ఫిలేమోనుకు లేఖ
1
1 మా ప్రియ సోదరుడూ జతపనివాడూ అయిన ఫిలేమోనుకు, 2 ప్రియమైన అప్ఫియకు, మా సాటి యోధుడైన అర్కిప్పస్‌కు, నీ ఇంట్లో ఉన్న సంఘానికి క్రీస్తు యేసుకోసం ఖైదీ అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. 3 మన తండ్రి అయిన దేవునినుంచీ, ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.
4 ప్రభువైన యేసుపట్ల, పవిత్రులందరిపట్ల నీకున్న ప్రేమభావం, నమ్మకం గురించీ వింటున్నాను 5 గనుక నా ప్రార్థనలలో ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటూ నీ విషయం నా దేవునికి కృతజ్ఞత చెపుతున్నాను. 6 నీ నమ్మకం విషయంలో ఇతరులతో సహవాసం చేయడం సఫలం అయ్యేలా క్రీస్తు యేసు ద్వారా మీకు కలిగిన ప్రతి మంచిదానినీ నీవు పూర్తిగా తెలుసుకోవాలని నా ప్రార్థన. 7 సోదరుడా, నీవు పవిత్రుల హృదయాలకు సేద తీర్చావు, గనుక నీ ప్రేమ భావాన్నిబట్టి మేము గొప్ప ఆనందం, ఓదార్పు కలిగి ఉన్నాం.
8 ఈ కారణంచేత, చేయతగిన దాని గురించి నీకు ఆజ్ఞ ఇవ్వగలిగినంత ధైర్యం క్రీస్తులో నాకున్నా, 9 ప్రేమనుబట్టే నిన్ను వేడుకొంటున్నాను. అవును, ముసలివాణ్ణయి, యేసు క్రీస్తు కోసం ఇప్పుడు ఖైదీనై ఉన్న నేను – పౌలును– 10 నా కుమారుడైన ఒనేసిమస్‌ను గురించి నిన్ను వేడుకొంటున్నాను. నేను బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారుడయ్యాడు. 11 గతంలో అతడిచేత నీకు ప్రయోజనమంటూ ఏమీ లేకపోయింది గాని ఇప్పుడు నీకూ నాకూ ప్రయోజనకరమైనవాడే. 12 నా ప్రాణ సమమైన అతణ్ణి చేర్చుకో. అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను. 13 నీ తరఫున అతడు శుభవార్త కోసం ఖైదులో ఉన్న నాకు సహాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకొన్నాను. 14 గానీ నీ అనుమతి లేకుండా అలాంటిదేదైనా చేయడం నాకిష్టం లేదు. నీ ఉపకారం బలవంతంమీద జరగకుండా నీ ఇష్టపూర్వకంగానే కావాలని నా ఉద్దేశం.
15 ఒకవేళ, అతడు ఎప్పుడూ నీ దగ్గర ఉండడానికే కొద్దికాలం నిన్ను వదిలివేశాడు కాబోలు. 16 అయితే ఇప్పుడు బానిసగా కాకుండా, బానిసకంటే ఎక్కువవాడుగా – ప్రియ సోదరుడుగా ఉంటాడు. విశేషంగా నాకూ, శరీరం విషయంలోనూ ప్రభువును బట్టి మరి విశేషంగా నీకూ అలా ఉంటాడు. 17 అందుచేత నీవు నన్ను నీతో పాలివాడుగా ఎంచితే నన్ను స్వీకరించినట్టే అతణ్ణి స్వీకరించు. 18 ఒకవేళ అతడు నీకేదైనా నష్టం కలిగించాడంటే, లేదా, నీకు బాకీపడితే అది నా లెక్కలో చేర్చు. 19 నేను – పౌలును – నా సొంత చేతితో ఈ మాట రాస్తున్నాను, అది నేను తీరుస్తాను. అయినా నీవు నీ ఆత్మ విషయంలో నాకు బాకీపడి ఉన్నావని నేను చెప్పనక్కర్లేదు. 20 సోదరుడా, ప్రభువులో నీవల్ల నాకు ఆనందం కలగనియ్యి. ప్రభువులో నా హృదయానికి సేద తీర్చు.
21 నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదానికంటే ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు. 22 మరో సంగతి – నా కోసం బస సిద్ధం చెయ్యి. ఎందుకంటే, నీ ప్రార్థనల ఫలితంగా నీ దగ్గరకు నన్ను రానివ్వడం జరుగుతుందని నా నమ్మకం.
23 క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా నీకు అభివందనాలు చెపుతున్నాడు. 24 నా జత పనివారు మార్కు, అరిస్తార్కస్, దేమాస్, లూకా అభివందనాలు చెపుతున్నారు.
25 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప నీ ఆత్మకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.