపు అతడు గుడ్డివాడని చూచినవారు “వీడు మునుపు కూచుని బిచ్చమడుక్కొనేవాడు కాడా?” అని అడిగారు.
కొంతమంది “అవును వాడే”, మరి కొంతమంది “వాణ్ణి పోలినవాడే” అన్నారు. అతడు “నేనే అతణ్ణి” అని చెపుతూ వచ్చాడు.
అందుచేత వారు “నీ కండ్లు తెరవబడినదెలా?” అని అతణ్ణి అడిగారు.
అతడు “యేసు అనే మనిషి బురద చేసి నా కండ్లకు పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అలాగే వెళ్ళి కడుక్కొన్నాను, చూపు వచ్చింది” అని బదులు చెప్పాడు.
“అతడు ఎక్కడున్నాడు?” అని వారు అతణ్ణి అడిగినప్పుడు అతడు “నాకు తెలీదు” అన్నాడు.
మునుపు గుడ్డివాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. యేసు బురద చేసి అతని కండ్లు తెరిచిన రోజు విశ్రాంతి దినం. కనుక పరిసయ్యులు కూడా అతనికెలా చూపు వచ్చిందని మళ్ళీ అతణ్ణి అడిగారు.
వారితో అతడు “ఆయన బురద నా కండ్లకు రాశాడు. నేను కడుక్కొన్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నాను” అన్నాడు.
కనుక పరిసయ్యులలో కొంతమంది “ఆ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాడు. ఎందుకంటే అతడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు” అన్నారు. మరి కొందరైతే “పాపాత్ముడైన మనిషి ఇలాంటి సూచకమైన అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఇలా వారి మధ్య భేదం ఉంది. అందుచేత వారు మళ్ళీ ఆ గుడ్డివాణ్ణి ప్రశ్నించారు – “అతడు నీ కండ్లు తెరచినందుకు అతడి విషయం నీవేం అంటావు?” అతడు “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
అతడు మునుపు గుడ్డివాడనీ చూపు పొందాడనీ యూదులు అతని విషయం మొట్టమొదట నమ్మలేదు గనుక చూపు వచ్చినవాని తల్లిదండ్రులను పిలిచి “మీ కొడుకు గుడ్డివాడుగా పుట్టాడంటారు. వీడు మీ కొడుకా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడు?” అని వారిని అడిగారు.
అందుకు అతని తల్లిదండ్రులు వారికిలా జవాబిచ్చారు: “ఇతడు మా కొడుకనీ గుడ్డివాడుగా పుట్టాడనీ మాకు తెలుసు. గానీ ఇతడు ఇప్పుడు ఎలా చూడగలుగుతూ ఉన్నాడో మాకు తెలియదు. అతడి కండ్లు తెరచినది ఎవరో అది కూడా మాకు తెలియదు. ఇతడు వయసు వచ్చినవాడు. ఇతణ్ణే అడగండి. తన సంగతి తానే చెప్పుకొంటాడు.”
అతని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకంటే, యేసు అభిషిక్తుడని ఎవరైనా సరే ఒప్పుకొంటే వారిని సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందని ఇంతకుముందే యూదులు నిర్ణయించారు. ఈ కారణంచేతే అతని తల్లిదండ్రులు “ఇతడు వయసు వచ్చినవాడు, ఇతణ్ణే అడగండి” అన్నారు.
కనుక మునుపు గుడ్డివాడుగా ఉన్నవాణ్ణి వారు రెండో సారి పిలిచి అతనితో “దేవునికి మహిమ కలిగించు! ఆ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు” అన్నారు. అందుకతడు జవాబిస్తూ “పాపాత్ముడో కాడో నాకు తెలీదు. ఒకటే నాకు తెలుసు. మునుపు గుడ్డివాణ్ణి, ఇప్పుడైతే చూస్తూ ఉన్నాను.”
అందుకు వారు “అతడు నీకు ఏం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని అతణ్ణి మళ్ళీ అడిగారు.
అతడు “అప్పుడే మీతో చెప్పాను గాని మీరు చెవిని పెట్టలేదు. ఎందుకు మళ్ళీ వినాలని ఉన్నారు? ఆయన శిష్యులు కావడానికి మీకు కూడా ఇష్టం ఉందా?” అని వారికి జవాబిచ్చాడు.
అప్పుడు వారు అతణ్ణి దూషించి అన్నారు “అతడి శిష్యుడివి నీవే. మేము మోషే శిష్యులం. మోషేతో దేవుడు మాట్లాడాడని మాకు తెలుసు. ఈ మనిషైతే ఎక్కడనుంచి వచ్చాడో తెలీదు.”
అతడు వారికిలా జవాబిచ్చాడు: “ఓహో! ఇది వింతగా ఉందే! ఆయన నా కండ్లు తెరిచినా ఆయన ఎక్కడనుంచి వచ్చాడో మీకు తెలియదు! దేవుడు పాపాత్ముల ప్రార్థనలు వినడని మనకు తెలుసు! ఎవడైనా దేవుని భక్తుడై ఆయన ఇష్టప్రకారం చేసేవాడి ప్రార్థనలే దేవుడు వింటాడు. పుట్టు గుడ్డివాడి కండ్లు ఎవరైనా తెరిచిన విషయం లోకం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి ఎన్నడూ వినబడలేదు. ఈ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాకపోతే ఏమీ చేయలేడు, అంతే.
ఇది అతనికి వారు చెప్పిన జవాబు: “నీవు పుట్టుకతోనే కేవలం పాపివి. మాకు ఉపదేశం చేస్తావేమిటి!” అప్పుడు వారు అతణ్ణి వెలివేశారు.
వారతణ్ణి వెలివేశారని విని యేసు అతణ్ణి కనుక్కొని “దేవుని కుమారుని మీద నీకు నమ్మకం ఉందా?” అని అడిగాడు. అతడు “స్వామీ, ఆయన మీద నేను నమ్మకం ఉంచాలంటే ఆయన ఎవరండి?” అని అడిగాడు. యేసు అతనితో అన్నాడు “నీవు ఆయనను చూశావు. నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే.” అతడు “నేను నమ్ముతూ ఉన్నాను, స్వామీ!” అంటూ ఆయనను ఆరాధించాడు.
యేసు “చూడనివారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు జరగాలని నేను లోకంలోకి వచ్చాను” అన్నాడు.
ఆయనదగ్గర ఉన్న కొందరు పరిసయ్యులు ఆ మాటలు విని “మేము కూడా గుడ్డివాళ్ళమా?” అని ఆయననడిగారు.
యేసు వారితో “మీరు గుడ్డివారై ఉంటే మీకు పాపం ఉండేది కాదు గాని ‘చూస్తూ ఉన్నాం’ అని మీరిప్పుడు అంటున్నారు, గనుక మీ పాపం నిలిచి ఉంది” అన్నాడు.
మరణం నుండి తిరిగి లేచిన లాజరు
యోహాను శుభవార్త 11:1-44
బేతనీ గ్రామం వాడైన లాజరుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలోనే మరియ, ఆమె సోదరి మార్త ఉండేవారు. ఈ మరియ అత్తరుతో ప్రభువును అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాల తుడిచింది. జబ్బుగా ఉన్న లాజరు ఈమె సోదరుడు. అందుచేత అక్కచెల్లెండ్లు యేసుకు ఇలా కబురంపారు: “ప్రభూ! నీవు ప్రేమతో చూచే వాడికి జబ్బు చేసింది.”
అది విని యేసు “ఆ రోగం రావడం మరణం కోసం కాదు గాని దాని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమకోసమే వచ్చింది” అన్నాడు.
యేసుకు మార్త, ఆమె సోదరి, లాజరు అంటే ప్రేమ. అతడు జబ్బుగా ఉన్నాడని విని కూడా ఆయన ఉన్న చోట ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. ఆ తరువాత ఆయన శిష్యులతో అన్నాడు “యూదయకు తిరిగి వెళ్దాం, పదండి.”
శిష్యులు “గురువర్యా, ఇటీవలే యూదులు నీమీద రాళ్ళు రువ్వాలని చూశారు! తిరిగి అక్కడికి వెళ్తావా?” అని ఆయనతో అన్నారు.
యేసు ఇలా జవాబిచ్చాడు: “పగటికి ఉన్నవి పన్నెండు గంటలు గదా. ఎవరైనా పగటివేళ నడిస్తే అతనికి ఈ లోకం వెలుగు కనిపిస్తుంది గనుక తడబడడం అంటూ ఉండదు. కానీ రాత్రివేళ నడిచేవాడిలో వెలుగు లేకపోవడంచేత తడబడుతాడు.”
ఇలా చెప్పిన తరువాత ఆయన “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి మేల్కొలపడానికి వెళ్తాను” అని వారితో చెప్పాడు.
అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడుతాడు” అన్నారు.
యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు గాని సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారనుకొన్నారు. కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు:
“లాజరు చనిపోయాడు. నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీ మేలు విషయమే. అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతనిదగ్గరకు వెళ్దాం, పదండి.” అప్పుడు తోమా (అతణ్ణి ‘దిదుమ’ అని కూడా అంటారు) సాటి శిష్యులతో అన్నాడు “ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం.”
యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
“చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
ఇలా చెప్పి ఆమె వెళ్ళి తన సోదరి మరియను పిలిచి రహస్యంగా “గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు” అంది. ఆమె ఆ మాట విని గబాలున లేచి ఆయన దగ్గరికి తరలివెళ్ళింది. యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు. ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియ గబాలున లేచి బయటికి వెళ్ళడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడ్వడానికి వెళ్తుందని చెప్పి ఆమె వెంట వెళ్ళారు. యేసు ఉన్న స్థలానికి మరియ చేరి ఆయనను చూచి ఆయన పాదాలదగ్గర సాగిలపడి “ప్రభూ! ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు” అంది.
ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్వడం యేసు చూచి ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు: “అతణ్ణి మీరెక్కడ ఉంచారు?” వారు “ప్రభూ, వచ్చి చూడండి” అని ఆయనతో అన్నారు.
యేసు కన్నీళ్ళు విడిచాడు. అందువల్ల యూదులు “ఇదిగో అతడంటే ఈయనకు ఎంత ప్రేమో చూశారా!” అని చెప్పుకొన్నారు.
అయితే వారిలో కొంతమంది “ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేక పోయేవాడా?” అన్నారు.
మళ్ళీ తనలో పరితపిస్తూ యేసు సమాధి దగ్గరికి వచ్చాడు. అది గుహ. దానిమీద బండ ఉంది. యేసు “బండ తీసివేయండి” అన్నాడు. చనిపోయినవాని సోదరి మార్త “ప్రభూ, అతడు నాలుగు రోజులు నిర్జీవంగా ఉన్నాడు, గనుక కంపుకొడతుంది” అని ఆయనతో చెప్పింది.
యేసు “నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా?” అని ఆమెతో అన్నాడు.
అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
ఇలా చెప్పి ఆయన “లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.
చనిపోయినవాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్ళకూ చేతులకూ కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టివేసి ఉంది. యేసు వారితో “ఆ కట్లు విప్పి అతణ్ణి వెళ్ళనియ్యండి” అన్నాడు.
సేవకుని చెవి బాగు చేయబడుట
లూకా శుభవార్త 22:49-51
జరగబోతున్నది గ్రహించి ఆయన చుట్టూ ఉన్నవారు “ప్రభూ! వీరిని కత్తితో కొట్టుదామంటావా?” అనడిగారు.
వారిలో ఒకడు ప్రముఖయాజి దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి నరికివేశాడు. అయితే యేసు “ఆగండి, ఇది కూడా జరగనియ్యి!” అని చెప్పి అతని చెవిని తాకి అతణ్ణి బాగు చేశాడు.
అనేకుల స్వస్థత
మత్తయి శుభవార్త 8:16-17
సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టినవారిని అనేకమందిని ప్రజలు ఆయనదగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఒక్క మాటతో ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడు. రోగులందరినీ కూడా బాగు చేశాడు. యెషయాప్రవక్త ద్వారా దేవుడు చెప్పినది నెరవేరేలా ఆ విధంగా జరిగింది. ఏమిటంటే, ఆయన మన బలహీనతలను తన మీదికి తీసుకున్నాడు; మన రోగాలను భరించాడు.
మార్కు శుభవార్త 1:32-34
సాయంకాల సమయాన ప్రొద్దు క్రుంకిన తరువాత ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టినవారందరినీ ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. పట్టణమంతా ఆ తలుపు దగ్గర గుమికూడారు. ఆయా జబ్బులతో ఉన్నవారిని అనేకులను ఆయన బాగు చేశాడు, అనేక దయ్యాలను బయటికి వెళ్ళగొట్టాడు. తాను ఎవరో దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
లూకా శుభవార్త 4:40-41
ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు అందరు ఆయా రకాల రోగాలతో ఉన్న తమ వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. వారిలో ప్రతి ఒక్కరిమీదా ఆయన చేతులుంచి వారిని బాగు చేశాడు. అనేకులలోనుంచి దయ్యాలు బయటికి వస్తూ “నీవు అభిషిక్తుడివి! దేవుని కుమారుడివి!” అని కేక పెట్టాయి. ఆయన అభిషిక్తుడు అని దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
ఇద్దరు వ్యక్తులి గుడ్డితనం నుండి బాగుపడుట
మత్తయి శుభవార్త 9:27-31
అక్కడనుంచి యేసు వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివారు ఇద్దరు ఆయనను అనుసరిస్తూ “దావీదు కుమారా! మామీద దయ చూపు” అంటూ కేకలు వేశారు.
ఆయన ఇంట్లో ప్రవేశించాక ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. వారితో యేసు అన్నాడు, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” “అవును, స్వామీ!” అని వారు ఆయనతో అన్నారు.
అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి, “మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది గాక!” అన్నాడు. వెంటనే వారి కండ్లు తెరచుకొన్నాయి. “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండేం!” అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు. కానీ వారు బయటికి వెళ్ళి, ఆయన విషయం ఆ ప్రాంతం అంతటా చాటించారు.
