యూదా రాసిన పత్రిక
గ్రంథకర్త
రచయిత తనను “యేసు క్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడును” (1:1) అని పరిచయం చేసుకుంటున్నాడు. ఇతడు బహుశా యోహాను 14:22 లో అపోస్తలుడిగా చెప్పిన వాడు అయి ఉండవచ్చు. సాధారణంగా ఇతన్ని యేసు ప్రభువు తమ్ముడుగా భావిస్తారు. మొదట్లో ఇతడు అవిశ్వాసి (యోహాను 7:5). అయితే తరువాతి కాలంలో తన తల్లితో కలిసి మేడ గదిలోనూ, ఇతర శిష్యులతో కూడా యేసు ఆరోహణం సమయంలో ఉన్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 70 - 80
యూదా ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడనే దానికి అలెగ్జాండ్రియా నుంచి రోమ్ వరకూ వివిధ ప్రదేశాలు చెబుతారు.
స్వీకర్త
“దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారు” (1:1) అని పేర్కొన్న వారు అంటే క్రైస్తవులందరూ అన్న అర్థమే వస్తుంది. అయినప్పటికీ కపట బోధకులకు ఇతడు ఇస్తున్న సందేశాన్ని చూస్తే ఏదో ఒక గుంపును గాక కపట బోధకులందరినీ దృష్టిలో పెట్టుకుని యూదా ఈ పత్రిక రాశాడు అనిపిస్తుంది.
ప్రయోజనం
దుర్బోధను వ్యతిరేకిస్తూ విశ్వాసంలో బలంగా నిలబడుతూ అస్తమానం జాగ్రత్తగా మెలుగుతూ ఉండవలసిన ఆవశ్యకతను చెప్పడానికి యూదా ఈ పత్రిక రాశాడు. అంతటా క్రైస్తవులను క్రియాపూర్వక జీవితానికి పురిగొల్పుతున్నాడు. కపట బోధల ప్రమాదాన్ని పసిగట్టి తమను తాము భద్రపరచుకోవాలని కోరుతున్నాడు. ఇప్పటికే మోసపోయిన వారిని వారు తిరిగి సంపాదించాలి. క్రైస్తవులు దేవుని శిక్ష వస్తుందనే భయం లేకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యవచ్చు అని బోధించే భక్తిహిన బోధకులకు వ్యతిరేకంగా యూదా రాస్తున్నాడు.
ముఖ్యాంశం
విశ్వాసం కోసం పోరాటం.
విభాగాలు
1. పరిచయం — 1:1, 2
2. కపట బోధకుల గతి — 1:3-16
3. క్రీస్తు విశ్వాసులకు ప్రోత్సాహం — 1:17-25