యూదా లేఖ
1
1 దేవుని పిలుపు అందినవారికి – తండ్రి అయిన దేవునివల్ల పవిత్రులై యేసు క్రీస్తులో కాపాడబడుతూ ఉన్నవారికి – యేసు క్రీస్తు దాసుడూ, యాకోబుకు సోదరుడూ అయిన యూదా రాస్తున్న విషయాలు. 2 కరుణ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగుతాయి గాక.
3 ప్రియ సోదరులారా, మనకందరికీ ఉన్న రక్షణ, పాపవిముక్తి గురించి మీకు రాయాలని ఎంతో శ్రద్ధాసక్తులు కలిగినా పవిత్రులకు ఒక్క సారే అప్పగించబడ్డ విశ్వాస సత్యాలకోసం మీరు మనసారా పోరాడాలని మిమ్ములను ప్రోత్సహిస్తూ రాయడం అవసరమని నాకు ప్రేరేపణ కలిగింది. 4 ఎందుకంటే, కొందరు మీ మధ్యలోకి దొంగచాటుగా ప్రవేశించారు. వారు భక్తిలేని దుర్మార్గులు, మన దేవుని కృపను పోకిరీ పనులకు సాధనంగా, మార్చివేసేవారుమన ఏకైక ప్రభువైన దేవుణ్ణీ మన ప్రభువైన యేసు క్రీస్తునూ కాదనేవారు. ఈ శిక్షావిధికి గురి అవుతారని చాలా కాలంక్రిందటే వారిని గురించి రాసి ఉంది.
5 ఈ విషయం ఇంతకుముందే మీకు తెలిసి ఉన్నా ఇది మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అంటే ప్రభువు ఈజిప్ట్‌లో నుంచి తన ప్రజను తప్పించిన తరువాత వారిలో తనను నమ్మనివారిని నాశనం చేశాడు. 6 అంతేకాకుండా, తమ అధికార స్థానంలో ఉండిపోకుండా సొంత నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలను మహా దినాన జరగబోయే తీర్పు కోసం ప్రభువు శాశ్వతమైన సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో ఉంచాడు. 7 వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలూ లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా సశరీరులకు వెంటబడుతూ ఉండడంచేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండనపాలై ఉదాహరణగా ప్రదర్శించ బడుతున్నాయి.
8 అలాగే కలలు కంటూ ఉన్న వీరు శరీరాన్ని అపవిత్రం చేసుకొంటున్నారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహనీయులను దూషిస్తూ ఉన్నారు. 9 ప్రముఖ దూత మిఖాయేల్ అయితే అపనింద పిశాచాన్ని ఎదురుకొంటూ వాడితో మోషే శరీరాన్ని గురించి వాదించినప్పుడు దూషించడానికి, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు గాని “ప్రభువే నిన్ను మందలిస్తాడు గాక!” అన్నాడు. 10 వీరైతే తమకు అర్థం కానివాటిని దూషిస్తారు. తెలివిలేని మృగాల్లాగా ప్రకృతిసిద్ధంగా ఏవేవి తెలుసుకొంటారో వాటివల్లే తమను తాము భ్రష్టులను చేసుకొంటున్నారు. 11 అయ్యో, వారికి బాధ తప్పదు! వారు కయీను నడిచిన దారి పట్టి నడిచారు, బిలాం నడచిన తప్పు త్రోవలో లాభంకోసం ఆతురంగా చొరబడ్డారు. కోరహు తిరుగుబాటు చేసిన నాశనం పాలయ్యారు. 12 వీరు నిర్భయంగా మీతో భోజనం చేస్తూ తమను తామే పోషించుకొంటూ మీ ప్రేమ విందులలో మచ్చలుగా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోతున్న వాన లేని మబ్బులు. కోతకాలం పోయి పండ్లు లేక వ్రేళ్ళతో పెళ్ళగించబడి రెండు సార్లు చచ్చిన చెట్లు. 13 వారు సముద్రం ప్రచండమైన అలల్లాగా ఉండి తమ అవమానాన్ని నురుగులాగా వెళ్ళగ్రక్కుతూ ఉన్నారు. వారు దారి తప్పి తిరుగుతున్న చుక్కలు. వారికోసం దట్టమైన కటిక చీకటి శాశ్వతంగా ఉంచబడి ఉంది.
14 ఆదాం మొదలుకొని ఏడోవాడైన హనోకు వీరిని గురించి దేవునిమూలంగా ఇలా పలికాడు: “ఇదిగో వినండి! ప్రభువు తన వేలాది వేలమంది పవిత్రులతోకూడా వస్తాడు. 15 అందరికీ తీర్పు తీర్చడానికి, వారిలో భక్తి లేని వారంతా భక్తిలేని మార్గంలో చేసిన భక్తిలేని క్రియలన్నిటిని గురించీ భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించీ వారిని ఒప్పించడానికీ ఆయన వస్తాడు”.
16 వీరు తమ దురాశలను అనుసరించి ప్రవర్తిస్తూ, సణుక్కొంటూ, తమ గతిని నిందించుకొంటూ ఉన్నవారు. లాభంకోసం ఇతరులను పొగడుతారు. వారి నోరు డంబంగా మాట్లాడుతుంది.
17 అయితే ప్రియ సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పంపిన రాయబారులు ముందు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. 18  చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని వారు మీతో చెప్పారు. 19 ఇలాంటివారు దేవుని ఆత్మలేని సహజ సిద్ధమైనవారు, భేదాలు కలిగించేవారు.
20 మీరైతే, ప్రియ సోదరులారా, అతి పవిత్రమైన మీ విశ్వాసంలో మీకు మీరే అభివృద్ధి కలిగించుకొంటూ ఉండండి. పవిత్రాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి. 21 శాశ్వత జీవార్థమైన మన ప్రభువైన యేసు క్రీస్తు కరుణకోసం ఆశతో ఎదురు చూస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకొని ఉండండి. 22 సరిగా వివేచిస్తూ కొందరిమీద జాలి చూపండి. 23 మరి కొందరిని భయం ద్వారా రక్షిస్తూ అగ్నిలోనుంచి లాగివేసి శరీర స్వభావంవల్ల అశుద్ధి అయిన వస్త్రాన్ని అసహ్యించుకోండి.
24 మీరు తొట్రుపడకుండా మిమ్ములను కాపాడడానికీ తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టడానికీ సామర్థ్యం గల మన ముక్తిప్రదాత, ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి 25 మహిమ, ఘనపూర్ణత, ప్రభుత్వం, అధికారం ఇప్పుడునూ శాశ్వతంగానూ ఉంటాయి గాక! తథాస్తు.