గలలో సరస్సు తీరాన్న జనసమూహం స్వస్థతనొందుట
మార్కు శుభవార్త 3:7-12
యేసు తన శిష్యులతోపాటు సరస్సు ఒడ్డుకు వెళ్ళిపోయాడు. గలలీనుంచి ఒక పెద్ద జన సమూహం ఆయన వెంట వెళ్ళారు. అంతే కాదు. ఆయన చేస్తున్న వాటి గురించి విని యూదయ నుంచీ జెరుసలం, ఇదుమియా, యొర్దాను నది అవతల ప్రాంతంనుంచీ తూరు, సీదోను నుంచీ జనం చాలా పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. జన సమూహం తనమీద పడకుండా ఉండేందుకు తన కోసం ఒక పడవను సిద్ధం చేయండని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఆయన అనేకులను బాగు చేసినందుచేత రోగాలతో ఉన్నవారంతా ఆయనను తాకాలని ఆయన దగ్గరకు తోసుకు వస్తూ ఉన్నారు. మలిన పిశాచాలు పట్టినవారు ఆయనను చూడగానే “నీవు దేవుని కుమారుడివి” అని అరుస్తూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. ఆయన తన విషయం తెలియజేయకూడదని ఆ పిశాచాలను ఆజ్ఞాపించాడు.
కొండపై/పర్వతంపై అనేకులు బాగుపడుట
మత్తయి శుభవార్త 15:29-31
యేసు అక్కడనుంచి బయలుదేరి గలలీ సరస్సుకు దగ్గరగా చేరి, ఒక కొండెక్కి కూర్చున్నాడు. గొప్ప జనసమూహాలు వచ్చి కుంటివారినీ గుడ్డివారినీ మూగవారినీ వికలాంగులనూ ఇంకా అనేకులను ఆయన దగ్గరకు తెచ్చి ఆయన పాదాల ముందు ఉంచారు. ఆయన వారిని బాగు చేశాడు. మూగవారు మాట్లాడ్డం, వికలాంగులకు పూర్తిగా నయం కావడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం చూచి జన సమూహానికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వారు ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి కీర్తించారు.
పదిమంది మనిష్యులు స్వస్థపడుట
లూకా శుభవార్త 17:11-19
ఆయన జెరుసలం ప్రయాణమైపోతూ సమరయ, గలలీ సరిహద్దులో సాగిపోతూ ఉన్నాడు. ఒక గ్రామంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే కుష్ఠురోగమున్న పదిమంది పురుషులు ఎదురుగా వస్తున్నారు. వారు దూరాన నిలుస్తూ కంఠమెత్తి ‘యేసూ! నాయకా! మామీద జాలి చూపు!’ అన్నారు.
వారిని చూచి ఆయన వారితో “మీరు వెళ్ళి యాజులకు కనబడండి” అన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉండగానే వారు శుద్ధమయ్యారు. వారిలో ఒకడు తన రోగం పూర్తిగా నయం కావడం చూచి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ వెనక్కు తిరిగి వచ్చాడు. యేసు పాదాలదగ్గర సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయ దేశస్థుడు.
అందుకు యేసు అన్నాడు “శుద్ధం అయిన వారు పదిమంది గదా! తక్కిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడకపోవడమేమిటి?” అప్పుడు అతనితో “లేచి నీ దారిన వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
సృష్టి ధర్మంపై నియంత్రణ
నీరు ద్రాక్షారసంగా మారుట
యోహాను శుభవార్త 2:1-18
మూడో రోజున గలలీలోని కానాలో పెండ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసునూ ఆయన శిష్యులనూ కూడా పెండ్లికి పిలిచారు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో “వారిదగ్గర ద్రాక్షరసం లేదు” అంది. యేసు ఆమెతో “అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. ఆయన తల్లి పనివారితో “మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సుమారు డెబ్భయి, లేదా నూరు లీటర్ల నీళ్ళు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం అక్కడ ఉంచారు. యేసు వారితో “ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో “ఇప్పుడు ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు ఎక్కడనుంచి వచ్చిందో ఆ నీళ్ళు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి ఇలా అన్నాడు: “ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం వడ్డిస్తారు. అతిథులు బాగా త్రాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు.”
యేసు చేసిన సూచనకోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలలీలోని కానాలో చేసి తన మహాత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయనమీద నమ్మకం ఉంచారు.
ఆ తరువాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు, ఆయన శిష్యులు కపెర్‌నహూం వెళ్ళారు. వారు అక్కడ అనేక రోజులు ఉండిపోలేదు.
యూదుల పస్కా పండుగ దగ్గరపడింది. యేసు జెరుసలం వెళ్ళాడు.
దేవాలయంలో ఎద్దులనూ గొర్రెలనూ పావురాలనూ అమ్మేవారినీ కూర్చుని ఉన్న డబ్బు మారకందారులనూ ఆయన చూశాడు.
ఆయన త్రాళ్లతో కొరడా చేసి వాళ్ళందరినీ గొర్రెలతో ఎద్దులతోపాటు దేవాలయంనుంచి వెళ్లగొట్టాడు. డబ్బు మారకందారుల నాణేలు వెదజల్లివేశాడు. వాళ్ళ బల్లలు పడద్రోశాడు.
పావురాలు అమ్మేవారితో ఆయన “వీటిని బయటికి తీసుకువెళ్ళండి. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయకండి!” అన్నాడు.
“నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేసింది” అని వ్రాసి ఉందని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.
అప్పుడు యూదులు జవాబిస్తూ ఆయనతో “నీవు ఈ క్రియలు చేస్తూ ఉన్నావే. సూచనగా ఏ అద్భుతం మాకు చూపుతావు?” అన్నారు.
విస్తారమైన చేపలు పడుట
లూకా శుభవార్త 5:1-11
ఒక సారి ఆయన గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు, జన సమూహం దేవుని వాక్కు వినడానికి ఆయన మీద పడుతూ ఉన్నారు. అప్పుడు సరస్సు దరిన రెండు పడవలు ఆయనకు కనిపించాయి. చేపలు పట్టేవారు పడవలలోనుంచి దిగి వలలు కడుగుతూ ఉన్నారు. ఆయన ఆ పడవలలో ఒకదానినెక్కాడు. ఆ పడవ సీమోనుది. ఒడ్డునుంచి కొద్ది దూరం త్రోయమని ఆయన అతణ్ణి అడిగాడు. అప్పుడాయన పడవలో కూర్చుని జన సమూహానికి ఉపదేశమిచ్చాడు.
మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమోనును చూచి “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
సీమోను జవాబిస్తూ “నాయకా, రాత్రంతా మేము శ్రమించాం గాని, చేపలు ఏమీ పడలేదు. అయినా నీ మాటనుబట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
వారు అలా చేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి, వారి వల తెగిపోబోయింది. అందుచేత మరో పడవలో ఉన్న వారి పాలివారు వచ్చి సహాయం చేయాలని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా నింపారు. పడవలు మునిగిపోసాగాయి.
అది చూచి సీమోను పేతురు యేసు మోకాళ్ళముందు పడి “ప్రభూ! నన్ను విడిచివెళ్ళు! నేను పాపాత్ముణ్ణి” అన్నాడు. ఎందుకంటే అతడూ అతనితో ఉన్నవారంతా తాము పట్టిన చేపల మొత్తం చూచి ఎంతో ఆశ్చర్య పడిపోయారు. సీమోనుతో పాలివారైన యాకోబు, యోహాను (జెబెదయి కొడుకులు) కూడా అలాగే ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు యేసు సీమోనుతో “భయపడకు! ఇప్పటినుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. వారు పడవలు ఒడ్డుకు చేర్చి అంతా విడిచిపెట్టి ఆయనను అనుసరించారు.
గాలి తుఫానులను నెమ్మదిపరుచుట
మత్తయి శుభవార్త 8:23-27
అప్పుడు ఆయన పడవ ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారు. అకస్మాత్తుగా సరస్సుమీద పెద్ద తుఫాను చెలరేగసాగింది. అలలు ఆ పడవమీదికి ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు దగ్గరగా వెళ్ళి ఆయనను మేల్కొలిపి “స్వామీ! నశించిపోతున్నాం! మమ్మల్ని రక్షించు!” అన్నారు.
అందుకు ఆయన “అల్ప విశ్వాసం గలవారలారా, మీరెందుకు భయపడుతున్నారు?” అన్నాడు. అప్పుడాయన లేచి, గాలులను సరస్సునూ మందలించాడు. అంతా ప్రశాంతమైపోయింది.
ఆ మనుషులకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఈయన ఎలాంటివాడో గాని గాలులు, సరస్సు కూడా ఈయనకు లోబడు తున్నాయే!” అని చెప్పుకొన్నారు.
మార్కు శుభవార్త 4:35-41
ఆ రోజే సాయంకాలమైనప్పుడు ఆయన వారితో “అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. ఉన్నపాటున ఆయనతో కూడా వారు జనసమూహాన్ని విడిచిపెట్టి పడవలో బయలుదేరారు. ఆయన వెంట మరి కొన్ని పడవలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగింది. అలలు పడవలోకి కొట్టినందుచేత అది నీళ్ళతో నిండిపోతూ ఉంది. ఆయనైతే పడవ వెనుక భాగంలో దిండుమీద నిద్రపోతూ ఉన్నాడు. వారాయనను మేల్కొలిపి “బోధకుడా, నశించిపోతున్నాం! నీకేమీ పట్టదా?” అన్నారు.
ఆయన లేచి గాలిని మందలించి సరస్సుతో “ఊరుకో! నిశ్శబ్దంగా ఉండు!” అన్నాడు. గాలి ఆగిపోయింది. అంతా పూర్తిగా ప్రశాంతమైపోయింది.
అప్పుడాయన వారితో “మీకు ఇంత భయమెందుకని? మీకు నమ్మకం లేకపోవడమెందుకు?” అన్నాడు.
వారు అధికంగా భయపడుతూ ఒకరితో ఒకరు “ఈయన ఎవరో! గాలి, సరస్సు సహా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.
లూకా శుభవార్త 8:22-25
ఒకానొక రోజున ఆయన తన శిష్యులతోపాటు పడవ ఎక్కి వారితో “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. వారు పడవ సరస్సులోకి త్రోసి బయలుదేరారు. వారు పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు. ఇంతలో సరస్సుమీదికి తుఫాను వచ్చింది. వారు ఉన్న పడవ నీళ్ళతో నిండిపోతూ ఉంది. వారు అపాయంలో చిక్కుకొన్నారు. కనుక ఆయనదగ్గరకు వచ్చి ఆయనను మేల్కొలిపి “నాయకా! నాయకా! నశించిపోతున్నాం!” అన్నారు. ఆయన లేచి గాలినీ ఉప్పెననూ మందలించాడు. అవి నిమ్మళమయ్యాయి. అంతా ప్రశాంతమైపోయింది.
అప్పుడాయన వారితో “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు.
వారు భయపడుతూ ఎంతో ఆశ్చర్యపోతూ “ఈయన గాలికీ నీళ్ళకూ ఆజ్ఞ జారీ చేస్తే అవి లోబడుతున్నాయే! ఈయన ఎవరో!” అని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు.
5,000 కంటే ఎక్కువైన జనసమూహానికి సమృద్ధిగా ఆహారం పెట్టుట
మత్తయి శుభవార్త 14:13-21
అది విని యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని జన సమూహాలు పట్టణాలనుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. యేసు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకు కనిపించింది. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, “ఇది అరణ్యం. ఇప్పటికే ప్రొద్దు పోయింది. ఈ జన సమూహాలు గ్రామాలకు వెళ్ళి తినుబండారాలు కొనుక్కోవడానికి వారిని పంపించండి.”
యేసు వారితో “వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు.
వారు “ఇక్కడ మనదగ్గర ఉన్నది అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే” అని ఆయనతో అన్నారు.
ఆయన “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. జన సమూహం పచ్చికమీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. స్త్రీలు, పిల్లలు గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.
మార్కు శుభవార్త 6:30-44
యేసు రాయబారులు ఆయనదగ్గరకు తిరిగి సమకూడి తాము చేసినదంతా ఉపదేశించినదంతా ఆయనకు చెప్పారు. ఆయన వారితో “పదండి, ఒక నిర్జన స్థలానికి వెళ్దాం. అక్కడ కొద్ది కాలం సేద తీర్చుకోండి” అన్నాడు. ఎందుకంటే చాలామంది వస్తూ పోతూ ఉండడంవల్ల వారికి భోజనం చేసే తీరిక కూడా లేకపోయింది. కనుక వారు పడవలో ఏకాంతంగా నిర్జన స్థలానికి వెళ్ళిపోయారు. అయితే వారు వెళ్ళిపోతూ ఉంటే జన సమూహాలు చూచి చాలామంది ఆయనను గుర్తుపట్టి అన్ని ఊళ్ళనుంచి పరిగెత్తుతూ వెళ్ళి వారికంటే ముందుగా కాలి నడకను ఆ స్థలానికి చేరారు. తరువాత వారు ఆయన దగ్గర గుమికూడారు. యేసు అక్కడ చేరినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకు కనిపించింది. వారు కాపరి లేని గొర్రెల లాంటివారని ఆయన వారిమీద జాలిపడి వారికి అనేక సంగతులు ఉపదేశించ సాగాడు.
చాలా పొద్దు పోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి “ఇది అరణ్యం. ఇప్పుడు చాలా పొద్దు పోయింది. వారికి తినడానికి ఏమీ లేదు. గనుక వారు వెళ్ళి తినడానికి రొట్టె కొనేలా చుట్టుపట్ల ఉన్న పల్లెసీమకూ గ్రామాలకూ వారిని పంపివెయ్యి” అన్నారు.
అయితే ఆయన “మీరే వారికి ఆహారం పెట్టండి” అని వారికి జవాబిచ్చాడు.
అందుకు వారు ఆయనతో “మేము వెళ్ళి రెండు వందల దేనారాల రొట్టెలు కొని తినడానికి వీరికివ్వమంటావా?” అని అడిగారు.
ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్ళి చూడండి” అన్నాడు.
