ప్రసంగి
గ్రంథకర్త
ఈ పుస్తకంలో నేరుగా రచయిత పేరు కనిపించదు. 1:1 లో రచయిత తనను “కొహెలెల్’’ (ఉపదేశకుడు) అనే పేరులో పరిచయం చేసుకున్నాడు. ముందుకుపోయి తనను “దావీదు కుమారుడు, యెరూషలేము రాజు’’ అని చెప్పుకున్నాడు. “యెరూషలేములో నాకు ముందున్న వారందరిలోకి అధిక జ్ఞానం సంపాదించిన వాడిని’’ అని తన గురించి వివరించాడు. తాను అనేక సామెతలు సేకరించినట్టు చెప్పుకున్నాడు (1:1, 16; 12:19). యెరుషలేము నగరంలో ఇశ్రాయేలు రాజ్యం అంతటిపైనా పరిపాలించిన దావీదు కుమారుడు సొలోమోను ఒక్కడే (1:12). ఈ గ్రంథ కర్త సొలోమోను అని సూచించే వచనాలు ఇందులో చాలా ఉన్నాయి. సొలొమోను మరణం తరువాత వేరొక వ్యక్తి రాసి ఉంటాడు, అనిపించే సందర్భానుసారమైన ఆధారాలు కొన్ని ఉన్నాయి.
రచనా కాలం, ప్రదేశం
సుమారు 970 - 930
ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను పాలన అంతంలో రాసి ఉండవచ్చు. యెరుషలేములో ఈ గ్రంథం రాసినట్లు ఉంది.
స్వీకర్త
ప్రాచీన ఇశ్రాయేలీయులు, బైబిలు పాఠకులందరూ.
ప్రయోజనం
ఈ గ్రంథంలో మనకొక గొప్ప హెచ్చరిక ఉంది. ఒక గురి, దైవభక్తి లేని జీవితం వ్యర్థం; అనవసరంగా గాలిని పట్టుకోడానికి ప్రయత్నించిన దానిలో సమానం. మనం సుఖభోగాలను, సిరిసంపదలను, సృజనాత్మక కార్యకలాపాలను, జ్ఞానాన్ని, లేక విషయ వాంఛలను కోరి వాటి వెంటబడితే జీవితాంతంలో మన జీవితమంతా వ్యర్థం చేసుకున్నామని అర్ధమవుతుంది. దేవుడే గురిగా కలిగిన జీవితం ద్వారానే దానికి ఒక అర్ధమంటూ వస్తుంది.
ముఖ్యాంశం
దేవుడు తప్ప మిగతాదంతా వ్యర్థమే
విభాగాలు
1. పరిచయం — 1:1-11
2. జీవితంలో అనేక అంశాలు వ్యర్థం — 1:12-5:7
3. దేవుని భయం — 5:8-12:8
4. చివరి తీర్మానం — 12:9-14