2 యోహాను లేఖ
1
1 దేవుని చేత ఎన్నికైన అమ్మగారికీ వారి పిల్లలకూ పెద్దనైన నేను రాస్తున్న విషయాలు. మనలో ఉంటూ మనతో శాశ్వతంగా ఉండబోయే సత్యాన్నిబట్టి 2 నాకు, నాకు మాత్రమే గాక సత్యం తెలిసినవారందరికీ మీరంటే నిజమైన ప్రేమ ఉంది. 3 తండ్రి అయిన దేవునినుంచీ తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు నుంచీ కృప, కరుణ, శాంతి సత్యంలో, ప్రేమలో మీకు తోడుగా ఉంటాయి.
4 ఆ తండ్రివల్ల మనం పొందిన ఆజ్ఞప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యాన్ని అనుసరించి ప్రవర్తించడం చూచినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. 5 అమ్మగారూ, నేను కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నట్టు కాదు గాని మొదటినుంచి మనకున్న ఆజ్ఞే రాస్తూ మనం ఒకరినొకరం ప్రేమతో చూచుకోవాలని విన్నవించుకొంటున్నాను. 6  ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే. మీరు మొదటినుంచి విన్నప్రకారం మీరు దానిలో నడుచుకోవాలనేదే ఆయన ఆజ్ఞ.
7 యేసు క్రీస్తు శరీరంతో వచ్చాడని ఒప్పుకోని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. అలాంటివాడు వంచకుడు, క్రీస్తు విరోధి. 8 మనం సాధించినదాన్ని మనం కోల్పోకుండా పూర్ణ బహుమతి పొందేలా జాగ్రత్తగా చూచుకోండి. 9 ఎవరైనా అతిక్రమించి క్రీస్తు ఉపదేశంలో నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుడు లేనివాడే. క్రీస్తు ఉపదేశంలో నిలిచి ఉండే వ్యక్తికి తండ్రీ కుమారుడూ ఉన్నారు. 10 ఈ ఉపదేశం తేకుండా ఎవడైనా మీదగ్గరకు వస్తే అతణ్ణి మీ ఇంట్లో స్వీకరించకండి, అతడికి అభివందనం చేయకండి. 11 అతడికి అభివందనం చేసే వ్యక్తి అతడి చెడ్డ పనులలో పాల్గొన్నట్టే.
12 అనేక విషయాలు మీకు రాయవలసి ఉన్నా సిరా, కాగితాలతో ఇవి రాయడానికి నాకిష్టం లేదు. కాని, మన ఆనందం పరిపూర్ణమయ్యేలా నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నా ఆశాభావం.
13 దేవునివల్ల ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు అభివందనాలు చెపుతున్నారు.