వారు ఆ సంగతి తెలుసుకొని “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
అప్పుడాయన అందరినీ గుంపులుగా పచ్చికమీద కూర్చోబెట్టాలని వారిని ఆదేశించాడు. వారు నూరేసిమంది చొప్పున, యాభయ్యేసి మంది చొప్పున బారులు తీరి కూర్చున్నారు. ఆయన ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలూ చేతపట్టుకొని ఆకాశంవైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి జనానికి వడ్డించాలని శిష్యులకందించాడు. చేపలను కూడా అందరికీ పంచి పెట్టాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. మిగిలిన రొట్టె ముక్కలూ చేపలూ పన్నెండు గంపల నిండా ఎత్తారు. రొట్టెలు తిన్న పురుషులే దాదాపు అయిదు వేలమంది.
లూకా శుభవార్త 9:10-17
యేసు రాయబారులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారిని వెంటబెట్టుకొని ఏకాంతంగా బేత్‌సయిదా అనే ఊరికి చెందిన నిర్జన స్థలానికి వెళ్ళాడు. అయితే జన సమూహాలు అది తెలుసుకొని ఆయన వెంట వెళ్ళారు. ఆయన వారిని స్వీకరించి దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడాడు, బాగుపడవలసిన వారిని బాగు చేశాడు. ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు తన పన్నెండుగురు శిష్యులు వచ్చి “మనం ఉన్నది నిర్జన స్థలం, ఈ జన సమూహం చుట్టుపట్ల గ్రామాలకూ పల్లెసీమకూ వెళ్ళి బస చేయడానికీ తినుబండారాలు చూచుకోవడానికీ వారిని పంపించండి” అని ఆయనతో అన్నారు.
అయితే ఆయన వారితో “మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు. అందుకు వారు “మేము వెళ్ళి ఈ ప్రజలందరికోసం భోజనం కొనకుండా ఉంటే మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలూ. మరేమీ లేదు.” అన్నారు.
అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు. ఆయన తన శిష్యులతో “వారిని గుంపులుగా ఒక్కొక్క గుంపులో యాభైమంది ప్రకారం కూర్చోబెట్టండి” అన్నాడు.
అలాగే వారు వారందరినీ కూర్చోబెట్టారు. ఆయన ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలూ చేతపట్టుకొని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ వాటిని దీవించి విరిచి జన సమూహానికి వడ్డించడానికి శిష్యులకందించాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే పన్నెండు గంపలు నిండాయి.
యోహాను శుభవార్త 6:1-15
ఆ తరువాత యేసు గలలీ సరస్సు (ఇది తిబెరియ సరస్సు) దాటి అవతలికి వెళ్ళాడు. రోగులకు ఆయన చేసిన సూచన కోసమైన అద్భుతాలు చూచి చాలామంది ఆయన వెంట వచ్చారు. అక్కడ యేసు ఒక కొండెక్కి తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. పస్కా అనే యూదుల పండుగ దగ్గర పడింది. యేసు తలెత్తి పెద్ద గుంపు తనవైపుకు రావడం చూచి ఫిలిప్పుతో ఇలా అన్నాడు: “వీరు తినడానికి రొట్టెలు మనం ఎక్కడ కొనాలి?” అతణ్ణి పరీక్షించడానికి ఆయన అలా అన్నాడు – తాను ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు.
ఫిలిప్పు “వీళ్ళలో ఒక్కొక్కరికి కొంచెం దొరకాలన్నా రెండు వందల దేనారాల రొట్టెలు కూడా ఏమీ చాలవు” అని ఆయనకు జవాబిచ్చాడు.
ఆయన శిష్యులలో ఒకడు – సీమోను పేతురు సోదరుడు అంద్రెయ – యేసుతో ఇలా అన్నాడు: “ఇక్కడ ఓ అబ్బాయి ఉన్నాడు. వాని దగ్గర అయిదు యవల రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి. అయితే ఇంతమందికి అదేపాటిది?”
“ప్రజలను కూర్చోబెట్టండి” అని యేసు అన్నాడు. ఆ చోట పచ్చిక విస్తారంగా ఉంది గనుక పురుషులు కూర్చున్నారు. వారి సంఖ్య సుమారు అయిదు వేలు. అప్పుడు యేసు ఆ రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు, శిష్యులకు పంచి ఇచ్చాడు. శిష్యులు కూర్చుని ఉన్నవారికి వడ్డించారు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతమట్టుకు వడ్డించారు. వారు కడుపారా తిన్న తరువాత ఆయన తన శిష్యులతో “మిగిలిన ముక్కలు ఎత్తండి – ఏమీ నష్టం కాకూడదు” అన్నాడు. అలాగే వారు వాటిని ఎత్తారు, ఆ అయిదు యవల రొట్టెలు ప్రజలు తినగా మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నింపారు.
యేసు చేసిన అద్భుతమైన ఈ సూచన చూచి ప్రజలు “నిజంగా, లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే!” అన్నారు.
వారు వచ్చి తనను రాజుగా చేయడానికి బలవంతంగా తీసుకుపోతారని యేసుకు తెలుసు, కనుక ఆయన మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాడు.
నీళ్ళపై నడచుట
మత్తయి శుభవార్త 14:22-33
వెంటనే యేసు జన సమూహాలను పంపివేస్తూ, శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండడంవల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది. రాత్రి నాలుగో జామున యేసు సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి “అది భూతం!” అని భయంతో కేకలు పెట్టారు.
వెంటనే యేసు వారిని పలకరించి “ధైర్యం తెచ్చుకోండి! నేనే! భయపడకండి!” అన్నాడు.
పేతురు ఆయనతో “ప్రభూ, నీవే అయితే, నన్ను నీ దగ్గరికి నీళ్ళమీద నడచి రమ్మనండి!” అన్నాడు.
ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు. కానీ గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి, మునిగిపోబోయాడు. “ప్రభూ! నన్ను రక్షించు!” అని కేకపెట్టాడు.
వెంటనే యేసు చేయి చాచి అతణ్ణి పట్టుకొన్నాడు. “అల్ప విశ్వాసం గలవాడా సందేహపడ్డావేమిటి!” అని అతనితో అన్నాడు.
వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది. పడవలో ఉన్నవారు వచ్చి “నిజంగా నీవు దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
మార్కు శుభవార్త 6:45-52
వెంటనే ఆయన జన సమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు బేత్‌సయిదాకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ప్రజలను పంపివేసిన తరువాత ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. సాయంకాలమైనప్పుడు ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒక్కడే మెరకమీద ఉన్నాడు. గాలి వారికెదురుగా వీస్తూ ఉండడం వల్ల పడవ తెడ్లతో నడపడం చాలా కష్టమైంది. అది చూచి సుమారు నాలుగో జామున ఆయన సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన వారిని దాటిపోబోయాడు. కానీ ఆయన సరస్సుమీద నడుస్తూ ఉండడం వారు చూచినప్పుడు ఆయన ఒక భూతం అనుకొని కేకలుపెట్టారు. ఎందుకంటే వారందరు ఆయనను చూచి హడలిపోయారు. వెంటనే ఆయన వారిని పలకరించి “ధైర్యం వహించండి! నేనే! భయపడకండి!” అన్నాడు.
ఆయన వారి దగ్గరకు వచ్చి పడవెక్కాడు. గాలి ఆగింది. వారు లోలోపల ఆశ్చర్యపడుతూ అమితంగా విస్మయం చెందారు. ఎందుకంటే ఆ రొట్టెల సంగతి వారికి అర్థం కాలేదు, వారి గుండెలు బండబారిపోయి ఉన్నాయి.
యోహాను శుభవార్త 6:16-21
సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సరస్సు ఒడ్డుకు వెళ్ళి పడవ ఎక్కి అవతల ఉన్న కపెర్‌నహూంకు దాటిపోసాగారు. అంతలో చీకటి పడింది. యేసు వారిదగ్గరికి ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి వీస్తూ ఉండడంచేత సరస్సు అల్లకల్లోలం కాసాగింది. వారు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం తెడ్లతో పడవ నడిపిన తరువాత యేసు సరస్సు మీద నడుస్తూ పడవకు దగ్గరగా రావడం చూశారు. వారికి భయం వేసింది. అయితే ఆయన వారితో “నేనే, భయపడకండి!” అన్నాడు.
అప్పుడు ఆయనను పడవలో చేర్చుకోవడం వారికి ఇష్టం అయింది. వెంటనే పడవ వారు వెళ్ళిపోతున్న స్థలం చేరింది.
నాలుగు వేల మంది ప్రజలకు ఆహారం పెట్టుట
మత్తయి శుభవార్త 15:32-39
తన శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని యేసు ఇలా అన్నాడు: “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తూ ఉంది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. వారిని ఆకలితోనే పంపివేయడం నాకిష్టం లేదు. దారిలో వారు శోష పోవచ్చు.”
ఆయన శిష్యులు ఆయనతో అన్నారు, “ఎవరూ కాపురం లేని ఈ స్థలంలో ఇంత పెద్ద గుంపు తృప్తిగా తినడానికి చాలినన్ని రొట్టెలు మనకు ఎక్కడ దొరుకుతాయి!”
యేసు “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారినడిగాడు. వారు “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి” అన్నారు.
జన సమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. అప్పుడు ఆ ఏడు రొట్టెలూ ఆ చేపలూ చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి తన శిష్యులకు అందించాడు. శిష్యులు జన సమూహానికి వడ్డించారు. అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే మొత్తం ఏడు పెద్ద గంపలు నిండాయి. తిన్న పురుషులు నాలుగు వేలమంది. వారితో పాటు స్త్రీలు, పిల్లలు తిన్నారు. తరువాత ఆయన జనసమూహాన్ని పంపివేసి పడవ ఎక్కి మగ్దాల ప్రాంతానికి వెళ్ళాడు.
మార్కు శుభవార్త 8:1-10
ఆ రోజుల్లో చాలా పెద్ద జన సమూహం గుమికూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోవడం చేత యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు: “ఈ జన సమూహం మీద నాకు జాలి వేస్తున్నది. ఎందుకంటే తినడానికి వీరిదగ్గర ఏమీ లేదు. మూడు రోజులు నా దగ్గరే ఉన్నారు గదా. ఒకవేళ నేను వారిని ఆకలితోనే వారి ఇండ్లకు పంపివేస్తే దారిలో శోషపోతారు. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.”
అందుకు ఆయన శిష్యులు “ఈ నిర్జన ప్రాంతంలో వీరు తృప్తిగా తినేలా ఎవరు రొట్టెలు పెట్టగలరు?” అని జవాబిచ్చారు.
“మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని ఆయన వారినడిగాడు. వారు “ఏడు” అన్నారు.
జనసమూహం నేలమీద కూర్చోవాలని ఆయన ఆదేశించాడు. అప్పుడా ఏడు రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు. వాటిని విరిచి జనానికి వడ్డించాలని తన శిష్యులకు అందించాడు. వారు జన సమూహానికి వడ్డించారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఆయన వాటిని దీవించి ఇవి కూడా జనానికి వడ్డించాలని ఆదేశించాడు. జనం తృప్తిగా తిన్నారు. తరువాత మిగిలిన ముక్కలను ఎత్తితే ఏడు గంపలు నిండాయి. తిన్న వారు సుమారు నాలుగు వేలమంది. ఆయన వారిని పంపివేసి, వెంటనే తన శిష్యులతోపాటు పడవ ఎక్కి దల్మానుతా ప్రాంతానికి వెళ్ళాడు.
ధనం ఉన్న చేపను పట్టుట, పన్ను చెల్లించుట
మత్తయి శుభవార్త 17:24-27
వారు కపెర్‌నహూంకు చేరుకొన్న తరువాత అర తులం పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి “మీ గురువు అర తులం పన్ను చెల్లించడా?”
అతడు “అవును” అన్నాడు. అతడు ఇంట్లోకి వచ్చిన తరువాత యేసే మొదట మాట్లాడాడు, “సీమోనూ, భూరాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా? పరాయివారి దగ్గరా? నీకేం తోస్తుంది?”
అతడు “పరాయివాళ్ళ దగ్గరే” అని ఆయనతో అనడంతో యేసు “అయితే కొడుకులు స్వతంత్రులు. అయినా వారికి అభ్యంతరం కలిగించకుండేలా నీవు సరస్సుకు వెళ్ళి గాలం వెయ్యి. మొదట పట్టిన చేపను తీసుకొని దాని నోరు తెరిస్తే తులమంత విలువగల నాణెం నీకు కనిపిస్తుంది. దానిని తీసుకొని నాకోసం, నీకోసం వారికివ్వు” అన్నాడు.
అంజూరపు చెట్టు చనిపోవుట
మత్తయి శుభవార్త 21:18-22
ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. దారి ప్రక్కన అంజూరచెట్టు ఒకటి కనిపించింది. ఆయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆయన దానితో “ఇకనుంచి నీవు ఎన్నడూ కాపు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూరచెట్టు ఎండిపోయింది.
అది చూచి శిష్యులు స్తంభించి “ఆ అంజూరచెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో!” అన్నారు.
యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, దేవుని మీద మీకు నమ్మకం గనుక ఉంటే, సందేహపడకుండా ఉంటే, అంజూరచెట్టుకు చేసినది మీరు కూడా చేయగలరు. ఇదిగాక, ఈ కొండను చూచి ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే అలాగే జరిగి తీరుతుంది. దొరుకుతాయని నమ్ముతూ, ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి.”
మార్కు శుభవార్త 11:12-14,20-24
మరుసటి రోజున బేతనీనుంచి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూర చెట్టు ఒకటి ఆయనకు కనిపించింది. దానికేమైనా పండ్లు ఉంటాయేమో అని ఆయన దానివైపు వెళ్ళాడు గాని దానిదగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. అది అంజూర పండ్ల కాలం కాదు. ఆయన దానితో “ఇకనుంచి తినడానికి పండ్లు నీమీద ఎవరికీ ఎన్నడూ దొరకకపోతాయి గాక!” అన్నాడు. అది ఆయన శిష్యులు విన్నారు. ప్రొద్దున వారు దారిన వస్తూ ఉంటే ఆ అంజూర చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం చూశారు.
పేతురు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనతో “గురువర్యా, ఇదిగో, నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
అందుకు యేసు వారితో ఇలా అన్నాడు: “దేవునిమీద నమ్మకం ఉంచండి. మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఎవరైనా సరే ఈ పర్వతంతో ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే తాను చెప్పినదేదైనా అతనికి జరిగి తీరుతుంది. అందుచేత మీతో అంటున్నాను, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి.
శిష్యులు విస్తారమైన చేపలు పట్టుట
యోహాను శుభవార్త 21:1-11
ఆ తరువాత తిబెరియ సరస్సు ఒడ్డున యేసు తనను తన శిష్యులకు మరోసారి ప్రత్యక్షం చేసుకొన్నాడు. ప్రత్యక్షమైన విధం ఏమంటే, సీమోను పేతురు, దిదుమ అనే పేరు ఉన్న తోమా, గలలీలోని కానావాడైన నతనియేలు, జబదయి కొడుకులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు అంతా పోగయ్యారు.
సీమోను పేతురు వారితో “చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను” అన్నాడు. వారు “మేము నీతో కూడా వస్తాం” అన్నారు. వెంటనే వారు వెళ్ళి పడవ ఎక్కారు. ఆ రాత్రి వారు పట్టినది ఏమీ లేదు. ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిలుచున్నాడు గాని ఆయన యేసని శిష్యులు గుర్తుపట్టలేదు.
కనుక యేసు “అబ్బాయిలూ! తినడానికి మీదగ్గర ఏమైనా ఉందా?” అని వారితో అన్నాడు. “లేదండి” అని వారు ఆయనకు బదులు చెప్పారు.
అప్పుడాయన “పడవ కుడిప్రక్క వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని వారితో చెప్పాడు. వారలా వల వేసినప్పుడు బోలెడన్ని చేపలు పడడం చేత వల లాగలేక పోయారు.
అందుచేత యేసు ప్రేమించిన ఆ శిష్యుడు “ఆయన ప్రభువే!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే, మునుపు తీసివేసిన తన పై బట్ట వేసుకొని సరస్సులో దూకాడు. ఒడ్డు అక్కడికి చాలా దూరంలో లేదు – సుమారు రెండు వందల మూరల దూరం. కనుక తక్కిన శిష్యులు చేపలున్న వల లాక్కొంటూ ఆ చిన్న పడవలో వచ్చారు. ఒడ్డుకు చేరగానే అక్కడ నిప్పు, దానిమీద చేపలూ రొట్టెలూ వారికి కనిపించాయి.
యేసు “ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్నిటిని ఇటు తీసుకురండి” అని వారితో అన్నాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వల ఒడ్డుకు లాగాడు. వల పెద్ద చేపలతో నిండి ఉంది – మొత్తం నూట యాభై మూడు చేపలు. ఇన్ని ఉన్నా వల పిగలలేదు.
యేసుని పునరుత్థానం
మత్తయి శుభవార్త 28:1-10
విశ్రాంతి దినం గడచిన తరువాత ఆదివారం నాడు తెల్లవారుతూ ఉండగానే మగ్దలేనే మరియ, ఆ మరో మరియ సమాధిని చూడడానికి వచ్చారు. అంతకుముందు ఒక పెద్ద భూకంపం కలిగింది. ఎందుకంటే ప్రభుదూత ఒకడు పరలోకంనుంచి దిగివచ్చి, ద్వారం నుంచి ఆ రాయి దొర్లించి దానిమీద కూర్చున్నాడు. అతడి రూపం మెరుపులాగా ఉంది, అతని వస్త్రం చలి మంచంత తెల్లగా ఉంది. అతని భయంచేత కావలివారికి వణకు పుట్టి చచ్చినంత పనైంది.
దేవదూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు: “భయపడకండి! సిలువ వేయబడ్డ యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన సజీవంగా లేచాడు. రండి, ప్రభువు పడుకొన్న స్థలం చూడండి. అప్పుడా దూత, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ‘ఆయన చనిపోయిన వారిలోనుంచి సజీవంగా లేచాడు. మీకంటే ముందుగా గలలీకి వెళ్ళబోతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. ఇదిగో, మీతో నేను ఇది చెపుతున్నాను.”
వారు భయంతో, గొప్ప సంతోషంతో సమాధినుంచి త్వరగా వెళ్ళి, ఆయన శిష్యులకు ఆ విషయం చెప్పడానికి పరుగెత్తారు. వారు ఆయన శిష్యులకు ఇలా చెప్పడానికి వెళ్ళిపోతుండగా యేసు వారిని ఎదుర్కొని, “శుభం!” అన్నాడు. వారు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆరాధించారు.
యేసు వారితో “భయపడకండి! వెళ్ళి నా సోదరులు గలలీకి వెళ్ళాలనీ అక్కడ వారు నన్ను చూస్తారనీ వారికి తెలియజేయండి” అన్నాడు.
మార్కు శుభవార్త 16:1-11
విశ్రాంతి దినం తరువాత మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహాన్ని అభిషేకించుదామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం నాడు వారు తెల్లవారు జామున ప్రొద్దు పొడవడంతోనే సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. “మనకోసం ఎవరు సమాధి ద్వారంనుంచి ఆ రాయి దొర్లించివేస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అప్పుడు తలెత్తి చూస్తే ఆ రాయి – అది చాలా పెద్దది – దొర్లించి ఉండడం వారికి కనిపించింది. వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు తెల్లని అంగీ తొడుక్కొన్న యువకుడొకడు కుడి వైపున కూర్చుని ఉండడం వారు చూచి నిర్ఘాంతపోయారు.
అతడు వారితో ఇలా అన్నాడు: “నిర్ఘాంతపోకండి! మీరు వెదుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన సజీవంగా లేచాడు. ఆయన ఇక్కడ లేడు. ఇదిగో, వారు ఆయనను పెట్టిన స్థలం! వెళ్ళి ఆయన శిష్యులతో – పేతురుతో కూడా – ఇలా చెప్పండి: మీకంటే ముందుగా ఆయన గలలీకి వెళ్ళబోతున్నాడు. ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరాయనను చూస్తారు.”
వారు త్వరగా బయటికి వెళ్ళి సమాధినుంచి పారిపోయారు. ఎందుకంటే వారికి వణుకు, విస్మయం పట్టుకొన్నాయి. వారు భయం కారణంగా ఎవరితో ఏమీ చెప్పలేదు.
ఆదివారం నాడు యేసు పెందలకడే సజీవంగా లేచిన తరువాత మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడ్డాడు. అంతకుముందు ఆయన ఆమెలోనుంచి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. మునుపు ఆయనతో ఉండేవారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి యేసు లేచిన సంగతి వారికి తెలియజేసింది. ఆయన సజీవుడనీ ఆమెకు కనబడ్డాడనీ విని వారు నమ్మలేదు.
లూకా శుభవార్త 24:1-12
ఆదివారం నాడు తెల్లవారు జామున తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారు, మరి కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. సమాధిముందు నుంచి ఆ రాయి దొర్లించి ఉండడం వారికి కనిపించింది. అయితే వారు సమాధిలోకి వెళ్ళి చూచినప్పుడు ప్రభువైన యేసు శరీరం కనబడలేదు. దీన్ని గురించి వారు అధికంగా కలవరపడుతూ ఉంటే హఠాత్తుగా ధగధగ మెరిసిపోతున్న వస్త్రాలు తొడుక్కొన్న ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడ్డారు. ఆ స్త్రీలు భయపడి నేల వైపు తమ ముఖాలు వంచుకొన్నారు. అయితే ఆ వ్యక్తులు “సజీవుణ్ణి చనిపోయినవారిమధ్య ఎందుకు వెదకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. సజీవంగా లేచాడు. ఆయన ఇంకా గలలీలో ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే, మానవ పుత్రుణ్ణి పాపిష్టి మనుషుల చేతికి అప్పగించడం, సిలువ వేయడం, ఆయన మూడో రోజున మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి” అని వారితో చెప్పారు.
అప్పుడు ఆయన మాటలు వారికి జ్ఞప్తికి వచ్చాయి. వారు సమాధినుంచి తిరిగి వెళ్ళి పదకొండుమంది శిష్యులకూ తక్కినవారందరికీ ఇదంతా తెలియజేశారు. ఈ విధంగా క్రీస్తు రాయబారులకు ఈ సంగతులు చెప్పినది ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వారితోకూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరికి తెలివితక్కువ కబుర్లలాగా అనిపించాయి గనుక వీరు వారిని నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధిదగ్గరకు పరుగెత్తి వెళ్ళి వంగి చూశాడు.సన్నని నారబట్ట మాత్రం విడిగా ఉండడం అతనికి కనబడింది. జరిగినదానికి ఆశ్చర్యపడుతూ అతడు వెళ్ళి పోయాడు.
యోహాను శుభవార్త 20:1-8
ఆదివారం నాడు పెందలకడ ఇంకా చీకటిగా ఉండగానే మగ్‌దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసివేసి ఉండడం చూచింది. గనుక ఆమె సీమోను పేతురు దగ్గరకూ యేసు ప్రేమించిన ఆ మరో శిష్యుని దగ్గరకూ పరుగెత్తి వెళ్ళింది. “వారు ప్రభువును సమాధిలో నుంచి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు” అంది.
అందుచేత పేతురు, ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి పరుగెత్తుతూ ఉన్నారు గాని ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి మొదట సమాధి చేరాడు. అతడు వంగి సమాధిలో ఆ అవిసెనార గుడ్డలు ఉండడం చూశాడు గాని లోపలికి వెళ్ళలేదు. అప్పుడు అతడి వెనకాలే సీమోను పేతురు వచ్చాడు. అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అవిసెనార బట్టలు చూశాడు. యేసు తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు. అది ఆ అవిసెనార బట్టలతో గాక వేరే చోట చుట్టిపెట్టి ఉంది. అప్పుడు, మొదట సమాధి దగ్గరికి చేరిన ఆ మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మాడు.
యేసు చెప్పిన ఉపమానాలు
వివిధ రకాలైన నేల
మత్తయి శుభవార్త 13:3-9,18-23
అప్పుడు ఆయన ఉదాహరణల రూపంలో వారికి అనేక సంగతులు చెప్పాడు:
“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి. మరికొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి స్థలాల్లో పడ్డాయి. మన్ను లోతు లేకపోవడంచేత అవి త్వరలోనే మొలకెత్తాయి. కానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచిపెట్టివేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని నూరు రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫయి రెట్లు పండాయి. వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!” “విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి. పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తినదానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి. రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు వినీ వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు. కానీ అతనిలో వేరులు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే అతడు తొట్రుపడిపోతాడు. ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వింటాడు గాని ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచి వేస్తాయి. అతడు ఫలించని వాడైపోతాడు. మంచి నేలను విత్తనాలు పొందినది ఎవరంటే – వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవాడు. కొందరు నూరు రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫయి రెట్లు ఫలిస్తారు.”
మార్కు శుభవార్త 4:3-9,13-20
“ఇదిగో వినండి! విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి. మరి కొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి. మన్ను లోతు లేకపోవడం వల్ల అవి త్వరలోనే మొలకెత్తాయి. గానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేవు గనుక వాడిపోయాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచివేయడం వల్ల అవి పంటకు రాలేదు. మరి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి వృద్ధి అవుతూ పంటకు వచ్చాయి. ముప్ఫయి రెట్లు, అరవై రెట్లు, నూరు రెట్లు పండాయి.” ఆయన ఇంకా అన్నాడు, “వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక!” ఆయన వారితో ఇంకా అన్నాడు “ఈ ఉదాహరణ అర్థం మీకు తెలియదా? అలాగైతే ఉదాహరణలన్నీ మీరెలా అర్థం చేసుకొంటారు? విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. దారిప్రక్కన ఉన్నవారి సంగతి ఇలా ఉంది: అక్కడ వాక్కు చల్లబడుతూ ఉంటే వారు విన్నప్పుడు, వెంటనే సైతాను వచ్చి వారి హృదయాలలో చల్లిన వాక్కును తీసివేస్తాడు. అదే విధంగా రాతి నేల మీద చల్లిన విత్తనాలు ఎవరంటే వారు వాక్కు వినీ వినడంతోనే సంతోషంతో దానిని అంగీకరిస్తారు. కానీ వారిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటారు. అప్పుడు వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే వారు తొట్రుపడిపోతారు. ముండ్ల తుప్పలలో చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు వింటారు, గానీ ఇహలోక చింతలు, ధనం మూలమైన మోసం, ఇతరమైనవాటిని గురించిన కోరికలు లోపలికి ప్రవేశించి వాక్కును అణచి ఫలించకుండా చేస్తాయి. మంచి నేలమీద చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు విని దానిని అంగీకరించి ఫలిస్తారు. కొందరు ముప్ఫయి రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు నూరు రెట్లు ఫలిస్తారు.”
లూకా శుభవార్త 8:5-8,11-15
“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. అవి కాళ్ళక్రింద త్రొక్కబడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వాటిని మ్రింగివేశాయి. మరి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. లోపల తడిలేదు గనుక మొలిచిన వెంటనే అవి ఎండిపోయాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల మధ్య పడ్డాయి. ముండ్ల తుప్పలు వీటితోపాటు పెరిగి వాటిని అణిచివేశాయి. మరి కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఇవి మొలిచి పెరిగి నూరు రెట్లు పంట పండాయి.”
ఇలా చెప్పి ఆయన “వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!” అని బిగ్గరగా అన్నాడు. ఈ ఉదాహరణ భావమిది: విత్తనమంటే దేవుని వాక్కు. దారిప్రక్కన ఉన్నవారంటే వాక్కు వినేవారు గానీ అపనింద పిశాచం వచ్చి వారి హృదయంలోనుంచి వాక్కు తీసివేస్తాడు. వారు నమ్మకుండా పాపవిముక్తి పొందకుండా చేయాలని వాడి ఉద్దేశం. రాతి నేల మీద ఉన్నవారంటే వాక్కు విని సంతోషంతో అంగీకరించేవారు. కానీ వీరిలో వేరులు లేకపోవడంచేత కొద్ది కాలమే నమ్ముతారు. విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. ముళ్ళ తుప్పలలో పడ్డ విత్తనాలు అంటే వాక్కు వినేవారు గాని తమ దారిన సాగుతూ ఉంటే జీవితంలో చీకుచింతలతో, సంపదలతో, సుఖభోగాలతో అణగారిపోయేవారు. వీరి ఫలం ఏదీ పరిపక్వం చెందదు. మంచి నేలలో పడ్డ విత్తనాలంటే హితమైన మంచి హృదయం కలిగి వాక్కు విని నిలుపుకొని ఓర్పు కలిగి ఫలించేవారు.
మొలకెత్తిన విత్తనం
మార్కు శుభవార్త 4:26-29
ఆయన ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం ఒకతను భూమిమీద విత్తనాలు చల్లినట్టుంది. రాత్రింబగళ్ళు అతడు నిద్రపోతూ మేల్కొంటూ ఉంటే, అతనికి తెలియని విధంగానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి. ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొక్కను, తరువాత వెన్నును, ఆ తరువాత వెన్నులో ముదిరిన గింజలను పుట్టిస్తుంది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు వెంటనే కొడవలి పెట్టి కోస్తాడు.”
కలుపు మొక్కలు
మత్తయి శుభవార్త 13:24-30,36-43
ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది: ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు. మనుషులు నిద్రపోతూ ఉంటే, అతని పగవాడు వచ్చి గోధుమల మధ్య కలుపుమొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు. గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి. యజమాని దాసులు వచ్చి అతణ్ణి ఇలా అన్నారు: ‘అయ్యగారూ, మీ పొలంలో మంచి విత్తనాలు వేశారు గదా! ఈ కలుపుమొక్కలు ఉండడం ఎలా?’ అతడు వారితో అన్నాడు ‘ఇది పగవాడు చేసిన పని.’ దాసులు, ‘మమ్మల్ని వెళ్ళి ఆ కలుపు మొక్కలు పీకెయ్యమంటారా?’ అని అతణ్ణి అడిగారు. అందుకతడు ‘వద్దు, కలుపు మొక్కలు పీకివేసేటప్పుడు వాటితోకూడా గోధుమ మొక్కలు పెళ్ళగిస్తారేమో. కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో నేను కోతవారికి చెపుతాను, ‘ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి’ అన్నాడు.” అప్పుడు యేసు జన సమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలో ఉన్న కలుపు మొక్కల ఉదాహరణ మాకు వివరించండి” అని చెప్పారు.
ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మంచి విత్తనాలు చల్లేది మానవ పుత్రుడు. పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి చెందినవారు. కలుపు మొక్కలు దుర్మార్గుడికి చెందినవారు. వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం. కోతకాలం ఈ యుగ సమాప్తి. ఆ కోత కోసేవారు దేవదూతలు. కలుపు మొక్కలను పోగుచేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగాంతంలో జరుగుతుంది. మానవ పుత్రుడు తన దేవదూతలను పంపుతాడు. వారు తొట్రుపాటుకు కారణమైన ప్రతిదానినీ, దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలోనుంచి పోగుచేస్తారు. వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. అప్పుడు న్యాయవంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యమండలం లాగా ప్రకాశిస్తారు. వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!
ఆవ గింజ
మత్తయి శుభవార్త 13:31-32
ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒకతను తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది. అయితే అది పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటినీ మించి చెట్టు అవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”
మార్కు శుభవార్త 4:30-32
ఆయన ఇంకా అన్నాడు “దేవుని రాజ్యం దేనితో సరిపోల్చాలి? ఏ ఉదాహరణతో దానిని వివరించాలి? అది ఆవగింజ లాంటిది. భూమిలో చల్లే విత్తనాలన్నిటిలో ఆవగింజ చిన్నది. అయినా దానిని చల్లిన తరువాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూళ్ళు కట్టుకోగలిగేటంత పెద్ద కొమ్మలు అది వేస్తుంది.”
లూకా శుభవార్త 13:18-19
అప్పుడాయన “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దేనితో దానిని పోలుస్తాను? ఒక మనిషి ఆవ గింజను తీసుకొని తన తోటలో నాటాడు. అది పెరిగి పెద్ద చెట్టయింది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలమీద గూళ్ళు కట్టుకొన్నాయి. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది” అన్నాడు.
పులిసిన పిండి
మత్తయి శుభవార్త 13:33
ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దాని వల్ల పిండి అంతట్లో పొంగజేసే పదార్థం వ్యాపించింది. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.”
లూకా శుభవార్త 13:20-21
ఆయన ఇంకా అన్నాడు “నేను దేనితో దేవుని రాజ్యాన్ని పోల్చాలి? ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దానిలో అంతటా పొంగజేసే పదార్థం వ్యాపించింది. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది.”
ముత్యం
మత్తయి శుభవార్త 13:45-46
“మరొకటి – వర్తకుడు మంచి ముత్యాలకోసం వెదుకుతూ వచ్చాడు. చాలా విలువైన ముత్యం ఒకటి కనబడగానే అతడు వెళ్ళి తనకున్నది అంతా అమ్మివేసి ఆ ముత్యం కొనుక్కొన్నాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.
దాచబడిన సంపద/నిధి
మత్తయి శుభవార్త 13:44
“మరొకటి – పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన నిధిలాంటిది. ఒక మనిషి దానిని కనుక్కొని అలాగే దాచివేశాడు. అప్పుడు దొరికిందనే సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలం కొనుక్కొన్నాడు.
చేపలు పట్టే వల
మత్తయి శుభవార్త 13:47-50
“ఇంకొకటి – వల సరస్సులో వేసి ఉంది. దానిలో అన్ని రకాల చేపలు పడ్డాయి. వల నిండినతరువాత దానిని ఒడ్డుకు లాగారు. కూర్చుని మంచి చేపలు బుట్టల్లో వేసుకొన్నారు, పనికిమాలినవి అవతల పారవేశారు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది. ఈ యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, న్యాయవంతుల మధ్యనుంచి చెడ్డవారిని వేరుపరుస్తారు. వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
ఫలించని అంజూరపు చెట్టు
లూకా శుభవార్త 13:6-9
అప్పుడాయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక మనిషికి తన ద్రాక్షతోటలో నాటి ఉన్న అంజూర చెట్టు ఒకటి ఉంది. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చాడు. అయితే ఒక్క పండు కూడా కనబడలేదు. అప్పుడు ద్రాక్షతోటమాలితో ‘ఇదిగో, ఈ అంజూర చెట్టుపండ్లు వెదకడానికి మూడేళ్ళ నుంచి వస్తున్నాను గాని ఒక్కటి కూడా కనబడలేదు. ఈ చెట్టువల్ల ఈ భూమికి దుర్వినియోగం ఎందుకు? దీనిని నరికివెయ్యి!’ అన్నాడు. అయితే తోటమాలి అతనితో ‘ఈ సంవత్సరం కూడా దీనిని ఉండనివ్వండయ్యా! దీని పాదు తవ్వి ఎరువు వేస్తాను. అది కాయలు కాస్తే సరే. లేదా, ఆ తరువాత మీరు దీనిని నరికేసెయ్యవచ్చు’ అన్నాడు.”
ద్రాక్షాతోటలో పనివారు
మత్తయి శుభవార్త 20:1-16
“ఎందుకంటే, పరలోక రాజ్యం ఇలా ఉంది: భూస్వామి ఒకడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకుందామని ప్రొద్దు పొడవగానే బయటికి వెళ్ళాడు. రోజుకొక దేనారం ప్రకారం పనివారితో సమ్మతించి వారిని తన ద్రాక్షతోటలోకి పంపాడు. సుమారు తొమ్మిది గంటలకు అతడు బయటికి వెళ్ళి సంతవీధిలో మరి కొందరు ఊరికే నిల్చుని ఉండడం చూశాడు. అతడు వారితో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి. ఏ జీతం న్యాయమో అది మీకిస్తాను’ అన్నాడు. అలాగే వారు వెళ్ళారు. సుమారు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ అతడు మళ్ళీ బయటికి వెళ్ళి ఆ విధంగా చేశాడు. సుమారు అయిదు గంటలకు కూడా అతడు బయటికి వెళ్ళి ఇంకా కొంతమంది ఊరికే నిలబడి ఉండడం చూచి, ‘రోజంతా మీరెందుకు ఇక్కడ ఊరికే నిలుచున్నారు?’ అని వారినడిగాడు. వారు అతనితో ‘మమ్మల్ని ఎవరూ కూలికి పెట్టుకోలేదు గనుక’ అని జవాబిచ్చారు. అతడు ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది మీకు చేకూరుతుంది’ అని వారితో చెప్పాడు.
“సాయంకాలమైనప్పుడు ద్రాక్షతోట యజమాని సేవాధికారిని చూచి ఇలా అన్నాడు: ‘పనివాళ్ళను పిలిచి వారికి కూలి ఇచ్చెయ్యి. చివరగా వచ్చినవాళ్ళకు మొదట ఇయ్యి. మొదట వచ్చినవాళ్ళకు చివరగా ఇయ్యి.’ సుమారు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చారు. వారిలో ప్రతివానికీ దేనారం దొరికింది. మొదటివారు వచ్చినప్పుడు తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకొన్నారు గానీ వారిలో కూడా ప్రతివానికీ ఒక్క దేనారం దొరికింది. అదే దొరికితే వారు భూస్వామిమీద ఇలా సణిగారు: ‘చివరగా వచ్చిన వాళ్ళు ఒక్క గంట సేపు మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతటి బరువునూ ఎండనూ సహించాం. మాతో వాళ్ళను సమానంగా చేశారేం!’
“అతడు వారిలో ఒకనితో ఇలా సమాధానం చెప్పాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయమేమీ చేయడం లేదు. నీవు దేనారానికి ఒప్పుకోలేదా నా దగ్గర? నీ జీతం తీసుకువెళ్ళు. నీకిచ్చినట్టే చివరగా వచ్చినవాళ్ళకు ఇవ్వాలనేదే నా ఇష్టం. నాకున్నదానితో ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నాకు హక్కు లేదా? నేను మంచివాడుగా ఉన్నందుచేత నీకు కడుపుమంటగా ఉందా?’
“ఈ విధంగానే చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు. ఎందుకంటే పిలిచేది అనేకమందిని, ఎన్నుకొనేది కొద్దిమందిని.”
ఇద్దరు సహోదరులు
మత్తయి శుభవార్త 21:28-32
దీన్ని గురించి మీకేమి తోస్తుంది? – ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్దవాడి దగ్గరకు వచ్చి అతడితో ‘బాబూ, ఈ రోజు నీవు వెళ్ళి, నా ద్రాక్ష తోటలో పని చెయ్యి’ అన్నాడు. అతడు ‘వెళ్ళను’ అన్నాడు గాని తరువాత మనసు మార్చుకొని వెళ్ళాడు. తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు ‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గానీ వెళ్ళలేదు. ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేశాడు?”
వాళ్ళు ఆయనతో “మొదటివాడు” అన్నారు.
యేసు వాళ్ళతో ఇలా బదులు చెప్పాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీకంటే ముందుగా సుంకంవారు, వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే, యోహాను న్యాయమార్గంలో మీదగ్గరకు వచ్చాడు గాని మీరు అతణ్ణి నమ్మలేదు. అయితే సుంకంవారు, వేశ్యలు అతణ్ణి నమ్మారు. అది చూచినా మీరు తరువాత పశ్చాత్తాపపడలేదు, అతణ్ణి నమ్మలేదు.
వివాహపు విందు
మత్తయి శుభవార్త 22:1-44
యేసు ఇంకా వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా చెప్పసాగాడు: “పరలోక రాజ్యం ఇలా ఉంది: ఒక రాజు తన కుమారుని పెళ్ళి విందు ఏర్పాటు చేశాడు. పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారిని రమ్మనడానికి అతడు తన దాసులను పంపాడు గాని వారికి రావడం ఇష్టం లేదు.
“మళ్ళీ అతడు వేరే దాసులను పంపుతూ, ‘ఆహ్వానం అందినవారితో ఇలా చెప్పండి: నా విందు సిద్ధం చేశాను. నా ఎద్దులనూ క్రొవ్విన పశువులనూ వధించడం జరిగింది. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందుకు రండి’ అన్నాడు.
“అయినా ఆహ్వానమందిన వారు దాన్ని లెక్క చేయక వెళ్ళిపోయారు. ఒకడు తన పొలానికి వెళ్ళాడు. మరొకడు వ్యాపారానికి వెళ్ళాడు. మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమానించి చంపారు. రాజు దాని గురించి విని కోపంతో మండిపడ్డాడు, తన సైన్యాలను పంపి ఆ హంతకులను సంహరించి, వారి నగరాన్ని తగల బెట్టించాడు.
“అప్పుడతడు తన దాసులతో ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గాని ఆహ్వానం అందినవాళ్ళు యోగ్యులు కారు. గనుక రహదారులలోకి వెళ్ళి మీకు కనిపించినవారందరినీ పెళ్ళి విందుకు పిలవండి’ అన్నాడు.
“అలాగే ఆ దాసులు రహదారులలోకి వెళ్ళి, తమకు కనిపించిన వారందరినీ – మంచివారినీ చెడ్డవారినీ – పోగు చేశారు. ఆ విధంగా పెళ్ళి ఇల్లు విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. ఆ అతిథులను చూద్దామని రాజు లోపలికి వచ్చాడు. పెళ్ళి వస్త్రం తొడుక్కోకుండా ఉన్న వాడొకడు అక్కడ అతనికి కనబడ్డాడు.
రాజు అతణ్ణి చూచి, ‘స్నేహితుడా! పెళ్ళి వస్త్రం లేకుండా నీవు లోపలికి ఎలా చేరుకున్నావు?’ అని అడిగాడు. అతనికి నోట మాట లేదు. అప్పుడు రాజు, ‘ఇతణ్ణి కాళ్ళు చేతులు కట్టి, అవతలికి తీసుకువెళ్ళి బయటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపూ, పండ్లు కొరుకుకోవడమూ ఉంటాయి’ అని ఆ పరిచారకులతో చెప్పాడు.
“అలాగే ఆహ్వానం అందుకొన్నవారు చాలామంది, ఎన్నుకోబడ్డవారు కొద్దిమందే.”
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు. తరువాత తమ శిష్యులను హేరోదు పక్షంవాళ్ళతోపాటు ఆయనదగ్గరికి పంపారు. వారు ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు యథార్థవంతులనీ, ఎవరినీ లెక్కచేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారనీ, మనుషులను పక్షపాతంతో చూడరనీ మాకు తెలుసు. గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి – సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా కాదా?”
యేసు వాళ్ళ దుర్మార్గత పసికట్టి “కపట భక్తులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? సుంకం నాణెం ఒకటి నాకు చూపెట్టండి” అన్నాడు. వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు.
“ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.
“సీజర్‌వి” అని వారు ఆయనతో అన్నారు. ఆయన వారితో “అలాగైతే సీజర్‌వి సీజర్‌కూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.
ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
ఆ రోజే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. చనిపోయినవారు లేవరని వారంటారు. వారు ఆయనను ఇలా ప్రశ్నించారు: “ఉపదేశకా, మోషే చెప్పినది ఇది: ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకొని అతడి వంశం నిలబెట్టాలి. మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చచ్చి అతడి భార్యను అతడి తమ్ముడికి విడిచిపెట్టాడు. ఈ రెండోవాడికి, తరువాత మూడోవాడికి, ఏడోవాడి వరకు అందరికీ అలాగే జరిగింది. అందరి తరువాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. కాబట్టి చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు ఈ ఏడుగురిలో ఆమె ఎవరి భార్య? ఆమె వాళ్ళందరికీ భార్యగా ఉంది గదా?”
యేసు వాళ్ళకు ఇలా జవాబిచ్చాడు: “లేఖనాలూ, దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు గనుక పొరబడుతున్నారు. చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు. చనిపోయినవారు సజీవంగా లేచే విషయమైతే – దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అదేమిటంటే, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.’ ఆయన చనిపోయినవారి దేవుడు కాడు గాని జీవిస్తూవున్న వారి దేవుడు.”
ఇది విని జన సమూహానికి ఆయన ఉపదేశంవల్ల చాలా ఆశ్చర్యం కలిగింది.
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు సమకూడి వచ్చారు. వాళ్ళలో ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ఈ ప్రశ్న అడిగాడు: “ఉపదేశకా, ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది?”
యేసు అతనితో అన్నాడు, “హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి. ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా. రెండో ఆజ్ఞ అలాంటిదే – మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలమీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలూ ఆధారపడి ఉన్నాయి.”
పరిసయ్యులు గుమిగూడి ఉన్నప్పుడు యేసు వారిని ఒక ప్రశ్న అడిగాడు – “అభిషిక్తుని విషయం మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” వారు “దావీదు కుమారుడు” అని ఆయనకు జవాబిచ్చారు.
ఆయన వాళ్ళతో “అలాగైతే దావీదు దేవుని ఆత్మమూలంగా ఎందుకు ఆయనను ప్రభువు అన్నాడు? దావీదు అన్నాడు గదా, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – నేను నీ శత్రువులను నీ పాదాలక్రింద ఉంచేవరకు నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.’
గొప్ప విందు
లూకా శుభవార్త 14:16-24
అతనితో ఆయన ఇలా చెప్పాడు: “ఒక మనిషి గొప్ప విందు ఏర్పాటు చేసి అనేకులను పిలిచాడు. విందుకు వేళయినప్పుడు ‘ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది, రండి’ అని ఆహ్వానం అందిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు.
“అయితే వారంతా ఏకమనస్సుతో సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు అతనితో ‘నేనొక పొలం కొన్నాను. వెళ్ళి దాన్ని చూచుకోవాలి. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.
“మరొకడు ‘నేను అయిదు జతల ఎద్దుల్ని కొన్నాను, వెళ్ళి వాటిని పరీక్ష చేస్తాను. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.
“మరొకడు ‘నేను పెళ్ళి చేసుకొన్నాను గనుక రాలేను’ అన్నాడు.
“అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ విషయాలు తన యజమానితో చెప్పాడు. ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. తన దాసునితో ఇలా అన్నాడు: ‘నీవు త్వరగా నగర వీధుల్లోకీ సందుల్లోకీ వెళ్ళి బీదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ ఇక్కడికి తీసుకురా!’
“తరువాత ఆ దాసుడు ‘యజమానీ, తమరు ఆజ్ఞాపించినట్టే అయింది గాని ఇంకా స్థలం ఉందండి’ అన్నాడు.
“అప్పుడు దాసునితో యజమాని ‘నా ఇల్లు నిండాలి గనుక రహదారుల్లోకీ కంచెల పొడుగునా వెళ్ళి అక్కడివారిని బలవంతాన తీసుకురా! నీతో అంటున్నాను, ముందు పిలుపు అందుకొన్నవారిలో ఎవరూ నా విందు భోజనం రుచిచూడరు!’ అన్నాడు.”
కౌలురైతులు
మత్తయి శుభవార్త 21:33-46
“మరో ఉదాహరణ వినండి. భూస్వామి ఒకడు ద్రాక్షతోట నాటించాడు. దానిచుట్టూ గోడ కట్టించి, అందులో ద్రాక్షగానుగ తొట్టి తొలిపించి, కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళిపోయాడు. కోతకాలం దగ్గర పడ్డప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరకు పంపాడు. రైతులు అతని దాసులను పట్టుకొని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు, మరొకనిమీద రాళ్ళు రువ్వారు. అతడు మళ్ళీ వేరే దాసులను పంపాడు. మునుపటికంటే వీరు ఎక్కువమంది. అయినా రైతులు వారిని కూడా అలాగే చేశారు. చివరికి అతడు ‘నా కుమారుణ్ణి వారు గౌరవిస్తారు’ అని చెప్పి తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు. కాని, కుమారుణ్ణి చూచి రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపి వీడి వారసత్వం తీసుకుందాం రండి!’ వారు అతణ్ణి పట్టుకొని, ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు. అందుచేత ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతులను ఏమి చేస్తాడు?”
వాళ్ళు ఆయనతో, “అతడు ఆ దుర్మార్గులను నిర్దయగా నాశనం చేస్తాడు, పంటకాలాల్లో తనకు పళ్ళు ఇచ్చే వేరే రైతులకు ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అన్నారు.
యేసు వాళ్ళతో అన్నాడు: “మీరు లేఖనాలలో ఈ మాట ఎన్నడూ చదవలేదా? – ‘కట్టేవారు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. ఇది ప్రభువుమూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’ గనుక మీతో నేను చెప్పేదేమిటంటే, దేవుని రాజ్యాన్ని మీనుంచి తీసివేయడం, దాని ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బండ మీద పడేవారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో వారు చూర్ణమై పోయేలా చేస్తుంది.”
ఆయన చెప్పిన ఉదాహరణలు విని ప్రధాన యాజులూ, పరిసయ్యులూ తమ విషయమే చెప్పాడని గ్రహించారు. ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహాలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్తగా ఎంచారు.
మార్కు శుభవార్త 12:1-12
అప్పుడాయన వారితో ఉదాహరణలలో చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటాడు. దాని చుట్టూ గోడ కట్టి ద్రాక్ష గానుగ తొట్టి కోసం అందులో గుంట తొలిపించి కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళాడు. కోతకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పంటలో కొంత రైతుల దగ్గరనుంచి తెమ్మని వారి దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. అయితే వారు అతణ్ణి పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు. అతడు మళ్ళీ మరో దాసుణ్ణి వారిదగ్గరకు పంపాడు. వారు అతని వైపు రాళ్ళు రువ్వి అతని నెత్తి గాయపరచి అతణ్ణి అవమానించి పంపివేశారు. అతడు ఇంకొకణ్ణి పంపాడు. అతణ్ణి వారు చంపారు. ఇంకా అనేకులను పంపాడు. వారు కొందరిని కొట్టారు, కొందరిని చంపారు.
“ఇంకా అతనికి తన ప్రియ కుమారుడొక్కడే మిగిలాడు. ‘వారు నా కుమారుణ్ణి గౌరవిస్తారు’ అని చెప్పి చివరిగా అతణ్ణి వారిదగ్గరకు పంపాడు. కానీ ఆ రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది!’ వారతణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేశారు.
“అందుచేత ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను చంపి ద్రాక్షతోటను వేరే వారి చేతికిస్తాడు. మీరు ఈ లేఖనం చదవలేదా? – కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.”
వారు తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ ఆయన చెప్పాడని గ్రహించి ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహానికి భయపడ్డారు. అప్పుడు వారు ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
లూకా శుభవార్త 20:9-19
అప్పుడాయన ప్రజలకు ఈ ఉదాహరణ చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటి దానిని రైతులకు కౌలుకిచ్చి దూర దేశంలో చాలా కాలం అక్కడికి ప్రయాణమై పోయాడు. కోత కాలం వచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష పంటలో కొంత తనకివ్వాలని ఆ రైతుల దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. కానీ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరోసారి అతడు మరో దాసుణ్ణి పంపాడు. అతణ్ణి కూడా వారు కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేశారు. మూడో సారి అతడు దాసుణ్ణి పంపాడు. వారతణ్ణి గాయపరచి బయటికి త్రోసివేశారు.
“అప్పుడు ద్రాక్షతోట సొంతదారుడు ‘నేనేం చెయ్యను? నా ప్రియ కుమారుణ్ణి పంపుతాను. బహుశా వారాయనను చూస్తే గౌరవిస్తారు’ అన్నాడు. కానీ అతణ్ణి చూచి రైతులు ‘వారసుడు ఇతడే! వారసత్వం మనది అయ్యేలా అతణ్ణి చంపుదాం రండి’ అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకొన్నారు. అప్పుడు వారతణ్ణి ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు.
“అందుచేత ద్రాక్షతోట యజమాని వారినేమి చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను ధ్వంసం చేసి ద్రాక్షతోటను వేరేవారి చేతికిస్తాడు.” అది విని వారు “అలా ఎన్నడూ కాకూడదు!” అన్నారు.
ఆయన వారివైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు: “అలాగైతే రాసి ఉన్న ఈ విషయానికి అర్థం ఏమిటి – ‘కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’? ఈ రాయిమీద పడే వారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో ఆ వ్యక్తిని చూర్ణం చేస్తుంది.”
ఆయన తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ చెప్పాడని గ్రహించి ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ఆ సమయంలోనే ఆయనను పట్టుకోవాలని చూశారు గాని ప్రజలకు భయపడ్డారు.
తప్పిపోయిన గొర్రె
మత్తయి శుభవార్త 18:12-14
“ఒక మనిషికి నూరు గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే, తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి, తప్పిపోయిన ఆ ఒక్కదానిని వెదకడానికి కొండలకు వెళ్ళడా? మీరేమి అనుకొంటారు? అది కనబడితే దారి తప్పని ఆ తొంభై తొమ్మిది గొర్రెల విషయంకంటే ఆ ఒక్కదాని విషయం అతడు ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నాశనం కావడం అంటే పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు.
లూకా శుభవార్త 15:3-7
అందుచేత ఆయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు: “మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఆ తొంభై తొమ్మిది గొర్రెలను నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టి, తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా? అది కనబడ్డప్పుడు భుజాలమీద దానిని పెట్టుకొని సంతోషిస్తాడు. అతడు ఇంటికి వచ్చినప్పుడు మిత్రులనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటాడు.
“అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.
పోయిన నాణెం
లూకా శుభవార్త 15:8-10
“ఒకామెకు పది వెండి నాణేలు ఉండి, వాటిలో ఒక నాణెం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంతవరకూ జాగ్రత్తగా వెదకదా? అది కనబడ్డప్పుడు స్నేహితురాండ్రనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘నేను పోగొట్టుకొన్న నాణెం నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటుంది. అలాగే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి దేవుని దూతల సముఖంలో ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.”
తప్పిపోయిన కుమారుడు
లూకా శుభవార్త 15:11-32
ఆయన ఇంకా అన్నాడు “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. చిన్నవాడు తండ్రితో ‘నాన్నా, ఆస్తిలో నాకు వచ్చే భాగమివ్వు’ అన్నాడు. తండ్రి తన జీవనాధారం వారికి పంచి ఇచ్చాడు.
“కొన్నాళ్ళకు చిన్నవాడు తనకు ఉన్నదంతా కూడగట్టుకొని దూర దేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేశాడు. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు అక్కరలో పడసాగాడు. అప్పుడు ఆ దేశ పౌరుడొకని దగ్గర చేరాడు. ఆ మనిషి పందులు మేపడానికి అతణ్ణి తన పొలాల్లోకి పంపాడు. పందులు మేపే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాలని ఆశించాడు, కాని అతనికి ఎవరూ ఏమీ పెట్టలేదు.
“అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇలా అనుకొన్నాడు: ‘మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి మనుషులకు బోలెడంత ఆహారం ఉంటుందే. నేనైతే ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను; నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకును అనిపించుకోవడానికి తగను. నన్ను నీ కూలి మనుషులలో ఒకడిగా పెట్టుకో! అంటాను.’
“అప్పుడతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
“అప్పుడా కొడుకు ‘నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకుననిపించుకోవడానికి తగను’ అని అతనితో అన్నాడు.
“అయితే తండ్రి తన దాసులను చూచి ‘అన్నిట్లో మంచి వస్త్రం తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని వ్రేలికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. తిందాం! సంబరపడదాం! ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు! తప్పిపోయి దొరికాడు!’ అన్నాడు. అప్పుడు వారు సంబరపడసాగారు.
“ఇంతలో పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు వచ్చి ఇంటికి దగ్గరగా చేరినప్పుడు సంగీత నాదం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి. అతడొక దాసుణ్ణి పిలిచి ‘వాటి అర్థమేమిటో!’ అని అడిగాడు.
“ఆ దాసుడు అతనితో ‘మీ తమ్ముడు వచ్చాడండి. తన దగ్గరకు క్షేమంగా చేరినందుచేత మీ తండ్రి కొవ్విన దూడను వధించాడండి’ అన్నాడు.
పెద్ద కొడుక్కు కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. కాబట్టి అతని తండ్రి బయటికి వచ్చి రమ్మని వేడుకొన్నాడు. కానీ తండ్రికి అతడు ‘చూడు, ఇన్ని ఏళ్ళపాటు నీకు చాకిరి చేస్తూ వచ్చాను. నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదు. అయినా నేను నా స్నేహితులతో సంబరపడేట్టు నీవు విందుకోసం మేకపిల్లనైనా ఎన్నడూ నాకివ్వలేదు. అయితే నీ జీవనాధారం వేశ్యలతో తినేసిన ఈ నీ కొడుకు రాగానే వాడికి కొవ్విన దూడను వధించావే!’ అని జవాబిచ్చాడు.
“అందుకు తండ్రి అతనితో ‘అబ్బాయి! నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. అయితే ఈ నీ తమ్ముడు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు. అందుచేత మనం సంబరపడి సంతోషించడం న్యాయమే!’” అన్నాడు.
ఇద్దరుకి అప్పు ఇచ్చిన రుణదాత
లూకా శుభవార్త 7:41-47
యేసు అన్నాడు “అప్పిచ్చేవాడొకడు ఇద్దరికి అప్పు పెట్టాడు. వారిలో ఒకడు అయిదు వందల వెండి నాణేలు బాకీ ఉన్నాడు, మరొకడు యాభై వెండి నాణేలు బాకీ ఉన్నాడు. అప్పు తీర్చడానికి వారిదగ్గర ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరినీ క్షమించాడు. అందుచేత అతడంటే ఆ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అభిమానం?”
“అతడు ఎవడిని ఎక్కువ క్షమించాడో అతడే అని నాకు తోస్తున్నది” అని సీమోను జవాబిచ్చాడు.
ఆయన అతనితో “నీ నిర్ణయం సరిగానే ఉంది” అన్నాడు. అప్పుడా స్త్రీవైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు: “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంటికి వచ్చాను గానీ కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్ళివ్వలేదు. ఈమె అయితే తన కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దుపెట్టుకోలేదు గానీ నేను లోపలికి వచ్చినప్పటినుంచి ఈమె నా పాదాలను ముద్దుపెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గానీ ఈమె నా పాదాలను అత్తరుతో అంటింది.
“అందుచేత నీతో నేను చెప్పేదేమంటే, ఈమె అనేక పాపాలకు క్షమాపణ దొరికింది. ఎందుకంటే, ఈమె ప్రేమ అధికమే. కానీ కొద్ది విషయంలో క్షమాపణ పొందిన వ్యక్తికి కొద్ది ప్రేమ మాత్రమే ఉంటుంది.”
పరిసయ్యులు మరియు పన్నువసూలు చేసేవాడు
లూకా శుభవార్త 18:9-14
తామే న్యాయవంతులని తమలో నమ్మకం ఉంచుకొంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకంవాడు.
“పరిసయ్యుడు నిలుచుండి తనతో ఇలా ప్రార్థించాడు: ‘దేవా, ఇతరులు వంచకులూ అన్యాయస్థులూ వ్యభిచారులూ ఈ సుంకంవాడిలాంటివారూ. నేను వారివంటి వాణ్ణి కాను గనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. నేను వారానికి రెండు సార్లు ఉపవాసముంటాను, నా రాబడి అంతట్లో పదో భాగం చెల్లిస్తూ వున్నాను.’
“ఆ సుంకంవాడైతే దూరంగా నిలుచుండి ఆకాశంవైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకొంటూ ‘దేవా! నేను పాపినే. నన్ను కరుణించు!’ అన్నాడు.
“న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెపుతున్నాను. ఎందుకంటే, తనను గొప్ప చేసుకొనే ప్రతి ఒక్కరినీ తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.”
పేద లాజరు, ధనవంతుడు
లూకా శుభవార్త 16:19-31
“ధనవంతుడొకడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలూ శ్రేష్ఠమైన బట్టలూ తొడుక్కొనేవాడు, రోజూ వైభవంగా హాయిగా బ్రతికేవాడు. లాజరు అనే దరిద్రుడు కూడా ఉండేవాడు. అతనికి ఒళ్ళంతా కురుపులు. ఇతడు ఆ ధనవంతుని ఇంటి గుమ్మందగ్గర పడిగాపులు పడి ఉండేవాడు. ధనవంతుని బల్లమీది నుంచి పడ్డ ముక్కలు తిందామని ఆశపడేవాడు. అంతే కాక, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి కూడా.
“ఆ దరిద్రుడు చనిపోయాడు. అతణ్ణి దేవదూతలు అబ్రాహాము ప్రక్కకు తీసుకువెళ్ళారు. ధనవంతుడు కూడా చనిపోయాడు పూడ్చిపెట్టబడ్డాడు. అతడు పాతాళంలో యాతనపడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రాహాము, అబ్రాహాము ప్రక్కన ఉన్న లాజరు కనబడ్డారు.
“అప్పుడు ధనవంతుడు ‘తండ్రి అబ్రాహాము! నా మీద జాలి చూపు! ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను! గనుక తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించు!’ అని మొరపెట్టి చెప్పాడు.
అందుకు అబ్రాహాము ‘కొడుకా, నీవు బ్రతికినన్నాళ్ళూ మంచివాటిని అనుభవించావు. లాజరైతే కష్టాలు అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో! ఇప్పుడితడు ఓదార్పు పొందుతున్నాడు, నీవేమో అల్లాడిపోతున్నావు. ఇవన్నీ కాక మరో విషయం – నీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడనుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకొనేవారికి సాధ్యం కాదు, అక్కడివారికి మా దగ్గరకు దాటిరావడం కూడా సాధ్యం కాదు’ అన్నాడు.
“అప్పుడతడు ‘అలాగైతే, తండ్రీ, అతణ్ణి మా నాన్న ఇంటికి పంపించమని నిన్ను వేడుకొంటున్నాను. ఎందుకంటే, నాకు అయిదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ యాతన స్థలానికి రాకుండా చేయడానికి అతడు వారికి సాక్ష్యమివ్వగలడు’ అన్నాడు.
“గానీ, అబ్రాహాము అతనితో ‘వారికి మోషే, ప్రవక్తలు ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.
“అతడు ‘అలా కాదు, తండ్రి అబ్రాహాము! చనిపోయినవారిలో నుంచి ఎవడైనా వారిదగ్గరికి వెళ్ళితే వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
“అందుకు అబ్రాహాము అతనితో ‘మోషే మాట, ప్రవక్తల మాట వారు వినకపోతే చనిపోయినవారిలో నుంచి ఒకడు సజీవంగా లేచినా వారికి నమ్మకం కుదరదు అన్నాడు.’”
ఎదురు చూస్తున్న దాసులు
లూకా శుభవార్త 12:35-40
“మీ నడుము కట్టండి. మీ దీపాలు వెలుగుతూ ఉండేలా చూచుకోండి. పెండ్లి నుంచి తిరిగి వచ్చే తమ యజమాని కోసం ఎదురుచూస్తున్న మనుషులలాగా మీరు ఉండండి. ఆయన వచ్చి తలుపు తట్టగానే వారు ఆయనకు తలుపు తీస్తారు. యజమాని వచ్చి చూచినప్పుడు ఆ విధంగా ఎదురు చూస్తున్న దాసులు ధన్యులు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఆయన నడుము బిగించి వారిని భోజనానికి కూచోబెట్టి తానే వచ్చి వారికి వడ్డిస్తాడు. యజమాని రెండో జామున వచ్చినా, మూడో జామున వచ్చినా ఏ దాసులైతే మెళకువగా ఉండడం ఆయన చూస్తాడో ఆ దాసులు ధన్యులు. ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళకువగా ఉంటాడు, తన ఇంటికి కన్నం వేయనియ్యడు. మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.”
10 మంది కన్యకలు
మత్తయి శుభవార్త 25:1-13
“అప్పుడు పరలోక రాజ్యం ఇలా ఉంటుంది: పదిమంది కన్యలు తమ దీపాలు చేతపట్టుకొని పెళ్ళి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు. వారిలో అయిదుగురు తెలివి తక్కువవారు, అయిదుగురు తెలివైనవారు. తెలివి తక్కువవారు తమ దీపాలు మట్టుకు తీసుకుపోయారు గాని ఏ నూనె తీసుకుపోలేదు. తెలివైనవారు తమ దీపాలతో కూడా సీసాలలో నూనె తీసుకువెళ్ళారు. పెళ్ళి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉంటే, వారంతా కునికి, నిద్రపోయారు.
“మధ్యరాత్రివేళ కేక ఇలా వినిపించింది: ‘ఇడుగో పెళ్ళి కుమారుడు వస్తున్నాడు! ఆయనకు ఎదురు వెళ్ళండి!’ అప్పుడు కన్యలందరూ నిద్ర లేచి తమ దీపాలు సరిచేసుకొన్నారు. అయితే తెలివి తక్కువవారు తెలివైనవారితో ‘మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి! మీ నూనె కొంచెం మాకివ్వండి’ అన్నారు. అందుకు తెలివైనవారు ఇలా జవాబు చెప్పారు: ‘మాకూ మీకూ ఇది చాలదేమో. నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి.’
“నూనె కొనడానికి వారు వెళ్ళిపోతూ ఉండగానే పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్నవారు ఆయనతోకూడా పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. తలుపు మూయబడింది. తరువాత తక్కిన కన్యలు వచ్చారు. ‘ప్రభూ! ప్రభూ! మాకు తలుపు తెరవండి!’ అని అడిగారు. గాని ఆయన ‘మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మిమ్ములను ఎరగను’ అని జవాబిచ్చాడు.
“మానవ పుత్రుడు వచ్చే ఆ రోజు గానీ గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.
విధేయులైన మరియు అవిధేయులైన పనివారు
మత్తయి శుభవార్త 24:45-51
“యజమాని తన ఇంటి దాసులకు తగిన వేళ ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడెవడు? యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు. మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తన ఆస్తి అంతటి మీదా నియమిస్తాడు. గానీ, ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై ఉండి ‘నా యజమాని ఇప్పుడే రాడు లే’ అనుకొని, సాటి దాసులను కొట్టడం, త్రాగుబోతులతో తిని త్రాగడం ఆరంభిస్తే ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు. అతణ్ణి రెండు ముక్కలుగా నరికివేసి కపట భక్తులతోపాటు అతనికి వంతు నియమిస్తాడు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
లూకా శుభవార్త 12:42-46
ప్రభువు అన్నాడు: “యజమాని తన దాసులకు సరైన వేళకు ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన జ్ఞానం గల నమ్మకమైన నిర్వాహకుడు ఎవడు? అతని యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తనకు ఉన్నదంతటి మీదా నియమిస్తాడు. కానీ ఒకవేళ ఆ దాసుడు తన హృదయంలో ‘నా యజమాని ఇప్పుడే రాడు లే” అనుకొని దాస దాసీ జనాన్ని కొట్టడం, తిని త్రాగి మత్తిల్లడం ఆరంభిస్తే ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు, అతణ్ణి రెండు ముక్కలుగా కోసి నమ్మకం లేనివారితోపాటు అతనికి వంతు నియమిస్తాడు.
తలాంతులు తీసుకున్న ముగ్గురు పనివారు
మత్తయి శుభవార్త 25:14-30
పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది: ఒక మనిషి దూర దేశానికి ప్రయాణం కట్టి, తన దాసులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పచెప్పాడు. ఒకనికి అయిదు తలాంతులు, ఇంకొకనికి రెండు, ఇంకొకనికి ఒకటి ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం ప్రకారం వారికిచ్చాడు. అప్పుడతడు ప్రయాణమై పోయాడు. అయిదు తలాంతులు తీసుకొన్నవాడు వెళ్ళి వ్యాపారం చేసి మరో అయిదు తలాంతులు సంపాదించాడు. అలాగే రెండు తలాంతులు తీసుకొన్నవాడు మరో రెండు సంపాదించాడు. గానీ ఒక్క తలాంతు తీసుకొన్నవాడు వెళ్ళి నేలలో గుంట త్రవ్వి, అందులో తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
“చాలా కాలం తరువాత ఆ దాసుల యజమాని వచ్చి వారి లెక్కలు చూశాడు. అయిదు తలాంతులు తీసుకొన్నవాడు మరో అయిదు తలాంతులు తెచ్చి, ‘నా యజమానీ, మీరు అయిదు తలాంతులు నాకప్పచెప్పారు గదా. చూడండి, నేను మరో అయిదు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. అతనితో అతని యజమాని ఇలా అన్నాడు: ‘భళా మంచి దాసుడా! నమ్మకమైనవాడివి! కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటిమీద నిన్ను నియమిస్తాను. నీ యజమాని ఆనందంలో ప్రవేశించు.’
“అప్పుడు రెండు తలాంతులు తీసుకొన్నవాడు కూడా వచ్చి, ‘నా యజమానీ, మీరు రెండు తలాంతులు నాకప్పచెప్పారు గదా. చూడండి, మరో రెండు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. అతనితో అతని యజమాని ఇలా అన్నాడు: ‘భళా, మంచి దాసుడా! నమ్మకమైనవాడివి! కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటిమీద నిన్ను నియమిస్తాను. నీ యజమాని ఆనందంలో ప్రవేశించు’.
“అప్పుడు ఒక్క తలాంతు తీసుకొన్నవాడు కూడా వచ్చాడు. ‘నా యజమానీ, మీరు కఠినులనీ విత్తనాలు వేయనిచోట కోస్తారు, వెదజల్లని చోట పంట పోగు చేస్తారు అనీ నాకు తెలుసు. అంచేత నాకు భయం వేసింది. నేను వెళ్ళి మీ తలాంతు భూమిలో దాచిపెట్టాను. ఇదిగో మీది మీరు తీసుకోండి’ అన్నాడు. అతని యజమాని అతనికి ఇలా జవాబిచ్చాడు: ‘నీవు చెడ్డ దాసుడివి! సోమరివాడివి! విత్తనాలు వేయని చోట కోస్తాననీ వెదజల్లని చోట పంట పోగుచేస్తాననీ నీకు తెలిసిందా? అలాంటప్పుడు నా డబ్బు సాహుకార్ల దగ్గర పెట్టవలసింది గదా. నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకొనేవాణ్ణే. కాబట్టి ఆ తలాంతు అతడి దగ్గరనుంచి తీసివేసి పది తలాంతులున్నవానికి ఇవ్వండి. కలిగిన ప్రతివానికి ఇంకా ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివానినుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. పనికిమాలిన ఆ దాసుణ్ణి బయటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం జరుగుతుంది.
పది బంగారు నాణాలు
లూకా శుభవార్త 19:11-27
వారు ఈ మాటలు వింటూ ఉంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన జెరుసలం దరిదాపులలో ఉన్నాడు, దేవుని రాజ్యం వెంటనే కనిపిస్తుందని వారనుకొన్నారు.
అందుచేత ఆయన ఇలా అన్నాడు: “గొప్ప వంశానికి చెందిన మనుషుడొకడు తనకోసం ఒక రాజ్యాన్ని స్వీకరించి తిరిగి రావడానికి దూర దేశానికి ప్రయాణం కట్టాడు. మొదట తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు. ‘నేను తిరిగి వచ్చేంతవరకు దీనితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
“అయితే అతని పౌరులకు అతడంటే ద్వేషం, గనుక ‘ఈ వ్యక్తి మామీద పరిపాలించడం మాకిష్టం లేదు’ అంటూ అతని వెనుక రాయబారం పంపారు.
“అతడైతే ఆ రాజ్యాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. రాగానే, తాను డబ్బిచ్చిన దాసుల్లో ఒక్కొక్కరు వ్యాపారంవల్ల ఎంతెంత సంపాదించారో తెలుసుకొందామని వారిని తన దగ్గరకు పిలవమని ఆజ్ఞ జారీ చేశారు.
“మొదటివాడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం పది నాణేలు సంపాదించింది’ అన్నాడు.
“అందుకతడు ‘భళా, మంచి దాసుడా! చాలా చిన్న విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక పది నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో చెప్పాడు.
“రెండో దాసుడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం అయిదు నాణేలు సంపాదించింది’ అన్నాడు.
“అతడు ‘నీవు అయిదు నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో కూడా చెప్పాడు.
“అప్పుడు మరో దాసుడు వచ్చి ఇలా అన్నాడు: ‘యజమానీ, ఇదిగో మీ నాణెం. దీనిని గుడ్డలో కట్టి ఉంచాను. ఎందుకంటే, మీరంటే నాకు భయం – మీరు కఠినులు, మీరు పెట్టనిది తీసుకొంటారు, వెదజల్లనిది కోస్తారు.’
“అందుకతడు అతనితో ‘చెడ్డ దాసుడా! నీ సొంత నోటనుంచి వచ్చినదాని ప్రకారమే నీకు తీర్పు తీరుస్తాను. నేను కఠినుణ్ణనీ పెట్టనిది తీసుకుంటాను, వెదజల్లనిది కోస్తాను అనీ నీకు తెలుసు అంటున్నావు గదా? అలాంటప్పుడు నీవు నా డబ్బు సాహుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా పెట్టి ఉంటే నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకొని ఉండేవాణ్ణే.’
“అప్పుడతడు దగ్గర నిలుచున్న వారితో ‘ఈ బంగారు నాణెం వీడిదగ్గర నుంచి తీసివేసి పది నాణేలు ఉన్నవాని చేతికివ్వండి’ అన్నాడు.
“అతనితో వారు ‘యజమానీ, అతనికి పది నాణేలు ఉన్నాయే!’ అన్నారు.
అందుకతడు ‘మీతో నేనంటున్నాను, కలిగి ఉన్న ప్రతి వ్యక్తికీ ఇంకా ఇవ్వడం, లేని వ్యక్తినుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. మరో మాట – నేను తమమీద పరిపాలించడం ఇష్టం లేని నా పగవారిని ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుటే చంపండి.’”
వెర్రివాడైన ఆస్థిపరుడు
లూకా శుభవార్త 12:16-21
అప్పుడాయన వారికొక ఉదాహరణ చెప్పాడు: “ఆస్తిపరుడొకడి భూమి బాగా పండింది, గనుక అతడిలా లోలోపల ఆలోచన చేశాడు: ‘నా పంట నిలవ చేయడానికి స్థలం లేదు. ఏం చెయ్యను? ఇలా చేస్తాను – నా గిడ్డంగులు పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యం, నా సరుకులు అన్నీ నిలవ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో నేనంటాను, ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు మంచి వస్తువులు కూడబెట్టబడ్డాయి. సుఖంగా ఉండు. తిను, తాగు, సంబరపడు!’ అని. అయితే అతనితో దేవుడు అన్నాడు ‘తెలివి తక్కువవాడా! ఈ రాత్రే నీ ప్రాణం అడగడం జరుగుతుంది. నీవు సిద్ధం చేసుకొన్నవి అప్పుడు ఎవరివవుతాయి?’ దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తనకోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే.”
ద్వేషించే వారిని కూడా ప్రేమించుట
లూకా శుభవార్త 10:25-37
ఒకప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసుడొకడు లేచి ఆయనను పరీక్షిస్తూ “ఉపదేశకా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చేయాలి?” అని అడిగాడు.
ఆయన అతనితో “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? నీవు దాన్ని చదవడం వల్ల నీకు తోచేది ఏమిటి?” అన్నాడు.
అందుకు అతడు ఇలా జవాబిచ్చాడు: “హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి; మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.”
ఆయన అతనితో “సరిగ్గా చెప్పావు. అలాగే చేస్తూ ఉండు. అప్పుడు జీవిస్తావు” అన్నాడు.
తాను న్యాయవంతుడై ఉన్నట్టు చూపుకోవాలని అతడు “అయితే నా పొరుగువాడు ఎవరు?” అని యేసును అడిగాడు.
యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఒక మనిషి జెరుసలంనుంచి యెరికోకు ప్రయాణమైపోతూ దోపిడీదొంగల చేతికి చిక్కాడు. వారు అతని ఒంటిమీద బట్టలు ఒలుచుకొని అతణ్ణి గాయపరచి కొనప్రాణంతో అతణ్ణి విడిచి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తుగా ఒక యాజి ఆ దారిన వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అలాగే లేవీగోత్రికుడొకడు కూడా ఆ చోటికి వచ్చి అతణ్ణి చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు. అయితే సమరయ దేశస్థుడొకడు ప్రయాణంమీద ఉండి ఆ మనిషి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూచి జాలిపడ్డాడు, దగ్గరకు వచ్చి అతని గాయాలకు నూనె, ద్రాక్షరసం పోసి కట్లు కట్టాడు, అతణ్ణి తన సొంత గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులు చూశాడు. మరుసటి రోజు అతడు బయలు దేరబోతుండగా రెండు వెండి నాణేలు తీసి సత్రం మనిషికిచ్చి ‘ఇతడి బాగోగులు చూడండి. ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు చెల్లిస్తాను’ అన్నాడు.
“నీకేమి తోస్తున్నది? – దోపిడీదొంగల చేతికి చిక్కిన మనిషికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉన్నారు?”
అతడు “అతనిపట్ల జాలి చూపినవాడే” అన్నాడు.
అతనితో యేసు “నీవు వెళ్ళి అలాగే చేస్తూ ఉండు” అన్నాడు.
క్షమించలేని పనివాడు
మత్తయి శుభవార్త 18:23-35
కాబట్టి, పరలోక రాజ్యం ఇలా ఉన్నది: ఒక రాజు తన దాసుల విషయం లెక్కలు చూడాలని కోరాడు. లెక్కలు పరిష్కారం చేయడం ఆరంభించినప్పుడు అతనికి పది వేల తలాంతులు బాకీపడ్డ దాసుణ్ణి అతని దగ్గరకు తెచ్చారు. బాకీ తీర్చుకోవడానికి ఆ దాసుని దగ్గర ఏమీ లేదు, గనుక అతణ్ణీ అతని భార్యాబిడ్డలనూ అతనికి కలిగినదంతా అమ్మి బాకీ తీర్చాలని అతని యజమాని ఆజ్ఞ జారీ చేశాడు. గనుక ఆ దాసుడు యజమాని ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ‘యజమానీ, నా విషయం ఓపిక పట్టండి. మీకు అంతా చెల్లిస్తాను’ అన్నాడు. ఆ దాసుని యజమానికి జాలి వేసింది. బాకీ రద్దు చేసి అతణ్ణి విడిచిపెట్టాడు.
“అయితే ఆ దాసుడే బయటికి వెళ్ళి, సాటి దాసులలో తనకు నూరు దేనారాలు బాకీపడ్డ ఒకణ్ణి చూచి అతణ్ణి జప్తుచేసి ‘నాకు బాకీ తీర్చు’ అంటూ అతని గొంతు పట్టుకొన్నాడు. ఆ సాటి దాసుడు అతని పాదాల దగ్గర సాగిలపడి, ‘నా విషయం ఓపిక పట్టు. నీకు అంతా చెల్లిస్తాను’ అని వేడుకొన్నాడు. అతడు ఒప్పుకోలేదు. అతడు బాకీ తీర్చేవరకు అతణ్ణి ఖైదులో వేయించాడు. అయితే అతని సాటి దాసులు జరిగినది చూచి, చాలా విచారపడుతూ తమ యజమాని దగ్గరకు వెళ్ళి అతనికి జరిగినదంతా తెలియజేశారు. అప్పుడు అతని యజమాని అతణ్ణి పిలిపించి అతనితో ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొన్నందుచేత నీ అప్పు అంతా రద్దు చేశానే! నేను నీమీద దయ చూపినట్టే నీ సాటి దాసుడిమీద జాలి చూపకూడదా ఏమిటి?” అతని యజమాని కోపగించి తన బాకీ అంతా తీర్చేవరకు చిత్రహింస పెట్టేవారికి అతణ్ణి అప్పగించాడు.
“మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుణ్ణి అతని అతిక్రమాల విషయం హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరమ తండ్రి మీకు అలాగే చేస్తాడు.”
ఎడతెగక అడిగే స్నేహితుడు
లూకా శుభవార్త 11:5-8
ఆయన వారితో ఇంకా అన్నాడు “మీలో ఎవరో ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. అతడు మధ్యరాత్రి అతనిదగ్గరకు వెళ్ళి ‘స్నేహితుడా! నాకు మూడు రొట్టెలు బదులివ్వు. నా స్నేహితుడు ఒకడు ప్రయాణం మధ్యలో నాదగ్గరికి వచ్చాడు. అతడికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు’ అంటాడు అనుకోండి. లోపల నుంచి అతడు ‘నన్ను తొందరపెట్టకు! తలుపు మూసి ఉంది. నేనూ నా పిల్లలూ మంచం మీద పడుకొన్నాం. నేను లేచి నీకివ్వలేను’ అంటాడు అనుకోండి. నేను మీతో అంటున్నాను, అతడు తన స్నేహితుడు కావడంచేత ఇతడు లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గులేకుండా అడుగుతూ ఉంటే ఇతడు లేచి అతనికి కావలసినంత ఇస్తాడు.
మోసగాడైన గృహ నిర్వాహకుడు
లూకా శుభవార్త 16:1-13
ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆస్తిపరుడు ఒకని కోసం సేవాధికారి ఒకడు పని చేశాడు. అతడు ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఫిర్యాదు ఆ ఆస్తిపరుడికి వచ్చింది. ఆస్తిపరుడు అతణ్ణి పిలిచి అతనితో ‘నిన్ను గురించి నేను వింటున్న విషయం ఏమిటి? ఇకమీదట నీవు సేవాధికారిగా ఉండడానికి వీలులేదు. నీవు సేవాధికారిగా చేసిన పనిని గురించిన లెక్క నాకప్పగించు!’ అన్నాడు.
“సేవాధికారి లోలోపల ఇలా అనుకొన్నాడు: ‘నేను సేవాధికారిగా ఉండకుండా నా యజమాని చేస్తున్నాడు. ఏం చెయ్యను? తవ్వకం పని నాకు చేతకాదు. ముష్టి ఎత్తుకుందా మంటే సిగ్గు. సేవాధికారిగా ఉండకుండా నన్ను తొలగించడం జరిగాక నలుగురూ నన్ను తమ ఇండ్లలోకి స్వీకరించేలా నేనేం చెయ్యాలో నాకు తెలుసు.’
“అప్పుడతడు తన యజమానికి బాకీ పడి ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచాడు. ‘నువ్వు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావు!’ అని మొదటివాణ్ణి అడిగాడు. ఆ మనిషి ‘మూడు వేల లీటర్ల నూనె’ అన్నాడు. ఇతడు అతడితో ‘త్వరగా నీ చీటి తీసుకొని వెయ్యిన్ని అయిదు వందల లీటర్లు అని రాసుకో!’ అన్నాడు. మళ్ళీ మరొకణ్ణి చూచి ‘నువ్వెంత బాకీ ఉన్నావు?’ అనడిగాడు. ఆ మనిషి ‘నూరు మానికల గోధుమలు’ అన్నాడు. ఇతడు అతడితో ‘నీ చీటి తీసుకొని ఎనభై అని రాసుకో’ అన్నాడు.
“న్యాయం తప్పిన ఈ సేవాధికారి వివేకంతో వ్యవహరించినందుచేత అతని యజమాని అతణ్ణి ఆమోదించాడు. ఎందుకంటే, ఈ లోకం మనుషులు తమ లాంటివారి విషయాల్లో వెలుగుకు చెందిన మనుషులకంటే వివేకవంతులు. మీరు అంతమైపోయిన తరువాత వారు మిమ్మల్ని శాశ్వత నివాసాల్లో స్వీకరించేలా అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండని మీతో చెపుతున్నాను.
“చిన్న చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అత్యల్ప విషయంలో న్యాయం తప్పినవాడు పెద్ద విషయంలో కూడా న్యాయం తప్పినవాడవుతాడు. అందుచేత అన్యాయమైన ధనం విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే ఇక మీకు నిజమైన సొత్తు ఎవరు అప్పగిస్తారు? మరొకరి సొత్తు విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే మీ సొంతం అంటూ మీకెవరు ఇస్తారు? ఇద్దరు యజమానులకు ఏ దాసుడూ సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్నచూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.”